ఘటికాచలమాహాత్మ్యము/తృతీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

ఘటికాచలమాహాత్మ్యము

తృతీయాశ్వాసము

[1]క.

శ్రీమత్ప్రసన్నవేంకట
ధామ కృపాకవచవర్థితా తామరస
స్తోమరసాస్పద[2]వచనా
[3]కామప్రద కల్పరూప ఖండొజి భూపా!

1


క.

అవధారు ధాతృనందనుఁ
డవిరళ మధురోక్తి ననియె నా భృగుమునితో
నవకుంద దంతకాంతులు
సవరన చెక్కిళ్ళ సాంద్ర చంద్రిక లీనన్.

2


క.

సప్తర్షి వర్యు లీక్రియ
సప్తతురంగమ సహస్ర సదృశ [4]మహాభ
వ్యాప్తుని నద్దేవునిఁగని
ప్రాప్తభయోత్కర్షమునను ప్రాంజలు లగుచున్.

3


క.

సర్వేశ్వర! సర్వాత్మక!
శర్వాది సుపర్వనయన సాధ్వసకరమై
పర్వెడు నీరూపముఁగన
నోర్వము శాంతస్వరూప మొందు మహాత్మా!

4


వ.

అని విన్నపంబు సేయఁ దదనంతరసమయంబున.

5


సీ.

కనకకుంభ ప్రభాకలి తాంబరతలంబు
అసమాన రత్నమయాంచితంబు
బలభిన్మణి విచిత్ర వలభిప్రదేశంబు
కమనీయ చిత్రరేఖాయుతంబు

ప్రాజ్య ముక్తాఫలోదంచద్వితానంబు
సురభిళాగురుధూపశోభితంబు
వివిధ నటీ[5]నాట్య విభ్రమాకాంతంబు
కిన్నర గంధర్వ గీతి యుతము
...........................
............................
రత్నరాజిప్రదీప విరాజమాన
మైనయొక్క విమానంబు గానఁబడియె.

6


క.

వారంతఁ ద ద్విమాన
ద్వారము సొత్తెంచి నిలువ దక్షిణదిశగా
[6]చేరి వెసం బ్రసవాయుధ
వైరి నిరీక్షించి ప్రమథవైభవమెసఁగన్.

7


సీ.

కరముల శంఖచక్రములు దాల్చినవాని
మురువైన తెఱనోటి యొఱపువాని
లోవంక మూపుల ఠీవిఁబొల్చినవాని
పద్మాసనంబునఁ బరఁగువాని
యోగపట్టికనొప్పు నూరుద్వయంబుపై
దొరయనిల్పిన కేలుదోయివాని
మేరుకూటంబుపై మిహిరబింబము లీల
శిరముపై మకుటంబు చెలఁగువాని
బాలచంద్రుని పైనున్న బాలచంద్రు
బోలు నళికోర్ధ్వపుండ్రంబు పొలుపువాని
కనకన వెలుంగు నంగారక విధమునను
గాననయ్యెడి మిక్కిలికంటివాని.

8


వ.

మఱియుఁ గలుషలక్ష్యభేదంబు సేయ వినతంబులగు త్రిణతంబులకొమ
రున బొమదోయిదీపింపఁ గురులసిరులవరలు మోముదమ్మినిమ్ముల
నిందిందిరమ్ములు గ్రమ్ముకొన మంకెనకావి సుంకంబుగొనుతావి

