Jump to content

చిత్రభారతము/తృతీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

చిత్రభారతము

తృతీయాశ్వాసము



రమణీరమణపదాం
భోరుహషట్చరణ, కల్పభూమీరుహదా
నా, రామాజనమదన, ద
యారసరఘురామ, పెద్దనామాత్యమణీ.

1


వ.

అవధరింపుము మృదుమధురవచనరచనాపరితోషితముని
జాతుం డగుసూతుండు హరికథాశ్రవణాహ్లాదు లగుశౌన
కాదులకు ని ట్లనియె న ట్లాకొలను గనుంగొని యద్దరి నిలిచి
యావేల్పుముధ్ధియలు తద్దయు వేడుకం దమలో ని ట్లనిరి.

2


సీ.

తనసొమ్ములైయున్న ఘనతరపద్మరా
             గప్రభాపటలి నల్గడలఁ బర్వఁ
దనజీవనస్థితి మనియెద నని రాజ
             హంసకుండలము నెయ్యమునఁ గొల్వఁ
దననిత్యమధురత్వమునకుఁ దక్కినవారిఁ
             జౌక సేయుచుఁ గవీశ్వరులు పొగడఁ
దనకు నీడై సంకేతంబును నిరసించి
             పుండరీకంబులు దండి మెఱయఁ

తే.

దన్నుఁ బాయని సిరిఁ జూచి తలఁగ లేక
వేడ్కఁ బ్రమదాళు లెల్ల సేవించుచుండ
సరసులకునెల్ల మేటియై సార్వభౌము
చందమున నుల్లసిల్లి యీసరసి మెఱసె.

3


చ.

సరసిజనేత్ర చూడు జలజాతదళంబులపై బయఃకణా
లి రమణ మీఱె మారుఁడు చలింపని ధైర్యమున న్విరోధులం
బొరిగొని చేరవచ్చినను బుత్రునిశౌర్యము మెచ్చి లచ్చి దా
మరకతరత్నపాత్రికల మౌక్తికసంఘ మొసంగు కైవడిన్.

4


చ.

అలశశి తన్మొఱింగి కమలాకృతి నీటఁ దపంబుఁ జేసి ని
ష్కలుషవధూజనాసనతఁ గాంచిన నాశ్రయహైన్యజాతవి
హ్వలతఁ దదంక మీ కువలయత్వము నొంది విధుంగుఱించి యిం
దులఁ బటునిష్ఠమై నిలిచెనో తరుణీనయనత్వసిద్ధికిన్.

5


క.

తనపతి యగుద్విజరాజున
కున దను రాగంబుఁ జూడఁగోరియె యతఁ డిం
పునఁ దారలతోఁ గూడిన
నునుమొగమునఁ గెంపు గదిరెనో తొగగమికిన్.

6


మ.

మకరందంబున దానము ల్సలిపి, జిహ్మప్రక్రియ ల్మాని, కొం
జక పుప్పొళ్లు విభూతిగా నలఁది, యైశ్వర్యంబుతోఁ బుష్పలి
ట్ప్రకరంబుల్ హరుఁ డంగజాతుని హరింప న్వానిదేహాప్తికై
ప్రకటప్రేమఁ దపంబుఁ జేసె విలసత్పద్మాసనస్థేమతన్.

7


తే.

కందమూలంబులు భుజించి కమలవనము
లందు నెలవొప్పఁజేసి ద్విజాలి పొగడ

భువనసంచారమహిమచేఁ బొలిచి రాజ
హంసతతు లెల్ల హంసాలి ననుకరించె.

8


వ.

ఇట్లు తదీయవిశేషంబు లీక్షించి యిది యంభోనిధియుం
బోలెఁ గమలోదయస్థానంబై చంద్రమండలంబునుంబోలె
నమృతమయంబై రామరాజ్యంబునుంబోలె లక్ష్మణానంద
కరంబై కౌరవసభయుంబోలె ధార్తరాష్ట్రనివాసంబై
మించి నేత్రోత్సవంబు గావించె నని సంతసించి సలిలక్రీడా
సంసక్తచిత్తలై యత్తరుణులు తత్తీరంబున.

9


చ.

[1]వలుద విభూషణంబులు జవంబున డుల్చి చెలంగి వస్త్రముల్
గలయ బిగించి పెన్నెరులు గట్టిగఁ గొప్పులు దిద్ది మందయా
నలు వనవీథిఁ గ్రుమ్మర మనంబుల నిండిన సేదదీఱ మె
చ్చులు దిలకించు నా సరసిఁ జొచ్చిరి సంతస మెచ్చరింపఁగన్.

10


వ.

అయ్యవసరంబున.

11


సీ.

అంగుష్ఠములు ముట్టి యంఘ్రితలంబులఁ
             జెంది గుల్భంబుల నంది యూరు
వులఁ జేరి జఘసస్థలులు సోఁకి నాభిరం
             ధ్రములను సుడిసి పక్షముల నూది
చన్నులు పట్టి కక్షంబుల నొరసి కం
             ఠములు నిమిరి కపోలములు పుణికి
యధరంబు లాని నయనముల నొరసి ఫా
             లములఁ జుంబించి శీర్షముల నంటి


తే.

క్రమము మీఱఁగ నిరతాభిరతి దలిర్ప
గళల నెళవులు పరికించు కాంతు లనఁగఁ

జాలి నీరేజపత్రలోచనల నెల్ల
సారసామోదయుతసరోజలము లలమె.

12


చ.

[2]జలములుచొచ్చి యీఁదునెడ సారసనేత్రల మోముఁదమ్ములుం
జలజములుం గనంగ నొకచందమున న్విలసిల్లఁ దుమ్మెదల్
దలఁచఁగ లేక పిల్లలని తార్కొని వే కురులందుఁ జొచ్చి మేఁ
తలుగ మరందము ల్గురిసెఁ దక్కని ప్రేమల ముద్దు సేయుచున్.

13


ఉ.

పాటలగంధులెల్ల మురిపంబులఁ బంతము లెక్కఁ జల్లుఁ బో
రాటము లాడుచు న్గువలయంబులఁ దమ్ముల వేఁటలాడుచున్
గూటువ గూడి కేకిసలు గొట్టుచు నోలలు పెట్టి యాడుచున్
సాటికి నీఁదుచు న్మునిఁగి చయ్యన నొండొకచోటఁ [3]దేలుచున్.

14


క.

కరకమలము లాననపం
కరుహంబులు నేత్రపద్మగణమున్ బాదాం
బురుహంబులుఁ చొప్పడ నా
తరుణులు పద్మినులె యనుట తథ్యం బయ్యెన్.

15


తే.

అధరరాగంబు గన్నులయందుఁ జేరె
నడలయలసత తలఁపులఁ గడలుకొనియెఁ
గేళిరుచిపెంపు లూర్పులఁ గీలుకొనియె
సరసిలో నోలలాలెడి సతుల కెల్ల.

16


వ.

ఇవ్విధంబున జలక్రీడావినోదంబులు సలిపి యలసతం జెంది
చాలించి యయ్యిందువదన లుదకంబు వెడలివచ్చు నవస
రంబున.

17

చ.

తడిసిన మేలివస్త్రములఁ దార్కొని మేనులసోయగంబు వె
ల్వడునెడఁ జూడ నొప్పెఁ జనవల్లభ, చిత్తజరాజ్యలక్ష్మి నే
ర్పడర సమస్తపాంథహృదయంబులకున్ గడునద్భుతంబుగా
నెడపక విశ్వరూపము వహించినకైవడి నేమి చెప్పుదున్.

18


చ.

జలములు జాఱఁగాఁ జికురజాలము మించె సుధాంశు మ్రింగి త
త్కళ లఱగించుకో వెరవు గానక క్రక్కెడురాహురీతి వా
నలు గనుపట్టినప్పటి ఘనంబు తెఱంగునఁ బువ్వుఁదేనియన్
గళములబంటిఁ గ్రోలి తిరుగ న్వెడలించు నళివ్రజాకృతిన్.

19


తే.

ఇట్టి చెలువంబు చూపఱ కింపొనర్ప
మేనితడియొత్తు లెడలించి మించుదుప్ప
టముల సవరించి కురులనీరముల జార్చి
వేడ్కఁ గైసేయఁ దొడఁగి రావెలఁదులెల్ల.

20


ఉ.

బారుపటీరపంకమునఁ జాలఁగఁ బన్నిరు పోసి మంచిక
స్తూరిని మేళవించి తమచొక్కపుమేనుల మెత్తుకొన్న యొ
య్యారపుబాగు మించెఁ గుసుమాయుధుఁ డుర్వి సువర్ణకారుఁడై
మీఱెడు వన్నెకై పటిక మెత్తిన హేమశలాకలో యనన్.

21


తే.

ముత్తియంబుల కమ్మలు ముంగరలును
[4]జల్లిబోటులు బవిరెలుఁ జంద్రికలును
మొగపుఁదీవెలుఁ గంకణంబులు సరంబు
లును మొదలుగాఁగ సొమ్ము లెల్లను ధరించి.

22

క.

కురులు కొనగోళ్లచే దు
వ్వి రసంబులు చిల్కు కమ్మవిరులం జెవిపై
నెరవిరులు బాగుగా ని
ల్పిరి కొప్పులు దిద్ధి యానిలింపాబ్జముఖుల్.

