తాళ్లపాక అన్నమాచార్యుల జీవితచరిత్రము/అన్నమాచార్యుల రచనలు
రసికుండు శ్రీపండరంగవిఠ్ఠలుఁడు
కొసరెడు భక్తి చేకూరఁ జేసేత-
నెనయ సంధ్యలకు నీళ్ళియ్యఁ జేకొనుచుఁ
దనరు పురందరదాసాహ్వయుండు
పరమ భాగవతుఁడై పరఁగుచు నంద-
వరకులాగ్రణియైన వైష్ణవోత్తముఁడు
సవరించు మురవైరి సంకీర్తనములు
కువలయంబునఁ బేరుకొన్న మాత్రమున
తలఁచిన భూత బేతాళ పిశాచ-
ములు పాఱిపోవ నిమ్ముల శుభం బెసఁగ
విని కనియును లోన వెఱఁగందికొనుచు
చని, తాళ్ళపాకశాసనుఁ డన్నమయ్య
వెన్నునిఁగానె బావించి కీర్తించి
సన్నుతిసేయ నాచార్యవర్యుండు
నతని విఠ్ఠలునిఁగా ననయంబు దలఁచి
ప్రతిలేని గతుల సంభావించె నపుడు;-
నీ రీతి మహిమ లనేకముల్ వెలయ
వారక వరభాగవతులు గీర్తింప
అన్నమాచార్యుల రచనలు
యెగమార్గంబున నొకకొన్ని బుధులు
రాగిల్ల శృంగార రసరీతిఁ గొన్ని
వైరాగ్యరచనతో వాసింపఁ గొన్ని
సారసనేత్రుపై సంకీర్తనములు
సరసత్వమునఁ దాళసముఖముల్ గాఁగ
పరమతంత్రములు ముప్పదిరెండువేలు,
ప్రవిమల ద్విపద ప్రబందరూపమున
నవముగా రామాయణము, దివ్యభాష
నా వేంకటాద్రిమాహత్మ్య మంతయును
గావించి, రుచుల శృంగారమంజరియు
శతకముల్ పదిరెండు సకలభాషలను
ప్రతిలేని నానాప్రబంధముల్ చేసి,
అన్నమాచార్య సంతతి
సిరివరు మెప్పించి చెలఁగి యా దేవు-
వరమునఁ దనయంతవారిఁ బుత్రకుల
నరసయాచార్యు నున్నతయశోధనునిఁ
దిరుమలాచార్యుని ధీవిశారధుని
గాంచి, వారున దనకరణి విద్యలను
గాంచనాంబరు భక్తికలిమిఁ బెంపొంద
శౌరికథాసుధాసల్లాప గరిమ
ధారుణి నెంతయుఁ దనరారుచుండె;
మనసునఁ గపటంబు మాని సద్భక్తి
ననఘమౌ నీ యన్నమాచార్యచరిత
వినిన వ్రాసినఁ బేరుకొనినఁ జదివిన
జనులకు నిష్ణార్థసౌఖ్యంబు లొదవు-