తరికొండ నృసింహశతకము/తరిగొండ నృసింహశతకము

వికీసోర్స్ నుండి

తరిగొండ నృసింహశతకము

[1]శ్లో.

శ్రీకాంతాత్మసరోజ చండకిరణం, శీతాంశు బింబాననం,
శ్రీకంఠాబ్జజ సన్నుతాంఘ్రికమలం, చిన్మాత్ర, మప్రాకృతమ్।
లోకాతీత, మనేక గోపయువతీలోలం, పరం, సర్వగం,
స్వాకారం తరిగొండ శేషకుధరాధ్యక్షం భజే౽హం సదా॥

భావం:

శ్రీమహాలక్ష్మియొక్క మనస్సనే పద్మాన్ని వికసింపజేసే సూర్యుడూ, చంద్రబింబంవంటి ఆహ్లాదకరమైన ముఖం కలవాడూ, పరమశివునిచే, బ్రహ్మదేవునిచే స్తుతింపబడిన చరణకమలాలు కలవాడూ, జ్ఞానస్వరూపుడూ, లోకాలన్నిటికి అతీతుడూ, అనేకగోపయువతులయెడ అనురాగం కలవాడూ, అంతటా వ్యాపించియుండే సత్యస్వరూపుడూ, దేవాదిదేవుడూ, పరంధాముడూ అయిన తరిగొండ (లక్ష్మీనృసింహుడు) అనే శేషాచలాధిపతి యయిన వేంకటేశ్వరుణ్ణి నిత్యం భక్తితో ఆరాధిస్తున్నాను.

ఉ.

శ్రీరఘురామ! మీ కృపను చెల్వము మీఱఁగ శ్రీ గణేశునిన్,
వారిజగర్భునిన్, భవుని, వాణిని, దుర్గను, క్షేత్రపాలకున్,
సారెకు సర్వదేవతల, సత్కవిశూరులనెల్ల, భక్తి నిన్
కోరి భజింతునయ్య! తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

1

భావం:

దయాసముద్రుడవైన, తరిగొండలో నెలకొనియున్న శ్రీలక్ష్మీనృసింహదేవా! శ్రీ రఘురామా! మీ కృపచేత గణపతినీ, శివుణ్ణి, బ్రహ్మ, సరస్వతి, దుర్గాదేవి - మొదలైన సమస్త దేవతలనూ, ఉత్తమకవీశ్వరులనూ, దేవదేవుడవైన నిన్నూ పదేపదే భక్తితో సేవిస్తున్నాను.

చ.

మఱియును రెండు విండ్లకును మధ్యమునన్ ఘనసాక్షిరూపమై
పరఁగుచు, యోగనిద్ర సురపన్నగతల్పమునందు ధీరుఁడై
సరసతఁ బవ్వళించి, యట సంతతలీలను విశ్వమేలు స
ద్గురుని భజింతునయ్య! తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

2

భావం:

దయాసాగరుడవైన తరిగొండ లక్ష్మీనృసింహస్వామీ! కనుబొమల నడుమ నున్న ఆజ్ఞాచక్రంలో జగత్సాక్షివై నీవు ప్రకాశిస్తున్నావు. శేషతల్పంమీద సొంపుగా పవ్వళించి యోగనిద్రలో నిమగ్నుడవైయుండి, నిరంతరం ఈ విశ్వాన్ని లీలగా పరిపాలిస్తూవున్న జగద్గురూ! నిత్యమూ నిన్ను భక్తితో సేవిస్తున్నాను.

చ.

అతులితమైన మీ పదవి నందఁదలంచి, విశాలభక్తిచే
వితరణగాను మీ రిపుడు వేడ్కను వాక్కుల నిచ్చినంతలో
శతకముగాను జెప్పెదను సద్గురు స్వామి కటాక్ష మేర్పడన్,
కుతుకము విఱఁగాను తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

3

భావం:

దయాసముద్రుడవయి తరిగొండలో వెలసియున్న శ్రీలక్ష్మీనృసింహదేవా! సాటిలేని మీ పదవిని (మోక్షాన్ని) అందుకోవలెననే తలంపు గలిగి, భక్తవత్సలుడవైన నీవు ప్రసాదించిన వాక్కులతోనే, సద్గురువర్యుని అనుగ్రహంవల్ల, ఆసక్తితో మీపై శతకాన్ని చెపుతున్నాను. చిత్తగించు!

చ.

కరుణయు లేక కొందఱు వికల్పకవిత్వ మటంచుఁ బల్కినన్,
సరగున నీవు వారలకు సమ్మతిఁ జెప్పి, పరాకు సేయకే!
పరువడితోను నీ శతకపద్యము లింక ధరిత్రిమీఁదటన్
గుఱుతుగ నిల్పవయ్య! తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

4

భావం:

దయాసముద్రుడవయి తరిగొండలో అవతరించిన శ్రీ లక్ష్మీనృసింహదేవా! కొంతమంది (పెద్దలు) దయలేనివారై, నా యీ రచనను 'వికల్పకవిత్వం' (కవిత్వంకాని కవిత్వం)- అని విమర్శిస్తున్నారు. అలాంటివారికి నీవే సద్బుద్ధిని ప్రసాదించి, సదభిప్రాయాన్ని కలిగించు! అంతేగాక, ఇకపై ఈ శతకపద్యాలు ఈ లోకంలో స్థిరంగా నెలకొనేట్లుగా పరాకు లేక, అనుగ్రహించు తండ్రీ!

చ.

హరి నరసింహదేవ! నను నందఱలోనఁ బరాకు సేసినన్
దరి యెవరయ్య? సామి! ఘనతాపసరంజన! నీవె గాక, ఓ
పరమదయార్ద్ర! నాహృదయపద్మమునన్ వసియించి, ప్రేమతో
గుఱిగొని వాక్కు నిమ్ము! తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

5

భావం:

దయాసముద్రుడవయిన తరిగొండ శ్రీలక్ష్మీనరసింహదేవా! శ్రీహరీ! ఈ లోకంలో నాకు దిక్కైనవారు, నన్ను దరి జేర్చేవారు నీవు తప్ప మఱి లేరు. గొప్ప గొప్ప తపోధనులను రంజింపజేసే పరమకృపాపరతంత్రుడవైన ఓ స్వామీ! నన్ను ఉపేక్షసేయక, నా హృదయపద్మంపై ప్రీతితో అధివసించి, మిమ్ము కొనియాడే చక్కని వాక్కులను ప్రసాదించు!

ఉ.

అచ్చపు భక్తితోడ దనుజాంతక! నే నిటు సర్వకాలమున్
హెచ్చుగ మీ పదాబ్జముల నింపుగ నమ్మినదాన, మాధవా!
మచ్చికతోడ నన్నెపుడు మన్ననసేయు మహానుభావ! యే
కుచ్చిత ముంచఁబోకు! తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

6

భావం:

దయాసముద్రుడవయి తరిగొండలో ఆవిర్భవించియున్న శ్రీలక్ష్మీనృసింహదేవా! రాక్షసాంతకుడవైన మాధవా! ఎంతో కాలంగా నేను అచ్చమైన భక్తిభావంతో మీ పాదపద్మాలనే పరిపూర్ణంగా నమ్ముకొని యున్నాను. కావున, ప్రేమతో నన్ను ఆదరింపుమా! మరో విధంగా భావించి నన్ను విడనాడవలదు మహానుభావా!

ఉ.

కంజదళాక్ష! యా బుధులఁ గావఁదలంచియు సోమకాసురున్
భంజనచేసి, యంతటను భాసురలీలను వేదముల్ తగన్
రంజనచేసి, యా క్షణమె బ్రహ్మకు నిచ్చిన ధీర! మ్రొక్కెదన్
కుంజరరాజపాల! తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

7

భావం:

దయాసముద్రుడవయిన తరిగొండ శ్రీలక్ష్మీనృసింహదేవా! కమలాక్షా! పూర్వం నీవు సోమకుణ్ణి సంహరించి, ఆ రక్కసుడు అపహరించియుండిన వేదరాశిని వెంటనే చెక్కుచెదరకుండా సృష్టికర్తకు ప్రసాదించినావు. ఆ విధంగా లోకమందలి బుధజనులను అందరినీ ఉద్ధరించిన ధీరుడా! గజరాజరక్షకా! మీకు నమస్కారం!

చ.

పరఁగఁగ దేవదానవులు వార్ధి మథింపఁగఁబూనినంత, మం
దరగిరి గ్రుంగఁగాఁ, దెలిసి దానికిఁ గచ్ఛపరూపమెత్తియున్
సరసత మూఁపునన్ నిలిపి, సర్వజగంబులు మోచినాఁడవౌ!
గుఱుతుగ నన్నుఁ బ్రోవు! తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

8

భావం:

దయాసాగరుడవయిన తరిగొండ శ్రీలక్ష్మీనరసింహస్వామీ! దేవదానవులు పాలసంద్రాన్ని మందరగిరితో మథిస్తూవున్నప్పుడు అది క్రిందకు క్రుంగిపోగా, నీవు కూర్మావతారాన్ని ధరించి, ఆపర్వతాన్ని పై కెత్తి, అటుపై సకలలోకాలను సవ్యంగా భరించినావు. అటువంటి కూర్మావతారుడవైన నీవు నన్ను తగినవిధంగా సంరక్షించుమా!

ఉ.

వాడక హేమలోచనుఁడు వార్ధిని వైతునటంచు భూమినిన్
పోఁడిమిమీఱ నెత్తుకొని పోవుచునుండినయంతలోన, మా
ఱాడక వానిఁ ద్రుంచియు, ధరాస్థలి రక్షణసేయఁజాలు సత్
క్రోడసమగ్రరూప! తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

9

భావం:

దయాసముద్రుడవైన శ్రీతరిగొండ లక్ష్మీనృసింహదేవా! హిరణ్యాక్షుడు భూమండలాన్ని పైకెత్తుకొని సాగరంలో వేయటానికి వెళ్లుతూవుండగా, వరాహరూపుడవై మాఱు మాట్లాడకుండా వాణ్ణి సంహరించి భూదేవిని యథాస్థితిలో పాదుకొల్పి, సంరక్షించావు. అట్టి ఉదాత్తమైన ఆదివరాహావతారా! మీకు అభివందనం!

చ.

ఫెళఫెళ నుక్కుకంబమున బిట్టుఁగ బుట్టి, హిరణ్యకశ్యపున్
చెలువుగ గర్భగోళమును జించి, సమంచితరక్తధారలన్
గళగళఁ ద్రావి, డింభకునిఁ గాచిన దేవుఁడవంచుఁ జాలఁగాఁ
గొలిచితినయ్య! నిన్నుఁ దరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

10

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనృసింహదేవా! ఉక్కుకంబాన్ని ఫెళ ఫెళ ధ్వనులతో చీల్చుకొని ఆశ్చర్యకరంగా అవతరించిన నరసింహస్వరూపా! హిరణ్యకశ్యపుని చంపి వాని గర్భగోళంలోని రక్తాన్ని గళగళధ్వనితో పానం చేసి, పరమభక్తాగ్రేసరుడైన ప్రహ్లాదకుమారుణ్ణి పరిరక్షించిన దేవదేవుడవని మిక్కిలిగా భజిస్తున్నాను. మహానుభావా! మీకు ప్రణామం!

ఉ.

ఏమనవచ్చు! మూఁడడుగు లిద్ధర నిమ్మని కౌతుకంబునన్
తామసమింతలే కడుగఁ, దప్పక దానవుఁ డిచ్చినంతలో
వేమఱు దానవాధిపుని విశ్వములోనికిఁ ద్రొక్కినాఁడవౌ!
కోమలనీలవర్ణ! తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

11

భావం:

దయాసముద్రుడవయిన శ్రీ తరిగొండ లక్ష్మీనృసింహదేవా! దానవరాజైన బలిచక్రవర్తిని ఏ మాత్రం తొణకని కుతూహలంతో మూడడుగులు దాన మడిగి, అతణ్ణి నెమ్మదిగా పాతాళానికి అణగద్రొక్కినావు. కోమలనీలవర్ణా! నీ అద్భుతచర్యను ఏమని కొనియాడగలము! అటువంటి అపూర్వమైన త్రివిక్రమ వామనావతారా! మీకు నా అభివందనం!

చ.

పరశువు చేతఁబూని, నరపాలవరేణ్యుల మస్తకంబులన్
ఇరువదియొక్క మాఱు సురలెల్ల నుతింపఁగఁ ద్రుంచి, రక్తమం
దరయఁగఁ దల్లిదండ్రులకుఁ దర్పణ మొప్పఁగఁ జేసినాఁడవౌ!
గుఱుతుగ మేరుధీర! తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

12

భావం:

దయాసముద్రుడవయిన తరిగొండ లక్ష్మీనృసింహదేవా! నీవు గండ్రగొడ్డలిని చేతబూని నిరంకుశులయిన రాజన్యుల శిరస్సులను దేవతలు నుతిస్తూవుండగా ఇరువదియొక్క పర్యాయాలు ఛేదించి, వారల రక్తంతో తల్లిదండ్రులకు తర్పణాలు విడిచిన సాహసివి! అలాంటి అద్వితీయపితృభక్తిపరాయణుడవూ, మేరునగధీరుడవూ అయిన పరశురామావతారా! నీకు నమస్కారం!

చ.

దశరథరాజుకుం బొడమి, తాటకఁ జంపి, మునీంద్ర యాగమున్
విసువక కాచి, యంతటను వేడుకతో మిథిలాపురంబునన్
పశుపతివిల్లు ద్రుంచియును, పంతము మించఁగ గెల్చి యేలితౌ!
కుసుమశరారిమిత్ర! తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

13

భావం:

దయాసాగరుడవయిన శ్రీ తరిగొండ లక్ష్మీనృసింహస్వామీ! నీవు దశరథమహారాజుకు పుత్రుడవుగా అవతరించి, బాల్యంలోనే 'తాటక' అనే రక్కసిని సంహరించావు; విశ్వామిత్ర మునీంద్రుని యజ్ఞాన్ని కాపాడినావు. మిథిలాపురి కేగి, శివధనుస్సును త్రుంచివేసి, సీతాదేవిని పరిణయమైనావు. తదుపరి, పంతంతో రావణున్ని జయించి, ఈభూమండలాన్ని ప్రజారంజకంగా పరిపాలించావు. పరమేశ్వరునకు మిత్రుడవుగా ప్రశస్తిగాంచిన శ్రీరఘురామావతారా! మీకు నా నమోవాకం!

చ.

మొనసియు దేవకీసతికి ముద్దుల బాలుఁడవై జనించియున్,
ఒనర యశోద చెంగటన నున్నతి యొప్పఁగ వృద్ధి పొందుచున్,
ఘనమగు సాహసంబునను కంసు వధించిన శూర! మ్రొక్కెదన్
గొనకొని నన్నుఁ బ్రోవు! తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

14

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనరసింహదేవా! వసుదేవుని పత్నియైన దేవకీదేవికి ముద్దుల కొమరుడవై అవతరించావు; నందునిసతియైన యశోదాదేవి వద్ద చక్కగా, హాయిగా పెరిగినావు. అపూర్వమైన సాహసంతో క్రూరుడైన కంసుణ్ణి వధించావు. అలాంటి శూరవరేణ్యుడవైన నీకు నా వందనం! పురుషోత్తమా! నీ భక్తురాలినైన నన్ను పూనుకొని రక్షింపుమా!

