గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 4/సంచిక 1/దేశ స్వభావమునకు చరిత్రకును గల పరస్పర సంబంధము
దేశ స్వభావమునకును చరిత్రకును గల పరస్పర సంబంధము
1. భరతఖండమనియు,ఇండియామనియు, ప్రఖ్యాతిఁ గాంచిన మనదేశపు చరిత్ర మిక్కిలి ప్రాచీనమై, అనేక అద్భుతాంశములతోఁ గూడియున్నది. వీటితత్వము తెలిసికొనుటకుఁ బూర్వము దేశముయొక్క స్వభాలక్షణము లేవియో నిర్ణయించు టావశ్యకము, ఏలన, దేశచరిత్రలోని ప్రధానధర్మములనేకములు దేశముయొక్క నైసర్గిక స్వరూపముల ననుసరించి యుండును.
మనదేశమునకు, ఉత్తరమున హిమాలయమును దూర్పున గొంతవఱకు హిమాలయశాఖలును మిగిలిన భాగమున బంగాళా ఖాతమును, దక్షిణమున హిందూమహా సముద్రమును, పశ్చిమమున అరేబియా సముద్రము కీర్తారు సులైమా౯ సం ఫేదుకో పర్వతములును, యెల్లలుగనున్నవి. ప్రభుత్వ సౌకర్యముకొఱకిప్పటి కాలమున బర్మా, బెలూచిస్థాన రాష్ట్రములఁగూడ యిండియాలోఁ జేర్చి యున్నారుగాని వీటికిని మన దేశమునకును స్వాభావిక సంబంధ మెట్టిదియు లేదు.
2. మనచరిత్రలోనికొన్ని ప్రధానవిశేషములకు మనదేశము పూర్వార్ధగోళముయొక్క నట్టనడుమ నుండుట ముఖ్యకారణమని చెప్పవచ్చును. మనకును తూర్పుభాగ మందలి బర్మా, నైయాం, కంబోడియా, మలే, జావా, సుమాత్రా మొదలగు ప్రదేశములకును, పశ్చిమభాగమందలి పర్షియా, ఆరేబియా, తూర్పు ఆఫ్రికాలోని దేశములకును, యీనిమిత్తమున చారిత్రక విషయములందు సులభపరస్పర సంబంధము సమకూడెను. మనపూర్వులీ దేశము లన్నిఁటితో వ్యాపారముఁజేసి వీటిలోఁ గొన్నిటి యందు వర్తక స్థానములనే గాక స్థిరనివాసములఁ (Colonies) గూడ నేర్పఱచుకొని నగరము లసేకములఁ గట్టి గొప్ప స్వతంత్ర రాజ్యములు స్థాపించి, మన గ్రంథములను శాస్త్రములను జిత్రికళలను మతమును వాటియందు వ్యాపింపఁజేసిరి. ఇన్ని దేశములకు సమీపమునఁ గాక, యెక్కడనో నొకమూల మనదేశముండిన యెడల, వీటియన్నిఁటితో నీలాటిసంపర్కము సంపాదించుట దుస్సాధ్యముగ నుండి యుండును, ఇదిగాక పూర్వకాలమున ప్రాక్పశ్చిమ ఖండముల మధ్యన జరుగుచుండిన వ్యాపారమున కంతయు మనదేశము రాజబాటయై ప్రసిద్ధిఁగాంచిన యనేక రేవుపట్టణములు గలదై తులలేని యైశ్వర్యము ననుభవించినందుకు గూడ నిదియే హేతువు. ఇందుచేతనే సమీపమందుండిన అన్యదేశీయు లనేకులు మనదేశమునకు వచ్చి మనల సులభముగ జయించుటయు మన దేశములోఁ బుట్టి పెరిగిన బౌద్ధాది మతము లితర దేశముల సులభప్రచారము సంపాదించుటయు, సంభవించెను. ఈ కాలమందు సహితము ఆస్ట్రిలెషియా,ఏషియా, ఆఫ్రికాలలోని యాంగ్లేయ సామ్రాజ్య రాష్ట్రముల మధ్య మనదేశముండుటచేతనే దానిని శత్రుభారినుండి రక్షించుట యందు మన ప్రభుత్వమువార పరిమిత శ్రద్ధను వహించవలసి యున్నారు. 3. హిమాలయపర్వతము మన దేశమును యిరుగు పొరుగు దేశములనుండి సంపూర్ణముగ వేరుపఱచుచున్నది. ఇది ప్రపంచములోని పర్వతములన్నిటిలో నెత్తెనదై, 1500 మైళ్ళ పొడుగును, 150 మొదలు 250 మైళ్ళ వెడల్పును గలిగి ఉత్తర దేశవాసుల యుపద్రవము నుండి మనల రక్షించుటకు దైవముచే నిర్మితమైన ప్రాకారమోయనునట్లున్నది. దీనియందుఁ గిలిట్టు కావల పామీరు ప్రదేశసమీపమునను, కాశ్మీరదేశపు పొలిమేరయందును సట్లెజు నది జన్మస్థాన మందుండియు, సిక్కిం రాష్ట్ర మార్గమునను కొన్ని