గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 6/నెల్లూరు మండల ప్రథమ గ్రంథాలయ ప్రతినిధుల సభ
నెల్లూరు మండల ప్రధమ గ్రంథాలయ ప్రతినిధుల సభ
ఆహ్వాన సంఘాధ్యక్షుని యుపన్యాసము
వనంబుల కెల్ల నందనవనమువోలె, వృక్షు రాంజులులలో కల్పతరువుమాడ్కి, సర్వవస్తుమయమై, వివిధజ్ఞానంబుల కునికిపట్టయి, దైవదేశభక్తాగ్రేసరులకు నిలయమై, ప్రఖ్యాతిఁగాంచిన మతంబులకు ముఖ్యస్థానమై, భూతదయ, త్యాగము, ఆత్మగౌరవాది కుసుమంబులకు తరువై, ఈ భారతదేశము భూమండలములో నాయకమణియై తనగారుచున్నది. అందాంధ్రరాష్ట్రము తక్కు౦గాని ధీశక్తులచే నొప్పుచున్నది. పంచమవేదంబను పేరుచే నొప్పు భారతమునకు గ్రంథకర్తయగు తిక్కనయు, పంచమవేదములోని శిధిల భాగములు నాంధ్రీకరించి ప్రబంధకారులలో ప్రఖ్యాతివడసిన ఎఱ్ఱాప్రగడయు, సర్వజ్ఞుడగు నాచనసోముఁడు, అభినవదండియను బేరుగాంచిన కేతనము, రామాయణ గ్రంథకర్తయగు గోపినాధకవిపుంగవులును, తరిగొండ వెంగమాంబ మొల్లలాదికవయిత్రులును; ఖడ్గతిక్కనాది మహాశూరు లును, ఈ యాంధ్ర దేశములో చేరిన నెల్లూరు మండలవాసులు. ఇట్లొప్పు నెల్లూరుమండలమున పెన్నా, బొగ్గేరు, బీరాపేరు సంగమంబులచేత సార్థక నామధేయమును గలిగినట్టియు, రాజులపేరు రూపుమాపిన పరశురాముని ఆరాధనాస్థలమగు నీ సంగనుము కవివరేణ్యులకును, స్వాతంత్య్రప్రియులగు రాజులకును సహితము వెనుదీయలేదు. స్థలపురాణముమాత్రము ఖలులచే మ్రుచ్చీలింపఁబడినది. అయినను పాండురంగమహాత్మమును రచించిన తెనాలి రామలింగకవి నిరూరులోని కరణము వేంకటాద్రిగారి కంకితమిచ్చినట్లు వ్రాయఁబడిన వాక్యములవలనను, పరశురామప్రతిష్టాపనయైన ఈశ్వరాలయమునకు దేవాదాయ విషయసూచికను దెలుపు శిలాశాసనములును పైవానికి తార్కాణములై యొప్పుచున్నవి. నద నగంబులచేతను, మిట్ట పల్లంబులచేతను, ఫలపూరితంబులగు తోటలచేతను నొప్పి యింపునుగొలుపు యీగ్రామమునకు మిమ్ముల సన్మాన సంఘము పక్షమున నే నాహ్వానముసేయుట నా జన్మసాఫల్యమునకు మార్గమేగాని వేరుగాదు. ఈ మహాభారమైన కార్యము సర్వసమర్థుఁడును, ఉత్సాహపరుఁడును, సన్మావసంఘముచే నేకగ్రీవముగ నెన్నుకొనఁబడిన శ్రీయుత తూములూరు శివరామయ్యగారు నిర్వహింపవలసి యుండెను. గాని వారికిఁగలిగిన యాపత్తుచే విరమించుకొనవలసివచ్చినే నాకాగ్యమునకుఁ గడంగి యసమర్థతను జూపవలసి వచ్చినది.
దేశమునందు,యొకవైపున సకాలవర్షములు లేనందునను కఱవుబాధలచే జనులు మలమలమాడుట చేతను, మఱొక వైపున మహాసంగ్రామమువలనఁ గలుగు మహావిపత్తులచే నశాంతి ప్రబలుచున్నను, ప్రాణ, ధనరక్షణము దుర్భరముగ నున్నను, మేముచేసిన యాహ్వానమును మీరుగౌరవించుట మీ దేశాభిమానమును వెల్లడి సేయుచున్నది. మేము మీ కొనర్చిన యల్పవసతులవలన మీకసౌఖ్యము గలుగవచ్చును. కాని మమ్ముల వాత్సల్యతతో క్షమించి సభను జయప్రదముగ జరిపి గ్రంథాలయోద్యమము నీ మండలమున వ్యాపనముజేయు మార్గముల నారయుదురని వేఁడుచున్నాఁడను.
యుద్ధము
న్యాయస్థాపనార్థము, స్వల్ప దేశ స్వాతంత్య్ర రుణార్థమును రణరంగమున బ్రవేశించిన మన ప్రభుత్వము వారికి జయమును, ఏతత్ ధర్మపరిపాలనమందు నిష్కామ దీక్షయు, సర్వేశ్వరుండు ప్రసాదించుఁగాత. సర్వేశ్వరుని మాయయగు నీయుద్ధము, కురుక్షేత్రయుద్ధరంగము ఆర్జునునికి నిజజ్ఞానము నార్జించుటకు తగుసమయమగు నట్లు మనకు స్వాతంత్య్రమున నభిలాషయును, విద్యయం దెక్కువ ఆసక్తియుఁ గల్పించినది. పూర్వపు ఆచార్యులు, గురువులు నశించినను, వారు గ్రంథరూపమున సజీవులై యున్నారు. ఈజీవుల కాలయములు నిర్మించి యూరాధన సేయవలయు.
సీ॥ అక్షరాన్యునకు నిరక్షరాస్యునకును
విద్య సుబోధమై వెలయవలయు
ధనమున్న లేకున్నఁ దగిన గ్రంథముఁ జూడ
నభిలాషగలయప్పు డమరవలయు
పదుగురొక్కెడఁజేరి భాషించుతఱివాణి
భువన మోహినియౌచుఁ బొరలవలయు
వీనులచేనైన వీక్షణంబులనైన
మంచి పెద్దల తుష్టిమనుపవలయు
దేశమెల్లెడ విజ్ఞానదీపవితతి
వలయునదియెల్లఁ గనుపింపవలయునెపుడు
భుక్తియును ముక్తియును మహారక్తివెలుగ
గ్రంథ భాండారములు భువిఁగ్రాలవలయు॥
సుజ్ఞానము
జిజ్ఞాస, అసంతృప్తి, అశాంతి, వృద్ధికి మూలబీజములు. ఈ జిజ్ఞాసచేత నే ఉపనిషత్, శ్రుతి, స్మృత్యాచులు వెలువడెను. ఈ యసంతృప్తిచేత నే బౌద్ధుఁడు, శ౦కరాచార్యులు లోనగువారు నూతనమతోద్ధారకులగుటకు కారణభూతులైరి, అశాంతిచేత పాశ్చాత్యదేశములందు సహితము, శాంతిని, స్వాతంత్య్రమును, సర్వవస్తు మంగళమయముల నార్జి ంపసాగిరి మానవుల సకల ప్రయత్నములు పైవారిని జయించుటకొఱకై యున్నవి. ఆదినుండియుఁ జేసిన ప్రబలప్రయత్నము సంతతులవారికి జ్ఞానరూపముగ పరిణమించుచున్నవి. ఈ జ్ఞానమును బోషించుటకు నేఁటివఱకు మూఁడు సదుపాయముల నారసియున్నారు.
౧. వాగ్రూపము.
