Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 4/సంచిక 5/నెల్లూరు మండల గ్రంథాలయసభ

వికీసోర్స్ నుండి

నెల్లూరు మండల గ్రంథాలయసభ

సూరి మేకట నరసింహశాస్త్రిగారి అధ్యక్షోపన్యాసము.
1920 నవంబరు 20, 21 తేదీలు.

ఓం

ప.కోణితలంబు నెన్నుదురుసోకగమ్రొక్కినుతింతుసైకత
  శ్రేణికిఁ జంచరీకచయ సుందర వేణికి రక్షితామర
  శ్రేణికి దోయజాత భవచిత్తవశీ కరణైక వాణికి౯
  వాణికి నక్షరామ శుకవారిజపుస్తకరమ్య పాణికి౯

ప్రపంచమందంతటను ఘోరమగు ప్రచండవాయువు వీచుచున్నది. ఎచ్చట చూచినను అశాంతియే. ఏ వైపునకు తిరిగినను కలవరమే. రాజ్యాంగమునకును ప్రజలకును, పెట్టుబడిదారునకును కార్మికునకును, తండ్రికిని కుమారునకును, ఉపాధ్యాయునకును శిష్యునకును, ఇది యది యననేల? అన్యోన్య సంబంధములు గలవారలందరిలోను ఒకరితో నొకరికి కలహమును అసంతుష్టియు దక్క వేరొండు కానరాకున్నది. ఈ యశాంతియు ఈ యాందోళనయు విశ్వమానవజాతి నెప్పుడును కలవరపఱచు చుండవలసినదేనా? దీనినుండి ప్రజలకు విముక్తి ఎప్పుడైనను కలదా యనుసమస్య ప్రపంచమంతటను తీవ్రముగా చర్చింపబడుచున్నది.

భూసారమునుబట్టి వేరు వేరుభూముల యందు ఫలించు పైరులు వివిధలక్షణములు గలవిగా నెట్లగుచున్నవో అట్లే వేరు వేరు దేశములయందు ప్రత్యేక ప్రత్యేక లక్షణములుగల జాతులు నిర్మాణమగునని 'మాజీనీ' యను తత్వవేత్త నుడివియున్నాడు. ఈ న్యాయముననుసరించి వేరు వేరు జాతులయందు వేరు వేరు సాంఘిక నియమములును, సంప్రదాయమున, ఆధ్యాత్మిక తత్వము సిద్ధి పరుచుకొను సాధనములును ప్రచారణకు వచ్చును. ఆసేతు హిమాచల పర్యంతమగుపట్టియు పుణ్యభూమిమైనట్టియు, భారతభూమి యుదు ప్రపంచమంతకును విలక్షణమగు సంప్రదాయము లీయన్నివిషయములయందును సనాతనములై విరాజిల్లు చున్నవి. పాశ్చాత్య జాతుల ప్రత్యేక లక్షణములు సామాన్యముగా వారి రాజ్యాంగ నిర్మాణమునందు కాననగును. ఆకారణముననే మనదేశమున కిచ్చు రాజ్యా౦గ సంస్కరణలను నిర్ణయించుటకై పార్లమెటు పంచాయతీ సంఘమువారు చేసిన విచారణలో సాక్ష్యమిచ్చుటకు మన దేశమునుండి ప్రముఖులు వెళ్లియున్నపుడు దేశపరిపాలనకు సాధనముగానుండు మీజాతికి విలక్షణమగు నిర్మాణము దేనినైనను పేర్కొనెదరాయని మనవారిని ఆ దేశ రాజనీతికోవిదులు ప్రశ్నించిరట. పాశ్చాత్య రాజ్యాంగ నిర్మాణమును ఉన్నది యున్నటులు తెచ్చి పెట్టుకొనటకన్న వేరొండు శరణ్యము లేదని వారు ప్రత్యుత్తరమిచ్చియుండిరట. ప్రపంచమంతకును గురుస్థాన మధిష్టించి నిరవద్యమగు పరిజ్ఞానమును అఖండమగు ఆధ్యాత్మిక వికాసమును కలిగియుండుటయందు లోకమంతటిలోను సద్వితీయమై విరాజిల్లుచున్న భారతభూమి రాజ్యాంగ నిర్మాణమునందు విలక్షణమగు సంప్రదాయములు కల్గియుండలేదని చెప్పుట కడుసాహసము.