మోవి ఠీవి నలంతినవ్వు నివ్వటిల్ల భక్తజనవిషయకారుణ్యంబున
నేత్రాంచలంబుల నారుణ్యంబు తారుణ్యంబు సంపాదింప కుండల
ద్వయమణిప్రభాపూరంబు గండమండలతాండవంబొనర్ప జగత్రిత
యైకాధిపత్యంబు దెలుపు రేఖాత్రయంబు కంఠంబునందనర కెందమ్మి
చెంతనున్న తుమ్మెదకొదమచందంబున కౌస్తుభోపకంఠంబున
శ్రీవత్సాంకంబు శోభిల్ల పంచవర్ణంబులం బ్రపంచించుచు పంచతత్వ
తత్వాభిమానికయైన మాలిక యొప్పార బాలప్రవాళలీలం దలపిం
చుచు బాహుశాఖల నఖర శిఖర కాంతులు విరాజిల్ల హారమంజీర
కంకణాంగదరోచులు దిక్కులంబిక్కటిల్ల కాదంబినీ సమావృత
గగనంబుపగిది నుదరబంధంబు సొంపార సంధ్యారాగసంవృత
శిలోచ్చయంబునా కనకాంబరపరివేష్ఠితకటిప్రదేశమ్ము భాసిల్ల
మధుకైటభ[7]హననవధ్యశిలాకల్పంబులైన జానువులు ప్రకాశింప
శంఖ చక్ర హల కుళిశ జలజాతపత్ర పతాకాదిరేఖాంకితంబులగు
పదంబులు విలసిల్ల చరణకాంతిసందోహవాహినిం [8]దేలియాడు
రాయంచగుంపుసొంపున నఖంబులు విరాజిల్ల నైంద్రజాలికుని
పోలిక మున్నుఁగైకొన్న యాకారంబు మాయించి సౌమ్యాకారంబు
దాల్చినిల్చినవాని శ్రీనరసింహదేవు నాలోకించి దండప్రణామంబులు
సమర్పించి కృతాంజలులై యిట్లని వినుతి సేయందొడంగిరి.

9


క.

జయజయ సితపద్మాక్షా!
జయజయ నిటలాక్ష! సర్వజగదభిరక్షా!
జయజయ దుర్జనశిక్షా!
జయజయ దితిసుతవిపక్ష! సదవన[9]దక్షా!

10


వ.

దేవా! జగత్సృష్టిరక్షణసంహారంబులకు కర్తవు జగదంతర్బహిర్వ్యాప
కుండవు సకలాంతర్యామివి పృథివ్యాదితత్త్వస్వరూపకుండవు శబ్దాది
గుణాత్మకుండవు సచ్చిదానందస్వరూపకుండవు అణువున కణువు మహ
త్తునకు మహత్తువు నీవ భవత్కటాక్షంబునంగాదె మధ్యేసముద్రం
బున భోగీంద్రతల్పంబున యోగనిద్రాముద్రితుండవగు నీనాభిపద్మం
బున బొడమిన పద్మజునకు మానసపుత్రులై మరీచిప్రముఖులు సృష్టి
పెక్కువిధంబుల గావించిరి నిమేషంబులు పదునెనిమిది కాష్ఠ యగు

(గ్రంథపాతం)

తనపేరు వెలయింపఁదలఁచి నాపే రెన్న
వినక పుట్టిన పిన్నతనయవర్యు
మామకభక్తి మగ్రుని ప్రహ్లాదుఁ
దీవ్రనిస్పృహ ఘోరదృష్టిఁ జూచి
హరి వినుతించిన హరియింతునే నిన్ను
హరి వైరిసు మ్మోరి యసురులకును
నని యెఱుఁగఁజెప్పి తనమాట వినకయున్న
తనయు ఘనరోషకలుషచేతస్కుఁ డగుచు
కనికరంబింతయునులేక కఠినవృత్తి
చంపఁ దలపోసి మదిలోన తెంపుఁ జేసి.

15


సీ.

కత్తుల మొత్తించి గంధద్విపముల మొ
త్తమ్ముల కొమ్ములఁ గ్రుమ్మఁజేసి
ఫణులచేఁ గఱపించి పావకశిఖలలోఁ
బొరలఁ ద్రోయించి యంబుధుల ముంచి
కట్టించి కొట్టించి కాఁచిన [10]కారులఁ
బట్టించి ధట్టించి గట్లచరుల
ద్రొబ్బించి నరకాగ్ని దూలించి దానవ
భటులచే నొంచి యిప్పాట్లఁ బఱచె
బాలుఁ డలయఁడు సొలయఁడు
[11]మదిని నాయందు భక్తి యేమరఁడు విష్ణు
పక్షమును మానితినటంచుఁ బలుకనొల్లఁ
డేమి చెప్పుదు నబ్బాలు హృదయశుద్ధి.

16


గీ.

అతనిఁగావ సభాస్తంభమందు వెడలి
కడిఁదిఱక్కసు వెడద వక్షంబు వాడి
గోళ్ల విదలించి యవనిపైఁ గూల్చి కరుణ
బాలు రక్షించితిని మునిప్రవరులార!

17

క.

మెచ్చితి మిము మునులారా
నొచ్చితి రిన్నాళ్లు తడసి నొగలకుఁ డిఁక మీ
కిచ్చెదఁ గోరినవరములు.
నిచ్చలముగ మీతపంబు నేడు ఫలించెన్.