మనుజుల మనంబులు వికాసము చెందినప్పుడు, భావములను సంజ్ఞలచే వ్యక్తీ కరించవలసి వచ్చెను. ఈ సంజ్ఞలే భాషయై వాఙ్మయమును వృద్ధిచేసెను. ఈవాఙ్మయముద్వారా సంతతివారినుండి సంతతివారికి వేదములు మొదలైన గ్రంథములు నిలువఁబెట్టఁబడినవి. వేదవ్యాసులు లోనగు మహర్షులు, జ్ఞానమును రక్షించుటకై సలిపిన మహాప్రయత్నములలో
౨. లిపి రూపము
లగు సంకేతములచే దివ్యజ్ఞానమును జెట్ల పట్టలవిూఁదను, శిలలపైనను, లోహములపైనను, శాసనరూప ములుగను, మంటిపైనను, తాళపత్రముల పైనను, సంక్షిప్తముజేసిరి. ప్రజాభివృద్ధియగు కొలఁదియు నూతన దేశముల నాక్రమించుట యనివార్యములయ్యెను. ఆర్జించుచున్న జ్ఞానమును వ్యాపనజేయుట కష్టసాధ్యమయ్యెడు స్థితియందు మహాపురుషులు
౪. ముద్రితరూపము
న జ్ఞానమును వ్యాపింపఁ బ్రయత్నించిరి. ప్రథమమున చీనాదేశస్థులు సదుపాయంబును వెనుక, పాశ్చాత్యులు బుద్ధికుశలతచే వృద్ధిపొందించి వేనవేలుగ వివిధభాషల యందు పొత్తము లచ్చొత్తించి స్వల్పశ్రయమునకు సులభముగ జ్ఞానవ్యాప్తిని జేయుచున్నారు. ఈజ్ఞానము వ్యాప్తిఁ జెందుటకు విద్యయే ముఖ్యసాధనము. విద్యగ్రామములయందభివృద్ధియై గ్రామముల స్థితిగతులను జక్కపరచినగాని దేశమభివృద్ధి కానేరదు హైందవదేశమందు పట్టణములకన్న పల్లెలు మెండుగా నున్నవి. ఉన్నత విద్యాలయములు పట్టణములయందుదప్ప పల్లెలయందుఁగానగావు. ప్రాధమిక పాఠశాలలు సహితము లేనిగ్రామములఁజూచుచున్నారము. నాగరికతఁ జెందిన దేశములందంతటను.
నిర్బంధోచిత ప్రారంభవిద్య
ను ప్రభుత్వమువారు నెలకొల్పి, దేశమును, దేశములలోని కళలను వికసింపఁజేయుచున్నారు. కాని నాగరక తఁ జెందిన ఆంగ్లేయ ప్రభుత్వము క్రింద రమారమి ౧౫౦ వత్సరములుగ నడుగులమడుగులొత్తుచుఁ జరించుచుండిన ఈ భరతఖండమునకు మాత్రము ఈవిద్యావిధానమును బ్రసాదించకున్నారు. ఇటీవల ప్రాధమిక పాఠశాలల నెక్కువగ స్థాపించినను, అయ్యవి చూపదగినంత యభివృద్ధిఁ జూపుచుండుట లేదు.
ఉన్నతపాఠశాలయందు సహితము నేర్పువిద్య దుర్బలులు గఁజేసి, ముఖ్యముగఁ అస్వతంత్రులగు గుమాస్తా లుగనుండుట కుపయోగించుచున్నది గాని జాతీయవికాసము బెంపొందించుటకు సహకారిగాక యున్నది. విద్య జాతీయవికాసముఁ గలుగఁ జేయవలయునన్న దేశభాషలలో విద్యగఱపఁబడవలయు. దేశభాషలలో కళలను శాస్త్రములను బోధసేయవలెను. దేశభాషలలో గ్రంథాలయముల నెలకొల్పవలయును. గ్రంథాలయ ములును, విద్యాలయములును పరస్పరసమాశ్రయములు. విద్య నే యభివృద్ధి జెందినఁ గాని గ్రంథాల యములు వృద్ధి జెందనేరవు. గ్రంథాలయములలభివృద్ధిఁ జెందినగాని విద్యాలయములు యభివృద్ధిఁగా నేరవు. ఈమండలమందు గ్రంథాలయములుగలవియు, గ్రంథాలయములు స్థాపింపనున్న సం ఘములు 39 గానవచ్చుచున్నవి. మండలములలోని గ్రంథాలయములలో నెల్లూరులోని తిక్కన భాండాగారము సుప్రసిద్ధము పోట్ల పూడి మందలివి వేకానంద ధర్మపుస్తక భాండాగారమును, గండవరములోని రామమోహన గ్రంథాలయమును బేర్కొనఁ దగియున్నవి. గ్రంథాలయోద్యమముపట్ల ఈమండలమున శ్రద్ధతో పనిచేయుచున్న వారలలో శ్రీయుత పొణకా పట్టాభిరామారెడ్డి గారు - నెల్లూరు వేంకట్రామానాయఁడు, పెల్లేటి ఆదినారాయణరెడ్డి, సర్వాభొట్ల గోపాలకృష్ణయ్య, తూమాటి మల్లారెడ్డి, మన్నేపల్లి రామకృష్ణ రావు గారులు ప్రశంశాహులు.
పూర్వులు: పామరజనులందు భక్తిలిబురిఁకొల్పుటకై సతీసమేతులైని శివకేశవాలయములు నిర్మించి నిత్యనైవేద్య దీపరాధనలకై మడిమాన్యములు దేవాదాయాదులు సమర్పించి శాశ్వతధర్మముల నెలకొల్పిరి. అట్టి పుణ్యమూర్తుల సంతతివారమగు మనము కొఱఁతబడినవిద్యాదేవతయగు శారదాంబకు భవనముల నిర్మించి ఆర్చకునకు ఆలయ సంరక్షణములకు కానుకలను, మాన్యములనర్పించ వలయును. ఈనిలయములే గ్రంథాలయములు. అర్చకుఁడే గ్రంథాలయాధిపతి.
ఈగ్రంథాలయములు గ్రామమున మధ్యగట్టఁబడి, దేశీయపరిశ్రమలకు దగిన స్థానములై యుండవలయును. పూర్వమువలె యువకులు పాఠశాలలనుండి బయలు వెడలునపుడు సింగ పుఁగొదమలవలెగాక, నిరుత్సాహులై, ధైర్యస్థైర్యములుడిగి జీవయాత్రక సమర్ధులై యుండుటఁ జూచుచున్నారము. ఈదురవస్థ సుపశమింపఁజేయట యొకధర్మమైయున్నది. అందలి యధికారి సర్వసమర్ధుఁడై గ్రామములోని వ్యాయామములఁ జక్కగవరసి యందులకు వలయుపొత్తములను కరపత్రములను తెప్పించి పంచి పెట్టవలయును. విరామములేక కృషికలుపు వ్యవసాయకులను, సోమరితనముచేతను,చెడ్డవృత్తులచేతను గాలముఁగడుపు బుద్ధిహీనులను సహితము నాకర్షించి జ్ఞానోపదేశముజేయుట కనేకమార్గములు గలవు. అందు
౧ వార్తాపత్రికలు వివిధరకముల గ్రంధములు ధ్మపయోగమునకై యుంచవలయునను వారలకు శ్రద్ధ గలుగుటకు వార్తాపత్రికలనుండి విషయములజగువుచు, వారికి యుత్సాహముపుట్టునట్లు కలసిమెలసి ముచ్చటించుటయు, పూర్వ గ్రంధములనుండి రాగయుక్తముగఁబాడి వారికిబోధించవలయును. మఱియు, నవీన పాశ్చాత్య నాగరికతావ్యామోహకులై లోక వ్యవహారములయందు కేవలము ధనకాంక్షచే వ్యాపార సంబంధముగ వతి౯ంపక, పారమార్ధికములచే సంచరించి జ్ఞానమునుబడని నిజమైన భారతీయుల మనిపించుకొనవలయును.
౨. ఉపన్యాసములు:— పెద్దల నప్పుడప్పుడు రావింగ్రామస్థుల కుపన్యాసము లిప్పించుచుండవలయును
3. వివిధవస్తుప్రదర్శనము: వివిధవస్తువులను సేకూర్చి వాని ప్రాముఖ్యతను వెలిఁబుచ్చవలయును. వాని సంయోగమువలని లాభములును, మార్పులును గ్రామమున కుపయోగించవలయును.
౪. మాజిక్ లాంతరులు ౫. భోజనకాలక్షేపములు, ౬. పురాణశ్రవణము, ౭. హరికథలు: —— వీనియందు యుక్తియుక్తముగ జనోపయోగములగు విషయములఁ గుఱించియు బోధిఁజేయుట కెక్కువ యవకాశములు గలుగుచున్నవి. మణియు, దేశభాషలను బెంపొందింపఁ జేయుటయు, కర్తవ్యమైయున్నది. భావములుగల పండితుఁడైనను, భాషాజ్ఞానములేనిది రంజిల్లనేరఁడు. కాన మన యాంధ్రభాష సంస్కృతముతో మైత్రికలిగినందున బ్రఖ్యాతిఁగాంచి ప్రజలను ర౦జింపఁ జేయుచున్నది. క్రిందట నే ఆంధ్రభాష “దేశ భాషలందుఁ దెనుఁగు లెస్స” అని కవిపుంగవులచేఁ గొనియాడఁబడియున్నది. ఇట్టి యాంధ్రభాష ఉన్నతదశయందుండియు, భాషనుయభివృద్ధిఁ గాంచుటకుఁ బెట్టఁబడిన పరిషత్తులలోఁ బ్రఖ్యాతిఁగాంచియు, ఉద్గ్రంథరచనయందు నుత్సాహముతోఁ దోడ్పడుటయుఁ గవివర్యులను, పండితవర్గమును బూజించుటకుమాఱుఁగ “చెట్టుచెడి కుక్క మూతి పిందెలు పుట్టె" ననురీతి గ్రామ్యభాష దేశమునకు యోగ్యమని వాదులాఁడువారు మాతృభాషాపోషితులు గారని వేఱుగఁ జెప్పనక్కర లేదు.
