Jump to content

చిరవిభవశతకము

వికీసోర్స్ నుండి

చిరవిభవశతకము

కూచిమంచి తిమ్మన

చ.⁠

సిరిమగఁడున్ బితామహుఁడుఁ జేరి భజింపఁగ వెండికొండపై
సరస నవేందుకాంతమణిసౌధమునందుఁ బసిండిగద్దెపై
గిరిసుతఁ గూడి వేడుకలఁ గేరెడు నిన్ను మదిన్ దలంచెదన్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 1


చ.⁠

కరులు హరుల్ చమూవరులు గాటపు మేల్‍నగరుల్ కడానిబం
గరులు సరుల్ తలోదరులు గంధమిళన్మృగనాభిచందనా
గరులు విరుల్ జగాసిరులు గల్గి సుఖింత్రు త్వదీయులౌ నరుల్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 2


చ.⁠

పరమకృపార్ణవా! తుహినపర్వతరాజకుమారికాధవా!
వరవృషసైంధవా! కుటిలవైరినిశాటసమిద్ధవా! మనో
హరకరసారసాగ్రనిహితాజిగతానతబాంధవా! శివా!
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 3


చ.⁠

నిరుపమ కూచిమంచికులనీరధిచంద్రుడు గంగమంత్రికిన్
బరమపతివ్రతామణియు భాగ్యసమన్వితయైన లక్ష్మికిన్
వరసుతుఁడై న తిమ్మకవివర్యుఁడ నే శతకం బొనర్చెదన్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 4


చ.⁠

శరనిధి కర్ఘ్యమిచ్చు క్రియ సారసబంధున కారతిచ్చు వై
ఖరి నిఖిలాబ్జజాండచయకర్తకు నీకు సమగ్రభక్తి శ్రీ
కరముగఁ గోరి యొక్కశతకంబు సమర్పణ సేయఁబూనితిన్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 5


చ.⁠

మరలని భక్తితోడ మును మల్హణబిల్హణముఖ్యసత్కవీ-
శ్వరులు కవిత్వవైఖరిని సారెకు నిన్ బ్రణుతించి ధన్యులై
బరగిరటంచు నేను నినుఁ బద్యముఖంబుగ సంస్మరించెదన్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 6


చ.⁠

హరిముఖసర్వదిక్పరివృతార్చితపాదసరోజుఁడైన య-
క్కరిముఖుఁ డెప్పుడున్ వితతకౌతుకలీలఁ బొసంగఁజేయుఁబో
నిరతముగాఁ ద్వదీయపదనీరజభక్తు లొనర్చు సత్కృతుల్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 7


చ.⁠

శరశరదిందుకుందహరిచందనహారతుషారతారకా-
దరఘనసారవర్ణ వరదండశుకాంబుజపాణి వాణి యా
దరమునఁ బ్రోచుచోఁ గవికదంబము నిన్బ్రణుతించు ధన్యమై
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 8


చ.⁠

తరలని భక్తి నా హృదయతామరసంబున సంస్మరింతు దు-
ర్భరదురితాంధకారవిసరప్రసరన్నళినీసుహృల్లస
త్కిరణములైన దెందులురి దివ్యకులోద్భవు లింగనార్యు స
ద్గురుచరణంబు లుగ్రభవతోయధిసంతరణంబు లెప్పుడున్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 9


చ.⁠

గురుతరలీలఁ బీఠపురి కుక్కుటలింగమహాప్రభుండవై
బరగెడు నిన్ను నేనిపుడు భక్తి దలర్పఁగ నాశ్రయింతు నీ
వరకరుణానిరీక్షణము వాలెము నాపయి నిల్పి ప్రోవవే
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 10


చ.⁠

నరపతి కొక్కకావ్య మిడినన్ ధనధాన్యమణీచోళముల్
పురములు వాహనంబులు విభూషణగోవసుధాదికంబులుం
గురుకృప నిచ్చి బ్రోచు నిదిగో మరి నీవిఁక నేమియిచ్చెదో
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 11