23


వ.

ఇవ్విధంబున నవ్విలాసినులు చీనిచీనాంబరసుగంధానులేప
నానర్ఘ్యమణిభూషణమనోహరమాల్యంబులు ధరించి.

24


సీ.

ముఖచంద్రరోచులు మోహరించినఁ జూచి
             వేనలిచీఁకట్లు వెనుకఁ దొలఁగఁ
గౌను సింగంబులఁ గనుఁగొని కుచకుంభి
             కుంభముల్ ఱవికల కొంగులీఁగఁ
బలుకు కోకిలకూఁత లలరిన నధరంపుఁ
             బల్లవంబులు ద్విజపంక్తిఁ జేర
దరహాసచంద్రికల్ తళుకుచూపినఁ బాద
             సరసిజాతంబులు సంచలింప


తే.

వఱలి మట్టియ లందియల్ సరవి మొరయఁ
గాంచికాదామకింకిణీక్వణన మెసఁగ
నీరజాక్షులు సురపొన్ననీడఁ దపముఁ
జేయుచున్నట్టి తుల్యుఁ గాంచిరి ముదమున.

25


వ.

అయ్యవసరంబున.

26


క.

ఒక్క కమలాక్షి యలసతఁ
జిక్కితి నని యుత్తరీయచేలమునఁ గడున్
గ్రిక్కిఱిసిన నునుగుబ్బలఁ
జిక్కిన గంధంబు [5]కమ్మ చెమటల నార్చెన్.

27

ఆ.

నెలఁత యొక్కతె పాపట నెరులు దిద్ద
బాహుయుగ మెత్తి తనకక్షభాగసీమఁ
బొడమి బంగారుతళుకులఁ బోలునట్టి
వాల్మెఱుంగుల మునికి నివాళిఁ జేసె.

28


క.

ఒకకోమలి యమ్మునినా
యకు డగ్గఱి తపముఁ జేసి యలసితి విఁకఁ గొం
చక మోవిఫలము భిక్షగఁ
బ్రకటితగతిఁ గొను మటంచుఁ బకపక నవ్వెన్.

29


తే.

జపము సన్నంపుటెలుఁగున జరపు నతనిఁ
జేరి వేరొకవికచరాజీవనేత్ర
మొగము మొగమునఁ జేరిచి నగవు లొలుక
వ్రాయఁగారాని పలుకులు పలికె నపుడు.

30


ఉ.

వేఱొక కొందఱింతులు ప్రవీణతతో మునినాథుఁ డున్నయ
బ్భూరుహమల్ల డాయఁ జని పువ్వులఁ గోయుద మంచుఁ గొమ్ములన్
మీఱినవేడ్క నెక్కుతఱి నీవులు [6]జాఱఁగఁ గానవచ్చె నూ
గారుల మేలు, నాభు లనయంబులు, నూరుల సోయగంబులున్.

31


వ.

అయ్యవసరంబున నమ్మునిచంద్రుండు తనమనఃకమలపీఠం
బున నిఖిలదేవతాకిరీటసంస్థాపితానర్ఘ్యమణిఘృణిపరివేష్టిత
పాదారవిందయుగళుండును సనకసనందనాదిపురాతన
యోగిజనసంస్తూయమానగుణాలంకారుండును గౌస్తుభ
మణిహారుండును లక్ష్మీకఠోరస్తనసంఘట్టనజాతకిణసంకాశ
శ్రీవత్సాంకుండును రూపనిర్జితసహస్రకోటిమిహిరతనుం

డును బీతాంబరధరుండును శంఖచక్రగదాదిలాంఛనకలిత
కరకమలుండును సకలభక్తపరాయణుండును నగు శ్రీ
మన్నారాయణుని నిలిపి బాహ్యేంద్రియంబులఁ గికురు
పెట్టి నిశ్చలుండును నిర్వికారుండునునై స్థాణువు చందం
బున నుండుట యెఱింగియును రంభ తనసౌందర్య
గర్వంబు పెంపున ముందటికీ డెఱుంగక యతనిం జేరి.

32


తే.

చెలియ తెచ్చిన వీణఁ గెంజేత నంది
కొని మెఱుఁగు గవియఁగ గవిసెన యెడల్చి
తీఁగెలు బిగించి సారెలు దిద్ది శ్రుతులు
గూర్చి యుత్తరతుంబికఁ గుచముఁ జేర్చి.

33


సీ.

తనభూషణంబులఁ దనరెడు మాణిక్య
             గణము లొక్కుమ్మడిఁ గరఁగిపాఱ
నీరసాకృతిఁ బొల్చునిష్టురస్థాణువుల్
             భాసురలీలఁ గ్రొమ్మోసులెత్త
నాసమీపంబున నల్లల్లఁ జరియించు
             మృగపక్షిజాతంబు మేఁత లుడుగఁ
జైతన్య మొంది వస్త్రంబులఁ గనుపట్టు
             చిత్రరూపంబులు శిరము లూఁచ


తే.

నొళవు చెమరింప దివ్యపయోజనేత్ర
గ్రామములు మూఁడు నిఖిలమూర్ఛనలతెఱఁగు
మంద్రమధ్యమతారక్రమంబు మెఱయఁ
బాడె రెండవశారదభంగిఁ బొంగి.

34


వ.

అప్పుడు.

35

క.

అనిమిషనాథునిబన్నము
మునివరుతప ముడుపఁగోరి మును దా నేతెం
చిన మదనుఁడుఁ దన బలముల
కును సెలవిడి చెఱకువింట గుణ మెక్కించెన్.

36


క.

కోయిల లదిఁ గనుఁగొని వెసఁ
గోయని కూయంగఁ జిలుకగుంపులు కినుకం
బాయని నెమ్మొగములఁ గెం
జాయలు దులకింప వెక్కసంబుగఁ బల్కెన్.

37


వ.

అంత.

38


శా.

నాదబ్రహ్మము లక్ష్యమై మునుపులోన న్మ్రోయుచుండంగ నా
హ్లాదం బొప్ప సుఖించుచున్న మునికై యారంభ పాడంగఁ ద
న్నాదం బాత్మవశంబుఁ జేయుచు మహానాదామృతాంభోనిధిన్
[7]స్వాదూత్కర్షము దాల్ప నాతఁడు తపోవశ్యత్వము న్వీడునే.

39


క.

తనమనమున మును నిలిపిన
వనజాక్షునిపాదములకు వందన మిడి మ్రో
ల నిలిచినదానిఁ దా నొ
య్యనఁ గనుఁగొనె నతఁడు లోచనానందముగాన్.

40


వ.

ఇవ్విధంబున నప్పూబోడిం దప్పక చూచి తనలో నిట్లనియె.

41


ఉ.

కారుమెఱుంగులెల్ల నొగిఁ గాయముగా సవరించి మేలి బం
గారపునిగ్గుతోఁ గలిపి కమ్మనివెన్నెలతేటఁ దోఁచి శృం
గారరసంబునం గరువు కట్టి మనోజసువర్ణకారకుం
డీరమణీశిరోమణిని నింపున ము న్నొనరించె బాపురే!

42

తే.

పలుక విహరింప నేర్చిన పసిఁడిబొమ్మ
రూపు గైకొని మెలఁగు మెఱుంగుఁదీఁగె
పొసఁగఁ జైతన్య మొందిన పుష్పలతిక
గాని యిది కాంత యని నమ్మగాదు మదిని.

43


తే.

చంద్రమండలిమీఁద నక్షత్రపంక్తి
యుండు నండ్రది చూడ నయుక్తమయ్యె
వనితవదనేందుమండలంబునకుఁ గ్రిందఁ
బాదనఖతారకలు గానఁబడియెఁగాన.

44


చ.

ఎలమిఁ గుశేశయప్రతతి నెల్లను గెంజిగురాకుగుంపుతో
గలిపి మనోజధాత తనకౌశల మేర్పడఁ గ్రొత్తలత్తుకల్
చిలుకుచు దీనిపాదములు చేసిన నీగతి నొప్పెఁగాక కెం
పులఁ దులకించు నీచెలువముం గనునే యటుగాక తక్కినన్.

45


తే.

సోగవట్రువ బాగున సొబగులైన
కంజదళనేత్రరదముల కాంతి దనరెఁ
బంచబాణునిలేమ చేపట్టినట్టి
దాసనపుఁబువ్వుబంతుల వాసి మెఱసి.

46


క.

మానినిజంఘాయుగ మిల
లోనం దూణులకు గాహళులకుం బరువై
యీనని పరిగర్భములకు
నీనని సంపదలఁ దావహించె దళముగాన్.

47


ఉ.

నిండినవేడ్క మీఱ నిట నీరరుహాయతనేత్ర రత్నపుం
బెండెము పెట్టుటెల్ల మది బెగ్గిలి పెన్బొలయల్కవేళలన్
దండము వెట్టినట్టి మగతండము మారులఁ జేరకుండఁగాఁ
బెండెముఁ బెట్టుటే యనుచుఁ బేర్పి నుతింపఁగ బుద్ధి పుట్టెడున్.

48

తే.

