Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 6/ధర్మార్ధ కామమోక్ష ప్రదాయినీ సమాజము-సిగడాం

వికీసోర్స్ నుండి

ధర్మార్థకామమోక్ష ప్రదాయినీ సమాజము, సిగడాం.

విశాఘపట్నముజిల్లా యందున్న నీగ్రంథాలయము ౧-౭-౧౮ న స్థాపింపఁబడినది. ఇందు ౫౦౦ గ్రంథములు గలవు. ౫ పత్రికలు వచ్చుచున్నవి. ధర్మగ్రంథాలయము ౨౭-౬-౧౯ న ప్రధమ వార్షికోత్సవము బుర్రా శేషగిరిగావుపంతులు గారి యధ్యక్షత క్రింద జరిగినది; వా రిట్లు చెప్పిరి.

మీరీ సిగడాం గ్రామమందు ధర్మార్ధకామమోక్ష ప్రదాయినీ సమాజము నేర్పరచి ప్రజలు తెలివిమీరునట్లు చేయుటకుఁ బ్రయత్నించుట యెంతయు స్తవనీయము. మన యాంధ్రదేశమున నెన్నియో సమాజము లున్నవి. కాని కోరఁదగిన పురుషార్ధము లన్నియును సమముగా సాధించుట కేర్పడిన సమాజము మీరు స్థాపించినదే కానఁబడుచున్నది. ఇది మీ సమాజముయొక్క యాధిక్యత.

ధర్మమునకును దానమునకును గొందఱ భేదము కల్పింతురు. దానధర్మములను ద్వంద్వము మీరందఱు నెరిగి నదే. కాని పురుషార్ధముగ నెన్నఁదగిన ధర్మ మదికాదు. అయినచో దానము చేయుటయే పురుషునికి విధాయకమై లోకమునందు సోమరితనమును దారిద్య్ర్యమును మితి మీరును.

ధర్మమన న్యాయమని మరికొంద ఱ౦దురు “యతో ధర్మస్తతో జయః" యనుచో "ధర్మ" మున కిదియే యర్థము "సర్వధర్మా౯ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ" యనుచో నీ యర్ధము పొసగదు. కనుక వీటినన్నిటిని సమన్వయింపఁగల నిర్వచన మాలోచింపవలెను. ధర్మమనఁగా “విధి”, “నియతకర్మ”, (Duty) యని చెప్పినయెడల నన్ని యర్థములును సమన్వయించును. కాగా మనుష్యునకు "నియతకర్మ” “విధి”, (Duty) యేమని ప్రశ్న కలుగుచున్నది. విశేషించి యాంధ్రుల మగు మనలో తగవరులకుఁ బెద్దలకు విద్యాధికులకు “విధి యేమి" ?

ఆంధ్రలోకము తెలివిమీరి ప్రజ్ఞావంతమగునట్లు చేయుటయే, ఇందుకే పూర్వపు మహారాజులును జక్రవతు౯లును దేవాలయ ప్రతిష్ఠలు, అగ్రహార ప్రతిష్ఠలు, వాపీకూపతటాకా రామప్రతిష్ఠులును జేసిరి. ఇందుకే మహాకవులు పురాణేతిహాసములు నాంధ్రీకరించిరి. ఇందుకే మహావీరులు తమరక్త ధారలతో భూమినభిషేకించి వైరిమతోద్రేకముల నడంచిరి. కాలములు మారినవి. రాజ్యాంగములు మారినవి. ఆశయములు మారినవి. ప్రస్తుతలోకము కత్తివలనఁ గాక కలమువలనఁ దరింపవలసి యున్నది. వీర స్వర్గాభిలాషులభినవప్రపంచమునను దలలెత్తుచున్ననుచచ్చి స్వగ౯మునకేగుటకన్న బ్రతికి లోకసంగ్రహమునకై పాటుపడుటయే మేలను ప్రబోధము సర్వేసర్వత్ర విననగుచున్నది.

మన యార్ధిక దశ మిక్కిలి దుస్థితియందున్నది. పూర్వము మన దేశము సమస్తసంపదలతోఁ దులతూఁగు చుండెను. కార్మిక విద్యలెల్లెడల వ్యాపించియుండెను. సర్వశాస్త్రములును వ్యాపించి యు౦డెను - ప్రాచీన గ్రంథములకై వెదకుచు నేను చేయుచున్న ప్రయత్నములలో శాస్త్ర సంబంధమైన గ్రంథములెన్నో కనఁబడుచున్నవి. కార్మిక విద్యలు ప్రచారమందు లేకుండుటచే న౦దఱును ముసద్ది వృత్తికి దిగి కడుపునిండ నన్నము తెచ్చుకొవఁజాలకున్నారు. ఈదుస్థితి మారుటకు మార్గము కార్మిక విద్యలు దేశమందు విస్తరింపఁ జేయుటయే. గవర్నమెంటువారెప్పుయేమో చేయుదుగని మనముచేతులు కట్టుకొని యుపేక్షించుటకన్న తెలివిమాలినతనము లేదు. గ్రంథాలయోద్యమమును దగినట్లు నడిపించినచో మనయీ గ్ర౦థాలయములే విద్యాగారములై గ్రామస్థులకు సాహిత్యముతోఁబాటు కార్మిక విద్యలును నలవడఁజేయును.