శారదానిలయములు, వివిధజాతులవారి వ్యక్తులను, ధర్మములను, కర్తవ్యములను, వివిధ చట్టములను దేట తెల్లముఁజేయుచున్నవి. కాన యవిమన సముదాయపు వ్యవహారముల యందెక్కువ యుపయోగకారులై పరిణమింప గలవు· గ్రంథాలయములు స్థాపించినకొలఁది, శారదాంబ కటాక్షముచే నజ్ఞానముఁబాసి చేకూర్చి, గ్రామములో నియంతః కలహములు నిర్జింపఁబడఁగలవు. గ్రామస్థులు వివేకులై, కలహములచే న్యాయస్థానముల కెక్కి ధనవ్యయముసేయక గ్రామములో వివిధవిషయములను బంచాయితీమూలముగఁ బరిపాలించుకొనుచు సంపూర్ణ స్వాతంత్ర్యముఁగ స్వల్పసంస్థానములవలె వృద్ధిఁజెందఁగలవు. దేశసేవకు మార్గదర్శకము కాగలవు. కాన
గ్రంథాలయ వ్యాపనము
కై సర్వప్రయత్నములు సలుపవలయును. సంచార గ్రంథాలయములచే మండలములోని ముఖ్యపట్టణముల కును, తాలూకా ఫిర్కా పట్టణములకును పరస్పరసంబంధముఁ గలుగఁజేసి, అమెరికా, బరోడా సంస్థానములలో జరుపురీతి గ్రంథాలయోద్యమమును జరుపుట యుత్తమము కాని స్వదేశసంస్థానములవలె మనకవకాశములు లేకుండుటయేగాక, రాజాదరణ సహితము తగినంత లేక యున్నది. కాన
స్వయం సహాయము
చే మన మీ యుద్యమమును నిర్వర్తించవలసియున్నది.
౧. గ్రామసముదాయమునకు సంబంధించిన బీళ్ళు,కంచలు, దొడ్లు లోనగువానినుండి వచ్చు వరుంబడి, మనలో నిరంకుశాధికారముగల యొకరిద్దఱిచేవసూలు చేయఒడి, నీతిబోధకు మాకు దుర్వృత్తుల కవకాశముఁగలిగించునట్టి యుద్యోగస్థులకు నియ్యవలసిన మామూళ్ళకును,లంచములకును, మిగత పైకమును లెక్క ఁజూపకయే స్వార్ధముకొఱకు వినియోగపరచుటయ తటస్థించుచున్నది. ఈ మొత్తము గ్రంథాలయముల కార్యనిర్వాహక సంఘమున కర్పించిన, వారు వలయువారికి ఖర్చుపెట్టి మిగత మొత్తమును గ్రంథాలయ నిర్వహణమునకు వినియోగపరచుట లాభకరముగ నుండును.
౨. సదుద్దేశ్యములతో దేవాలయములను స్థాపించి,భక్తులచే జీవనముల నేర్పాటుజేసినను, దుర్వ్యయములకును, ఉత్సవాదులయందు యనావశ్యకములగు వ్యయములఁబెట్టుట మామూలై యున్నది. దేవాలయములందు, మఠములు, సంస్కృత, వేదపాఠశాలలఁ బోషించుట మానివైచిరి. ఇందువల్ల ర్యాదగిన ధనమును యీయుద్యమమున కుపయోగించుట భావ్యము.
౩. నురుపిళ్ళయందును,వివాహాది కార్యములయం లాభములలోకొంత భాగమును, గ్రామములోని కొలగారమువల్ల వచ్చువరంబడియు, లోనగు యాదాయములచే గ్రంథాలయోద్యమము వ్యాపనము కాగలదు.
ముగింపు.
ఆంధ్రోద్యమప్రారంభమాదిన యాంధ్రదేశమున నూతనశక్తి వ్యాపించినది. కామ్యార్థములకు శక్తిసాధనము లాపశ్యకములు ఘనకార్యములు త్యాగయుతములై యున్నవి. కీర్తి ఘనకార్యమువల్లఁ బడయవచ్చు. గతించినిను సజీవులుగాఁ జేయునది కీర్తియై యున్నది. కీర్తిశేషులుగాఁ జేయునది శారదాలయములై యున్నవి. ప్రస్తుతమున కార్యశూరత్వమునకు శక్తిజాలక వాక్ ప్రౌఢిమతో జరిపింపఁబడు సభలవలెఁగాకఁ గార్య శూరులై గ్రంథాలయములు వెలుఁగు చున్నవి. ఆంధ్ర పత్రికాధిపతియగు శ్రీ కాశీనాధుని నాగేశ్వరరావుగారి నుడువు లీతరుణమున స్మరణకువచ్చుచున్నవి. "గ్రంథాలయ ప్రతినిధులు కార్యశూరులు గాని వాళ్ళూరులు గారు. స్వయంసహాయావలంబులుగాని నివేదనావలంబులుగారు. త్యాగపరులుగాని స్వార్థపరులుగారు; సేవానిరతులుగాని లాభార్థులుగారు. మాతృభాషాభిమానులుగాని మాతృభాసానిర పేక్షకులుగారు”
జన్మసాఫల్యముఁ గాంచుటకు భగవత్ప్రతినిధులగు మానవులసేవ యావశ్యకము. నిర్గుణబ్రహ్మోపాసనకు సగుణబ్రహ్మోపాసన యావశ్యకము. ఇదియే ప్రపంచముయొక్క పరమావధి శాన యాత్మావలబ్ధికిని, మదీయ సోదర యాత్మావలబ్ధికిని ప్రధానసోపానమైన గ్రంథాలయోద్యమము నుత్సాహముతోను శ్రద్ధాభక్తులచే నుత్తేజముఁ గలిగింపవలయును. సర్వేశ్వరుఁడీసభకు సర్వైశ్వర్యములు ప్రాసాదించుగాఁత, ఓం శాంతిః
అధ్యక్షులగు శ్రీవావిలకొలను వేంకటసుబ్బారావుగారి - యుపన్యాసము
సత్యభాషణము దోషావహముకాదు. ఆంధ్రలోకపురోవృద్ధి సూచకముగ దేశమున స్థాపింపఁబడుచుండు గ్రంథాలయములను గుఱించి నేనేమియునింతవఱకుఁ బరిలించినవాడను గాను నాయందీలోపముగా గలదని సన్నీ సభకాహ్వానింపవచ్చిన వారికి విన్న వించుకొంటిని. ఆగ్రాసన మలంకరించినఁ జాలుననియు మీకుఁదోఁచినది చెప్పుఁడనియు వారు చెప్పుటచే దాక్షిణ్యవశమున నీయకొంటిని. మీరందఱు నీవిషయమున వ్యవహరించుసనుభవజ్ఞానముగలవారలు. ఇట్టిమీకు నేనేమి నూతనముగఁజెప్పఁగలను? కావున నాయుపన్యాసమునఁ గ్రోత్త విషయములు లేవేని క్షమింతురుగాక.
గ్రంథాలయమునకుఁ బ్రాచీన నామము
మనదేశమున గ్రంథాలయ స్థాపనమునకుఁ బాశ్చాత్య సాంగత్యము కారణమనియుఁ దత్పూర్వ మీదేశమున నిట్టిపిలేవుగను నే దానికి నాంగ్లభాషయందు లైబ్రరీ వలె సంస్కృతిభాషయందు సేక పదము లేదనియు గొందఱు నాతోఁ జెప్పిరి. ఈయభిప్రాయ మవిమర్శమూలకమని తోఁచుచున్నది.
లైబ్రరి (Library) అను పదము లాటి౯ భాష యందలి లైబర్ (Liber) అను పదమువలనఁ గలిగినది. లైబర్ అనఁగా పుస్తకము. ఈ లైబర్ అను పదమునుండి (Librarium a book case) లైబ్రేరియమ్ అనుపదముపుట్టెను. దీనికి పుస్తకములుంచెడి పెట్టెయనియర్థము. అట్టులే లైబ్రేరియ యనఁగాఁబుస్తకము లమ్మెడియంగడి. (Library) లైబ్రెరీ యనుదానికి “ A collection of books belonging to a private person or to a public institution; an apartment or suite of apartments or whole building appropriated to the keeping of a collection of books") అను నగ్ధములాంగ్లనిఘంటువులందుఁ గానవచ్చుచున్నవి.