కమలములమేలుఁ జెందొవగములచెలువు
మత్స్యకచ్ఛపరేఖాసమగ్రతయును
గలుగ నీయింతిపదములు కొలనులయ్యె
మురిపముల హంసకంబులు మెరయునపుడు.

49


చ.

కరభము లీడు వచ్చుననఁగాఁ దగు నెప్పుడు చేతులం బహి
ష్కరణము నందవే ననఁటికంబము లెన్నఁగ సాటియౌ ఫల
స్ఫురణ నశింపవేనిఁ గరిపోతకరంబుల జోడుదూఁగు బ
ర్భరత వహించదేని సురభామినియూరుయుగంబుతోడుతన్.

50


తే.

అమృత మధరంబునన్ దేజ మాననమునఁ
గమ్మతెమ్మెర యూర్పుల ఖమ్ము నడుమ
నుండు టీక్షించియో యీపయోజముఖకిఁ
బృథ్వి యయ్యెను దాఁ గటిపెంపుకతన.

51


తే.

రత్నకీలితకాంచసరశనచేత
నింతి కటిచక్ర మొప్పె మహీస్థలమునఁ
గమ్మి యెక్కించి చొక్కముగా నమర్చి
యున్న మన్మథురథచక్రమో యనంగ.

52


క.

వనిత జఘనంబుమీఁదుగఁ
గనుపట్టి మనోజ్ఞరత్నకాంచీదామం
బనుపమగతి నొప్పెడుఁ గం
తు [8]నివాసద్వారబంధతోరణ మనఁగన్.

53


ఉ.

కౌను నభంబు గాని హరికమ్రవలగ్నము గాదు చూడ న
ట్లైనను దానిమీఁదఁ బొడవైన పయోధరమండలంబు శో
భానిధి యైనచందురుఁడు [9]భాస్వరతారకలుం గ్రమంబునన్
గానఁగవచ్చునే పొలుపుగా నిఁక సందియ మేల దీనికిన్.

54

సీ.

కుటిలవర్తన మయ్యుఁ గుంతలదేశంబు
             దలకూడె సుమనోవితానమహిమ
నిష్ఠురత్వంబున నెగడెడు చోళమం
             డల మతిసౌభాగ్యముల వహించెఁ
దప్పకచూడంగ నుప్పతిల్లెడు నంగ
             రాజ్యంబు బంగారురాశి యయ్యెఁ
గడువెక్కసం బైన కాంచీప్రదేశంబు
             సకలసంపదల కాస్థాన మయ్యె


తే.

శంబరారాతి యనుమేటిసార్వభౌముఁఁ
డతివయౌవనభూమి నెయ్యమున నేల
మధ్యరాష్ట్రంబునంద క్షామంబు మిగుల
నయ్యె నచ్చటివివరంబు దయ్య మెఱుఁగు.

55


క.

చనుఁగవయును జఘనంబును
ఘనతకునై పోరుచుండఁగాఁ గలఁబడకుం
డను మదనుఁడు నడుమను ద్ర
వ్వినఖాత మనంగ నాభివివరము పొల్చెన్.

56


తే.

తనరునూగారుతో వళిత్రయము మించె
ఘనపయోధరభరము నోర్వనినడుముకు
శంబరారాతి నీలశీలంబుతోడఁ
గూడ బంగారుకట్లు గీల్కొలిపె ననఁగ.

57


తే.

పసిఁడికుండల కుంభికుంభములఁ జక్ర
వాకములఁ బువ్వుగుత్తుల వసుమతీధ
రములఁ బరిహాస మొనరించి రాయిడించి
చెన్ను మీఱెడు నీయింతిచన్నుదోయి.

58

క.

ఈలలన బాహుయుగ్మముఁ
బోలుటకై యీమృణాళములు వల్లికలున్
హేళివసంతులఁ గూర్చి వి
శాలవనమునందుఁ దపము సలుపుచునుండెన్.

59


క.

గణుతింపఁగ మరుశంఖము
[10]మణితాప్తికినై తపస్సమాధి నిలిచి యా
మణిదీప్తి మెఱయుతరుణీ
మణికంఠంబై సువర్ణమహిమం దనరెన్.

60


క.

పగడంపుఁదియ్యమోవికిఁ
బగడంబుగఁ దాల్చి కెంపుబాగులచే దా
ని గెలువ[11]నొదవమినో యీ
చిగురాకుంబోలు నింతిచేఁ గట్టుపడెన్.

61


క.

హల్లకగంధికి మదనుఁడు
పల్లవరాగంపుముద్దపై నమృతముఁ దాఁ
జల్లుచు నధరముఁ జేసెనొ
పల్లవ[12]రాగంబు గాఁగఁ బ్రతిభాస్ఫూర్తిన్.

62


తే.

పండువెన్నెలఁ గాయు నీపడఁతిమోము
నందుఁ గెమ్మోవి తనరె సుధాశనప్ర
చయము సుధఁ గ్రోలఁగాఁ బూని చంద్రునందు
మించుఁ గెంపులగిండిఁ గీలించె ననఁగ.

63


క.

ఈపడఁతి మెఱుఁగుఁజెక్కులు
చూపట్టెన్ రతియు భావజుండునుఁ దమలో

నేపున నలరుచుఁ జిహ్నము
లాపోవఁగఁజూచు మెఱుఁగుటద్దము లనఁగన్.

64


క.

రమణికి నాసిక తనరెను
గమలానందనుఁడు పాంథగణపక్షిసమూ
హముఁ బడనూఁదఁగఁ దిలసూ
నమునం గావించు జమిలినాళమురీతిన్.

65


తే.

మించు బవిరెలకెంపులు మేలువాలుఁ
గన్నుఁగవకొల్కులకు వింతకాంతి నొసఁగ
వెలఁది ముత్యాలకములకళలు గండ
ఫలకములనిండ నింతివీనులు దనర్చె.

66


తే.

వెల్లదామరఱేకుల విరియఁదోలి
వాలుగల నెల్ల నొకవంక వలలఁ బెట్టి
చికిలి చేసిన యలుఁగులఁ గిగురుపఱిచి
కామినికి నొప్పె నీవాలుఁగన్నుదోయి.

67


ఉ.

వ మ్మొకయింత లేక నిడువాలిక బాగును సోగలాగునున్
గమ్మ నవీనకాంతి గతిఁ గ్రమ్మఁగఁజేసి దివానిశంబులున్
నెమ్మి లతాంతసాయకుఁడు నిక్కముగా సవరించు వింటికిన్
బొమ్మలఁ బెట్టినట్టి కనుబొమలు చూడఁగ నొప్పె బాపురే.

68


చ.

కమలజుఁ డీవధూటియలికం బటు చూచి మునిద్రుమప్రసూ
నము నొనరించి పోలదని నవ్వుచుఁ జెట్లను గట్టి క్రొన్నెలం
గ్రమమునఁ జేసిన న్సవతురామికి రోసి [13]నవోడురాజునుం
దమకముతోడ నాకసమున న్వడిఁ బాఱఁగవైచె సిగ్గునన్.

69

చ.

పొలఁతిముఖాబ్దసంపదలఁ బొందఁ దలంచియొ చంద్రుఁ డబ్జతన్
జెలఁగినఁ దమ్మి యబ్జతను జెందినచో సమమైనపేరికై
చలమున రెంటికిం బగ నిజంబుగ నిద్ధరఁ జెల్లెఁ గాక యీ
నెలవున నున్న తమ్మికిని నింగి శశాంకున కేల పో రగున్.

70


చ.

తరుణిముఖారవిందమునఁ దానకమై విలసిల్లు తుమ్మెద
ల్పరిమళలోభయుక్తిఁ దెగిపాఱక నిల్చెనొ కాక మోము చం
దురునికళంక మీగతి వినోదము సల్సెనొ కాక యింతి లేఁ
గురులు మెఱుంగు చందములొకో వివరింపఁగఁ జోద్య మయ్యెడిన్.

71


ఉ.

అన్న సరోజగర్భుఁ డనయంబుగ దర్శనిశన్ బ్రభాతమున్
బున్నమరేల భేదగతిఁ బొందఁగఁజేయ మరుండు మించఁజే
సె న్నలినాక్షి పెన్నెరులచీఁకటి[14]చాయలు నిండియుండఁగాఁ
గన్నులఁ దెల్లవాఱఁగ మొగంబున వెన్నెల లుప్పతిల్లఁగన్.

72


వ.

అని యివ్విధంబున నమ్మునీంద్రుం డయ్యిందువదన సకలా
వయవంబులం జూచి చూచి తనివి చాలక మఱియు ని ట్లని
వితర్కించె.

73


సీ.

కిసలయంబులమేలు కెందామరలఁ గూర్చి
             యిచ్చోట బ్రహ్మ దా నేమి చేసెఁ
గరికరంబులసౌరు కదళీతరులఁ గూర్చి
             యిచ్చోట బ్రహ్మ దా నేమి చేసె

గజకుంభముల బాగు కందుకంబులఁ గూర్చి
             యిచ్చోట బ్రహ్మ దా నేమి చేసెఁ
జంద్రబింబముచాయ సరసిజంబునఁ గూర్చి
             యిచ్చోట బ్రహ్మ దా నేమి చేసె


తే.

