Jump to content

చిత్రభారతము/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి

ప్రథమాశ్వాసము

వ.

అభ్యుదయపరంపరాభివృద్ధిగా నాయొనర్పంబూనిన చిత్ర
భారతంబను మహాపురాణంబునకుం బ్రారంభం బెట్టిదనిన.

1


ఆ.

సకలపుణ్యతీర్థసంఘవరేణ్యంబు
పాపదావశిఖికిఁ బ్రావృషేణ్య
జలధరాగ్రగణ్య మిల నైమిశారణ్య
మఖిలమునిశరణ్య మగుచు వెలయు.

2


వ.

మఱియు నప్పుణ్యక్షేత్రంబున సకలకాలపల్లవితకోరకిత
కుసుమితఫలితచందనమందారమాతులుంగమధూక
సరళసౌవీరజంబీరఖర్జూరనారికేళనారంగతాల
తక్కోలహీంతాలతమాలకురంటకకోవిదారకపిత్థ
జంబూపనసబదరీశమీబిల్వామలకవటయజ్ఞాంగ
పున్నాగపాటలాదిప్రభేదంబులం దనరి ప్రియులకయివడి
ననంగి పెనంగి మెఱయు మల్లికామాధవీనాగవల్లీలవలీ
సేవంతికైలాజాతిమరీచిప్రముఖనానాలతావితానం
బుల సురభితావిశేషంబులచేత విబుధాళులకు ననుదినంబు
సంతర్పణంబు చేయించుచు సత్ఫలంబులన్ ద్విజశ్రేణికి నని
వారితసత్రంబు లిడునట్టి తరువాటికల విజృంభించి ఫలరస
మకరందమహాప్రవాహంబు లెల్ల హ్రదీభవించినచందంబున
నతిమధురపానీయంబులం బొలుపొంది తటప్రదేశసుఖా
సీనపరమహంసద్విజరాజప్రభావిశేషంబున నిరంతరవిక

సితసితకమలకల్హారకుశేశయకుముదకువలయవాసనా
వాసితంబులును, గలహంసకారండవచక్రవాకటిట్టిభ
బకబలాహకక్రౌంచసారసాదినానాజలపక్షిసమూహ
కోలాహలంబులును దేవాభిషేకనిమిత్తమునికుమార
పూర్యమాణకరకమండలుసంభూతఘుమఘుమధ్వాన
బధిరీకృతభూనభోంతరంబులును నగు సరోవరంబులం
గనుపట్టి, మునికన్యకాప్రవర్ధమానబాలలతాకీర్ణపర్ణ
శాలాప్రాంగణప్రదేశవికీర్యమాణనీవారచర్వణలీలా
లంపటమృగశాబకవినోదంబులం జెలువొంది మునిసం
దోహపరిపాలితకామధేనుస్తన్యపానసమేధమానవత్స
ముఖస్రవత్పయఃఫేనజాలశమితరజఃపుంజం బై రంజిల్లి
పుండరీకాక్షఖండేందుమౌళిపూజావేళామునిరాజరణిత
ఘంటాజాతఘణఘణక్వణనచకితకురంగడింభకచంక్ర
మణవిలాసంబున నింపొంది శాఖామృగలంఘనాధూతమహీ
రుహశాఖాగ్రనిరంతరనిర్యత్పుష్పరసపంకిలాలవాల
ప్రదేశంబై విలసిల్లి యజ్ఞస్రమునిమాణవకపఠితఋగ్యజు
స్సామాదిబహువేదఘోషముఖరితసకలదిశ్చక్రం బై
మెఱసి ఋషికృతాధ్వరదేవతాహ్వానస్వానప్రతిధ్వనిత
చక్రవాళగహ్వరం బై చెలంగి తపస్వికృతక్రతుహోమ
ధూమబంధురగంధవాసితసకలమహీమండలం బై యెసంగి
మహాభారతంబుచందంబున నర్జుననకులవిలాసంబునం
బొదలి చంద్రమండలంబుపగిది నిఖిలదేవతాభ్యవహారనిల
యతాకలితం బై మించి దేవేంద్రసభామంటపంబులీల బుధ
గురురంభాహరిణీగౌరవంబున మీఱి గ్రహమండలంబు
తెఱంగున హంసజైవాతృకప్రముఖాధిష్ఠానం బై వెలసి

