చందమామ పిల్లల మాసపత్రిక/సంపుటము 1/జూలై 1947/చందమామ వ్యాస రచన పోటీ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ముఖచిత్రం
Chandamama 1947 07.pdf

దొంగముచ్చు (పోటీవ్యాసం)

మొదటి బహుమానం రు. 10/- రెండవ బహుమానం రు. 5/-

ముద్దులకోడళ్లూ, అల్లుళ్లూ!

మీరు బళ్లో "ఆవు నాలుగుకాళ్ల జంతువు. దాని కొక తోకయుండును. తోకతో అది ఈగలను తోలుకొనును. ఆవుకు రెండు కొమ్ములుండును, కొమ్ములతో అది పొడుచును. ఆవు నెమరువేయు జంతువు. అది అంబా యని అఱచును." ఇలాంటి వ్యాసాలు వ్రాసేవుంటారు. ఇంకా గుర్రముమీదా, పేరాశగల కుక్కమీదకూడా వ్రాసిఉంటారు, అయితే ఇవి అన్నీ మీరు వాచకపుస్తకాల్లో చదివినవే. కాని, పుస్తకంలో చదివినవి కాకుండా మీరు కంటితో చూచినవి వ్రాయటం నేర్చుకోవాలి. అప్పుడు మీకు స్వతంత్రంగా వ్రాసేశక్తి వస్తుంది.

చూడండి, మీ బళ్లోగానీ, మీ ఇంటోగానీ, మీ ఇంటిపొరుగునగానీ అనేక రకాల పిల్లలు ఉంటారు. వాళ్లలో పైకి బాగా ఉంటూ ముచ్చుగా ఉండేవాళ్లూ, కుళ్లుబోతులూ ఉంటారు. వీళ్లు కూబిగా ఉంటూ ఎన్నో చిలిపిపనులు చేస్తారు. ఇలాంటివాళ్లకు మనం 'దొంగముచ్చు'లని పేరుపెడదాం. ఇలాంటి ఒక దొంగముచ్చుచేసే పనులు అరపేజికి తగ్గకుండా, పేజికి మించకుండా నాకు వ్రాసి పంపండి. నేను చక్కగా బొమ్మలుగీయించి బాగా ఉన్నవి అచ్చ వేస్తాను. మీరు వ్యాసంతో డబ్బు ఏమీ పంపనక్కరలేదు. అన్నిటిలోకీ బాగా ఉన్న రచనకు పదిరూపాయల విలువగల బహుమతి యిస్తాను. రెండోదానికి అయిదు రూపాయల విలువగల బహుమతి. ఇంకా బాగా ఉన్నవి ఉంటే చిన్న చిన్న బహుమతులు ఇస్తాను. మీ వ్యాసాలు ఈ చిరునామాకు పంపండి.

చందమామ వ్యాసరచన పోటీ
37, ఆచారప్పన్ వీధి. మద్రాసు.
Chandamama 1947 07.pdf

అబ్బాయిలూ, అమ్మాయిలూ!

మీరు పెద్దవాళ్ల సహాయం లేకుండా సొంతంగా ఆలోచించి ఈ పజిలు పూర్తి చేయాలి సుమా. అలా పూర్తిచేసి 58 పేజిలో ఉన్న జవాబుతో సరిచూసుకోండి. ఒక్క తప్పుకూడా లేకపోతే మీకు పది మార్కులు. ఒక తప్పుంటే ఆరు మార్కులు. రెండు తప్పులుంటే నాలుగు మార్కులు. మూడు తప్పులుంటే రెండుమార్కులు. నాలుగుగాని అంతకుమించిగాని తప్పులుంటే మాత్రం బండిసున్నా వచ్చినట్లే.

పోతే, దీన్ని పూర్తిచేసేపద్ధతి మీకు తెలుసునా ! నెంబరు అడ్డంలో మూడు అక్షరాలు వుండాలి. ఆధారములలో "బహుమతి" అని వుందా, దానికి మూడు అక్షరాల మాట ఏమైయ్యుండాలి అని ఆలోచించాలి. అప్పుడు "కానుక" వస్తుంది. అక్కడ 'కానుక' ఉంచండి.

Chandamama 1947 07.pdf

అలాగే 1 నెంబరు నిలువు మూడు అక్షరాలు వుండాలి, దానిని వెతకటానికి "నాలుక మంట పుట్టించేది" ఏదా అని చూడాలి. దాని మొదటి అక్షరం "కా" - యిది ఏమబ్బా అని ఆలోచిస్తే "కారము" గుర్తుకు వస్తుంది. అట్లాగే తతిమ్మా గళ్లూ పూర్తిచేసి మీ మార్కులు నాకు చెప్పండి.