గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 6/సంచిక 9/కార్నీజీ సహాయ సంఘము
కార్నీజీ సహాయసంఘము
గ్రంథాలయయోద్యమము నందు జరుగుచున్న పలువిధములగు కార్యములును గ్రంథాలయములు జనులకు చేయుచున్న పలురకములగు సేవయును, కార్నీజీ సహాయ సంఘము వారు చేయుచున్న కార్యక్రమమును బట్టి తెలుసుకొనవచ్చును.
ప్రపంచము నందున్న అన్ని దేశములందును అమెరికా దేశదాతయగు కార్నీజీ మహనీయు నెరుంగని వారుండరు. ఆయన దానములలో చాలభాగము ఆయన ద్రవ్యార్జనచేసిన అమెరికా దేశమునందే చేయబడినప్పటికిని ఆయన జన్మదేశమగు బ్రిటిషుదీవులందుగూడ దాన ధర్మములను జేసెను. తాను జేసిన దాన ధర్మములను నిర్వహించుటకు ఒక సంఘము నేర్పరిచెను. ఆసంఘమును స్థాపించి పండ్రెండు సంవత్సరముల కాలమై యున్నది. మొదటి అయిదు సంవత్సరముల కాలములో ఈ సంఘము చేయదగిన పనినిగూర్చి విచారించిరి. యుద్ధకాలమగు 1914 మొదలు 1918 సంవత్సరము వరకును ఈ సంఘము పనిని బొత్తిగా మానివేయవలసి వచ్చెను. కాని 1922, 1923, 1924 సంవత్సరములయందీ సంఘము విశేషముగు అభివృద్ధిని జూపినది. ఈ సంఘము నిర్వహించుచున్న పనులలో ముఖ్యమైనవి (1) పల్లెటూళ్ల అభివృద్ధి (2) గ్రంథాలయ స్థాపన (3) పల్లెటూళ్ల యందు పాట కచ్చేరీలను, నాటకములు మున్నగు వానిని ఏర్పాటు చేయుట (4) గ్రుడ్డివారికి గ్రంథాలయము (5) శరీర పరిశ్రమ (6) విద్యార్థుల బసలకు తగిన ఏర్పాట్లుచేయుట.
పల్లెటూర్లు అభివృద్ధివిషయమై ఒక సలహా సంఘము నేర్పరచిరి. ఈ సంఘము యొక్క ఖర్చులకై మూడు సంవత్సరములవరకు సంవత్సరమునకు 15000 రూపాయల చొప్పున మంజూరు చేసిరి. ఈ సంఘమునందు రాజ్యాభివృద్ధినిగోరు ప్రభుత్వము వారియొక్కయు ప్రజల యొక్కయు అన్ని సంఘములనుండియు ప్రతినిధులుందురు.
గ్రంథాలయముల విషయము
జిల్లా తాలూకాల గ్రంథాలయములయొక్క భవనముల నిర్మాణమునకై విశేష మొత్తములు విరాళముగ నొసంగబడెను, పల్లెటూళ్ల గ్రంథాలయములకు గూడ విశేషసహాయము చేయబడెను. అవి గ్రంథములు కొనుటకై 247500 రూపాయల విరాళమియ్యబడెను.
కేంద్ర గ్రంథాలయముల విషయమై ఎక్కువ శ్రద్ధ దీనికొనబడినది. వీనివలన విశేషమును ఉపయోగము కానుపించినది. అయితే కేంద్ర గ్రంథాలయముల నుండి గ్రంధములను వ్యక్తులకు గాక పల్లెటూళ్ల యందలి గ్రంథాలయములకు మాత్రము ఎరువిచ్చుటవలన ఎక్కువ ప్రయోజనముండునని అనుభవపూర్వకముగ నిర్ణయించిరి. “బ్లూమ్సుబరీ” గ్రంథాలయమునకు ప్రతిసంవత్సరమందువలె నే 15000 రూపాయయల విరాళమొసంగిరి. "వెస్టు మినిస్టరు" నందు గ్రుడ్డి వారల గ్రంథాలయ భవనము నభివృద్ధి చేయుటకు రు2,25,000ల విరాళమోసంగిరి. ఖైదీలకు ఉపన్యాసములను గూడ యిప్పించిరి.
లండను నగరమందు గ్రంథభాండాగారులను తయారుచేయుట కొక పాఠశాలనుగూడ నిర్వహించు చున్నారు. ఈ పాఠశాలకు ప్రతి సంవత్సరమును రు 22,5300 విరాళమిచ్చు చున్నారు.
ఐర్లాండ్ దేశమందు గూడ ఈ సంఘము వారి ఆదరగణక్రింద గ్రంథాలయములు విశేషాభివృద్ధిని జూపు చున్నవి.
సంగీతాభివృదికి ఈ సంఘమువారు రు. 30,000 రూపాయిలను నొసంగిరి.
శరీర పరిశ్రమాభివృద్ధికి గూడ రు.30,000 ల విరాళమొసంగిరి. విద్యార్థులకు వసతిగృహములకుగూడ విశేషద్రవ్యము ఖర్చుపెట్టిరి.
ఈ రీతిగా ఈ సంఘమువారు ఈ క్రింది మొత్తములను ఖర్చుపెట్టిరి.