Jump to content

జైమినీభారతము/పీఠిక

వికీసోర్స్ నుండి
​

పీఠిక

పిల్లలమఱి వంశజుఁడైన పినవీరభద్ర కవి నియోగిబ్రాహ్మణుడు. తండ్రిపేరు గాదయామాత్యుఁడు. తల్లి నాగాంబ. అన్న పెదవీరన్న. భారతీతీర్థు లితని గురువు. ఈతని గోత్రవిషయమై యీ క్రిందిపద్యమువలన నన్నయభట్టుయొక్క భారద్వాజసగోత్రమని యూహింపవలసియున్నది.

మ.⁠

కవులన్ బంకజగర్భసన్నిభుల వక్కాణింతు వల్మీకసం
భవునిన్ వ్యాసునిఁ గాళిదాసు బిలహున్ బాణున్ మయూరున్ శుకున్
భవభూతిన్ శివభద్రుమల్హణుని ఘంటామాఘునిం జోరు భా
రవి మానన్నయభట్టుఁ దిక్కకవి నెఱ్ఱాప్రగడన్ సోమునిన్.

⁠

ఇతని కాలనిర్ణయమును గూర్చి కవిజీవితములలో భారతీతీర్థుల శిష్యుఁ డగుటచే 1300 లగాయితు 1350 వరకు నున్నవాఁడని చెప్పబడియున్నది. ఇతడు భారతీతీర్థుల ప్రియశిష్యుఁ డగుటచే పైకాలమువాడేయని చెప్పవలసియున్నది.

ఇతని కవిత నిరుపమానమైఁ దిక్కన సోమయాజి కవనంబును బోలియుండును. ఇతనిని భారతకవులతోఁ బోల్పవచ్చును. ఇతఁడు జైమిని భారతాశ్వమేధపర్వమునుఁ దెలిగించి సాళువగుండ నృపాలున కంకితమిచ్చెను. ఇతఁడు జైమినిభారతమును దెలిగించు విషయమై యొకచిన్నకథ గలదు. సాళువగుండ నృపాలుఁ డొకనాఁడు నిండుపేరోలగంబున నీ చినవీరన్నతో సల్లాపము లాడుచు,

క.⁠

నామది నిరతము భారత
రామాయణకథలఁ బ్రేమ రంజిలు నందున్
జైమినిభారత మనఁగా
భూమి నపూర్వము పురాణముల గణియింపన్.

⁠


గీ.⁠

ఆపురాణంబుఁ గనఁ దెనుఁగయ్యెనేనిఁ
జెప్ప నేర్చిన కవియుఁ బ్రసిద్ధుఁడేని
తెనుఁగునుడికారమున మించు గనియనేని
కుందనము కమ్మ వలచిన చంద మగును.

⁠

అను జైమినిభారతమునుఁ దెలిగింప సమర్ధత గలిగినవా రెవ్వరనగా తదాస్థానపండితులు కొందఱిపేరులు జెప్పుచు పినవీరన్నయే సమర్ధుఁడని నిశ్చయించిది. రాజు కొలది ​కాలములో గ్రంథము పూర్తి చేసి యీయగల సమర్ధు లెవ్వరన పినవీరన్నయే సమర్ధు డనిరి. ఎంతకాలములో సంపూర్ణమగునని రాజు ప్రశ్నింప కొందఱు సంవత్సరమనియు మరికొంద ఱారుమాసములనియుఁ జెప్పిరి. మూడునెలలకే పూర్తియగునా యని పినవీరన్నను రాజు ప్రశ్నింప 'తమ సెలవగుచో యొకనెలకే పూర్తి జేతు' నని యనెను. అందుల కారాజు తన్నెగతాళి చేయుచుండెనని యెంచి మిగుల గోపంబున 'యొక మాసంబునకు దేకున్నచో' యనుచుండ పినవీరన్న 'మీయిచ్ఛానుసారముగ జేయవచ్చు' ననియెను. సాళువగుండ నృపాలుఁడు వెంటనే కర్పూరతాంబూల మొసఁగి గ్రంథరచన కనుజ్ఞనిచ్చెను. అప్పటినుండియు పినవీరన్న వారాంగన వీటియందే కాలము గడుపుచు భోజనమునకు మాత్రము యింటికి వచ్చుచుండెను.