బర్హములమేలు షట్పదపంక్తిఁ గూర్చి
యెలమి నిచ్చోట బ్రహ్మ దా నేమి చేసె
ననుచుఁ జరణోరుకుచముఖఘనకచముల
పసలు వీక్షించి చిత్తవిభ్రాంతి నొంది.

74


క.

కనుఁగొనెడు యోగివల్లభు
ఘనతరమైనట్టి ధైర్యకంచుకము దలం
ప నితరసాధనములచేఁ
జినుఁగునె యని మరుఁడు విరులచేఁ బగిలించెన్.

75


వ.

అయ్యవసరంబున నయ్యతివరుం డాత్మాధీనుం డయ్యెనని
తలంచి.

76


ఉ.

ఆరమణీశిరోమణి నయంబున నమ్మునినాథుఁ జేరి యొ
య్యారపురీతి నిల్చి వినయంబున హస్తయుగంబు మోడ్చి
క్రొక్కారుమెఱుంగుతోడఁ జెలికారముఁ జేయు సువర్ణకాంతులన్
మీఱిన యట్టి చన్నుఁగవ మేలిమి కానుకగా నొసంగుచున్.

77


సీ.

ప్రవహించు శృంగారరసవూర మమ్ముని
             మేనికి జలకంబుగా నొనర్చి
[15]తళతళత్కాంతి చేఁ దనరెడు దరహాస
             చంద్రికావితతి వస్త్రముగ నొసఁగి

[16]మవ్వంపుఁదేనియల్ చివ్వున నిడువాక్య
             ములు ప్రసూనములుగాఁ బూజఁ జేసి
చొక్కంపునిడువాలుచూపుమెఱుంగులు
             పొసఁగు నీరాజనంబులుగఁ జేసి


తే.

యమృతరసములు చిప్పిలు నధరబింబ
మదననైవేద్యమునుగ నియ్యఁగఁ దలంచి
యడుగుఁదమ్ముల కెరఁగి నెయ్యంబుతోడ
రంభ యిట్లను [17]సంగమారంభ యగుచు.

78


తే.

స్వర్గసౌఖ్యంబులకు నెల్ల సంయమీంద్ర
గణనఁ జేసిన నేనె కారణము సూవె
యట్లు గాకున్న నాకొఱకై నరేంద్రు
లాహవంబునఁ దెగివత్తురా ముదమున?

79


క.

విను మట్టియేను నిన్నుం
గనుఁగొని కాంక్షించియుండఁగా వేడుకఁ గై
కొన వేల? రతులకుం బై
కొనవేల? సుఖానుభవముఁ గొన వేల? తగన్.

80


క.

తనువులు నొచ్చినపిదపం
గను బ్రహ్మానందకేళికంటెఁ బ్రయాసం
బునఁ జెందక పద్మాక్షీ
జనితాసంగములు మిగుల సౌఖ్యము గావే.

81


శా.

నీ వీమోక్షము గోరి యోగముల నెంతే డస్సి డెందంబులో
నేవెంటం గొనరాని మీఁది యమృతం బేలా విచారింప? నా
నీవీమోక్షముఁ జేసి యోగముల నెంతే నెమ్మదిం డాయ నీ

వేవెంటన్ జనకుండఁ గల్గు నమృతం బిచ్చోట నామోవిపై.

82


సీ.

నాగుబ్బచన్ను లున్నతహేమభూమీధ్ర
             శిఖరములకు నీడు సేయవచ్చు
నాజఘనంబు బృందారకానేకప
             శీర్షంబునకు నీడు నేయవచ్చు
నాకరంబులు సురానోకహంబులఁ బొల్చు
             చిగురాకులకు నీడు సేయవచ్చుఁ
నామందహాస ముద్దామమందాకినీ
             తోయంబులకు నీడు సేయవచ్చు


తే.

నాయధరరుచి దేవతానాథసతత
సేవ్యసుధసొంపునకు నీడు సేయవచ్చుఁ
గాన నాతోడి యోగంబు గల్గెనేని
దివ్యభోగంబు లెల్ల సిద్దించినట్లు.

83


వ.

అని యిచ్చ నచ్చలంబు హెచ్చంజేరి మీఁదఁ జలువలు
గొలుపు కప్పురంపుఁబలుకులు వోని ముద్దుఁబలుకులను,
వలరాజు వాఁడితూపులకు మెఱుంగు సూపు నోరచూపు
లను, సుధారసంబు తేటలగు పాటలను, మదననివాసంబు
లగు పెక్కువిలాసంబులనుం గరగించితినని సంతసిల్లి
కరంబులు మొగిడ్చి.

84


ఉ.

అమ్మునినాథు నెమ్మొగమునందుఁ గటాక్షము నిల్పి రంభ లోఁ
గ్రమ్మెడుసాహసంబు వెలిఁ గానఁగ వచ్చు నళీకమోహమున్
ముమ్మరమై తనర్పఁ దనమో మొకయించుక వాంచి పాదప
ద్మమ్మున నేల వ్రాయుచు సుధారస మొల్కఁగఁ బల్కె నేర్పునన్.

85

సీ.

పచ్చవిల్తునికాఁక నొచ్చినదేహంబు
             నీచల్లకౌఁగిట నిలుపకున్న
వెన్నెలమంటచే వేఁగు చన్దోయి నీ
             కరవారిజంబులఁ గప్పకున్న
వేఁడినిట్టూర్పుల వెచ్చనౌమోవి నీ
             యధరామృతముచేత నార్పకున్నఁ
జెలులు చెప్పఁగ నైన చింతాభరంబు నీ
             తియ్యనిపల్కులఁ దీర్పకున్న


తే.

నెవ్విధంబున నీవల పీఁదనేర్తు
ననుచు నమ్మునికే లంట నతఁడు దొడ్డ
బ్రహ్మవిద్య మనంబునఁ బాదుకొలిపి
దానిచేతకు రోసి డెందమునఁ గినిసి.

86


శా.

కంఠారావ మొనర్చె నత్తఱి మహోగ్రస్ఫూర్తి దిఙ్నాగముల్
గుంఠీభూతమదంబులై వడఁకఁగా గోత్రంబు లూటాడఁగాఁ
గంఠేకాలసరోరుహప్రభవనాకస్వామిభోగీంద్రవై
కుంఠు ల్దద్దరిలంగ లోకములు సంక్షోభంబునం బొందఁగన్.

87


క.

భూపాలక విను తుల్యుఁడు
శాపజలం బపుడు కేల సవరించి మహా
కోపస్ఫురితాధరుఁడై
యాపడఁతుకఁ జూచి యిట్టు లనియెం బెలుచన్.

88


ఉ.

ఓసి దురాత్మురాల, వినయోక్తులచే నను వెఱ్ఱిఁ జేయు పే
రాసలు మాను నిప్పు చెదలంటఁగ నేర్చునె బల్మిఁ బైఁ బడం
గా సమకట్టి చేరితివిగానఁ దురంగమ వై చరింపు నీ
మై సొబగెల్లఁ బొల్లుపడ మర్త్యుని మోచి ధరాతలంబునన్.

89

వ.

అని శపియించిన.

90


సీ.

సైంహికేయచ్ఛన్నచంద్రబింబమురీతి
             వదనంబు మిక్కిలి వాడి కంద
హిమసిక్తరక్తపదములచాడ్పున నశ్రు
             వులతోడి కెంపుఁగన్నులును మొగుడ
శ్యేనత్రసచ్ఛారికానినాదంబు చొ
             ప్పున భీతి గద్గదస్వనము పొడమఁ
బెనుగాలిచేతఁ గంపించు వల్లికభంగిఁ
             దల్లడపాటునఁ దనువు వణఁక


తే.

నొదవు చంపకవాసన కులికిపఱచు
నళులకైవడిఁ గుంతలంబులు విడంగ
ఱిచ్చవడి సొమ్మసిలి యంత వెచ్చివెచ్చి
త న్నెఱుంగని పెనుమూర్ఛ ధరణి వ్రాలి.

91


ఉ.

అత్తఱిఁ గొంతసేపునకు నయ్యెలనాఁగ మనంబు ధీరతా
యత్తముఁ జేసి లేచి తనువంతయుఁ గంపము నొందుచుండ రా
జోత్తమతుల్యుపాదముల కొయ్యనఁ జాఁగిలి మ్రొక్కి నిల్చి లో
నత్తిన శోకము న్భయము నద్భుతమున్ బిరుసై పెనంగఁగన్.

92


మ.

మునిచూడామణి నీమనంబు కినుకం బొందంగ లక్ష్యం బఱన్
వనజాతాక్ష లలాటలోచన సుపర్వజ్యేష్ఠ దేవేంద్రులై
నను నిల్వంగ భయంబు నొందుదు రన న్నాబోటియంబేద లె
ల్లను నీముందఱ నిల్వనోపుదురె చెల్లంబో కృపం జూడవే.

93

మ.

అనఘా, పిచ్చుకమీఁద వేయుదురె బ్రహ్మాస్త్రంబు రౌద్రాకృతిన్
నను రోషించి తురంగరూపమున నానాదేశముల్ ద్రిమ్మరం
గ నరున్ మోవఁగ నానతిచ్చితిరి నాకా యట్టికష్టంపురూ
పున వర్తింపఁబడన్ భవత్కరుణచేఁ బోషించి రక్షింపవే.

