చందమామ పిల్లల మాసపత్రిక/సంపుటము 1/జూలై 1947/పొట్టి పిచిక కథ

వికీసోర్స్ నుండి
ముఖచిత్రం

అవసరాల రామకృషారావు, తుని.

అనగా అనగా ఓ వూర్లో వక పొట్టి పిచిక వుండేది. అదేం చేసిందీ, ఊరల్లా తిరిగి ఉలవగింజ, చేనల్లా తిరిగి సెనగ్గింజ, పెరడల్లా తిరిగి పెసరగింజ, ఇల్లాంటివి ఎన్నోగింజలు పోగు చేసుకొని కొట్టి కొట్టి కొండంత రొట్టిచేసుకుంది. చేసుకుని, చింత చెట్టుమీద కూర్చుని, ఆపిచిక ఆ రొట్టెను ఎగరేసుకుంటూ, ఎగరేసుకుంటూ, తింటూ ఉంటే, చీమతలకాయంత ముక్క చెట్టుతొర్రలో పడిపోయింది.

అప్పుడా పిచిక ఏం చేసిందీ వడ్రంగి దగ్గరికి వెళ్లి, "వడ్రంగీ, వడ్రంగీ, అతి కష్టపడి కొండంత రొట్టెచేసుకుని తింటూంటే చీమ తలకాయంతముక్క చెట్టు తొర్రలో పడిపోయిందోయ్! చెట్టుకొట్టి అది తీసి పెట్టాలోయ్," అంది.

వడ్రంగి 'చీమ తలకాయంత ముక్కకై చెట్టు కొట్టాలా? అని పక పక నవ్వాడు.

అప్పుడా పిచిక కెంతో కోపంవచ్చి తిన్నగా రాజు దగ్గిరకివెళ్ళి, "రాజుగారూ, రాజుగారూ! అతి కష్టపడి కొండంత రొట్టి చేసుకొని తింటూంటే చీమ తలకాయంతముక్క చెట్టుతొర్రలో పడిపోయింది. తీసిపెట్టమని వడ్రంగి నడిగితే తీయనన్నాడు. వడ్రంగిని దండించు రాజా," అంది.

రాజుకూడా నవ్వి, 'ఇంత చిన్నపనికి వడ్రంగిని దండించాలా? దండించనుపో అన్నాడు రాజు.

'అమ్మా వీడిపని ఇలా వుందా!' అని ఆ పిచిక వెంటనే లేళ్లదగ్గిరకి వెళ్లి జరిగింది చెప్పి, "చెట్టు కొట్ట

మంటే వడ్రంగి కొట్టనన్నాడు. వడ్రంగిని దండించమంటే రాజు దండించలేదు. రాజుకు ఉద్యానవన మంటే ఎంతో ఇష్టం. అది పాడుచెయ్యండి లేళ్లూ!" అంది.

"ఈ చీమతలకాయంత రొట్టిముక్కకి చక్కటి రాజు పూలతోట పాడు చేస్తామా? చాలు, చాలు పో," అన్నాయి లేళ్లు.

"అమ్మ! వీటమ్మ కడుపుకాలా! ఈ వెధవ లేళ్లకు ఇంత తెగులా!" అని ఆ పిచిక ఏంచేసిందీ, బోయ వాడి దగ్గిరికివెళ్లి,

'బోయాడూ! బోయాడూ! చీమ తలకాయంత రొట్టిముక్కు చెట్టుతొర్రలో పడిపోయింది. తియ్యమంటే వడ్రంగి తీశాడుకాడు. వడ్రంగిని దండించమంటే రాజులా చెయ్యలేదు. రాజుపూలతోట పాడుచెయ్యమంటే లేళ్లు పాడుచెయ్యలేదు, లేళ్ల కాళ్లు విరక్కొట్టు బోయాడూ!" అంది.

ఇదంతా విని బోయవాడు, 'ఈపాటి భాగ్యానికి చెంగు చెంగని గెంతే లేళ్ల కాళ్లను విరక్కొట్టనా? బాగానేవుంది. వెళ్లు వెళ్లు, అని పంపేశాడు.

దాంతో పిచిక్కి కోపమెక్కువై ఎలక దగ్గరకు వెళ్లి, 'ఓయ్, ఎలకా! ఎలకా! ఓ సహాయం చేసిపెట్టాలి. చీమ తలకాయంత రొట్టి ముక్క చింతచెట్టుతొర్రలో పడిపోతే తియ్యమంటే వడ్రంగి తీశాడుకాదు. వాడ్ని దండించమంటే రాజలా చేశాడుకాదు, రాజుగారి పూలతోటను పాడుచెయ్యమంటే లేళ్లలా చేశాయికాదు. లేళ్ల కాళ్లు విరక్కొట్టమంటే బోయ విరక్కొట్టేడుకాదు. బోయ చెప్పులు కొరికి పాడుచెయ్యి ఎలకా!" అంది.

ఎలికెకూడా "నావల్ల కాదు పొ"మ్మని అంది.

