జగత్తు - జీవము/జగత్తు

వికీసోర్స్ నుండి

జగత్తు - జీవము

1. జగత్తు

చీకట్లను వెన్నాడుచున్నట్లు నక్షత్రాలొక్కొక్కటే సూర్యాస్తమయంతో బయటపడగా నవరత్నఖచిత వితానంవలె చీకటిరాత్రులలో ఆకాశం కనిపిస్తుంది. వెలుగుచుక్క లట్లు కనిపించునక్షత్రాల కాంతి కోటానకోట్ల మైళ్లదూరమునుండి కోటానకోట్ల సంవత్సరాలతరబడి ప్రయాణంచేస్తూ దిశలు వ్యాపిస్తూంది. దూరానికి విరామం లేదు; కాంతికి విశ్రాంతిలేదు. నక్షత్రాలనడుమనున్న దూరం క్షణక్షణం పెరిగిపోతూంది ; నియతవేగంతో అనుక్షణం కాంతి ఆకాశయానం చేస్తూనే ఉంది. వీటికి హద్దున్నదా ?

జగత్తుకి హద్దులున్నవా ? విశ్వంయొక్క వ్యాప్తిఎంత ?

విశ్వం అనుపదం మనకెంతపరిచితమో దానిభావం మనకంత దురవగాహం. ఆస్తికులు, మతగ్రంధాలు చదివినవారు, చతుర్దశభువనాలని, నరకనాకలోకాలని, యక్షగంధర్వ కిన్నరాది ఉత్తమ జీవులని, ఇంద్రాగ్ని వరుణాదిదేవతలని, సప్తసముద్రాలని, మింట మెరుస్తూ నక్షత్రప్రాయంగానున్న మహాఋషీశ్వరులని మొదలగు లోకాలు, జీవులు, దేవతలు ఈభూమికన్న అన్యమైనవి విశ్వంలో నున్నట్లు గ్రహిస్తారు; నమ్మినవారు నమ్ముతారు. లేనివారులేదు. ప్రత్యక్షాలోకాన మహాభాగ్యంచేతనో, విజ్ఞానగ్రంధపఠనంచేతనో విజ్ఞానులు విజ్ఞానోత్సాహపరులు భూమిని తృణీకరించే మహాద్భుత పరిమాణంగల అపరిమితమైనగోళాలు అనంతాకాశంలో నిస్సహాయంగా అదృశ్యశక్తుల బంధనాలచేత అత్యంత దూరాలలో నున్నాయని తెలిసికొంటారు. ఈరెండు తెగలకు చెందని సామాన్యులు విశ్వం అంటే మనభూమి, మనం, మనసముద్రాలు, నదులు, అరణ్యాలు. పల్లెలు, పట్టణాలు, మేడలు, కోటలుకన్న అధికంలేదని అనుకొంటారు. అజ్ఞానంచేత, జడత్వంచేత, లోకజ్ఞానం సంపాదించు కుతూహలం లేకపోవుటచేత వారినమ్మకాలనే వేదంగా పరిగణించి సంతృప్తులౌతారు.

అంతేనా, లేక, కొంత నిశ్చయభావంతో సహేతుకంగా, సప్రమాణంగా, ఈవిశ్వమంటే ఏమిటో, దానివ్యాప్తి ఎంతవరకో. దానినిర్మాణమెట్టిదో తెలిసికొనడానికి అవకాశమున్నదా ? అని ప్రశ్న. విశ్వమేది ?

ఏరూపంలో ద్రవ్యమున్నా అదంతా విశ్వంలోనిదే. శక్తి యావత్తు విశ్వంలోనిదే. విశ్వాన్ని దాటి స్వతంత్రంగా పైనున్న దేమీ లేదు. మనకు కనిపించు నక్షత్రాలన్నీ విశ్వంలోనివే. అగోచరంగా ఉన్న నక్షత్రాలుకూడ విశ్వంలోనివే. విశ్వపర్యంతాలు కనుగొందా మంటే నక్షత్రాలు ఎంతవరకున్నాయో గమనించాలి.