లైబ్రరియను దానికి సరియైన పర్యాయపదము సంస్కృతమునఁ గోళము, కోశశబ్దముతోలుతఁ బుస్తకమున కన్వయించు చుండెను. “శాంతరేత్వయం పాఠ” యనియు “వైదేశికేషుకోశేషుపాఠభేదాన్ని రీక్ష్యతా౯” అనియు వ్యాఖ్యానంబులఁ గానవచ్చెడి. ఆవల నీకోళళబ్ద మే పుస్తకసమూహమందు వతి౯౦పసాగెను. “గృహేదే.హేపుస్తకాఘే పేశ్యామసిపిధానకే" అని నానార్ధ రత్నమాలయందున్నది. కోశశబ్దము పదార్ధములుందఁబడు స్థలమునందును వన్వయించును గావునఁ గోళమనఁ గాఁఱుస్తక సమూహము౦చబడు స్థలమునందు నవ్వయంపవచ్చును. కావున లైబ్రరీ యనుదానికిఁ గోళమనునది పర్యాయపదముగ గ్రహింపవచ్చును. “కోవానాచార్య” యను ప్రమాణమునుబట్టి లైబ్రేరియన్ అనుదానికిఁగోళ వంతుఁడనునది పర్యాయముగఁగొనవచ్చును. నూతన శబ్ద సృష్టితోఁ బనిలేదనియు నిట్టియుగారములు మనదేశమున ననాదిగనున్నవనియు వానికిఁబేరునుగలదనియుఁ దెలుపుటే యిందు నాముఖ్యోద్దేశము. అట్టిశబ్దము నునికితెలియక గ్రంథాలయశబ్దము సృష్టింపఁబడెనని నేను జెప్పనుగాని యిప్పటివారికి సుబోధముగ నుండుటకై కల్పింపఁబడినదనుట సమంజసమని తలఁచెదను.
కోశోత్పత్తినిదానము
ఇంకాఁగోళములు పుట్టఁగారణము విచారి౦తము. కోళము పుస్తకసమూహము. పుస్తకము వాక్య సమూహము. వాక్యము పదసమూహము. పదమక్షరసమూహము. ఇదివిలోమక్రమము. ఇది విలోమక్రమము. ఇంకాననులోమముగఁ జూచినఁ దొలుత నక్షరము పుట్టెను. ఆవలఁబదము. ఆపిమ్మట వాక్యము. తదనంతరము పుస్తకము.
పాశ్చాత్యులక్షరములు కొండగుర్తులవంటి సంకేతములు (Conventional signs) అనుచున్నారు. వారివర్ణముల విషయమున నది సత్యమేకాని మనయఅక్షరముల విషయమైయట్లు చెప్పువాఁడు తెలిసినవాఁడు కాఁడన వచ్చును.
ఆర్యులమతిమున నక్షరమతురమే శబ్దము బ్రహ్మమని మనవారు సాధించిరి. "ఓమిత్యేకాక్షరం బ్రహ్మ” యనికలదుకదా. ప్రణవము పరబ్రహ్మవాచకము. “తస్య వాచకః ప్రణవ” యని పతంజలియోగశాస్త్రమున వచించెను. వాక్యవాచకముల భేదమని మనవారునిర్దేశించిరి. ఊర్ధ్వముఖముగ వచ్చు ధ్వనులకన్నిటికిఁ గంఠము మొదటిజన్మస్థానము, అందుఁబుట్టుధ్వనులలో వచ్చులు తొలుతఁబుట్టినవి. "ఆకుహవిసర్జనీ యానాంకంఠ" యన్నట్టులు కంఠమునఁ దొలుతఁబుట్టిన యచ్చు ఆకారము. శిశువులు అమ్మ అత్తలోనగు నకారాదిపదములు తొలుతఁ నుచ్చరింపసాద్యపడుటచేతనే ఆకారము ప్రధమాక్షరమని మనము గ్రహింపవచ్చును. ఆకారము నారాయణ ప్రధమాభిధాన మనుటకిదే కారణమైయుండవచ్చును. ఆది దేవున కాద్యక్షరమన్వయించుట సముచితము కదా.
ఆయాయక్షరము నుచ్చరించినపుడు నోటినరములు మొదలగువానియందు నెట్టియాకారములు గానవచ్చునో యట్టియాకారమే యాయాయక్షరమున కియ్యబడినదని యక్షరవిధానశోధకులు వచింతురు. రూపము సంకల్పించినపుడు మెదడునందెట్టులో యక్షుని ముచ్చరించినపుడు నోరనట్టులే మార్పుకలుగును. ఒక్కొక్క యక్షరము పలుమాఱు జపించిన నొక్కొక్క ఫలము గలుగునని మంత్రయోగశాస్త్రములు చెప్పుచున్నవి. అక్షరములన్నియు బీజాక్షరములే. అక్షరజపము వలన ఫలము గలుగుట సత్యము, దీనికిఁ గారణమార యుదము. ఒక్క యక్షరముపలుమాఱు జపించినయెడల వరములందు నొక్క విధమయిన చలనము (Vibration) విడువక కలుగుచున్నది. ఈదలనమేకతాళమువలె నేకవిధగమనము కలదైయుండవలయును. నడుమనడుమ భిన్నించినఁ గీడుకలదు. దీర్ఘ సమగ మనమువలన నొకశక్తి యావిర్భవించును. ఆశక్తికొలఁది ఫలము గలుగును. మంత్రములు ఫలప్రదములగుట కిదేయొక కారణమై యుండవచ్చును.
ఆకారస్వరూపము మీరంద అఱుఁగుదురు. ఆయక్షరమునుచ్చరించునపుడు పెదవి పెదవి కలియకనోరు తెఱచి కొనియుండునుగదా. అకారమందు మొదటివలయము పై పెదవి యనియు దానికెదురుగనుండు దంపు క్రింది పెదవియనియు రెంటికి నడుమనుండు నెడము రెండు పెదవులనడిమియంతరాళమనియు భావించితి రేని ధ్వనిని సూచించు నడిమిలోగీఁత పెదవులు దాఁటిపోకుండుటయు నెఱుఁగఁగలరు. ఇప్పుడు మన మకారము నడ్డముగ వ్రాయుచున్నారము. అటు గాక నిలువుగా వ్రాసితిరేని నేను జెప్పినది సుబోధమగును.
ఇఁక ఉకారము విధము చూతము. ఉకారముచ్చరించునప్పుడు పెదవు లేయాకృతిని బొందునో కనిపెట్టి యాయాకృతికి ఉకారము సరిపోవునోపోవదో చూడుఁడు. ఇందును రెండు పెదవులు, నడుమ కంఠమునండివచ్చు ధ్వనిని దెలుపు గీఁతయఃఁగలవు గాని య కారమందువలెఁ గాక గీత వెలుపలికి బోవనుంకించుచుండును. ఈ గీతయందిట్టి యత్నము కలదని దీర్ఘమైన ఊ కారమునందు స్పష్టపడు చున్నది. ఉ - కారము ఓష్ఠ్యము కదా.
ఇంక ఓ కారమును బరిశీలింతము, ఆ కారము ఉ కారము సంధికలియఁగానైనది ఓ కారమనిమీ రెఱుగుఁదురు. అకారము కంఠ్యమనియు, ఉ కారము ఓష్ఠ్యమనియు నీరెంటిసంధివలననైన ఓ కారము కంఠోష్ఠ్యమునియును మీరెఱుఁగుదురు, అక్షరస్వరూపమందును నీ సంధిగాన నయ్యెడి. ఉ కారము నడిమిగీఁతతొలగించి ఆకారము నందలి మొదటివలయము ఉ కారమునకు వైవైపుగఁజే ర్చ యా గీతలోఁ గలిపిన ఓ కారమగును. ఓ కారమునధ్వని యూర్థ్వగతముగావున ఓ కారము తలపై గీఁతగీయవలెను.
ఇ కారముచ్చరించునపుడెట్లు ధ్వనియధోముఖరుగునో యట్లే ఆదియు నధోముఖముగనే వ్రాయఁబడును. ఏ కారముచ్చరించు నపుడెట్లు ధ్వని యూర్థ్వపథగామియగు నో వర్ణమునట్లే వ్రాయఁబడును. ఉచ్చారణము ననుసరించి ఐ క్రిందఁజూచునట్లు వ్రాయుచున్నాము. పరిశోధించు వారికిట్టి చిత్రము లింకను దెలియ వచ్చును.