94


సీ.

విటుఁడు పల్లొత్తినఁ గటకటపడుమోవి
             యినుపకళ్లెములకు నెట్టు లోర్చుఁ?
కొనగోరు సోఁకినఁ గ్రొవ్వాఱు దేహంబు
             ఘనకశాహతుల నేగతి సహించు?
వలిపపయ్యెద మోవఁ దలఁకెడియంసంబు
             పక్కెర నేరీతి నిక్కి తాల్చు?
నొరులు పాదాంభోజయుగళి మోవఁగ నున్న
             యే నన్యుల వహింప నెట్లు నేర్తు?


తే.

సంతతము మందగమనాలసంబులైన
నాదుపాదంబు లిలఁ బవనంబులీల
పర్వుఁబెట్టంగఁ జాలునే పరమయోగి
వర్య! నా కిట్టిదుర్దశ వలదు మాన్పు.

95


వ.

అని తనలోన.

96


ఉ.

కూరిమితోడఁ జేరి నలకూబరు నంతటివాఁడు మత్పదాం
భోరుహలాక్ష కుంకుమపుబొట్టుగఁ గైకొని యెల్లవేళలం
గారవ మెచ్చరింపఁ దనకౌఁగిటిలోపల నిద్రఁ బొల్పుగాఁ
గూరుకుచుండు నాకు వెడగుఱ్ఱపురూపము వచ్ఛె దైవమా!

97


వ.

అని యివ్విధంబునఁ జింతించుచుఁ దోడిచెలులచందంబులు
వీక్షించుచు నొల్లంబోయిన యుల్లంబున దీనయై యప్పరమ

మునీంద్రుపాదారవిందంబులకుఁ బునఃపునః ప్రణామంబు
లాచరించి కన్నీరుసోన గురియఁ బెదవులు దడుపుచు నత
నికి దయ పుట్టునట్లుగా వెండియు నిట్లని విన్నవించె.

98


తే.

ఎంతకాలంబునకు నాకు నేనెపమున
శాపమోక్షంబు గల్గెడు సజ్జనాగ్ర
గణ్య! నీనెమ్మనంబునఁ గరుణఁ జేసి
యానతీఁదగు నశ్వతఁ బూనఁజాల.

99


క.

అని కరుణపుట్టఁ బల్కెడు
వనితకు నాతుల్యమౌని వాత్సల్యముతో
ననియెం దరుణీ! దుఃఖం
బునఁ జెందకు వినుము శాపమోక్షక్రమమున్.

100


చ.

వినయవివేకశాలి పరవీరభయంకరదోర్బలుండు కుం
డిననగరంబువాయకుఁ డనింద్యచరిత్రుఁడు పుణ్యమూర్తి రా
మ నల భగీరథ ప్రముఖ మానవనాథసమానరమ్యవ
ర్తనుఁడు చతుర్ధనుం డనఁగ రా జొకఁ దుర్వర యేలుఁ గోమలీ.

101


ఉ.

ఆతనికిం బురాకృతమహాసుకృతంబున మేనితోడనే
యాతతసౌఖ్యసంపదల నత్యధికం బగుపుణ్యవిష్టప
వ్రాతము చూడఁగాఁ గలదు వారిజలోచన, యా నృపాలకున్
బ్రీతిఁ దురంగరూపము ధరించి వహింపుము నేర్పు మీఱఁగన్.

102


క.

ఆనృపతికి సంతోషం
బానఁగ లోకములు చూపి యరుదెంచిన నీ

మేనిచెలువంబు తొల్లిటి
పూనికనే యుండు నటకుఁ బొమ్మని యనిపెన్.

103


వ.

ఇవ్విధంబున ననుప నంతకుమున్న యమ్మునీంద్రుకోపంబు
నకు బెదరి.

104


సీ.

రతిరాజు బాణసంతతి మూలఁ బడవైచి
             చాపంబు గడపటఁ జప్పఁజేసె
జంద్రుఁడు తనరాక జాడఁ గాదని రోసి
             యుల్లంబులోఁ గంది వెల్లఁబాఱె
మలయానిలుండు సోమరినైతినని మేని
             బడలికతో సుడివడి చలించె
దొరయైన యావసంతుండు నేగెడుత్రోవఁ
             గానక యడవిఁ జీకాకు పడియెఁ


తే.

జిలుకగుంపులుఁ గండుగోయిలలగములు
నొలయఁజాలక చెట్లనె [18]యొదుగఁజొచ్ఛె
వలుద రాయంచగమియు వంకల నణంగె
మధుపకులమెల్లఁ దమ్ములమఱువు సొచ్చె.

105


వ.

ఆరంభయుఁ దనగర్వసంరంభం బుడిగి కన్నీరు దొరుఁగ
విన్నంబోయి యరవిరి దమ్మిపైఁ బరిభ్రమించు మదభ్రమర
బృందంబుచందంబున వదనంబుపైఁ జికురంబులు వ్రేల
వడి దూలఁ బుప్పొడి గప్పిన కొదమ నునుదీఁగె బాగున
ధరణీపరాగంబునం గనుపట్టి తనువల్లిక వణంక నయ్యాశ్ర
మంబు వెడలివచ్చునెడఁ దోడం గూడి యరుదెంచిన పువ్వుఁ
బోండ్లయందు నొకప్రోడ యి ట్లనియె.

106

సీ.

వనిత యమ్మునిప్రోడ వద్దనె వద్దనె
             చెప్పితి నామాట సేయనైతి
చేర నేటికిఁ గీడు గోరనె గోరనె
             సన్న జేసినఁ మానఁజాలవైతి
రమణి పోదము వీడి రా వేల రావేల
             గాదని చెప్పినఁ గానవైతి
నిక్కపువరుఁడని నీవింత నీ వింత
             పిల్లచేఁతలు చేసి బేలవైతి


తే.

వకట నీనేర [19]మని యెంత యనినఫలము
నేమిరాఁ గందు నీచిన్నిమోముదమ్మి
మెఱుఁగు దప్పిన యుద్ధంబుతెఱఁగు దాల్చె
నేమి చేయుదు నింక నా కేది దిక్కు.

107


క.

అని వగచుచు నాయంగన
మన మూఱడిలంగ మంచిమాటలచే నొ
య్యన తన్వి దానియనుమతిఁ
జనియె నిజస్థానమునకు సఖులుం దానున్.

108


వ.

తదనంతరం బారంభ తచ్ఛాపదవానలజ్వాల సోఁకి వసి
వాళ్లువాడు తనువల్లిచే బెడంక నల్లనల్లన వచ్చి చతుర్ధన
బాహాపరిపాలితంబైన కుండిననగరసమీపంబున నొక్క
వనాంతరంబున.

109


సీ.

నెరులసౌ రళులందు నెమ్మోముసిరి చంద్రు
             నందుఁ గన్నులమెఱుం గంబుజాత
ములయందు మోవిచాయలు బింబములయందుఁ
             గంఠంబుసొంపు శంఖంబునందుఁ

జనుదోయిగరిమంబు చక్రవాకములందుఁ
             గౌనువిలాస మాకసమునందు
జఘనమండలి యొప్పు సైకతస్థలియందు
             నడుగులపస చివురాకులందు


తే.

నడలమురిపంబు గజగమనములయందు
మేనిచెలువంబు క్రొక్కారుమెఱుపులందుఁ
బలుకు[20]సుకుమార మెల్ల రాచిలుకలందుఁ
జేరఁ దొలిమేను వదలి యాచిగురుఁబోఁడి.

110


సీ.

ప్రియునికెమ్మోవి చుంబింపనోపనిలేమ
             కఠినఖలీన మేగతి వహించు
హారంబు బరు వని యలయు లతాతన్వి
             వాగెల నెట్టికైవడి ధరించు
జడసోఁకు లోర్వఁగాఁ జాలని తరళాక్షి
             కడువంక పల్ల మేకరణిఁ బూను
నొడ్డాణమును దాల్పనోపని సతిపొట్టఁ
             బట్టెడబిగి నెటువలె సహించు


తే.

మిగులు మెత్తని నడుపుల మెలఁగునింతి
మనసుకంటెను జవమున మసలునెట్టు
లనుచు దేవత లద్భుత మంది చూడ
రాజకులనాథ సాంబ్రాణితేజి యయ్యె.

111


వ.

ఇట్లు రంభ తురంగంబై చరించుచుండె నంత.

112


ఉ.

కుండినవల్లభుండు రిపుకుంజరసింహపరాక్రముండు దో
ర్దండధృతావనీతలుఁడు దానజితామరభూజచంద్రమా

ర్తాండతనూభవుండు వనితామదనుం డొకనాఁడు వేడ్కతో
మండలనాథులున్ హితులు మాన్యులు భామలుఁ జేరి కొల్వఁగన్.

113


తే.

భానుఁ డుదయాద్రిపై నున్నపగిది రత్న
ఖచితసింహాసనంబుపైఁ గడుముదమున
నాత్మతేజంబు దిక్కుల నాక్రమింప
నోలగం బుండె సకలనేత్రోత్సవముగ.

114


వ.

అప్పుడు.

115


క.