నక్షత్రాల వై చిత్ర్యమేమంటే వాటికి అంతమున్నదని నిశ్చయింపలేకున్నాము. కంటికి సామాన్యంగా కొన్నివేల నక్షత్రాలు గోచరిస్తాయి. దూరదర్శిని (Telescope)తో ఆకాశం శోధిస్తే ఇంకా బహుళంగా కనిపిస్తాయి. యంత్రంయొక్క దృష్టి సామర్ధ్యం ప్రబలుతున్నకొద్దీ మనకు గోచరించు నక్షత్రాలసంఖ్య పెరుగుతునే ఉంటుంది. ఆకాశగర్భకుహరాలలో దాగి ఎందున్నవో కాని మానవుని పరిశోధనాశక్తిని ధిక్కరిస్తూ తండోపతండాలుగా నక్షత్రాలు బయల్పడుతున్నాయి. దీనికీ అంతులేదు. అయితే, జీవకోటికి తలమానికమై. విశేష శేముషీసంపన్నుడై, ప్రజ్ఞాన్వితుడై, ఆసక్తిపరుడైన మానవుడు పరాజయాన్ని సులభంగా స్వీకరించడు. అడ్డంకులు అధికమౌతూంటే, పట్టుదల పూనిక మరింత ప్రబలమౌతాయి. అది మానవస్వభావం. ఆశాబద్ధమైనజీవి మానవుడు యుగాలతరబడి విజ్ఞానసోపానాలు ఆరోపిస్తున్నాడు ; ప్రమాదవశాత్తు ఒకప్పుడు అవరోహించడముకద్దు. అంత మాత్రాన వివశుడై, చలించి, కార్యసాధనదీక్షను సడలనివ్వడు. అదే వాని ప్రయత్న సఫలత.

ప్రకృతి సౌందర్యోపాసకులగు మేధావులు కొన్నివేల సంవత్సరాలనుండి నక్షత్రాలను పరిశోధిస్తున్నారు. వాటినిగూర్చి బహుళంగా విశేషాలు గ్రహించేరు. అందులో కొన్ని జట్టుజట్టులుగా, యాత్రిక సమూహాలవలె, ఆకాశ సంచారంచేస్తున్నాయని, నియమితమార్గాలలో చరిస్తున్నాయని కనుగొన్నారు. లెక్కకు సాధ్యంకానప్పటికి, నక్షత్రాలు అసంఖ్యాకంగా ఉన్నాయనిమాత్రం గుర్తించినట్లు లేదు. సామాన్యచక్షువులకు అగోచరమై యంత్రదృష్టికి గోచరించునక్షత్రాలు ఉంటాయని ఊహించినట్లయిన లేదు.

17వ శతాబ్దంలో గెలిలియో కనుగొన్న దూరదర్శినిమూలంగా మనకు దూరదృష్టి లభ్యమయిందనవచ్చును. ఆకాశ అంధకారాలలో వెలుగుచుక్కలు విశేషంగా గోచరమగుట ప్రారంభించేయి. దూరదర్శిని కేవలం ఒక జ్ఞానచక్షువుగా పరిణమించింది. మన దృక్పధంలో విశేషదూరంగానున్న నక్షత్రాలను చెంతకు తీసికొనివచ్చినట్లు చూపించింది. చూడకలిగినకొద్దీ ఆకాశం దీర్ఘ తరంకాగలదనీ, నక్షత్ర సంఖ్య అనంతం కాగలదనీ ఎరిగించింది.

నిశ్చయంగా ఈవిషయం మనకూహాతీతం.

దృగ్గోచరమైన నక్షత్రాలు, యంత్రగోచరమౌతాయని ఆశించిన నక్షత్రాలు గణించి, పట్టీవ్రాయగా అనంతాకాశంలో ఒకబిందువు పరిశోధించినట్లౌతుంది. ఈ అనంతంలో నిమజ్జనమగుటకు పూర్వం నక్షత్రాలవిషయం విచారించవలసిఉంది.

