తాళ్ళపాక పదసాహిత్యం/ఐదవ సంపుటం/రేకు 404
రేకు: 0004-1 వసంతం సం: 05-018
పల్లవి:
శోభనమే శోభనమే
వైభవముల పావనమూర్తికి
చ. 1:
అరుదుగ మును నరకాసురుఁడు
సిరులతోఁ జెరలుదెచ్చిన సతుల
పరువపు వయసుల బదారువేలను
సారిదిఁ బెండ్లాడిన సుముఖునికి
చ. 2:
చెందిన వేడుక శిశుపాలుఁడు
అంది పెండ్లాడఁగ నవగ ళించి
విందువలెనె తా విచ్చేసి రుకుమిణి
సందడిఃఁబెండ్లాడిన సరసునికి
చ. 3:
దేవదానవులు ధీరతను
దావతిపడి వారి దరువఁగను
శ్రీ వనితామణిఁ జెలగి పెండ్లాడిన
శ్రీ వేంకటగిరి శ్రీ నిధికి
రేకు: 0004-2 పాడి. సం: 05-019
పల్లవి:
దేవరచిత్తం దివ్యనిధి
దేవనిర్మిత విధీ యవధానం
చ. 1:
అతివలు నాట్యంబాడెదమని వు-
న్నతి మెఱయుచు నున్నారిదివో
ప్రతినలతో రంభయు మేనకయును
ధృతి కరుణాంబుది ధీయవధానం
చ. 2:
గానవిద్య తమకంబున వినుమని
కానుకలివె సురకాంతలవి
కానుపించుకో గంధర్వసతులను
ధీనుత పంపు ధీ యవధానం
చ. 3:
పరియంకంబునఁ బవళించెదవో
సిరుల విభవముల జెలఁగెదవో
తిరువేంకటగిరి దేవ యన్నిటా
తిరమందితి విటు ధీయవధానం
రేకు: 0004-3 శంకరాభరణం సం: 05-020
పల్లవి:
ఇంతే విన్నపమింతేలా నీ-
పంతము చేకొంటి పాలించు
చ. 1:
అలయు సాలయునతివ లోలోనే
చెలిపై నొరగు చెక్కు నొక్కు
పులకించు నించు వొలఁతి చెమట
చిలికించు గోరఁజిత్తగించు
చ. 2:
చెలుల మొరఁగు చింతచే గరఁగు
పలుకఁ దలఁచు బడలును
పిలుచు నిన్ను నీపేరుకొనుచును
తొలఁకు కన్నీరు దుడుచును
చ. 3:
చనుఁగవ చూచు సారె నీసేఁతలు
తనలోనే మెచ్చి తనరును
అనయము వేంకటాధీశ యీ యింతిఁ
జెనకి కౌఁగిటఁ జేకొంటివి
రేకు: 0004-4 ముఖారి సం: 05-021
పల్లవి:
కలలోనె యిరువురము నలిగి వేగ
కలయనుచు దెలిసి నినుఁ గౌఁగిలించితిరా
చ. 1:
అలుగుదురెఁ బతులనఁగా వినఁగ
నలవాటు లేక నే నలుగుచుండుదురా
అలిగితట వురక నీవంత నాతోను మరి
నలుగులౌనట పూవులంతలోపలనే
చ. 2:
చందురుఁడె సూర్యుఁడై జరగ మిగుల
కెందమ్ములవుర నాకెంగేలుదోయి
గందమే తోఁచెనట కస్తూరియనఁగ నా-
చందమపుడొకలాగు చందమవునటరా
చ. 3:
విటవరుఁడ కోనేటివిభుఁడ నీ
వెటు దొలంగిన దేహమెట్టు నిలుపుదురా
యిటువలెనె మనలోన నెలమి మరచి
తటుకననుఁ గలయనుచు తలఁకి తెలిసితిరా