రామాయణంబువైఖరి ఖరదూషణవిరోధంబున నొనరు
నన్నెలవునఁ జాంచల్యంబు బహిర్మారుతంబునందును, శ్రుతి
సముల్లంఘనోద్యోగంబు తాపసకామినీకటాక్షాంచలంబు
లందును, రాగంబు మౌనిపరిధానంబులందును రజో
విజృంభణంబు కై తకంబులందును దమఃప్రసారం బుపాంత
గిరిగహ్వరంబులందును బ్రతికూలత్వం బరిషడ్వర్గంబులం
దును నాస్తికబుద్ధి యీషణత్రయంబునందును జిహ్వా
చాపల్యంబు హరినామస్మరణంబునందును నిరంతరవ్యస
నంబు నారాయణపదాంబుజద్వయీసేవైకపాకంబులందును
గాని యొండెడ లేక పొలుచు నచ్చట విహరించుకుందేటి
కూనలమేనులు మవ్వంబు నివ్వటిల్ల నందందదువ్వు శశాద
నంబులును లీలాదృష్టివిలాసంబున నవ్వనం బెల్లన్ గువలయ
తోరణాభిరామంబుగాఁ జేయు హరిణీసముదయంబులకు
నెయ్యంబున సంతసం బంతంతకు ఱేచుఱేఁచులును తాపససం
రక్షితవన్యధాన్యభక్షణచకితమూషికావళికిం దల్లులగతిం
జన్నిచ్చి రక్షించు పిల్లులును వనమక్షికాజక్షణకండూల
హోమధేనువులయందు మచ్చికలు పిచ్చిలం దమగోళ్ల దూల
వారించుశార్దూలంబులును, సంతతయోగాభ్యాసయోగిజన
రేచితవాయుపానతుందిలదందశూకబృందంబుల భయం
బుడిపి యూరడిలం దిరుగు మయూరంబులును సంతతసం
తోషభరితాంతఃకరణమత్తశుండాలజాలంబులతోడం గూడి
మాడి విహరించుహరులును, హరినికరసటాచ్చటాకంకతి
కాయమాననఖతుండంబు లై మైత్రి నెఱుపు గండభేరుం
డంబులును, వెండియు ననేకమృగంబులు నన్యోన్యవైరంబు
లుడిగి యత్యంతసమ్మదంబున విహరించు మఱియును.

3

సీ.

చెలఁగి “హరేర్న కించి ద్వ్యతిరిక్తమ
             స్తి" యటంచుఁ బల్కురాచిల్కగములు
వరుసమై "వాసుదేవస్సర్వమితి” యని
             సతతంబుఁ బలవించు శారికలును
“నచ నచ నారాయణాత్పరం మంత్ర" మన్
             తెలివిని మ్రోయు నిందిందిరములు
మోదముతో "నమో వేదాంత వేది నే”
             యని యెఱిఁగించు పికావళియును


తే.

దపసులు సకలవేదశాస్త్రములు చదువు
నప్పుడు గవుళ్లుపోయిన యట్టియెడలఁ
దీర్చి చదివించునట్టి సద్ద్విజకులంబుఁ
గలిగి విలసిల్లు నప్పుణ్యకాననంబు.

4


ఆ.

ఆవనంబులోనఁ బావనశీలురు
శౌనకాదిమౌనిజనులు గూడి
సత్రయాగ మమర సమ్మదంబునఁ జేయఁ
గను దదీయమహిమ గనఁగఁ దలఁచి.

