Jump to content

తాతా చరిత్రము/వ్యాపారారంభము

వికీసోర్స్ నుండి

3. వ్యాపారారంభము.

ఆకాలమున మనదేశమున ప్రభుత్వమువారి ప్రోత్సాహముతో చాలనల్లమందుజేసి, చీనా కంపి, వర్తకులు అందు హెచ్చుధర కమ్ముచుండిరి. ఈలాభకర వ్యాపారమును కొందరు సాహసులగు పార్సీలు, చీనాసమీపపు 'హాంకాంగు' ద్వీపముద్వారా, జరుపుచుండిరి. 'హాంకాంగు' ఆంగ్లేయుల వశమగుటకు పూర్వమే, మనసూరతు ప్రాంతమునుండి పోయి కొందరు పార్సీ లందు వసించుచు, వర్తకమును జరుపుచుండిరి. అప్పటికి మహానౌకలు, తంతిసౌకర్యము, లేవు. ఇటనుండి చీనా చేరుట కారు నెలలు పట్టుచుండెను; అపాయము లధికము. అందుచే, చీనా వ్యాపారమున పార్సీలకు పోటీ లేకుండెను. అప్పటి చీనులు నల్లమందు భాయీలగుటచే, ఆపార్సీల కీవర్తకమున చాలలాభము కల్గెను. తండ్రితరపున జంషెడ్జియు హాంకాంగుచేరి, చీనాతో నాలుగేండ్లా వ్యాపారము జేసి, ధనము అనుభవము సంపాదించి, అ వ్యాపారముపై విరక్తిగల్గి, 1863 లో మరల బొంబాయి చేరెను. వెంటనే జంషెడ్జి కాంగ్లదేశ ప్రయాణము తగిలెను.

మిల్లుయంత్రములందు సన్నబట్టల వడికినేయుటలో గత శతాబ్దిని బ్రిటిషువా రగ్రేసరులైరి. కాని వారిదేశము శీతలము; భూమి చాలవరకు కొండనేల; అందు ప్రత్తిపండదు; అందుచే నాంగ్లేయులు తమ మిల్లులకు దూది నిప్పటికిని విదేశములనుండి తెచ్చుకొనుచున్నారు. ప్రపంచమున సమృద్ధియగు ప్రత్తిపంటకు తగుభూసారము వేడిమి గలదేశములు మూడే:- అమెరికాలోని సంయుక్తరాజ్యము, ఆఫ్రికాలోని యీజిప్టు, మనభారతదేశము. వీనిలో అమెరికా ప్రత్తి సన్ననూలుకు ప్రశస్తము; దాని నింగ్లండుకు తెచ్చుటయు సుకరము. ఈజిప్టులో నైలునదీప్రాంతమున ప్రత్తి వ్యవసాయము నిటీవలనే యారంభించిరి. అంతకుపూర్వ మచ్చట మంచి ప్రత్తిపంటలేదు.

ఇట్లుండగా, అమెరికాలో సంయుక్త రాజ్యపు ఉత్తరదక్షిణభాగములమధ్య కలహము గల్గెను. దక్షిణభాగమే చాల సారవంతము; అందు ప్రత్తి బాగుగపండును. అచ్చటి తెల్లవారు కొలదిమంది యైనను, నీగ్రోబానిసల కూలిమూలమున వారు చాల పంటలబండించి భాగ్యవంతులైరి. వారు నీగ్రోలను మన మాలలకన్నను హీనులుగ జూచుచుండిరి. ఉత్తరప్రాంతపు వారా రాజ్యమంతటను నీగ్రోల యమానుష దాస్యము నెట్లైన పరిహరింప జూచిరి. ఇది దక్షిణప్రాంతపుధనాఢ్యులగు దొరలకు నష్టకరమైనందున, వా రంగీకరింపక, ఉత్తరప్రాంతీయులపై తిరుగబడి, తాము ప్రత్యేకరాజ్యముగ విడిపోవయత్నించిరి. 1861 లో, అమెరికాలో నిట్లంతర్యుద్ధ మారంభెంచెను. *


  • [1]ఉత్తర జిల్లాల వారు నౌకాబలముకలవారై, దక్షిణజిల్లాల రేవులన్నిటిని ముట్టడించి, అచ్చటి కోస్తా వ్యాపారము నరికట్టిరి. సంయుక్త రాజ్యముకు ఆంగ్లదేశముకు మధ్య (అట్లాంటికు అనబడు) విశాలమహోదధికలదు. ఇట్లు దక్షిణజిల్లాల తీరమునుండి యాంగ్లదేశముకు వచ్చు దూదియెగుమతి నిల్చిపోయి, బ్రిటనులో దూది కరువుగల్గెను; లంకషైరుమిల్లు లొక్కసారిగ నొల్చిపోయెను.*[2] అందుపై నాధారపడు నితరపరిశ్రమలును స్థంభించెను. లక్షలకొలది జనులకు వృత్తులుపోయి, దేశమున నలజడి గల్గెను.