18


వ.

అనిన నమందానందకందళితహృదయారవిందులై యమ్మహర్షు
లిట్లనిరి.

19


క.

పురహర పురందరాది క
దురధిగమంబై భవాదిదూరమ్మగు నీ
యురుమూర్తిఁ గనుటకంటెను
వర మెయ్యది వరముగలదు వర్ణింప నజా!

20


గీ.

ఉర్వి నమృతఫలాఖ్య భక్తోచితాఖ్య
గలిగె నేకతమున నీకు కలుషదూర!
వినఁగఁ గోరెద మెఱింగింపవే యటన్న
ఋషుల కిట్లని పలికె సర్వేశ్వరుండు.

21


క.

అమృతము మోక్షము తత్ఫల
మమరిచి యమృతఫలనామ మందితి ధరణిన్
శమయుక్తభక్తకాంక్షిత
మమరిచి భక్తోచితాఖ్య నటు గైకొంటిన్.

22


క.

ఈ పర్వతశిఖరమ్మున
దీపించుచునుండు రెండుతీర్థము [12]లివియున్
ప్రాపించు నేతదాఖ్యలె
తాపసవరులార! సార్థతానయయుక్తిన్.

23


సీ.

దివ్యమౌనీంద్రు తీర్థంబులోఁ గ్రుంకి
ధన్యులై కడుమహత్త్వంబుఁ గనిరి
ఎవ్వరు మద్భక్తు లిందు మజ్జనమాడ
నవవర్గసంప్రాప్తి కర్హులగుదు

రాదిమాశ్రమము నారాయణగిరి నాకు
నల రెండవది ఘటికాచలంబు
వృషభాద్రి మూఁడవ దీమూఁడునెలవుల
నశ్రాంతమును నేను విశ్రమింతు
ననిన దద్దేవదేవు పాదాంబుజముల
కమ్మునీంద్రులు సాష్టాంగ మాచరించి
విన్నపము గల దొక్కటి వేదవేద్య
కృప దలిర్పంగ నది చిత్తగింపవలయు.

24


సీ.

జలజాక్ష! మూఁడుయోజనములదాక ని
గ్గిరిమీఁద ఝరులు దీర్ఘికలు నదము
లేరులు మడువులు భూరి మోక్షదములు
గావుత నేడాదిగాఁగ నిందు
వసియించు జనుల కాపద లెవ్వియును లేక
దయ శాంతి దాంతియు ధర్మబుద్ధి
కలుఁగంగవలయు మృగంబు లన్యోన్యంబు
మైత్రిచే నెప్పుడు మనఁగవలయు
శబర యవన పుళిం దాదిజనములెల్ల
జ్ఞాన వైరాగ్య ధర్మముల్ బూనవలయు
నెలనెలను మూఁడువానలు నిండఁగురియ
ధరణి సస్యసమృద్ధయై తనరవలయు.

25


సీ.

ఆగమ యాగ యో గాన్నదానైక ప
రాయణులగుచు ధరామరులును
కరులతో హరులతో వర వీరభటులతో
జగతిఁ బాలించుచుఁ క్షత్రియులును
ధన ధాన్య పశు సుహృద్బంధువర్గంబుతో
కోటికి [13]పడగెత్తి కోమటులును
ధరణిసురోత్తమచరణసేవారతి
ప్రవరులై [14]మనుచు శూద్రప్రవరులు

వెలయుదురుగాత యని తను వేడికొనిన
మునులపై నుడివోవని కనికరమున
నట్లెయొనరింతు నే నని యానతిచ్చె
ఛిన్నసుజనార్తి శ్రీనరసింహమూర్తి.

26


క.

[15]హరుఁడు విరించియు నపుడ
గ్గిరిమాహాత్మ్యము నృసింహుకృప మునిభాగ్య
స్ఫురణము మెచ్చుచు తమ మం
దిరములకుం జనిరి మదిని నివ్వెఱ యొదవన్.

27


గీ.

అంత [16]వైఖానసులు వసుధామరాగ్ర్యు
లజుని పంపున సంతసం బావహిల్ల
వచ్చి హరినామసరసుల వారిఁ గ్రుంకి
ధౌతపటములు కటితటి: దాల్చి నిల్చి.

28


క.