అట్లు చెప్పుట సాహసమైనచో 1. అట్టి రాజ్యాంగ నిర్మాణ మేది? 2. ఆనిర్మాణమునకున్న, భారత జాతి వికాసమునకును, ప్రస్తుత కాలమున ప్రపంచమునంతను ఆవరించియున్న అశాంతికిని ఏదైన సంబంధము కలదా? 3. ఈ విషయము మన గ్రంథాలయోద్యమమునకు ప్రస్తుతాంశ మెట్లగును? అనుప్రశ్నలు బయలు చేరుచున్నవి.

మన దేశచరిత్రను సింహావలోకనముగ పరిశీలించినచో ఈ ప్రశ్నలకు సమాధానము రాగలదు. మన పాఠశాలలయందు మనకు బోధింపబడు చరిత్రగ్రంథములేవియు ఇందుకు మన కక్కరకురావు. దేశచరిత్ర యథార్థముగా నుండవలెనన్న కేవల బాహ్య ప్రపంచమును గూర్చియే చెప్పునదిగా నుండక మానసికా ప్రపంచమునుగూర్చి కూడ వివరించునదిగా సుండవలెను. అనగా దేశమును పరిపాలించిన రాజుల నామావళిని, ఆయా రాజులు చేసిన దండయాత్రలను, వారు పరిపాలించిన దేశముల విస్తీర్ణమును, తరిబీతు చేసిన సైనికులు సంఖ్యను వివరించుటతో తృప్తి నొందక ఆయా కాలముల యందలి ప్రజలయొక్క సాంఘిక వికాసము, విద్యాభివృద్ధి, చిత్రలేఖనము, కాన్యరచన మొదలగు మానసిక వికాసమునకు తోడ్పడు కళలయభివృద్ధిని గూర్చిగూడ బోధించునదిగా నుండవలెను. ఈ మధ్య బైటపడు చున్న శాసనములవల్లను, విదేశయాత్రికులవలన రచింపబడి ఇప్పుడు ప్రచురణకు వచ్చుచున్న పురాతన గ్రంథములనుబట్టియు, దేవాలయములు రాజసౌధములు మొదలగు వానిపై లిఖింపబడియున్న చిత్రలేఖనములవలనను, పురాతనపు కట్టడములవలనను పూర్వముకన్ననిపుడు మన కెన్నియో రెట్లు అధికముగా మనస్వదేశచరిత్ర తెలియుచున్నది. ఈ యన్నిటిని బట్టి ఎన్ని విప్లవములు ఎంత కలవరము కలిగినను సనాతనమగు ఆర్యధర్మము అప్పుడప్పుడు జనించుకారణములవలన పైకి తాత్కాలిక ముగఖలమయినట్లు గోచరించినను యధార్థమున నిరవద్యమై నిత్యయౌవనముతో విరాజిల్లుచున్నదని బోధపడుచున్నది. ఇందుకు కారణము మన భారతభూమి అదిను౦డియు తపస్సవన్నలగు ఋషిపుంగవులచే విరాజిల్లు చుండుట చేత అట్టి పుణ్యపురుషులు తమ సమాధియందు ధర్మమును సత్యమును సాక్షాత్కరించుకొని ప్రజానికాసమునకు సాధనములుగా నుండు అన్ని నిర్మాణములను ఆ ధర్మముల నాధారపరిచి చేసి యుండిరి. ఇట్టి నిర్మాణములు భారత భూమికి విలక్షణములు. కాలపరిణమముచే ఈ నిర్మాణముల యొక్క ఆకారము మారవచ్చును. అట్లు మారుచున్న మాట నిశ్చయము. ఈనిర్మాణములయందు లీనమై యున్న ధర్మసూత్రములకు మాత్రమెట్టి మార్పును లేదు.

ఈ తత్వమునే మహాయోగి అరవిందుడిల్లు నిరూపించియున్మాడు:౼

"India can best develop herself and serve humanity by being herself and following the law of her own nature. This does not mean as some narrowly and blindly suppose the rejection of everything new that comes to us in the stream of time or happens to have been first developed or powerfully expressed by the West".

