Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 6/సంచిక 1/రాధ పిలుపు

​

రాధ పిలుపు

మూడునాళ్లాయెరా మువ్వగోపాల
నినుజూడ కేనింక నిలువజాలనుర
కనులలో మెదిలేవు కనకగోపాల
నీచక్కదన మెందు దాచుకోగలవు
చాటుగా నిలుచుండి పాట బాడేవు
మరుగున తలవంచి మాటలాడేవు
ముసుగులో నేమిటో ముచ్చటాడేవు
తెరలోనరాగాలు తీసేవుకృష్ణ
మురళి వాయించరా వరహాలకృష్ణ
నీడలను బట్టుకోఁజాలు దేను
గజ్జెలందెలు మ్రోయ కడపరాకాలు
నీగుట్టుమటెల్ల నే నెఱుంగుదురు
నెమిలికుచ్చుతురాయి నిగనిగలాడి
నిను బట్టియిచ్చునంచును తీసినావె
నీచుట్టుపచ్చగా పూచేనటంచు
బంగారు శాలువా పాఱెసినావె;
ఎంతసేపాయరా యీవనాంతమున
నీకోసమొంటిగా ప్రాకులాడితిని
ఎందెందు వెదకినా యిబృందయందు
నీవెన్నల కానరావేల కృష్ణ!
పొదలలోపూవు నైపోయినా వేమొ
ఆలలో దూడపై యరిగినా వేమొ
తమ్ములతీయగా ద్రవియించితేమొ
కలికివేణువుతోడ కరిగినా వేమొ
నిన్నెందుజూతురా చిన్నారికృష్ణ
ఏమూల వెదికేదిరా మోహనాంగ
వెన్నదొంగిలి కానిపింపకున్నావొ
చీరలెత్తుకపోయి దూరమైనావో
తగుణులేనిను దారి తప్పించినారో
మధురలో పౌరులే మరపించినారొ
ఏమి సేయుదునురా నాముద్దుకృష్ణ!
నినుజూడ కేనింక నిలువజాలనుర
రాధను వేధింప రాదురాకృష్ణ
రాధ పైకోపింప రాదురా కృష్ణ!
పిలిచినుద్దీయరా ప్రేమాలపిందె
కలిసిక్రీడింపరా కళ్యాణకళిక!

౼ రాయప్రోలు సుబ్బారావు