చ.⁠

హర పరమేశ శంకర పురాంతక భర్గ గిరీశ చంద్రశే
ఖర మృడ కృత్తివాస శితికంధర శర్వ నగేంద్రజామనో
హర శివ మృత్యుసంహర యటంచు నిను న్స్మరియింతు నెప్పుడున్,
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 12


చ.⁠

కరయుగళంబు మోడ్చి కుతుకంబున మ్రొక్కెద సర్వదేవతా
పరివృఢమౌళిభాగ్మకుటపంకజరాగమణిప్రభాచ్ఛటా
నిరతవిరాజమానరమణీయభవచ్చరణాగ్రపీఠికిం
జిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 13


చ.⁠

తరమె నుతింప నేరికిని దావక దివ్యపదప్రభావమున్
గరికిని సాలెపుర్వునకు గాడుపుదిండికి మోక్షమిచ్చి యా
దరమున నేలుకొంటివట దాన వరేణ్యులఁ బ్రోచుటబ్రమా
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 14


చ.⁠

తరలని భక్తి నెల్లపుడు ధ్యానము సేతు తుషారధారుణీ
ధరవరకన్యకావిలసితస్తనకుంభవిలిప్తకుంకుమా
గరుఘనసారచందనసుగంధవిభాస్వదురఃస్థలు న్నినున్
జిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 15

{{Telugu poem|type=చ.|lines=

శరధిశయాంబకాయ రవిచంద్రకృపీటభవాంబకాయ గో
పరివృఢకేతనాయ సితపర్వతకూటనికేతనాయ సు
స్థిరకరుణామతే భగవతే శివ తే నమ యంచు మొక్కెదన్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

|ref=}16}

చ.⁠

సరసిరుహాక్ష పద్మభవ శక్ర కృశానుకృతాంత యామినీ
చర వరుణానిలైలబిల చంద్రకిరీట సుధామయూఖ భా
స్కరముఖదేవతాప్రముఖసర్వము నీవె యటంచు వేఁడెదన్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 17


చ.⁠

శిరములు వేయిగల్గు నహిశేఖరుఁడైన చతుర్ముఖంబులన్
బరగు విధాతయైన సులభంబుగ నొక్కిసుమంతయైన నీ
చరితము లెన్నఁజాలరట శక్తులమే మముబోంట్ల మెన్నఁగాఁ
జిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 18


చ.⁠

వరుణభవాత్రిగౌతములు వ్యాసవసిష్ఠఘటోద్భవుల్ పరా
శరసుతకణ్వకౌశికులు జహ్నుశమీకముఖాఖిలర్షిశే
ఖరులు నుతింపఁజూలరటకా నిను మాదృశు లెన్ననేర్తురే
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 19


చ.⁠

హరిణము ఢక్క శూలము గజాజిన మెక్కువకన్ను పాపరా
సరములు బూదిపూత వినుజక్కర లేనెలపున్క లెద్దు దా
నిరుమెయి కప్పు కుత్తుకయు నెమ్మిగఁ గల్గు నిను న్భజించెదన్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 20


చ.⁠

ధరణి రథంబుగా శృతివితానము వాజులుగా రమామనో
హరుఁడు శరంబుగా మరుదహార్యము సింగిణిగా బిలేశయే
శ్వరుఁడు గుణంబుగా నలువ సారథిగాఁ దిగప్రోళ్లఁ గూల్చితౌ
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 21


చ.⁠

హరి మిము వేయుపద్మముల నర్చన చేసిన సర్వలోకభీ
కరఖరదైత్యసంహరణకారణమై కనుపట్టు చుట్టువా
లరుదుగ నిచ్చిమెచ్చి భువనైకధురంధరుఁ జేసి యేలితో
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 22


చ.⁠

తరణిసుతోగ్రపాశవితతవ్యథ గాసిలి స్వేతుఁ డర్థి నిన్
స్మరణము నొంద నజ్జము వెసం బడదన్ని ధరామరోత్తమున్
గరమనురక్తిఁ బ్రోవవె జగంబున శాశ్వతజీవిఁ జేసి మేల్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 23


చ.⁠

అరుదుగ నింద్రకీలగిరి నర్జునుఁ డుగ్రతపం బొనర్చుచో
నరిగి కిరాతరూపమునఁ జక్కఁగ నిల్చి కరంబు వానితో
దురమొనరించి మెచ్చి కృపతోడుతఁ బాశుపతాస్త్రమీయవే
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 24