కనుమలున్నవి. ఇవియన్నియు, మిక్కిలి యిరుకుగను అపాయకరముగను యుండుటచే వీటిద్వారా యెవరో కొందఱు యాత్రీకులు, వర్తకులు మాత్రము ప్రయాణముఁ జేయుటకు సౌకర్యము లున్నవి. గాని, యాయుధసహితులగు విశేషసంఖ్యగల సైనికులు వచ్చుట దుస్సాధ్యము. అన్యదేశీయులనేకులు మనదేశముపై దాడివచ్చి మనల జయించిరి గాని, వీరెవరును హిమాలయ కనుమల నుపయోగించినవారు కారు. చీనా దేశీయులగు శాకులు, యూచీలు (తుషారులు) మున్నగు వారు మన దేశమును ప్రవేసించుటకుఁ బూర్వము, వాయవ్యభాగమున ప్రయాణముచేసి, ప్రథమమున కాబూలు ప్రాంతమునుఁ జేరి, యచటనుండి మన దేశమునకు వచ్చిరి గాని, సూటిగ హిమాలయ మార్గముల దాఁటి రాఁజాలరైరి. యంత్రనిర్మాణజ్ఞాన మభివృద్ధిఁగాంచిన నీకాలమందుఁగూడ నిట్టి కార్యముఁ జేయగలవారెవరును లేరు. మన రక్షణార్థమై యింతటిమహోపకారము గావించి మన సంపదలకు మూలాధారములైన సింధు, యమునా, గంగా, బ్రహ్మపుత్రాది నదులకు జన్మస్థానమగుటచేతనే మన వారిప్పటి వఱకును హిమవంతమును పర్వతరాజముగనే గాక దైవముగను దేవతల నివాస భూమిగను పరిగణించు చున్నారు.
వాయవ్యభాగమందలి పర్వతపంక్తు లిట్టివికావు. ఇవియు హిమాలయ శాఖలేగాని, వీటియందు లక్షలకొలఁది జను లేక కాలమున దాఁటగల కనుమలు పెక్కులున్నవి. వీటిలో ప్రధానములైనవి కైబరు, కుఱ్ఱం, బోల౯ కనుమలు. ప్రాచీన కాలమందు మన దేశము జయించ నుద్దేసించివచ్చిన పారసీకులు, గ్రీక్కులు, శాకులు, పహ్లవులు, హూణులు, తురకలు, మొదలగు దేశాంతర
వాసులందఱు నీకనుమల మార్గముననే మనదేశమును ప్రవేసింపఁ గలిగిరి. ఇవిగాక, బెలూచిస్థానపు తీరమందుండి కరాచి పట్టణమున కుత్తరముగ మనదేశము చేరుటకు మరియొక దారి యున్నది. ఇదియు చాల పురాతనమై ప్రాచీనకాలమందు మనదేశమునకును పశ్చిమయేషియాలోని బాబిలోనియా, ఆసిరియా మొదలగు సామ్రాజ్యములకును జరుగుచుండిన వ్యాపారమునకేగాక ఆ రాజ్యములందలి ప్రజలును వారి నాగరికతయు మన దేశమును బ్రవేశించుటకు కూడ ప్రథానమార్గముగ నుండెను. మహమ్మదీయులలో మొట్టమొదట మనల జయించుటకు వచ్చిన అరబ్బీలు దీనినే యుపయోగించిరి.
ప్రస్తుతముకూడ మెట్టమార్గమున మన దేశమును దండెత్త నుద్దేసించు విదేశీయులెల్లరు యీవాయవ్య కనుమగుండ రావలయును. కాని వారికి వేరు మార్గములు లేవు. ఇందుచేతనే యిప్పటి ప్రభుత్వమువారు యీప్రదేశముల రక్షించుటకై యెంతయో శ్రమపడుచు విశేష ద్రవ్యము ఖర్చుపెట్టి యనేక కోటలగట్టి విస్తారసైన్యముల వాటియందు నిలిపియున్నారు. విదేశీయుల
యుపద్రవ మెల్లప్పుఁడీ ప్రాంతమందత్యధికముగ నుండినందున విచ్చట నివసించు సిక్కులు మొదలగు పంజాబు రాష్ట్రీయులీ కాలపు హిందువులలో నెల్ల యోధాగ్రగణ్యులనియు, నసమాన బలపరాక్రమ వంతులనియు ప్రఖ్యాతిఁ గాంచియున్నారు. ఇంతకు బూర్వ ప్రదేశములోని కనుమల జాగ్రతగ కాపాడుకొనుటయందు మనమసమర్థులుగ నుండినందుననే, మన దేశమన్యుల
పాలగుట సంభవించెను.
ఆగ్నేయ భాగములోని కనుమలు ప్రయాణీకులకు సులభసాధ్యములు కావు. ఇందుచేత నీదిక్కునుండి మనల బాధ పెట్టినవారు చాలమందిలేరు. కాని యుపయోగించఁదగిన మార్గములు కొన్ని వీటియందుండుటబట్టి, మం గోలియ౯ జాతివారు కొందఱు ప్రాచీనకాకాలమందు మనదేశమును బ్రవేశించి, యిప్పటి. ఆసాం, బంగాళా రాష్ట్రములలో కాపురము లేర్పఱచుకొనఁ గలిగిరి.