ఉ.

నిండిన భక్తితోడుతను నిన్ను నుతించెద సర్వకాలమున్,
అండజవాహ! నిన్నుఁ గొనియాడిన భాగ్యఫలం బదెట్టిదో!
పండెను నాదు కోరికలు పండితపాలన! బుద్ధరూప! ఓ
కుండలిశాయివెన తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

15

భావం:

దయాసముద్రుడవయిన శ్రీ తరిగొండ లక్ష్మీనృసింహస్వామీ! ఓ గరుడవాహనా! నిన్ను కొనియాడినందువల్ల కలిగిన పుణ్యాలఫలితం ఎంతటిదో! కాని, అందువల్ల నా కోరికలు పూర్తిగా పండినాయి. కావున కలకాలం మిమ్ములను పరిపూర్ణమైన భక్తితో కొనియాడుతూ వుంటాను దేవా! జ్ఞానులయిన సజ్జనులను సంరక్షించే శేషశాయీ! బుద్ధావతారా! మీకు నా అభివాదం!

చ.

రవికులవార్ధిచంద్ర! గురురాయని వాక్యము మీఱ కెప్పుడున్
కవిజనపాల! నీ మహిమఁ గాంచెద నింకను కల్కిరూప! యా
శివుని విధంబుఁ జూచెదను, జీవుని నాత్మను జేరఁ జేసెదన్;
కువలయపత్రనేత్ర! తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

16

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనృసింహదేవా! కలువరేకులను పోలిన అందమైన కన్నులు గలవాడా! సూర్యవంశమనే సముద్రానికి పూర్ణచంద్రుడా! నా గురువర్యుని ఉపదేశానుసారంగా నేడు నేను నీ మహిమను చూడగలుగుతున్నాను. అందువలన నాజీవాత్మను పరమాత్మతో అనుసంధింపజేయగలుగుతున్నాను అటుపై, మంగళకరుడైన శివునితో అభిన్నంగా భావన చేయగలుగుతున్నాను. కవిజనులను కాపాడే కల్కి అవతారా! మీకు నా నమస్కారం!

చ.

వినుము మహానుభావ! మది వేడుకతోడుత విన్నవించెదన్
మొనసెడు స్వాతివానలకు ముత్యపుఁజిప్ప లవెట్టులుండు న
ట్లనిశము భక్తియుక్తి నిను నాత్మవిభుండవు నీవటంచు, నీ
కును నెదురేను జూతుఁ; దరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

17

భావం:

దయాసముద్రుడవయి తరిగొండలో ఆవిర్భవించియున్న శ్రీలక్ష్మీనరసింహదేవా! మహానుభావా! మిక్కిలి వేడుకతో విన్నవిస్తూవున్న ఈ నా మనవిని చిత్తగించు! ముత్తెపుచిప్పలు స్వాతికార్తెలో కురిసే వానలకు ఎదురు చూచిన రీతిగా, నా ఆత్మప్రభుడవైన నీ రాకకై ఎల్లప్పుడు భక్తితో నేను ఎదురుచూస్తూవున్నాను. (కావున, కృపతో నీ దివ్యదర్శనాన్ని అనుగ్రహించు!)

ఉ.

నారదసన్నుతాంఘ్రియుగ! నా విధమెల్లను విన్నవించెదన్
సారెకు నల్లకల్వ లల చంద్రునిఁ జూడఁదలంచుభంగి నిన్
ధీరతమీఱ నిన్నెపుడు దేహములోఁ బొడగాంచు భాగ్యముల్
కోరుచునుందునయ్య! తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

18

భావం:

దయాసముద్రుడవయిన శ్రీ తరిగొండ లక్ష్మీనృసింహదేవా! పరమభాగవతోత్తముడైన నారదమునీంద్రునిచే కొనియాడబడిన చరణద్వయం గల మహనీయా! నా జీవన విధానమంతా మీకు విన్నవిస్తూవున్నాను, చిత్తగించండి! నల్లకలువలు చంద్రుణ్ణి ఆసక్తితో చూడగోరినట్లుగా, ఈ దేహంలో నిన్ను నిమ్మళంగా దర్శించే భాగ్యం ఎప్పుడు లభిస్తుందా? - అని ఆతురతతో ఎదురుచూస్తూవున్నానయ్యా! స్వామి! అనుగ్రహించు!

చ.

మరగితి నీ పదాబ్జముల మానసమం దెడఁబాయఁ జాలకన్,
గరిమను [2]భానుఁ డొచ్చుటకుఁ గంజములెల్ల నపేక్షసేయు నా
కరణిని నీవు వచ్చుటకు గట్టిగ నా హృదయాంబుజంబు మేల్
గుఱుతుగఁ గోరునయ్య! తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

19

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనృసింహదేవా! మనస్సు నీ పాదపద్మాలను ఎడబాయజాలని విధంగా మచ్చిక అయ్యింది. అందువల్ల నాహృదయసరోజం కమలసమూహం సూర్యుని రాకను కోరినట్లుగా దృఢంగా మీ రాకను కోరుతూవున్నది. (దయచేసి నా మనఃపద్మపీఠంమీదకు వేంచేయుమా! స్వామీ!)

చ.

'హరి! హరి! రమ్ము ర'మ్మనుచు నార్భటమందుచు నేను పిల్చినన్
పరువున రావదేమి? నినుఁ బట్టుగ భక్తులు గట్టివేసిరో?
మఱచితొ నన్ను నొల్లక, రమా సతి నిన్నిటు చేరనీయదో?
గుఱిగొని రావదేమి? తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

20

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనృసింహదేవా! 'శ్రీహరీ! ఓ నరహరీ! రమ్ము!ర' మ్మని భక్త్యావేశంతో నేను పిలిచినప్పటికీ, నీవు వేగంగా రావటంలే దెందులకు? భక్తు లెవరయినా నిన్ను కట్టు కదలనీయక కట్టివేసినారా? లేక, నన్ను మరచిపోయావా? లేదా, లక్ష్మీదేవి నిన్ను ఇటువైపు రానియ్యడం లేదా? ఆసక్తితో నీవు రాకున్నావేల? (శీఘ్రమే వేంచేయుమా! మహానుభావా!)

ఉ.

మానక నేను పిల్చినను మక్కువ లేక పరాకుసేసితో?
వీనుల సోఁక లేక తగ విశ్వము పాలనసేయఁబోతివో?
పూని మహావినోదమున భోగము మీఱఁగఁ జెంచుభామతోఁ
గోనలనుండి రావొ? తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

21

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనరసింహదేవా! విడువకుండా నే నెంతగానో భక్తితో పిలిచిన్పటికీ, నామీద ప్రీతి లేనందున ఉదాసీనత వహించియున్నావో? లేక, ఈ విశ్వాన్ని పరిపాలించటానికి వెళ్లిపోయినందువల్ల నా పిలుపు నీ చెవులకు వినబడలేదో? అటుగాక, చెంచులక్ష్మితో గూడి కొండకోనల్లో విహరిస్తూ ఆనందంలో నిమగ్నుడవై ఉన్నందున, ఆ అడవుల్లోనుండి రాజాలక యున్నావో? (కృపాంతరంగా! త్వరగా విచ్చేయుమా!)

ఉ.

నెమ్మదితోడ నిచ్చటను నీ నిజరూపముఁ జూడ వేడుకై
రమ్మని నేను పిల్చినను రాజసమో, దయలేకయుంటివో,
సమ్మతి గాదొ, లేక నిను సారెకుఁ బిల్చిన రావదేమొకో?
కొమ్మనవేమి ముక్తిఁ? దరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

22

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనృసింహదేవా! నీనిజస్వరూపాన్ని చూడవలెననే కుతూహలం కలిగి నేను నిండుమనస్సుతో పిలుస్తూవున్నా, రాజసస్వభావంతో రాదలంప కున్నావా? లేక, నాపై నీకు దయ కలుగలేదా? లేదా, ఇటువైపు రావడం నీకు ఇష్టంలేదా? పదే పదే నిన్ను పిలుస్తూవున్నప్పటికీ ఏలకో రాకున్నావు? వచ్చి, ముక్తిని ప్రసాదింపకున్నా వెందులకు?

ఉ.

మేలు! కృపాంతరంగ! నిను మిక్కిలి నే నిటు పిల్చి పిల్చినన్
ఏల పరాకు చేసెదవె? యిప్పుడు నిన్నెడఁబాయఁజాలకన్,
చాలగు నీ పదాబ్జములసారములెల్ల మిళిందభాతిగన్
క్రోలుచునుందునయ్య! తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

23

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనృసింహదేవా! కరుణాహృదయా! మేలగునుగాక! ఇంతగా నేను పలుమార్లు నిన్ను పిలుస్తూవున్నప్పటికీ పరాకు చేస్తున్నావెందులకో? ఇప్పుడు నిన్ను ఎడబాయలేక, నీ పాదపద్మాలనుండి చాలుగా స్రవించే సారాన్ని (జాల్వారే భక్తిభావన-అనే మకరందాన్ని) తుమ్మెదలాగా పానం చేస్తూ వుంటున్నానయ్యా! చిత్తగించు!

ఉ.

సుందరదేహ! నిన్నిచటఁ జూచెదనంచు నపేక్షసేయుచున్
మందరధారి! రమ్మనుచు మాటికిఁ బిల్చిన నిఫ్డు వచ్చి, నా
ముందర నిల్చి పల్కఁదగు, ముద్దులు గుల్క నటింపుమన్న! యీ
కుందకమేల నింకఁ? దరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

24

భావం:

దయాసముద్రుడవయి తరిగొండలో విరాజిల్లుతూ వున్న శ్రీలక్ష్మీనృసింహస్వామీ! మందరగిరిధారీ! ఓ సుందరదేహా! నిన్ను సందర్శింపవలెననే ఆకాంక్షతో పదేపదే ప్రార్థిస్తూవున్నాను. కనుక, నాయెదుట సాక్షాత్కరించి, ముద్దులు గులికేట్టు మాటాడుతూ నర్తింపగోరుతున్నాను. ఈ నాకోరికను నెరవేర్చక జాగు సేయుచున్నావేల? (ఏలాటి అభ్యంతరం లేకుండా శీఘ్రంగా నీ దివ్యదర్శనాన్ని అనుగ్రహింపుమా!)

ఉ.

సారములేని సంసరణసర్పము చేతికిఁ జిక్కలేక, యా
తేరకు లేని యాసలను దెచ్చుక యింక నటింపలేక, యా
పారము లేద యెక్కడికిఁ, బాపము మాయెడ వాంఛఁజేసె; నీ
ఘోరముఁ బాపవయ్య! తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

25

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనృసింహదేవా! ఏమాత్రం సారం లేని సంసారమనే సర్పానికి చిక్కలేకున్నాను; లేనిపోని జీవితాశలను తెచ్చిపెట్టుకొని, ఐహికజీవితంలో నటింపలేకున్నాను. అంతులేని ఈ జీవనయానంలో పాపకార్యాలు నన్ను లోబరచుకోవాలనే కోరికతో చూస్తూవున్నాయి! ఘోరమైన ఈప్రమాదాన్ని కృపతో నివారించుమా! స్వామీ!

ఉ.

ఉబ్బుచుఁ దేరతేరకును, నూరక లేనటువంటి యాసలన్
బెబ్బులిచేతఁ జిక్కి, తనుభేదము లెన్నుచు నున్నదాన; నా
మబ్బును పద్మమిత్రుగతి మందఁగ సంహరణంబుఁజేసి, నన్
గొబ్బునఁ గావవయ్య! తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

26

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనరసింహదేవా! మాటిమాటికిని నా మనస్సులో అంకురించి తలయెత్తే ఆశలనే పెద్దపులికి చిక్కియున్నాను; అలా చిక్కియుండి, నావారు, పెరవారు- అనే భేదభావనతో ప్రవర్తిస్తూవున్నాను. ఈ భేదభావన అనే మబ్బును, సూర్యుడు మేఘాన్ని తొలగించినట్లుగా, పూర్తిగా నశింపజేసి, (అందరిలో నీవే ఉన్నాడవనెడి) నిజమైన భావనను కలిగించి, వేగమే నన్ను కాపాడుమా! తండ్రీ!

చ.

అనిశము దుష్టవర్తనుల నార్గురి సాధక మెట్లు చేతు? నా
మనమున నుండుటన్ దురభిమానము నెట్ల సవాలు చేతు? మ
జ్జనమును, భోజనం బుడుగు సాధక మే గతిఁ జేతు? నింక నా
కును నొకదారిఁ జూపు! తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

27

భావం:

దయాసముద్రుడవయిన తరిగొండ లక్ష్మీనృసింహదేవా! ఎల్లవేళలా చెడుగా ప్రవర్తించే నాలోని ఆరుగురిని (అరిషడ్వర్గాన్ని) ఏ విధంగా అదుపు చెయ్యగలను? ముఖ్యంగా, నామనస్సులోనే ఉండే దురభిమానాన్ని ఎలాగున దబాయించి నిరోధించగలను? స్నానం, పానం, భోజనం - వీటిని విడిచిపెట్టడం ఏ ప్రకారంగా సాధించ గలను? ఈ విషయంలో నీవే నాకు ఒక మార్గాన్ని నిర్దేశించవయ్యా! మహాత్మా!

చ.

ఎనసి మనంబుతోడ సకలేంద్రియముల్ పెడఁబాయఁజాలకే
ఘనముగఁ గర్ణరంధ్రములు గానముఁ గోరుచునుండుఁ, జర్మమున్
తనరఁగ దూది పానుపులు తక్కక కోరుచునుండుఁ జూడు! దు
ర్గుణముల కేమనందుఁ? దరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

28

భావం:

దయాసముద్రుడవయిన శ్రీ తరిగొండ లక్ష్మీనరసింహదేవా! నాయందలి జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలన్నీ మనస్సునే అంటిపెట్టుకొని, ఎడబాయకుండా ఉన్నాయి. ఆ రీతిగా చెవులు ఇంపైన గానాన్ని వినగోరుతున్నాయి; చర్మం మెత్తని స్పర్శగల దూదిపరుపులను కోరుతూ వుంది. తక్కిన ఇంద్రియాలు కూడా ఇలాగే మనస్సును తమ తమవైపులకు లాగుతూవున్నాయి. ఇక, ఈ ఇంద్రియాల దుర్గుణాలను గూర్చి ఏమని చెప్పగలను? (భక్తవత్సలుడవయిన నీవే వీటిని చక్కబరుపగల మనోనిగ్రహాన్ని ప్రసాదించు ప్రభూ!)

ఉ.

