Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 6/సంచిక 9/సరస్వతీమహలు గ్రంథాలయము, తంజావూరు

​

సరస్వతీ మహలు గ్రంథాలయము, తంజావూరు

ప్రపంచమునందన్న గ్రంథాలయములలో కెల్ల ఈ ప్రస్తుతము ఈ గ్రంథాలయము పెద్దదియును మిక్కిలి ప్రాముఖ్యత జెందినదియు నైయున్నది. 16, 17 శతాబ్దములందు దక్షిణ జిల్లాల నేలిన తెలుగునాయకరాజులచే ఈ గ్రంథాలయము ప్రారంభింపబడినది. అప్పటినుండియు పిమ్మట వచ్చిన రాజులెల్లరు దీనిని అభివృద్ధిపరచుచునే యుండిరి. తంజావూరు నేలిన మహారాష్ట్ర ప్రభువులు లెక్కలేనన్ని తాటియాకు గ్రంథములను ఈ గ్రంథాలయమునకు జేర్చిరి.

ప్రస్తుతము ఈ గ్రంథాలయము తంజావూరు రాజ కుటుంబమునుండి ఒక ప్రతినిధి, కలెక్టరు, జిల్లాజడ్జి, గ్రామస్థులనుండి ఒక ప్రతినిధి గలిగిన సంఘముచే పరిపాలింపబడుచున్నది. గ్రామస్థుల ప్రతినిధియగు టి. సాంబమూర్తిరావు గారు ప్రస్తుతము గౌరవ కార్యదర్శిగా పనిజేయుచున్నారు. గౌరవ కార్యదర్శియైనను జీతము పుచ్చుకొనువానికంటే ఎక్కువగానే గ్రంథాలయమునకై పనిజేయుచున్నారు.



​ఈ గ్రంథాలయ సంఘమువారు 1923-24 సంవత్సరమునకు రిపోర్టును ప్రకటించినారు. వ్రాత ప్రతులను సంరంక్షిచుటయేగాక, ఈదిగువ వివరించిన పనులను గూడ ఈ సంఘమువారు చేసిరి.

(1) వ్రాతిపతులకు విషయ వివరములను దెలుపు క్యాటలాగులను తయారు చేయుట.

(2) అమూల్యములగు వ్రాత గ్రంథములకు ప్రతులను ఇతర సంఘములకుగాని వ్యక్తులకుగాని వ్రాయించి యిచ్చట.

(3) వ్రాత గ్రంథములకు వివరణ పట్టికలను తయారుచేయుట.

(4) శిధిలమగుచున్న గ్రంధములకు తిరిగి ప్రతులను వ్రాయించుట,

(5) గ్రంథాలయమున జనులను చదువుకొననిచ్చుట.

ఈ సంవత్సరమందు 2,368 వ్రాత ప్రతులు ఇతరులచే జదువబడినవి. శిధిలమగుచున్న 49 గ్రంథములను తిరిగి మంచి కాగితములమీద వ్రాయించిరి. ఇతరుల ఉపయోగమునకై 33 గ్రంథములకు వ్రాతప్రతులు వ్రాయింపబడినవి. అరవగ్రంథములకు వివరణపట్టిక నుద్రింపబడుచున్నది. సంస్కృతాంధ్ర గ్రంథములకు గ్రంథ వివరణ పట్టికలను తయారుచేయుట అత్యంతావశ్యకమై యున్నది. ఈ పనికై గ్రాంటుకొరకు ప్రభుత్వమువారిని అడిగిరి. తంజావూరు మహారాజావారి కటుంబము వారిచే నియ్యబడిన మూలధనము వలనను ప్రభుత్వము వారి గ్రాంటులవలనను ఈ గ్రంథాలయము పోషింపబడుచున్నది. కాని ఈ ప్రకారము వచ్చు ఆదాయము ఈ గ్రంథాలయము చేయవలసిన పనులన్నిటికిని సరిపోవుటలేదు. అందుచేత మహనీయులు సహాయము చేసి ఈ గ్రంథాలయమునందున్న అపూర్వములగు వ్రాత గ్రంథములు శిధిలమైపోకుండ కాపాడి గ్రంథ వివరణ పట్టికలను వ్రాయించుట అత్యంతావశ్యకమై యున్నది.

ఆంధ్రులు నిర్వహింపవలసిన ప్రత్యేకమగు ధర్మమొకటి గలదు. ఆంధ్రుల అపూర్వములగు వ్రాత గ్రంథములనేకములు ఈ గ్రంథాలయమందు గలవు. అట్టి స్థితియందు ఆంధ్రగ్రంథముల వివరణ పట్టిక ఇంతవరకును తయారుగాక పోవుట మిక్కిలి శోచనీయము. ఇదిగాక ఈ గ్రంథాలయమునందున్న ఆంధ్ర అపూర్వ గ్రంథములను ప్రకటించుటగూడ అత్యంతావశ్యకమై యున్నది. ఈ పనులను పూర్తిజేసి ఆంధ్రులు ఈ గ్రంథాలయమును నిరాదరించుచున్నారను అపనిందను బాపుకొందురని కోరుచున్నారు.