Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/ఐదవ సంపుటం/రేకు 415

వికీసోర్స్ నుండి


రేకు: 0015-1 ఆహిరి సం: 05-085

పల్లవి:

లేత మాయలు నీకు నింతేసి పూత సిగ్గులే బూమిలో వారికి
యీఁత వలపు చిత్తములోన నెవ్వరికైనాఁ దెలుసునే

చ. 1:

కొప్పునఁ జిన్ని కొనలు సాగ కురులు దురుమ నేఁటికే
కుప్పలే గాఁగఁ జెక్కులదాఁ క కుంకుమ పూయనేఁటికే
ముప్పిరి గొసఁగ రెప్పల తుదల ముద్దులు గునియ నేఁటికే
నిప్పక సెలవిఁబార నవ్వుచు వింతలు సేయనేఁటికే

చ. 2:

గుబ్బల మించులు పయ్యెద వెడల కులికి నడవ నేఁటికే
గబ్బితనము చూపులోని కలికి లాగుల లేఁటికే
వొబ్బిడియైన చెలుల లోన వొయ్యారము లేఁటికే
అబ్బుర పడఁ జూచిన వారి కాసలు సేయనేఁటికే

చ. 3:

కొండల తిమ్మని జూచి లోలో కుతిల కుడువ నేఁటికే
కొండుక వయసు వారికింత గుట్టున నడవ నేఁటికే
యెండయు నీడయు నిపుడె కంటి మెమ్మెలఁ బొరల నేఁటికే
కొండత మేలు సేసిన వారిని కొడి మెలెన్న నేఁటికే


రేకు: 0015-2 తెలుఁగుఁగాంబోది సం: 05-086

పల్లవి:

చెట్ట వట్టేవేరా నన్నుఁ జెంచుదానిని
పుట్టతేనెలారగించి పోకవుండేవా

చ. 1:

కుదురు గదలని నాగుబ్బలే చూచితి గాని
గదరుఁ బుణుఁగు కంపు గానవైతివిగా
చిదిమినా నెఱఁగవు చేరేవు నా పొగడని
గుదికొన్నమరునమ్ము గుండె దాఁకెనా

చ. 2:

తొరంపు నా మెఱుఁగుల తొడలే చూచితి గాని
జీరల నాచెమటమై చిత్తగించవా
కేరేవు నా పొడగని కిందుపడి నీవు నాకు
యీరాని చనవులెల్లా నియ్యనోపుదా

చ. 3:

పిక్కటిల్లు తేనెల నా పెదవే చూచితి గాని
చొక్కపు నా యెంగిలిని చూడవైతిగా
ఇక్కువ గరఁగి వేంకటేశ నన్నుఁ గూడితివి
వొక్కనిమిషమోరవ నోపవైతిగా


రేకు: 0015-3 శ్రీరాగం సం: 05-087

పల్లవి:

తేనెయు నేయు నంపోవు తీపుమాటల
కానీలే తేనెయు నేయుఁ గాదా నీయలుక

చ. 1:

కప్పురమే యంపోవు కటకటా అందుతోనే
అప్పుడైనా నిమ్మపండు నంపవైతివి
కప్పురగంధికి నీ కరుణ లేకుండుటే
కప్పురము నిమ్మపండుఁ గాదా నీయలుక

చ. 2:

సంపెంగనూనె యంపేవు సారెసారె నందుతోనె
అంపవైతి గన్నెరలు అప్పుడైనాను
ఇంపులేని కోమలికి నేఁటికి సంపెంగనూనె
కంపులును గన్నెరలుఁ గాదా నీయలుక

చ. 3:

నేరేడుఁ బండ్లే యంపేవు నెలఁతకు నందుతోనె
ఆరనియానవాలై నా నంపవైతివి
కోరి వేంకటేశ యింతిఁ గూడితిగాక లేకుంటే
నేరేడుఁబండ్లుఁ బాలును నేఁడేపో నీయలుక


రేకు: 0015-4 కన్నడగౌళ సం: 05-088

పల్లవి:

ఏమనఁగలదిఁకఁ గాలము యింతయు విపరీతములై
భామినిదేము పరితాపంబున వేఁగెడిని

చ. 1:

కప్పురమియ్యని వీడెము గైకొనకొల్లని కాంతకు
కప్పురమంటిన చోట్లే కడుఁగడుఁ దొక్కెడిని
పుప్పొడివెన్నెల పొళ్ళు (?) పొలఁతికి వెన్నెల బాయిలు
నిప్పులఁ దోఁగినయట్లే నిలువునఁ గాఁగెడిని

చ. 2:

పానుపు పువ్వులఁ బరవక పవళింపుని సతి పూవులఁ
పానుపు కన్నులఁ జూచినఁ బరవశమందెడిని
లేనగవొదవని మాటలు లేనిలతాంగికి నగవులు
కానుకపట్టిన నొల్లక కన్నుల విసిగెడివి

చ. 3:

కందర్పుని గురుఁడనఁగాఁ గలిగిన తిరువేంకటపతి -
చందము చూపుల బామిని చనవున నొప్పెడిని
ఇందు వదనకే దేవుఁడు యింపులఁగడు మన్నించిన
కందువ పొలయలుకలఁ దమకమువడి రేఁపెడిని


రేకు: 0015-5 ముఖారి సం: 05-089

పల్లవి:

ఆతఁడేపో చెలియా మాయాతఁడు
చేతనే పరము చూపి చెలువైన యాతఁడు

చ. 1:

కుప్పలుగాఁ గస్తూరియు కుంకుమయు మయినిండ -
నప్పళించుకొని యున్న యాతఁడు
గొప్పగొప్ప ముత్తేల కుప్పె సవరము పెద్ద-
కొప్పుతోఁ జెలఁగీనదె కో మా యాతఁడు

చ. 2:

మలయుఁ జెక్కుల నవ్వు మకర కుండలముల
అలర నిగ్గులె చల్లే యాతఁడు
బలువైన ముత్యాల పదకాల హరాల
వెలుఁగొందీ నదె చూడవే మా యాతఁడు

చ. 3:

సంకుఁ జక్రపుఁ జేతుల సందుల బాహుపురుల
అంకెలఁబ్రభల మించే యాతఁడు
వేంకట నగము మీఁద విభవంపుఁ గౌఁగిలి నా -
కుంకువగా నిచ్చె నదెకో మా యాతఁడు