మీఱిన చక్షురింద్రియము మేలగు వింతలు చూడఁగోరు, వి
స్తారముగాను జిహ్వ రుచిం సారెకుఁ గోరుచునుండు, నాసికం
బారయ గంధవాసనల నందముమీఱఁ గ్రహింపఁగోరు; దు
ష్కోరిక లిన్ని చూడు! తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

29

భావం:

దయాసముద్రుడవయిన శ్రీ తరిగొండ లక్ష్మీనృసింహదేవా! కర్మేంద్రియాలన్నిటిలో మిగుల శక్తిమంతమైన కన్ను మంచిమంచిదృశ్యాలను, వింతలను, విశేషాలను చూడగోరుతూవుంటుంది. అలాగే, నాలుక మంచి మంచి రుచులను (రుచిగల వస్తువులను) మాటిమాటికి కోరుతూనే వుంటుంది. ముక్కు సుగంధపరిమళాలను అతిశయమైన ఆనందంతో ఆఘ్రాణింపగోరుతూవుంటుంది. ఈచేడుకోరిక లన్నిటినీ నిగ్రహించే సదుపాయం అనుగ్రహించవయ్యా! వీరనృసింహదేవా!

ఉ.

చూడు మహానుభావ! యొకచోద్యపుజీవుఁడు దేహకాంక్షలన్
వీడఁ, డవెన్ని చెప్పిన వివేకము గల్గదు, ఎంత మత్తుఁడో?
రాఁడు దురాశలన్ విడిచి, ప్రాకృతుభంగిని నింద్రియాలతో
[3]గూడెడఁబాయలేఁడు; తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

30

భావం:

దయాసముద్రుడవైన శ్రీ తరిగొండ లక్ష్మీనరసింహదేవా! మహానుభావా! ఇటుచూడు! విచిత్రస్వభావంగల ఈ జీవుడు దేహంమీది మమకారాన్ని విడువకున్నాడు. ఎన్ని చెప్పినా, ఎంత చెప్పినా వీనికి వివేకం కలగటం లేదు. నిజంగా వీడు ఎంత మదించినవాడో కదా! దురాశలను విడిచిపెట్టి రానే రాడు. శుద్ధపామరునిలాగా ఇంద్రియాలతో ఎడబాయని రీతిలో కలసిమెలసియుంటున్నాడు. (ఇట్టి అవివేకిని సమర్థుడవైన నీవే సముద్ధరింపగలవు స్వామీ!)

ఉ.

జోడుగ నెల్లకాలమును సొంపుగ నా పరమాత్ముఁ డుండు మేల్
జాడఁ గనంగ నేర్చి, తనజాడకుఁ బోవును జీవుఁ, దన్యథా
జాడకుఁ బోఁదలంచి శివుజాడకు భీతిల్లుచున్నవాఁడు; ఈ
కోడిగ మేమి చూడు! తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

31

భావం:

దయాసముద్రుడవయిన శ్రీ తరిగొండ లక్ష్మీనృసింహదేవా! తొలుత చాలాకాలంగా ఆ పరమాత్ముడుండే ఉత్తమమైన ప్రదేశాన్ని చూచియున్నవాడై, ఆ మార్గం తెలిసినవాడై వుండి కూడా, ఈ జీవుడు ఇప్పుడు వేరొక మార్గంలో వెళ్లడానికి పూనుకొంటున్నాడు. ఆపరమేశ్వరుని జాడకు వెళ్లడానికి వీడెందులకో భయపడుతూవున్నాడు. ఈ జీవుని యొక్క ఇప్పటి ఈ కపటమైన ప్రవర్తన యేమిటో? ఎందులకో? నీవే ఆలోచించుమా! స్వామీ!

ఉ.

రూఢిగ నాత్మనాయకుని రూపముఁ గాంచెను నాఁడు వేడుకన్,
గాఢప్రపంచమాయలకుఁ గ్రమ్మఱఁ జిక్కందలంచి నేఁడు బల్
మూఢుఁడునై చరింపుచును మోహమహావనిఁ జిక్కినాఁడయా!
గూఢము నమ్మలేఁడు; తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

32

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనరసింహదేవా! ఈజీవుడు ఆనాడు ఆసక్తితో ఆత్మనాయకుడైన పరమేశ్వరునినిజస్వరూపాన్ని ప్రశస్తంగా దర్శించియున్నాడు. ఈనాడు మళ్లీ బలీయమైన ఈ ప్రపంచ మాయలకు చిక్కదలంచి, మూఢుడై సంచరిస్తూ, 'భ్రాంతి' అనే గొప్ప అడవిలో చిక్కుబడిపోయాడు. ఇలాగ తాను చిక్కుబడిపోయిన ఈ రహస్యాన్ని వీడు విశ్వసింపలేకున్నాడు కదా! ఇక, వీనికి నీవే దిక్కు!

ఉ.

వేడుకతోడ బొందికిని వింతగఁ జిన్నెలు సేయుచుండఁగా
నేఁడును నింట నుండు, నటు నిక్కముగా మఱునాఁడు చూచినన్
కాడునఁ జేరి, వేగ లయ కాలుని చెట్టనుబట్టి, క్రమ్మఱన్
గూడునఁ జేరు జీవి; తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

33

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనృసింహదేవా! జీవుడు మిగుల ఆసక్తితో ఈ శరీరానికి వింత వింతలైన వన్నెలను, చిన్నెలను ఎన్నిటిని చేసినా, ఈనాడు ఇంటిలో నున్నవాడు మరునాడు కాటికి చేరుకొంటూవుంటాడు. అటుపై యమునితో మైత్రి నెరపి, అనంతరం మరో దేహంలో ప్రవేశిస్తూవుంటాడు. (కావున, అశాశ్వతమైన ఈ బొందికి అతిశయంగా వన్నెలూ, చిన్నెలూ, అలంకారాలూ చెయ్యడం అనావశ్యక మని, వ్యర్థమని సారాంశం).

ఉ.

ఆడకు హంగ పుట్టఁగను నార్భటమందుచు నింటిలోనఁ బో
రాడుచునుండినంతటను, నంతకు[4]కింకరు లొచ్చి వేగఁ ద
న్నీడిచి తన్నఁగాను దన కెవ్వరు నడ్డముగాను రారు; ఆ
గోడెడఁబాప నీవె! తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

34

భావం:

దయాసముద్రుడవయిన శ్రీ తరిగొండ లక్ష్మీనృసింహదేవా! జీవుడు అవసానదశను చేరుకొని ఇంటిలో మృత్యువుతో పోరాడుతూ వుండగా, యముని సేవకులు వచ్చి తనను బలవంతంగా లాగి, తన్నినప్పుడు, తన కెవ్వరూ అడ్డపడలేరు. అలాంటి ఆపత్ సమయంలో ఆ బాధనూ, దుఃఖాన్నీ, నివారించి జీవుణ్ణి ఆదుకొనే సంరక్షకుడవు నీ వొక్కడవే సుమా! (అటువంటి సర్వరక్షకుడవయిన నీకు నావందనం!)

చ.

'కట కట! జీవి! నీ విఁకను కష్టము పొందుచు నుండవద్దు, ఈ
ఘటమును నమ్మవద్దు, నినుఁ గాంచి యఖండముఁ జూడు'మంచు నే
నెటువలె బోధఁ జేసినను, నెప్పుడుఁ దాను ఘటాభిమానియై
కుటిలము మానఁడాయెఁ; దరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

35

భావం:

దయాసముద్రుడవయిన శ్రీ తరిగొండ లక్ష్మీనరసింహదేవా! 'ఓ జీవీ! నీ వికమీదట కష్టాలు పొందుతూ ఉండవద్దు. ఈ ఘటాన్ని (శరీరాన్ని) సుస్థిరమని ఏ మాత్రం సమ్మవద్దు. నీ అసలు స్వరూపాన్ని గుర్తించి, సత్యమైన ఆ స్వరూపభావనతో అఖండమైన పరమాత్మతత్త్వాన్ని సందర్శించ'మని నే నెంతగానో బోధచేశాను. అయినా, తానుమాత్రం ఈ ఘటం (శరీరం) నందే అభిమానం కలిగినవాడై, కుటిలమైన నడవడిని మానుకోలేకున్నాడు. (ఇట్టి పరిస్థితిలో ఈజీవుని సముద్ధరింపగల శక్తిమంతుడవు నీవే కదా? కృపాపరిపూర్ణా!)

ఉ.

కండలు, ప్రేవులున్, బలు వికారవుటస్థులు, చీము, నెత్తురున్,
నిండిన మూత్రమున్, మలము నెప్పుడు మూఁగి, మహా అసహ్యమై
యుండును కుక్షిలోన, నిఁక నో హరి! యేమని విన్నవింతు? నీ
కుండకు భోగమేల? తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

36

భావం:

దయాసముద్రుడవయి తరిగొండలో విలసిల్లుతున్న శ్రీలక్ష్మీనరసింహదేవా! ఈ శరీరాన్నిగురించి ఏమని విన్నవింపగలను? ఈ కుక్షి (ఉదరం) మాంసపు కండలు, ప్రేవులు, వికారమైన ఎముకలు, చీము, నెత్తురులు, నిండిన మలమూత్రాలు - వీటితో మిక్కిలి అసహ్యంగా ఉంటుంది. అలాంటి ఏహ్యమైన, అశాశ్వతమైన ఈ 'కుండ'కు మితి మీఱిన ఐహికసుఖాలు, అలంకారాలు ఎందులకు? (అక్కరలేదని అభిప్రాయం).

చ.

మఱపున జీవుఁ డెప్పటికి [5]మాయనుదానికిఁ జిక్కి, తాను నా
యెఱుకను నిల్వనీయకను, నెప్పుడు మద్గురు వాక్యసంగతుల్
మఱచెదనంచుఁ బోయినను, మక్కువతోడుత నన్నుఁబ్రోవ స
ద్గురుఁడటు పోవనీఁడు; తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

37

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనృసింహదేవా! మాయ అనే దాని చేతిలో చిక్కిన ఈ జీవుడు, నా గురువర్యుడు ఉపదేశించిన వాక్యాలను - జ్ఞానాన్ని ప్రసాదించే వాటిని - ఏమఱుపాటున మరచిపోవడానికి పాల్పడినా గురువర్యుడు నా యెడ వాత్సల్యంతో కూడిన ప్రీతితో, తాను ఉపదేశించిన ఆ వాక్యాలనూ, వాటి ఫలితమైన జ్ఞానాన్నీ మఱువనీయక, నన్నూ, నా యెఱుకనూ అల్లాగే కాపాడుతూవున్నాడు కదా! (నా గురువర్యునికి నాయందు గల వాత్సల్యం అలాంటిది!)

ఉ.

ఈడిచి తెచ్చి జీవుని మహీపతి దండనసేయఁబూని, యా
మూఁడు గుణాలఁ బట్టుకొని ముప్పురి పగ్గము పేడి, గట్టిగాఁ
జూడఁగ నాల్గురిన్, మదినిఁ జొన్పిన చిత్తము, నింద్రియంబులన్
కూడ బిగించినాఁడు; తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

38

భావం:

దయాసముద్రుడవయిన శ్రీ తరిగొండ లక్ష్మీనరసింహదేవా! అవధరింపుము! ప్రభువైన గురువర్యుడు (గురురాయడు) జీవుణ్ణి సక్రమమైన మార్గంలో నడుచుకొనేట్టు శిక్షింపదలంచిన వాడై, వీణ్ణి తన వద్దకు లాగుకొని వచ్చి, మూడు గుణాలనే ముప్పిరిపగ్గంగా పేని, ఆ త్రాటితో ఆరుగురు శత్రువులను (అరిషడ్వర్గాన్ని), చిత్తాన్ని మనస్సులోపల దూర్చి, అలా దూర్చిన మనస్సుతో, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలను (అనగా, ఆయాఇంద్రియాల వ్యాపారాలను కూడా ఒక్కటిగా చేర్చి, గట్టిగా బిగించి యున్నాడు. (ఈ రీతిగా ఈ జీవుణ్ణి సవ్యమైన పద్ధతిలో నెలకొల్పినట్టి గురువర్యుని అనుగ్రహాన్ని కొనియాడుతున్నాను.)

చ.

పసగల సామి న న్నెపుడు పాలన సేయఁదలంచినాఁడో? నా
కుశలముఁ గోరినాఁడు; నను గొబ్బున రక్షణచేసి ప్రేమతో,
విసువక, నామనంబు గడువిం తగుటన్ మదకుంజరాన కం
కుశముగ నిల్చినాఁడు; తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

39

భావం:

దయాసముద్రుడవయిన శ్రీ తరిగొండ లక్ష్మీనృసింహదేవా! సర్వసమర్థుడయిన నాగురుస్వామి ఏనాడు చక్కగా నన్ను రక్షింపదలచినాడో ఆనాడే నా క్షేమాన్ని మనసారా కోరి, నన్నాదుకొన్నాడు. నాపై కలిగిన అవ్యాజమైన ప్రీతితో, ఎంతమాత్రమూ నన్ను విసుగుకోకుండా, మదపుటేనుగువంటి విచిత్రమైన నా మానసిక ప్రవృత్తిని అటునిటు చెదరిపోనీయకుండా, అంకుశంలాగా స్థిరంగా నిలిచియుండి నన్ను రక్షించాడు. (అటువంటి శక్తిమంతుడైన గురువర్యుని అనుగ్రహాన్ని మిక్కిలిగా కొనియాడుతూవున్నాను).

ఉ.

దేశములోన దివ్యమగు ధీరుఁడు సర్వము నిండియుండఁగా
వాసి గనంగలేక, మనవారును, నన్యులటంచు నుండి, [6]
ట్టాస లనేటి తీఁగెలను నప్పుడు [7]నిశ్చయమంచు కత్తితోఁ
గోసెను మద్గురుండు, తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

40

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనరసింహదేవా! లోకంలో భగవంతుడనే ధీరాగ్రేసరుడు అంతటా వ్యాపించి యుండగా, ప్రసిద్ధమైన ఈ సత్యాన్ని తెలిసికోలేక, 'వీళ్లు మనవాళ్లు, వాళ్లు పరాయివాళ్ళు'- అనేటటువంటి భేదభావంతో ఉంటూవుండినాను. అప్పుడు నా గురువర్యుడు నాలోని పలురకాల వ్యర్థమైన ఆశలనే తీగలను దృఢనిశ్చయమనెడి పదునైన అంచుగల కత్తితో మొదలంట కోసివైచి, నాకు అభేదభావపూర్వకమైన జ్ఞానోదయాన్ని ప్రసాదించాడు కదా!

చ.

నరహరి! మ్రొక్కి చెప్పెదను నా నుదుటన్ గల వ్రాలు ప్రేమతో
నరుదుగ నంఘ్రిమూలమున నంటెను, పూర్వపువ్రాలు దీసి, యా
సరసిజగర్భుపట్టమున సాంద్రకటాక్షము నుండఁ బంచె; మ
ద్గురు[8]మహిమేమనందుఁ? దరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

41

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనరసింహదేవా! ఓ నరహరీ! ఇప్పుడు తమకు ఒకానొక స్వానుభవాన్ని మనవి చేస్తున్నాను; కృపతో చిత్తగించు! గురువర్యుడు నాపై గల అవ్యాజమైన ప్రేమతో, తన పాదంచేత నా నొసటి యందలి బ్రహ్మవ్రాతను (బ్రహ్మలిపిని) తుడిచివేసి, క్రొత్తగా అనుగ్రహపూర్వకమైన తన వ్రాతను వ్రాసి, నన్ను చరితార్థురాలిని కావించియున్నాడు. ఈ విధంగా నా జీవితంయొక్క భవిష్యత్తునే మార్చివేసిన మదీయ సద్గురువర్యుని మాహాత్మ్యాన్ని ఏమని కొనియాడగలను? (అటువంటి గురుపుంగవుని ప్రభావాన్ని ప్రశంసింపజాలనని కవయిత్రియొక్క అభిప్రాయం.)