మన సౌరమండలానికి అధినాధుడైన సూర్యుడు అనేకకోట్ల సంవత్సరాలనుండి నిమిషానికి 250,000,000 టన్నులు చొప్పున తేజోష్ణప్రసారంగా తనద్రవ్యాన్ని వ్యాపింపచేస్తూ క్షీణిస్తున్నాడు. సౌరమండలంలో సూర్యునిస్థానే ఆదూరంలోనే జ్యేష్టానక్షత్రమున్నట్లయితే, ఉదయాస్తమయాలప్పుడు ఆకాశంలో ఆరవభాగం ఆక్రమించేది. విపరీతపరిమాణంగల ఆర్ద్రానక్షత్రాన్ని చెరిపి సూర్యులుగా మారుస్తే సుమారు 30,000,000 సూర్యులేర్పడేవారు.

ఒక నెబ్యులానుండిపుట్టిన సుమారు, 3,000 కోట్ల నక్షత్రాలలో మనసూర్యుడొకడై యుండవచ్చును. ఇట్టి నెబ్యులాలు కోట్లకొలది యంత్రగోచర మౌతున్నాయి. వాటిలో వెలుగు చుక్కవలె మనకంటికగుపించు నక్షత్రాన్ని యంత్రంతోచూస్తే. అది కొన్నివేల నక్షత్రాల సమూహం అని తెలుస్తుంది.

ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నాయో, అన్ని మృతనక్షత్రాలు కూడ ఉండవచ్చునని విజ్ఞానులు (Scientists) చెప్తారు. స్వయం ప్రకాశంలేని కాలనక్షత్రమే మృతనక్షత్రం. ఆకాశ అంధకారంలో అట్టిది మనకగుపించదు. శని - గురు - శుక్రాదిగ్రహాలు నక్షత్ర కళేబరాలని చెప్పవచ్చును. మృతనక్షత్ర శ్మశానమనదగు అనంతాకాశంలో మనకు తేజోష్ణా లనుగ్రహిస్తూ, జీవరక్షకుడైన సూర్యునివంటి జీవప్రదాతల ప్రాపకభాగ్యంలేని మృతనక్షత్రాలు బహుళంగా సంచరిస్తున్నాయి. మృతనక్షత్రం కేవలం "మృతం" అని భావింపకూడదు. జగత్తులో మృత్యువుకి స్థానంలేదు. మన కింద్రియగోచారంగాని వేరొక శక్తిరూపంధరించి ఈమృతనక్షత్రాలలో జగచ్ఛక్తులుండవచ్చును. కాంతి విహీనములైన ఆగోళాలలో నూతన వికాసంతో జీవం వర్ధిల్లుచుండవచ్చును. ఆజీవం భూలోకజీవంవంటి జీవం మాత్రంకాదు. ఆజీవాన్ని మనంగుర్తించి హెచ్చరింపలేము. సౌరమండలంలోని ఇతరగ్రహాలలో జీవం నేటికిని కనుపించలేదంటే, నక్షత్రలోకాలలో జీవం మనలేదని సిద్ధాంతీకరించలేము. సౌరమండల నియమాలు నక్షత్రమండలాలకు వర్తించకపోవచ్చును. కాంతి సాగరప్రసృత నీలనెబ్యులాలు నక్షత్రమండల సూత్రానుగుణ్యంగా జీవరాశులతో కలకల లాడుచుండవచ్చును.

సుమారు 10 లక్షలకాంతి సంవత్సరా [1] లమేర దిక్తటములు దృష్టి సారించగలిగిన యంత్రాలైనా జగద్విషయమై మనకెరింగించినది అతి స్వల్పం. అతిదూరంగానున్న నక్షత్రంలో అత్యధికదృష్టి సామర్థ్యంగల దూరదర్శినినిపెట్టి అక్కడనుండి విశ్వాంతరాళం శోధిస్తే అక్షయంగా నక్షత్రాలు బయల్పడతాయి. నక్షత్రంనుండి నక్షత్రాని కీయంత్రంతోపోయి ఆకాశం చూచినకొద్దీ అంతంలేని కాలాంతంవరకు నక్షత్రగణాలు గోచరిస్తూనే ఉంటాయి. ఏమంటే, దగ్గరగానున్న నక్షత్రాలైనా తేజోవంతమైనవికాకపోతే కనుపించుట కష్టం. మహాతేజోవంతమైన నక్షత్రాలు అతిదూరంగా ఉంటే దీర్ఘ యానంచేసిన కాంతి తీక్ష్ణత గోల్పోవుటచే మనకు గోచరించుట కష్టం. కాబట్టి, యంత్రగోచరం కానిమాత్రాన ఆకాశం నక్షత్ర శూన్యమని భావించుటకు అవకాశంలేదు.

