తాళ్ళపాక పదసాహిత్యం/ఐదవ సంపుటం/రేకు 401
రేకు: 0001-1 శ్రీరాగం సం: 05-001
పల్లవి:
ఏ వూరికేవూరు యెక్కడికి నెక్కడ
నీవు మాకు నిఁకనేల నిజమైనాఁ జెప్పరా
చ. 1:
ఆద్దమరాతిరిదాఁకా నందునిందు నుండివచ్చి
వద్దువోరా నీకునింత వలసినొల్లములు
నిద్దుర గంటికి లేక నీకునుండ వారమా
వొద్దిక చాలని వారముండినా నుండితిమి
చ. 2:
వేఁకమైన పరితాప వేదనఁ బొరలలేక
కాఁక పుట్టి తిరిగేవు కన్నుగానలేక
యేఁకట దీర నీకు నెందరు గలరని
వోఁకల పులుసు కలువులఁ బుచ్చవలెనా
చ. 3:
అందఁగాఁడ తిరువేంకటాద్రీశ పెక్కిండ్ల-
విందవై నీవొకతెపై వెచ్చఁదన మున్నాదా
మందెమేళము నీతో మాటలాడితిమి గాక
కందువ మన్నన చాలు కలకాల మెల్లను
రేకు: 0001-2 భైరవి సం: 05-002
పల్లవి:
గందము వూనేవేలే కమ్మని మేన యీ-
గందము నీమేనితావికంటె నెక్కుడా
చ. 1:
అద్దము చూచేవేలే అప్పటపట్టికిని
అద్దము నీ మోముకంటె నపురూపమా
ఒద్దిక తామరవిరినొత్తేవు కన్నులు నీ-
గద్దరికన్నులకంటె కమలము ఘనమా
చ. 2:
బంగారు వెట్టేవేలే పడఁతి నీ మెయినిండా
బంగారు నీతనుకాంతి ప్రతివచ్చీనా
ఉంగరాలేఁటికినే వొడికిపువేళ్ళ
వెంగలిమణులు నీ వేలిగోరఁబోలునా
చ. 3:
సవర మేఁటికినే జడియు నీ నెరులకు
సవరము నీకొప్పుసరి వచ్చీనా
యివలఁ జవుల నీకునేలే వెంకటపతి -
సవరని కెమ్మో విచవికంటేనా
రేకు: 0001-3 ఆహిరి సం: 05-003
పల్లవి:
దంటమాటలనె నన్నుఁదాఁకనాడేవు వోరి
జుంటితేనె తీపులెల్లఁ జూరలాడేవా
చ. 1:
అత్తయింటికోడల నన్నమ్మమీఁద నేరా నీ-
తొత్తుఁ దిట్టినట్టె తిట్ట దొరకొంటివి
మెత్తనైతే దిగఁబడి మేరమీరి యింతలోనే
ఒత్తుక వచ్చేవు చక్కనుండ నేరవా
చ. 2:
పంతపు మగఁడు గల పడఁతి నన్ను నేరా నీవు
కొంతైనా వెఱపులేక గోరనంటేవు
ఇంతలోనే వేలువెట్టి యిమ్ముగైకొని వలపు
దొంతులు వేరిచేవు బడుకనియ్యవా
చ. 3:
ఊరివారి యింతి నన్ను వుద్దండపుఁ దుటారాలఁ
బేరుకుచ్చి సోలయుచుఁ బిసాళించేవు
గారవించి తిరువేంకటరాయ నీవు నన్ను
యేరా నాగుట్టంతయు బాయిట వేసేవా
రేకు: 0001-4 ఆహిరి సం: 05-004
పల్లవి:
సంగతెఱగవు చీ జాణనందువు
మంగలాన జాజులు వేమారు వేఁచేవు
చ. 1:
అంగన వొకతె నీకు ఆకు మడి చియ్యఁగా
బంగారుతూఁగు మంచముపై నీవుండి
వుంగరాల వేళ్ళతో నువిదమొలనూళ్ళ
చెంగటఁ జాచిన ఆచేత నన్నంటేవు
చ. 2:
పడఁతి వొక్కతె నీకు పాదములొత్తఁగను
బడలి కప్పురశయ్యపై నీవుండి
కడుఁ దమకమున నెక్కడో మోవఁ జాఁచిన
పడిగపుఁ బాదాలు నాపైఁ బారఁజాఁచేవు
చ. 3:
ఇచ్చల నొక్కతె గుబ్బలెదురు చూపఁగను
పచ్చలు దాచిన మేడపై నీవుండి
వెచ్చని మేనితోఁ గూడి వేంకటేఁశుడ నీ
వెచ్చపుఁ గౌఁగిట నన్ను వేసాలఁ బెట్టేవు
రేకు: 0001-5 కాంబోది సం: 05-005
పల్లవి:
రాకుంటే మానుఁగాక రంతులేఁటికే
వేఁకపు గుబ్బలాండ్ల విటుడాఁతఁడు
చ. 1:
అంపిన కప్పురమొల్ల నంటేఁ దాననుఁ గాక
వంపు మోముతోడ నీకు వాడనేఁటికే
చెంపల లప్పలు నిండఁ జెరిగిన కప్పురపు -
గంపకొప్పుల సతుల ఘనుఁడాతడు
చ. 2:
ఒద్దికగాకక్కడనే వుంటే దానుండుఁ గాక
ముద్దుమోము వంచి నీకు మొక్కనేఁటికే
చద్దికి వేఁడికి మంచిచక్క సతుల మోవి
పొద్దునొద్దుకారగించే భోగి యాతఁడు
చ. 3:
అబ్బురపు వేంకటేశుఁడైతే దానవుఁ గాక
గబ్బి చూపులెల్లా నీకై గప్పనేఁటికే
జొబ్బిలేటి జవ్వాదిసోనల పన్నీట నన్ను
గుబ్బలంటి సరసానఁ గూడెనాతఁడు