అప్పుడాప్రత్తికరువు తీరుటకై, బ్రిటిషువారు మనదేశపు దూదిని ఖరీదుచేసి కొనిపోసాగిరి. ఈయెగుమతివలన మనదేశమున ప్రత్తిధర చాలహెచ్చి, ప్రత్తి యెగుమతికిస్థానమగు బొంబాయిలోని యావ్యాపారస్థులకు చాలలాభము రాదొడగెను. ఆవిధముగ తక్కిన బొంబాయివ్యాపారస్థులతోబాటు తాతా కంపెనీకిని చాల ద్రవ్యము చేకూరెను. ఆవ్యాపారపువృద్ధికై, జంషెడ్జి తాతా 1864 లో లండనుకు వెళ్ళెను.

హఠాత్తుగ గల్గిన యీలాభద్రవ్యముతో కొందరు బొంబాయి వర్తకులు ప్రావిడెంటుకంపెనీలరీతి కొత్తకంపెనీలను, విచిత్ర వ్యాపారములను, ఆరంభించిరి. ఈధనప్రవాహము చాలయేండ్లు వచ్చుననియే తలచి, వారనాలోచితముగ వర్తించిరి. అమెరికాలోని యాయుద్ధము, అందుచే బొంబాయికి లభించిన దూదివ్యాపారపు ధనప్రవాహమును, కేవలము తాత్కాలికమే యనుసంగతిని వారుమరచిరి. వారిట్లుకష్టార్జిత ద్రవ్యమునువిచ్చలవిడిగ ధారబోయుచుండగనే, హఠాత్తుగ, 1865 లో అమెరికా సంయుక్త రాజ్యపు యుద్ధము నిల్చిపోయెను. అచ్చటి యుత్తర జిల్లాల సేనలు దక్షిణప్రాంతముపై విజృంభించి, జయించెను; నీగ్రో దాస్యముపోవుషరతున రెండుప్రాంతములకు సంధియేర్పడెను. అంతట, అమెరికానుండి, మరల నింగ్లండుకు దూదియెగుమతి యధాప్రకారము కొనసాగదొడగెను. తమ యవసరమిట్లు తీరినందున, ఆంగ్లేయులు మనదేశపు దూదినికొనుట మానుకొనిరి. ఇట్లు సీమయెగుమతి నిల్చిపోగనే, బొంబాయిలోను బ్రిటిషు రేవులందును నిలువయున్న మనదేశపు దూదిబేలులకు గిరాకి పోయి, ఒక్కసారిగ ధరతగ్గిపోయెను; అమ్మువా రేగాని కొనువారు లేరైరి. హఠాత్తుగ స్థితిగతులు తలక్రిందులై నందున, ఈ వ్యాపారముచేయు బొంబాయివర్తకులకు కోట్లకొలది రూపాయల నష్టము కల్గెను. ఆప్రావిడెంటు కంపెనీలు, చాలమంది పెద్దవర్తకులును, కొన్ని బాంకులునుగూడ, దివాలాతీసెను.

ఈ కల్లోలసమయమునకు జంషెడ్జి వేలకొలది దూది బేళ్ళను లండనులో జేర్చి, అందొకప్రత్యేకపు బాంకును స్థాపించుచుండెను; తాతాకంపెనీకిని అప్పుడపారనష్టము కలిగెను. తమ వ్యాపారమంతకును మూలచ్ఛేదము కలుగున ట్లుండెను; వ్యవహార మపసవ్యమగుటకనిపెట్టి, తాతా నిదానించెను; లండనులో తలపెట్టిన బాంకుయత్నమును మాని, తన అసలుకంపెనీ యా దివాలా యుప్పెనలో బడకుండ జాగ్రత్తతో నతడు కాపాడెను. బ్రిటిషువర్తకులకు నచ్చజెప్పి, వారికి దామీయవలసినసొమ్ముల వాయిదాలపైన నిచ్చుట కేర్పర్చి, తమపరపతికి భంగము లేకుండ జేసికొనెను. తాతా ఋజుత్వము న్యాయవర్తనము జూచి, సంతసించి, బ్రిటిషువర్తకు లాయేర్పాటుల నంగీకరించిరి. బ్రిటనులో నిలువయున్న తమకంపెనీవారి దూదిబేలులనెట్లో సొమ్ముచేసికొని, జంషెడ్జి బొంబాయిచేరి, తమమూలసంఘము నెట్టెటులో రక్షించెను; ఆయన న్యాయశీలతను బట్టి బాకీదార్లు సమాధానమొందిరి. బొంబాయిలో నిలవయున్న సరుకులగూడ నెట్టెటులో యమ్మి, అందుచేవచ్చిన స్వల్పద్రవ్యముతో తాతాకంపెనీ నిదానముగ మరలవ్యాపారమారంభించెను.