చ.⁠

సురలును దైత్యులుం గదసి స్రుక్కక వార్ధి మధింపుచున్నచో
నురుగతినందు హాలహల ముద్భవమై జగముల్ హరింప న
గ్గరళము కంఠసీమనిడి కావవె లోకములెల్ల నాఁదటన్
జిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 25


చ.⁠

కిరికలహంసరూపములఁ గృష్ణుఁడు నంబురుహాసనుండు నీ
చరణములున్ శిరంబు గనఁ జాగి రసాతలము న్నభంబు వే
సరి వెదుకంగ వారికిఁ బ్రసన్నతనొందవె లింగమూర్తివై
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 26


చ.⁠

శరధిశయానుఁడైన హరి సారసబంధుకులంబునందు దా
శరథి యనం జనించి బహుసంఖ్యలు మీఱిన లింగమూర్తులన్
సరవిఁ బ్రతిష్ఠఁ జేసెనఁట శక్యమె నీ యధికత్వమెన్నఁగాఁ
జిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 27


చ.⁠

గరువముతోడ నిన్ను వెలిగా నిడి దక్షుఁడు జన్న మొక్కెడన్
హరిహయపుండరీకనయనాబ్జభవాదులఁ గూర్చి చేయుచో
నరుదుగ వీరభద్రభయదాకృతిఁ గైకొని సంహరింపవే
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 28


చ.⁠

కరమరుదార నల్వఁ దనకన్న ఘనుండగు వేల్పు లేఁడటం
చురుగతి దేవతాసభ దురూక్తులు బల్కఁగ నల్గి వాని దు
ర్భరతరగర్వభారమును బల్వడిఁ ద్రుంపవె భైరవాకృతిన్
జిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 29


చ.⁠

అరయ మృకండుసూనుఁడు నిరంతరమృత్యుభయాకులార్తుఁడై
వెఱవు దలిర్ప నిన్ శరణు వేడిన మిత్తి నడంచి యమ్మునీ
శ్వరసుతుఁ బ్రోచినాఁడవట శాశ్వతజీవునిఁ జేసి వాసిగాఁ
జిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 30


చ.⁠

ముఱియుచుఁ గాశికాపురిని మూఢత బాహువులెత్తి ధారుణీ
ధరములకన్న నెవ్వఁడును దైవము లేడని పల్కు నప్పరా
శరసుతు బాహుయుగ్మకము స్తంభనమొందఁగఁ జేసి కుంచవే
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 31


చ.⁠

అరయ నశేషలోకముల కాఢ్యుఁడ వీవె నిజంబు బాలిశు
ల్మెఱమెఱగాఁ దలంత్రు కడిమిం బహిరంతరలోకరక్షకై
గరళము కంఠమూలమున గట్టిగ నిల్పు టెఱుంగరేమొకో
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 32


చ.⁠

హరి నరసింహరూపధరుఁడై సమరాగ్రమహోగ్రభంగి న-
బ్బురమొదవన్ హిరణ్యకశిపు న్బరిమార్చి చెలంగుచున్నచో
సరగఁ దదుగ్రతం శరభసాళువదేహుఁడవై యడంపవే
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 33


చ.⁠

సరసవిహారలీల విటజంగమరూపముతోడ నేగి య
బ్బురముగ మున్ను భల్లణుని పత్నిని చల్లమదేవిఁ గోరి యా
గురుకుచ కౌఁగిట న్నిలవె గోమెలయ న్నెలనాళ్లపట్టివై
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 34


చ.⁠

ఇరవుగ దారుకావనమునీంద్రవధూతిలకంబుల న్మనో
హరవటుకాకృతిం బొలిచి యబ్జశరాహవలీలలం గడున్
గరచిన నీ విలాసరతికౌశలముల్ గణుతింప శక్యమే
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 35


చ.⁠

సరభసలీల మున్ముసలిజంగమువై చిరితొండనంబి మం
దిరమున కేఁగి తత్తనయునిం బొలకై వధియింపఁజేసి చె
చ్చెర నిజమూర్తి చూపి కృప చిప్పిల వానిఁ గృతార్థుఁ జేయవే
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 36