సూచన: ఈ కవయిత్రీమతల్లి యొక్క అపూర్వమైన ఆధ్యాత్మికానుభూతులలో ఇది యొకటిగా పేర్కొనదగియున్నది.

చ.

గురునకు నీ కభేదములు కోరి పఠించితినంచుఁ జిత్తమం
దరయఁగఁ గోపమున్ వలదు, అంబుజబాంధవ, సోమనేత్ర! నీ
కరుణను నిన్ను నేను పొడగాంచితి; నింకనుమానమేల? మ
ద్గురుఁడవు నీవె కాదె? తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

42

భావం:

దయాసముద్రుడవయిన శ్రీ తరిగొండ లక్ష్మీనృసింహదేవా! సూర్యచంద్రులే నేత్రాలుగా గలిగిన పరాత్పరా! నాగురువర్యునకు నీకు అభేదాన్ని (ఈ శతకంలో ఆ యా చోట్ల) పాటించినానని నీమనస్సున కోపింపవలదు. నీ అపారకరుణచేతనే నేను నీదివ్యస్వరూపాన్ని సందర్శింప గలిగినాను కదా! కావున, నాగురువర్యుడవు నీవే! ఇందులో ఏమీ సందేహం లేదు! ఓ గురుస్వామీ! నీ శిష్యురాలైన నన్ను నీకృపావిశేషంతో కటాక్షించు!

చ.

సతమగు సామి! నిన్నిఁకను సారెకు నే నెటు పోవనిత్తు? నా
యితముగ నీ పదాబ్జముల నేర్పడ గట్టిగఁ బట్టి, వేగ శ్రీ
పతి! ఘనభక్తిమార్గమను పగ్గమునన్ బిగఁబట్టి, నిన్ను నా
కుతికకుఁ గట్టుకొందుఁ; దరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

43

భావం:

దయాసముద్రుడవయిన శ్రీ తరిగొండ లక్ష్మీనరసింహదేవా! ఓ శ్రీపతీ! ఎల్లప్పుడూ నెలకొనియుండే సత్యస్వరూపుడవయిన స్వామీ! ఇక మీదట నిన్ను నానుండి దూరం కానివ్వను. నీ పాదపద్మాలను గట్టిగా పట్టుకొని, వాటిని భక్తిమార్గమనే బలమైన పగ్గపుత్రాటితో బాగుగా ముడివేసి, ఆ త్రాటిద్వారా నిన్ను నా కంఠానికి ముడివేసికొంటాను. ఆ విధంగా నిన్ను నానుండి దూరం కానీయక శ్రద్ధతో కాపాడుకొంటూవుంటాను సుమా!

(ఈ నా ఉపాయాన్ని భక్తవత్సలుడవైన నీవు ఆమోదించి, అనుగ్రహించుమా!)

ఉ.

పన్నగశాయి! నీ మహిమ భక్తులకెల్లను గానవచ్చె, నీ
సన్నిధి దగ్గఱాయెను, విచారము తీరెను, ముక్తి గల్గు నౌ!
నెన్నఁగ నీదు రూపమును నీగతి నాదు మనంబులోనఁ గన్
గొన్నవిధంబు దోఁచెఁ; దరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

44

భావం:

దయాసముద్రుడవయి తరిగొండలో విలసిల్లుతూవున్న శ్రీలక్ష్మీనృసింహదేవా! భక్తులయిన వారలకు నీ మాహాత్మ్యం చక్కగా గోచరిస్తున్నది. ఆ ప్రకారంగా నీ దివ్యచరణసాన్నిధ్యం నాకు చేరువ అయ్యింది. నా విచారమంతా తొలగిపోయింది. నాకు ముక్తి లభిస్తుందనే నమ్మకం కుదిరింది. నామనోవీథిలో గోచరించిన విధంగానే నీ దివ్యమంగళమూర్తి నాకు సాక్షాత్కరించి, అపూర్వమైన అనుభూతిని ప్రసాదించింది. ఓ శేషశయనా! మీకు నా అభివందనం!

ఉ.

పాటుగ నాత్మదేశమునఁ బన్నుగ వెన్నెల గాయుచుండు, బల్
ఆటకమైన యేడు ఘనఆవరణంబులు నుండు, దానిలో
[9]మేటగు సర్పము న్నొకటి మేరువుమీఁదను [10]కావలుండు, నీ
కోట విధంబుఁ గంటి; దరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

45

భావం:

దయాసముద్రుడవయిన శ్రీ తరిగొండ లక్ష్మీనరసింహదేవా! ఆత్మయొక్క దేశంలో ఎప్పుడూ సొంపుగా వెన్నెల కాస్తూవుంటుంది. ఈదేశంలోనే ఏడు గొప్ప ఆవరణలు నెలకొనివున్నాయి. అందులో శ్రేష్ఠమైనసర్పం ఒకటి మేరువుపైన (అగ్రభాగంలో) కావలికాస్తుంటుంది. ఇటువంటి కోటతీరును నీ దయవల్ల నేను కనుగొన్నాను.

చ.

తొలఁగక మేటి కోటకును త్రోవలు తొమ్మిది, దానిలోపలన్
బలిమిగ నంచెలంచెలను పట్టుగ నాల్గురు [11]కావలుందు, రా
వల నొక యేడు చిల్కలును వాసిగఁ బల్కుచునుండు, దానిలోఁ
గొలఁకులు రెండు నుండుఁ; దరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

46

భావం:

దయాసాగరుడవై తరిగొండలో విరాజిల్లుతూవున్న శ్రీ లక్ష్మీనరసింహదేవా! ఈ 'కోట'కు (శరీరానికి తొమ్మిదిత్రోవ లున్నాయి. ఈకోటయందు ఆ యా అంచెలలో ఆరుగురు బలమైన పట్టుదలతో కావలి కాస్తూవున్నారు. ఈ కావలివాండ్రకు ఆవల ఏడు చిలుకలు ప్రశస్తంగా పలుకుతున్నాయి. అచ్చట రెండు సరోవరాలు ప్రకాశిస్తూ వున్నాయ

(కవయిత్రి ఈ పద్యంలో మానవదేహంలోని షట్చక్రాలు మొదలయిన యోగవిద్యావిశేషాలను మర్మకవితాధోరణిలో వెల్లడించింది.)

చ.

కొలఁకుల మధ్యమందు నొకకోమలి యున్నది, దానిలోపలన్
సలలితవహ్నిమండలము, చంద్ర, దివాకరమండలంబులున్,
అలవడ నాఱుచక్రముల కావల నందొక సారసంబులోఁ
గులుకుచునుండు హంస; తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

47

భావం:

దయాసముద్రుడవయి తరిగొండలో విలసిల్లుతున్న శ్రీలక్ష్మీనరసింహదేవా! అవధరించు! రెండు సరస్సుల మధ్య ఒకయువతి నెలకొనివుంది. ఆ కోమలి నడుమ అగ్నిమండలం, దానికి అటునిటు చంద్ర, సూర్యమండలాలు ఉన్నాయి. ఇదిగాక, ఆఱుచక్రాలపైన ఒక పద్మం ఉంది; ఆ పద్మం(సహస్రారకమలం)లో జ్ఞానస్వరూపియైన హంస నిత్యం కులుకుతూవుంటుంది.

ఉ.

గీష్పతి, బ్రహ్మశేషనుతకీర్తివిశాల! దయాంతరంగ! యో
పుష్పశరారిమిత్ర! విను పొందుగ దేహములోన మేటిగాఁ
బుష్పము లేడు నుండు, తనముందర నందొక ముక్తిపుష్పమున్
గోష్పదభాతి నుండుఁ దరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

48

భావం:

దయాసముద్రుడవయి తరిగొండలో అవతరించియున్న శ్రీ లక్ష్మీనృసింహదేవా! బృహస్పతి, బ్రహ్మ, ఆదిశేషుడు- వీళ్లచే విశేషంగా కొనియాడబడిన విశాలమైన కీర్తిగలవాడా! పరమశివునకు మిత్రుడా! ఓ కరుణాంతరంగా! స్వామి! చిత్తగింపుమా! ఈ దేహంలో ప్రసిద్ధంగా ఏడు పుష్పాలు ఉన్నాయి. వాటికి ముందు - అనగా అన్నింటికి పైభాగాన ముక్తి అనే పుష్పం ఆవుగిట్టంత పరిమితి, ఆకృతి- గలిగి భాసిస్తూవుంటుంది.

ఉ.

భాసురలీల సో౽హమనుభావములన్ నిరతంబు చాల హం
సీసహితంబుగాను మఱి చేసెను మిత్రుఁ; డిలా, భగీరథీ,
కాశి, గయా, ప్రయాగలును ఖ్యాతిగ దేహములోన నేర్పడన్,
కోశము లైదు నుండుఁ; దరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

49

భావం:

దయాసముద్రుడవయి తరిగొండలో వెలుగొందుతూవున్న శ్రీలక్ష్మీనృసింహదేవా! కాలస్వరూపుడైన సూర్యభగవానుడు ఉచ్ఛ్వాసనిశ్శ్వాసాలనే హంసలను నిరంతరం చలింపజేయటంద్వారా సో౽హంభావాన్ని విశిష్టంగా సూచించాడు! అట్లే, ఈ దేహంలో భూమిని, గంగను, కాశీ, గయా ప్రయాగ- అనే పుణ్యక్షేత్రాలను పాదుకొల్పియున్నాడు! ఆ రీతిగానే ఈ దేహంలో అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలనే ఐదుకోశాలూ అమరివున్నాయి.

చ.

అరయఁగఁ జేతనుండును, గణాధిపుఁడున్, యమరాజసంఘమున్,
ఇరవుగ బ్రహ్మ, విష్ణులు, మహేశుఁడు, రుద్రుఁడు, సర్వలోకముల్
సరసిజసంభవాండమునఁ జక్కఁగ నుండును, ఆ యజాండమున్
గుఱుతుగ నాత్మ నుండుఁ; దరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

50

భావం:

దయాసముద్రుడవయి తరిగొండలో విలసిల్లుతూవున్న శ్రీలక్ష్మీనృసింహదేవా! అవధరింపుమా! చైతన్యస్వరూపుడయిన పరమాత్మ, గణాధిపతి, యమధర్మరాజు, త్రిమూర్తులు, సమస్తలోకాలు - బ్రహ్మాండంలో చక్కగా ఉంటున్నాయి. ఆ బ్రహ్మాండమంతా సూక్ష్మాకృతితో ఆత్మలో నెలకొనివుంటుంది! (ఇదే సృష్టిరహస్యం!)

ఉ.

కంఠములోని నాళ మతికాంతిగ వెల్గెడి రీతిఁ జూచి, యా
కంఠముమీఁద రెండు బలుకాటుకకొండలమధ్యమందు శ్రీ
కంఠునిఁ గాంచి, యంత లయకాలుని వేగమె ధిక్కరించి, వై
కుంఠముఁ జేరవచ్చుఁ; దరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

51

భావం:

దయాసముద్రుడవయి తరిగొండలో ఆవిర్భవించియున్న శ్రీలక్ష్మీనృసింహదేవా! చిత్తగింపుమా! ఈ దేహమందలి జీవుడు కంఠంలో మిగులకాంతితో వెలుగొందే నాళాన్ని పరికించి, అలాగే ఆ కంఠంమీద నెలకొనివున్న రెండు కాటుకకొండలమధ్యన ప్రకాశిస్తూవున్న పరమేశ్వరుణ్ణి సందర్శించాలి. అలా సందర్శించిన ఆ జీవాత్మ మృత్యువుకు అధిపతియైన యముణ్ణి సైతం వేగంగా ధిక్కరించి, నేరుగా శ్రీవైకుంఠలోకాన్ని చేరగలడు!

ఉ.

నిష్ఠ లవెన్ని గల్గినను, నేర్పు నరణ్యమునందుఁ బొందినన్,
కష్టము లెన్ని చేసినను గ్రమ్మఱ జీవుఁడు పుట్టకుండునే?
అష్టమదంబుల న్నుడిగి, యాత్మను గాంచినవాఁడు వేగ ను
త్కృష్ట భవాబ్ధి దాఁటుఁ; దరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

52

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనృసింహదేవా! మనుజుడు అరణ్యంలో నివసిస్తూ, నియమనిష్ఠలు మొదలైన వాటిలో ఎంతో గొప్ప నైపుణ్యాన్ని సాధించినా, అంతమాత్రంచేత ఈ జీవుడు మళ్లీ పుట్టకుండా ఉండజాలడు. (పునర్జన్మను పొందకుండా తప్పించు కోలేడని అభిప్రాయం).

కులమదం, రూపమదం, బలమదం, ధనమదం, యౌవనమదం, విద్యామదం, అధికారమదం, తపోమదం - అనే ఎనిమిదిరీతుల మదములను పూర్తిగా తొలగించుకొని, ఆత్మయొక్క తత్త్వాన్ని దర్శింపగల్గినటువంటివాడు మాత్రమే సువిశాలమైన ఈ సంసారసాగరాన్ని దాటి, (ఆవలితీరమైన) మోక్షాన్ని చేరుకోగలడని సారాంశం.

ఉ.

మూఁడు గుణంబులు న్నెఱిఁగి, ముందటి మార్గముఁ గాంచి గ్రక్కునన్,
మూఁడు శరీరముల్ దెలిసి, ముమ్ములకోనను జేరి ధీరుఁడై,
మూఁడు ప్రవాహముల్ గలసి మోదము నొందుచునుండు చోటునన్
కూడిన మోక్షమబ్బుఁ; దరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

53

భావం:

దయాసముద్రుడవయిన శ్రీ తరిగొండ లక్ష్మీనృసింహదేవా! వందనములు! జీవుడు సత్త్వము, రజస్సు, తమస్సు- అనే మూడుగుణాలయొక్క స్వరూప, స్వభావాలను తెలిసికొని, ఆ పై అనుసరించదగిన మార్గాన్ని శీఘ్రంగా దర్శించి, స్థూల, సూక్ష్మ, కారణ శరీరము లనెడి మూడు శరీరాల తత్త్వాలను గుర్తెఱిగి, తొణకని స్థిరచిత్తంతో మిగుల మూలన ఉండే కోనయందు (సహస్రారంలోపల) ప్రవేశించి, ఇడ, పింగళ, సుషుమ్న-- అనే మూడు ప్రవాహాలు సంగమించియున్న- సంతోషాన్ని ప్రసాదించే- స్థలాన్ని చేరుకొంటే మోక్షం లభిస్తుంది.

ఉ.

