Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 7/సంచిక 4/పట్టణ గ్రంథాలయ కథనము

వికీసోర్స్ నుండి

పట్టణ గ్రంథాలయ కధనము

అనగనగా అమెరికా దేశమను పేరుగల భూభాగము గలదు. ఆ దేశంలో "ఇండియా నెపోలిస్" అను పట్టణం గలదు. ఆపట్టణమున అరవై సంవత్సరముల కిందట ఒక గ్రంథాలయము స్థాపింపబడినది. మొదట ౧౧౩ గురు సభ్యులు అందుచే చందాల పద్ధతిని దానిని నడిపిరి. ఇట్లు నాలుగు సంవత్సరములు గడచునప్పటికి అది పౌరధర్మగ్రంథాలయముగ మార్చబడెను. ఈమార్పు జరుగున్నప్పటికి అందు ౩,౬౪౯ గ్రంథము లుండెను. మరి ౮,౦౦౦ గ్రంథములను పండితుల సలహా ననుసరించి సేకరింపబడెను. ౧౮౭౨ వ సంవత్సరమునం దీగ్రంథాలయమునకు "చార్లెస్ ఈ వాన్సు" అను సుప్రసిద్ధుడు గ్రంథ భాండాగారిగా నియమింప బడెను. అప్పటినుండియు ఈ గ్రంథాలయము విశేషమైన అభివృద్ధిని పొందసాగెను. ఆయన పరిపాలనా కాలమునందే ఈగ్రంథాలయమునకు నూతన భవన నిర్మాణము జరిగెను; ఈ భవనమునందు. ఇరువది సంవత్సరములున్న పిమ్మట అది చాలకపోవుటచే మరియొక గొప్ప భవనము నిర్మింపబడెను.

౧౮౯౨ వ సంవత్సరము నందీ గ్రంథాలయమునకు అదివరకే ఆ గ్రంథాలయమందు సేవకురాలుగా నున్న “ఎలీజాగోర్డను బ్రవునింగు” అను నారీమణి "గ్రంథ భాండాగారి” గా నియమితురాలై తన అసనమైన సామర్థ్యమువలన గ్రంథాలయమును మహెూన్నతమైన స్థితికి తేగలిగెను. ఈ ప్రకార మామె ౨౫ సంవత్సరముల కాలము "గ్రంథ భాండాగారి” పదవి నలంకరించి ౧౯౧౭ సంవత్సరమునందు ఆ పదవిని వదలి విశ్రాంతిని దీసికొనెను. ఈమె పరిపాలన కాలము నందు గ్రంథములు ౫౦,౦౦౦ ల నుండి ౨,౧౨,౦౦౦ లకు అభివృద్ధి యాయెను. గ్రంథములను అక్కడ చదువు వారు ౧౬,౦౮౮ నుండి ౪౧,౪౫౩ నకు బేరిగెను. ఇండ్లకు తీసికొనిపోవు గ్రంథముల సంఖ్య ౧,౪౨,౯౫౩ నుండి ౭,౨౫,౭ యయ్యెను. పండ్రెండు శాఖా గ్రంథాలయములు స్థాపింపబడెను. బాల శాఖ, పాఠశాలలకు రిఫరెన్సు శాఖ, ఏర్పరుపబడెను. తలుపులు లేని బీరువాల యందు గ్రంథముల నుంచు పద్ధతి అవలంబింపబడెను. మాసపత్రిక యొకటి ప్రారంభింపబడి నిర్విఘ్నముగ కొనసాగింపబడెను,

ఈ గ్రంథాలయము నందు ఇరువదిఐదు సంవత్సరముల కాలము పనిచేసి జగద్యఖ్యాతి నోందిన “ఎలీజాగోర్డను బ్రవునింగు” దొరసాని కడిచిన మే నెలయందే స్వర్గమలకరింపచెను. ఆ గ్రంథాలయము యొక్క దివ్యభవనమే ఆమెకు జ్ఞాపక చిహ్నముగ నుండ గలదు.

ఐరోపా మహాయుద్ధ మండలి భటులు చదువుకొనుటకై ఈ గ్రంథాలయము వారు అనేక గ్రంథములను సేకరించి పంపియుండిరి. ౧౯౧౮ సంవత్సరము నందు ఈ గ్రంథాలయము నందలి గ్రంథము లన్నిటిని నవీన పద్ధతుల ననుసరించి, వర్గీకరణము చేయబడెను. ఈ వత్సరమునుండియు ఈగ్రంథాలయమును అనేకవిధముల అభివృద్ధి జేసి యుండిరి. ప్రత్యేక విషయములను గూర్చి పరిశీలన చేయదలచువారికి ప్రత్యేక సదుపాయములు, ఉపాధ్యాయులకు వారి వృత్తికి సంబంధించిన ప్రత్యేక గ్రంథములు, బాలుర విద్యావిధానములు, తరిబీతు తరగతులు - ఈరీతిగా నూతన శాఖలు అనేకముగా ఏర్పరుపబడెను. గ్రంథాలయముయొక్క ఉపయోగము పొందని పట్టణ భాగములు రెండింటి యందు శాఖలు ఏర్పరుపబడెను. ఒక ఉన్నత పాఠశాల యొక్క గ్రంథాగారమును ఈ గ్రంథాలయము యొక్క శాఖగా అంగీకరించి దానిని పునరుద్ధరించిరి. చిన్న పట్టణమునందు నీగ్రోలు నివసించు భాగములందు రెండు శాఖలు ఏర్పాటు గావింపబడెను. పాఠశాల లందు ఉపాధ్యాయులకు ఆయా తరగతుల గదులయందలి గ్రంథా గారములకు కావలసిన గ్రంథములను, ఉపాధ్యాయుల తరిబీతు పాఠశాలలకు కావలసిన గ్రంథములను సప్లయి చేయుటకు ఏర్పాటులు జరిగెను. ౧౯౨౧ సంవత్సరమున, పట్టణమందలి పరిశ్రమాభివృద్ధికి కావలసిన గ్రంధములను చదువరులకు అందజేయుటకు ఒక శాఖను, వైద్యశాలలందలి రోగులకు గ్రంథముల నంద జేయుట ఒక శాఖను ఏర్పరచిరి. ౧౯౨౪ సంవత్సరమున లలిత కళలకును, సంగీతమునకును సంబంధించినట్టి శాఖ నొకదానిని నెలకొల్పిరి; ఇంతేగాక పాఠశాలలను విడిచిన బాలురకును బాలికలకును ప్రత్యేక సౌకర్యములను కలుగజేయుట కొక శాఖను ఏర్పరచిరి.

