తాళ్ళపాక పదసాహిత్యం/ఐదవ సంపుటం/రేకు 410
రేకు: 0010-1 సామంతం సం: 05-056
పల్లవి:
ఒద్దేలు మొక్కేవో వుద్ధవుఁడా తన
ఉద్దండాలె చెల్లెనుద్ధవుఁడా
చ. 1:
ఊరూర వలపులుద్ధవుఁడా నే-
మోరుతుమా యిఁక నుద్ధవుఁడా
ఊరడించ వచ్చేవు వుద్ధవుఁడా తన-
వూరట చెలుములుద్ధవుఁడా
చ. 2:
ఒప్పలర మావురిసిన పుం-
డ్లుప్పులు వెట్టించె నుద్ధవుఁడా
చెప్పకు మమ్మిఁక చెలువుఁడాతఁడే
వొప్పివుంటేఁ జాలు నుద్ధవుఁడా
చ. 3:
గోపకల మమ్ము గూరిమిఁజిక్కించె-
నోపమింతేసి నేముద్ధవుడా
పైపైనే మమ్మింత ప్రాణము నిలుప-
నోపెఁగా తానైన నుద్ధవుఁడా
చ. 4:
తెగి తన్నుఁ గూడే తెరఁగు దలఁచి
యుగములై నవి ఉద్ధవుఁడా
పగటున మా మా ప్రాణము మాకిఁక
నొగరే తీపాయే నుద్ధవుఁడా
చ. 5:
చెల్లించె మా ప్రేమ శ్రీవేంకటేశుఁడు
వుల్లమలర నేఁడుద్ధవుఁడా
చల్లని కూటపు జనవిచ్చి మామా-
వొళ్లెల్లఁ జెనకె నుద్ధవుఁడా
రేకు: 0010-2 ముఖారి సం: 05-057
పల్లవి:
పలుమరు వుట్లపండుగను
చిలుక చిడుక్కని చిందఁగను
చ. 1:
ఊళ్ళ వీధుల వుట్లు కృష్ణుఁడు
తాళ్ళు దెగిపడఁ దన్నుచును
పెళ్లు కఠిల్లు పెఠిల్లు చిఠిల్లని
పెళ్ళుగ మ్రెసె పెనురవము
చ. 2:
బంగారు బిందెలఁ బాలుఁ బెరుగులు
ముంగిట నెగయుచు మోఁదఁగను
కంగు కళింగు కఠింగు ఖణింగని
రంగుమీరు పెనురవములై
చ. 3:
నిగ్గుగ వేంకటనిలయుఁడుట్టిపాఁ
లగ్గలికఁ బగుట నడువఁగను
భగ్గు భగిల్ల ని పరమామృతములు
గుగ్గిలి పదనుగఁ గురియగను
రేకు: 0010-3 ఆహిరి సం: 05-058
పల్లవి:
చెడ్డ చెడ్డ మనసుల చెంచువారము- ఆల-
దొడ్డివాఁడ పోవయ్య దూళికాళ్ల రాక
చ. 1:
ఏఁటి దాననైతినేమి యెవ్వతె నేనైతినేమి
ఆఁటదాని నన్ను నీకు నడుగనేలా
మూఁట మాఁటలనె కడు మోవనాడవద్దు లేటి-
వేఁటకాఁడ పోవయ్య వెంటవెంట రాక
చ. 2:
ఎవ్వరి వారైరేమి యేడనేడ నుండిరేమి
దవ్వుచేరువలు నీకు దడవనేలా
నవ్వకుండఁగానె వట్టి నవ్వునవ్వేవెవ్వరైన
పువ్వక పూచెననేరు పోవయ్య రాక
చ. 3:
ఎక్కువ కొప్పయిననేమి యెంత గుబ్బలైన నేమి
చక్కఁదనము వొగడ సారె నీకేలా
వెక్కసాలు మాని మాతో వేంకటేశ మాయింటి-
యిక్కువకే పోవయ్య యింతనంత రాక
రేకు: 0010-4 శుద్ధదేశి సం: 05-059
పల్లవి:
ఎందరిఁ జెనకేవేరా నీవు
అందపు నీ మేన నలముచు
చ. 1:
ఎక్కడికైనా విచ్చేసి యేరా నీవు
వెక్కస మాడేవు వెఱవక
యిక్కువలంటఁగ వచ్చేవేరా నీవు
నిక్కపు నీ ప్రేమ నెరపుచు
చ. 2:
ఎప్పుడు మానవు బిగువేరా నీవు
కప్పురపు నోరఁ గసరుచు
యిప్పుడె యింతేసి చేసేవేరా నీవు
వొప్పదు నాతోడి వుదుటులు
చ. 3:
ఏతరుణిఁ దలఁచితొ యేరా నీవు
కాతరాన నన్నుఁ గలయుచు
యేతరి వేంకటేశుఁడ యేరా నీవు
బూతులమాటాడి పొదలేవు
రేకు: 0010-5 హిజ్జిజి సం: 05-060
పల్లవి:
తరుణిపై మరునికి దయలేదు నీవు
మరునినే పోలితి మరియేఁటిబ్రదుకు
చ. 1:
ఎదురు చూచి చూచి యింతక యేమౌనో
హృదయము ఝల్లనీ నిటుదలఁచి
పొదల తీగెలయింటఁ బొరలి యేమౌనో
మదిరాక్షికొకటైన మరియేఁటిబ్రదుకు
చ. 2:
చెలుల దూరిదూరి సిగ్గుననేమౌనో
తలఁచి తలఁచి గుండె తల్లడించీని
కల నిన్నుఁగని లేచి గక్కన నేమౌనో
మలసి వెన్నెలమంట మరియేఁటిబ్రదుకు
చ. 3:
ఇంతి గలయకున్న నిఁక నెంత యౌనో
పంతపు వేంకటరాయ భయమయ్యీని
ఇంత నీకరుణ నిఁక నెంత యౌనో
మంతనమింత లేకున్న మరియేఁటి బ్రదుకు
రేకు: 0010-6 రామక్రియ సం: 05-061
పల్లవి:
వద్దే గొల్లెత వదలకువేఁ నీఁ
ముద్దు మాటలకు మొక్కేమయ్యా
చ. 1:
యేలే యేలే యేలే గొల్లెత
నాలాగెఱఁగవా నన్ను నేఁచేవు
చాలుఁజాలు నిఁకఁజాలు నీరచనలు
పోలవు బొంకులు పోవయ్యా
చ. 2:
కానీ కానీ కానిలే గొల్లెత
పోనీలే నీవెందు వోయినను
మాని మాని పలుమారుఁ జెనుకుచు మా-
తోనిటు సొలయక తొలవయ్యా
చ. 3:
రావా రావా రావా గొల్లెత
శ్రీవేంకటగిరి చెలువుఁడను
నీవె నీవె నను నించితి కౌఁగిట
కైవశమైతినిఁ గదవయ్యా