కరికుంభజాతమౌక్తిక
పరికరమును సంకుమదము ఫలములు వింజా
మరలు మృగమదముఁ గప్పుర
సిరమున్ గొనివచ్చె నొక్కచెం చయ్యెడకున్.

116


తే.

వచ్చి కడుసంభ్రమంబున వసుమతీంద్రు
నంఘ్రులకు మ్రొక్కి యాయుపాయనము లెల్ల
సమ్ముఖంబునఁ బెట్టి హస్తములు మొగిచి
తనవచఃప్రౌఢి మెఱయ ని ట్లనుచుఁ బలికె.

117


శా.

సామీ! గూడెములోని మాప్రజలు నిచ్చల్ పండుగల్ సేయుచుం
బ్రేమం దామరతంపరై మనుదు రేభీతి న్మదిం బొందకే
యేమేతప్పులు చేసినన్ గరుణ నీ వేప్రొద్దు మన్నింపఁగా
మామాపల్లెలలోన నుందు మెలమి న్మాబోటివా రారయన్.

118


వ.

అని విన్నవించిన నాచతుర్ధనుండు సంతసిల్లి యాచెంచు
నకు ని ట్లనియె.

119


చ.

కలుగునె చేరువన్ బొలము కందువలన్ మృగకోటిపక్షులున్
మెలఁగునె క్రందుగా ననుచు మేల్నగ వొప్ప నతండు పల్కినన్

నిలిచి ముదంబు మీఱఁగ వనేచరముఖ్యుఁడు హస్తనీరజం
బులు మొగిడించి ఫాలమున మోసి చతుర్ధనుతోడ ని ట్లనున్.

120


ఆ.

మెకములేమి [21]బ్రాఁతి మేదినీవల్లభ
మందలై మెలంగు మావనముల
శరభ సింహ నాగ శార్దూల భల్లూక
హరిణ కిటి శశాదులైన వెల్ల.

121


తే.

కారుఁగోళ్లును గౌఁజులుఁ గక్కెరలు [22]సు
బారువములుఁ బూరేళ్లును గేరజములు
గువ్వలును మొదలుగ లెక్కకొలఁది మీఱఁ
గలవు పులుఁగులు నేతులు గ్రక్కఁ గ్రొవ్వి.

122


వ.

మఱియును.

123


క.

కూరిమితోఁ దిరుగుచుఁ గ
స్తూరీమృగకులము పొదలు దూఱఁగ ముండుల్
చీరినఁ దెరుపుల నెత్తురు
కాఱ నచట నెపుడు పచ్చికస్తురి గలుగున్.

124


వ.

అని విన్నవించిన సంతసంబునం బొదలి వేత్రహస్తులం
జూచి వేఁటరులం బోటరుల వేడుకలవేటి యగువేఁటకుం
బిలువనంపి తగినవారల నిలిపి యోలంబు సాలించి యంతః
పురంబున కరిగి మజ్జనభోజనాదులు సలిపి యనంతరంబు.

125


సీ.

పసిఁడివ్రాఁతల పచ్చపట్టు దట్టిగఁ గట్టి
             కస్తూరి దట్టంబుగా నలంది

గరుడపచ్చలమించు కడియాలు ధరియించి
             యురమున నీలంపుసరులు దాల్చి
మహనీయవైడూర్యమణికీలితంబులై
             పొలుపొందుకుండలములు ధరించి
మంచుచెల్వము నేపగించు నున్ననిపాగ
             గట్టిగా నొసపరిఁ జుట్టచుట్టి


తే.

జమునినాలుకఁ బురణింపఁ జాలునట్టి
వన్నెయడిదంబు దాఁపలివంకఁ బూని
శరశరాసనములు పరిచరులు దేర
రాజు చనుదెంచె నంతఃపురంబు వెడలి.

126


వ.

ఇవ్విధంబున మృగయోచితశృంగారంబు నంగీకరించి నిజ
మనోరథంబునకుం దగినరథం బారోహణంబుఁ జేసి యతం
డత్యంతసంతోషభరితాంతఃకరణుం డై మున్ను దనకు
మృగంబులచొప్పు చెప్పిన యచ్చొక్కరి ముందు నడువఁ
బురంబు వెడలి చనునప్పుడు విక్రమప్రచండసింహోపమే
యంబు లగుసారమేయంబులను మృగాక్రమణక్రియాభం
గులం బొంగుసివ్వంగులను బలవత్పక్షిహృదయపాటన
పాటవంబు లగుసాళువంబులను వినోదకారణంబు లగు
నోరణంబులను వెండియు మొకంబుల నీవలావలం జననీక
కన్నుల చెన్నులఁ దగులుపఱచు వలలును వలలం జిక్కు
పడ ముడిపెట్టి యిష్టంబుగాఁ బురికొని పురిదిగుచు నురులం
దలం గిలించి తమయొరపుచెరపునం జననీక పట్టికొట్టిన
నలుపులులం బెట్టుదట్టింపుబోనులును బోనులం బోనమిడి
[23]కోడెలజాడలం బొదలంజేరి యిరుఁగెలంకుల నొత్తుడు

కత్తెరల నెత్తుడుతెరలను బూని తమమేనిపొంకంబులును
బింకంబులును భయంకరంబులు గాఁగ సంతతహింసిత
మృగవ్రాతు లగుకిరాతులు సంతోషంబున.

127


సీ.

నీలికాసెలమీఁదఁ గీలుకొల్పినయట్టి
             నెలవంకకత్తుల తళుకు లెసఁగఁ
బొలుచు జుంజురుమీసముల నీలకాంతుల
             మొగముల నఱుక్రమ్మి ముంచుకొనఁగ
మిట్టగ్రుడ్డులమీఁదఁ దొట్టిన కెంజాయ
             చరమసంధ్యారక్తి చౌకళింపఁ
గర్ణార్పితంబులై గనుపట్టు సంకుటా
             కులు కృష్ణపక్షతారల హసింపఁ


తే.

జెలఁగి తలముళ్లు వాకట్టు తిలకములును
గసుమెఱుంగులు [24]గుతిమందులును ధరించి
పందివాటులు చేపట్టి పంతములకు
నొండొరులఁ గూడఁ బోయిరి దండి మెఱసి.

128


వ.

అందు.

129


సీ.

ఎరమీఁదీపులినైన గొఱియచందంబునఁ
             గొనివత్తు మిదె చూడు మనెడువారు
నఱిమెడు సింగంబునైనఁ బ్రాణంబుతో
             డనె పట్టి తెచ్చెద మనెడువారుఁ
జండించు గండభేరుండంబునైనను
             గనుకట్టు కట్టెద మనెడువారుఁ

జాలఁ గోపించిన శరభాధిపంబునై
             నను మెడఁ గట్టెద మనెడువారు


తే.

ఘోరమృగముల గమియించుకొని ప్రతాప
మడర సురియలఁ బొడిచెద మనెడువారు
నగుచు నానరపాలునియగ్రవీథి
నడచి రంతంతఁ జెంచులు పుడమి వడఁక.

130


వ.

ఇవ్విధంబునఁ బ్రబలంబు లగుశబరబలంబులు గొలువ నాత్మ
జనపరివృతుండై చనిచని.

131


క.

ముందటఁ గనియెన్ నరపతి
చందనపున్నాగవకుళసాలకుటజమా
కందపిచుమందజంబూ
తిందుకసరళాతరుతతిం దగునటవిన్.

132


వ.

ఇట్లు గనుంగొని చొత్తెంచి యందు.

133


క.

తగువారలుఁ దానును నా
మృగములు విహరించునట్టి మెలఁకువఁ గని లో
నిగురొత్తెడువేడుకతో
జగతీశుఁడు సన్నఁ జేసి శబరుల కనియెన్.

134


క.

కీలెఱిఁగి వలలు పన్నుఁడు
చాలేర్పడఁ దెరలు చుట్టి చాగుండురులన్
గీలించి బోను లొడ్డుఁడు
కాలాగక రొప్పుఁ డడవిఁ గల మృగవితతిన్.

135


వ.

అని యాన తిచ్చుటయుఁ జెంచు లుచ్చులుపెట్టిన నెలవుల
మైకంబులు దారుకో పెఱింగి కీలుకొయ్యలు గీలించి వల
లొడ్డియు, దొడ్డివైపుగాఁ దెరలు చుట్టియు, నురులు పదలించి

తోరణంబుల గతిం గట్టియు, బోనులు మాఁటియు, మెకం
బులనడుము చేకొని యచ్చట నొక్కతమగంబు పన్నిన.

136


ఉ.

ఆతమగంబుపై నరవరాగ్రణి సమ్ముఖవర్తిమానవ
వ్రాతముతోడ నెక్కి నిడువాలికరూపులుఁ జాపదండమున్
జేతులఁ బూని వేఁటరులఁ జీరి మృగంబులఁ జోప బంపి ని
ర్భీతకిరాతులన్ వలల క్రేవలఁ గొందఱ నిల్పెఁ [25]జాల్పుగన్.

137


వ.