“భారత దేశము స్వధర్మాచరణము వలననే మానవ జాతికి సేవ చేయగల్గును. స్వాభివృద్ధి కూడ అమార్గముననుసరించియె పొందగలదు. ఇందువలన నవీన నిర్మాణములనన్నిటిని తిరస్కరించవలెనను ఆశయము కాదు. కాలనుగుణముగ వచ్చు మార్పులను బట్టి నిర్మాణమగు నట్టిగాని పాశ్చాత్యులభివృద్ధినొందించి నట్టి ఉద్యమములనుగాని అనివారితముగా తోసివేయవలయునని ఎప్పటికి చెప్పకూడదు. సనాతన ధర్మము ఆర్యభూమియండేట్లు వర్ధిల్లు చున్నదో చరిత్రనుఁడి కొన్ని నిదర్శనములవలన స్థిరీకరించుటకు ప్రయత్నించెదను. పారసీకులు మనదేశముపై దండయాత్ర జరుపక పూర్వము చరిత్రాత్మకమనదగు విషయము లేవియు మనకు తెలియవని చరిత్రకారులు నుడువుచున్నారు. పాశ్చాత్యుల సంప్రదాయముల ననుసరించి వ్రాయబడిన మనదేశ చరిత్రయొక్క ఆదికాలమందే తక్షశిలయందు మహెూన్నతమగు విశ్వవిద్యాలయము వర్ధిల్లు చుంకెననియు, ఆవిద్యాలయమున వేదములను అష్టాదశవేదాంగములను సమర్థులగు ప౦డితులు బోధించుచుండిరనియు విద్యాపారంగములగుటకై అచ్చటకు ధనికులగు బ్రాహ్మణ క్షత్రియవిద్యార్ధులు పెళ్లచుండిరనియు మనము చదువుచున్నాము. గుటూరు మండలమున ప్రస్తుత మమరావతీపట్టణమున్న స్థానమున ధాన్యకటక మను పేర గొప్ప విశ్వవిద్యాలయము నర్థిల్లెననియు, దాని ననుకరించి లాసాపట్టణమున విద్యాలయము నిర్మాణ మాయెననియు మన కీపుడు తెలియుచున్నది. క్రీస్తుశకము ఏడవశతాబ్దమున మనదేశమునకు యాత్రపరుకుగావచ్చిన హుయావత్స్యాంగు ప్రస్తుతము పాట్నాయన పేరుతో వర్థిల్లుచున్న పాటలీపుత్రమునకు సమీపమున నెలకొల్పబడియున్న 'నలందా' యను విశ్వవిద్యాలయమును వేనోళ్ల వర్ణించి యున్నాను. ఇచట కూడ సకల శాస్త్రములును, కళలును, అభ్యస్తమగుచుండెనని చరిత్రకారులు వ్రాసియున్నారు. అందువలననే ఈ విద్యాలయము ఆసేతుహిమాచలపర్యంతమగు భారతభూమియొక్క అన్నిరాష్ట్రములనుఁడియు విద్యాంసులను విద్యార్ధులను ఆకర్షించు౦డెను. క్రీస్తుశకము 12, 13 శతాబ్దములవరకును బంగాళాదేశమున 'ఓదంతపురము' 'విక్రమశిల' యను విశ్వవిద్యాలయములు వర్ధిల్లు చుండెను. కాకతీయ, విద్యానగర, చాళుక్య, పల్లవ, చోళ, పాండ్య రాజులచరిత్ర మనకు పూర్ణముగా తెలిసినపుడు ఆయాకాలములయందు స్థాపింపబడియున్న విశ్వవిద్యాలయముల అభ్యుచ్ఛయదశ మనకు గోచరము కాకపోదు. 'బెజవాడకు సమీపమున కృష్ణకు ఆవలివైపున ప్రస్తుతము మందడ మనుపేర బరగుచున్న గ్రామమునకు సమీపమున ఈమధ్య నూతనముగా బయటపడిన శాసనమువలన కాకతీయుల కాలమున సకలవిద్యలను బోధించుట కెట్టి ఉన్నత విశ్వవిద్యాలయములు స్థాపింపబడియుండెనో మనకిప్పడు బోధపడుచున్నది. మన దేశమున ప్రస్తుతము “జాతీయ విద్యావిధానముకై జరుగుచున్న పోరాటము" ఈ సనాతన విద్యాపద్ధతిని పునరుద్ధారణ చేయు వాంఛ ఎందుకు కాదు?