4. సముద్రములు దేశమున కెల్లలుగా నుండుటవలన యొకప్పుడు లాభమును, మరియొకప్పుడు నష్టమును సంభవించు చుండును. దీనికి మనదేశపు చరిత్రయే నిదర్శనము. సముద్రసహాయమున నితర దేశములతో సాంగ త్యము సంపాదించుట సులభము. నౌకానిర్మాణ కుశలులగు ప్రజలు సముద్రతీరమందుండిన యెడల, వారిసహాయముచే నెంతటి గొప్ప సముద్రములనైన దాఁటుటకవకాశముండును. మన పూర్వులలో నిట్టి సామర్ధ్యముగల వారనేకులుండిరి. వారిచే నిర్మితములైన నౌకల సాధనముగఁ జేసుకొని, మనవారు బంగాళాఖాతమును దాఁటి యావలనున్న దూరదేశములకును ద్వీపములకును వెళ్ళి వాటిని జయించి, గొప్పరాజ్యములు స్థాపించఁగలిగిరి. మన కిరుగు పొరుగున నాకాలముందుండిన విదేశీయులెవ్వరు నౌకాబలమందు మనకంటే నధికులు గాకపోవుటచేత, సముద్రమార్గమున మన దేశమును జయించ ప్రయత్నించు వారెవరును లేరైరి. హిమవత్పర్వతముల వలె సముద్రములు కూడ మనకు రక్షకములై యుండెను.
కాని, యిటీవల, గతించిన నాలుగైదువందల సంవత్సరములనుండి, యివియే మన స్వాతంత్య్ర నష్టమునకు హేతువులైనవి, పదిహేనవ శతాబ్దాంతమందు ఐరోపియన్లు సముద్రమార్గ మొకదానిని మన దేశమునకు గనిపెట్టిరి. అది మొదలు పోర్చుగీసు, డచ్చి, ఫ్రెంచి, ఇంగ్లీషు మొదలగువారు మనదేశమును జయింపఁ బ్రయత్నించి తుదకాకార్యమును సాధించఁగలిగిరి. సముద్ర
సహాయమే లేనియెడల నంతదూరమందుండు విదేశీయులు మనల వశపరచుకొనుట సంభవించి యుండదు. సముద్రయాన మందును నౌకానిర్మాణమందును వారు మనకంటె యెక్కువ నేర్పును ధైర్యసాహసములును గలిగినవారు. వారి నౌకాబలము మన దేశపు ప్రభువుల నౌకాబలముకంటె నత్యధికముగ నుండెను. ఇదియే వారి విజయమునకు హేతువు. సముద్రము లెల్లలుగ
నున్నప్పుడు ప్రభువులు విశేషనౌకాబలముఁ గలిగియుండినఁ గాని సముద్రమార్గమునవచ్చు విదేశీయుల బాధ తప్పించుకొనుట దుస్సాధ్యము. కనుక ప్రస్తుత కాలమందు కూడ వాయవ్యభాగమందలి సేనలకన్న సముద్రమందలి బ్రిటిషునౌకలే మనల నెక్కువగఁ గాపాడుచున్నవి.
సముద్రయానమందు తగినంత నేర్పును మనవారు సంపాదించక పోవుట కనేక కారణములు గలవు. మన దేశము మిక్కిలి సారవంతమైనది. విదేశవ్యాపారమవసరములేకయే మనకుఁ గావలసిన పదార్ధములనన్నిటిని స్వదేశమం దుత్పత్తి ఁజేసుకొనుటకు
వలయు సదుపాయములన్నియు మనకున్నవి. సముద్రయానమందు నేర్పరులై విదేశములకు వెళ్ళి సరుకులఁ దెచ్చుకొన్నఁగాని
జీవయాత్ర జరుగదన్న భయము మనపూర్వులకు లేకయుండెను. ఇట్టి సందర్భమందీ విషయమై ప్రజ్ఞానుభవములఁ పొందఁ గోరినవారి సంఖ్య చాల తక్కువగనుండెను. ఇది గాక ఇంగ్లండు, హాలెండు, గ్రీసు మొదలగు దేశపాశ్చాత్యదేశముల సముద్ర తీరములందువలె, మన దేశమున గొప్పయోడలు నిలుచుటకుఁదగిన రేవు లనేకములు లేవు. తూర్పుతీరమందిట్టివి లేవనియే చెప్పవచ్చును. పశ్చిమ తీరమందు బొంబాయి నగర మున్నది గాని యినుపదారులు రాకపూర్వము దానినుండి మన దేశపు