వేషము లెల్ల మాని, సువివేకముఁ జెంది, విచారహీనుఁడై,
రోషముఁ జంపి, భావమున రూఢిగఁ జూచుచునుండువానికిన్
భూషణమైన యట్టి యొకపువ్వులతోఁటకుఁ బశ్చిమాన మేల్
ఘోష వినంగవచ్చుఁ; దరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

54

భావం:

దయాసముద్రుడవయిన శ్రీ తరిగొండ లక్ష్మీనరసింహదేవా! అవధారు! లోకంకొఱకై డాబుసరిగా ధరించే బాహ్యవేషాలన్నీ మానుకొని, సుజ్ఞానాన్ని పొందినవాడై, చింతావిరహితుడై, మనస్సులో పరతత్త్వతేజాన్ని స్పష్టంగా సందర్శిస్తూవుండేవానికి మిక్కిలి అందంగా ప్రకాశిస్తున్న ఒకానొక పూలతోటకు వెనుకభాగంలో చక్కనిధ్వనితో గూడిన నాదం వినబడుతుంది. (శ్రేష్ఠమైన ఆ నాదఘోషయే ముక్తికి ముఖ్యసోపానం కదా? స్వామీ!)

ఉ.

బూడిదఁ బూయనేల? మఱి పొందుగఁ గష్టముఁ జేయనేల? యే
నీడల నుండనొల్లకను నిండిన యెండల నుండనేటికో?
పోఁడిమిగాను నాత్మ నిటు పొందుగఁ గాంచినవాని వేడుకన్
కూడును మోక్షకాంత; తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

55

భావం:

దయాసముద్రుడవయిన శ్రీ తరిగొండ లక్ష్మీనృసింహదేవా! చిత్తగించు! మనుజుడు (మోక్షకాంక్షతో) ఒడలంతా బూడిద పూసికోవడం ఎందుకు? శరీరాన్ని పలుకష్టాలపాలు చెయ్యడం ఎందులకు? నీడపట్టున ఉండటానికి అంగీకరింపక (తపస్సు పేరిట) తీవ్రమైన ఎండల్లో ఉండడం దేనికి? ఆత్మస్వరూపాన్ని ఇంపార సందర్శించిన వానిని ముక్తి అనే కాంత (తనంతట తానుగ వచ్చి) హాయిగా కలుస్తుంది కదా!

ఉ.

మూఁడు గుణాలు మానకను, ముందర నుండెడి మూర్తిఁ గానకన్,
బూడిద మేనఁ బూసి, బహుబూటకముల్ పయినేసి, ధాత్రిపై
వాడక సంచరించుచును [12]వాసగు వస్తువుఁ గానకుండినన్
కూడదు ముక్తికాంత; తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

56

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనరసింహదేవా! స్వామీ! అవధరించు! సత్త్వగుణం, రజోగుణం, తమోగుణం - అనే త్రిగుణాలలో చిక్కుకొని వుండి, వాటిని అదుపు చేయజాలనందున, ఎదుట గోచరించే దివ్యమైన) ఆత్మస్వరూపాన్ని కనలేక, ఒళ్లంతా బూడిద పూసికొని, ఆడంబరాన్ని సూచించే బాహ్యవేషాన్ని ధరించి, ఉత్కృష్టమైన ఆత్మతత్త్వాన్ని దర్శింపకుండానే, ఊరక ఈ లోకంలో సంచరిస్తూవుండే బూటకాలరాయుణ్ణి ముక్తికాంత కూడదు (కలిసికొనదు) కదా!

ఉ.

భూచరుఁడైన నేమి? శివపూజలు చేసి యనేకముద్రలన్
చూచినఁ బుణ్యమేమి? యది చూడకయుండిన నేమి తక్కువల్?
ఖేచరిముద్రఁ గాంచి మదిఁ గిన్నరభావము మానసంబులో
గోచరమైన ముక్తి; తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

57

భావం:

దయాసముద్రుడవయిన శ్రీ తరిగొండ లక్ష్మీనృసింహదేవా! అవధరించు! మనుష్యుడు భూమిమీద తిరుగాడుతూ భూచరుడయి యుండి, శివపూజలు చేస్తూ తాంత్రికమైన అనేకముద్రావిశేషాలను అనుభవపూర్వకంగా తెలిసికొనియున్నా, అథవా తెలిసికోలేకపోయినప్పటికినీ అందులో ఎక్కువగానీ, తక్కువగానీ యేమీ లేవు! అటుగాక, (రాజయోగానికి సంబంధించిన) ఖేచరీముద్రను ఆచరణాత్మకంగా దర్శించి, మానవాతీతమైన అనుభవాన్ని మనస్సులో సాక్షాత్కరింపజేసికొనగలిగితే అదే నిజంగా ముక్తి అనబడుతుంది. (అదే ముక్తిమార్గానికి దారి తీస్తుందని అభిప్రాయం).

ఉ.

పామరబుద్ధులన్నియును పగ్గములన్ బిగఁగట్టి, సద్గురు
స్వామినిఁ జేరి, బ్రహ్మమును చాలఁగఁ గాంచినవాఁడు ధీరుఁడై
వేమఱు ముక్తికాంతను వివేకముగాఁ గవగూడు; నన్యథా
కోమలి నంటఁబోఁడు; తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

58

భావము:

దయాసముద్రుడవయిన శ్రీ తరిగొండ లక్ష్మీనరసింహదేవా! చిత్తగించు! పాపకార్యాలను ప్రేరేపించే ఆలోచనల నన్నింటినీ మనస్సనే బలమైన త్రాటితో బిగియగట్టివైచి, ఉత్తమోత్తముడైన గురువర్యుని సన్నిధిని చేరుకొని, పరబ్రహ్మ కళను దర్శించిన పుణ్యాత్ముడు స్థిరచిత్తంతో గూడిన వివేకం గలవాడై, ముమ్మాటికిని ముక్తికాంతను పొందగలడు. అటువంటి మోక్షకామి, మరల కామియై మానవకాంతను తాకడు.

చ.

సతులను జూచి చూచి మది సంతసమందుచునుందు రెప్పుడున్,
గతులు గనంగలేరు, నినుఁ గానఁగ లేరు వివేకహీనులై,
సుతు లిఁక మోక్షమిత్తురని చూచి, ధనంబు నపేక్ష సేయుచున్
కుతుకము నొందినారు; తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

59

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనరసింహదేవా! ఈ సామాన్యమానవస్వభావాన్ని చిత్తగించు! (ఈ లోకంలో అనేకులు) తమ భార్యలను నిత్యము చూస్తూ (అటువంటి అందగత్తెలు లభించినందువల్ల తామెంతో ధన్యులయినట్లు భావిస్తూ), సంతోషిస్తూవుంటారు. కాని, భావి పరిస్థితులను ఊహింపజాలరు. అందుచేత, దేవదేవుడవయిన మిమ్ము అసలే దర్శించలేరు. మిమ్ము దర్శించాలనేటటువంటి వివేకం లేనివాళ్లనందువల్లనే, ఆ సతులకు కలిగిన తమ పుత్రులు తమకు (మోక్షంలాంటి) ఉత్తమగతులను చేకూరుస్తారని ఎంతో ఆశిస్తూ, ఆ పుత్రుల కొరకు ఆసక్తితో ధనాన్ని సేకరిస్తూ ఆహ్లాదపడుతుంటారు. (కాని, ఆ సతులవల్ల, సుతులవల్ల, ధనాలవల్ల సమకూరే సాంసారిక సౌఖ్యాలు అశాశ్వతమైనవని తెలియనివారై ఉంటారని సారాంశం.)

చ.

ఇదియును శాశ్వతంబనుచు నిల్లును, ముంగిలి చూచి చూచుచున్,
కుదురక కాపురంబులును కొన్ని దినంబులు సేయుచుండఁగా,
ముదియఁగ, మర్త్యకోటులకు మోహము, లోభము మీఱి, జ్ఞానమన్
కుదురు గనంగరాదు; తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

60

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనృసింహదేవా! అవధరించు! మానవు లనేకులు ఈ సంసారమే (ఐహిక జీవితమే) శాశ్వతమయినదనే భ్రాంతితో, తమ యింటిని, ముంగిటిప్రదేశాన్ని తరచూ ఆసక్తితో చూస్తూ, కల్పించుకొన్న సంతోషంతో జీవితాలను సాగిస్తూవుండగానే (వృద్ధాప్యం ఆవరింపగా) వృద్ధులైపోతారు. అసంఖ్యాకులయిన అలాంటి మానవులలో ఆదినుండీ మోహం (భ్రాంతి), లోభం (పిసినారితనం) మితిమీఱి వుంటున్నందువలన, అటువంటి వాళ్లకు జ్ఞానమనే ఆధారకేంద్రం (కుదురు) కానబడదు. (కోట్ల కొలది సామాన్య మానవుల జీవితాలు ఇలానే కొనసాగుతూ వుంటాయని తాత్పర్యం).

ఉ.

పుట్టుచు గిట్టుచున్ మఱియు బోధశరీరునిఁ గాననేరకన్,
వట్టి దురాశలన్ దగిలి, వారిజగంధుల మీఁది ప్రేమచే
నెట్టన కాపురంబులును నిక్కమటంచును నమ్మి, యాత్మలో
గుట్టుఁ గనంగలేరు; తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

61

భావం:

దయాసముద్రుడవయిన శ్రీ తరిగొండ లక్ష్మీనృసింహదేవా! మానవులు సాధారణంగా మరల జన్మిస్తూ, మరల మరణిస్తూ (అలాగ, మరల మరల మాతృగర్భంలో ప్రవేశిస్తూ) జ్ఞానస్వరూపుడయిన పరమాత్మను దర్శింప జాలక ఉంటారు. మరేమంటే, వనితలపై వ్యామోహంచేత (ఐహికములైన) ఈ సంసారాలనే నిజమైనవిగా విశ్వసించి యున్నందువల్ల, ఆత్మయొక్క లోగుట్టును (అసలు తత్త్వాన్ని) (ఏమాత్రం) కనలేరు కదా!

ఉ.

కట్టిడి బుద్ధి లేక, మఱి కాపురముల్ సతమంచు నమ్మకన్,
చుట్టిన మోహపాశములఁ జూరునఁ గోసిన బుద్ధిమంతుఁడున్
పట్టగునట్టి దేశికుని ప్రాపునఁ జేరి, మనంబు నిల్పి, యా
గుట్టు గనంగనేర్చుఁ; దరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

62

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనరసింహదేవా! ఆలకింపుము, బుద్ధిమంతుడైన మనుజుడు చెడు తలంపులను వీడినవాడై, ఈ సంసారాలు అశాశ్వతాలని యెరింగి, వీటిని నమ్మనివాడై, తనను చుట్టుముట్టిన పలురకాల ఆకర్షణలనే మోహపాశాలను (వ్యామోహాలనే త్రాళ్లను) (దృఢనిర్ణయమనే) చుఱకత్తితో కోసివేసి, యోగ్యుడయిన (మిక్కిలి తగియున్న) గురువర్యుని సన్నిధిని చేరుకొంటాడు. (ఆ గురుపుంగవుడు ఉపదేశించిన రీతిగా) మనస్సును నిలిపి, ఆ గుట్టును (గూఢమైన ఆ ముక్తి స్థానాన్ని) చక్కగా కనుగొనగలడు.

ఉ.

ఎక్కడి రొక్కయోజనము? లెక్కడి భాగ్యము? లెక్క డింతులున్?
ఎక్కడి పాఁడి పంటలును? ఎక్కడి బాంధవు? లెల్ల నాఁటికిన్
తక్కక వృద్ధరూపమును దాల్చినఁ, బుత్రకు లింటివాకిటన్
కుక్కలఁ దోలుమండ్రు; తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

63

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనరసింహదేవా! ఈలోకరీతిని చిత్తగించు! మానవుడు ఎంతో ధనాన్ని సేకరించియున్నా, సంపదను పెంపొందించియున్నా, స్త్రీలను (భార్యలను) ప్రేమతో పోషించియున్నప్పటికీ, పాడిపంటలను చక్కగా సమకూర్చి యున్నప్పటికీ- ఇలాగ ఐహిక విషయాలను ఎంతగానో చేకూర్చిపెట్టి యుండినా, ముసలితనం పైబడగానే, కన్నకొడుకులే దయమాలినవారై, తనను 'ఇంటి వాకిట్లో కూర్చొని ఇంటిలోకి కుక్కలను రానీయకుండా తోలవలసిం'దని (కఠినంగా) ఆజ్ఞాపిస్తారు కదా! (కనుక ఈ లోకంలో ఎవ్వరి కెవ్వరు? - అనే యథార్థాన్ని గుర్తించి, ముందే తరణోపాయం ఆలోచించి జాగ్రత్తపడవలసి వుంటుందనే హెచ్చరిక- ఇందలి సారాంశంగా గ్రహింపదగివుంది).

ఉ.

యవ్వనమందు నాథులకు నింతులు [13]మేలుపచార మేర్పడన్
నివ్వటిలంగఁ జేతురు, త్రిణేత్రుని వీడని భక్తి నుందు; రా
యవ్వనమంతఁ బోవ, మఱి యింతులు నాథుల లెక్కసేయకన్
క్రొవ్విన మాట లండ్రు; తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

64

భావం:

దయాసముద్రుడవయిన శ్రీ తరిగొండ లక్ష్మీనరసింహదేవా! మహానుభావా! సాధారణంగా ఈ లోకమందలి గృహిణులయొక్క స్వభావాన్ని విన్నవిస్తున్నాను, చిత్తగించు! యౌవనదశలో నున్న యువతులు తమ భర్తలను శివుణ్ణి చూసినంత పూజ్యభావంతో చూస్తూ వారికి భక్తిశ్రద్ధలతో పరిచర్యలు చేస్తూవుంటారు. కాలక్రమేణ ఆయౌవనం గడచిపోయిన పిదప, ఆ యింతులు గర్వించినవారై, పతులను లక్ష్యపెట్టక, దురుసుగా మాట్లాడుతూవుంటారు. (కనుక, ఇంతులు పతులయెడ ప్రదర్శించే సేవాతత్పరత చాలవరకు తాత్కాలికమైనదే యని గుర్తించి, మనుజుడు ముక్తిలక్ష్యాన్ని మరువక మసలుకోవలెనని సందేశం).

చ.

మనుజులు మందబుద్ధిఁ జని మానవనాథుల నాశ్రయించుచున్
ఒనరఁగఁ దర్శవాదముల నూరక చేసి, ధనంబుఁ దెచ్చి, యా
తనయుల కంచు గొందులను దాఁతురు లోభముచేత నేర్పడన్,
గొనకొననీదు ముక్తి; తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

65

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనృసింహదేవా! దయచేసి ఈ మానవస్వభావాన్ని చిత్తగించు! కొందరు విద్యావంతులయిన మనుజులు బుద్ధిమాంద్యంతో రాజులను ఆశ్రయించి, వాళ్ల సభలలో శాస్త్రవాదాలు సలిపి, ఆ రాజులను మెప్పించి, వాళ్లు బహూకరించిన ధనాన్ని తెచ్చి, (తామనుభవింపక), తమ తనయులకొఱకని యుద్దేశించి, పిసినిగొట్టులై మార్మూలప్రదేశాల్లో భూమియందు దాచిపెట్టుతుంటారు. అల్లాగ ద్రవ్యంపై దురాశ అనే దుర్గుణం అలాంటి పండితుల్లో కూడా ముక్తిని గూర్చిన ఆలోచనను కలుగనీయదు కదా!

