Jump to content

చలిజ్వరము/మొదటి ప్రకరణము

వికీసోర్స్ నుండి

చలిజ్వరము


ఇది వ్యాపించువిధము; దీనిని నివారించు పద్ధతులు; చికిత్స

మొదటి ప్రకరణము


జ్వరభేదములు

మన దేశమునందు అన్ని వ్యాధులలో సర్వ సామాన్యమైనవ్యాధి జ్వరము. జ్వరము
సామాన్యవ్యాధి.
గడచిన 10 సంవత్సరములలోపల ఏ సంవత్సరము యొక్క జనాభా లెక్కలు తీసిచూసినను ఈ దేశమునందు జ్వరము వలన మృతినొందిన జనులసంఖ్య తక్కిన వ్యాధులన్నిటిచే చచ్చినవారి మొత్తముకంటే అయిదారు రెట్లు హెచ్చుగా నున్నది.

క్రొత్తగా మన దేశమున బుట్టిన మహామారి వ్యాధివలన గడచిన 6 సంవత్సరములలో మన హిందూదేశమున అంతటను జేరి 15 లక్షల మంది చనిపోయినట్టు కనబడుచున్నది. జ్వరమువలన ఒక్కొక్క సంవత్సరమునందే 40 లక్షలు మొదలు 50 లక్షలవరకు చచ్చుచున్నారు. మహామారి వ్యాధిని గురించి మాటలాడినప్పుడు ప్రజలు భయపడుచున్నారుగాని అంతకంటె 15 రెట్లు హెచ్చుగ మన దేశపు ప్రజలప్రాణములను తీయుచున్న ఈ జ్వరములను గూర్చి అందరును నిర్లక్ష్యముగ నున్నారు. ఈ జ్వరముల వలన, చనిపోవువారల సంఖ్యకంటె, చిరకాలము రోగపీడితులై బలమును కోల్పోయి పనిపాటలు చేయలేక, భూమికి బరువు చేటుగానున్న ప్రజలసంఖ్య ఏటేట ఎంత హెచ్చుచున్నదో చెప్పనలవికాదు.

ఒక్క బొంబాయి పట్టణములో ఒక్కొక సంవత్సరమునకు[1] పనిపాటలు ఛేయువారలలో మాత్రము లెక్కవేయగా సంవత్సరము ఒక్కింటికి రెండు లక్షల ఇరువది అయిదువేలమంది జ్వరపడుచున్నారు. వీరందరు సగటున సంవత్సరమునకు ఒక వారము పని చెడుచున్నారు. పనివానికి సగటున దినము 1-కి రు. 0-5-0-లు జీతముచొప్పున లెక్క వేసికొనిచూడగా మొత్తముమీద పనివారలకు మాత్రము ఒక్కొక సంవత్సరమునకు 5,62,500. రూపాయలునష్టము వచ్చుచున్నది.

జ్వరము వలన మంచం మీదనున్న వారము దినములలో కలుగు ఈనష్టమునకు, వీరలు పనిలో ప్రవేశించిన తరువాత చాలదినముల వరకు బలహీనతచేత పని తక్కువగా చేయుటవలన వారి యజమానులకు వచ్చునష్టమును, వీరు జ్వరముతొ బాధపడునప్పుడు వీరి ఉపచారము నిమిత్తమై పని చెడి ఇంటియొద్ద నిలిచియున్న వారికి కలుగు నష్టమును, మందులు పథ్యపానాదులు మొదలగువాని కగు కర్చుల నష్టమును ఈలెక్కలో చేరలేదు.

ఈ ప్రకారముగా ఇంతిం తనరాని ధననష్టమును శరీరారోగ్య నష్టమును కలుగజేయుచుండెడు ఈ జ్వరమును గూర్చి ఎంతవ్రాసినను వ్రాయవచ్చును. తమకు తెలియని విషయములలో తమ బాగుకొరకు ఎవరైన ఏదైనచెప్పిన విశ్వసించి తమ తప్పులను దిద్దుకొను స్వభావము మన ప్రజలయందు కొంచెమయినను కానరాదు. తమకు వంశపారంపర్యముగా తాతల నాటినుండి వచ్చు మూఢవిశ్వాసమును విడువరు.