చ.⁠

దొరకొని చెప్పుగాల తలఁ ద్రొక్కి యొకించుక నంజు డెంగిటన్
బొరసిన దప్పనంబొసఁగి పుక్కిటనీ ర్మెయిఁ జిల్కు బోయకున్
సరగున మోక్షమిచ్చితఁట సజ్జనకోటుల కిచ్చు టబ్రమే
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 37


చ.⁠

ఇరుసతలోకము ల్మహిమ నేలెడు స్వామివి నిన్ను వాకిటన్
దరలకయుండ గాపునిచి ధన్యతఁ జెందిన బాణదైత్యుఁ డే
కరణిని నిన్ను మున్నెరవు గ్రాలఁగఁ బూజ యొనర్చెనో కదా
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 38


చ.⁠

మెరమెర లేక నీవు మును మేదరిసెట్టియు బోయలెంకయున్
బెరసుకులంపు చాకలియు బెట్టిన యోగిర మారగించితౌ
సరిసరి నిన్ను నర్చనలు సల్పెడుచో నియమంబులేలయా
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 39


చ.⁠

పురుడె గణింప భక్తసులభుండవు నీకు నిలింపులెల్ల కి
న్నరనరుఁ డెట్టు లర్చన లొనర్చెనొ కాని కడుం గడిందిగా
సెరబడి చేసి వానికి విచిత్రధనాధిపతిత్వమివ్వవే
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 40


చ.⁠

గరళము కంఠమూలమున గట్టిగ దాల్చుట నీకు నంగదల్
బరగునటంచు రుద్రపశుపత్యభిధానుఁ డెదం గలంగఁగా
నొరిమెర నంగపీఠమున నుంచవె యాతని శాశ్వతంబుగాఁ
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 41


చ.⁠

విరసముతోడ నిన్ శిలల వ్రేసియు రోకటఁ గ్రుమ్మియున్ గృహాం
తరమునఁ గాపువెట్టియును సిద్ధముగా వెలివెట్టు కుంటిన
ల్దిరగఁగఁ జేసినట్టి ఘనులే తగుభక్తవరేణ్యులైరి మేల్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 42


చ.⁠

సురపతి వేణువుం గలిమికొమ్మమగండు మృదంగవాద్య మం
బురుహభవుండు తాళమును పొత్తముముత్తవ వీణఁ బూనఁగా
హరిసతి బాడినం జదల నద్భుతతాండవకేళి సల్పితౌ
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 43


చ.⁠

ఉరగము లెమ్ములుం బునుక లుగ్రపిశాచములుం గళాసముల్
గరళము కంఠమూలమున గట్టిగ నెప్పుడు గల్గియుండియున్
బరమశివాకృతిం బొలుచు భద్రములిచ్చెద వబ్బురం బహా
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 44


చ.⁠

ఇరవుగ నెల్లలోకముల నేలెడు స్వామివి నీవు కూర్మితో
దొరతనమెల్లఁ బో కడచి తుచ్ఛపుజాలరిపూపకన్నియన్
శిరమునఁ బెట్టుకొంటివఁట చిత్రములౌర భవద్విలాసముల్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 45


చ.⁠

హరుఁడు మురారి యబ్జభవుఁ డాఢ్యులటంచు పురందరుండు దే
వర యనుచు న్విభావసుఁడు వహ్నియు వేల్పులటంచు నెంత్రు బు
ద్ధిరహితమానవు ల్పశుపతిత్వము నీయెడఁ గల్గుటెన్నకే
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 46


చ.⁠

సరవి విధాతరూపమున సర్వచరాచరముల్ సృజించి శ్రీ
హరివయి బ్రోదిచేసి నిటలాక్షుఁడవై యడఁగింపుచుందు వ
బ్బురముగ నీవెకా జననపోషణనాశనకర్త వారయన్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 47


చ.⁠

శరనిధికన్యనాగ హిమశైలతనూజయనంగ వాణినాఁ
బరగు వధూట్లఁ గూడి భవపాలననాశము లోలిఁ జేయుచున్
హరిహరధాతృమూర్తి వగు నాఢ్యు నినుం గనుగొందు నీశ్వరా
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 48