ఆకాశంలో మనకత్యంత సన్నిహితగ్రహమైన చంద్రుడు 240,000 మైళు దూరంగాను. అతిదూరస్థగ్రహం ప్లూటో 368 కోట్ల మైళ్లు దూరంగాను ఉన్నాయి. 750 కోట్ల మైళ్లు వ్యాసంగల గోళం మన సౌరజగత్తు : విశ్వంలో సూక్ష్మబిందువు. ప్లూటోనుదాటి నక్షత్రలోకం ప్రవేశిస్తే ఆదూరాలు మైళ్లలోకాక కాంతి వత్సరాలలలో వాకొనవలసిఉంటుంది. అనేక సహస్రనక్షత్ర స్థాపితమైన మన గెలాక్సీమండలం ప్రారంభమవుతుంది. అందులో లక్షలకొలది నెబ్యులాలున్నాయి. దానివ్యాసం 3 లక్షల కాంతివత్సరాలు. అదే దుగ్థపధం (milky way). సెకెనుకి 400 మైళ్లవేగంతో ఈ దుగ్థపధం ఒక ద్రవ్యశకలంవలె ఆకాశయానం చేస్తూంది. దీని వెనుక అధికగెలాక్సీక నెబ్యులాలు (extra - galactic nebulae), సర్పిల (spiral) నెబ్యులాలు మన జగత్తుతో సంబంధంలేనివి ఉన్నాయి. దూరతమమైన నెబ్యులాదూరం ఇప్పటికి కనుపించినవాటిలో 14 కోట్ల కాంతి సంవత్సరాలని విజ్ఞానులు గణించేరు.

యంత్రదృష్టి చొరలేని ఆకాశంలోగల అనన్వేషిత ప్రదేశాలలో జగత్తుపై జగత్తు ఆనంత్యంవరకు ఉండవలసిందే !

ఊహకందని నెబ్యులామండలాన్ని ఈవిధంగా జీన్సు పండితుడు చిత్రించుకొనమన్నాడు : 2 మైళ్లు వ్యాసంగల గోళంలో 25 గజాలకొకటి చొప్పున 50 టన్నుల బిస్కట్లనుపేర్చగా, 100 అంగుళాల దూరదర్శిని చూడగల ఆకాశాన్ని ఈగోళం నిరూపిస్తుంది. 13000 కాంతి సంవత్సరాలు వ్యాసంగల నెబ్యులాని ఒక బిస్కట్టు నిరూపిస్తుంది, ఈపరిమాణంలో నిరూపింపబడిన భూమి కంటికి కనిపించదుసరికదా, దాన్ని కొన్నికోట్లసార్లు పెంచుతేనేగాని సూక్ష్మదర్శినిలో కనిపించు సూక్ష్మతమమైన కణంపాటి పరిమాణానికైనా రాదు.

ఇది మన జగత్తుయొక్క స్థూలచిత్రం. సౌరజగత్తు గెలాక్సీ జగత్తులో సూక్ష్మకణప్రాయంగా అంతర్బూతమై ఉంది. మన గెలాక్సీజగత్తుకి ఉపరి సర్పిలనెబ్యులాలతో ఏర్పడిన మూడవ జగత్తుంది. వీటిని తృణీకరించు జగత్తులు ఆకాశగర్భంలో ఎన్నో ఉండవచ్చును. ఇవన్నీ విశ్వంలోనివే !