అప్పుడు తాతాకు కాకతాళీయముగ నొకపెద్దబేరము లభించెను. ఆఫ్రికాలో తూర్పుభాగమున 'అబిసీనియా' దేశము కలదు. అందుకొంతభాగమడవులు, కొండలు, మిగిలినదియెడారి. 1867 లో, అచటిరాజు కొందరాంగ్లేయులపై కోపించి, వారిని ఖైదులో నుంచెను. వారలవిడిపించుటకు రాయబారములు జరిగియు వ్యర్ధమయ్యెను. అంతట బ్రిటిషుప్రభుత్వమువా రబిసీనియాపై యుద్ధమారంభించిరి. మనదేశము అబిసీనియాకు దగ్గర; రెంటిమధ్య, అరేబియా సముద్రమేయడ్డము; బ్రిటిషునాయకత్వమున మనదేశీయుల సేనతో అబిసీనియాను జయించుట సుల భము †[3] అందుచే 'నేపియరు' దొరగారి సేనానిత్వమున నొక భారతీయసేన మనదేశమునుండి యాదండయాత్రకు పంపబడెను. ఆసేనకు వలయు వస్త్రాహారది సామగ్రినంతను సకాలమున సమకూర్చుటకు, మనప్రభుత్వమువారు కొందరు బొంబాయివర్తకులతో ఖరారునేర్పర్చుకొనిరి. అదిగుత్తబేరము: ప్రభుత్వమువా రేకముగ కొంతసొమ్మునిత్తురు; ఆయుద్ధకాలమున నాఫ్రికాలో నాసేనకవసరమగు సామగ్రినంతను ఆవర్తకులు పంపవలెను. సామగ్రుల హెచ్చుతగ్గులబట్టి కలుగు లాభనష్టములావర్తకులవే. ఇందు తాతావారును ముఖ్యభాగస్థులు. కొంతసామగ్రితో మనసేన యబిసీనియాకు దాడివెడలెను. తీవ్ర యుద్ధము జరుగునని, మహాగహనమగు ఆదేశపుకొండలను లోయలనదులను దాటి రాజధానిజేరుటకు చాలయేండ్లు పట్టునని, అందుకు హెచ్చుసామానులనింకను చాలసారులు పంపవలసియుండునని, అందరును తలచిరి; ఆభావమున నావర్తకులకు గుత్తసొమ్ము కొంతహెచ్చుగా నిర్ణయమయ్యెను. కాని ఫిరంగులుమున్నగు అయోమయములగు నాగ్నేయాస్త్రములతో నాంగ్లభారతవాహిని దండెత్తివచ్చి పైబడుచున్నదని వార్తవినినంతట, అబిసీనియారాజు తానోడుదుననిభీతుడై, పరాజితుడై కష్టములబడుటకన్న చావుమేలని, ఆత్మహత్యచేసికొనెను. రాజు పోగనే, అబిసీనియాసైనికులు చెదరి పోయిరి.*[4] అందువలన, ఎదురుసేనతో యుద్ధము లేకుండ మన సేననిర్నిరోధముగ బోయి, అప్పటి ముఖ్యనగరమగు 'మగ్డలా'ను పట్టుకొని, బ్రిటిషుఖైదీల విడిపించెను. ఇట్లు 1868 వేసవికిముందే, ఆజైత్రయాత్ర విచిత్రముగ నంతమయ్యెను.

మొదటపంపిన కొంచెముసామగ్రియే యాయాత్రకంతకు చాలెను. ఈగుత్తబేరమున పెద్దవాటాదారగు తాతాగారికందుచే మంచిలాభముకల్గెను. ఆద్రవ్యమును దేశమునకు తనకుగూడ లాభకరమైన వ్యాపారముకై వినియోగింపదలచి, తాతాగారంతట బట్టలమిల్లుల వ్యాపారముపై దృష్టినిమరల్చిరి.


__________
  1. * ఇది American Civil War అను పేర చరిత్రలో ప్రసిద్ధము (1861 - 1865.)
  2. * ఆంగ్లదేశమే 'ఇంగ్లండు' అనబడును. ఇది దీని కుత్తరమందున్న స్కాట్లండుతో కలసి యేకద్వీపమై 'బ్రిటను' అనబడును. ఆ దేశీయులను 'బ్రిటిషు' వారని యందుము. లంకషైరు ఇంగ్లండులో నొకజిల్లా.
  3. † ఆంగ్లదేశమునుండి అబిసీనియాకు సేనలబంపుచో బ్రిటిషువారికి చాల హెచ్చువ్యయ ప్రయాసములు గల్గును.
  4. * జాతీయమగు ప్రజాప్రతినిధుల రాజ్యాంగపద్ధతిలేకుండ పాలన కేవల మొకవ్యక్తిగతమగుచోట్ల నట్లేయగుటసహజము.