మన దేశీమున నభివృద్ధిగాంచిన చిత్రలేఖనము యొక్క చరిత్రమును పరికించిచూచిన నిట్లేకనబడును. బంగాళారాష్ట్రమున పునరుద్ధారణ మగుచున్న చిత్రలేఖనమున ప్రాచీన సంప్రదాయము లెట్లు లీనమైయున్ననో మహాయోగి అరవిందుడు వర్ణించియున్నాడు. ఆధునిక వాఙ్మయమునందును కావ్యరచనయందున కూడ ఇట్టిసూచనలే మనకు గోచరమగును.

రాజ్యాంగ నిర్మాణమున మన భారతభూమియందు ప్రత్యేక విలక్షణముగు స్వస్థాపన 'గ్రామసంఘము' మనదేశమెన్ని పర్యాయములు పరరాజులచే ఆక్రమింపబడినను ఎందరు రాజులు వచ్చినను, ఎందరు పోయినను, ఈస౦ఘములు స్వతంత్ర జీవనముకలవై సముద్రపు పైభాగముమాత్రము కల్లోలితమై అడుగు భాగ మెప్పుడును ప్రశాంతమై యుండునట్లు మనదేశ" పద్ధతులను నైతిక మార్గములను ఆచారములను సారస్వత నైఖరులు రుచులు మొదలుగా గల భారతజాతీయ వ్యక్తిత్వ వికాససాధనముల నన్నిటిని భద్ర పరచునవిగా ఏర్పాట్లల్లుచున్నవి. “పరరాజులు మనదేశము పై ............." 'ప్రభుత్వమే కారణము.”

పరరాజులు మన దేశముపై దండువిడిసి కొల్లగొట్టుచున్న కాలముననే, మహామహులుదయించి జనులకు ధార్మిక నైతిక మార్గములు నిరభ్యంతరముగ నుపదేశింపగల్గిరి. 8వ శ॥ కేమారిలుడు వైదిక ధర్మమున ప్రతిష్టించెను. 9 వ శశాతాబ్దమునందు షణ్మతస్థాపనా చార్యుడైన శంకర భగవత్పాదులు ఆసేతుహిమాచలము సంచారము చేసి వాక్యార్ధములచే పండితత్తములు పాదాక్రాంతులు గావించి, అదైృతమతి ప్రాశస్థ్యమును లోకమునకు వెల్లడించెను మరియు మాహాకవులగు భవభూతి, (క్రీ.శ॥ 780) మాఘుడు (క్రీ.శ॥ 800) నైషధకర్తయగు శ్రీహర్షుడు (క్రీ.శ॥ 1188), మహమ్మదీయులు దేశము నాక్రమించుకొనుచుండగనే మహాకృతులు రచించిరి. 12 వ శతాబ్దమునందే కాశ్మీర చరిత్రకారుడైన కల్హానుడు 'రాజతరంగిణి' యను చరిత్ర గ్రంథమును రచించెను.

పదునొకండవ శతాబ్దమున దక్షిణ హిందూస్థాశమున బసవారాధ్యుడు జైనమతమును వేదాంతదేశికుడు వైష్ణవమతమును స్టాపించిరి. మహమ్మదీయప్రభువయ్యు నాజీర్షాయను నతడు (i282–1325) మహాభారతమును బంగాలీ బాషలోనికి పరివర్తితము చేయించెను. 15 వ శతాబ్దము నందు కుల్లూకభట్టు మనుస్మృతికి వ్యాఖ్యానమును రచించెను. ఉత్తర దేశమందు జిమూతవాహనుడు 'దాయాభాగము' అను ధర్మశాస్త్రగ్రంధమును దక్షిణదేశ విజ్ఞానేశ్వరుడు మితాక్షరమను గ్రంథమును రచించాడు.

మొగల్ పరిపాలనమునందు హైందవ నాగరికత నిష్కళంకితమై యభివృద్ధిగాంచెను. ఈ కాలమున నుదయించిన తులసీదాసు మున్నగు మహాకవుల కాన్యములు, ఆంగ్లకవులగు స్పైన్సర్, షేక్సిషియర్ల కావ్యము కంటె రసవంతములుగ నున్నవని ఆంగ్లేయవిద్వా౦సులభిప్రాయ పడియున్నారు. తులసీదాసు రామాయణము నేటికిని ఉత్తర దేశమందు జనసామాన్యమునకు సర్వోపనిషత్సార సంగ్రహమైముక్తి ప్రదాయినియై యున్నది.