చ.

స్థిరమగు మానసంబునను శ్రీహరి! నిన్నెపు డాశ్రయించినన్
తఱుఁగక యింట నుండు దివిజాధిప......
...........................................................
..........తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

66

భావం:

దయాసముద్రుడవయిన శ్రీ తరిగొండ లక్ష్మీనృసింహదేవా! దేవతలెల్లరకూ అధిపతియైన దేవాదిదేవా! స్థిరమైన మనస్సుతోఎవరైనా, ఎప్పుడైనా మిమ్ములను ఆశ్రయిస్తే (శరణంటే) అట్టివారల యింటిలో సమస్త సౌభాగ్యాలు తగ్గిపోక ఎప్పుడూ విలసిల్లుతూ వుంటాయి. (అటువంటి భక్తవత్సలుడవైన మీకు నా ప్రణామం!)

ఉ.

చెండితనంబు మానకను, చెప్పినమాట గ్రహింపనేరకన్
ఉండెడి భార్యతోఁ దగులు ఊ................
....................................................
.............తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

67

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనృసింహదేవా! గయ్యాళిస్వభావం మానుకోకుండా, భర్త చెప్పిన మాటను పాటింపకుండా వుండే భార్యతోడి సంబంధం (సంసారం) నిష్ప్రయోజనం కదా!

చ.

సరసము, నీతి, సాహసము, జాణతనంబును, మేలిమైననున్
పరమ పతివ్రతాగుణము ...................................
..................................................................
...................తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

68

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనృసింహదేవా! సరసత్వం, నీతి ప్రవర్తన, సమయోచితమైన సాహసగుణం, తెలివితేటలు, ఉత్తమమైన పతివ్రతాశీలం కలిగిన భార్య ఎంతో అదృష్టవంతులకే లభ్య మౌతుందనేది సత్యం!

ఉ.

నీతికి లోనుగాక, పరనిందలు సేయుచు నెల్లకాలమున్
ఘాతుక బుద్ధి మానకను, గల్లలు పల్కుచు........
...............................................................
......................తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

69

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనరసింహదేవా! నీతిమార్గానికి లోబడి వర్తింపక, పరులను నిందిస్తూ, ఎల్లకాలం ఇతరులకు అపకారం చేయాలనే క్రూరబుద్ధిని విడువక, నోరు తెరిస్తే అబద్ధాలే మాట్లాడుతూవుండే దుర్జనులకు తరణోపాయం ఎక్కడిది? అటువంటి కుజనులను నిగ్రహానుగ్రహసమర్థుడవయిన నీవే సంస్కరింపగలవు!

ఉ.

కల్లరి కేల నిక్కమును? ఘాతకమర్త్యుని కేల ధర్మమున్?
ప్రల్లరి కేల నీతులును? పాపశరీరున కేల మోక్షమున్?
......................................................................
..............తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

70

భావం:

దయాసముద్రుడవయిన శ్రీ తరిగొండ లక్ష్మీనరసింహదేవా! అబద్ధాలాడే స్వభావం గలవానికి సత్యంతో పని లేదు. క్రూరమైన పనులు చేసే అలవాటు గల మనుజునికి ధర్మాచరణతో పని లేదు. పరుషవాక్కులు పలికేవానికి నీతులతో నిమిత్తం లేదు. అలాగే, పాపకర్మలు చేసే వానికి మోక్షచింతన అవసరం లేదు కదా!

ఉ.

ముడ్డికిఁ గాటు కేమిటికి? ముక్కిడిదానికి ముక్కరేల? బల్
గ్రుడ్డుల కేల [14]చల్వలును? గుక్కల కేలను చీని పల్లమున్?
.......................................................................
................తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

71

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనరసింహదేవా! ముడ్డికి కాటుక అవసరం లేదు. ముక్కు లేని వ్యక్తికి ముంగర అనే అలంకారం అక్కర లేదు. పుట్టుగ్రుడ్డివారికి చల్లదనాన్ని కలిగించే కళ్లజోడుయొక్క ఆవశ్యకత లేదు. అలాగే, పట్టుతో నిర్మించిన జీను కుక్కలకు అవసరం లేదు కదా!

ఉ.

మించుల వంటి భోగములు, మేఘమువంటిది రాజచిత్తమున్,
మంచు విధంబు.............................................................
.............................................................................
..................తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

72

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనృసింహదేవా! ఇహలోకసౌఖ్యాలు మెఱుపులవలె అస్థిరమైనటువంటివి; రాజులచిత్తం మేఘంవలె మిగుల చంచలమైనటు వంటిది. సంపదలు మంచుసమూహంవలె కరిగి అంతరించిపోయేటటువంటివి.

(కాబట్టి, తెలివిగల మనుజుడు మనుగడ సార్థకమయ్యే మార్గాన్ని గూర్చి ఆలోచించాలి కదా!)

చ.

గరిమను హాని, వృద్ధియును గానఁగ లేక మదాంధకారుఁడై
పరఁగఁగ దండకాటవికి .................................
..............................................................
..............తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

73

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనరసింహదేవా! అహంకారం చాలా చెడ్డది కదా! అహంకారమనే అంధకారం తనను ఆవరించియుండినందువలననే రాబోయే కీలుమేళ్లను ఊహింపజాలక (రావణుడు సీతాదేవిని అపహరించేందుకై దండకారణ్యానికి బయలుదేరి వెళ్లినాడు కదా!)

(అందువల్లనే తత్ఫలితాన్ని తరువాతి కాలంలో పూర్తిగా అనుభవించినాడు కదా!)

చ.

కలిగిన వారికిన్ కలిమి గల్గిన వారలు ఈవు లిత్తు రా
కలిమియ లేనివారు తమకల్గినయంతలొ............
.................................................................
..............తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

74

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనృసింహదేవా! చిత్తగింపుము! కలిమి గలవారు కలిమి గల్గినవారలకే దానా లిస్తారు. అదేమీ గొప్ప కార్యంకాదు. కలిమి లేనివాళ్లు (పేదవారు) తమకు ఉండినంతలో నిరుపేదలయిన వారికి దానాలు చేస్తే అదే నిజమైన ధర్మాచరణ అవుతుంది కదా!

చ.

బలిమిని రచ్చలోఁ గినిసి భాగ్యము గల్గినవాఁడు దబ్బఱల్
పలికిన నిక్కమండ్రు, మఱి భాగ్యముఁ గాననివారు నిక్కమున్
పలికిన దబ్బఱందు, రిటువంటిది కల్మి ధరిత్రి మీఁదటన్,
కులమున మిండఁడాయెఁ; దరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

75

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనరసింహదేవా! ఇహలోకంలో కలిమికి గల ప్రాముఖ్యాన్ని తమకు విన్నవిస్తున్నాను; కృపతో చిత్తగించు!

సంపద గలవాడు సభలో ప్రవేశించి, గట్టిగా అబద్ధాలు మాట్లాడినా, అవన్నీ నిజాలని ఎల్లరూ వాకొంటారు. మఱి నిఱుపేద యైనవాడు సత్యమే పలికినప్పటికీ, అది అసత్యమని అందరూ ఏకగ్రీవంగా అంటారు. కాబట్టి, ఈ భూమిపై (ఈలోకంలో) కలిమికి ఇంతటి బలిమి నెలకొనివుంది. మొత్తంమీద, ఈ ప్రపంచంలో కలిమి గలవాడే ఉత్తమ కులస్థుడుగా పరిగణింపబడుతూవుంటాడు. (ఇహలోకంలో కలిమికి గల బలిమి ఇంత గొప్పదని తాత్పర్యం).

చ.

కలియుగమందు నిక్కముగఁ గల్లలు తోఁచె, నిజంబు కల్లలై
బలిమిగఁ దోంచసాగె, మఱి ..................................సత్
..........................................................................
కులము లసత్యమాయెఁ; దరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

76

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనృసింహదేవా! కలియుగం యొక్క స్వభావాన్ని, ప్రభావాన్ని కాస్త చిత్తగింపుమా! స్వామి! ఈ కలికాలంలో అసత్యాలు సత్యాలుగా, సత్యాలు అసత్యాలుగా రూఢిగా గోచరిస్తూవున్నాయి. అంతేగాక, ఈకలియుగంలో 'ఉత్తమ కులాలు' అనే మాట (ఉత్తమమైన ఆచరణ లేనందువల్ల) అబద్ధమైపోయింది కదా! (అనగా, అర్థంలేని దయ్యిందని అభిప్రాయం.)

(ఇందులో కలిప్రభావాన్ని సూచించడం కవయిత్రియొక్క ముఖ్యోద్దేశంగా గ్రహించదగివుంది.)

ఉ.

ధర్మమె శాశ్వతంబనుచుఁ దప్పక యెన్నుచునుండువాఁడు ఏ
కర్మవిరక్తుఁడై, యొనరఁగాను ధరిత్రిని కీర్తిమంతుఁడై,
నిర్మలచిత్తుఁడై యెసఁగి నీ పదపద్మములందుఁ జేరు; నో
కూర్మశరీర! స్వామి! తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

77

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనరసింహదేవా! దేవకార్యార్థమై ఒకప్పుడు కూర్మశరీరాన్ని ధరించియుండిన ఓ స్వామీ! ధర్మమార్గమే సుస్థిరమైనట్టిదని త్రికరణశుద్ధిగా విశ్వసించి, అలా నడచుకొంటూ వుండే మానవుడు భవబంధాన్ని పెంపొందించే ప్రారబ్ధకర్మలనుండి త్వరగా విరక్తిని పొందగలడు. అలా విరక్తుడైనవాడు ఈ లోకంలో గొప్ప కీర్తిని గడించి, నిర్మలమయిన మనస్సు గలవాడై, తుదకు ఆ లోకంలో మీ పాదకమలాలను చేరుకుంటాడు. (ధర్మాన్నే నమ్మి చరించేవాడు ఇహంలో కీర్తిని, పరంలో ముక్తిని పొంది ధన్యు డౌతాడనేది సారాంశం).

చ.

సరఁగున నాత్మలోపలను సద్గురుఁ గాంచినవాఁడు క్రమ్మఱన్
అరుగఁడు దుర్గుణంబులకు, నందుకు సాదృశ మేనుఁ జెప్పెదన్
మఱి కదళీఫలంబుఁ దగమక్కువతోడ భుజించు కీరముల్
కొఱుకునె ముష్టికాయఁ? దరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

78

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనరసింహదేవా! సద్గురుడవు, జగద్గురుడవు అయిన నిన్ను ఏ మనుష్యుడు తన ఆత్మలో సందర్శిస్తాడో, అటువంటి సుకృతి మళ్లీ చెడుగుణాలవైపు వెళ్లడు. (చెడు గుణాలను చేపట్టడని భావం). ఇందుకు ఒక దృష్టాంతాన్ని తమకు మనవి చేస్తున్నాను; దయతో చిత్తగించు! పరిపక్వమైన అరటిపండ్లను ఆరగించిన రామచిలుకలు ఎక్కడైనా, ఎప్పుడైనా విషముష్టికాయలను (తినవలెననే కాంక్షతో) కొఱుకుతాయా? (కొఱకనే కొఱకవనేది నిశ్చయం).

చ.

అలరు విధిన్, నిషేధమును నాత్మకు లే; దిటు లెంచిచూడ, నీ
కలఁకలు మానలేకను వికారములైన ప్రపంచమాయచే
బలిమిగఁ జిక్కి, భేదములు పల్కుటెగాని, మహాత్మ! యాత్మకున్
కులమును, గోత్రమేది? తదరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

79

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనృసింహదేవా! మహాత్మా! లెస్సగా ఆలోచించి చూస్తే, ఆత్మస్వరూపానికి ఫలానాకార్యం చేయదగినది(విధి), ఫలానా పని చేయదగనిది (నిషేధం)- అనే రెండూ లేవు. అయితే, ఈ యాత్మ ప్రపంచానికి సంబంధించిన మాయలో గాఢంగా చిక్కుబడియున్నందువల్లనే ప్రతివ్యక్తినీ కులం, గోత్రం- ఇత్యాదుల ఆధారంతో భిన్న భిన్నంగా పరిగణించటం జరుగుతున్నది గాని, నిజం ఆలోచిస్తే ఈ ఆత్మ కులమూ, గోత్రమూ- అనే ఈ రెండు భేదాలూ లేనిది; ఈ రెండు భేదాలకు అతీతమై ఉంది కదా?

ఉ.

పుణ్యుఁడయైన సద్గురుని పూజ [15]నిరంతముఁ జేసి, భక్తిచే
గణ్యము సేయ, కాగురునిఁ గండలుగాఁ దెగఁగోసి, మోక్షమున్
గణ్యముఁజేసి, ముక్తియను కాంత వినోదముఁ జూడ, వేఱ షా
ఢ్గుణ్య మెఱుంగలేఁడు; తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

80

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనరసింహదేవా! అవధరింపుము! మనుష్యుడు పుణ్యాత్ముడైన ఉత్తమగురుపుంగవుణ్ణి నిరంతరం శ్రద్ధతో సేవించి, ఆయనయందలి భక్తివలన ఏమాత్రమూ సంకోచింపకుండా, ఆ గురువర్యుని నిజాయితీని నిశితంగా పరిశోధించి, ఆయనయొక్క అనుగ్రహవిశేషంచేత మోక్షమనే యువతి తోడి వినోదాన్ని పడయజాలిన అదృష్టశాలి వేతే షడ్గుణాలకొరకు- అనగా ఐశ్వర్యం, వీర్యం, యశస్సు, శ్రీ, జ్ఞానం, వైరాగ్యం- అనే ఆఱు దివ్యగుణాలకొరకు ఎదురుచూడక, ఆనందమయుడై అలరారుతూవుంటాడు.

ఉ.

వేధ కుసంశయంబులును వీడి నిజస్థితి నుండి, భక్తిచే
సాధకమైన యా నిగమసారములో రుచిఁ జూడలేరు, స
ద్బోధ వినంగలేరు, తమబు ద్ధొకచోటను నిల్పలేరు, దుష్
క్రోధము మానలేరు; తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

81

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనృసింహదేవా! ప్రపంచంలో కొంతమంది తమ మనస్సులను పీడిస్తూవున్న అల్పసందేహాలను విడిచి, నిజస్థితియందు నిమ్మళంగా ఉండలేరు. కనుక, భక్తిభావంతో సాధింపదగిన వేదసారం (తత్త్వజ్ఞానం) యొక్క రుచిని తెలిసికోజాలరు. అలాగే, ఉత్కృష్టమయినటువంటి ఉపదేశాన్ని సైతం వినజాలరు. అట్లే, తమ బుద్ధిని ఒకేచోట కొంచెంసేపైనా నిల్పటానికి అశక్తులై ఉంటారు. వాళ్లు మిక్కిలి చెడుదైన కోపగుణాన్ని మాత్రం నిగ్రహించుకోలేరు. (అటువంటి సంశయాత్ములకు నీ దయ ఒక్కటే శరణ్యం స్వామి!).

ఉ.