5


సీ.

అరుణజటాబంధధరులు భస్మత్రిపుం
             డ్రాంకితాలికులు కృష్ణాజినోత్త
రీయులు వల్కకౌశేయులు రుద్రాక్ష
             భూషితదేహులు పుణ్యతీర్థ
జలపూర్ణమండలుహస్తు లభినవ
             దండపాణులు జగద్వంద్యచరితు
లఖిలశాస్త్రాగమాభ్యాసవిశ్రాంతులు
             స్పటికాక్షమాలికాభరణధారు

తే

లంబుజాతదళాక్షపాదారవింద
యుగళసేవాప్రవీణులు నిగమజాల
మూర్తు లజకల్పులును నైనమునులు యతులు
నేగుదెంచిరి శిష్యసమేతు లగుచు.

6


సీ.

మఱియుఁ గొందఱు ముక్తిమత్తకాశినియందు
             వినుకలిమేలున మనము దగిలి
గంధంబు బంధ మై కమ్మనిపువ్వులు
             నొవ్వు లై నవ్వులు దవ్వు లగుచు
రాకలు దుఃఖంబురాక లై యారామ
             కూటంబు ఘనకాలకూట మగుచు
భూరిరత్నాంకితభూషణంబులు దూష
             ణంబులై చెలఁగ నెయ్యంబు మీఱ


తే.

నిద్రయును మేలుకనుటయు నెఱయలేక
తుల్యమగు నాయవస్థలతోడనున్న
కాముకులకైవడి సురతకాంక్షఁ దిరుగు
నట్టి మౌనీంద్రులును వచ్చి రచ్చటికిని.

7


వ.

ఇవ్విధంబున సమస్తధరణీమండలపుణ్యక్షేత్రనివాసు లైన
మహాత్ములు శిష్యజనసమేతు లై వచ్చి యవ్వనంబు నిండ నిల్చి
యుండి రయ్యవసరంబున వారలఁ జూడంగోరి విబుధజన
మాన్యుండును దపోవిద్యాధన్యుండును సాత్యవ తేయ
శిష్యకుమారుండును విమలాచారుండును సకలపురాణవచన
రచనాపరితోషితమునిజాతుండును నగు సూతుండును జను
దెంచిన నతని మృదుమధురభాషణంబుల గారవించి సుఖా
సీనుం గావించి యి ట్లనిరి.

8

చ.

అనఘ పరాశరాత్మజముఖాంబుజసంభవ మైన యీపురా
ణనికర మెల్లఁ దావకమనఃకమలంబున నున్నదందు మా
కు నొకపురాణరాజము నకుంఠితవాగ్విభవంబు మీఱఁ జె
ప్పి నిఖిలమౌనిసంతతికిఁ బ్రీతి యొనర్పుము తాపసోత్తమా!

9


తే.

అనిన నారోమహర్షణతనయుఁ డనియె
వినుఁడు దత్తావధానులై మునివరేణ్యు
లార సకలాఘహరణంబు భూరిపుణ్య
కరము నగునది చెప్పెదఁ జరిత మొకటి.

10


శా.

వ్యాసప్రోక్తమహాపురాణములు ముయ్యా ఱందులోఁ జిత్ర మై
శ్రీసౌభాగ్యవిలాసదం బయి బహుశ్రేయస్కరం బై కడున్
భాసిల్లున్ సుపురాణ మొక్కటి ధరన్ బ్రహ్మాండ మన్పేరఁ బెం
పై సర్గ ప్రతిసర్గ వంశ మను రాజాది ప్రశంసాకృతిన్.

11


చ.

చదివెడువారికి న్వినెడు సభ్యులకు న్మది వాంఛఁ జేయు బ
ల్లిదులకుఁ గల్గు విప్రులకు లేఁగలతోఁ గనుపట్టు లక్ష పె
న్మొదవుల నిచ్చినట్టిఫలమున్ హయమేధముఁ జేయుపుణ్యమున్
గొదుకక ధాత్రియంతయు నకుంఠితదానము సేయు శ్రేయమున్.