15 న॥ శతాబ్దమునంను పంజాబులో అప్పటి మహమ్మదీయ దౌర్జన్యమున కంకుశమై శిక్కుమత ముదయించెను. 17 వ॥శ॥ అంతమున ఔరంగజేబు దౌష్ట్యమువలన ప్రకోపింపబడి మహారాష్ట్ర సామ్రాజ్యముదయించెను. మహారాష్ట్ర రాజ్యచరిత్ర హిందువులకు రాజ్యాంగ నిర్మాణమునందు గల నైపుణ్యమును వెల్లడించెను. రామదాసు గురుపాదులవారి కరుణాపాంగలబ్ధమైన శైవ్యోద్రేకము కలవాడై శివాజి మహమ్మదీయుల నాగి, పాశ్చాత్యునుగ్గుచేసి, అర్యనాగరికతను మతమును ఉద్ధరించిన చరిత్ర స్వర్వదా సంస్మరణీయము. శివాజీ యొక్క నైపుణ్యతకును సమర్థతకును, కారణములతని గురు దేవభక్తియే యని ముఖ్యముగ గమనింపవలయును.

పై జెప్పిన విషయములవలస తేలిన సారాంశమేమనగా:— కేంద్ర మందేరాజులున్నను, వారిమతములు, నాగరికతలు విదేశీయములైనను ఆర్యనాగరికత, జీవన్ముక్తుడు ప్రపంచమందు సంచరించుచుండియు దాసినలన వ్యామోహితుడు కానట్లు, నవనీతము మజ్జిగలో వైచినను మునిగిపోనట్లు, తన స్వత్వమును కాపాడుకొని నేటికిని తొలుతటి తేజముతో విరాజిల్లుచున్నది. ఇట్లునుండుటకు మన స్థానిక పరిపాలనా పద్ధతులయందుగల పటుత్వమే కారణము.