రేకు: 0004-5 నాదరామక్రియ సం: 05-022
పల్లవి:
సకలం హేఖి జానామి తత్
ప్రకటవిలాసం పరమం ధధసే
చ. 1:
అలికమృగమదమయ మషీకలనో
జ్జ్వలతాం హేసిఖి జానామి
లలితం తవ పల్లవిత మనసి ని-
శ్చలతర మేఘశ్యామం ధధసే
చ. 2:
చారుకపోల స్థల కరాంచిత వి-
చారం హేఖి జానామి
నారాయణ మహినాయకశయనం
శ్రీరమణం తవ చిత్తే ధధసే
చ. 3:
ఘనకుచశైలాగ్రస్థిత విధుమణి-
జననం హేఖి జానామి
కనదురసా వేంకటగిరి పతే-
ర్వినుత భోగసుఖ విభవం ధధసే
రేకు: 0004-6 భైరవి సం: 05-023
పల్లవి:
వనితభాగ్యంబు దేవరచిత్తము మాకు
బనిగాదు యింక నీ పాదంబులాన
చ. 1:
అడబాలసతి బోనమారగించు మటంచు
బడి బడిని కడు విన్నపము సేయఁగా
ఉడుగని పరాకుతో నుండి నెచ్చెలి మీఁద
బడలి వొరగినది నీ పాదంబులాన
చ. 2:
అడపంబుపతి వీడెమవధరింపుమటంచు
అడరి కప్పురపుఁ బలుకందీయఁగా
కడకంటఁ జూడదిదె కాఁతాళమో మరపొ
పడఁతి యిప్పుడు నీ పాదంబులాన
చ. 3:
ఆలవట్టము విసరు అతివలను వలదనదు
పాలిండ్లపై కొంగు పచరించదు
యేలాగవునొ వేంకటేశ నీవిపుడిట్టె
పాలించకున్న నీ పాదంబులాన
రేకు: 0004-7 శంకరాభరణం సం: 05-024
పల్లవి:
అలరులు గురియఁగ నాడెనదే
అలకలఁ గులుకుల నలమేల్ మంగ
చ. 1:
అరవిరి సొబగుల నతివలు మెచ్చఁగ
అరతెర మరఁగున నాడెనదే
వరుస పూర్వదువాళపు తిరుపుల
హరిఁగరగింపుచు నలమేల్ మంగ
చ. 2:
మట్టపు మలపుల మట్టెల కెలపుల
తట్టెడి నడపుల దాఁటెనదే
పెట్టిన వజ్రపు పెండెపు తళుకులు
అట్టిట్టు చిమ్ముచు నలమేల్ మంగ
చ. 3:
చిందుల పాటల శిరి పొలయాటల
అందెల మోఁతల నాడెనదే
కందువ తిరువేంకటపతి మెచ్చఁగ
అందపు తిరుపుల నలమేల్ మంగ
రేకు: 0004-8 దేశి సం: 05-025
పల్లవి:
వలపారగించవమ్మ వనిత నీ-
యలుక చిత్తమున కాఁకలి సేసినది
చ. 1:
అడియాసలనె పక్వమైన సోయగపు-
వెడయలుకల మంచి వేఁడి వేఁడి రుచులు
ఎడసేసి తాలిమి నెడయించి పైపైనె
పొడమిన తమకంపు బోనము వెట్టినది
చ. 2:
ఆమంచి మధురంపు ఆధరామృతముల
వేమారుఁ దావులు చల్లు వెన్నెలబయటను
కొమలపుఁ దరితీపు కోరికఁ గుమ్మరించి
భామకు పూబానుపు పళ్ళెము వెట్టినది
చ. 3:
కన్నుల కాంక్షలనెడి కళవళములు దీరె
సన్నపు నవ్వులనెడి చనవగ్గలించెను
అన్నువపు మరపు నీ కంతవింతఁ గలిగె నేఁ-
డిన్నియును దిరువేంకటేశుని మన్ననలు