అయ్యవసరంబున మేఁతలవెంబడి మూతులు సాఁచి తల
వంపులై నిలుపుగుంపులు చాయం బసిమిగల కసవులు
మెసంగి దృశ్యంబు లగుఋశ్యంబుల నెలమిఁ గదిసి మిస
మిసమెఱయు సస్యంబు లాస్యంబులం జర్వించి గర్వించి
ఱంకెలు వేయు జింకలను, నొగరుగల చిగురుంబ్రోవులు
గోవులు వట్టిమేనుల తేటలం బొల్చు లేఁటికొదమలను,
మదులం బొదలు మదనకదనోత్సాహంబులమోహంబులు
వొదవం బదరు మదవతులయెడ సకరుణంబు లగుహరిణం
బులను దట్టంపునీడల జాడల లలితంబులై పొదల యిరు
వులఁ బిల్లలపొందులకుఁ గ్రందుకొనుపందులను, మవ్వంబు
నివ్వటిల్లం దమ కందంబులైన కందంబు లాస్వాదించి
వెండ్రుక దెగంబొడిచి కడచి మూఁకలం బాయు నేకలంబు
లను, దమ రమణీసముదయంబుఁ గవయుటకై హెచ్చిన
మచ్చరంబునం బెచ్చు పెరిగిన [26]గవలగవులం దగిలి కయ్యం
బునకుం జీరుకొట్టుచుం గన్నుల నిప్పు లుప్పతిల్లం బరస్పర
యుద్ధంబు ప్రవృద్ధంబుగా నొనర్చి యచ్చట మనుమెకం
బులం బెదరించు మనుమెకంబులను, గొలఁదియుంగాని
తిండి మెండునన్ గండెక్కి నిక్కి సొక్కి నిర్భీకంబులై

తిరుగు భల్లూకంబులను, నిచ్చకువచ్చు మృగము నలిమి
నలమి పొలభక్షించి మించుగబ్బుగల బెబ్బులులను, నుడు
గక తుదుమువడి బెడిదంబున జముని లాయంబునం గలలు
లాయంబును నుద్దవిడిఁ గొమ్ములం జిమ్మఁ దలంచు కారుపోతు
లను మదంబు ముదంబునం బిడుల వెదకి నెఱిం గను
మఱంగి పొందంజేర కారణంబు సేయ డాయునెడఁ
జిక్కనగు వెక్కసంబున సాహంకారంబుగా ఘీంకారంబు
లొనర్చి యుద్ధంబులకు సన్నద్ధంబులై తలపడి పిఱుతివియక
నిలిచి పొలిచి యన్యోన్యదంతంబుల నింతింతలు చిదురు
పలుచెదర నొండొండ వెనకకుం జాఁగి తూగి కయ్యంబు
సేయుచు శౌర్యధురంధరంబులై కనుపట్టు గంధసింధురం
బులను, కుంభికుంభస్థలంబులు చించి మెదడు భుజించి తదు
దంచితమౌక్తికజాలంబు లోలంబుల వెదఁజల్లుచు నభంగ
విక్రమంబులం బొంగు సింగంబులను గంఠీరవంబులం
గంఠారవంబులచే సుడి వఱిచి వీఱిచి తదామిషం బొక్క
నిముసంబున మ్రింగి నింగి ముట్టిన సంతసంబున సరభసంబు
లై తిరుగు శరభసముదయంబులను, శరభంబులఁ జెండాడి
గుండెలుం గండలును మేసిమేసి సిరి గలిగి మెండుకొను
గండభేరుండంబులను మృగహింసాచంచు లగుచెంచులు
నేర్పున వలలకుం జేరికగా నొత్తి తెచ్చిన.

138


సీ.

విపులధ్వనికి నుల్కి విపినాంతరము నెల్లఁ
             జీఁకటిగొనఁగ నీక్షించుఁ గొన్ని
గాడ్పులఁ బసిగొని కలఁకమైఁ జెవులు రి
             క్కించి నల్గడలు నాలించుఁ గొన్ని

తెరలచందము గని వెఱచి తీవ్రంబుగా
             నఱచి యంతంతఁ గేళ్లుఱుకుఁ గొన్ని
వీఁకమైఁ జని పోగుదాఁకి క్రమ్మఱ భీతి
             నేవరి పొదలసం దీగుఁ గొన్ని


తే.

వెనుకవారలు తఱుమంగ వేగిరమునఁ
బిల్లతండంబు తమమ్రోలఁ బెట్టుకొనుచుఁ
గినుకతో వచ్చి యచ్చట జనులఁ జూచి
నిగుడఁజాలక గుంపుగా నిలుచుఁ కొన్ని.

139


క.

అప్పుడు ధరణీకాంతుఁడు
ముప్పిరిఁగొను సంభ్రమము ప్రమోదము వెఱఁగుం
జొప్పడఁగ నామృగంబులఁ
దప్పక కన్గొని గృహీతధనురస్త్రుం డై.

140


క.

ఎందును బథికులు పొడఁగని
[27]డెందములోఁ గలఁకఁబడుచుఁ దిట్టుదురను నీ
కుం దేల? వలదు మాన్పెదఁ
గుందేలా! యనుచు నతఁడు కూలఁగ నేసెన్.

141


క.

కలకలము సేయు మనుజుల
యెలుఁగులు విని చెదరునట్టి యెలుఁగుల నేసెన్
బొలమెల్లఁ గలికిచూపుల
యెలములచే నిర్లుకొలుపు నిర్లం ద్రుంచెన్.

142


క.

ఏరీతి నోర్తు నే భూ
దారుఁడ నగు టెఱిఁగి యెఱిఁగి తా మిచ్చట భూ

దారత్వముఁ గైకొనెనని
యారాజు వరాహముల రయంబునఁ ద్రుంచెన్.

143


తే.

ఖడ్గినై యుండు టెఱిఁగియు గణన సేయ
కిచట నామ్రోల ఖడ్గి దా నెట్లు నిలిచె
నంచుఁ గినిసినగతిఁ ద్రుంచె నామృగంబు
శిరము శరముల నాశ్చర్యకరము గాఁగ.

144


చ.

తరగనియట్టి దానజలధారలచేఁ గనుపట్టు కుంభినీ
వరుఁడనఁ బొల్చి సత్వమున వ్రాలిన నాసరిగాఁ గరీంద్రుఁడున్
దరగనియట్టి దానజలధారలచేఁ గనుపట్టి కుంభినీ
వరుఁడనఁ బొల్చి సత్త్వమున వ్రాలుట యెట్లని యేసెఁ దూపునన్.

145


ఆ.

సకలమహిషసమూహంబు సంహరించి
యానృపాలునిబాణంబు లాగ్రహమునఁ
జేకొనియె నట్టి తన్మహిషకులంబు
నని జయించినచోఁ గొల్లలాడఁ[28]దగదె.

146


వ.

వెండియు.

147


సీ.

కొలఁది మీఱినయట్టి కొమ్ములు నెమ్ములుఁ
             దోరంబులై తోఁచు తొడలు మెడలు
గరిమమై చూపట్టు శిరములు నురములుఁ
             బలుదెఱంగుల మించు పండ్లు రొండ్లుఁ
జెలువంబు పచరించు చెక్కులు ముక్కులు
             బసల దేఱెడి క్రొవ్వు బరులు సిరులుఁ
బొంకంబు లైనట్టి బోరలు మోరలు
             లోలంబు లైన తాలువులుఁ జెవులు

తే.

నెఱుఁగరాకుండఁ జక్కుగాఁ దఱిగినట్లు
వనములోపలఁ గలమృగవ్రాతములను
జేతికసివోవ నారాజశేఖరుండు
వాలుఁ గ్రొవ్వాడితూపులపాలు చేసె.

148


వ.

ఇవ్విధంబున నమ్మహీవరుండు మృగంబులం జంపి యంత
రంగంబున సంతసం బంది తనయిరుఁగెలంకుల మెలంకువలు
సల్పు వేఁటరులకు సెలవు పెట్టినం బొంగి నింగి పగుల
నార్పులు నిగుడించి వివిధవాద్యంబులు మొరయించిన హత
శేషమృగంబులలో బెదరి తెగువలం బాఱినం దెగువల
లను జొచ్చునెడ బిసలు బెడిసిన ముచ్ఛముడింగి పడునేక
లంబులను, నేకలంబుల జోకలం బాసి క్రేళ్లుఱికి చనునెడఁ
గాలు వలలఁ జిక్కిన మొక్కలంబున నీడ్చి యూడ్చుకొన
లేక కాలువలం జిక్కిన గండుమీనులతెఱంగునం బొరలు
హరిణంబులను, హరిణంబులకంటెను మున్ను నిగుడం
దలంచి తెరలు దెరలం [29]దూరి జాలు చనునెడల మెడల
కడలం దగిలిన యురులు బిగియ నురులు మనుబోతులను,
మనుబోతులకంటెం బెల్లెగసి తుటుములు గట్టి చన డొంకల
చెంతలం బెట్టిన బోనులం దగిలి నొప్పులు గొనియున్న దుప్పు
లనుం జూచి రభసంబునం బొడిచియు నీడ్చియుం జిమ్మియు
డాసియు వ్రేసియుం బొరిగొని వెండియు నెట్టకేలకుం
దప్పిగొని పఱచు మృగంబులం గని.

149


చ.