12


క.

గ్రామములు వేయు సాల
గ్రామంబులు లక్ష కోటికన్యాజనమున్
హేమాద్రు లనంతంబులుఁ
ప్రేమ నొసఁగుఫలము దీనిఁ బేర్కొనఁ గలుగున్.

13


క.

అని పలికి మదిఁ బరాశర
తనయు న్భావించి మ్రొక్కి దామోదరపా

దనలీనము నుతించి ముదం
బున సూతుఁడు శౌనకాదిమునులకుఁ జెప్పెన్.

14


చ.

వినుఁడు మహాత్ములార పృథివీస్థలియందు విచిత్రలీలఁ గృ
ష్ణునకును దేవనాయకతనూజునకున్ రణ మయ్యె నొక్కరా
జు నెపముచేత నర్జునునిఁ జుట్టలతోడ హరించె ధర్మనం
దనుఁ డొకరుండుఁ దక్క యదునాయకుఁ డుగ్రరథాంగధారచేన్.

15


క.

తదనంతరంబ క్రమ్మఱ
యదువిభుఁడు గృపాసముద్రుఁ డై వాణీశ
త్రిదశేశుల కాశ్చర్యం
బొదవ మనిచె నుభయసైన్యయోధులనెల్లన్.

16


క.

ఇది చిత్రభారతంబన
ముదమున వర్ధిల్లె లోకమునఁ బుణ్యౌఘా
స్పద మై లక్ష్మీవల్లభ
పద మై కడుచిత్ర మై సభారంజక మై.

17


వ.

అనవుడు హరికథాశ్రవణాహ్లాదు లగు శౌనకాదు లతి
విస్మితహృదయు లై యి ట్లనిరి.

18


సీ.

కౌరవబలము నుగ్రతఁ జక్కు సేయుచో
             సూతుఁ డై మెఱసెఁ గృష్ణుండు గాఁడె?
[1]ఖాండవవన[2]దగ్ధకాలమునందున
             సురలఁ దోలించెఁ గృష్ణుండు గాఁడె?

[3]కర్ణప్రముక్తమౌ దీర్ఘపన్నగమహా
             శుగముఁ దప్పించెఁ గృష్ణుండు గాఁడె?
ప్రతినదప్పకయుండ నతిగుప్తు సైంధవు
             నుఱుమాడఁ జేసెఁ గృష్ణుండు గాఁడె?


తే.

యర్జునున కెల్లభంగుల నైనశౌరి
కంటికిని ఱెప్పరీతి నిక్కముగఁ బ్రోవ
నతనితోఁ బార్థుఁ డేల కయ్యంబుఁ జేసెఁ
దామసం బెట్లు పుట్టె నాతనికి ననఘ.

19


వ.

ఈవిశేషంబు సవిస్తారంబుగాఁ జెప్పి కృతార్థులం జేయు మనిన
నారోమహర్షణకుమారుం డి ట్లనియె మున్ను నారాయణ
ధ్యానానురాగి యగుశుకయోగీంద్రుని నిక్కథ యుదార
స్వాంతుం డగు నిలావంతుండను ధనంజయనందనుం డడి
గిన నతని మన్నించి యమ్మహానుభావుండు చెప్పినవృత్తాం
తంబు నెఱింగించెద. దత్తావధానుల రై వినుండని చెప్పం
దొడంగె.

20


సీ.

అనవరతంబు ననంతాధివాస మై
             పొలుపొందు వైకుంఠపురముఁ బోలి
విషధరప్రఖ్యాతవిశ్రమస్థాన మై
             చెలు వైన కైలాసశిఖరిఁ బోలి
నిర్ముక్తసందోహనిలయ మై విలసిల్లు
             నీరజోద్భవునిమందిరముఁ బోలి
నవ్యసుధారసభవ్యభోగాఢ్య మై
             కనుపట్టు నాకలోకంబుఁ బోలి

తే.