మల్లియలు కమలసుమనో
వల్లరులును గన్నెరులును వాసంతికముల్
హల్లక పాటలములు ను
త్ఫుల్లవకుళ చంపకములు పొరిపొరి గొనుచున్.

29


సీ.

దేవతాగృహము సద్భావంబుతోఁ జొచ్చి
స్వస్తికా[17]సనముల వరుసనిలిచి
[18]ధౌతులై దేహశోధన మాచరించి ప్రా
ణాయామపరతమై యంతరంగ
మేకాగ్రముఁగఁ జేసి యెలమితో సంకల్ప
కల్పిత వస్తునికాయమునను
మానసపూజ నేమంబున గావించి
యావాహ నాస నార్ఘ్యాది విధులు
గంధ సుమ ధూప దీపాదికముల
[19]మధురనైవేద్యవీటీసమర్పణముల

నాటపాటల పూజనం బాచరించి
[20]రనిన నారదునకు భృగుఁడనియె నపుడు.

30


గీ.

సకలజీవాంతరాత్మయౌ శౌరి కెట్లు
వసుధ నావాహనంబు నుద్వాసనంబు
గలుగు నదియెల్ల నానతీవలయు ననిన
నింపుసొంపార నారదుఁ డిట్టు లనియె.

31


మ.

విను దైత్యాంతకుఁ డంతరాత్మ యగుచున్ వేఱొండుచోను న్వసిం
పును లోకంబులనిండియున్నశిఖి యేపోల్కిన్ శమీగర్భమం
దును గానంబడు నట్ల బింబగతుఁడై తోడ్తోడ నావాహనం
బును నుద్వాసన మమ్మహామహుఁడు సంపూర్ణస్థితిన్ గైకొనున్.

32


క.

అనవుడు భృగుముని యిట్లని
యెను వైఖానసు లనంగ నెవ్వరు చెపుమా
వినవలతు ననిన నారద
ముని యిట్లను నాదరంబు ముప్పిరి గొనఁగన్.

33


క.

ఇది గోప్యము [21]కలుషహరము
విదితంబుగ దీని తెఱఁగు వింటి తొలుత నీ
కది యిపుడు తెలియ వినిపిం
చెద నవధానముగ వినుము శిష్టజనాఢ్యా!

34


సీ.

అనఘ! నిరుక్తవేదాంగోక్తమై ధర
పొగడొందు నీకథ పుణ్యయగుచు
నంబుధీశ్వరుని యాగంబున జలదద
యనెడు నచ్చరఁ జూడ నజుని కపుడు
వీర్యంబుజారఁ దద్వీర్యం [22]బతఁడు పర్ణ
పుటి నించి వహ్నిలోఁ బోయ నందు
నర్చియును భృగుండు నంగారపిండంబు
నం దంగిరుండును నత్రి మునియు

విఖన సాంగత్యమునఁ జేసి విఖనసుండు
బొడమి రాయన్వయంబునఁ బుట్టు గనిన
వేదశాస్త్రార్థనిరతులు విప్రవర్యు
లఖిలమంత్రతంత్రార్థరహస్యవిదులు.

35


క.

పంచవిధబేరపూజా
చుంచువులై వార లెపుడు శుద్ధాత్మకులై
పంచాయుధ శోభితు నర
పంచాస్యునిఁ గొలుచుచుండ్రు భాగ్యము కలిమిన్.

36


క.

[23]అన భృగుఁడు పంచబేరా
ర్చనతెఱఁ గెఱింగింపు మనుచుఁ బ్రార్థించుడు న
య్యనిమిషసంయమి యాదర
మున నిట్లనిపలికె నధికమోదం బెసఁగన్.

37


సీ.

ఘనతేజ ధృవకౌతుకస్నాపనోత్సవ
బల్యంబులివి బేరపంచకంబు
పరఁగు నాఱవయది [24]బాలాల[25]యాహ్వయం
బదియ సూ పాంచరాత్రాభిదంబు
వరుస శ్రీకృష్ణుండు పురుషుండు సత్యుండు
నచ్యుతుండును [26]బుద్ధుఁ డనఁగ నందు
నావాహ్య[27]లల్లధ్రువాదిగా నుత్తరో
త్తర[28]బేరములయందు వరుస సేయ.
వలయు నావాహనం బని పలుక భృగుఁడు
నారదున కిట్టులనియెను గౌరవమున
నాద్యబేరంబు నావాహనాదికముల
నితరబేరంబుఁ జెందుట యెట్టు లనిన.