చ.⁠

పురుషులలోన విప్రుఁడును పుష్పకదంబములోన జాజియున్
దరువులలోన రావియును దానచయంబుల నన్నదానమున్
ధరణిఁ బ్రశస్తిఁ గన్న ప్రియదైవములం దధికుండ వీవయా
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 54


చ.⁠

పరుసము సోకి లోహము శుభస్థితి బంగరమైన రీతి స
ద్గురుకరుణానిరీక్షణ మకుంఠితలీల నొకింత సోకినన్
నరుఁడు మహాత్ముఁడై బుధజనస్తుతుఁడై నినుఁ జెందుఁబో తుదిన్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 55


చ.⁠

అరయఁగ నీరబుద్బుదములట్ల నశించుచునుండు మేనులున్
శరధితరంగమాలికల చందమునం గనుపట్టు ఠీవులు
స్థిరమని నమ్మి నిన్గొలువనేరక రిత్త నశింతురౌ ఖలుల్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 56


చ.⁠

పొరిఁబొరిఁ బుణ్యభూములకు బోవఁగనేలఁ గడు న్దపోమహా
ధ్వరము లొనర్చనేల యుపవాసములన్ గృశియింపనేటికిన్
హరహర యంచు నొక్కతరి నాడినఁజాలు నఘప్రశాంతికై
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 57


చ.⁠

తరణిసుధామయూఖవసుధాయజమానసమీరణానలాం
బరజలమూర్తివైన నిను భక్తిఁ దలంచినవారి కెందులన్
దిరుగఁగనేల యే శిలల నిచ్చలుఁ గోరి భజింపనేలయా
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 58


చ.⁠

సరవి చతుశ్రుతు ల్నిఖిలశాస్త్రపురాణకథారహస్యముల్
విరివిగ నిచ్చనిచ్చలును విందుముగాని తలంచిచూడ మా
గురుచరణంబులాన నినుఁ గొల్వక యేరికి ముక్తి లేదయా
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 59


చ.⁠

గరుడముఁ గన్న పన్నగనికాయములట్ల మృగేంద్రుఁ గన్న కుం
జరములకైవడిన్ దురితసంఘములెల్లఁ దొలంగి పారుచో
నరుఁడొకచో ననాస్థనయినం భవదాహ్వయ ముచ్చరించినన్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 60


చ.⁠

ధరణిసురు న్వధించిన మదంబున గోనిధనంబొనర్చినం
గురుసతిఁ గూడినన్ మధువుఁ గ్రోలిన హేమము మ్రుచ్చలించినన్
దొరకొను పాతకంబు లొకతూరి శివా యనినన్ దొలంగుఁబో
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 61


చ.⁠

గురుహరిణేక్షణామణినిఁ గూడిన దుష్కలుషాత్ముఁ జంద్రునిన్
శిరమునఁ బెట్టుకొంటివఁట చెప్పఁగ నబ్రమయారె మేలుమే
ల్గురుతరభక్తితోడ నినుఁ గొల్చినవారి కిఁకేటిపాపముల్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 62


చ.⁠

దురితము లేమిసేయు గ్రహదోషపిశాచరుజామృగోరగో
త్కరభయమేల కల్గు నృపతస్కరవహ్నిభయంబులే ప్రియం
బెరయు నరుం డొకప్డు నినుఁ బేర్కొని నెమ్మది సంస్మరించినన్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 63


చ.⁠

అరదము లందలంబులు హయంబులు రత్నవిభూషణంబు లం
బరములు చామరంబులు ద్విపంబులు నాదిగఁ గల్గు ఠీవులు
న్బొరసెడువారు మిమ్ము మునుఁ బూజయొనర్చినవారె కారయా
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 64


చ.⁠

వెరవిరవార నేపగిది వేఁడినఁ గానియు నియ్యలేని ము
ష్కరనరనాయకాధముల సావడులం బడి ప్రేలువారికిన్
నిరతకృపార్ద్రదృష్టిమెయి నీవిడ కన్యుఁ డొసంగఁజాలునే
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 65