జలజనిలయాధినాయకచరణనీర
జాతజాతతరంగిణీసత్ప్రవాహ
వారిపూరపవిత్ర మై భూరిమహిమఁ
బొలిచెఁ బాతాళభువనంబు పుణ్యధనము.

21


చ.

బలువగు [4]వేల్పుఱేని నునుఁబానుపునుం గనుపట్టునిల్లు వె
న్నెలతలకానిసొమ్ముగమి నించినపెట్టియ యెట్టివేళలం
బులుఁగులరాచవారికలవోకలకుం జొరరాని యిక్క పెన్
జిలువలమన్కిప ట్టనుచుఁ జెప్పఁగ నొప్పు రసాతలంబు దాన్.

22


క.

నాకులలోన మెలంగియు
నాకులఁ దమమహిమచేఁ దృణంబుగ మది నా
లోకించి భుజగవరులు ని
రాకులతఁ జరింతు రమ్మహానిలయమునన్.

23


తే.

కుటిలగతిఁ దమకు నిజముగఁ గూర్చినట్టి
తామరసగర్భుమర్యాదఁ దప్పరామి
భావమున నూహ చేసి యాఫణికులంబు
లాత్మ కాంతాలకంబులయందు నిడియె.

24


శా.

ఆభూమిన్ బ్రవహించు నెప్పుడు నపర్ణాధీశమౌళిస్థగం
గాభంగామలపద్మగంధనికరవ్యాప్తప్రవాహాఢ్య [5]యై
యాభోగావతి పన్నగేశఫణదీవ్యత్పద్మరాగచ్ఛటా
శోభానూనహిరణ్మయాంబుజములన్ జూడంగ నింపొందుచున్.

25


క.

వినుఁ డానది శ్రుతిబాహ్యులు
ననవరతముఁ గుటిలగతులు నగుభోగివరుల్

దనవారిలోన మెలఁగినఁ
దనవారిఁగఁ జేసి హరునితల యెక్కించెన్.

26


వ.

అమ్మహకూలంకషాకూలప్రదేశంబున నమరావతియుంబోలె
విబుధాలయం బై యర్చిష్మతియున్ బోలె శుచిస్థానం బై
సంయమనీనిలయంబునుంబోలె ధర్మాధిష్టానం బై పుణ్యవతి
యుంబోలెఁ బుణ్యజనావాసం బై యమలావతియునుంబోలె
రత్నాకరం బై గంధవతియుంబోలె మహాబలనివాసం బై
యలకానగరియుంబోలె ధనదాశ్రయం బై యైశాన్యం
బునుంబోలె సర్వజ్ఞక్షేత్రం బై యెప్పి భోగవతి యన
నొక్కపురంబు గలదు.

27


క.

ఆపురమున కధిపతి యై
యేపట్టున రాజనీతి యెడలక ధర్మ
వ్యాపారం బుడుగక యౌ
లూపేయుఁడు దందశూకలోకం బేలున్.

28


తే.

అతఁ డిలావంతుఁ డనుపేర నమరు టెఱిఁగి
యును కరీంద్రధరాహీశులును మదించి
తా రిలావంతు లనుకొన్నదాన వారి
సత్వధైర్యమనీషలు జడుపుగొనియె.

29


తే.

ధర్మవర్తన భీమప్రతాపమహిమ
నర్జునఖ్యాతి తనయందు ననువుపఱుచు
సత్యమున సత్వమున శరాసననిరూఢి
మీఱి [6]తనతండ్రులను విడంబించె నతఁడు.

30


వ.

అని మఱియును.

31

క.

భోగవతీదక్షిణతట
భోగవతీపురమునందు బుధులు నుతింపన్
భోగవతీసతితో బహు
భోగవిశేషములఁ బ్రొద్దుపుచ్చుచు నుండెన్.