ఊహాతీతమైన పరిమాణంగలవిగా ఈ జగత్తులు మనకగుపించవచ్చును. మనుష్యప్రమాణంతోటి, భూప్రమాణంతోటి కొలిచినప్పుడట్లేఉంటుంది ఆకాశసామ్రాజ్యంలో మనకెట్టి ప్రాముఖ్యం లేదన్నవిషయం మనకు సహజంగా గుర్తుండదు. యదార్ధానికి విశ్వంలో పరమప్రమాణంలేదు. సాపేక్షవాదం ఇక్కడ స్ఫురిస్తుంది. ఎలక్ట్రానుపై పుట్టిన జీవికి పరమాణువులోని శూన్యాంతరాళాలే దురూహ్యమైన బృహత్పరిమాణం గలవిగా గోచరిస్తాయి. గెలాక్సీలో జీవులుంటే వారికీ సౌరజగత్తు అతి క్షుద్రంగా కనిపిస్తుంది.

అయితే, విశ్వం అనంతమా ? విశ్వాన్ని ఒక గోళంగా భావించుకోమన్నారు. అప్పుడది నియతము (finite), అనావృతము (unbounded) అవుతుంది. అప్పుడు ఆకాశం వక్రమౌతుంది. ఆకాశంలో సూటిగా పోగాపోగా ఆకాశవక్రతచేత బయలుదేరిన స్థానానికే రావలసిఉంటుంది, భూమినిచుట్టివచ్చినట్లు. ఈ విషయమై ఎడ్డింగ్‌టను ఇట్లంటాడు : విశ్వంచుట్టు ప్రయాణంచేస్తూన్న కాంతి యొక్కస్పందం తగ్గిపోతున్నట్లు వర్ణపటగ్రాహకం (spectrograph) తెలియచేస్తూంది. సెకెనుకి 500 మైళ్లను మించినవేగంతో సర్పిల నెబ్యులాలన్నీ వెనుకకు పారిపోతున్నాయి. ఈ వక్రాకాశంలో పడి పోనుపోను వెనుకనుండి భూమిని చేరుకొంటాం.

సూర్యునిచుట్టు భూమివలె నక్షత్రమండలమంతా ఒక కేంద్రకం (nucleus) చుట్టు తిరుగుచున్నట్లుంది. దాని పరిభ్రమణకాలం 30 కోట్ల సంవత్సరాలు. ఈ భ్రమణచలనం ప్రకృతియొక్క లక్షణం. బృహద్వస్తువునుండి సూక్ష్మవస్తువువరకు ప్రతివస్తువులోను ఇది గోచరిస్తుంది. సూక్ష్మతమమైన ఎలక్ట్రాను నిరంతరం పరిభ్రమిస్తూంది. ఇదొక విశ్వవిశేషం.

నక్షత్రాలు మహావేగంతో ఆకాశయానం చేస్తున్నాయని విజ్ఞానులు చెప్తారు ; కాని అవి మనకెప్పుడు వాటివాటి యధాస్థానాలలోనే కనుపిస్తాయి. ఒకకోటి సంవత్సరాలు గతించిన తరువాత భూతలంనుండి ఆకాశంపరీక్షిస్తే యధాప్రకారంగానే కనిపిస్తుంది. ఈదీర్ఘకాలంలో కొన్ని నక్షత్రాలు కొద్దిగా స్థానచలనమొందుతాయి. కొన్ని ఎరుపెక్కుతాయి. కొన్ని పచ్చవారుతాయి. కొన్ని నీలమౌతాయి ; ఈ మార్పులన్నీ యంత్రాలు కనుగోవలసిందేగాని దృగ్గోచరంకావు. నీలస్నిగ్ధవియత్తలం యధావిధిగా నక్షత్రస్థాపితమై ఉంటుంది. ఇట్లు కొన్నికోట్ల సంవత్సరాలు పోయినతరువాత మంచుకొండలు బారులుదీర్చిన భూమికేతెంచి ఆకాశంచూస్తే సూర్యబింబ మొక ఎర్రని పెనంవలె కనిపిస్తుంది. తేజోష్ణప్రసారములీయగల సామర్థ్యం ఉడిగి అది నిరుపయోగమైపోతుంది. అప్పటికైనా నక్షత్రాలు, దుగ్ధపదం, అపరగెలాక్సీక నెబ్యులాలు మారుతాయా ? నిర్లక్ష్యంగా దుర్వ్యయమొనర్పబడిన అపరిమితశక్తి శూన్యాకాశ కుహరాలలో వ్యాపించగా, దుర్బలమైన ద్రవ్యం గడ్డకట్టి, నిరంతర నిశ్చలావస్థలో మూర్తీభవించిన జడత్వమట్లుండిపోతుందా ? ఔననడానికిగాని, కాదనడానికిగాని తగిన ఆధారాలులేవు.