వీనినన్నిటిని చక్కఁగనాలోచించినచో మనయక్షరములు కొండగుర్తులని మీరందురా?
ఇంతియ కాదు. అన్ని యక్షరములు కంఠముమొదలు పెదవులకు లోపుబుట్టును, కంఠముమొదలు పెదవులకు నీవలఁగాని పుట్టినవి లేవుకదా. ఇంక నక్షరములనుజూచిన ఆ కారము మొదటిది, మ కారము కడపటిది. మ కారమోస్ట్యము. మ్ అవ్వగానే నోరుమూతపడును. తరువాత నక్షరమెట్లు పుట్టును. కంఠమునకుఁ బెదవులకు నడుమ ఉ కారధ్వని యెట్లు సంచరించుచు రెంటికి సంబంధము గలుపునో యట్లే అ కారమునకు మ కారమునకు నడుమ ఉ కారమువచ్చి ఆఉమ్ అయి ఓమ్ అగును. కంఠమునకుఁ బెదవులకు నడుమనే ధ్వనియిమిడియుండునట్లు సమస్తశబ్దప్రపంచము ఓమ్ అను నొంటియక్షరములో నిమిడియున్నది, వాచ్యుఁడైన యీశ్వరునందు సమస్తమెట్లిమిడియున్నదో యట్లే వాచకమైన ప్రణవమందును సమస్తమిమిడియున్నది. వాచ్యుఁడెట్లు ముక్తిప్రదుఁడో వాచకమట్టులే ముక్తిప్రదము. ఈవిషయమింత కెక్కువ వచించుట యప్రస్తుతమగును గావి ప్రణనము పరబ్రహ్మవాచకమై ప్రణవమందు సమస్తశబ్దప్రపంచమిమిడి యుండుటచే శబ్దప్రపంచమంతయు బ్రహ్మమయమే యగును. నూక్మమొకటి స్థూలమొకటి అంత మాత్రమేభేదము, శబ్దప్రపంచమంతయు బ్రహ్మమయ మైనచో నపశబ్దములని సుశబ్దములని భేదమెట్లు గలిగెననరాదు.
కం॥ హరిమయము విశ్వమంతయు
హరివిశ్వమయుఁడు సంశయముపనిలే దా
హరీమయము గానిద్రవ్యము
పరమాణువులేదు వంశ పావనివింటే॥
అని కలదుగదా! అటైనచోఁ గొన్ని యమేధ్యపదాగ్గములని యేలభుజింపక మానెదరు? దీనికేమికారణమో దానికిఁ గారణమదే.
అక్షరములు శబ్దములు దేవతాత్మకములనియు వానియందు మనుష్యుల రక్షింపఁగల మహాశక్తియొకటి గలదనియు నెఱింగియే యాశక్తిని సరస్వతీయని పూజసేయుదురు. బ్రహ్మశక్తిపూజ్యగాదా? ఆమె వాణివీణాపుస్తక పాణియనుట కిదేకారణము. ఈ కారణముచేతనే మూలానక్షత్రము మహానవమినాఁడు పుస్తకపూజఁగావింతురు. బ్రహ్మవాక్కునందు సరస్వతి నివసించుననుపురాణోక్తికిఁగారణమిపుడు విశదమయ్యెను గదా.
పుస్తకములందిట్టి శ్రద్ధాభక్తులుకలిగినకారణముచేతనే మన పెద్ద లపత్రగ్రంధములు వ్రాయక మోక్షదాయక మయినవానిని రచించి, కాలముజరుగు కొలంది సత్తగుణము క్షీణించుకొలఁది ధర్మములను బోధించు గ్రంథములు నావల నద్ధసాధకములైన గ్రంథములు, తరువాతఁ గ్రామ ప్రధానములైన గ్రంధములు వెలువడెను. ఇప్పుడే ప్రయోజనములేనివికొన్ని వెడలుచున్నవి. ”కావ్యాలా పాంశ్చవర్జయే"త్తని కావ్యరచనయే నిషేధింపఁబడినకాలమొకటి యుండెను. పై విధమున నానాగ్రంధములు లోకమున వ్యాపించెను.
కొందఱుమనలోఁ బూర్వకాలమున లిపిలేకుండుటచే లిఖిత గ్రంథములు లేకుండేవనియుఁ గావుననే వేదాదులు ముఖస్థములు చేయుచుండిరనియు నందురుగాని యిది వాస్తవముగఁదోఁపదు. వేదముల పౌరుషేయములై తోలుత శ్రవణగోచరమగుటచే శ్రుతులను పేరుగలవయేను. దానిని ముఖస్థములు చేయుటకు లిపియభావము కారణముగాదు వేదముస్వర ప్రధానము. శబ్దమొక్కటియే భిన్న స్వరములచే భిన్నార్థములు గలదగును. 'ఇంద్ర శత్రో' యనునది మీరందణెణో౦గినది.
వేదములు మాక్సుముల్లరుకు ముందు లిఖితముగాలేవనియు నాయనయే తొలుతవ్రాయించి ముద్రించెననియు నొకరనిరిగాని యదిసత్యేతరము మనలోలేఖనపద్ధతి చిరకాలముగనున్నది. భారతములిఖితరూపకముగ వెలువడి యెఁగదా.
భారతమునకుఁ బురాణములకు ముందుపుట్టిన శ్రీమద్రామాయణమునందు "రామనామాంకితం చేదంపశ్య దేవ్యంగుళీయకమ్" అని కలదు. దీనివలన హనుమంతునిచే శ్రీరాముమూర్తి పంపిన యుంగరముమీఁద శ్రీరామనామము చెక్కఁబడినట్టు స్పష్ట పడియెఁగదా. దానియందే మఱియొకచోట 'రామనామాంకితైణైై రావ్యవ్య దద్రణరుండలమ్' అనికలదు. బాణములఁ జేయువారు కరమలవారు, ఉంగరములుజేయువారు కమసాలవారు వీరు గూడ నక్షరలేఖజ్ఞానము కలవారై యుండినపుడు బ్రహ్మక్షత్రియవైశ్యులందు లిపిలేకుండెనని యెట్లు తలఁపవచ్చును?
శ్రీమద్రామాయణమునకుఁ బూర్వకాలము నాఁటివి గదావేదాంగములు. మొదటి వేదాంగమైనశిక్షయందీ శ్లోకముగలదు.
"గీతీశీఘ్రశిరఃకంపీ తథాలిఖితపాఠకః
అనర్ధజొజ్ఞల్పకంఠశ్చ్ షడేతేపాఠకాధమాః !
ఆకాలముననే వేదములిఖితముగాకుండినలిఖితపాటకు లెట్లు గలిగిరి ? పుస్తకముచూచి వేదముచదివిన స్వరముతప్పునుగావును లిఖితపాఠకుఁడు పాఠకాధముఁడయ్యెను. పైప్రమాణమువలన వేదములను ప్రప్రథమమున మొక్స్ మూలరు పండితుడు వ్రాయించెననుట పొరపాటుకదా? లేఖనములేనిచో వచన భాగములనెట్లు ముఖస్థముఁజేసిరి. ఈవిధముగఁజూచిన మన దేశీమున లిఖితగ్రంధము లానదిగా నున్నవి. కోళవానాచార్యయనునది నేఁటిమాట కాదుగదా.
ఆదిశంకర, రామానుజాచార్యులవారలు గ్రంథాఅన్వేషణముచేయుచు దేశాటనము గావించిరి. కాశ్మీర దేశ మందు రామానుజాచార్యులకు బోధాయనసూత్రములు లభించెను.
పాశ్చాత్యులకు ముందు మనదేశముపై దాడిపెట్టిన తురకలు మనదేశమందలికోశములనెన్నింటినో దగ్ధముఁ గావించిరి. ఈకారణముచే నుత్తరహిందూస్థానమందుఁ గోళములరుదయ్యెను.అసమయమున దురకలరాయిడి కడ్డుపడి వారిని దక్షిణమునకు రానీయక శ్రీకృష్ణ దేవరాయులేలిన విజయనగర సంస్థానము వెక్కడులు పోరాడెను. ఆ కారణముచేతనే దక్షిణ దేశమునఁ గోళాకారములు గానవచ్చుట కలిగెను మతాచార్యు లనేకులు దక్షిణమందుద్భవించుట కదియే హేతువు. ఇట్టిమేలు దక్షిణహిందూస్థానమునకంతయుఁఁ గావించిన విస్మృతాంధ్రరాజ్యమును దలంచి యాంధ్రులు గర్వింపవలయునో తన్నాళమునకు శోకింపవలయునో.