32


వ.

అంత.

33


చ.

అతఁ డొకనాఁడు మంత్రులు మహారసికు ల్మునులుం గవు ల్భుదుల్
హితులుఁ బురోహితు ల్సరసిజేక్షణలుం బరివారమున్ దొరల్
చతురతఁ గొల్వ నైందవశిలాపరికల్పితసౌధవేదికో
న్నతనవరత్నకీలితకనత్కనకాససమధ్యవర్తి యై.

34


వ.

పేరోలగం బున్నయవసరంబున.

35


చ.

భువనములం బ్రసిద్ధిఁ గని పొల్చిన సద్ద్విజకోటికన్న నె
క్కువయగుహంసచక్రములు గోరి భజింపఁగ నంబుజాక్షుఁ బె
క్కువిధములు స్మరించుపలుకుల్ శ్రుతియోగ్యము లై చెలంగ ము
క్తివనితచేతికీరమనఁ [7]దేఱి శుకుం డరుదెంచె వేడుకన్.

36


తే.

ఇట్లు వచ్చిన శుకయోగి నెదురుకొని సు
ఖాసనాసీనుఁ గావించి యర్ఘ్యపాద్య
ముఖ్యపూజావిశేషసమ్ముదితుఁ జేసి
ప్రణతు లొనరించి మధురోక్తిఁ బలికె నతఁడు.

37


సీ.

అనవరతంబు నత్యానందకారి వై
             కామరోషవికారగరిమ మడఁచి
సులభుఁ డై ద్విజరాజచూడావతంస మై
             దనరెడు సర్వజ్ఞు ననుకరించి

నట్టిమహాత్ముండ వబ్జాక్షపాదార
             విందభృంగమవు వివేకనిధివి
నీరాకచేతను [8]నెగడె మత్పుణ్యంబు
             లనఘాత్మ నీ వెఱుంగని దొకింత


తే.

యైనఁ గాలత్రయమునందు నరసి చూడ
లేదు ప్రాక్తనరాజావళీవిశేష
చరితములలోన మిగులనాశ్చర్యహేతు
వయినకథ యెద్ది యది నాకు నానతిమ్ము.

38


క.

నరనారాయణు లనఁగాఁ
బరఁగి నిరంతరము [9]సఖ్యభానోన్నతిఁ ద్రి
మ్మరు కృష్ణులకుం దమలో
దుర మయ్యె న దేమినెపము దొరలి మునీంద్రా.

39


తే.

పాండుసూనులఁ బొదువునాపదలు మాన్పఁ
బాలుపడి శోభనంబులు గీలుకొలుపఁ
జాలి చుట్టంబు మంత్రియు సఖుఁడు నగుచుఁ
గృష్ణుఁ డతిభక్తి వారి రక్షించు నెపుడు.

40


శా.

ఆకుంతీసుతులందు నర్జునునితో నత్యంతమున్ మైత్రిమై
నాకృష్ణుండు మెలంగుఁ దొల్లి బలభద్రాదుల్ కడంక సుభ
ద్రాకన్యామణి రాజరాజునకు నీఁ దర్కించుచుండంగ మా
యాకృత్యంబున నీయఁడే నరున కయ్యబ్జాతపత్రేక్షణన్.

41


క.

దివిజులు భయమందఁగ ఖాం
డవవన మనలునకు నిచ్చునాఁ డాలక్ష్మీ
ధవుఁడు సహాయం బై ని
ల్చి విజయునకు జయ మొసఁగఁడె లీలయపోలెన్.

42

తే.

ఈవిశేషంబు విరివిగా నెఱుఁగఁ జెప్పి
చెవులపండువు సేయు మచ్చిక దలిర్ప
మునివరేణ్య భవద్వాక్యజనితమధుర
సుధ గదా నన్ను నేఁడు విబుధుఁగఁ జేయు.