చ.⁠

సరయువు గృష్ణ నర్మదయు జాహ్నవి బాహుద తుంగభద్ర భా
స్కరసుతయు న్సరస్వతియు గౌతమియుం మొదలైన దివ్యని
ర్ఝరులను మున్గు పుణ్య మొకసారె శివా యనినన్ లభించుఁబో
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 66


చ.⁠

ధర శ్రుతిమంత్రకోటికిఁ ప్రధానము నాగమమాతయైన య
గ్గురుతరమంత్రరాజమునకుం బతి వీవని లోగణింపకే
వెకవరి కొల్తురౌ ఖలులు వెంగళులై కుఱకుఱ్ఱవేల్పులన్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 67


చ.⁠

హరువులు దీర్ప నీవు హృదయంబున నెప్పుడు గల్గియుండఁగా
వెరవరి యందు నందులకు వేరడులై చనుచుంద్రు పామరుల్
నెరయఁగ వెన్న చేతినిడి నేతికి ద్రిమ్మరు కైవడిం గటా!
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 68


చ.⁠

ఉరగము గాలిఁ గ్రోలి గుహనుండదె యాకులు నించుకోనల
న్దిరుగదె మేఁక నీళ్ల వెనుదీయకఁ గృంకదె కప్ప యెవ్వరే
కరణిఁ జరించుచున్న నినుఁ గన్గొనకున్నఁ బరంబు లేదుగా
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 69


చ.⁠

హరహర! మేరుభూధరమునంత పదార్థము సంగ్రహించిన
న్సురనగరాభిపత్యము త్రిశుద్ధిగ నబ్బిన రంభయంత సుం
దరి నిజభార్యయైన మది దార్కొను తృష్ణ యడంగదేరికిన్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 70


చ.⁠

బురుదను హాళితో నురెడిపుర్వు మెలంగుచునుండి యెప్పుడు
న్బురుద యొకింతయైనఁ దనుఁ బొందకయుండ మెలంగునట్లు నే
ర్పరి గృహమేధియయ్యు భవబంధమునంటక నిన్నుఁ జెందుఁబో
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 71


చ.⁠

ఒరుల భజింపఁబోడుగద యొక్కపుడు న్నినుఁగొల్చు మేటి భా
స్వరసరసామ్రభూరుహలసత్కిసలానుభవానుమోదియౌ
పరభృతరాజమెందు నొకపట్టున వేములఁ జేరనేర్చునే
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 72


చ.⁠

సరవిని జీవనార్థముగ చర్మసితాభసితాక్షమాల లే
నరుడు ధరించు కైతవమునన్ భువినాతఁ డశేషధారుణీ
భరణధురీణప్రచురభాగ్యసమన్వితుఁడై చెలంగుఁబో
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 73


చ.⁠

సురచిరభక్తితోడ మనుజుం డొక బిల్వదళం బొకప్డు నీ
శిరమున నుంచెనేని యది సింధురసైంధవచామరధ్వజాం-
బరమణిభూషణాది విభవస్ఫురణ న్గనుపట్టి యుండుఁబో
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 74


చ.⁠

నరుఁ డొకనాఁడు నీ నగరు నంగనఁ బట్టి విచిత్రఘంటికో
త్కరరవమాలకించిన నతండు వినం డెపుడున్ కృతాంతకా
సరగళఘంటికావ్రజవిశంకటసాంద్రఘణంఘణధ్వనుల్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 75


చ.⁠

దురదుర జాగి మర్త్యుఁ డొకతూరె సమంచిత తావకీన మం
దిరమునకుం బ్రదక్షిణ మతిప్రమదంబునఁ జేసెనేని య
ప్పురుషుఁడు శేషభూభువనపోషణధూర్వహుడై విరాజిలున్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 76


చ.⁠

తిరమున నీ నివేశమున దీప మొకానొకనాఁ డొకింత బం-
ధురమతి నిడ్డ ధన్యుఁడు చతుర్ముఖముఖ్యనిలింపమాన్యుఁడై
నిరుపమ తావకీన పద నిత్యసుఖోన్నతుల చెలంగుఁబో
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 77