మధ్యభాగమునకు మెట్టమార్గమున వెళ్ళుట సులభసాధ్యముకాని కారణముచే దానిని రేవుపట్టణముగ నుపయోగించుటకు వీలులేక యుండెను, సముద్ర మనేక ప్రదేశములలో భూమిలోనికిఁ జొచ్చుకొనివచ్చి తీరమును వంకరగఁ జేసినయెడల, రేవులేర్పడుట కవకాశముండును. మన సముద్రము లట్టివికావు. ఇంతయేగాక, తీరమందీ సముద్రములు విస్తారము లోతులేనిపై, యిసుకతో నిండి యుండుట చేత, గొప్ప యోడలన్నియు, సముద్రపుగట్టునకు రాఁజాలక, నాలుగైదు మైళ్ళదూరమందుండవలసి
యున్నవి. కొన్ని దేశములయందు నదుల ముఖద్వారములు విశాలములై, పెద్ద నావలు నిలుచుటకును, ప్రవాహమార్గమువ విదేశములోపలికిఁ బోవుటకును, సౌకర్యములుండును. మన దేశమందాలాటి సదుపాయములు తక్కువ. గంగానది ముఖ ద్వారము తప్ప మిగిలినవన్నియు మిక్కిలి యిరుకై, యినుక దిబ్బలతో కూడియుండుట చేత చిన్నపడవలకేగాని పెద్దనావలకవి యుపకరించుట లేదు. ఇన్ని లోపములు మన సముద్రతీరమందుండుటఁ బట్టి నావలఁజేయు వారును వాటిని నేర్పుతో
నుపయోగించగలవారును బహుస్వల్పము. ఈ కారణముచే నౌకాబలము ననకుఁ గావలసినంత విశేషముగ అభివృద్ధిఁ
గాంచలేదు. ప్రాచీన గ్రంథములలో మనవారు వర్ణించిన యుద్ధములన్నియు భూమిమీఁదఁ జరిగినవి కాని సముద్ర యుద్ధములు కావు. శ్రీరాములవారు లంకాద్వీపమునకు సేతుమార్గమున గాని నౌకాసహాయమున వెళ్ళలేదు. అర్ధశాస్త్రములలోను నీతిసారముల యందును ప్రభు బలముల నిర్ణయించు సమయమున చతురంగ బలమున కిచ్చిన ప్రాముఖ్యత గ్రంథకర్తలు నొక బలమున కిచినదిలేదు. మన దేశమున బ్రసిద్ధిఁ గాంచిన సామ్రాజ్యము లన్నియు భూమినే కాని సముద్రముల నాధారముగఁ జేసుకొనినవి కావు.
5. ఆంగ్లేయ సామ్రాజ్యస్థాపనకుఁ బూర్వము మన దేశమునంతయు నేకచ్ఛత్రముగ పరిపాలించిన వారెవరుసు లేరు. మహాశూరు లనియుఁ జక్రవర్తి శ్రేష్ఠులనియు బిరుదు వహించిన ఆశోక, విక్రమాదిత్య, శ్రీహర్ష, కృష్ణ దేవరాయ, అక్బరు మొదలగు మహానీయలు కూడ దేశములోని కొంత భాగమునకు మాత్రమే పరిపాలకులుగ నుండిరి. అనారిగ మన దేశమందొక్క రాజ్యము గాక ననేక స్వతంత్ర రాజ్యములుండినవి. వీటినే పౌరాణికులు యభైయారు దేశములుగ వివరించియున్నారు. దేశ మొక్కటియైనను రాజ్యములు పెక్కులుండుటకు కొన్ని హేతువులున్నవి. వీటిలోఁ మొదటిది దేశము యొక్క వైశాల్యతయే. మన దేశము 1,530,059 చదరపుమైళ్ళ విస్తీర్ణము గలదై యింగ్లీషువారు నివసించు దేశమునకంటె పదిహేను రెట్లు గొప్పదై, ఐరోపా ఖండ మందలి (రషియాతప్ప) దేశములన్నింటి వైశాల్యమెంతయో అంతటి వైశాల్యముఁ గలదిగా నున్నది. ఇంత గొప్ప దేశమును యొకరు సంపూర్ణముగ జయించి పరిపాలించుట సులభసాధ్యము కాదు. ముఖ్యముగ, ఇనుపదారులులేక, దేశము లోని యొక భాగమునుండి మఱియొక భాగమునకుఁ బ్రయాణముఁ జేయుట కష్టతరమైయున్న కాలమందిట్టి మహాకార్యముఁ జేయుట కవకాశములు లేక యుండెను. ఇదిగాక వైశాల్యాధిక్యము వలన బ్రజల యాచార వ్యవహారములందనేక భేదములు పుట్టుటయు, వీటివలన రాజకీయ విషయములందు గూడ వారు వేరై, వేరు వేరు ప్రభువుల యధికారమునకు వశులగుటయు సంభవించెను.
