తాళ్లపాక అన్నమాచార్యుల జీవితచరిత్రము/అన్నమాచార్య పురందరదాసుల చెల్మి
నా చెట్టు ముట్టితి నప్పయ్య దీన-
నేచిన దుర్గుణంబెల్లఁ బోఁజేసి
మించైన తియ్యమామిడి సేయుమనినఁ
బంచదారలవంటి ఫలములదయ్యె;-
నా సుద్ది విని యెుకఁ డట పెండ్లియాడఁ
గాసువీసము నాకుఁ గల్గ దీవింపు-
మన విని, వాఁ డెన్ని వేఁడినఁగాని
కాసువీసంబునే కాని యెుక్కరుఁడు
చేసేత నొకరూక చేతిలో నిడఁడు ;
అది విని యది యెుట్టిదని గాయకుండు
తదనుజ్ఞ మహిమగాఁ దఁలచి యేతెంచి
ఓతండ్రి నా పెండ్లి కొదవెడు ధనము
చేతికి రా దయసేయవే యనుడు-
నటువలె నౌఁగాక యనిన, నా విప్రుఁ-
డట వీథి కేఁగెడునపుడు రా జొకఁడు-
నాదరంబునఁ బిల్చి యడిగిన ధనము
ద్వాదశీ కన్యకా దాన మిచ్చుటయు-
నా వార్త విని జను లరుదందికొనుచు
వావిరి నొడి వళావళికిఁగా బెగడి
చెలువొందు నా గురు శ్రీపాదరక్ష
తమ నిడి తమయాపదలు వీడికొనిరి;
అన్నమాచార్య పురందరదాసుల చెల్మి
గద్య పద్యముల డెబ్బది రెండుమంది-
యాద్యులచేఁ గొనియాడించుకొన్న
రసికుండు శ్రీపండరంగవిఠ్ఠలుఁడు
కొసరెడు భక్తి చేకూరఁ జేసేత-
నెనయ సంధ్యలకు నీళ్ళియ్యఁ జేకొనుచుఁ
దనరు పురందరదాసాహ్వయుండు
పరమ భాగవతుఁడై పరఁగుచు నంద-
వరకులాగ్రణియైన వైష్ణవోత్తముఁడు
సవరించు మురవైరి సంకీర్తనములు
కువలయంబునఁ బేరుకొన్న మాత్రమున
తలఁచిన భూత బేతాళ పిశాచ-
ములు పాఱిపోవ నిమ్ముల శుభం బెసఁగ
విని కనియును లోన వెఱఁగందికొనుచు
చని, తాళ్ళపాకశాసనుఁ డన్నమయ్య
వెన్నునిఁగానె బావించి కీర్తించి
సన్నుతిసేయ నాచార్యవర్యుండు
నతని విఠ్ఠలునిఁగా ననయంబు దలఁచి
ప్రతిలేని గతుల సంభావించె నపుడు;-
నీ రీతి మహిమ లనేకముల్ వెలయ
వారక వరభాగవతులు గీర్తింప
అన్నమాచార్యుల రచనలు
యెగమార్గంబున నొకకొన్ని బుధులు
రాగిల్ల శృంగార రసరీతిఁ గొన్ని
వైరాగ్యరచనతో వాసింపఁ గొన్ని
సారసనేత్రుపై సంకీర్తనములు