గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 7/సంచిక 4/ఆంధ్రోద్యమము
అంధ్రోద్యమము
అనంతపురమందు జరిగిన ఆంధ్ర మహాజనసభ అధ్యక్షులగు శ్రీ ఓ. లక్ష్మణస్వామిరావుగారు
తమ ఉపన్యాసమునందు ఇట్లు నుడివియున్నారు.
ఆంధ్రదేశంలో జరుగవలసినపనిచాలా ఉంది. పూర్వం అంధ్రోద్యమం మూలకంగానే గ్రంథాలయోద్యమం విరివిగా పెరిగింది. అ దేమి కారణమో కాని బెజవాడలోని రామమోహన గ్రంథాలయం, హైదరాబాదులోని మ్యునిసిపలు గ్రంథాలయం, ఇట్లాటి పెద్ద తెగలో చేరక పోయినా కర్నూలులోని ఆంధ్ర గ్రంథాలయం, నంద్యాలలోని విక్టోరియా రీడింగు రూమ్ - ఇట్లాటి పట్లవాసపు గ్రంథాలయాలే నేటిదినం ఆనాటి గ్రంథాల యోద్యమానికి గుర్తులుగా నిలువబడియున్నవి. ఆంధ్ర సర్వకళాశాల యేర్పడిందానికి అందులోని విద్యావ్యాప్తి (Extension) పనిజరిపి ప్రజానికాసం విస్తారంగా జరిపించే సంస్థలు దేశమంతటా యేర్పడవలసి యున్నవి. గ్రంథాలయ సంఘాలుంటే యీ పతికి దోహదం బాగా జరుగుతుంది. అందువల్ల ఆంధ్రోద్యమ పటుత్వం బాగా నెలకొనడానికి మార్గమవుతుంది. ఆంధ్రస్థాయి సంఘంవారు యీపని గట్టిగా ఆరంభించవలెను.
1913 సంవత్సరములో ఆంధ్ర స్థాయి సంఘంవారి తరఫున ప్రకటితమైన ఆంధ్రోద్యమమనే కరపత్రంలో ఆంధ్రోద్యమంయొక్క ఉద్దేశాలు చెప్తూ దేశంలోని వ్యాపార వ్యవసాయ పరిస్థితులు కనుగొని ప్రజలలో పరస్పర సహకార విశ్వాసములను బుట్టించడమున్నూ, ప్రజల ఆ రోగ్యము దేహబలములకుసంబంధించిన విజ్ఞానం వ్యాపింప జేసిబలవంతులు, తేజోవంతులు దేశంలో ప్రబలేఉపాయాలా లోచించడంపయి ఉద్దేదేశాల్లో చేరినట్లు వ్రాసినారు. ఈఉద్దేశాల నిర్వహణం కూడా కొంత కొంతైనా జరిగినట్లు కనిపించడం లేదు. తాలింఖానాలు, గరిడీఖానాలు, దసరా పోటీపందెములు, విద్యార్థుల వ్యాయామసంఘాలు, ఆరోగ్య విజ్ఞాన పచారక మండలులు, వైద్యసహాయ సమితులు, ఊరూర. ప్రోత్సహించుటకు మన దేశమునం దెంతైనను అవకాశమున్నది. కాని యీపని అంతయు స్కూళ్ళ ఇ౯ స్పెక్టర్లది, శానిటరీ ఇ౯ స్పెక్టర్లది, మాత్రమేయని నాయకు లుదాసీన భావము పొందియున్నారు. ఆంధ్రుల ప్రత్యేక శక్తులు విజృంభింప వలెనంటే ఈ అన్ని విధముల జీవితమునకు పోత్రాహము కలుగవలెను.
అన్ని కార్యాలకు ఉద్దీపనం హృదయాన్ని పొంగజేసే శబ్దం. అది జాతీయమైనటువంటి కథల్లో, పాటల్లో, సుద్దుల్లో యిమిడి యున్నది. దాన్ని బహిరంగపరచే సాధనాలు కూడా ఆంధ్రోద్యమకారకులు ఆలోచించవలసిందని శాసించినారు. అయితే సాధారణంగా వినిపిస్తూండిన బొబ్బిలి పాట శబ్దమే క్రమక్రమంగా కరువౌతూవుంది. అనుదినం చదువుతూవుండిన భారత భాగవతాల సుస్వనము సాధారణంగా వినరావడంలేను. ఇండ్లలో ఆడవాండ్లు పాడుకొనుచుండిన సావిత్రి–సీత మొదలైన మహావ్యక్తుల గానము నశించి పోయి యుండవచ్చును, ఈ యన్నిటిని పునరుద్ధరించడం, నవీనజ్ఞానము నెడల ఉత్సాహము వ్యాపింపజేయడం, ఇవియన్నిన్నీ స్థాయిసంఘము వారు తల పెట్టవలసిన విషయములే.