బలమునఁ దీవ్రతన్ హరులపాటివి యంచు నుతించి కుక్కలం
గళములు దువ్వి లుబ్ధకులు గట్టినపట్టెడ లూడ్చి చూపినం

బులుల నెలుంగులం బ్రిదిలిపోవఁగనీయక యొక్కటొక్కటే
చలము మెయిన్ హరించె దమ చండత సర్వజనాద్భుతంబుగాన్.

150


చ.

కనుఁగవఁ గట్టినట్టి కుడుకల్ దలఁగించి మృగాలినెల్లఁ గ్ర
న్ననఁ గనిపించి పోవిడిచినన్ వెరవొప్పఁగఁ బాఱి మూఁగిఁ
గి నిగిడి లాఁచి పట్టుకొనెఁ గీడ్పడఁగాఁ బెనులేటిగుంపులన్
వినుతపరాక్రమంబులగు వేఁట సివంగులు రాజు మెచ్చఁగన్.

151


తే.

ఉరులఁ గొమ్ములను ధరించు హరిణతతుల
విడువ నవి పరమృగముల వెంటఁబఱచి
కలసి పోరాడి వాని కొమ్ములఁ దవిల్చి
పండఁబడియెను లుబ్ధకప్రతతి పొగడ.

152


తే.

ఇవ్విధంబునఁ దమనేర్పు లెల్లఁ జూపు
శునకముల బిరుదు సివంగులను గురంగ
ములఁ బ్రియంబున దువ్వుచు బుజ్జగించి
చెంచు లానందమున సంచరించి మఱియు.

153


క.

బలుసాళువముల నోరణ
ముల డేగల వైచి యోదముల నీరములన్
మెలఁగి చతురత్వ మేర్పడఁ
బొలియించిరి పొలములోని పులుఁగుల నెల్లన్.

154


వ.

ఇట్లు వేఁటలాడి చాలించి ప్రాణంబులతోడఁ గస్తూరిమృగం
బులను సౌరభంబులకుం దల్లులగు జవ్వాజిపిల్లులనుం బట్టి
తెచ్చియిచ్చిన బిల్లులకుం బసదనంబులు గొల్లలుగా నిచ్చి
తన్నుఁ గొల్చివచ్చిన సామంతవీరభటవారంబులకు మృగ

మాంసంబులు దోరహత్తుగా నిచ్చి యొక్కరమ్యప్రదేశం
బునం దానును విశ్రమించి యచ్చట.

155


ఉ.

నేతులు గారు మాంసముల నిగ్గులు గ్రమ్మెడు నీరు ద్రెళ్లఁగాఁ
జేతుల నొత్తుచున్ వెదురుచివ్వల నంటఁగఁ గ్రుచ్చి వ్రచ్చి సం
జోతిగ నిమ్మపంటిపులుసున్ లవణాదులఁ గూర్చి వేడ్క ను
ర్వీతలభర్త యాత్మహితబృందముతో భుజియించె నత్తఱిన్.

156


క.

మనమున మృగయాక్రీడలు
గొనియాడుచు బలము లెల్లఁ గొలువ నిజస్యం
దన మెక్కి ముదంబున నా
జననాయకుఁ డాత్మపురికిఁ జని తనయెదుటన్.

157


క.

పరుషఖలీనముతో భా
స్వరమణిసంఘటితహేమపల్యాణముతో
మెరయుచు సకిలింపుచు నిజ
ఖురపుటముల ధరణిఁ ద్రవ్వు గుఱ్ఱముఁ గనియెన్.

158


తే.

కని తదంతికమునకు నజ్జనవరేణ్యుఁ
డరిగి తేరట డిగ్గి నెయ్యంబు మీఱఁ
గలితలక్షణలక్షితాంగముల నిమిరి
దానిచందంబు లి ట్లని తలంచె నతఁడు.

159


క.

పదములచొప్పును వడియొ
ప్పిదము నలంకారలక్ష్మిపేర్మియు ధారా
స్పదభావముఁ గల్గి శుభ
ప్రదమై హయ మమరె సత్ప్రబంధమురీతిన్.

160

సీ.

సురలోకముననుండి ధరణీతలంబున
             కవతరించిన యుత్తమాశ్వమొక్కొ
యక్షనాయకుని లాయంబు వెల్వడి వసుం
             ధరకు నేతెంచిన తురగమొక్కొ
రాజీవబాంధవురథముఁ బూనఁగలేక
             వసుధ కేతెంచిన వాహమొక్కొ
శరధివల్లభుని మందురలోన వెల్వడి
             యుర్వికి డిగిన గంధర్వమొక్కొ


తే.

కాకయుండిన నీశుభ్రకాంతిమహిమ
మీమనోవేగచాతుర్య మీశుభాంగ
పాటవము నీమహాబలప్రాభవంబుఁ
గలుగనేర్చునె పెఱతురంగములు కందు.

161


క.

అని బహువిధములఁ బలుకుచు
మనుజేంద్రుం డత్తురంగమముఁ గైకొని కుం
డిననగరి కేగెఁ దూర్య
స్వనములు కడునిగుడ సకలజనములుఁ బొగడన్.

162


తే.

అరిగి నిజమందిరముఁ జొచ్చి యత్తురంగ
రత్నమును మందురాభ్యంతరంబునందు
నిలిపి చిత్తంబు దానిపై నెలవు కొలిపి
యంగసేవకు నియమించె నర్హజనుల.

163


వ.

వెండియు హృద్యఖాద్యవిశేషంబులం బోషించుచు నొక్క
నాఁడు పేరోలగంబున నుండి తనమంత్రులకు ని ట్లనియె.

164


క.

ఏవనమున వేఁటాడం
గా వేడుక నేగ నచటఁ గలిగినతురగం

బేవిధమున మెలఁగెడినో
యావిధ మెఱుఁగుటకు నెక్కి యాడఁగవలయున్.

165


క.

కావున విూ రీక్షణమున
దైవజ్ఞులఁ బిలిచి చంద్రతారాబలముల్
భావించి శుభముహూర్తము
ధీవిలసితు లగుచుఁ దెలిసి తెండు హయంబున్.

166


తే.

అనుడు మంత్రులు సర్వసిద్ధాంతవిదుల
నడిగి తెలిసిన శుభసమయంబునందు
హయముఁ బల్లించి తేఁబంపి రావిభుండుఁ
గొలువు వీడ్కొని నగరిలోపలికి నరిగె.

167


వ.

అని శుకయోగీంద్రుం డిలావంతునకు నెఱింగించిన
తెఱంగుఁ జెప్పిన విని యటమీఁది వృత్తాంతం బేమని
యడుగుటయును.

168


శా.

అంభోజాతభవాన్వయాంబునిధితారాధీశ భోగింద్రది
క్కుంభిక్ష్మాధరకూర్మదుర్వహమహాక్షోణీభరాధారదో
స్తంభప్రాభవ బంధుయాచనకవిద్వల్లోకమందారతే
జో౽౦భోజాప్తనృసింహవీరవరసంప్రాప్తాతిభాగ్యాధికా.

169


క.

బాహసితీక్ష్ణధారా
రాహుముఖగ్రస్త విమతరాజ మహాల
క్ష్మీహరిమందిర స్వామి
ద్రోహరగండాంక దానరుచిరశశాంకా.

170


సుగంధి.

తారకాశశాంకకుంద తారకాశమల్లికా
శారదాభ్రకల్పభూజ శారదాత్రిదృక్సుధా

హారనాగ పుండరీక హారనాగ రాజ నీ
హారగోత్ర శుభ్రకీర్తిహార గోత్రరక్షకా.

171


గద్యము.

ఇది శ్రీమత్కౌండిన్యగోత్రపవిత్ర చరిగొండ తిమ్మ
నామాత్యపుత్ర సకలవిద్యాపారీణ శతఘంట సురత్రాణ
సుకవిజనవిధేయ ధర్మననామధేయప్రణీతం బయినచిత్ర
భారతం బనుపురాణకథయందుఁ దృతీయాశ్వాసము.

  1. వలదురుభూషణంబులు
  2. చలమునఁ జొచ్చి
  3. దేలఁగన్
  4. జల్లిబొట్టలు
  5. గ్రమ్మఁ జెమటల
  6. జార్చిన
  7. స్వాదోత్కర్షము
  8. నివాసకవాటబద్ధతోరణ
  9. భాసుర
  10. మణిదీప్తికినై
  11. నోపమినో
  12. రాగదము గాఁగఁ
  13. తదిందురేఖనున్
  14. ఛాయలు
  15. మందహాసవికాసమహిమంబు చందనపంకంబుగా సమర్పణ మొనర్చి
  16. అచ్చపుఁదేనియల్ విచ్చిలు మృదువాక్య
  17. సంభ్రమారంభ
  18. యొదిగె జిక్క, వలుసు రాయంచ
  19. మే మని యెంతు నబల, ముట్టినను గందు
  20. నుడికార
  21. భాతి; భ్యాతి
  22. మ, యూరములును
  23. గోడలజాడలం బొదలి... నొత్తుకత్తెర లన లొప్పుతెరలనుం
  24. గుడి
  25. బొల్పుగన్
  26. వగలం దగిలి
  27. తెందేఁపలు గాఁగ నిన్నుఁ దిట్టుదురను నీ
  28. గలదె
  29. దూలి జాలి