38


క.

దీపంబువలన వేఱొక
దీపము గలుగంగ రెంటఁ దేజము లేదే

శ్రీపతి యభిముఖ భావమె
యేపున నాహనాఖ్య నెసఁగు ధరిత్రిన్.

39


క.

అనవుడు భృగుఁ డిట్లను వి
ష్ణుని బూజ యొనర్చు ధరణిసురులకు ప్రాపిం
చును [29]మఱి దేవత్వం బని
జనులాడుదు రవ్విధంబు చయ్యనఁ జెపుమా!

40


క.

అనవుడు నారదుఁ డిట్లను
ఘనులగువీరల కొసంగె కమలోద్భవుఁడీ
యనుపమ పూజావర్తన
మును మును గావునను నదియుఁ [30]బొందదు వారిన్.

41


గీ.

కూలిగొని చేయువారి కా కొదవ గలదు
నొండుచో ఖండితారివేదండుఁ డైన
శ్రీనృసింహుని[31]తో నది చెల్ల దెపుడు
మౌనినాయక యిది సత్యమైన పలుకు.

42


సీ.

ఒక నాడు సంశయయుక్తచిత్తు లగుచు
సకలవైఖానసుల్ సాధుచిత్తుఁ
డవ్వసిష్ఠుఁడు విన ననఘ మే మిచ్చట
నివ్వటిల్లినవేడ్క నిలచుటెట్టు
లనిన నమ్ముని వారికనియె నో ఘనులార
యి మ్మహాహరియుండునెడలు తఱచు
రాణించు బదరికాశ్రమము సాలగ్రామ
ధరణీధర మయోధ్య ద్వారకయును
కాశి మధురయు నైమిశ కాననం బ
వంతినారాయణాఖ్యపర్వతము నీల
గిరి కురుక్షేత్రమును గాంచిపురము వెలయు
హరివసతులందు సుప్రసిద్ధంబు లగుచు.

43

గీ.

వేగవతి యుత్తరపుదరి వెలయు హస్తి
గిరి నజుని యజ్ఞవేదికాపరిసరమున
దనరు పుణ్యకోటివిమానమున వసించు
వరదుఁ డాత్మీయభక్తుల వరము లొసగు.

44


క.

ఇచ్చోటుల వసియింతురు
సచ్చరితులు బుధులు సత్యసంధులు పెక్కం
డ్రెచ్చో నేమూ ర్తి భయం
బచ్చో నామూర్తిఁ గొలుతు రనుపమభక్తిన్.

45


వ.

విశ్లేషించి యీ ఘటికాచలంబు సకలజనప్రశంసనీయం బని వసి
ష్ఠుండు బల్కుటయు నమ్మును లమ్మునీంద్రచంద్రుంబూజించి స్వామీ
యిందు విషమప్రదేశంబున మేముండుట యెట్లు సిద్ధించు నుపాయం
బుగల దేని యాన తిమ్మననుటయు వసిష్ఠుండు వారల కిట్లనియె.

46


గీ.

ఇమ్మహీధ్రమ్మునకు చుట్టు నెవ్వరేని
సమతలంబుగఁ జేయంగఁ జాలిరేని
యిందు మీరు సుఖంబున నుందు రనిన
వారు శ్రీనరసింహునిఁ జేరి మ్రొక్కి.

47


సీ.

శిరములు కన్నులు [32]చెవులు కాళ్లు
చేతు లసంఖ్యముల్ జెంది త్రిభువ
నేశుఁడవై బ్రహ్మవై శక్రరూపివై
యఖలదేవాకృతి నలరి తీవ
రూపదీపితుఁడ వరూపుఁడ వఖలస్వ
రూపుఁడ వీవ సంప్రాపకుఁడవు
అసమాక్ష[33]ముఖ్యులు నీయాజ్ఞ దాటంగలే
రితరు లెఱుంగుట కెంతవారు
పాకశాసనముఖ్య దిక్పాలవరులు
శాశ్వతైశ్వర్యులైరి నీ సాంద్రకృపను

సర్వభూతాత్మకుండపు సర్వ శుచివి
నీప్రభావంబు దెలియంగ నేర్తు మెట్లు?

48


సీ.

