తాళ్ళపాక పదసాహిత్యం/ఐదవ సంపుటం/రేకు 412
రేకు: 0012-1 ఆహిరి సం: 05-068
పల్లవి:
చక్కఁదనములచేత జవ్వన భారము చేత
యెక్కడౌటాఁ గానదిఁక నేమి సేతమే
చ. 1:
ఒయ్యనె బంగారు తూఁగుటుయ్యాల మంచముమీఁద
పయ్యెద చెఱఁగు జారఁ బవ్వళించి
ముయ్యక మూసిన రెప్ప మూయుచుఁ దెరచుఁ గాని
నెయ్యమునఁ జూడనేరదేమి సేతమే
చ. 2:
ముత్తేల గద్దియమీఁద ముద్దుల కురులు దూల-
నొత్తిలి యొకతె మీఁద నొరగుండి
చిత్తగించి చేతనున్న చెంగలున బంతిఁ జెక్కు-
లొత్తుఁగాని మాటలొల్లదేమి సేతమే
చ. 3:
కమ్మని తావులతోడ కన్నుల నవ్వులతోడ
చిమ్ముఁ జెమటలతోడఁ జెలువొంది
కొమ్మకు నేడుఁగలిగె కోనేటిరాయని పొందు
నెమ్మనము దాఁచ నేరదేమి సేతమే
రేకు: 0012-2 ఆహిరి సం: 05-069
పల్లవి:
దవ్వుల నుండవే యాల దగ్గరేవు ఆతఁ-
దెవ్వరౌతా నెఱఁగవిదేమే చెలియా
చ. 1:
ఒద్దికతో చనుదోయి నొరయుచు కంట-
నద్దలింపుచుఁ దిట్టేవు అమ్మమీఁదను
ముద్దుమోము విరియించి మురిసేవు ఇంత
వద్దువో ఆతనితో గర్వము నీకుఁ జెలియా
చ. 2:
బొమ్మముడి జంకెనలఁ బొలయుచు మోవిఁ
దమ్మచూపి సన్న సేసి తనరేవు
చిమ్మేవు నీ చెమటలు చెక్కు మీఁద ఓ-
యమ్మరో యాతనితో వొయ్యార మేలే చెలియా
చ. 3:
మొరము మెట్టెలు పాదమున మెట్టి
చెరఁగులోపల గోరఁ జెనకేవు
కరఁగి వేంకటపతి కౌఁగిట నీ-
నెరతనములు చూప నేర్తువా చెలియా
రేకు: 0012-3 శంకరాభరణం సం: 05-070
పల్లవి:
తరుణి నీ యలుకకెంతటిదింతినీ వేళఁ
గరుణించఁగదర వేంకటశై లనాథా
చ. 1:
ఒకమారు సంసారమొల్లఁ బొమ్మని తలఁచు
ఒకమారు విధిసేఁతలూహించి పొగడు
ఒకమారు తనుఁజూచి వూరకే తలవూఁచు-
నొకమారు హర్షమున నొంది మే మఱచు
చ. 2:
నిన్నుఁ జూచి వొకమారు నిలువెల్లఁ బులకించు
తన్నుఁ జూచి వొకమారు తలపోసి నగును
కన్ను దెరచి నినుఁజూచి కడు సిగ్గువడి నిలిచి
యిన్నియునుఁ దలపోసి యింతలో మఱచు
చ. 3:
వదలైన మొలనూలు గడియించు నొకమారు
చెదరిన కురులెల్లఁ జెరుగునొకమారు
అదనెరిఁగి తిరువేంకటాదీశ పొందితివి
చదురుఁడవు నినుఁ బాయఁజాలదొక మారు
రేకు: 0012-4 బౌళి సం: 05-071
పల్లవి:
మోహము సేయించుకొని మురిసేవు నీ-
సాహసములె దురా చదురాలికిపుడు
చ. 1:
ఒక్క చక్రమె నీకునున్నది గాని, యింతిఁ
రెక్కల చక్రాలె పో రెండు గుబ్బలు
మక్కువ సేయించుకొని మలసేవు నీ-
చక్కఁదనమెదురా జవరాలికిపుడు
చ. 2:
నీలమేఘము చాయ నీమేను గాని పెద్ద-
నీలమేఘమే పో నెలఁత కొప్పు
జాలిఁ బొరలించేవు సతిని నీవు నీ-
తాలిములెదురా తరుణికి విపుడు
చ. 3:
మరుని ప్రతినిధి నీ మహిమ గాని ఆ-
మరుని సంపదే పో మగువ నేఁడు
తిరువేంకటేశ పొందితివి గాని నీ-
సరసము లెదురా సకియకు నిపుడు
రేకు: 0012-5 పాడి సం: 05-072
పల్లవి:
వచ్చెరా మా యమ్మతోడు వన్నెలుగావు నీ-
మచ్చరములెల్ల మాని మందకేఁగ నియ్యరా
చ. 1:
ఓసోసి యెందు వొయ్యేవే వొయ్యారపుగొల్లెతా
దోసము మమ్మునంటక తొలఁగరటు
మూసేవే గుబ్బల గొంగు మురిపెంపుగొల్లెతా
మూసినది చీరకొంగు మందకేఁగ నియ్యారా
చ. 2:
సానఁ బట్టేవే మాటలే చల్లజంపు గొల్లెతా
నేనేమి బాఁతిరా నీకు నెరజాణా
కానిలే రావైతివిగా గబ్బిచూపుగొల్లెతా
మానమువంకఁ జూడక మందకేఁగ నియ్యరా
చ. 3:
జంకించేవే బొమ్మలను జవ్వనంపుగొల్లెతా
వేంకటవిభుఁడ నీకు వెరతుమయ్య
అంకపు గుబ్బలను నన్ను నదిమేవె గొల్లెతా
మంకుఁ గూటములు మాని మందకేఁగ నియ్యరా
రేకు: 0012-6 దేసాళం సం: 05-073
పల్లవి:
కులుకక నడవరో కొమ్మలాలా
జలజలన రాలీని జాజులు మా యమ్మకు
చ. 1:
ఒయ్యనే మేను గదిలీ నొప్పుగా నడవరో
గయ్యాళి శ్రీపాదతాఁకు కాంతలాలా
పయ్యెద చెఱగు జారీ భారపు గుబ్బలమీఁద
అయ్యో చెమరించె మా యమ్మకు నెన్నుదురు
చ. 2:
చల్లెడి గందవొడి మైజారీ నిలువరో
పల్లకి వట్టిన ముద్దు బణఁతులాల
మొల్లమైన కుందనపు ముత్యాల కుచ్చులదర
గల్లనుచుఁ గంకణాలు గదలీ మాయమ్మకు
చ. 3:
జమళి ముత్యాలతోడి చమ్మాళిగ లిడరో
రమఱికి మణుల నారతులెత్తురో
అమరించి కౌగిట నలమేలుమంగనిదె
సమకూడె వేంకటేశ్వరుఁడు మాయమ్మకు