ఒకానొక విధమైన పురుగు నీటి మూలమున మనశరీరములో ప్రవేశించుటచే 'కలరా' అను వ్యాధి కలుగుచున్నదని అజ్ఞానియగు కాపువానికి చెప్పిన "కాదు కాదు అమ్మవారు" అనును. ఒకకాలో చేయియో ఉపద్రవముగ వాచినప్పుడు నీ శరీరములో ఒకానొక విధమైన సూక్ష్మజీవులు ప్రవేశించి రక్తమును చెరుచుటచే నీకు కురుపు వేయుచున్నదని చెప్పిన "కాదు కాదు, మంత్రము" అనును; లేదా "మా పొరుగింటివాడు ప్రయోగము చేసెను" అని చెప్పును. అమిత మైన చలి కుదుపుచే వడకుచు ఇంటిలో నున్నదుప్పట్లు అన్నియు కప్పుకొను నొకరోగియొక్క శరీరమంతయు 15 నిమిషములలోపల తహతహ మండుచున్నట్లు చేయుమార్పు జ్వరలక్షణమనియు. ఈ జ్వరము దోమకాటు మూలమున మన నెత్తుటిలొ ప్రవేశించు నొకా నొక పురుగువలన కలుగుచున్నదనియు చెప్పిన యెడల "కాదు కాదు, దయ్యము" అనును. ఇట్టి నమ్మకము చదువెరుగని జనసామాన్యమునందే గాక బి.ఏ., ఎం.ఏ. పరీక్షలలో తేరినామని చెప్పుకొను జ్ఞానము దేశమంతటను వ్యాపించి యుండుటకు వైద్యులే కారకులని నానమ్మకము. ఒక వ్యాధిని గుర్తెరిగిన వైద్యునకు ఆ వ్యాధిని కుదిర్చి నంతమాత్రమున తన పని తీరలేదు. తన సాటి ప్రజలకు ఆ వ్యాధి జ్వరము
వైద్యుల
లోపము.
యొక్క వ్యాపకమును గూర్చియు దానిని తప్పించుకొను మార్గమును గూర్చియు వివరముగ బోధింపక పోవుట మన దేశమందలి వైద్యులలోపము.

ఈ విషయముల యందు సర్కారువారు అంతగా సాయము చేయజాలరు. ఒకవేళ సాహసించి చేయబూనినను వారి ఉపదేశములు ప్రజలకంతగా హితవుగా నుండవు. ఇందుకు ఉదాహరణమేమన:-

సర్కారువారి
ఉపదేశము
ప్రజలకు
హితవుగా
నుండదు.

మునివిపల్ జవానువచ్చి కలరారోగిగల ఒక ఇంటియందలి వారికి "రోగినందరును తాకకూడదు; ప్రత్యేకముగా నొక గదిలోనుంచి వైద్యముచేయవలెను" అనిచెప్పి నప్పుడు "మీ యింటనుండు చలిజ్వరమునకు మీ పెరటిలోని పాడునూతిలో నున్న దోమలే కారణము. ఆ నూతిని పూడ్చిన మీకు జ్వరములురావు" అనిచెప్పినప్పుడు ఆజవాను చేసిన హితోపదేశమునకు ప్రత్యుపకారముగా రెండుతిట్లుతిట్టి తలుపులు మూసికొందురు. ఇట్టి ప్రజలకు నచ్చజెప్పి బోధించుట కేర్పడిన శానిటరీ ఇనస్పెక్టర్లనేకులు ప్రజలతో కలసి మెలసియుండి తగిన రీతిని బోధచేయుటకు బదులుగా తమ యధికారమును చెలాయించుచు వీదులలో నున్న బండ్లజాబితాలు తయారుచేయించి న్యూసెన్సు క్రిందచేర్చి బెదిరించుచు మునసపు కరణముల ద్వారా రాయబారములనంపుచు కరణముల ఇండ్లలో విందుభోజనము లారగింఫుచుందురు.

కావున ప్రజల జ్ఞానాభివృద్దికి చేయుభారము శాస్త్రజ్ఞానముగల వైద్యులదేకాని సర్కారువారి దంతగాకాదు. ఈవిషయమై ప్రజలకు కావలసిన సామాన్య విషయములను బోధించు నిమిత్తము ఆరోగ్య మనుపేర నొక మాసపత్రికను సాగింప బూనితిని గాని తగినంత ప్రోత్సాహము కనబడక పోవుటచే తను ఒక్కొక విషయమై పెక్కుసంచికలలో ముక్కలుముక్కలుగా వ్రాయుటకంటె ఒక్కొక విషయమును గూర్చి ప్రత్యేకముగా నొక్కొక చిన్నపుస్తకమును ప్రచుతించిన నది శాశ్వతముగా నుపయోగపడునని తలచుటచేతను ఈచిన్న పుస్తకమును వ్రాయబూనితిని.