కామమునకు విపరీతార్థముఁ గల్పించినచో నదివ్యసనమై యుద్ధదాయకమగును. విషయాసక్తతయే కామ మైనయెడల నదిదుర్నీతికి మార్గమగును కాని పురుషార్థముకానేరదు. కామరత్నమను నొక గ్రంధమును జూచితిని, అందు సమస్త విద్యలను సాధించు మార్గములు కలవు. కోరఁదగిన విషయములను సాధించుమార్గములు చూపు శాస్త్రము కామశాస్త్రము, రతి తంత్రమే కామశాస్త్రమనుట విపరీతాభిప్రాయము, పరమేశ్వరుఁడు ప్రతివ్యక్తియందును గొన్ని శక్తు లిమిడించి యున్నాడు. వాటిని సాధనలోనుంచి ప్రకాశింపఁజేయుటయే "కామ" మను పురుషార్థము. ఇది యందఱుకు గోరఁదగినది. దీనివలన లోకమునకెంతో యుపకారము కలుగును. మన యధ్రదేశమందుఁ బ్రతిమనుష్యుఁడును దనయందిమిడియున్న శక్తులను బ్రకాశింపఁజేయుటకుఁ ౼ బ్రయత్నించుటయు నట్టి ప్రయత్నమునకు మన గ్రంథాలయములు తోడ్పడుటయు జరిగినచో మన యాంధ్రదేశమచిరకాలములో వన్నె కెక్కును.

మోక్షము ముక్కు మూసికొనుటవలన రాదు. మోక్షమనఁగా సంసార చక్రమందలి రాయిడులనుండి తొలఁగుటకాని సంసారము త్యజించుటకాదు, కుమ్మరపురుగు సామెత మీరింద ఱెఱిఁగినదే. ప్రపంచ మందుండియుఁ బ్రపంచమాలిన్యము తనకంటకుండ లోకయాత్ర నడపించుట ముక్తికి మార్గము. జనకాదిరాజయోగులిట్లు ప్రవతి౯ంచి లోకమును ద్యజించిన మునిపుంగవులకును బూజ్యులై ధర్మకత౯లై మార్గదర్శకులై విలసిల్లిరి. ముక్తులలో జీవన్ముక్తు లోత్తములు, జీవన్ముక్తిత్వము నిరంతర సాధనవలనను, నిరంతరధర్మానువత౯నమునను, నిరంతర పరశ్రేయోభిలాషిత్వమువలనను గలుగును గాని కేవలము గ్రంథపఠనమువలనఁగాని కర్మమార్గమువలనఁగాని కలుగ నేరదు. పరబ్రహ్మము చిద్ఛ్వరూపము, ఆత్మయుఁ జిచ్ఛ్వ రూపము, అందుచేత నే తత్వమసీత్యాది వాక్యములకుఁ బ్రామాణ్యము కనుక జ్ఞానప్రకాశితముగాని యుపాయములవలనఁ బ్రకృతి బంధములనుండి చిచ్ఛ్వరూపియగు నాత్మను విడిపింపఁజాలము.

ఇట్లు ధర్మార్ధ కామమోక్షములకు జ్ఞానమే సర్వోత్కృష్టమగు సాధనమగుచున్నది. జ్ఞానము పలువిధముల విస్తరించినగాని తరుణోపాయము లేదు. మన పూర్వులు సంపాదించిన జ్ఞానవిశేషములు విద్వత్సం స్తవనీయములగు మనయాంధ్రగీర్వాణ భాషలయందున్నవి. అందుఖిలమగుచున్న గ్ర౦ధముల నుద్ధరించుటకు, నిలచియున్న వాటిని వాడుకలోనుంచుటము, నవీన ప్రాపంచకజ్ఞానము నాంధ్రములోనికి దించుటయు, సత్యవసరమగుచున్నది. ఇట్టి ప్రయత్న మందఱు నాదరింపఁదగినది. దీనికిఁ జేసిన ధనసహాయము కోటిగుణితమై యిచ్చువారికినిఁ బుచ్చుకొనువారికిని శ్రేయోదాయకమగును.

విద్య, వితరణ, వివేకము, వివయము అనునీనాలుగును బ్రస్తుత కాలమున మానవులు తరించుటకుఁ జతుర్వేదములై యున్నవి. వేదచ్యోతములగు చతుర్విధ పురుషార్థముల సాధింపనేర్పడిన మీ గ్రంథాలయమందీ జతుర్వేదములును నిరంతరము సభ్యులమనముల కుద్దీపనములైమీ చేయు విద్యాప్రచార ప్రయత్నమునకు యశశ్చంద్రికలై వెలయుఁగాక!

గీ॥ విద్య వెలయించి విబుధులు ♦ వినుతి గాంచి,
నాగరకులయి, నయవిద్య ♦ నాయకులయి,
పిన్న పెద్దలతగురీతి ♦ మన్నలను
దనిపి, పురుషాథ౯ సంసిద్ధి ♦ గనుచుమనుడు