అన్న పెదవీరన్న తమ్ముడగు పినవీరన్న రాజునొద్ద చేసిన సమయము నాలించి యతిభీతుఁడై యొకపరి పినవీరన్నను జేరి “తమ్ముఁడా! నీవు చిన్నప్పటినుండియు కడు దుడుకుతనముగనే బ్రవర్తించియుంటివి. మీదు మిక్కిలి వారాంగనాలోలుఁడవైయుంటివి. భూపాలురనొద్ద నావిధముగ బ్రతినపట్టవచ్చునా? ఏమి చేయదలంచితివి?” యన యతఁడు నవ్వి “అన్నా! ఆవిషయమై నీ వేమాత్రమును భయపడకుము. ఆవిషయమంతయు నేఁజక్కఁబెట్టువాఁడ' ననుచునే వెలవెలంది వీటిని గూర్చి వెడలిపోయెను.

గడువుదినములు సమీపించినను పినవీరన్న గంట మెత్తి యాకుపై వ్రాసిన జాడ యేమియు పెదవీరన్నకు గనబడలేదు. గడువుదినము రేపనగా మరల పెదవీరన్న తమ్ముని హెచ్చరించెను, ఆనాటిరాత్రి పిన వీరన్న వదినెగారిచే యొకగది నలికించి యందముగ రంగవల్లి దీర్పించి యొక ఆముదపుదీపమును కొంత ఆముదమును నాగదియందు బెట్టించి తా నాగదిలో ప్రవేశించి గడియవేసుకొనియుండెను. అనంతరము కొంతసేపటికి పదిగంటములచే వ్రాయు చప్పుడును గురకలును వినబడుటచే అన్న పెదవీరన్న సందేహనివృత్తికై కొంతకాల మూరకుండి తలుపుసందులోనుండిఁ జూచెను. సర్వాభరణభూషితయైన యొకసుందరాంగి గంటము చేతబట్టి చకచక యాకుపై వ్రాయుట యాతఁడుజూచెను. బావగారు జూచుచుండిరని యాసుందరి గ్రహించి పినవీరన్నను లేపి యంతర్హితయయ్యెను. పినవీరన్నయు మిగిలినభాగము పూర్తి చేసి మరునాటి గొలువుసమయంబునకు అన్నగారితో పోయెను.

రాజును అంతస్వల్పకాలములో నాగ్రంథము పూర్తి చేసినందున మిగుల సంతసించి యాగ్రంథము జదువ ననుజ్ఞ యిచ్చెను. అన్న యగు పెదవీరన్న యామూలాగ్రముగ గ్రంథమును జదివి వినిపించెను. అనంతరము కవి యాశ్వాసాంతమందు జెప్పిన ​

క.⁠

ప్రేమమున శ్రోతవక్తకుఁ
"జామీకరణహయము ధవళచామరములు నా
నామణివిభూషణంబులు
గ్రామముఁ గృప సేయవలయు గ్రంథసమాప్తిన్."

⁠

అనినరీతిగా బహూకరించెను.

అట్టి సమయంబున కొందఱు పండితులు 'ఇంతస్వల్పకాలములో గ్రంథము పూర్తి చేయుట యత్యాశ్చర్యము. ఎట్లు ముగించితి' వని పినవీరన్నను బ్రశ్నింప 'వాణి నారాణియైయుండగా నేమిలోపము? ఈ గ్రంథమంతయు నిన్నటిరాత్రియే ముగింపబడిన' దని చెప్పెను. జగన్మాతయగు వాణిని యీతఁడు తనరాణి యనుచుండెగాన నీతఁడు పండితుఁడుగాడని ఏకగ్రీవముగా ననుచుండిరి.