చ.⁠

కరతలతాళవృంతములుఁ గ్రమ్మఁగ నెవ్వఁడు తావకాలయా
జిరమున నాఁడు నాతఁడు వసించు విరాజితరాజతావనీ
ధరశిఖరాగ్రరత్నసముదంచితకాంచనసౌధవీధులన్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 78


చ.⁠

పరిచితి మీఱ మీ శిరముపై పురిసెండు జలంబొకప్పుఁ డా-
దరమునఁ జిల్కు బల్లిదుఁడు తథ్యముగా నఖిలాఘదూరుఁడై
ధరఁ గల పుణ్యతీర్థములఁ దప్పకఁ గ్రుంకు ఫలంబుఁ జేకొనున్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 79


చ.⁠

బెరసిన వేడ్క యుల్లమునఁ బిక్కటిల న్మనుజుండు నీకుఁ గొ
వ్విరిసరమొక్క టచ్చపువివేకముతోడ నొసంగిన న్బురం
దరధరణీరుహప్రసవదామవిభూషితుఁడై చెలంగుఁబో
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 80


చ.⁠

కరయుగమెత్తి నీకుఁ గుతుకంబున మొక్కునతండు శేషభూ
వరమకుటాగ్రరత్నసమవాయసమగ్రవిభాసముల్లస
చ్చరణసరోజుఁడై వివిధసంపదలం గొదలేక యుండుఁబో
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 81


చ.⁠

తొరలెడు భక్తిఁ గప్పురపు ధూపము నీకు జనుం డొసంగుచో
గొరగొర వానిమేనఁ గల ఘోరతరాఘపిశాచసంఘముల్
బరువడి కూయి వెట్టుచును బారి చనుంగద తత్క్షణంబునన్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 82


చ.⁠

పరునిఁ బరేశు భక్తజనపాలనశీలు ననంతు నాద్యు న
క్షరు నపవర్గదాయకు జగన్మయు నద్వయు నప్రమేయు నం
బురుహభవాండభాండపరిపూర్ణపిచండుఁ దలంతు నిన్మదిన్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 83


చ.⁠

హరునకు వందనంబు ఫణిహారునకు న్శరణ్యార్థి దేవతా
వరదునకుం జొహారు పురవైరికి మ్రొక్కు నగేంద్రజామనో
హరునకు జోత యంచు ననయంబును నీకు నమస్కరించెదన్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 84


చ.⁠

దిరమున స్నానసంధ్యలును దేవ సపర్యలు సువ్రతంబులు
న్గురుభజనాదికంబులు నకుంఠితభక్తి నొనర్పనేర నీ
చరణము లాశ్రయించితి నిజంబుగ నన్నిక నెట్లు బ్రోచెదో
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 85


చ.⁠

గురుఁడవు బాంధవుండవు సఖుండవు తల్లివి దండ్రి వన్న వీ
శ్వరుఁడవు దాత వాప్తుఁడవు సర్వము నీవె యటంచు నమ్మితి
న్వరదుఁడవై కృపారసము వావిరి నాపయిఁ జిల్కి బ్రోవవే
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 86


చ.⁠

కెరలెడు ఘోరపాపతతికి న్మదిఁ గంపిలి యేయుపాయమున్
దొరకక యొక్క పెన్వెరవు దోచిన నుబ్బుచు నిబ్బరంబుగా
హరహర యంచుఁ బల్కితి నహా! దురితంబులు వీడి పారెఁబో
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 87


చ.⁠

దొరకెను నాకు భాగ్యమున దుస్సహదండధరప్రచండకిం
కరపటుదర్పసంహరణకారణమై యయిదక్షరంబులు
న్బరగిన మంత్రరాజము సుపర్వులకైనఁ దలంక నేనిఁకన్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 88


చ.⁠

గిరిశ నమోస్తు యోగిజనగేయ నమోస్తు మహోగ్రదోషసం
హరణ నమోస్తు భోగికులహార నమోస్తు సమస్తదేవతా
చరణ నమోస్తు తే యనుచు సారెకుఁ గోరి నమస్కరించెదన్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 89