మన దేశములోని యొక ప్రాంతము నుండి మఱి యొక ప్రాంతమునకు వచ్చుట కెన్నియో ఆటంకములున్నవి. స్వాభావికముగ
నీ దేశము మూఁడు భాగములుగ విభజింపఁబడియున్నది. ఇందులో మొదటిది యుత్తర యిండియా, దీనికే అణ్యావర్తమనియు హిందూస్థానమనియు పేర్లు కలవు ఇది వింధ్య, హిమాలయ పర్వతములకు మధ్య నున్నది. మిధ్య పర్వతములకును కృష్ణా తుంగభద్రా నదులకును మధ్యనుండు (రెండవ) భాగమునకు దక్క౯ (దక్షిణాపధము) అని పేరు. దీనికి దక్షిణమున కన్యాకు
మారి వఱకునుండు ప్రదేశము మూఁడవభాగమగు దక్షిణ యిండియా లేక ద్రావిడము, హిందూస్థాన, దక్షిణాపథములకు మధ్యన వింధ్య పర్వతములు, నర్మదానది, సాత్పురా పర్వతములు, తపతినది, ఉత్తరకనుమలు మొదలగునవి యడ్డములుగ నున్నవి. వీటినన్నిటిని దాఁటినఁ గాని హిందూస్థాన మందుండి దక్షిణ దేశమునకు వచ్చుటకు వీలు లేదు. సూర్యబింబమును గూడ నడ్డగించు చుండిన వింధ్యపర్వతమును అగస్త్యమహర్షి యేదియో నొక విధమున వశపఱచుకొని దక్షిణదిక్కునకు రాగలిగెనను పౌరాణిక గాధ యీయాటంకముల నతిక్రమించుటకై పూర్వులు పడిన కష్టమును సూచించుచున్నది. సులభముగ దక్షిణదేశమును బ్రవేశించుటకు వీలులేకపోవుట చేత, ననేక విషయములందు దాక్షిణాత్యుల చరిత్రకును ఔత్తరీయుల చరిత్రకుకు నపరిమిత భేదము కనబడుచున్నది. అక్ష్యుల వైదికమతమును, వారి సాంఘిక వ్యవస్థలుకు, వారి యాచారవ్యవహారములును, వారి
నాగరికతయు, హిందూస్థానమఁనమందు వ్యాపించిన తర్వాత, తగినంత సులభముగను సంపూర్ణముగను దక్షిణ దేశమందు వ్యాపించలేదు. ఆర్యుల భాష యగు సంస్కృతము, ఉత్తర యిండియాలోని యిప్పటి ప్రజలు మాట్లాడుచుండు హింది, పంజాబి, బంగాలి మొదలగు భాషలన్నిటికి మూలమై, ఆభ్యావర్తమందంతట ప్రచారముఁ గాంచ గలిగినది కాని, దక్షిణ దేశమందలి ద్రావిడ భాషలగు నాంధ్రము, కన్నడము, ఆరవము మొదలగు వాటిని వళపఱచుకొనఁ జాలక పోయెను. ఉత్తర రాష్ట్రా వాసులకును దాక్షిణాత్యులకును పరస్పరసాంగత్యము కష్టమగుటయే దీనికి హేతువు: ఇట్లే ఆర్యావర్త పరిపాలకులు కొందఱు దక్షిణాపథమును, దక్షిణాపథ ప్రభువు లార్యావర్తమును జయించి వశపరుచుకొనుట కుద్దేసించినను వారి ప్రయత్నములు సాధారణముగ కొనసాగక, కొనసాగినపుడుగూడ తాత్కాలికఫలమునే గాని స్థిరవిజయము నివ్వకపోవుటకీ నైసర్గికాటంకములే ప్రధాన కారణము. దైవ నిర్మితములయిన యీయడ్డములు లేని పక్షమున మన దేశమంతయు బూర్వకాలమందుగూడ నొక్క ప్రభుత్వమునకే వశమైయుండి యుండును. వాయవ్య భాగమందుండి మనదేశమును బ్రవేసించి, హిందూస్థానమును స్వాధీన పఱచుకొనిన అస్యదేశీయు లనేకులు దక్షిణ దేశపు పరిపాలకులు కాకపోవుటకును, బలవంతులనియు పౌరుషవంతులనియు ప్రఖ్యాతిఁ గాంచిన మహమ్మదీయుల మతము సహితము ఉత్తర యిండియాయందువలె దక్షిణ భాగమందు నాటుకొననందుకు కూడ నిదియే కారణమని జెప్పవచ్చును.
దక్షిణాపధ, దక్షిణ యిండియాలకు మధ్యనున్న కృష్ణా, తుంగభద్రా నదుల దాఁటుట సులభమగుటచే నీ రెండు ప్రదేశములలోని ప్రజలకు పరస్పర భేదము లనేకము లగుపడుట లేదు.