విశ్వం క్షీణించవలసిందే అని కొందరు విజ్ఞానులంటారు. విశ్వంఅనే గడియారానికి ఆదినెవరో ""కీ" ఇచ్చేరు. కాలక్రమాన్ని "కీ" తగ్గిపోతుంది, తిరిగి "కీ" ఇచ్చేవారులేరు. సర్వనాశనమై పోయేవరకు ద్రవ్యం శక్తిని ప్రసరిస్తుంది ; ఈ శక్తి యావత్తు ఆకాశంలో చెదరిపోతుందే కాని తిరిగి ద్రవ్యంగా పరిణమించ లేదంటారు.

శక్తి ద్రవ్యంగా పరిణమించలేదని ప్రాయోగికంగా ఋజువైతే అగుగాక, అది మన పరిశోధనాగారాలలోనే. అంతమాత్రాన ఈవాదం సత్యమనలేము. జగత్తను ఈబృహత్తమ పరిశోధనా గారంలో అత్యద్భుతప్రయోగాలు నిరంతరం జరుగుతున్నాయి. వాటినవగాహన చేసికొనడానికి మానవబుద్ధి చాలదు. ఇంకా వికసించాలి. ఆకాశగర్భంలో శక్తి ద్రవ్యంగా పరిణమించలేదనడం సాహసమే.

తీవ్రపరిశోధనమూలంగా మనకుప్రాప్తించిన జ్ఞానమేమనగా : ఆకాశంలో నెబ్యులాలు సాంద్రీకరించడం, నెబ్యులాలలో నక్షత్రగోళాలేర్పడడం, నక్షత్రాలప్పుడప్పుడు తునియలై గ్రహాలుద్బవించడం మొదలైనవి విశ్వపరిణామఫలితాలు. వాటికి నిదర్శనాలు ఎన్నైనా ఆకాశం చూపిస్తుంది.

ఇక సూక్ష్మతమమైన జగత్తులు. అణు (molecule) వొక జగత్తని ఆధునికవిజ్ఞానం తెలియచేస్తూంది. అందులో పరిమాణువు (atom) లు నిత్యపరిణామ మొందుతున్నాయి. కొన్ని అణువులలోని పరమాణువులు అవ్యక్తంగా ఉంటాయి. సూర్యగోళమంత గోళంలో మానవుడవ్యక్తంగా ఉన్నట్లు. ఒక తులాన్ని కోటిభాగాలుచేసి, అందులో ఒకభాగాన్ని కోటిభాగాలుగాచేసి, అందులో ఒకభాగాన్ని తిరిగి కోటిభాగాలుచేయగా అందులో ఒకభాగంలో శతసహస్రాంశం కన్న స్వల్పంగా ఉంటుంది ఉదజని పరమాణువుయొక్క భారం. చిన్న నీటిబిందువులో కోటానకోట్ల జలాణువులుంటాయి.