నీవాఁడుగావున నిధినాథుఁడయ్యెను
దేవ! కుబేరుండు దివిజవరుఁడు
నినుఁ గొల్చి దుర్వాసముని శాపజలధిలో
మునిగిన శ్రీ గాంచే మున్నువోలె
కడఁకతో తండ్రి యంకంబెఱుంగనివాని
[34]గాఁచితి నీ యంకగానిఁ గాఁగ
జనకుని కృతవీర్యసంభవు నంబరీ
షునిఁ గాచితివి మున్ను జనులు వొగడ
ఘనకృపావిభవమ్మునఁ గావు మమ్ము
నని మునీంద్రులు గొనియాడఁగా నృసింహుఁ
డంబుదారావగఁభీర మయిన ఫణితి
హితము దళుకొత్త వారల కిట్టులనియె.

49


క.

మెచ్చితిమునులారా మీ
యిచ్చికు వచ్చిన వరమ్ము లెయ్యవి చెపుడా
యిచ్చెద నన వారును మది
నిచ్చలముగ భక్తి యుక్తి నియతి దలిర్పన్.

50


క.

దేవా యిగ్గిరిచుట్టును
నేవేళన్ నీదుసేవ యే మొనరింపన్
దా వొసఁగు మనుచు వేడిన
నా విభుఁడపు డాంజ నేయు నాత్మఁదలంపన్.

51


వ.

అంత.

52


మ.

కనకోర్వీధరసన్నిభంబగు మహాకాయంబుతో విస్ఫుర
ద్ఘనకాంతిస్ఫుటకుండలద్వయముతోఁ గౌశేయవస్త్రంబుతోఁ
గనదుత్కంపితవాలవేష్టనముతోఁ గమ్రాంజలిస్ఫూర్తితో
హనుమంతుం డపు డేగు దెంచి నిలిచెన్ హర్యగ్రభాగంబునన్.

53

గీ.

నిలిచి సాగిలి మ్రొక్కి యో నీరజాక్ష!
నీకు నచ్చిన తొలిబంట నేన యిపుడు
నన్ను రమ్మన్నపనియేమి నాకుఁ దెలియ
నానతీయఁగఁ దగు నన్న నభవు డనియె.

54


క.

ఈ మునులు నిలిచియుండఁగ
నీ మహీధరముననుఁ బార్వతీశ్వరునిదెసన్
భూమి సమతలము సేయుము
గ్రామము నీపేరనొకటి గావింపు [35]మిటన్.

55


క.

అన నట్ల జేసి యచ్చట
హనుమంతుఁడు తనదుపేర హనుమగ్రామం
బను నొకగ్రామం బొనరిచి
తన నెలవున కఱిగె నంతఁ దద్విజవరులున్.

56


క.

అనుమోదమునను నరహరి
యనుమతిఁ దమయిండ్లనుండి హరిగృహమునకున్
జనుదెంచుచుఁ దత్పూజన
మొనరింపుచు నివ్విధమున నుండుచు నంతన్.

57


సీ.

అంబుజాక్షునకుఁ గల్యాణమహోత్సవం
బాచరింపఁగ మదియందుఁ దలచి
పువ్వుల చప్పరమ్ములు మేలు కురువేఱు
తావుల పందిళ్లు దళ్లు పెక్కు
పట్టులు మేల్కట్టు బహుదివ్యమణిపంక్తి
తోడ నమర్చిన తోరణములు
నగరు ధూపంబులు నంగడి వీథులు
బుగబుగలీను కప్పురపు మ్రుగ్గు
యాగశాలలు కనకకల్యాణవేది
భర్మహర్మ్యంబు[36]లును వీడుపట్లొనర్చి
చాటఁబనిచిరి సకలదిక్చక్రమునను
సరసిజాక్షుని పరిణయోత్సవదినంబు.

58

సీ.

భూషణ[37]ప్రవిలిప్తభూరిమణిప్రభా
కోటి దిక్కోటుల గుమురుగట్ట
ముత్యాలగొడుగుల మొలుచుడాల్ వెన్నెల
మొత్త మాకస మెల్ల ముంచికొనఁగ
చామరంబులువీఁచు చామ కరంబున
హేమకంకణరవం బింపుఁగులుక
పటహ భేరీ శంఖ పణవ మర్దళ ముఖ్య
వాద్యధ్వనుల్ దిశావలయమద్రువ
నందలంబులు పల్లకీ లశ్వములును
సామజంబులు నెక్కి యుత్సాహ మొదవ
నవనినాయకు లేతెంచి రచ్చటికిని
సరసిజాక్షుని పరిణయోత్సవముఁ జూడ.