దక్షిణ భాగమును ప్రవేశించఁగోరు పరదేశస్థులకు మెట్టమార్గము కంటె సముద్రమాగ౯ మెక్కువ సుకరమైనది. ప్రాక్పశ్చిమ సముద్రతీరముల రెంటియందును పూర్వకాలమున నిప్పటికంటె రేవుపట్టణము లెక్కువగ నున్నట్టును, వీటిలోఁ గొన్ని కాల వశమునను సముద్ర స్వభావమందు కలిగిన కొన్ని మార్పుల వలనను క్షీణతఁ జెందినట్టును, దేశచరిత్ర వలనఁ దెలియు చున్నది. ఈ రేవుల నాధారఁము జేసికొని దక్షిణ యిండియాకు అన్యదేశీయు లెందఱో వచ్చి యుండవచ్చును కాని కారణాంతరముచేనట్లు జరుగలేదు. ప్రాచీన కాలమందు మనకు తూర్పుగ నుండు బర్మా మొదలగు దేశములలోనివారు నాగరికత యందును నౌకాబలమందును మనకంటె యుత్కృష్టులు గాకపోవుటచే ఆవైపునుండి తూర్పుతీరపు రేవుల చేరువారెవరును లేరైరి. పశ్చిమదేశము లందలి పారశీకులు, అరబ్బీలు మొదలగువారు వ్యాపారమందు చాల ప్రసిద్ధి గాంచి మనదేశపు పశ్చిమ తీరమునకు వచ్చుచుండిరి గాని పొరుగూడ సముద్రతీరమును దాఁటి దేశము లోని మధ్యభాగమును చొరలేక పోయిరి. దీనికి గారణము పడమటి కనుమలు. ఇవి పశ్చిమ సముద్రమునకును దక్షిణాపధ దక్షిణ యిండియాలకును మధ్యనుండు యెత్తైన కొండలు. వీటిని దాఁటినఁగాని నీప్రదేశముల లోపలి భాగమును జేరుటకు వీలులేదు. ఈ కొండలు సముద్రతీర సమీప మందుండుటచే, వాటికిని సముద్రమునకును మధ్య నుండు దేశము మిక్కిలి సంకుచితమై అన్యదేశీయు లనేకులు స్థిరనివాసము లేర్పఱచుకొనుటకుఁ గావలసిన వసతులులేక యున్నది. ఈ కనుమల ప్రాంతమందు కాపురముచేయువారు మిక్కిలి పౌరుషవంతులై, స్వతంత్ర రక్షణయందు కడుదీక్షాపరులై యున్నారు. శివాజీకాలము నుండి ప్రసిద్ధి గాంచిన మహారాష్ట్రు లిక్కడివారే. పర్వత ప్రదేశములనివసించు వారగుటచే వీరు సహజ శరీర పటుత్వముగలవారై పర్వత శిఖరములమీఁద దుర్గములగట్టుకొని, పరులెవ్వరు దేశములోనికిఁ జొరకుండునట్లు యుద్ధముఁ జేయుచుండిరి. ఈ కారణము చేత పశ్చిమ తీరమునకు విదేశీయులనేకులు వచ్చుచుండినను, వారు దక్షిణా పథమును గాని దక్షిణ యిండియాను గాని జయించజాలరైరి.
తూర్పు భాగమందుకూడ నిట్లే తూర్పు కనుమలను కొండలున్నవి. ఇవి సముద్రమునకుఁ గొంచెము దూరమందుఁడుటచే, వీటికిని సముద్రతీరమునకును మధ్యనుండు ప్రదేశము విశాలముగనున్నది. ఇందుచేతను, దీనియందు గోదావరి, కృష్ణా,కావేరి మొదలగు గొప్పనదులు ప్రవహించుచుండుట చేతను, దక్షిణ యిండియాలోని తూర్పుభాగము పశ్చిమ భాగముకంటె నెక్కువ సారవంతమై, యెక్కువ ప్రజాసంఖ్యను కలదై ఉత్తమ నాగరికత కనాదిగ నెలవైయున్నది. దేశము సుభిక్షముగా నున్నగాని ప్రజలభివృద్ధిఁ గాంచలేరు. గనుకనే, దక్షిణ దేశమందలి పాండ్య, చోళ, పల్లవ కాకతీయాది ప్రాచీన రాజ్యములన్నియు తూర్పు భాగమునబుట్టి, క్రమ క్రమముగ పశ్చిమ భాగమునకు వ్యాపించగలిగినవి. పశ్చిమ తీరమందలి రాజ్యము లెప్పుడు యింతటి ప్రాముఖ్యతను సంపాదించలేదు. మన నాగరికతా చిహ్నములయిన పుణ్యక్షేత్రములును బ్రశస్త దేవాలయములును తూర్పు భాగమందే యున్నవి. పడమటి కనుమలకును తూర్పుకనుమలకును గల భేదమే, తూర్పు పడమటి ప్రదేశ చరిత్రములలోని యీభేదములకు కారణమాయెను.