చూపు నిజంబుచేసి యొకచోటనె చక్కఁగఁ జూడలేరు, కన్
పాపల మధ్యమందుఁ బరబ్రహ్మకళంతయు నిల్పలేరు, సం
తాపము మానలేరు, నొకదాఁటుగ నాత్మఁ గనంగలేరు, ఆ
కోపము నిల్పలేరు; తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

82

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనృసింహదేవా! (కడచిన పద్యంలో పేర్కొన్నవారిలాగానే), మఱికొందఱు మానవులు తమ దృష్టిని ఏకాగ్రంగా కేంద్రీకరించి ఒకే చోట సూటిగా, స్థిరంగా చూడజాలరు; అలాగే, కంటిపాపల నడుమ పరబ్రహ్మకళను చక్కగా ధారణ చెయ్యజాలరు. నిరంతరం తమ మనస్సుల్లో చింతిస్తూ వుండడం మాత్రం మానుకోలేరు. ఉత్సాహవంతులై ఒక ఊపులో తమలోని ఆత్మస్వరూపాన్ని కనుగొనలేరు. తమలోని కోపాన్నిమాత్రం అదుపుచెయ్య జాలనివారై ఉంటారు. అటువంటివారలకు నిర్వ్యాజమైన నీ దయయే దిక్కు కదా? దేవా!).

ఉ.

బోధశరీరుఁ జేరి తనబొందిన నుండు మహాత్ముఁ గాంచి, బల్
సాధుల సేవఁ జేయుచును, జాలఁగ నింద్రియకాంక్ష మానుచున్,
మాధవు నాత్మ నెన్నుచును మన్న విభుం డటు మర్త్యకోటిపైఁ
గ్రోధముఁ నిల్పఁబోఁడు; తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

83

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనృసింహదేవా! సుజ్ఞానియైన గురువర్యుణ్ణి సమీపించి, ఆ మహనీయుని ఉపదేశాన్ని పాటించి, తనలో నెలకొనివున్న ఆత్మస్వరూపుణ్ణి దర్శించి, అనంతరం లోకంలోని సాధు, సజ్జనుల సేవలు చేస్తూ, సమస్తజ్ఞానేంద్రియ, కర్మేంద్రియాల కాంక్షలను నిగ్రహించుకొంటూ, భగవానుణ్ణి నిత్యమూ మనస్సులో ధ్యానిస్తూ, సాటిమానవులపై కోపగించుకోనట్టి మనుజుడు సర్వశ్రేష్ఠుడు. (అలాంటి మానవుడు 'జీవన్ముక్తుడు'గా పరిగణింపబడుతుంటాడనేది సారాంశం).

ఉ.

భేదము లేక, సర్వము నభేదముగాఁ బరిణామపూర్ణుఁడై,
బాధకదేహమందు బహుభావము దోఁచి సదాస్వరూపుఁడై
మోదముఁ జెందుచుండఁగను, పొందుగ నా సుధ జీవి యింకఁ గా
కోదరమంత గ్రోలుఁ; దరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

84

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనృసింహదేవా! చిత్తగించు! జీవుడు ఐహికములైన అనేకబాధలతో గూడియున్న ఈదేహంలో ఉంటూవున్నప్పటికీ, స్వ, పరభేదభావన లేనివాడై, సమస్తం ఆ భగవంతుని స్వరూపంగానే పరిపూర్ణంగా సంభావిస్తూ, సహస్రారంనుండి స్రవించే అమృతాన్ని కుండలినీయోగం ద్వారా పానంచేస్తూ, సదా ఆనందస్వరూపుడై మోక్షసామ్రాజ్యాన్ని చూఱగొంటూ వుంటాడు కదా?

ఉ.

ముట్టని దూరమేఁగి, యట మూఁడు దినంబులు బైట నుండి, యా
ముట్టెడఁ బాపఁబూని బహుముఖ్యతరంబుగ బొంది నీళ్లలోఁ
బట్టుగ ముంచివేసినను, పన్నుగ దేహికి ముట్టు పోవునే?
గుట్టొకటుండఁగాను, తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

85

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనరసింహదేవా! దేహి (వనిత) నెలకొక మాఱు ముట్టైన వెంటనే ఎవ్వరిని తాకకుండా మూడురోజులు ఇంటికి దూరంగా ఉండి, అనంతరం ఆ ముట్టుదోషాన్ని నివారించుకోవటానికై తన శరీరాన్ని నీళ్లలో పూర్తిగా ముంచి తేల్చి శుభ్రం చేసినప్పటికీ, బొంది ఉన్నంతకాలం ఈ ముట్టు దేహిని విడిచి దూరంగా పోదు కదా! (కాబట్టి, ఈ ముట్టుదోషాన్నుండి శుచి కావటంలో అతిగా ప్రవర్తించరాదని, ఆర్భాటం పనికిరాదని అభిప్రాయం).

చ.

ఇదివరదాఁక దేహముల నెన్ని ధరించితి? నెన్ని పోయెనో?
మది నినుఁ బాయనేరకను మాయను దానికిఁ జిక్కియుంటి, నీ
పదములు నేఁడు గంటి; హరి! పట్టుగ నా కిటు బ్రహ్మవిద్యలోఁ
గొదవలు సేయకియ్య! తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

86

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనృసింహదేవా! ఓ శ్రీహరీ! ఈ నా మనవిని కృపతో చిత్తగించు! నేను ఇంతవరకు ఎన్నిదేహాలను ధరించియుండితినో? (ఎన్ని జన్మము లెత్తితినో?) ఎన్నిజన్మలు గడచిపోయినవో? తెలియదు. ఈ జన్మలో నేను మాయకు చిక్కియున్నప్పటికీ, మనస్సులో నిన్ను విడువకుండా (నీ స్మరణ గలిగి) ఉన్నాను. నేడు నీ పాదపద్మాలను దర్శింపగలిగినాను! కనుక, పరబ్రహ్మకు సంబంధించిన ఆధ్యాత్మికజ్ఞానాన్ని నాకు ఏ కొదువ లేకుండా అనుగ్రహించు! (పరబ్రహ్మవిద్యను పరిపూర్ణంగా ప్రసాదించు తండ్రీ!).

ఉ.

మర్కటరాజపాల! నిను మానసమందుఁ దలంచు పుణ్యముల్
శర్కర, పాలు, వెన్నయును జాల భుజించిన రీతిఁ దోఁచు;
యర్కకులాభిచంద్ర! బలు ఆఁకలి దీరును; రాఘవేంద్ర! నా
కోర్కెలు చెల్లెనయ్య! తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

87

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనృసింహదేవా! వానసరాజైన సుగ్రీవుని రక్షించిన స్వామీ! నిన్ను మనస్సున స్మరించినంతనే, ఆ పుణ్యంచేత చక్కెర, వెన్న, పాలు తృప్తిగా భుజించినంతటి సంతోషం కలుగుతున్నది. సూర్యవంశమనే పాలసంద్రానికి పరిపూర్ణచంద్రుడవైన ఓ రాఘవేంద్రా! అలాగ నిన్ను స్మరియించినంతట నా అమితమైన ఆకలి తీరుతున్నది. నా కోరికలన్నీ సఫలమైనాయి! అలాంటి కరుణామయుడవైన నీకు నా ప్రణామాలు!

ఉ.

[16]పాటగు నన్నమున్ విడిచి పత్రము లెప్పుడు మేయనేల? బల్
ఏటికిఁ గట్ట వేసినను నెన్ని దినంబులు నిల్చుఁ దోయముల్?
బూటకమంతె కాదె? మఱి పొందుగ జన్మము లెత్తుటెల్ల నీ
కూటికిఁ గాదె? స్వామి! తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

88

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనరసింహదేవా! అవధరించు! అనువయిన ఆహారాన్ని విడిచిపెట్టి, మనుజుడు (తపస్సు పేరిట) ఆకులు భక్షించడం దేనికి? నిరంతరం వేగంగా ప్రవహిస్తూవుండే జీవనదికి కట్టను వేస్తే, అలాంటి కట్టవల్ల నీళ్లు ఎన్నాళ్లు నిలిచివుంటాయి? అలాగే, ఆకులు మేయడం కూడా ఒకవిధంగా బూటకమైనదే (తాత్కాలికమైనదే) కదా! మఱి ఈ జీవుడు పదే పదే జన్మ లెత్తుతూవుండటం కూడా ఆకూటి కొరకే గదా? స్వామీ! (కాబట్టి, కపటమైన ఆచరణకన్నా, మనస్సును నిలుపడం ముఖ్యమనేది సారాంశం.)

ఉ.

భోగము, భాగ్యమున్ గలిగి, పూర్వము నెవ్వరికైనఁ బ్రేమతోఁ
ద్యాగగుణంబు గల్గియును దానముసేయఁగ లేని గాసిచేఁ
దాఁకి దరిద్రభూత మటు తప్పక నేఁటికి వెంట నంటె; నూఁ
కో గతి యెవ్వ? రండ్రు, తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

89

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనృసింహదేవా! పూర్వజన్మప్రారబ్దానికి నిదర్శనమైన ఈ సత్యాన్ని దయచేసి చిత్తగించు! మానవుడు వెనుకటి జన్మలో భోగ, భాగ్యాలతో తులతూగుతూ వుండికూడా, త్యాగగుణం లేనందువల్ల, ప్రీతితో (అర్హులైన వారెవ్వరికీ) దానం చెయ్యని పాపంచేత, ఈ జన్మలో ఆ జీవుణ్ణి దారిద్య్రమనే పిశాచం వెంటనంటడం తప్పదు. అలా దరిద్రుడయిన వాని మొఱను ఆలకించేవాళ్లుగానీ, వాడు దైన్యంతో విన్నవించే పల్కులను సానుభూతితో ఊకొట్టుతూ వినేవాళ్లుగానీ ఉండరు కదా! అప్పుడు తన పల్కులను వినేవారు లేరని చింతించి ప్రయోజనం లేదని అభిప్రాయం. (కాబట్టి, మానవుడు తనకున్నంతలో ప్రీతితో దానం చెయ్యడం ద్వారా ఇతరులకు సహాయం చేస్తూ పుణ్యాన్ని సంపాదించవలెనని సందేశం!)

ఉ.

పెట్టినవారికిన్ మఱియుఁ బెట్టిన యంతయె గల్గు; నేటికిన్
వట్టి దురాశలన్ దగిలి వాజతనంబున నన్యసంపదల్
గట్టిగఁ జూడఁజాలకను కచ్చలు సేయును? నోరు నొవ్వఁగాఁ
గొట్టిన బొందరయ్య! తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

90

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనరసింహదేవా! పరుల సంపదను గాంచి ఓర్వలేని దురాశాపరుణ్ణి గూర్చి యిపుడు చిత్తగించు! స్వామీ! ('పెట్టినవారికి పెట్టినంత మహాదేవ!' అన్నట్లు) పూర్వజన్మలో తాను పెట్టిన దానికి (దానం చేసినదానికి తగినంత ఫలితమే ఈ జన్మలో లభిస్తున్నదని తెలిసికోజాలక, అసూయాపరుడు ఇతరుల సంపదలను గాంచి సహింపలేక, సంపన్నులతో అనవసరంగా, వృథాగా, గట్టిగా అరుస్తూ, కలహిస్తూవుంటాడు. అటువంటివాని నోరు అలాగ, వ్యర్థంగా అరవడానికి అవతరించిన గుంటలాంటిదికదా! తండ్రీ!

ఉ.

పట్టుగ నీశ్వరుండు తనపాలిటనుం డిపు డిచ్చినంతలోఁ
దిట్టక దీనదేహులను తేటగ లాలన చేసి, యన్నమున్
పెట్టు వివేకి మానసముఁ బెంపొనరించుచు నూరకుండినన్,
గుట్టుగ లక్ష్మిఁ బొందుఁ; దరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

91

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనరసింహదేవా! వివేకం గల మానవుడు తనకు భగవంతుడు ప్రసాదించినంతలో అంగవికలురు, అనాథలు, నిరుపేదలు అయిన దీనజనులను కసరుకొనక, ఆప్యాయతతో లాలిస్తూ వాళ్లకు అన్నం పెడుతుంటాడు. ఆ విధంగా అన్నదానం కొనసాగిస్తూ, తన మనస్సులో ప్రశాంతతను పెంపొందించుకొంటూ, నిమ్మళంగా నివసిస్తుంటాడు. అట్లు నెమ్మదితో అన్నదానం కావించే ఆ సజ్జనుణ్ణి సంపదలకు అధిదేవతయైన శ్రీమహాలక్ష్మి గుట్టుచప్పుడు కాకుండా (ఏలాటి ఆడంబరమూ, ప్రచారమూ లేకుండానే) వచ్చి వరిస్తుంది. (అతని యింటిలో నెలకొంటుందని అభిప్రాయం.) (దీనులకు నిరాడంబరంగా కావించే అన్నదానానికి ఇంతటి మహిమ కలదని తాత్పర్యం.)

ఉ.

బొందియె శాశ్వతం బనుచు
బోరున రొక్కముఁ గూర్చు లోభినిన్
పొందుగ నూరిలోఁ గినిసి 'భోజుఁడ'వంచును భట్లు వేడినన్,
'ఎందుకు వీరు వచ్చి? రిది యేమి మహాప్రళయం?' బటంచు బల్
గొందుల దూరునయ్య! తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

92

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనృసింహదేవా! ఇపుడు లోభియైన మనుజుని స్వభావాన్ని నివేదిస్తున్నాను, చిత్తగించు! లోభివాడు ఈ శరీరమే స్థిరమైనదని విశ్వసించి దండిగా ధనాన్ని సమకూర్చుకొంటాడు. అలాంటి పిసినిగొట్టును కవిత చెప్పుతూ పద్యాల్లో ప్రశంసించే భట్టులు సమీపించి, 'దానగుణంలో మీరు భోజమహారాజులాంటి వారు!'- అని ప్రార్ధింపగా, 'నేను ఊళ్లో ఉండగా కొంపలు మునిగిపోయేంత ప్రళయంలాగా ఇప్పుడే వీళ్లెందుకు దాపురించినా రబ్బా?' అని అనుకొంటూ వాళ్లకు కనిపించకుండా శీఘ్రంగా సందుల్లో, గొందుల్లో దాగుకొంటాడు. (లోభివాని స్వభావం ఇందులో అత్యంత సహజంగా ఆవిష్కరింపబడింది.)

ఉ.

అంకితమైన కీర్తికిని నాలయమైనటువంటివాఁడ యా
శంకరుఁ డిచ్చినంతయు విచారము సేయక, యేకభక్తితోఁ
బొంకముగాను రచ్చలను ‘భోజుఁడ’ వంచును బల్కువారికిన్
గొంకక, యీవు లిచ్చుఁ; దరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

93

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనృసింహదేవా! అవధరింపుము! చక్కగా పేరుప్రతిష్ఠలు గడించిన ఉత్తముడు అధికంగా తనకు సంప్రాప్తింపజేయలేదే!- అనే ఆలోచన మానుకొని, ఆపరమేశ్వరుడు తనకు ప్రసాదించిన సంపదతో సంతుష్టుడై, చలించని దైవభక్తితో గూడినవాడై, సభల్లో తనను పొగడేవారి ప్రశంసలకు ఉబ్బిపోక, నిబ్బరంగా, తగినవాళ్లకు తగినరీతిగా దానధర్మాలు చేస్తూ వుంటాడు. (అలాంటి సహజదానపరుడే సత్యమైన కీర్తికి నిలయమైనవాడని సారాంశం.)