59


సీ.

వ్యాసాది సంయమివర్గంబుతోఁగూడ
వాధూల సంయమీశ్వరుఁడు వచ్చె
వీణలు ధరియించి గాణ లేతెంచిరి
దేవలోకమున వర్తించువారు
నిటలోర్ధ్వపుండ్రంబు నీర్కావులు ధరించి
యరుదెంచి రఖిలాగ్రహారజనులు
[38]గొన్నన గొల్లెన కొల్లారు బండ్లును
తేనె నేయును నూనె తిలలు పెసలు
గుడము జీరకము హరిద్ర గోధుమలును
వరుగు వడియంబు లల్లంబు వరుసఁ గొనుచు
వణిజులును బేరివారును గణన మీఱి
వచ్చి రద్దేవదేవు నుద్వాహమునకు.

60


క.

అంతట వైఖానసు ల
త్యంతసదాచారు నొకని నన్వయ[39]వృద్ధున్
శాంతుని నాచార్యునిఁ గా
వింతమని యొనర్చి రట్ల వేదోక్తవిధిన్.

61

ఆ.

[40]హోమపూర్వకముగ నుత్తుంగగరుడకే
తనపటంబు నెత్తి తాళమాన
విధము తప్పకుండ వివిధవాద్యంబులు
మొరయఁజేయు తదవసరము నందు.

62


క.

పరివారసహితముగ పుర
హరుఁడును కమలోద్భవుండు దిశాధిపతులు స
త్వరమున సహవాహనులై
స్థిరకుం జను దెంచి రానృసింహుఁ గనంగన్.

63


సీ.

కనకకుంభము లెత్తి కరిరాజయుగ్మంబు
నినుచు తీర్థము లాడు నీలవేణి
వెన్నెల నొరవెట్టు వెలిపట్టువస్త్రంబు
జోకగాఁ గట్టెడు లోకజనని
అలినీలములనొప్పు నబ్జాసనమ్మున
కొలువుండు గురుకుచకుంభయుగళ
నెత్తమ్మిరేకుల నిరసించగాఁ జాలు
సోగకన్నులుగల శోభనాంగి
ఇందిరాదేవి యా జగదీశు నెదుట
నిలిచి మంగళాష్టకముల [41]యులివు సెలఁగ
చిత్రకరమైన తెర[42]యెత్త చేతులెత్తి
హరికి తలఁబ్రాలు [43]వోసె నయ్యవసరమున.

64


సీ.

కౌతుకబంధముల్ ఘటియించి నెఱిమించి
భూరివాద్యంబులు భోరుగలుగ
మొనసి ముక్తాఛత్రములు మిన్నుముట్టంగ
భాగవతుల యాట పాట లమర
నాగమస్తుతులు గాయక గానములు నొప్ప
నంబుజాసనల నాట్యములు ధనర

దేదీప్యమానమై దీప[44]ప్రతానంబు
రోదసీకుహరంబు రుచులనింప
రత్నయానంబు లందుంచి రాజసమున
మించి తిరువీథు లేగించి రంచితముగ
దిరుగ నగరు ప్రవేశించి దేవదేవు
మంచినైవేద్యముల దనియించి రెలమి.

65


క.

ఈగతి తొమ్మిది దినములు
నాగమవిధి సమ్మతముగ నఖిలోత్సవముల్
రాగిల్లఁ దీర్థవారియు
బాగుగఁ దిరుకోటిడించి ప్రమద మెలర్పన్.

66


క.

ఈవిధమున వైఖానసు
లేవేళ మహోత్సవంబు లెసఁగింపఁగ స
ద్భావమున జనులఁ బ్రోచుచు
నా విభుఁడు సుఖాబ్ధి నోలలాడుచునుండున్.

67


సీ.

అపవర్గకాముల కపవర్గఫలదంబు
ధనకాములకు మహాధనకరంబు
పుత్రార్థులకు బహుపుత్రదాయకము నా
యుష్కాములకు మహాయుష్కరంబు
పాతకహరమును బహురసాలంకార
భావ నానార్థవిభాసురంబు
నఖిలపురాణేతిహాసవిఖ్యాతంబు
పాఠక శ్రావక భాగ్యఫలము
నిఖిలకవిబుధసంస్తవనీయ మయిన
యీచరిత్రంబు నిరతంబు నెసఁగుచుండు
తారకాచంద్రభాస్కరధరణిశైల
శరధు లెందాక నందాక జగతియందు.