గ్రంథాలయముల మూలమున ఎన్ని విధముల ప్రజల కుపయోగించుటకు సావకాశములు గలవో జనసామాన్యమునకు బోధించు టకుగాను, ఈగ్రంధాలయమువారు ఎల్లప్పుడును క్రొల్తి కార్యక్రమమును అవలంబించుచు, గ్రంథాలయోపయోగమును సదా పెంపొందింప జేయుచుండెదరు.

ఈ గ్రంథాలయమునకు ప్రచురణశాఖ యొకటికలదు, ఈ శాఖవారు వారిశాభా గంథాలయములు మూలముననేగాక, దినపత్రికల మూలమున, పౌరపత్రికల మూలమున, కరపత్రికల మూలమున, ప్రసంగముల మూలమున, ప్రదర్శనముల మూలమున, ఉత్తరముల మూలమున, ఇంకను అనేక విధముల తమ గ్రంథాలయమును గూర్చి ప్రకటించుకొనుచుండెదరు. ఇవిచాలక, గ్రంథాలయ పక్షమున ప్రచారమునకుగాను మాసపత్రిక నొకదానినిగూడ ప్రకటించుచున్నారు. పట్టణమునందలి జనులెల్లరు ఈ గ్రంథాలయమును గూర్చి తెలిసికొని దాని ఉపయోగమును పొందవలెనని వారి యాశయము.

బాల శాఖనుగూడ అనేక విధములు పెంచినారు; ఈ శాఖ యందలీ గ్రంధములను విశేష పరిశ్రమ జేసి, ఏర్చి పెట్టినారు. “మంచి గ్రంధముల ప్రదర్శనము” ను సంవత్సరమున కొకసారి ఏర్పరచెదరు. వేసవికాలపు సెలవుదినములలో ఎక్కువ గ్రంథములను చదివిన పిల్లలకు బహుమతుల నేర్పరచెదరు. ఇందువలన పిల్లలలో నూటికి ౮౯టికి తక్కువ గాకుండ ఈగ్రంథాల యోపయోగమును పొందెదరు.

ఇన్ని విధములు అభివృద్ధిపొందుట వల్ల ఈ గ్రంథాలయ ఉపయోగము అమితముగ హెచ్చి పోయెను. ౧౯౧౭ సంవత్సరమున జూను నెలతో అంత్యమయ్యే కాలమునకు ఇండ్లకు గ్రంథములను తీసికొని పోవువారి సంఖ్య ౭,౨౫,౭౯౧ అయియుండగా, ౧౯౨౭ సంవత్సరము జూను నెలతో అంత్యమగు కాలమునకు ఇండ్లకు తీసికొనిపోవు గ్రంథముల సంఖ్య ౨౦,౯౫,౫౮౧ అయ్యెను. గ్రంథములను ఇండ్లకు తీసికొని పోవువారి సంఖ్య నూటికి ౧౬౧ చొప్పున పెరిగెను. పట్టణము యొక్క జనాభా నూటికి ౨౨ చొప్పున పెరిగెను. గ్రంథాలయము నుండి గ్రంథములను చదువువారి సంఖ్య మాత్రము నూటికి ౧౩ నుండి ౨౯ టికీ పెరిగెను. శాఖా గ్రంథాలయము లందలి అంకెలు నాలుగు రెట్లు అయ్యెను. చిన్న పిల్లలయందు చదువువారి సంఖ్య ౧౦౦ కి ౨౭౫ చొప్పున పెరిగెను. చిన్న పిల్లలు చదువు గ్రంథముల సంఖ్య నూటికి ౧౮౫ చొప్పున బెరిగెను.

పది సంవత్సరముల కాలములో ఇట్టి అపరూపమైన అభివృద్ధి కలుగుట సామాన్య కార్యము గాదు. గంథాలయ ఉపయోగము ఇట్లు అమితముగ హెచ్చి పోవుచుండ, గ్రంథాలయ పరిపాలకులగు అధికారులు అప్పుడప్పుడు గ్రంథాలయమునకై పట్టణమునందు వేయు పన్నును తగ్గించి గ్రంథాలయము యొక్క ఆదానుగూడ తగ్గించుట తరుచుగా తటస్థమగుచుండును. అట్టి స్థితిగతులయందు “గ్రంథ భాండాగారి” యొక్క నిరంతర కార్య దీక్షయును, 'మొండి పట్టుదలయును, సహజానందమును మాత్రమే గ్రంథాలయ జయప్రదమునకు దోడ్పడుచుండును.