మన దేశమునందు జనన మరణముల లెక్కలలో వ్యాధులను క్రమముగ పేర్కొనుట లేదు. ఈ రిజిష్టర్లను తయారుచేయు గ్రామాధికారికి దేహఖాయిలా, జ్వరము, విరేచనములు, అను ఈ 3 బాపతుల వ్యాధులుతప్ప తక్కినవి తెలియవు. ఈ బాపతుల క్రిందనైనను తనపై యుద్యోగస్థుడు గ్రామమునకు వచ్చిన దినముననే వినికిని బట్టి వ్రాయు ను గాని ఏదినమున కాదినము సరియయిన కారణమును విచారించి తనకు తెలిసినంత వరకైనను వ్రాయుటలేదు. జాగ్రత్తగా వ్రాయవలెనని తలచెడు గ్రామాధికారికి గూడ ఏయేవ్యాధులు ఏయే తెగలక్రింద చేరునో తెలిసికొనుటకు ఆధారములు లేవు. జ్వర
భేదములు
కావున ఈ పుస్తకములో మొదటి ప్రకరణము నందు వివిధ జ్వరములకు గల బేదములను తెలుపబూని యున్నాను. ఇందుకొరకు ఆయాజ్వరములచే బాధపడిన రోగుల చరిత్రములను సంక్షేపముగ పటముల రూపకముగ వ్రాయించి ప్రత్యేకముగ తయారు చేయించితిని.

1-వ పటము జ్వరపుపుల్ల.

వివిధ జ్వరభేదములను సరిగా తెలిసికొన వలెనను నెడల 1-వ పటములో చూపబడిన జ్వరపుపుల్ల [2]యను నొక గాజుగొట్టముతో రోగియొక్క శరీర వేడిమిని కొలవవలెను. ఈపుల్లయందు మధ్యభాగమున తలవెండ్రుక కంటె సన్నముగ నుండు గొట్టముకలదు. ఆ గొట్టములో మొదటి భాగము లావుగనుండి పాదరసముతో నింపబడి యుండును. ఈ పాదరసము వేడితగిలినప్పుడు హెచ్చి గొట్టము పొడువునను ప్రాకును. చలి తగిలినప్పుడు ముడుచుకొని గొట్టము అడుగునకు దిగును. ఎంతెంత వేడికి గొట్టములోని పాదరసము ఎంతెంత హెచ్చునో కనిపెట్టి ఈ మార్పులను సరిగా కొలచు నిమిత్తమై జ్వరపు పుల్లయొక్క ప్రబాగమును 95 మొదలు 110 వరకు 15 మెట్లుగా విభజించి యున్నారు. ఈ మెట్లనే డిగ్రీలు లేక అంశములు అందురు.

ఒక రోగియొక్క జ్వరతీవ్రమును కొలవవలెననిన జ్వరపు పుల్లయొక్క మొదటిభాగమును సాధారణముగా నారోగియొక్క నోటిలో నాలుక క్రిందపెట్టి ఒక నిముషమువరకు ఉంచవలెను. లేదా రోగియొక్క చంకలో చెమట లేకుండునట్లు తుడిచి జ్వరపు పుల్ల యొక్క మొదటిభాగము చక్కగ నన్నిప్రక్కలను తాకునట్లుగ చంకలోపెట్టి భుజమునుప్రక్కకు అంటి యుండునట్లుగా నదిమి పెట్టవలెను. రోగికి స్మృతితప్పి యున్నప్పుడును చంటిబిడ్డల జ్వరమును తెలిసికొన వలసి యున్నప్పుడు జ్వరపు పుల్లను ఆసనములోపెట్టి జ్వరమును కొలుచుట మంచిది.

జ్వరపు పుల్లలలో ననేక భేదములు కలవు. కొన్ని అరనిమిషములోనే జ్వరమును సరిగా తెలుపు ను. మరికొన్ని అయిదునిమిషములకుగాని తెలుపజాలవు. ఒకసారి జ్వరమును కొలిచిన తరువాత తిరిగి జ్వరమును కొలవకముందు జ్వరపు పుల్లను క్రిందివైపునకు ఝాడించి దానిలోని పాదరసమును క్రిందికి దింపవలెను.