68

గీ.

అనుచుఁ బల్కిన నారదమునివరేణ్యు
తోడ [45]భృగుముని మదిలోన వేడు కలర
ననఘ నీవల్ల సుకృతి నేడైతి ననుచు
నతులు గావించి [46]మించి సమ్మతిని నుండె.

69


ఆశ్వాసాంతము

శా.

దివ్యాహార పయస్సితామధుర మాధ్వీక ప్రవాహోపమా
నవ్యాహార విలాస హావ విలసన్నారీ నవాంభోజినీ
నవ్యాహారమణాపణాయిత బుధా నందానుసంధాన స
ద్రవ్యాహార కుముద్వతీరమణ రారాజద్యశోమండలా.

70


క.

లోచన కమలా విలసన
యాచనక స్థూలలక్ష యౌవత హృదయా
సేచనక నిజౌజోవై
[47]రోచన కౌశిక పతద్విరోధి వరేణ్యా!

71


మాలిని.

సరసగుణసమాజా! సన్మృగేంద్రస్ఫుటౌజా!
పరభటకృతపూజా! బంధుగీర్వాణభూజా!
తరుణతరుణితేజా! ధారుణీరాజరాజా
భరణసుకవిభోజా! భాగమాంబాతనూజా!

72

ఇది శ్రీమత్పరమపదనాథ నిరవధిక కృపాపరిపాక పరిచిత సరస
కవితాసనాథ తెనాలిరామకృష్ణకవినాథ ప్రణీతంబైన
ఘటికాచల[48]మాహాత్మ్యం బను మహాప్రబంధంబు
నందు సర్వంబును తృతీయాశ్వాసము.

  1. పూర్వముద్రణమునం దీపద్యము లేదు.
  2. వచన తా.
  3. ఈ పాదము తాళపత్రమున లేదు.
  4. మహేభ. తా.
  5. నట. పూ. ము.
  6. జిరదిశన్.
  7. హననావంధ్య. పూ. ము.
  8. జేరి. పూ. ము.
  9. రక్షా. తా.
  10. వారుల. తా.
  11. మదిని.... పక్షమును- ఈ భాగము పూర్వముద్రణమున లేదు.
  12. లవియున్. పూ. ము. తా.
  13. పడగెత్తు. తా.
  14. మనెడు. తా. మించి. పూ. ము.
  15. హరియు. పూ. ము. తా.
  16. వైమానసులు. పూ.ము. తా.
  17. సరములు తా.
  18. ధాతు. తా.
  19. మఱియుమధుర. పూ. ము.
  20. కనిన. తా.
  21. ఈ పాదార్ధము తాళపత్రమున లేదు.
  22. బితడు. పూ.ము. తా.
  23. అని. పూ. ము. తా.
  24. వాలాల. పూ. ము. తా.
  25. పర్వతంబది సూవె. పూ. ము.
  26. బుద్దు ....లవ్వి.
  27. లల్లి. తా.
  28. భేదము. పూ. ము. ఈభాగము పూర్వముద్రణమున పూర్తిగా లేదు.
  29. దేవతల కత్వం. తా.
  30. బొందుదు. తా. పూ. ము.
  31. చో. తా. పూ.ము.
  32. చెవులు(చెక్కులు).
  33. ముఖులు. పూ. ము. తా.
  34. గాంచితి నీయంతవానిగాగ. పూ. ము.
  35. మికన్. తా. పూ. ము.
  36. లను. పూ.ము. తా.
  37. ప్రత్యుప్త. తా.
  38. గొనలు. తా.
  39. వృద్ధున్. తా.
  40. హేమ. తా.
  41. యలవు. తా. నెలవు సేయ. పూ. ము.
  42. యెత్తి. తా.
  43. నించె. తా. ము. తా.
  44. ప్రతాపంబు పూ. ము.
  45. నిట్లను.పూ.ము. తా.
  46. యతఁడు. పూ. ము. తా.
  47. రోచనక కౌశికద్విరాధీవరేణ్యా. తా.
  48. మహత్వం. తా.