ముద్రాక్షరశాలలేర్పడుకఱకు మనవారు పుస్తకములను నిక్షేపమువలెఁ గాపాడుచుండువారు, ఇప్పటి బంగారు నగలవలె ముందు పుస్తకములు నప్పులకై కుదువ ముంచువారు. కోశవంతుఁడాచార్యుఁడను పట్టము వహించియండెను. అగ్రంధములన్ని ఁశివతఁడు పఠించి యెవ్వరేముడి గినను జెప్పసామర్ధ్యముఁ గలవాఁడగుటచే నిట్టిపట్టమునకు యోగ్యుఁడయ్యెను. కాలక్రమమున నిప్పటి లైబ్రేరియ౯లవలె వారును బుస్తకములకుఁ గావలియుండువారుమాత్ర మగుటచేఁగోళవంతుఁ డాచార్యుఁడనుట పండితపుత్రుఁడనుటవలె నయ్యెను. కావున నేఁటికోళనంతులు గృహములు కాచుకుక్కలవలెఁ, గోశాగారములకు రక్షకులుమాత్రము గాక సేకరించిన పుస్తకములు నెల్లఁ జక్కఁగఁబఠించి వానియందలి సద్విషయములు లోకుల కెఱిఁగించు చుండవలను. కోళవంతుల కిది ప్రథమకర్తవ్యము.
పుస్తక పఠనమువలని లాభములు
పుస్తకములు మౌనమువహించిన మిత్రములు. తనతోఁ జేరిన వానియందు స్నేహభావముఁగలిగి, వలసిన యుపకారముచేసి రక్షించుట మిత్రలక్ష్మణము.నిజమైనమిత్రుఁడు మనస్సున నొకటి యుంచుకొని తర్భిన్నముగ మాటలాడఁడు. ఒక్కొక్క సమయమునఁ గోపించియు దూషించియుఁ జెప్పును. సద్గ్రంధములు నిట్టిన.
సద్గ్రంథములు మనకుఁ దఢ్యములు పద్యములునైన వానిని బోధించునుగాని మనకు రుచిగానుండు వానిని మాత్రమే తెలుపవు మీ మేలు మీరు కోరుదురేని యెట్లు నిజమైన మిత్రుని సంపాదింప యత్నింతురో యట్లుపుస్తకములను సేకరించి పఠించుటయందును యత్నింపవలయును. పుస్తకములవలన బాగుపడఁగోరువారు తొలుతఁ దమ చిత్తవృత్తియెట్టిదో యేవిషయమందుఁ దమకభిరుచి మెండో యాలోచించి యావల నావిషయమై వ్రాయఁబడిన మంచి పుస్తకములను బఠింపవలయును. పరలోక వాంఛగలవానికి యోగము భక్తి-విరక్తి-జ్ఞానము లోనగు విధములఁ దెలుపు పతంజలి యోగశాస్త్రము, ఫేరండసంహిత, హఠయోగ ప్రదీపిక, భాగవతము, రామాయణము,భగవద్గీత, విష్ణుపురాణము, ఉపనిషత్తులులోనగు పెక్కు గ్రంథములు గలవు. ఇట్టి ధర్మవిషయమై - యర్ధకామముల విషయమై వ్రాయఁబడిన గ్రంథములును, గళలగుఱించి వ్రాయఁబడిన గ్రంథములుసుగలవు. దుష్టమిత్రు లెట్లు కీడుచేయెదురో దుష్టగ్రంథములునట్లు పాఠకులకుఁ గీడు చేయును. ఏవిషయమై మికాసక్తి మెండో యావిషయమును బోధించు గ్రంథములను బలమాఱు చదువవలయును. గొప్పకవులు మహాత్ములు వ్రాసినగ్రంథములందు నొక్కొక్కసారి చదువునపు డొక్కొక్క క్రొత్త విషయము మనస్సునకువచ్చుచుండును. మొదటిసారి బోధ పడనిది రెండవసారి బోధపడును. తొలుత నిస్సారముని యుపేక్షించినది యావల నెంతో సారవంతముగఁ గాన వచ్చును. సద్గ్రంథములకిది లక్షణముగావున నిట్టి గ్రంథము లందుఁగల సారమంతయు హృదయమున భాగుగనాటు కొని, పాడుకొని, దృఢపడి నిశ్చలముగ నిలువఁ జేయవలయును. తన్మయత్వము నొందవలయును. శ్రీరామానుజాచార్యులవారు శ్రీమద్రామాయణమును నిరువదియొక్క సారులు గురుముఖముగఁ బఠించిరి. పారాయణము చేయునుద్దేశముమీఁదఁ జెప్పినదియ, ఇట్టి పఠనము వలన ఫలము గలరుగాని యొకసారి చదివి యావల నుంచిన మేలులేదు. ఒక్క సారి చదివియావలఁ బాఱవేయవలసిన విపుడుపుట్టుచుండు నవలలు వీనినిఁ జదువకయే పొఱవేసిన నాయువు దుర్వ్యయము గాకుండును.
యోగము భక్తిలోనగు విషయములు మీకుగుచించు నో రుచింపవో కావున నీకాలమునఁ గవులుగాఁబెక్కురు బాలురు కోరుచుందురు కావున వారికి గావలసిన మార్గము సూక్ష్మముగఁ దెలిపెదను.
కవులు గాఁగోరువారు తొలుత ఛందోవ్యాకరణ లక్షణ జ్ఞానమును సంపాదింపవలయును. ఆపై వారివారి తెలివికొలఁది యుత్సాహము ననుసరించి యలంకారగ్రంథములఁ బఠింపవలయును. అమరమురాని వాని కేసమరనను సూక్తిగలదు కావున నామలింగానుశాసనము ఆంధ్ర నిఘంటువులు కొంతవఱకైనఁ బఠింపవలయును. ఈయధ్యయనము నిత్యకృత్యముగ విధిగనుంచుకొని విరామకాలములందు లక్ష్యుగ్రంథములు కవిత్రయ రచితములు, భాగవతము, రామాయణము లోనైనవి ముందు పఠింపవలయును. వీనిని బఠించుటవలన ననేక విషయములు హృద్ధతిములగును. ఆవలఁ బంచకావ్యములులోనైనవియొకసారి పఠింపవలయును. ఇప్పుడు చదివిన గ్రంథము లండేది తనకు నిష్టగ్రంథమయి మనస్సు నెక్కు వగరంజింహాఁజేయునో దానిని బలుమాఱు చదివి దానియందలి ప్రయోగములు గమకవిధము మనస్సునకుఁ దెచ్చుకొనవలయును. ఆగ్రంధముతన్ను రంజింపఁజేసిన కారణమేదో యదియు దెలిసికొని యట్టి గుణము తనయందును గలుగజేసికొన వలయును. ఈవిధముగఁ బునాది యేర్పడిన తరువాత నేగ్రంధమైనఁ జదువవచ్చును. దానియందలి సారము గ్రహింపవచ్చును. లక్ష్యులకణజ్ఞానము కుదురు వఱకు గ్రంథరచనకు సాహసింపరాదు. అభ్యాసమునకై విడివ్రాతలువ్రాసి పండితులయొద్ద సవరింపఁజేసికొను చుండవలయును, పాండిత్యమునకుఁ గవితాశైలికి సంబంధములేదు. విద్వత్కవులే కవులు. కేవలకవులు కేవలకవులేయని నూక్తిగలదు.
“దేవునానఁ దొల్లిదేశానికొకకవి
యిప్పుడూగనూరనింటనింట
నేవురార్వురేడ్వురెనమండ్రు తొమ్మండ్రు
పదుగురేసిశవులు పద్మనాభ"
యన్నట్టులిప్పుడు బాలకవులు వెల్లివిరియుచున్నారు. ఏదేశమునఁ గవులెక్కువమందియుందురో యాదేశము వృద్ధి చెందుననియు నే దేశమునఁగవులుజనింపరో యాదేశము క్షీణించుననియు విజ్ఞులమతము ఏల? బుద్ధివికాసముగలవారు కవులు. వారు వైకుంతముమొదలు పాతాళమువఱకు సంచరించి యాప్రదేశవాసులకుఁ దెలియని విషయములను మనోదృష్టిచేఁ జూచిచెప్పుదురు. కావునఁ గవులు పెక్కురుపుట్టుట శుభోదర్కమే కాని యట్టిపేరుపొందగోరువారు వంచనలేక లక్ష్యలక్షణజ్ఞానము, దానికిఁదగిన యోగ్యత సంపాదించుకొనవలయుననియే యభిలాష గాని యితరముకాదు.