సామాన్య రేఖ

సామాన్యముగా మన శరీరముయొక్క వేడిమి 98½ తొంబది ఎనిమిదిన్నర డిగ్రీలు ఉండును. అది క్రింది 2-వ పటములలో 98, 99 అంకెల మధ్యనుండు దళమైన నల్ల గీటువలన చూపబడినది. ఈ గీటునకు సామాన్యరేఖ (Normal) అని పేరు.

పేరు-వెంకయ్య. వయస్సు 24 సంవత్సరములు.

2-వ పటము.

2-వ పటములో పైకి, క్రిందికి ఎక్కుచు దిగుచు నున్నట్లు గీయబడిన గీటు జ్వరముయొక్క హెచ్చు తగ్గులను తెలియజేయును. ఈగీటు, క్రిందికి దిగు సమయమున జ్వరము తగ్గుచున్నట్లును, గీటుపైకి ఎక్కుతున్న సమయమున జ్వరము హెచ్చుచున్నట్లు ఎంచవలెను. ఈపటములో 96, 97, 98, మొదలగు సంఖ్యలు శరీరముయొక్క వేడి యెన్ని డిగ్రీలు ఉన్నదో తెలుపు సంఖ్యలు. ఈ పటములో పైభాగము ఉన్న 1, 2, 3 మొదలగు అంకెలు తేదీలను తెలియజేయును. ' ఉ ' అనునది ఉదయమును ' సా ' అనునది సాయంకాలమును తెలియజేయును.

శరీరముయొక్క వేడిమి 100 లేక 101 డిగ్రీల వరకు ఉండిన కొంచెము జ్వరము తగిలినట్లు ఎంచుదుము. ఈవేడిమి 103 లేక 104 వరకు ఉండిన హెచ్చు జ్వరమనియు 106 లేక అంతకంటె హెచ్చుగ నుండిన విపరీత జ్వరమనియు చెప్పుదుము. శరీరము యొక్క వేడి 97 డిగ్రీల వరకు దిగిన యెడల దేహము మిక్కిలి చల్లగా నున్నదనియు 96 లేక 95 డిగ్రీలకు దిగినయెడల మిక్కిలి శీతలముగ నున్నదనియు చెప్పుదుము. జ్వరము 107 డిగ్రీలకుమించి పోయినను శీతలము 95 డిగ్రీలకంటె దిగిపోయినను జీవింఛుట దుర్లభము.

రెండవపటములో వెంకయ్యకు 1 తేది సాయంకాలము 105 డిగ్రీలకంటె హెచ్చుగ జ్వరము వచ్చినట్లు చూపబడినది. ఆ దినము ఉదయమున ఎంత ఉన్నదో చూడలేదు. రెండవతేది ఉదయమునకు ఆజ్వరము తగ్గి 97 డిగ్రీలకు వచ్చియున్నది. అనగా సామాన్యముగా మనశరీరమునకుండు వేడిమికంటె తగ్గియున్నది. 2, 3, 4-వ తేదీలలోకూడ మధ్యాహ్నమున జ్వరము 105 డిగ్రీల వరకు హెచ్చి యున్నది.


3-వ పటములో సుబ్బన్నకు 1-వతేదీని జ్వరము 105 డిగ్రీల కంటె కొంచము తక్కువగా వచ్చియున్నది. 2,4 తేదీలను జ్వరమురానేలేదు. 3-వ తేదీని రమారమి 105 వరకును 5 వ తేదీని 103 వరకును వచ్చియున్నది.

వెంకయ్యకు 4-వ తేది సాయంకాలమునను, సుబ్బన్నకు 5-వ తేది ఉదయమునను క్వయినా ఇయ్యబదినది. (2, 3 పటములను చూడుము) వెంకయ్యకు 5-వ తేది సాయంకాలమున రావలసిన జ్వరము రాలేదు. శరీరవేడిమి 99 డిగ్రీలవద్దనే నిలిచి పోయినది. సుబ్బన్నకు 5-వ తేదీ సాయంకాలము మామూలు ప్రకారము 105 డిగ్రీలవరకు రావలసిన

పేరు-సుబ్బన్న. వయస్సు 40 సంవత్సరములు.

3-వ పటము.

జ్వరము 103 డిగ్రీలవరకే వచ్చినది. వరుస ప్రకారము 7-వ తేదీని రావలసిన జ్వరము రానేలేదు. శరీరవేడిమి 99 డిగ్రీలవద్ద నిలిచియున్నది.