ఇంత సూక్ష్మతమమైన పరమాణువు సూర్యమండలంవలె నిర్మితమైఉంది. యావత్పరమాణువు అంతరాళపూరితమై ఉంది. పరమాణువుయొక్క వ్యాసం అంగుళంలో సహస్రాంశంలో శత సహస్రాంశం. సూర్యసన్నిభంగా పరమాణువు మధ్యనున్న కేంద్రకంయొక్క వ్యాసం పరమాణువ్యాసంలో శతసహశ్రాంశమై ఉంది. అంతరాళం అంతర్ధానమయేటట్లు ఎలక్ట్రానులను, పరమాణువులను అణువులను దగ్గరగా కుద్దించగలిగితే ఎంత దివ్యభవనమైనా అగ్గిపెట్టెలో ఇమిడిపోతుంది. అట్లుండబట్టేకాబోలు శ్వేతవామనతార (White dwarf) ఒక విధమైన నక్షత్రం-లలోని ద్రవ్యసాంద్రత ఘనపుటంగుళానికి సుమారొక టన్నుపైబడిఉంది. పరమాణువులోని ఎలక్ట్రానులు కేంద్రకంచుట్టు విరామంలేకుండా పరిభ్రమిస్తున్నాయి.

ఎలక్ట్రానంత విద్యుదావేశ (electric charge) మే గల ప్రోటాను ఎలక్ట్రానుకన్న 1850 రెట్లు బరువైన విద్యుత్కణం. ఘనపరిమాణంలో ప్రోటానుకన్న ఎలక్ట్రానే పెద్దది.


ఇది సూక్ష్మజగత్తుయొక్క చిత్రం.


రేడియో ధార్మికత్వం, x - కిరణాలు, అతినీలలోహిత కిరణాలు, విద్యుత్తు, ఛాయాగ్రహణము మొదలగు సాధనాలతో, చతురపరికరాలతో, అద్భుతమైన గణితసాహాయ్యంతో అగోచరమైన ఈసూక్ష్మకణాలని లెక్కించి, తూచి, వాటి పరిమాణం కనుగొన్నారు ; సూక్ష్మాకాశంలో ఎలక్ట్రానుగ్రహాల చలనాలుకట్టేరు ; వాటిశక్తి ప్రసారవిధానం, సామర్ధ్యం కనుగొన్నారు. సూక్ష్మాకాశంలో అవి నక్షత్రాలట్లు ప్రవర్తిస్తున్నాయి.

ఏమంటే, ఈ సూక్ష్మకణ సమూహాలచిత్రాలను ఎన్నోరెట్లు విస్తరింపచేస్తే నెబ్యులాల చిత్రాలట్లేఉంటాయి. కొన్ని లక్షలమైళ్ల వ్యాసంగల సూర్యుని కబళించగల విపరీతగోళాలచిత్రాలు, సూది మొనలో కోట్లకొలది ఇమిడిపోవు సూక్ష్మకణాలచిత్రాలు : ఒకదాని ప్రక్క నొకటిపెట్టగా ఏచిత్రం దేనిదోచెప్పుట కవకాశం ఉండదు. బృహత్ప్రపంచానికి సూక్ష్మప్రపంచానికి అంత సారూప్యం ఉంది.

ఇందులో ధీరుడెవడు ? సూక్ష్మతమమైన ఎలక్ట్రాను పరమాణువులా ? బృహత్తమమైన నక్షత్రమా ? లేక, విశ్వాన్ని ఇంతగా శోధించి విశ్వచరిత్ర లిఖిస్తూన్న మానవుడా ? ఎడ్డింగ్‌టను లెక్క ప్రకారంగా 1027 పరమాణువులుకలిసి మానవశరీరం ఏర్పడగలదు; 1028 మానవశరీరాలలోని ద్రవ్యంతో ఒకనక్షత్రం ఏర్పడగలదు; విశ్వంలో బృహత్తమానికి సూక్ష్మతమానికి మధ్యనున్నాడు మానవుడు. ఇరువైపులా దృష్టిసారించి విశ్వనాటకం విలోకిస్తున్నాడు. మానవుడే ధీరుడేమో !

  1. కాంతి సంవత్సరమంటే కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణంచేయుదూరం, సెకెనుకి 186,000 మైళ్ల చొ॥ సంవత్సరానికి 186000X60X60X24X365= 5897,000,000,000 లేక సుమారుగా 6 లక్షలకోట్ల మైళ్లదూరం పోతుంది. 6 లక్షల కోట్ల మైళ్లు దూరంలోనున్న నక్షత్రం ఒకకాంతి వత్సరదూరంలోనుందని అంటారు.