Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 6/బాలభటుని అక్షరావధానము

వికీసోర్స్ నుండి

అక్షరావధానము

బాలభటు లొకరికొకరు దూరమునందుండి, పరస్పరము మాటలాడుకొనవలసివచ్చినప్పుడు, కొన్ని గుర్తులవలన తమభావముల నెఱుకఁ జేసికొనగలరు. అట్టి గుర్తులు పొగతోఁగాని, జెండాలతోఁ గాని యీలలతోఁగాని, లాంతరులతోఁ గాని జేయవచ్చును, ఆగుర్తులు జేసికొను విధముమీక్రింద కనుబరుపఁబడినది.

ఒక చోటనుండి మఱియొక చోటికి మాటలు చెప్పునప్పు డావశ్యకమైన గుర్తులు

కు — కుడిప్రక్కకు జరుగుము
ఎ - ఎడమ ప్రక్కకు జరుగుము
పై ౼ పైకి జరుగుము—:కి — క్రిందికి జరుగుము
నీ — ఉపయోగించుము
తె — తెలుపు జండా ఉపయోగించుము
దీ — దీపము చూపుము
ఎవ - నీవు ఎవరు
ఉ — ఉండు
ఏ — నీవు సిద్ధముగా నున్నావా
ఊ — కానిమ్ము, చెప్పుము, కొట్టుము
జలేప — జవాబు లేనివి పంపు
జలే — జవాబు లేనివి
శీ — శీఘ్రముగా
నె — నెమ్మదిగా
లే — ఇంకేమియు లేవు
రా — వచ్చి వేయుము, రమ్ము
ర — అంతా రద్దుపరచుము

జండావధానము చేయునప్పుడు గమనింప వలసిన విషయములు.

జండాలతోగాని ఈలలతోగాని సంజ్ఞలు చేయునప్పుడు “వత్తు”లు మొదలగునవి లేనట్లు పైన వ్రాసిన సంజ్ఞలలో కనుపించును. కాని యీ “వత్తు” లకు వేరు వేరు సంజ్ఞల నేర్పరచినయెడల, నియవధానము కష్ట మగును. కావున కొన్ని కష్టమగు నక్షరములను రెండింటి క్రింద విభజించుకొనిన సులభముగా నుండును.

ఉదాహరణము:— “మై" అని చెప్పవలసినచోట “మయి" అని చెప్పిన వీలుగానుండును. ఆలాగున నే "కై" అని చెప్పవలసిన చోట "కయి" అని చెప్పవలయును.

ఒక అక్షరమునకు “వత్తు" కొట్టవలసినపుడు ముందుగా అక్షరమును కొట్టి,తరువాత “వత్తు” వచ్చుచున్నదని తెలియుటకు "రెండు బొట్లను” కొట్టవలెను. అటుతరువాత నే “వత్తును" దెలియజేయు ఆక్షరమును కొట్టవలెను.

ఉదాహరణము: —“శ్చా" అని చెప్పవలసినపుడు ముందు “శ" యును “దీర్ఘ"మును కొట్టవలెను; తరువాత “వత్తు” వచ్చుచున్నదని తెలియుటకు "రెండు బొట్లు" కొట్టి "చ" కారము కొట్టవలెను. అప్పుడు “శ్చా" అని చెప్పిన వారమగుదుము.