క్వయినా
యొక్క
గుణము.

పై పటములను పట్టిచూడగా వెంకయ్యకు దినదినము వచ్చుజ్వరమును, సుబ్బన్నకు దినమువిడిచి దినమువచ్చు జ్వరమును, క్వయినా తీసికొనిన వెంటనే తగ్గిపోయినట్లు కనబడుచున్నది.

పేరు-రామన్న. వయస్సు-37 సంవత్సరములు.

4-వ పటము.

మూడు
దినముల
కొకసారివచ్చు
జ్వరము

పైని చూపబడిన నాల్గవపటములోని రామన్నకు 1, 4, 7 తేదీలను అనగా రెండు దినములు విడిచి మూడవదినము జ్వరము వచ్చుచున్నట్లు కనబడుచున్నది.


5-వ పటము.


6-వ పటము.

పేరు-నరసింహము. వయస్సు-23 సంవత్సరములు.

7-వ పటము.

ఎల్లప్పుడు
విడువకుండు
జ్వరము

ఏడవ పటములోని నరసింహమునకు మొదటి తేదీని 100 డిగ్రీలవరకును, రెండవ తేదీని 101 వరకును, మూడవ తేదీని 102 డిగ్రీలవరకును నాలుగవ తేదీని 104 వరకును జ్వరము వచ్చి ఒక దినమునకంటె మరియొక దినమున నిచ్చెనమెట్లవలె హెచ్చుచు వచ్చినది. పిమ్మట 4-వ తేది మొదలు 11-వ తేది వరకు 102, 104 డిగ్రీలమధ్య నిలుకడగా నిలిచియున్నది. 12-వ తేది మొదలు జ్వరముదిగు టకు ప్రారంభించి 17-వ తేది నాటికి 98 డిగ్రీలకు వచ్చియున్నది. మొదటి తేది మొదలు 17-వ తేదివరకు జ్వరము ఒక్కనాడైనను 98½-కు అనగా సామాన్య శరీరవేడిమికి దిగలేదు. ఈ జ్వరమునకు క్వయినా ఇచ్చుటవలన ప్రయోజనము కనబడలేదు.

1. పైన చెప్పబడిన రోగులకు ఆరు గురికి వచ్చిన జ్వరము వేరువేరు జాతిజ్వరములా లేక ఒకటే విధమైన జ్వరమా?

2. మొదటి ఇద్దరికిని క్వయినా ఇచ్చిన తోడనే జ్వరము నిలుచుటయేమి? 4-వ పటము లోని వానికి క్వయినా ఇచ్చుటచేత ఒకదినము జ్వరము విడిచి మరుసటిదినము జ్వరము విడువక పోవుటకు కారణమేమి?

3. పైన చెప్పబడిన జ్వరములు, క్రమముతప్పకుండ ఒకనికి దినదినమును, మరియొకనిని దినము విడిచి దినమును, ఇంకొకనికి 3 దినముల కొకసారియు వచ్చుటకును, 5-వ పటములోని వానికి ఏ విధమైన క్రమము లేకుండవచ్చుటకును ఏవైనను కారణము లున్నవా?

4. పైని 2, 3, 4, 5, 6 పటములలో జూపబడిన రోగులకు జ్వరము విడిచి విడిచి వచ్చుచుండెను. ప్రతిదినము కొంతకాలము కొందరకును, నడుమ నడుమ నొకటి రెండు దినములు కొందరకును బొత్తిగ జ్వరము లేకయుండెను. 6-వ పటము లోని రోగిని 1-వ తేదీని వచ్చిన జ్వరము 17-వ తేది వరకు నొక్క క్షణమైన విడువక నిలుకడగా నుండెను. ఇట్లు ఎల్లప్పుడు విడువకుండ జ్వరములకుని విడిచి విడిచివచ్చు జ్వరములకును గల భేదమేమి?

ఈ విషయములన్నియు ముందు ప్రకరణములలో వివరింపబడును.

  1. ఈ లెక్కలు 1911 సం॥ రంలో ప్రచురింపబడిన డాక్టరు బెంట్లే గారి ' మలేరియా జ్వరకారణ విచారణ ' యను గ్రంథమునుండి తీసికొనబడినవి.
  2. జ్వరపుపుల్ల:—దీనికి ఇంగ్లీషులో ధర్మామీటరు అని పేరు.