Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/ఐదవ సంపుటం/రేకు 426

వికీసోర్స్ నుండి


రేకు: 0026-1 సామంతం సం: 05-144

పల్లవి:

ఎట్టు ధరింపఁగనగు భువినిట్టి వియోగావలస్థల-
నట్టును నిట్టును విధి దమునారడిఁ బెట్టఁగను

చ. 1:

కాంతునిచూపులఁ జిక్కినకాంత వియోగాగ్నికిఁ దగ
శాంతికిఁ జెంగలువలుపైఁ జల్లిరి నెచ్చెలులు
కాంతుఁడు చూచినతొల్లిటి కనుచూపులె బహుళములై
కాంతశరీరంబంతయుఁ గప్పిన తెఱఁగాయ

చ. 2:

రమణునిమాటలఁ దగిలిన రమణికి నంగజతాపం-
బమరఁగ మకరందముపై నలికిరి నెచ్చెలులు
రమణుని తియ్యని మాటాలరచనలె కడునగ్గలమై
కమలదళాక్షికిఁ బై పై గట్టినతెఱఁగాయ

చ. 3:

ప్రాణము సందియమై యీ పడతికిఁ బ్రాణము వచ్చెను
ప్రాణేశుఁడు తిరువేంకటపతి గరుణించినను
ఏణాక్షికి నొకతెకుఁ గాదీయఖిలంబున కీ దేవుఁడు
ప్రాణము ప్రాణంబనియెడి పలుకిది నిజమాయ


రేకు: 0026-2 కాంభోది సం: 05-145

పల్లవి:

ఇంతగాఁ జేసితి నన్ను నింతలోననె వోరి
సంతవలపుబేరాల జట్టికాఁడ రారా

చ. 1:

గంపంత దురుముతోడి గబ్బిచూపుఁగన్నుల
గుంపెన గుబ్బలది మేకులు సేయఁగా
అంపలేక మాటలాడే వాపె తోడనె వోరి
జంపు వలపుబేరాల జట్టికాఁడ రారా

చ. 2:

గుద్దలింపుఁ గులుకుల కొనవంపుచూపుల -
అద్దపుఁ జెక్కులది నిన్నద్దలించఁగా
పెద్దరికా లాకెతోడ బెరయించేవా వోరి
చద్దివలపుబేరాల జట్టికాఁడ రారా

చ. 3:

మెల్లనె మురిపములమ్మెడి లేఁతమాటల-
గొల్లెతచిత్తమంతయుఁ గొల్లగొంటివి
వెల్లిగా నన్నుఁ గూడితి వేంకటేశుఁడా వోరి
చద్దివలపుబేరాల జట్టికాఁడ రారా


రేకు: 0026-3 సామంతం సం: 05-146

పల్లవి:

సింగారరాయనిఁ దిట్టిఁ జెంచెత వేలి-
వుంగరాలచేత నన్నొత్తకు నీవనుచు

చ. 1;

గురువింద పొదమరఁగున నుండి బిగిసీని
సిరివరు నెదుటనే చెంచెత
దొరలకే కాక నెత్తురుమన్ను మాకేల
బురదచెమటనామై పొలకంపనుచు

చ. 2:

గుదిగొన్న మొగలిరేకుల యెన్ను కొనగోరఁ
జిదిమి దేవునివేసీఁ జెంచెత
గదరుఁ బిల్లుల నేతికంపు నీ వొళ్ళెల్ల
కదియకు నా మేను కంటగించీననుచు

చ. 3:

కప్పురపుఁ దావి వేంకటపతికౌఁగిటఁ
జెప్పక యేతులే చెప్పీఁ జెంచెత
దప్పిదేరు తేనెల తనివార నీమోవి
యెప్పుడుఁ బాయక ఇట్టె ఇచ్చేవో యనుచు


రేకు: 0026-4 ఆహిరి సం: 05-147

పల్లవి:

అయ్యో వీఁడు నన్నణఁకించీనే వీని-
కొయ్యతనాలణఁచక కోపమేల తీరునే

చ. 1:

గుట్టున వాఁడిందు రాఁగ గొబ్బన నే ముంగురులు
పట్టుకొని పరపుపైఁ బడఁదీసి
గట్టిగ గుబ్బలమీఁది కస్తూరిచెమటలనే
అట్టునిట్టు సేయక నాయల పేల తీరునే

చ. 2:

గక్కున వాఁడిందు రాఁగా గడెవెట్టి తమకాన
చెక్కుదో యి నాకొనచేతనే నొక్కి
పుక్కిటితమ్ములమిడిపొదిగొన్న కౌఁగిటిలో
నొక్కినఁగాని నానొగులేల తీరునే

చ. 3:

కూరిమి వాఁడిందు రాఁగా కొంకక నా వాఁడిగోళ్ళ
జీరలుగా నొడలెల్ల జిమ్ముచుఁ దీసి
ధీరత వేంకటగిరి దేవుఁడైన వానికి నా-
నేరుపెల్లఁ జూపక నా నెగులేల తీరునే


రేకు: 0026-5 దేవగాంధారి సం: 05-148

పల్లవి:

ఇట్టిముద్దులాఁడిబాలుఁ డేడవాఁడు వానిఁ
బట్టితెచ్చి పొట్ట నిండఁ బాలు పోయరే

చ. 1:

గామిడై పారితెంచి కాఁగేటివెన్నలలోన
చేమపూవుకడియాలచేయి వెట్టి
చీమ గుట్టెనని తనచెక్కిటఁ గన్నీరు జార
వేమరు వాపోయె వాని వెడ్డువెట్టరే

చ. 2:

ముచ్చువలె వచ్చి తనముంగై మురువులచేయి
తచ్చేటిపరుగులోనఁ దగఁ బెట్టి
నొచ్చెనని చేయి దీసి నోరనెల్లఁ జొల్లుగార
వొచ్చెలి వాపోవునాని సూరడించరే

చ. 3:

యెప్పుడు వచ్చెనో మాయిల్లు చొచ్చి పెట్టెలోన
చెప్పరానివుంగరాల చేయి వెట్టీ
అప్పడైనవేంకటేశుఁడాపాలకుఁడు గాన
తప్పకుండ పెట్టె వానితల కెత్తరే


రేకు: 0026-6 శ్రీరాగం సం: 05-149

పల్లవి:

వద్దు వోరా నీవు గడు వచ్చి తడవాయనేరు
నిద్దురవుచ్చేవు నేము నీ కొలఁదివారమా

చ. 1:

గయ్యాళి యెవ్వతో కాని కస్తూరివాట్లు చూడ
నొయ్యారముగా వేసె నుదుటైన గుబ్బల
కయ్యపుఁ గూటముల నీ కౌఁగిలెల్లానంటె నీవు
పుయ్యక పూసిన కమ్మఁబూత వింతలాయరా

చ. 2:

గొంటెత యెవ్వతోకాని కొదలేని తమకి తా-
నంటఁగాక నిన్నుఁగూడె నదిరి పాటునను
వెంటనే తెచ్చితివోరి వెడగెంపునీరు కోక-
నంటినది నీవు మమ్ము నంటక తొలఁగరా

చ. 3:

కొండలలో నెలకొన్న కోనేటిరాయఁడ యెందు
వుండిన నామనలోనుండి పాయలేవురా
నిండిన కౌఁగిటఁజేర్చ నీవు దానై కూడి-
యుండినట్లనే పాయకుండె నెవ్వతెరా