తాళ్ళపాక పదసాహిత్యం/ఐదవ సంపుటం/రేకు 416
రేకు: 0016-1 సామంతం సం: 05-090
పల్లవి:
వద్దు నాతో బొంక నిటువలె నీకు నీ -
సుద్దుల కాఁకల మంట సొద చొచ్చేరా
చ. 1:
కనలి నే నపరాధిఁ గానని కలికి నీ -
కొనచూపులనే యలుగులఁ బారేనే
యెనసి యెవ్వతెకొ మోహింతువని నీ మోవి
మనసార నాలిక మడ్డువట్టే రా
చ. 2:
మఱచి యెవ్వతెతో నే మాటాడనని నీ -
చిఱునవ్వు నిప్పులు దోసిట ముంచేనే
తెఱలఁ గాఁగిన నీ దేహపు టుక్కుఁ గంబము
కఱతలిన్నియు నని కౌఁగిలించేరా
చ. 3:
నెలఁత దక్కితినని నీ వీడెపు రసము
చలివాయ నిపుడు పోసము దాగేనే
కలసియు నన్ను వెంకటరాయ కపటాన -
నలయించేవని నీపై నాన వెట్టేరా
రేకు: 0016-2 వరాళి సం: 05-091
పల్లవి:
పన్నీరు చల్లెరా నీపై పలచని దెవ్వతో
అన్నువయలపుతోడ నసలాయఁ జెక్కులు
చ. 1:
కప్పురము చల్లె నీపై కలికి యదెవ్వతో
యిప్పుడె నీ వురమెల్ల నెఱ్ఱ నాయను
చెప్పరాని మురిపెంపు చేఁతలెల్ల నాకును
కప్పిఁన గప్పఁగరాని గతులాయ నిప్పుడు
చ. 2:
మృగనాభి చల్లె నీపై మెలుఁత యదెవ్వతో
తెగువ నీమోమెల్ల తెల్లనాయను
నగపు మేలము గాదు నమ్మరా నా పలుకు
సగవాయ నిప్పుడే యీ చక్కని నీ దేహము
చ. 3:
కుంకుమ చల్లెర నీపై కోమలి యదెవ్వతో
సంకె దేరి నీమేనెల్లా చల్లనాయను
వేంకట విభుఁడ నీకు వెచ్చమైతిఁ జెప్పరా
వుంపకుగా నాకు నబ్బె ఉదుటు నీచేఁతలు
రేకు: 0016-3 ఆహిరి సం: 05-092
పల్లవి:
కుందణంపుమై గొల్లెత తా -
నెందును బుట్టని యేతరి జాతి
చ. 1:
కప్పులు దేరేటి కస్తూరి చంకల
కొప్పెర గుబ్బల గొల్లెత
చప్పుడు మట్టెల చల్లలమ్మెడిని
అప్పని ముందట హస్తిణిజాతి
చ. 2:
దుంప వెంట్రుకల దొడ్డతురుముగల -
గుంపెన నడపుల గొల్లెత
జంపుల నటనలఁ జల్లలమ్మెడిని
చెంపల చెమటల చిత్తిణిజాతి
చ. 3:
వీఁపున నఖములు వెడవెడ నాఁటిన
కోపపుఁ జూపుల గొల్లెత
చాఁపున కట్టిగఁ జల్లలమ్మెడిని
చాఁపేటి యెలుగున శంకిణిజాతి
చ. 4:
గారవమున వేంకటపతి కౌఁగిట
కూరిమిఁ బాయని గొల్లెత
సారెకు నతనితో చల్లలమ్మెడిని
బారపుటలపుల పద్మిణిజాతి
రేకు: 0016-4 ముఖారి సం: 05-093
పల్లవి:
సతి గర్వమిది నీ తేజము గాదా
అతివఁ బ్రేమముతోడ నాదరించవయ్యా
చ. 1:
కనకపుఁ జమ్మాళిగలు మెట్టియల జ-
వ్వని గర్వమున నిట్టె వచ్చి వచ్చి
వెనక వెనకకె పోయీ వెఱచి దేవరఁగని
కనకపందలము గక్కన నంపవయ్యా
చ. 2:
అడప తొయ్యలి తన కాకు మడిచియ్యఁగా
నడపుల మురిపేన నవ్వుచు వచ్చి
అడరి నీ పొడగని ఆకదే తనకుఁ దానె
మడుచుకొనెడి నీవె మడిచియ్యవయ్యా
చ. 3:
కొప్పున సంపంగిరేకులు గానరాఁ జెరిగి
కప్పుచు నెరుల నిన్నుఁగని కలికి
యెప్పుడునుఁ దిరువేంకటేశుఁడ నీ వెఱపెల్ల
చెప్పరాని తమకమే చిత్తగించవయ్యా
రేకు: 0016-5 భైరవి సం: 05-094
పల్లవి:
గోళ్ళు మీఁటుచునుండెఁ గొన్నాళ్ళు గొల్ల-
వీళ్ళ పాలారగించె వీఁడు కొన్నాళ్ళు
చ. 1:
కోడెకాఁడై తిరిగెఁ గొన్నాళ్ళు తాఁ
గోడెల నావుల- గాచెఁ గొన్నాళ్ళు
కోడెల వల్లెతాడై గొల్లెతలా తాఁ
గూడి పైకొననుండెఁ గోరి కొన్నాళ్ళు
చ. 2:
గుజ్జు రూపము ధరించెఁ గొన్నాళ్ళు
గుజ్జనగూళ్ళారగించెఁ గొన్నాళ్ళు
గుజ్జుబాలకిఁ దగిలెఁ గొన్నాళ్ళు తా
బొజ్జెనె లోకము నించె పొందుగఁ గొన్నాళ్ళు
చ. 3:
కొండ గొడుగుగాఁ బట్టెఁ గొన్నాళ్ళు తాఁ
గొండముచ్చుల నేలెఁ గొన్నాళ్ళు
కొండల కోనేటివాఁడై కోరికలా తాఁ
గొండుక చేఁతలు దొంకొనియెఁ గొన్నాళ్ళు
రేకు: 0016-6 ముఖారి సం: 05-095
పల్లవి:
దొరకెఁగా పూజ కందువపూజ నీ-
విరహపు తనుతావి విరవాదిపూజ
చ. 1:
కలికి నీ కనుచూపు కలువరేకులపూజ
లలన నీ నగవు మొల్లల పూజ
తలపోఁత చింత చిత్తపుఁ గమలపు పూజ
చలివేఁడి వూర్పు నీ సంపంగి పూజ
చ. 2:
కవలుఁ జెక్కునఁ జేయి కరపల్లవపు పూజ
తనుపులకలు జాజిననలపూజ
తనరు నీవలులు దొంతరపూవుల పూజ
మొనయుఁ జెమట మల్లె మొగ్గలపూజ
చ. 3:
చెనకు నీ గోళ్ళే చిఱుగేదఁగుల పూజ
గునియు గుబ్బలు పూవుగుత్తుల పూజ
ఘనతమైఁ గూడి వేంకటపతి మోము సోఁ-
కిన నీదుమోవి మంకెనపూవు పూజ