వెంటనే యశరీరవాణి 'వాణి జగంబులకు మాత. పినవీరన్న పరమేష్ఠియవతారము. గావున వాణి యీతనికి రాణియైనది. ఇంక మీసంశయము వదలుకొనుడు' అనెను. అప్పలుకు లాలించి యందరును నత్యద్భుతముతో యాతనిని కడుంగడు నాదరించిరి.

ఇతనితాతయు, తండ్రియు, అన్నయుగూడ కవులైనట్లు యీ క్రింది పద్యమువలన తెలియును.

క.⁠

తాతయుఁ దండ్రియు నగ్ర
భ్రాతయునుం దాను భువనభాసురకృతి ని
ర్మాతలు పిల్లలమఱి వి
ఖ్యాతునిఁ బినవీరుఁ బోలఁగలరే సుకవుల్.

⁠

ఇతఁడు తనక విత్వమును గూర్చి యీ క్రింది పద్యమును చెప్పియున్నాడు.

ఉ.⁠

అల్లన నిచ్చుచెంగలువలందు రజం బనుకప్పురంబుపైఁ
జల్లఁగఁ జల్లనై వలచుసౌరభముల్ వెదచల్లుభావముల్
పల్లవహస్త చన్నుగవపయ్యెద జీబుగఁ దోచుభాతిగాఁ
బిల్లలమఱ్ఱి వీరన యభిజ్ఞుఁడు చెప్పఁగ నేర్పుఁ గబ్బముల్.

⁠
ఈతఁడింకను శృంగారశాకుంతల, అవతారదర్పణము, నారదీయము, మఖమాహాత్మ్యము, మానసోల్లాససారము అను పుస్తకములు రచించెను. ఈ యైదుపుస్తకములలో నొక్కశృంగారశాకుంతలయే ప్రచారమందున్నది. ఇది చిల్లర వెన్నమంత్రియను నియోగి ప్రభువున కంకితమిచ్చెను. ఇతఁ డీగ్రంథములగాక 'పురుషార్థసుధానిధి' యను మరియొక గ్రంథము రచించినట్టు ఆంధ్రకవులచరిత్రయందు చెప్పబడియున్నది. ​

ఇతఁడు యోగమహిమ గలవాఁడని కవిజీవితములలోని ఈ క్రిందికథవలన తెలియుచున్నది.

ఒకరోజున పెదవీరన్న శివపూజ చేయుచుండగా పినవీరన్న భోజనమునకై వచ్చెను. భోజనమునకు వచ్చిన యాతఁడు నిముషమాత్రంబైన నిలువడనియు, ఆతఁడు భుజించిన శివనైవేద్యము చేయుట కూడనిపని యనితలంచి తన పిల్లలనందరను చెరువునకు గొంపోయి కడుపులోపల వెలుపల శుభ్రముగ కడుగుకొని స్నానము చేయించి రావలసినదనియెను. పినవీరన్నయు నీబాలుర తటాకమునకుం గొంపోయి పొట్టలు చీల్చి కడుపులోపల పైన శుభ్రముగా తోమి యాశవంబుల భుజముపై వైచుకొని యింటి కరుదెంచెను. యాబాలశవంబులఁ జూచి పెదవీరన్న కన్నకడుపుగావున నొకక్కపెట్టున రోదన మొనరించుచుండెను. పెదవీరన్న భార్యమాత్రము మరది మహిమ లెరింగినది గావున యాతని లీలగా నెంచి యూరకుండెను. అనంతరము పినవీరన్నను జూచి "మరదీ పిల్లలను దీసికొని భోజనమునకు రమ్ము" అనియెను. వెంటనే పినవీరన్న యాబాలుర పేర్లతో పిలచిన వారు వచ్చుచుంటిమనుచు పినవీరన్నను జేరిరి. అది జూచి పెదవీరన్న మిగుల సంతసముతో తమ్మునింగూడి భోజన మొనరించెను. తమ్ముని యోగమహిమకు కడుంగడు సంతసించెను. ఇట్టివిచిత్రచర్య లెన్నియో గావించెను. గ్రంథవిస్తరభీతిని నింతటితో విరమించితిని.

ఇట్లు సుజనవిధేయుఁడు,

దేవరకొండ అమన్న శాస్త్రి