గ్రామములనుండువారు పేదలుగను బుస్తకనామములు తెలియనివారుగను నుందురుగావున గ్రంథాలయము లందుఁ బుస్తకములలవడిన నట్టివారికెంతో సహాయపడును. జ్ఞానముసంపాదింపఁ గోరికకలిగియు బీదలగుటచేఁ గొనలేక యుండువారును, యేపుస్తకములను జదువవలయు నోతెలియనివారును గొందఱు కలరని నేనెఱుఁగుదును. అట్టివారి గ్రంథాలయములు నిక్షేపములు.
సద్గ్రంథముఁ జదువుఁడని పలుమాఱు చెప్పితివిగాని గ్రంథము చదువక యదిమంచిదో చెడ్డదో తెలిసికొనుట యెట్లని ప్రశ్నవచ్చెను గదా. ఇదియడుగఁదగినప్రశ్న మే. నా ప్రత్యుత్తర మేమన.
గ్రంథాలయసర్వస్వము మూఁడవసంపుటము రెండవ భాగముపైపుటయందు వెనుకప్రక్క నిట్లు ప్రకటింపఁబడియున్నది.
When you buy a book this test. ఒకగ్రంథమును గొనునపుడు పరిశీలింపవలసిన ముఖ్య విషయములు.
- ౧ అందము గానున్నదా?
- ౨ మంచిభాష యందు వ్రాయుఁబడినదా?
- ౩ మనజీవితవిధానమును దెలుపునా?
- ౪ మన జ్ఞానమును అభివృద్ధిఁజేయునా?
- ౫ మనవ్యవహారమునకు ఉపకరించునా?
- ౬ హితమును బోధించునా?
- ౭ సన్మార్గ జీవితమునకు సాయపడునా?
- ౮ మనజీవితమును సారవంతము చేయునా?
- ౯ ఆప్తునివ లెఁబ్రేమింపఁదగియున్న దా?
ఈప్రకారము పరీక్షించి పుస్తకముల గ్రహింపవలయును. ఎట్టి పనికిమాలిన పుస్తకమందైనను నేదోయొకమూల నొకమంచిమాటయో నీతియో యుండును. అట్టిదానితోఁ బ్రయోజనములేదు. కొన్నిటియందు విపరీతనీతులు దురాచారములు వర్ణించి లోకముట్లు ప్రవర్తింపకుండుటకై యదివ్రాయఁబడినదనియు నిదియు నీతిహితబోధకమనియు నందురు. అది సరిగాదు.
గ్రంథాలయములందు దుష్టగ్రంథములు నిస్సారగ్రంధములు ప్రోగుగాకుండుటకు వేఱోక సదుపాయము కలదు.
ఇప్పటి గ్రంథాలయ స్థాపకులు గ్రంథకర్తలపాలి చీడపురుగులై యున్నారు. ఒక గ్రంథకత౯ విద్యసేకరించుట యందు, నాలోచించుటయందు, గ్రంథము వ్రాయుట యందెంత శ్రమించునో, యెందఱ నాశ్రయించిపది రూక లసంపాదించి దాని నచ్చొత్తించునో కోశస్థాపకులకు బొత్తిగమనస్సునకుఁ దగులలేదు. పదిపుస్తకములు వెచ్చమగునా పదిరూపాయలువచ్చునాయని డబ్బిచ్చి పత్రికలయందుఁ బ్రకటితము చేయఁగానే ముందీభిక్షాటకుల యుత్తరములు స్తుతిపాఠములతో దినమునకొకటి రెండువచ్చుచుండును. కోశస్థాపకులలో దొంగలుకొందఱుకలరు. మూరెడుపొడుగు పేరితో నొకగ్రంథాలయమని పేరు పెట్టి తానుగార్యదర్శినని యీబిచ్చగాండ్రుత్తరములు వ్రాయుదురు. విచారింపఁబోయిన వ్రాసినవాని తలలోఁదప్ప నీగ్రంథాలయ మయూరనుండదు. ఉండినను వానియింటనుండును. అదిపదుగురకుపయోగపడునది కాదు. కొన్ని గ్రంధములు చేర్చి యావలవానిని విక్రయింతురు. ఇట్టివారిని గుఱించి సువర్ణలేఖయందొక వ్యాసముఁజదివి యుంటిని.
ఇప్పుడు గ్రామగ్రామమునఁ గోశాగారములు నెలకొల్పఁబడుచున్నవి. గ్రంథకర్త ముద్రించు గ్రంథములసంఖ్య కంటె వీరి సంఖ్యయెక్కుడుగనున్నది ముద్రించినపుస్తకములు వీరికిఁబంచిపెట్టి తరువాత గ్రంథకర్త యేమి చేయవలయును? కావునఁగోశస్థాపకులీపుస్తకభితుములెత్తకుండుట ప్రథమకర్తవ్యము. పుస్తకముల యాచించుటకుమాఱు ధనవంతులయొద్ద ధనముయాచించి పుస్తకములను వెలయిచ్చికొనవలయును. అట్లు కొనువారు మంచి గ్రంథములనే కొందురుగాని పనికిమాలినపుస్తకములను గొనరు. ఇదియొక మేలు. పుస్తకము మంచిదాయెనా గ్రంథాలయముల వాఅందరుకొనుటచే గ్రంధకర్త కె౦తో సాహాయ్యముచేసిన వారగుదురు. దానివలన నతఁ డుత్సాహియై యింకను సద్గ్రంథములు వ్రాయువాఁడగును. ఈవిధానమున గ్రంధకర్తలు పోషింపఁబడుదురు. భాషయుఁ బోషింపఁబడును. కావునఁ గోళస్థాపకులు పుస్తకభిక్షయను నీచవృత్తిని మానుదురుగాక.
ముద్రణమువలని లాభనష్టములు
తక్కువవేలకు లభ్యపడుట, సర్వజనులకుఁ గొనఁదగి యుండుట, యామూలమున విద్యాజ్ఞానములు లోకమున విరివిగ వ్యాపించుట లోనగునవి ముద్రణమువలనఁగలుగు లాభములు. ఇవిమీరందరు ఱింగినవియే. లోకమున నీడలేని దీపము లేదు. దుఃఖములేని సుఖములేదు. అట్టులే యిదియు. ఇప్పుడు ధనవంతులకువలె బీదలకును బుస్తకములు దొరకుచున్నవి. విజ్ఞానము, వీధిజలదారియందలి నీళ్ళవలె వీధుల వెంటఁబాఱుచున్నది. అయినను నిట్టి గ్రంధపఠనమువలన విశేషలాభము లభించుట లేదు. పుస్తకములు కొలఁదిగను వెలయెక్కువగనుండు కాలములో వానిని గొనువారు వానినిబలుమారు చదివి దానిసారమంతయు హృదయమునఁ బాదుకోనఁజేసియుండిరి. అట్టి వారికట్టి పుస్తకములు వాస్తవముగ మిత్రము లేయైయుండెను. ఇప్పుడో, యతిపరిచితి యవజ్ఞతకుఁగారణమయ్యెను. శ్రమపడక లభించినదానియఁదు గౌరవముతక్కువ. కావునఁ బుస్తకములందు మిత్రభావముపోయి సామాన్య మైనపరిచయభావముకలిగెను. బ్రాహ్మణకల్లుదుకాణములని పేరుగొన్న కాఫీహోటల్సునందుఁ జేరువారి పరస్పరపరిచయమెట్టిదో యిప్పటిపుస్తక పరిచయ మట్టిదని యొకఁడు చెప్పెను. ఇప్పుడువెలువడు ననేక పుస్తకములు సోమరులు కాలముగడుపుటకై వినియోగపడునవియేకాని వాస్తవజ్ఞానదాయకములు గావు. సద్గ్రంధములు కొన్నియున్నను గడ్డిగాదమువలె నివి పెరుఁగుటచే వానినిఁగని పెట్టుటకుఁగాని వానియందే విశేషకాలము వెచ్చించి బాగుపడుటకుఁ గాని వలనులేకుండఁ దటస్థించుచున్నది. ఏదిపొట్టో యేదిగట్టియో తెలిసికొనుటకష్టము. రసము స్నిగ్ధముస్థిరమునగు నాహారముగొని దేహబుద్ధిపటుత్వము సంపాదించు కొనుటయందు పేక్షవహించి శాఫీనీళ్ళు త్రావి రోగములపాలవువారివలె నుత్తమగ్రంథపఠనమున లక్ష్యపఱిచి సులభంబులగు నల్పగ్రంథములఁజదివి వానియందలి విషయములఁ గొన్నిటి నెఱుఁగుటచే జ్ఞానులమైతి మనుకొను మహాజ్ఞానులు కొందఱు వెలువడుచున్నారు. కావున గ్రంథాలయములందు నల్పవిషయముల గుఱించి వ్రాయఁబడిన గ్రంథములుండుటతగదని నా యభిప్రాయము.