ఉ.

ఎవ్వరు లేరు జీవునికి, నెవ్వరు శత్రువు? లెవ్వ రాప్తులున్
ఎవ్వరు నిందసేయుదురు? ఎవ్వరు మెచ్చుదు రెన్నిభంగులన్?
ఎవ్వరియందు సంతతము నేర్పడ జీవుఁడు నిండియుండుఁ; దాఁ
గ్రొవ్వును, భేదమేల? తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

94

భావం:

దయాసముద్రుడవయిన శ్రీ తరిగొండ లక్ష్మీనరసింహదేవా! చిత్తగింపుము! ఎన్నిరీతుల ఆలోచించి చూచినా, ఈ జీవుడే అందరిలోనూ నిండియున్నాడు గనుక, ఈ జీవునికి ఎవరూ శత్రువులు కారు; ఎవరూ మిత్రులు కారు. అలాగే, ఈ జీవుణ్ణి నిందించేవారుగానీ, ప్రశంసించేవారు గానీ ఎవ్వరూ లేరు. యథార్థ మిదిగా ఉండగా, ఒక్కొక్క మనుష్యుడు “నీవు నేను”- అనే భేదభావంతో అహంకరించి, సతమతం అవుతూవుండడం దేనికి? (తత్త్వం ఎఱిగిన జ్ఞానికి సర్వం భగవత్ స్వరూపమే కాబట్టి, అలాంటి భేదభావన తగదని తాత్పర్యం.)

ఉ.

పాటిగ నగ్నిసాక్షిగ వివాహమయైన పతివ్రతామణిన్
నీటున నొల్లకన్, మిగులనేరము లెన్నుచుఁ, గొట్టి తిట్టుచున్,
ధాటిగ నన్యకాంతను ముదంబున రక్షణచేసి, దానితోఁ
గూటమి పాపహేతు; తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

95

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనృసింహదేవా! చిత్తగించు! ఈ లోకంలోని మనుష్యుల్లో ఒక్కొక్కడు అగ్నిసాక్షికంగా తాను పరిణయమాడిన పతివ్రతయైన భార్యామణిని అంగీకరింపక, ఆమెపై లేనిపోని నేరాలను, దోషాలను ఆరోపిస్తూ, ఆ నేరాల నెపంతో ఆ ఉత్తమురాలిని అనేకవిధాల తిడుతూ, కొడుతూ ఉంటాడు; అంతకంటే ధీమాగా పరస్త్రీని ఉంచుకొని, సంతోషంగా పోషిస్తూ వుంటాడు. అలా పరకాంతతో కూడివుండటం పాపహేతువు కదా? (అటువంటి పాపాత్ముడు ఆ పాపఫలితాన్ని అనుభవించక తప్పదని హెచ్చరిక!)

ఉ.

తల్లికిఁ గాని బిడ్డలును, దైవము నెంచని మర్త్యకోటులున్,
చుల్లరబుద్ధితోడఁ బరసుందరిఁ గోరుచునుండువారలున్
తల్లడమంది నాఁటికినిఁ దప్పక యా యమధర్మరాజుచేఁ
గొల్లకుఁ బోవువారు; తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

96

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనరసింహదేవా! ఆలకించు! కని పెంచిన తల్లిని సరిగా చూడని కుమారులూ, భగవద్ భక్తిలేక, భగవంతుణ్ణి లక్ష్యపెట్టక జీవించే మానవులూ, పోతరించిన పందులవలె మదించియుండి, కామంతో పరస్త్రీలను సదా కాంక్షిస్తూ వుండేవాళ్లూ- ఒకనాటికి - అనగా, అంత్యదశలో - నరకాధిపతియైన యమధర్మరాజుచేత వాళ్లు చేసిన ఆ యా పాపకార్యాలకు అనుగుణంగా నిర్దాక్షిణ్యంగా శిక్షింపబడుతారు. (తల్లిదండ్రులను ఆదరించడం, దైవాన్ని ఆరాధించడం, పరస్త్రీ వైముఖ్యం - మున్నుగాగల సత్ప్రవర్తనలమూలంగా మనుజుడు పుణ్యాన్ని గడించాలనేది సందేశసారాంశం.)

ఉ.

కాయముమీది యాస, తనకైన జనంబుల మీఁది యాశలన్
మాయని నిశ్చయించి, తనమానసమందును ముక్తిసాధనో
పాయముఁ జేసి, సద్గురుని పట్టుగ నమ్మియు, మోహపాశముల్
కోయక ముక్తి రాదు; తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

97

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనృసింహదేవా! ముముక్షువగు వ్యక్తి (మోక్షాన్ని పొందగోరేవాడు) అనుసరించవలసిన ఉత్తమ పంథాను మనవిచేస్తున్నాను; దయచేసి ఆదరంతో చిత్తగించు! మోక్షకాంక్షియైనవాడు శరీరంమీది ఆశను, తనకు సంబంధించినవారలపై గల ఆశలను- వాటన్నింటిని మాయ అని నిశ్చయించి, తన మనస్సున ముక్తిని సాధించగల సదుపాయాన్ని దృఢంగా ఆలోచించాలి. అలాంటి సుదృఢమైన ఆలోచనతో, ఉత్తముడయిన గురువర్యుని సన్నిధిని చేరుకొని, ఆయనను పరిపూర్ణంగా విశ్వసించాలి. ఆ గురువర్యుని అనుగ్రహవిశేషంచేత కలిగిన జ్ఞానంతో సంసార వ్యామోహమనే బలమైన బంధాలను (త్రాళ్లను) కోసివేస్తేనే ముక్తి చేకూరుతుంది.

ఉ.

ఇట్టి శరీరమందు నదు లెప్పుడుఁ దీయక పాఱఁగా, మఱిన్
పుట్టిన భూమిలోపలఁ ద్రిమూర్తులు నుండఁగఁ గాననేరకన్,
పట్టుగఁ దీర్ఘయాత్రలకుఁ బామరులెల్లను బోయి; యూరకే
గొట్టుపడంగనేల? తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

98

భావం:

దయాసముద్రుడవయి తరిగొండలో అవతరించియున్న శ్రీలక్ష్మీనృసింహదేవా! అవధరింపుము! ఈ శరీరంలో నదులు నిరంతరం ప్రవహిస్తూనేవున్నాయి. అలాగే, ఈ 'క్షేత్రం'లో త్రిమూర్తులు సైతం నెలకొనియున్నారు. ఇది తెలియలేని కొందరు పామరులు పట్టుదలతో తీర్థయాత్రలకు వెళ్లి, శ్రమపడుతూవుంటారు. (నిజానికి అలాగ ఆయాస పడనక్కర లేదని అభిప్రాయం.)

చ.

మన సొకశుద్ధి లేక, ఘనమాయకు లోఁబడియుండి, నీళ్లలో
మునిఁగి, శరీర మున్నదని పొందుగ నందఱుఁ జూచుచుండఁగాఁ,
గనులటు తేలవేసి, కరకంజములన్ ముకుళించి, మంత్రముల్
గొనిఁగిన ముక్తి రాదు; తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

99

భావం:

దయాసముద్రుడవయి తరిగొండలో విలసిల్లుతూవున్న శ్రీలక్ష్మీనృసింహప్రభూ! మనస్సులో శుద్ధి లేకుండా, మాయకు లోనై, నీళ్లలో మునిగి, నిమీలితనేత్రుడై, చేతులు జోడించి, అందరు తనను చూచే లాగున యాంత్రికంగా మంత్రాలను గొణుగుతూవుంటే ముక్తి రాదు.

(ఇతరుల కొరకై నటించే బాహ్యాచారానికన్నా, మోక్షలబ్ధికి మనశ్శుద్ధి ముఖ్యమని తాత్పర్యం.)

ఉ.

వెన్నయుఁ జేతఁ బట్టుకొని వేమఱు నేయని కూయనేటికో?
పన్నుగ బొందిలోన ఘనభక్తిని జీవి జపంబుసేయఁగా,
నెన్నుచు వ్రేళ్లు సారెకును నేర్పడఁ నెప్పుడు గాఢమంత్రముల్
కొన్ని భజింపనేల? తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

100

భావం:

దయాసముద్రుడవై తరిగొండలో విరాజిల్లుతూవున్న శ్రీ లక్ష్మీనృసింహస్వామీ! చిత్తగింపుము! వెన్నను చేతిలో పెట్టుకొని గూడా "నెయ్యి కావాలె; నెయ్యి కావాలె!"- అని అరవడం దేనికి? (అనగా, అలాగ అరవనక్కరలేదని భావం).

అలాగే, జీవుడు దేహంలో నిరంతరం (ఉచ్ఛ్వాసనిశ్శ్వాసాలరూపేణ) జపం చేస్తూనే వున్నాడు కదా? అలాంటప్పుడు అదే పనిగా చేతివ్రేళ్లు కదలిస్తూ తీవ్రమైన మంత్రాలను పునశ్చరణ చెయ్యడం ఎందుకు? (అవసరం లేదని అభిప్రాయం).

అనగా, ఉచ్ఛాసద్వారా "సః" (సో)- అనే అక్షరాన్నీ, నిశ్శ్వాసద్వారా “హం”- అనే అక్షరాన్నీ ఉచ్చరిస్తూ నిరంతరం (మౌనంగా) జపంచేస్తే చాలునని సారాంశం. దీనికే “హంస" (సో౽హం) మంత్రమని, “అజప”- అని పేర్లు కలవు. ఈ "అజప"ను సాధిస్తే, అంతకు మించింది లేదని యోగవిద్యకు సంబంధించిన గ్రంథాలు వివరిస్తున్నాయి.

(జీవుడు కావించే ఉచ్ఛాసనిశ్శ్వాసక్రమాన్ని పైరీతిని జపకార్యంగా సమన్వయించుకోగలిగితే చాలునని ఈ కవితాతపస్విని సందేశం!)

ఉ.

ముందటి దోవ గానకను, మూర్ఖులునై బలు జవ్వనంబునన్
సుందరులైన భామినులఁ జూచి మనంబు నపేక్షసేయఁగా,
నిందలు సేయుచున్, పరుల నేరము లెన్నఁగఁ దాము బుద్ధిలోఁ
గుందుచు నుందురయ్య! తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

101

భావం:

దయాసముద్రుడవయి తరిగొండలో వెలసియున్న శ్రీలక్ష్మీనరసింహదేవా! మూర్ఖజనులు కొందరు భవిష్యత్తులో తాము నడుచుకొనదగిన సన్మార్గాన్ని తెలిసికోలేనివారై, సుందరీమణులగు యువతులను గాంచి మనస్సులో కోరుకొంటూవుంటారు. ఆ యువతీమణులపై నిందలను సృష్టిస్తూవుంటారు. అలాగే ఎల్లవేళలా ఇతరులదోషాలను ఎన్నడంలోనే కాలం గడపుతూ, మలినబుద్ధులై, మనశ్శాంతి లేనివారై యుంటారు.

(అలాంటి కలుషితబుద్ధులను ఉద్ధరించగల్గిన ఉత్తమసదుపాయం తరిగొండ లక్ష్మీనృసింహుని యందలి భక్తి ఒక్కటే - అనేది సందేశసారాంశం).

ఉ.

నిన్ననె కంటి నీ మహిమ నీరజలోచన! దివ్యతేజ! నీ
సన్నిధి దగ్గఱాయెను, విచారము మానెను, ముక్తి కల్గె నౌ!
పన్నుగ నవ్విధంబునను భావములోపల నీదు మూర్తిఁ గన్
గొన్నదె భాగ్యమయ్య! తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

102

భావం:

దయాసముద్రుడవై తరిగొండలో నెలకొనియున్న శ్రీలక్ష్మీనృసింహదేవా! కమలాక్షా! దివ్యతేజస్స్వరూపా! నిన్ననే నీ మహిమావిశేషాన్ని దర్శించాను. నీ సన్నిధి నాకు దగ్గ రయ్యింది. అందుచేత నా విచారమంతా తొలగిపోయింది. మోక్షం అందుబాటులోకి వచ్చింది. ఈ విధంగా మనస్సులో నీ దివ్యమంగళమూర్తిని కనుగొన గల్గిన నా భాగ్యమే భాగ్యము కదా! స్వామీ!

చ.

ఎలమినిఁ బెంపు, సొంపొదవ నింజెటి వంశజుఁడైన వేంకటా
చలపతి నామధేయుని నిజాంగన వెంగమ సత్కవీంద్రు లి
మ్ముల ముదమంద నీ శతకమున్ రచియించి యొసంగె మీకుఁ, గో
ర్కులు సమకూర్చవయ్య! తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

103

భావం:

దయాసాగరుడవయి తరిగొండలో నెలకొనియున్న శ్రీలక్ష్మీనరసింహదేవా! ఇంజేటి వంశీయుడైన వేంకటాచలపతియొక్క నిజాంగనయైన వెంగమ్మ సత్కవీంద్రులు సంతోషించే విధంగా ఈశతకాన్ని రచించి, మీకు సమర్పించింది. ఈ కవయిత్రి కోరికలను (ముక్తిని) కృపతో ఇతో౽ధికంగా సమకూర్చుమా! స్వామీ!

  1. ఈ శ్లోకం వెంగమాంబ తిరుమలక్షేత్రంలో రచించిన కృతుల్లో అగ్రగణ్యమయిన "శ్రీ వేంకటాచలమాహాత్మ్య" మనే పద్యకావ్యంయొక్క ప్రారంభంలో ఉంది. స్తుతిసుందరమైన ఆ శ్లోకాన్ని కవయిత్రి తరువాతి కాలంలో ఈ శతకానికి మొదట తిలకాయమానంగా చేర్చినట్లు భావింపవీలౌతున్నది.
  2. 'భానుఁడు + వచ్చుటకు' - అని పదవిభాగము
  3. 'కూడి+ఎడఁబాయలేఁడు' అని పదవిభాగము.
  4. 'కింకరులు+వచ్చి' - అని పదవిభాగము
  5. 'మాయ+అనుదానికి' - అని పదవిభాగము
  6. ‘వట్టి+ఆసలు+అనేటి”– అని పదవిభాగము
  7. ‘నిశ్చయము+అంచుకత్తితోన్'- అని పదవిభాగము
  8. 'మహిమ+ఏమని+అందున్' అని పదవిభాగము
  9. 'మేటి+అగు' అని పదవిభాగము
  10. 'కావలి+ఉండు' అని పదవిభాగము
  11. 'కావలి+ఉందురు'- అని పదవిభజనము
  12. 'వాసి+అగు’- అని పదవిభాగము
  13. 'మేలు+ఉపచారము' అని పదవిభజనము
  14. ఇక్కడ 'చెల్వలును'? అని ఉంటే 'పుట్టుగ్రుడ్డివారికి యువతులతో నిమిత్తంలేదు' అనే
    అర్ధం వెల్లడౌతుంది. అయితే ఇది కేవలం సూచనమాత్రమే గాని, పాఠాంతరం కాదు.
  15. 'నిరంతరము'- అను అర్థంలో ప్రయోగింపబడింది.
  16. 'పాటి + అగు' అని పదవిభాగము