చ.⁠

వరద పరాకు భక్తజనవంద్య పరాకు సమస్తపాపసం
హరణ పరాకు భక్తనివహావహదక్ష పరాకు యోగిహృ
శ్చరణ పరాకు సేయకిఁక సయ్యన నా మనవాలకించవే
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 90


చ.⁠

పరవనితాపరాస్థనరపాలకసేవలయందుఁ గోరికల్
దొరలఁగనీక నీ చరణతోయజభక్తియు సూనృతోక్తి యె
వ్వరికినిఁ గీడు సేయమియు వాలెము నా కొనఁగూర్చి బ్రోవవే
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 91


చ.⁠

మురిపెముతోడ నక్షుసరము ల్భసితంబు ధరించినాఁడ మ
ద్గురువరదత్తమై సకలదోషములన్ దొలఁగించు ద్వాదశా
క్షరి జపియించినాఁడ కలుషంబులు నాకిఁకఁ గల్గుటెట్లయా
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 92


చ.⁠

మురువుగ నక్షమాలయును మోదికఁ బూనితి భూతి దాల్చితిన్
స్మరణగ నైదువర్ణముల మంత్రము వేమరు నుచ్చరించితిన్
దురితపిశాచముల్ దొరగి దూరముగా జనకుండుటెట్లికన్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 93


చ.⁠

గురువరభక్తి మీఱ మిముఁ గొల్చినవాఁడనటంచుఁ దద్దయుం
గరువముతోడ నేను కృతకర్మము లెవ్వియుఁ జేయనైతి దు
ర్భరదురితాత్ముఁడంచును దిరస్కృతిఁ జేయక నన్నుఁ బ్రోవవే
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 94


చ.⁠

ఒరిమెఁ గవీంద్రుఁ డేమెఱుఁగునో యని దర్శనమియ్యనోడి బ
ల్దొరలును మూలనీగుదురు లోభమున న్నిను నే మఱేమియు
న్వరములు వేడ నాకిపుడు వైళము దర్శనమియ్యరాగదే
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 95


చ.⁠

నర పశు పక్షి వేఁట మృగ నాగ ఝషాదిక జంతుయోనుల
న్బొరిఁబొరి నెన్నిమార్లు మును పుట్టితినో యెఱుఁగ న్మహాఘనుల్
హరు నినుఁ గొల్చు భాగ్య మిపుఁ డబ్బెనికే క్రియఁ బ్రోచెదో సుమీ
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 96


చ.⁠

ఒరుల నుతింపఁజాలఁ గలుషౌఘమహాదహనాగ్నికీలయై
బరగుచుఁ గామితార్థము లపారముగా నిడు నీదు నామసం
స్మరణ యహర్నిశంబును బ్రశస్తిగ నాకొనరించి బ్రోవవే
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 97


చ.⁠

కరిముఖ నందిభృంగిరిటికాశిసముద్భవ కాలభైరవా
ద్యురు బలవన్మహాప్రమథయోధవరేణ్యులు గొల్వ ధారుణీ-
ధరసుతఁ గూడి నాకిపుడు తావక మోహనమూర్తిఁ జూపవే
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 98


చ.⁠

సరభసలీల నొక్కనిమిషంబును నిన్భజియింపలేక బల్
దెరవుల దుర్విచారములఁ ద్రిమ్మరుచున్నది యెన్ని చెప్పిన
న్మరలదు పాపజాతిమతి నాకిపు డంకెము గాదికెట్లయా
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 99


చ.⁠

అరయఁగ నే నహర్నిశము నాఁడెడు వాక్యములెల్లఁ దావక
స్ఫురణగఁ జిత్తగించి కలుషప్రకరంబులఁ బారఁదోలి నీ
చరణసరోజభక్తి కొనసాగఁగఁజేపీ సముద్ధరింపవే
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 100


చ.⁠

ఇరవగు భక్తితోడ జనుఁ డీశతకంబుఁ బఠించిన న్సమా
దరమున వ్రాసిన న్వినినఁ దప్పవుగా వివిధేష్టభోగముల్
ధర భుజియించి యా తుదిని తావక దివ్యపదంబుఁ జేరుఁబో
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

⁠ 101

సంపూర్ణము.