మహారాష్ట్రుల స్వాతంత్య్రమును పడమటి కనుమలు రక్షించినట్లు హిందూస్థాన మందలి రాజపుత్రుల స్వరాజ్యమును యెడారులు కాపాడినవి. రాజపుత్ర స్థానములోని యారావలి పర్వతములకుఁ బశ్చిమమున సింధునదీ ప్రాంతము వఱకు యెడారిమయమగు ప్రదేశ మొకటి యున్నది. ఉత్తర యిండియాలోని పంజాబు రాష్ట్రమును జయించినవారు సూటిగ దక్షిణదిక్కున ప్రయాణముఁ' జేసి యిప్పటిబొంబాయి రాష్ట్రమును ప్రవేసింపకయుండు నట్లు,యీయెడారి యడ్డగించుచున్నది. దీనియందిప్పుడు యోధపురము, బినీరు, జయసల్మీరు మొదలగు స్వదేశ సంస్థానము లున్నవి. మహమ్మదీయులు ఉత్తర యిండియాను జయించినప్పుడు వారియుపద్రవమునుండి తప్పించుకొనుటకై రాజపుత్రులీ యెడారిని బ్రవేశించి, యచ్చట పట్టణముల గట్టుకొని, స్వతంత్రరాజ్యముల స్థాపించుకొనిరి. అది మొదలు వీరిని వళ్ళపఱచు కొనుటకై తురకలనేక పర్యాయములు ప్రయత్నించిరి. కాని వీరి యుద్యమములు పూర్తిగ ఫలింపఁజాలినవి కావు. యెడాదిలో గొప్ప సైన్యములు ప్రయాణము చేయుట సులభసాధ్యము కాకపోవుటయే దీనికి హేతువు.
పర్వతములు, నదులు, యెడారులు, అడవులు మొదలగునవి యీవిధముగ దేశమును విభజించి కొంత లాభమును మఱికొంత నష్టమును మనకు గలుగఁజేసినవి.
5. పూర్వకాలమందు వన్నెఁగాంచిన నాగరికత లన్నిఁటికిని గొప్పనదులు ప్రవహించు ప్రదేశములు జన్మస్థాపములుగ నుండెను, నైలునదీ తీరమందలి యీజిప్టు దేశమును, యూఫ్రటీసు, టైగ్రీసు నదులు ప్రవహించు బాబిలోనియా, ఆసిరియా, పారసీక సామ్రాజ్యములును, హొయాంగ్ హొ, యాంగ్సీకియాంగ్ నదుల తీరమందుండు చీనా దేశమును దీనికి నిదర్శనములుగ నున్నవి. మన దేశముకూడ నిట్టిదియనియే జెప్పవచ్చును. హిందూస్థానమందు సింధు, యమునా, గంగా, బ్రహ్మపుత్రాది నదులును, దక్షిణదేశమందు నర్మదా, తపతీ, మహానది, గోదావరి, కృష్ణా, కావేరీనదులును, ప్రవహించుచున్నవి. ప్రసిద్ధిఁ గాంచిన మౌర్య, ఆంధ్ర, గుప్త, శ్రీహర్ష, చోళ, విజయనగరాది సామ్రాజ్యముల కన్నిఁటికి యీ నదులే మూలాధారములై వాటియౌన్నత్యమును విస్తరింపఁజేసినవి. ప్రజల నైశ్వర్యవంతులఁ జేయుటయందును, తన్మూలమున ప్రభువుల శక్తి సంపన్నులఁ గావించుట యందును, నదులవలె నుపచరింపగలవి మరేమియులేవు. వీటి నన్నిఁటిలో ముఖ్యముగ గంగానది మనకు గావించిన యుపకార మింతింతియని జెప్పుటకు సాధ్యము కాదు. ఈ నది ప్రవహించు ప్రదేశమత్యంత సారవంతమై, ప్రజలకు నీటి లోపమును గలుగఁజేయక, సమస్తమైన పంటలకు నెలవై, కర్షకులకు వలయు నాహార పదార్థముల సులభముగను పరిమితముగ నుత్పత్తిఁ జేయించుచు, ప్రపంచములోని గణనీయములగు సుక్షేత్రములలో నొక్కటియై వెలయుచున్నది. దీనియందు, ముఖద్వారము మొదలు ప్రవాహసహాయమున ననేక వందల మైళ్ళవఱకు వర్తకపుటోడలు ప్రయాణముఁజేయట కవకాళమున్నది. ఇందుచేఁ బ్రజలకు జీవనోపాయము సులభముగ దొఱకుటయు, తన్మూలమున వారు విద్యాసంపన్నులై, నాగరికతాగ్రగణ్యు లగుటయు సంభవించు చున్నది. గంగానది తీరమందున్న పాటలీపుత్రమును రాజధానిగాఁ గలవారగుటచేతను, దాని ప్రాంతమందలి సారవంతమైన ప్రదేశముల స్వాధీనపఱచుకొనుట చేతను, మౌర్య చక్రవర్తులు మిగిలినవారికంటే ముందుగ మన దేశమున మొదటి సామ్రాజ్యమును స్థాపించఁగలిగిరి. స్థానేశ్వరము, ఇంద్రప్రస్థము, కన్యాకుబ్జము, ప్రయాగ, వారణాసి, పాటలీపుత్రము, కాళీఘట్టము మొదలగు ప్రఖ్యాత నగరములన్నియు గంగ యొక్క లేక దాని ప్రధాన యుపనదియగు యమున యొక్కయో తీరమందున్నవి. మన మతమునకును సారస్వతమునకును శాస్త్రములకును యిదియే జన్మస్థానము. ఈనదుల ప్రాధాన్యము చేతనే మన దేశపు చరిత్రయందు దక్షిణభాగముకన్న హిఁదూస్థాన మెక్కువ యాధిక్యతను బొందఁగలిగెను. తుదకు యిటీవల గూడ, ఆంగ్లేయులు దేశమునంతయు సులభముగ స్వాధీనపఱచుకొనుటకు గంగానది ప్రవహించు బంగాళా రాష్ట్రమును వారు మున్ముందుగ జయించుటయే కారణము. బ్రహ్మపుత్రానదిలో చాల భాగము మన దేశమున కావలగ హిమవత్పర్వతమున కుత్తరముగ నుండుటచేతను, సింధు నదీ ప్రాంతములోని ప్రదేశములు యెడారిమయములుగ నుండుటచేతను యివి ప్రవహించు భాగము గంగా, యమునా నదీ తీర దేశములంతటి ప్రాముఖ్యతను గాంచలేదు. ఇట్టిలోపములు గొన్ని కొన్ని నదులలో కనుపడినను మొత్తముమీఁద మనమైశ్వర్యమున కంతయు నదులే మూల కారణములని జెప్పవచ్చును.