చదువ నేర్చినవారు పుస్తకములయందు దేశమేమి? కాలవ్యయముచేయుటకా? జ్ఞానవిజ్ఞానముల సంపాదించుటకా? యని యాలోచింపవలయును. ఆహారము దేహమును, బుస్తకపఠనము మనస్సును, మంచిదశయందుంచవలయును. తద్విరుద్ధములైన యాహార, పుస్తకములు త్యాజ్య ములు తెలిసికొన యోగ్యమైనది విద్యగాని యచ్చొత్తింపఁబడిన దేనినైనఁ జదివితెలిసికొనుట విద్యనార్జించుట కాదు. ఇంతయేల? పుణ్యమా పురుషార్థమాయనువాడుక చూట యిందు ముఖ్యముగా నవ్వయించును.
కోశవంతులకృత్యములు
౧ కోశవంతులు సద్గ్రంధములేవేవి యెందెందుఁ బ్రచురింపఁబడుచున్నవో తెలిసికొని వానినార్జింసదు పాయములు వెదుకవలయును.
౨ సంపాదించిన పుస్తకములనన్నిటిని దానుజదువలయును.
౩ తానుజదిపినవానిలోని సద్విషయములను గ్రామములోనివారికి నుపన్యాసములోసంగియో పురాణ పఠనముగఁ జదివిచెప్పియో మఱియేవిధముగనో నప్పుడప్పుడు తెలుపుచుండవలయును.
౪ తెలిసినవారినిబిలిపించి యప్పుడప్పుడు ఉపన్యాసములో సంగజేయవలయును.
౫ మంచినడవడిగలవాఁడై జనులగౌరవమునకుఁ బాత్రుఁడుగా యత్నించుచుండవలయును.
౬ ఏవిషయమైనాఁబరిశోధింప మనస్సుగలవారి కేయే గ్రంథముల౦ దావిషయము వ్రాయబడి యున్నాదొ తెలిపే సహాయుడుకావలయును.
౭ అముద్రిత గ్రంథము లెందైవఁ గలవాయని విచారించి యట్టివియుండిన సేకరింపవలయును.
౮ అపూర్వగ్రంథమేదైన లభించిన ముద్రింపయత్నమైనఁజేయవలయును. లేకతక్కినకోశవంతులకా విషయమువ్రాసి కోరినవారికి దానిప్రతులు లభింపఁజేయవలయును.
౯ చదువుకొనుటకుఁ బుస్తకములనిచ్చిన యెడల వానిని తీసికొనినవారు మఱలనిచ్చునపుడు దానిచ్చిన పుస్తకమునే యిచ్చిరా, వేలోక ప్రస్తకమునిచ్చిరా, పుస్తకములోని పత్రములను బటములచించికొనిపోలేదు గదాయని శోధించి యావలఁ వానిని యధాస్థానముననుంచవలయును. పుస్తకమునుమార్చు పెద్ద మనుష్యులు, పటముల సుజించికొనిపోవు పెద్దమనుష్యులు కొందఱుందురు.
౧౦ హైదరాబాదు నగరముననుండు గ్రంథాలయమందుఁ బుస్తకమింటికిఁగొనిపోవుసభ్యులు దానివెల ముందుగ నియ్యవలయును. పుస్తకము మంచిస్థితిలో మరల నీయఁబడునని వారిచ్చిన పైకము వారికి నొసఁగఁబడును. ఇట్టినియమము తక్కినచోటులనుండవచ్చును.
౧౧ వ్రాత పుస్తకముల సేకరించువారుమంచిపుస్తకములను దాముహరించి తక్కినవానిని గ్రంథాలయములకుఁ బంపకుండునట్లు గ్రంథాలయములకు సంబంధించిన వారందఱుకనిపెట్టవలయును.
౧౨ ఏపుస్తకములులోకులచే ఁజదువఁబడుచున్నవో యందు విశేషముగ నెట్టివిచదువఁబడుచున్నవో కని పెట్టవలయును. దీనికై పుస్తకములఁ జదువువారిపేరు చదివిన పుస్తకములు పేరు వేరొక పుస్తకమున వ్రాసియుంచుచుండవలయును.
కోశవంతులు సంపాదింపఁదగిన గ్రంథములు
గ్రంధసంపాదనమందు భాషానియమనఃక్కఱలేదు. తత్తత్ప్రదేశవానులెఱిఁగిన భాషలయందలి గ్రంథములెల్ల సంపాదింపఁదగినవే. కేవలాంధ్రభాష ప్రచారముననుండు పల్లెలయందు నఱునపుస్తకములుంచఁబనిలేదు. మండలము నకొక్క ముఖ్యకోశాగారముండవలయును. అందుసకల గ్రంథములుండవలయును. ఆంధ్రగ్రంథములు ప్రాముఖ్యమువహింపవలయును. వారికిసమానముగ సంస్కృతగ్రంథములు గౌరవింప వలయును. పెక్కురు నాగరలిపియెఱుఁగరుకావున నివియాంధ్రలిపికుండుట మేలు. అట్టివి లభింపనపుడే లిపిలోనుండినను గ్రహింపవచ్చును. తెనుఁగు చేయఁబడని కొన్ని సంస్కృత గ్రంథములు గలవు. అవి యాంగ్ల భాషయందు భాషాంతరీకరింపఁబడినవి. ఇట్టివానిని సంపాదించినచో మూలము లభ్య పడనపుడును, సంస్కృతము రానివారికిని నివియుపయోగించును. సంపాదించిన గ్రంథములు విషయమునుబట్టి వేదాంతశాస్త్రములు,పురాణములు, కావ్యములు, యోగము, వైద్యము, జ్యోతిషము, అనియిట్లు నానాభాగములుగ తరగతులుగ విభజింపవలయును. కోశనామసూచిక నొకటి యుండవలయును. ఇదిముదితమగుటయే గాక వలయువారికి వెలకు లభింపఁజే యూటయు మేలు.
ఆర్యులారా! యిప్పుడు నేను జెప్పిన విషయములన్నియు మీరెఱిఁగినవే. అంతేకాదు అనుభవజ్ఞులగు మీరే నాకంటే నెక్కువగ నెఱుఁగుదురు. నాకుఁబ్రకృతిము తోఁచినవి చెప్పితిని, రాత్రిచాలఁబ్రొద్దయినది. దినమంతయుఁ బ్రయాణముచేయుటచే నా మిత్రులందఱలనియ న్నారు ఇంకను నామాటలచే మిమ్ముఁబీడింపమనసొప్ప కున్నది. కావున నింతలో నిరమించెదను. తెలిసి తెలియక నేను జెప్పినవానియందు లోపములున్న క్షమింపుఁడు. గ్రంథాలయములవారు శ్రద్ధాభక్తులతోఁబరి చేసిన దేశమున కెంతో మేలుగలదు, గ్రంథాలయము స్థాపించితిమను ప్రతిష్ఠకై తిరిపెమెత్తి పుస్తకముల సంపాదించి యొకగదిలోనుంచి కుక్క కావలి యుండుటచే నేమియుమేలులేదు. వీరుమనస్సొప్పి శ్రమమునకోర్చి పనిచేయఁబూనిన నెంతైన నవకాశముగలదు. చందాలిచ్చువా రాయాగ్రంథాలయము వారేమి పనిచేయుచున్నారు. ఎట్లు చేయు చున్నారు, తృప్తి కరమైనపని జరుగుచున్న దా లేదాయని కని పెట్టి సోమరితనముగావచ్చినచో దానిని దొలఁగింప యత్నింపవలయును. ఈసభకు నెల్లూరియందలి తిక్కన పుస్తక భాండాగారమువారు తమ ప్రతినిధిని బంపరైరనియు నచ్చటి వారికీవిషయములఁ జాలినంత యుత్సాహములేదనియు వింటిని, ఇది మిక్కిలి శోచనీయము. శిరస్సుచెడివి నవయవములన్నియుఁ జెడునట్లు ముఖ్యకోశాగారము మార్గదర్శకమగునది యింతసోమెక్కి యుండినఁ దక్కినవెట్లు భాగుపడఁ గలవు? కావునఁ తిక్కనభాండాగారమువారు నిదురమేల్కొని సర్వదాజాగరూకులై తమమాతృస్థాన గౌరవమును గాపాడుకొందురుగాక, శ్రద్ధయుభక్తియు ఋజు ప్రవత౯నము గ్రంథాలయములవారికెల్ల భగవంతుఁడొసఁగుఁ గాక.
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.
Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.
This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.
The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.
This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.
Public domainPublic domainfalsefalse