43


వ.

అనవుడు నిలావంతునకు శుకయోగీంద్రుం డి ట్లనియె.

44


తే.

అనఘ మేలైనయది నన్ను నడిగి తీవు
వినెడువారికిఁ జెప్పెడుఘనమతులకు
నఖిలపాతకహారియు నభిమతార్థ
దాయకము నగు తచ్చరిత్రంబు వినుము.

45


చ.

కలఁడు మహాత్ముఁ డొక్కఁడు సుఖంబులు దుఃఖములు స్సమంబుగా
మెలఁగి సుహృజ్జనంబులు నమిత్రులు నేకవిధంబుగాఁ జెలం
గి లలితలోచనాతతి మృగీసమితి న్సరిగాఁ దలంచువాఁ
డిలపయిఁ [10]దుల్యభావనయు నిట్లు భజించుటఁ దుల్యమౌనినాన్.

46


చ.

అలఘుతపోవిశేషమున నంబుజగర్భునితోడ శాంతి మై
సలినదళాక్షుతోడ భువనస్తుతభూతహితప్రబుద్ధిచే
నల గిరిజేశుతోడ మహిమాతిశయంబున వ్యాసుతోడ నీ
తుల గురుతోడఁ దుల్యుఁడనఁ దుల్యుఁడు మించె ధరాతలంబునన్.

47


తే.

అతఁడు పరమాత్ముఁ గూర్చి బాహ్యమును లోను
నేకముగఁ జేసి లోకంబులెల్లఁ బొగడ
భూరిభాగీరథీనదీతీరమునను
విమలమతితోడఁ దపముఁ గావించుచుండె.

48

వ.

అని శుకయోగీంద్రుం డిలావంతున కెఱింగించినతెఱంగు
చెప్పుటయు విని యటమీఁది వృత్తాంతం బేమని యడు
గుటయు.

49


మ.

హరిదంత ద్విపదంతకాంతి లసదుద్యత్కీర్తికాంతామనో
హరదుగ్ధాంబుధిసంభవారమణపాదాబ్జద్వయీభావనా
వరతేజోజితనిస్ఫురజ్జ్వలనజంభద్వేషిదంభోళి భా
స్కర కృష్ణారమణీమణీవరతనూజా మానినీమన్మథా.

50


క.

అనతారిమానభంజన
వినతానూనుప్రతాపవిశ్రుతవనితా
జనతాపంచశిలీముఖ
ఘనతామరసాప్తతనయఘనదాననిధీ.

51


మాలిని.

అతులితగుణరూపా హారిపుండ్రేక్షుచాపా
హతవిమతమహీపా యాత్మవంశప్రదీపా
జితకలితతికోపా శ్రీమహాభోగగోపా
క్షితిభరణదిలీపా క్ష్వేడకంఠప్రతాపా.

52


గద్యము.

ఇది శ్రీమత్కౌండిన్యగోత్రపవిత్ర చరిగొండ తిమ్మ
నామాత్యపుత్త్ర సకలవిద్యాపారీణ శతఘంట సురత్రాణ
సుకవిజనవిధేయ ధర్మననామధేయప్రణీతం బయినచిత్ర
భారతం బనుపురాణకథయందుఁ బ్రథమాశ్వాసము.

  1. భగదత్తుఁ డల్క మై నిగిడించువైష్ణవా, శుగము వారించెఁ గృష్ణుండు గాఁడె?
  2. దాహ
  3. కానీనముక్తనాగమహాశరంబును, బెండుగాఁ జేసెఁ గృష్ణుండు గాఁడె?
  4. నల్లవేల్పు
  5. తా, నై భాగీరథి
  6. తలిదండ్రులను
  7. జేరి
  8. నీడేఱె
  9. సత్యభాషారతి
  10. దుల్యభాగ యనునేట జనించిన తుల్యమాని