గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 6/సంచిక 3/యెర్రిసరదాలు (పద్యములు)
స్వరూపం
యెర్రిసరదాలు
1 యెంకి వస్తాదాని
యెదురు తెన్నులు కాసి
దిగులుట్టి, తలదించి
తిరిగి సూనేతలికి ౼
యెంకిరావాలి నాయెదగ నిలవాలి
కులుకుతా నన్నేటొ పలకరించాలి!
2 పిల్ల పొరుగురి తల్లి
మల్లి రాలేదాని
వొల్లంత వుడురెత్తి
వొక్కణ్ణి పాడుకుంటే
ఘల్లుమంటా యెంకి కాలు పెట్టాలి
"యెల్లివొచ్చా" వంట యెంకీ నవ్వాలి!
3 యెంకి కోపాలొచ్చి
యేదేశమో పోయి
కల్లో నా కాపాడితే
కళ్లు తెరిసేసరికి ౼
తళుకుమని యెంకి నా దరికి రావాలి
"నిదర కాబో” సంట నిందలాడాలి!
— నండూరి వెంకటసుబ్బారావు
12-5-23