"అమ్మ దొంగముండా, నీకెంత గర్వమే! అని పిల్లి దగ్గిరకి వెళ్ళి, "పిల్లిబావా! పిల్లిబావా! చీమతలకాయంత

రొట్టిముక్క చెట్టుతొర్రలో పడిపోతే తియ్యమంటే వడ్రంగితీసేడుకాడు. వడ్రంగిని దండించమంటే రాజలా చెయ్యలేదు. రాకు పూలతోట చెరుపమంటే లేళ్లలా చెయ్యలేదు. లేళ్ల కాళ్ళు విరొక్కొట్టమంటే బోయ విరక్కొట్టాడు కాదు. బోయ చెప్పులు కొరకమంటే ఎలక కొరికిందికాదు. ఎలుకను వేటాడు పిల్లీ!" అంది.

"నా కిప్పుడు చాలా పనులున్నాయ్, ఇదే పనా ఏమిటి?" అని పిల్లి వెళ్ళి పోయింది.

'అయ్యొ దీని దర్జా మండా! ఉండు దీని పని పడ్తాను, 'అని తిన్నగా అవ్వదగ్గరకెళ్లి, 'అవ్వా, అవ్వా, చీమ తలకాయంత రొట్టి ముక్క చెట్టుతొర్రలో పడితే వడ్రంగి తీసేడుకాదు. రాజు వడ్రంగిని దండించాడు కాదు, రాజుగారి పూలతోటను లేళ్లు పాడుచెయ్య లేదు. లేళ్ల కాళ్లు బోయ విరక్కొట్టలేదు. ఎలక బోయ చెప్పులు కొరకలేదు. పిల్లి ఎలకను వేటాడలేదు. పిల్లిమీద వేడి వేడి పాలొయ్యి అవ్వా," అంది.

'చీమ తలకాయంత రొట్టిముక్కకోసం పిల్లిమీద పాలోస్తానూ? చాలుచాల్లే, అని అవ్వ కసిరి పొమ్మంది.

"ఏమి తూలిపోతున్నావే! మామ్మా!" అని తిన్నగా తాతయ్య దగ్గిరకి వెళ్ళి, "చీమతలకాయంత రొట్టిముక్క తొర్రలోపడిపోతే, వడ్రంగి తియ్యనన్నాడు. రాజు వడ్రంగిని దండించాడు కాదు. లేళ్లు రాజు గారి పూలతోటన పాడుచేశాయి కాదు. లేళ్లకాళ్ళు బోయ విరక్కొట్టలేదు. బోయ చెప్పులు ఎలక పీకలేదు. అవ్వ పిల్లి మీద వేడి పాలొయ్యలేదు. అవ్వను చితక్కొట్టు తాతా!" అంది.

'అమ్మో, నేనలాచేస్తానా! చెయ్యను పో,' అన్నాడు తాత. "ఓహో! నీకింత గర్వమా, సరే!" అని ఆపిచికేం చేసిందీ, గబగబా అవుదగ్గిరకెళ్ళి, "ఆవు పిన్నీ, ఆవు పిన్నీ! చీమ తలకాయంత ముక్క చెట్టు తొర్రలోపడిపోతే వడ్రంగి తీసేడుకాడు, రాజు వడ్రంగిని దండించలేదు. రాజు పూలతోట లేళ్లు పాడుచెయ్యలేదు. లేళ్ల కాళ్లు బోయవాడు విరక్కొట్టలేదు. బోయ చెప్పులు ఎలక కొరకలేదు. ఎలకను పిల్లి వేటాడలేదు. పిల్లిమీద అవ్వ వేడిపాలొయ్యలేదు. తాత అవ్వను చితక్కొట్టలేదు. తాత, పాలుతియ్యడాని కొచ్చినప్పుడు 'ఫెడీ' మని తన్ను ఆవూ," అంది.

'అబ్బే, నేనలాచెయ్యను సుమా!' అంది ఆవు.

అప్పుడు పిచిక విచారిస్తూ, "పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశానో, ఎవళ్ళ నడిగినా ఏమీ చెయ్యనంటున్నారు ఎలాగో!" అని ఏడుస్తూ కూర్చుంది. ఇంతట్లో ఓ ఈగ ఆ దారమ్మట వెడుతూ "ఏం పిచికా ఏడుస్తున్నా" వంటే, పిచిక జరిగినదంతా చెప్పి ఉపకారము చేసి పెట్టమంది.

అప్పుడు ఈగ ఏం చేసిందీ, వెంటనేవెళ్లి ఆవు చెవులో దూరి నానా అల్లరి చేసింది. ఆవు ఆ బాధ భరించలేక తాతని తన్నింది. తాతకి కోపంవచ్చి అవ్వని చితకకొట్టాడు. అవ్వకు వళ్లుమండి పిల్లి మీద వేడి పాలోపింది. పిల్లి కోపం కొందీ ఎలక వెంటపడింది. ఎలక భరించలేక బోయ చెప్పులు కొరికింది. బోయ ఆ కోపం తీర్చుకోడానికి లేళ్ల కాళ్లను విరగకొట్టేడు. లేళ్ళు కోపంచేత రాజుగారి తోటను పాడుచేశాయి. రాజుకి బుద్ధివచ్చి వడ్రంగిని శిక్షించేడు. వడ్రంగి చచ్చినట్టు చెట్టును నరికి, తొర్ర తవ్వి ఆ చీమ తలకాయంత రొట్టిముక్కనూ, తీసి పిచిక చేతిలో పెట్టేడు.

పిచిక మళ్లీ ఎగవేసుకుంటూ ఎగవేసుకుంటు ఆ రొట్టెముక్కను కమ్మగా తిన్నది.