6. ప్రాచీన కాలమునందుండి మన దేశము సుభిక్షమగు దేశములలో ముఖ్యమైనదిగా పరిగణించబడుచున్నది. నదులు, సారవంతమైన నేల, యుక్తమగు శీతోష్ణస్థితి, దట్టములైన ఆడవులు, సారముగల గనులు మొదలగు స్వభావ సిద్ధమైన సౌకర్యము లనేకము లుండుటవలన, సమస్త ధాన్యములు, పైరులు, లోహములు, కంప్యములు మన దేశమం దుత్పత్తి యగుచున్నవి. ఇప్పటికంటెగూడ యెక్కువగఁ బూర్వకాలమం దపరూప పదార్ధము లనేకములు దొఱకుచుండినవి. రత్నములు, సుగంధ ద్రవ్యములు, సుకుమారులు, ధనికు లుపపయోగింపఁ దగిన బట్టలు, మున్నగువాటిని విదేశీయులు మనదేశమందుండియే తీసుకొనిపోవుచుండిరి. మనదేశపు కర్మకారుల నైపుణ్యమద్వితీయమై, విలువగల సామగ్రులసేకము లుత్పత్తి జేయుటయందు దోడ్పడుచుండెను. విస్తారము సంపదగల దగుటచేత, మనదేశమును యితరులు స్వర్ణభూమిగ భావించుచుండిరి. ఈయైశ్వర్యము మనకుఁ గొన్ని విషయముల లాభమును మఱికొన్నిఁటి యందు నష్టమును గలుగఁజేసినది. విదేశీములతోటి వ్యాపార మిందుమూలమున నభివృద్ధిఁ గాంచెను విదేశస్థులను బాబిలోనియా వారు, పారసీకులు, అరబ్బీలు, రోమకులు, ఇతర ఐరోపీయన్లు మొదలగువారు మనదేశమునకు వర్తకులుగ వచ్చుటయు, మనమితర దేశములకు వెళ్ళుటయు, యిందుచే పరులతోటి సాంగత్యము మనకు లభించుటయు వారి నాగరికత మన నాగరికతతో కొంతవఱకు మిళితమై మనయాచారవ్య వహారములలో మార్పులు గలుగుటయు మొదలగు ఫలములనేకములు గలిగినవి. ఇదిగాక విశేష దేహపరిశ్రమ యవసరము లేకయే మనకుఁ గావలసిన పదార్ధము లన్నియు మనకు దొరకుచుండినందున మనవారున్న దానితోఁ దృప్తి చెందుటయు, కొంచెము సోమరులుగ నుండుటయుగూడ సంభవించెను. పాశ్చాత్యదేశములలో బ్రజలు విస్తారముగ కష్టపడినగాని వారికి వలయు నాహారపదార్ధములు దొరకుట లేదు. గనుక వీటిని సులభముగ సంపాదించుట కొన్ని యుపాయముల కనుఁగొనుటకై వారు ప్రకృతిశాస్త్రములయందు విస్తారముగ కృషి చేయవలసి యున్నారు. ఇందుచే పాశ్చాత్య దేశములవలె మనదేశమందు ప్రకృతిశాస్త్రజ్ఞానమభివృద్ధిఁ గాంచలేదు. ఇహలోకమందు సౌఖ్యము సులభముగ లభించుచుండుటచే మనవారు పరలోక జ్ఞాన సంపాద నార్థమై వేదాంతాది ఆధ్యాత్మిక శాస్త్రములలో విచారములు సల్పుచుండిరి. దీని వలన కలిగిన లాభనష్టములు చదువరులే యూహించు కొనెదరు గాక. దేశము సంపదతోఁ దులతూగుచుండినందున దీనిని స్వాధీనము చేసుకొనవలయు ననెడి దురాశ పరులయందు జనించి మన స్వాతంత్య్రమునకు భంగము కలిగెను. దేశచరిత్ర యొక్క నిజతత్వముఁ దెలుసుకొనవలయునన్న దేశస్వభావ నిర్ణయమవసరమని యీయంశముల వలన స్పష్టమగుచున్నది.
౼ మామిడిపూడి వేంకటరంగయ్య, ఎం.ఏ