తాళ్ళపాక పదసాహిత్యం/ఐదవ సంపుటం/రేకు 417
రేకు: 0017-1 ముఖారి సం: 05-096
పల్లవి:
పసులు గాచేటి కోల పసపుఁ జేల
పొసఁగ నీకింతయేల బుద్ధుల గోల
చ. 1:
కట్టిన చిక్కపు బుత్తి కచ్చకాయల తిత్తి
చుట్టిన పించెపుఁ బాగ చుంగుల సోగ
ఇట్టి సింగారము సేయ నింత నీకుఁ బ్రియమాయ
వెట్ట నీచేఁతల మాయ విట్టలరాయ
చ. 2:
పేయలఁ బిలుచుకూఁత పిల్లఁగోవి బలుమోఁత
సేయరాని గొల్లెతల సిగ్గులచేఁత
ఆయెడలఁ దలపోఁత యమున లోపలి యీఁత
వేయరాని మోపులాయ విట్టలరాయ
చ. 3:
కొంకులేని పొలయాట కూరిములలో తేట
అంకెల బాలులతోడి యాట పాట
పొంకపు తుత్తురు కొమ్ము పొలుపైన నీ సొమ్ము
వేంకటనగము చాయ విట్టలరాయ
రేకు: 0017-2 భైరవి సం: 05-097
పల్లవి:
ఉగ్గు వెట్టరే వోయమ్మా చె-
య్యొగ్గీనిదె శిశువోయమ్మా
చ. 1:
కడుపులోని లోకమ్ములు గదలీ-
నొడలూఁచకురే వోయమ్మా
తొడికెడి సరుగనఁ దొలఁగఁ దీయరే
వుడికెడి పాలివి వోయమ్మా
చ. 2:
చప్పలు వట్టుక సన్నపుబాలుని-
నుప్పరమె త్తకురో యమ్మా
అప్పుడె సకలము నదిమీ నోరనె
వొప్పదు తియ్యరె వోయమ్మా
చ. 3:
తొయ్యలులిటు చేతుల నలఁగించక
వుయ్యల నిడరే వోయమ్మా
కొయ్య మూటలను కొండల తిమ్మని-
నొయ్యన తిట్టకురోరమ్మా
రేకు: 0017-3 దేసాళం సం: 05-098
పల్లవి:
కొలనిదోఁపరికి గొబ్బిళ్ళో యదు-
కులము స్వామికిని గొబ్బిళ్ళో
చ. 1:
కొండ గొడుగుగా గోవులఁ గాచిన
కొండుక శిశువుకు గొబ్బిళ్ళో
దుండగంపు దైత్యులకెల్లను తల-
గుండు గండనికి గొబ్బిళ్ళో
చ. 2:
పాపవిధుల శిశుపాలుని తిట్ల-
కోపగానికిని గొబ్బిళ్ళో
యేపునఁ గంసుని యిడుమలఁ బెట్టిన-
గోపబాలునికి గొబ్బిళ్ళో
చ. 3:
దండి వైరులను తఱమిని దనుజుల-
గుండె దిగులునకు గొబ్బిళ్ళో
వెండిఁ బైఁడియగు వేంకటగిరిపై
కొండలయ్యకును గొబ్బిళ్ళో
రేకు: 0017-4 కాంబోది సం: 05-099
పల్లవి:
తమ్ములాల అన్నలాల తల్లులాల నే
నెమ్మనపు హరిఁ బాసి నిలువనేనిఁకను
చ. 1:
కొమ్మలాల మరుకోట కొమ్మలాల వో-
యమ్మలాల తొలరె నా యక్కలాల
తమ్మిరీకుఁ గన్నుల యాతనిఁ బాసి నే-
నుమ్మల సొమ్మలచేత నుండలేనిఁకను
చ. 2:
చెలులాల కలికి తొయ్యలులాల వో-
యెల జవ్వనముల మోహినులాల
చెలువంపు హరిఁ దలఁచిన నాకు నే -
నులుకుఁ గన్నీ రాఁపకుండలే నిఁకను
చ. 3:
బోఁటులాల జవ్వనపు మేఁటులాల వో-
గాఁటపుఁ దురుముల చీఁకటులాల
వాఁటమైన వేంకటేశ్వరుఁ బాసి నే-
నాఁటదాననై జన్మమందలేనిఁకను
రేకు: 0017-5 పాడి సం: 05-100
పల్లవి:
ఏఁటికిఁ జేరీనేమితఁడు
నాఁటించి రతి నన్నేలె
చ. 1:
కన్నుల మొక్కీఁ గానుకలంపీ -
నెన్నటికెన్నఁడిదేమితఁడు
నిన్నట నుండియు నెయ్యమె పెంచీ
నన్నేలీతఁడు నవ్వీనే
చ. 2:
పువ్వుల వేసీఁ బొంచుక లాసీ-
నెవ్వరికెవ్వరిదేమితఁడు
దవ్వుల నున్నాఁ దాపము రేఁచీ
రవ్వలనే కడు రాసీనే
చ. 3:
కంపులె పూసీఁ గౌఁగిట మూసీ-
నింపులు నేసీనేమితఁడు
చెంపల చెమటల శ్రీ వేంకటేశుఁడు
అంపరాని విభుఁడాయఁ గదే
రేకు: 0017-6 శ్రీరాగం సం: 05-101
పల్లవి:
సామాన్యమా వలపు సతులుఁ బతులనుభవన -
లేమరినఁ బ్రాణంబులేరీతి నుండు
చ. 1:
కలికి చూపుల మనసు గరఁగ కెటువలె నుండు
అలయింతలను దేహమలయకేలుండు
బులుపుఁ బిలుపుల మేను పులకించకేలుండు
మొలకనగవుల యాస మొలవకేలుండు
చ. 2:
పచ్చిచూపులు కాఁడి పారకెటువలెనుండు
వెచ్చనూర్పులు మనసు వేఁచకేలుండు
మచ్చికల హృదయంబు మరులు గొనకేలుండు
అచ్చలంబునఁ గాఁకలలమకేలుండు
చ. 3:
దంటమాటలఁ గూర్మి దగుల కెటువలెనుండు
నంటునను మోహంబు నాఁటకేలుండు
గొంటుఁజేఁతల మనసు కొల్లగొనకేలుండు
రెంటలను విరహగ్ని రేఁచకేలుండు
చ. 4:
కింకలను దమకంబు కెరలకెటువలె నుండు
జంకెనలఁ బ్రేమ కొనసాఁగకేలుండు
వేంకటవిభుఁనిఁ గలసి వెడయలుక యేలుండు
పంకజానన వానిఁ బాసియేలుండు