ఇట్లే వేరు వేరు కులముల వారికిని వేరు వేరు వృత్తుల నవలంబించు సంఘముల వారికని కూడ ప్రత్యేక సంఘములుండియుండెను. ఈ సంఘముల నిర్మాణ 'మెట్టిదియో వీని వ్యవస్థలెట్టివియో ఈ సంఘములకును కేంద్రప్రభుత్వమునకును ఎట్టిసంబంధము కలిగి యుండెనో వీని విధు లెట్రివియో బాధ్యత లేవో నిర్ణయించు గ్రంథములున శాసనములున ఇప్పుడెన్నియో బైటకు వచ్చినవి. వీని నన్నిటిని చేర్చి ప్రస్తుతము మైసూరు విశ్వవిద్యాలయమున చరిత్ర శాస్త్ర పండితులును ప్రాచీన హైందవ నాగరికతను పరిశోధించి అమూల్యమగు గ్రంథరాజములను ప్రచురించిన శ్రీయుత రాధాకుముదము కర్జీ గారు నూతనముగా “స్థానిక ప్రభుత్వము” అను పేర ఒక గ్ర౦థమును రచించియున్నారు. వివరములు తెలియగోరు వారు అగ్రంథమును అనువాదముగా కృష్ణపత్రిక యందు ఈ సంవత్సరము మే, జూన్, జులై, ఆగష్టు నెలలలో "దేశీయ స్వపరిపాలనా పద్ధతి” అన శీర్షికతో ప్రచురింప బడిన వ్యాసములను చదువ గోరుచున్నాను. ఈ సంఘము చరిత్ర వలన మనకు ముఖ్యముగా బోధపడు విషయము లేవి యనగా:- వీని నిర్మాణమును గూర్చి వేదముల యందును, స్మృతులయందును, పురాణముల యందును, కావ్యములయందును, శాససముల యందును వర్ణింపబడియున్నది. మరియు ప్రత్యేక మొక దేశమ౦దును, ఒక కాలమందును అభివృద్ధి గాంచివిగా నుండక ఆసేతు హిమాచల పర్యంతమగు భారతభూమియొక్క అన్ని రాష్ట్రముల యందును అన్ని కాలములయందును ఈసంఘములు తమవిధులను నిర్వర్తించుచు౦డేనని కూడ మనకు తెలియుచున్నది. ఇందుకు వ్యతిరేకముగ ఏదో యొక కాలమున౦దును మాత్రమే ఒక దేశమునందే ఈ సంఘములు లుద్భవించి యుండెనని విన్సెన్ స్మిత్తుగారు ఆక్సుఫార్డు హిస్టరీ ఆఫ్ ఇండియా అను గ్రంథమును వ్రాసిన వ్రాత కేవలము సాహసము. బ్రిటిషు ప్రభత్వములో ఈగ్రామసంఘములకు శైధిల్యము వాటిల్లినది. ఈ గ్రామ సంఘములను పునరుద్ధరణ చేసినచో మనకు కల్గు లాభములు కడుమెండు. పాశ్చాత్యదేశమును పీల్చిపిప్పి చేసి ఇప్పటి అశాంతికి ముఖ్యకారణమైనది ప్రత్యేకవ్యక్తిస్వాతంత్య్రావాదము. మన దేశమందు సనాతనముగా వచ్చుచున్నది సంఘ సమీకరణసిద్ధాంతము. ఈ సిద్ధాంతానుసారముగానే మనకులమునుబట్టియు, వృత్తినిబట్టియు, నివాసస్థానమును బట్టియు మన దేశమున స౦ఘములు నిర్మాణమగు చున్నవి. ఈసంఘములు అందుచేరిన వారిని తమ తరబీతుకు లోబరచుకోని స్వోత్కర్షకై తన జీవితమును వృయపరచి పొరుగువానిని హింస పెట్టి తాను లాభము పొంద వలయునని వ్యక్తీయందుదయి౦చెడి వా౦ఛను అణచివేయగలవు. ఇట్లు చెప్పింటచే వ్యక్తి స్వాత౦త్యమున కేమైన ముప్పువాటిల్లు నని తలంచరాదు. వ్యక్తి సంఘమునందు సర్వ స్వాత౦త్యము కలిగియుండి సంఘము యొక్క చర్యలను నిర్ణయించుట యందు ఇతరులతో సమానాధికారము కల్గియుండును. ఇందువలన స్వల్పద్రవ్యముతో వాంఛలను తీర్చుకొనుచు మానవుడు తన నైలిక ఆధ్యాత్మికతత్వములను తనబుద్ధిని వికసింప చేసికొనుటకై పాటుపడటకు తగుసమర్ధుడగు చున్నారు. పాశ్యాత్యుల సిద్ధాంతము మనజుని వాంఛలను అనంతముగా చేసుకొనవలసినదని చెప్పుచుండ మనదేశ సిద్ధాంతము అందుకు బేధముగానుండియున్నది. పైన చెప్పిన ఆధ్యాత్మిక పరి జ్ఞానము ప్రపంచమును కలవరపరచుచున్న అశాంతిని నిర్మూలము చేయగలదు.

ఇట్టి సంఘములు పునరుద్ధరణ చేయుటకు మన గ్రంథాలయ సంఘ సభ్యులకు కల సావకాశములు మరి ఎవ్వరికిని లేవు. మన పల్లెటూర్ల యందు ధర్మాదాయము లెన్నియో కలవు. ఇవియన్నియు అన్యాక్రాంతములై ఉద్దేశింపబడిన పనులకు వానియాదాయములు వ్యయము కాకుండ పోవుట తటస్థించుచున్నవి. వాని యాదాయమును దొరతనమువారు స్వాధీనపరుచుకొనుటకు కొంతకాలము ప్రయత్నము జరిగినది గాని ఇప్పుడు ఏ యూరియందలి ధర్మాదాయముల ద్రవ్యము ఆయూరియందు సర్వజనోపయోమనకై ఖర్చు పెట్టవలయునను న్యాయమును దొరతనము వారు అంగీకరించునట్లు కనబడూచున్నది. ఇట్టి ద్రవ్యమునుబట్టియు, ఇంక నిట్టిగణద్రవ్యమును ఇతర మార్గముల ననుసరించి కూడ సముపార్జన చేసి సర్వజనోపయోగము కొరకై వ్యయపెట్టి ప్రజలందరకు తన్మూలమున సమానసౌఖ్య మొనగూర్చుట మన గ్రంథాలయ సంఘముల విధియైయున్నది.