Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 6/తృతీయ గోదావరి మండల గ్రంథాలయ సభ

వికీసోర్స్ నుండి

తృతీయ గోదావరి మండల గ్రంథాలయ సభ

ఆహ్వాన సంఘాధ్యక్షులగు

శ్రీ చెలికాని లచ్చారావుగారి ఉపన్యాసము

ఈ మహాసభ రెండేండ్లనుండి గోదావరీమండల రాజకీయసభ యండఁజేరి యద్దాని క్రీగంటి ప్రసారంబున బ్రతుకుచున్నది. సర్వలక్షణ లక్ష్యోపేత నుంబైప్రసిద్ధంబగు నాంధ్రమాత తన సుధామయోక్తులను స్వాతంత్య్ర ప్రయత్నమును తన ప్రియపుత్రులకు బోధించ నరగంటయైన కాలవ్యవధి లేకుండుట విచారించి మీదు మిక్కిలి పై సభనాహ్వానించినవారు దానితో బాటైన రమ్మనమని యొక్క మాటయైన బలుక కుండుటయు, "పిలువని పేరంటము” నకు బోవనేలయనియు, స్వాతంత్య్ర౦బులేని జీవనంబు నిరర్థకంబనియు, తలంచి సభాతీర్మాన౦బున భాషామతల్లి మొగంబుజూచి మేమికు గ్రామంబున కాహ్వానించితిమి. ఇంక నీ యాంధ్రమాతను కడుశ్రద్ధతో నాదరంబుతో స్వతంత్రముగా పోషించు భార మామెపుత్రులమగు మనయందే యున్నది. మా చిత్రాడపురీ పుణ్యవశంబున సంగీత సాహిత్య కళావిశారదులును, భాషాభిమానులును, బంధుమిత్రగురు బుధజనవగ్గంబును నగు మహానీయులెల్లరు నీ సభ నలంకరించి నందులకు మాకృతజ్ఞతావందనంబు లర్పించుచున్నవారము. మాచిత్రాడ చిన్నగ్రామమై (1800 జనాభా) నప్పటికీ నీమధ్య నాంధ్ర పరిశోధక మహామండలి నిమిత్తమై గ్రంధములను వెదకుచున్నతఱి రమణక్క పేటలో దొరకిన యొక తాళపత్ర గ్రంధమందు సుమారు 140 సం॥రముల క్రింద రచించిన చిత్రాడ వేంకటేశ్వర స్తోత్రంబు చూచిన నప్పటికెంతో కాలమునుండియు చిత్రాడ గ్రామము వెలసియుండినట్లు కానబడుచున్నది. అది సంస్కృతమున రచింపబడిన వేంకటేశ్వరశతకము. చిత్రాడనుగుఱించి పురాణ ప్రసిద్ధంబగు గాధ యేదియు గానరానప్పటికి నిందుండు పోతురాజు మొదలుగాగల శిలావిగ్రహంబుల శిల్పనైపుణ్యంబు తిలకించిన జైనుల కాలము జ్ఞాపకము వచ్చుచున్నది. మఱియు నిప్పుడు కానరాని నెన్నోతరములక్రింద నశించిన రాజనాలవారు చక్కావారు, బచ్చువారు మొదలగు కుటుంబముల నామములతో పెద్దలవలని వాడబడుచున్న పెరడులను బట్టి చూచినను నిదిపురాతన గ్రామంబని తోచుచున్నది. ఇప్పుడీ కుగ్రామమునకు తూర్పుననున్న నొక భూభాగమును “ధనపుదిబ్బ” యని వాడబడుచుండుటయు, గోలెంబులకొలంది ధనమున్నట్లు వాడుకయుగలదు. ధనము భూమియందు దాచుకొనుట, నిక్షేపముచేయుట, శత్రువులు వచ్చునప్పుడు పాతివేయు నలవాటుండుట, దోపిడుల కాలముందు రెడ్లు, మహమ్మదీయుల పరిపాలన కాలమున కున్నతస్థితి నున్న దాయని జ్ఞాపకము వచ్చు చున్నది. ఇందపాలి, కుమ్మర, బలిజి, గొల్ల, ఈడిగ, చాకలి, మంగలి, జంగము, మాల, మాదిగె, మహమ్మదీయ, బ్రాహ్మణ, రాచివెలమ, వైశ్యళూద్రాదులు గల వగంబుల లక్షించినను యెటలజూచినను పురాతన గ్రామంబని తేలుచున్నది. ఇందు బోర్డుస్కూలును, నైట్ స్కూలును, పంచమాన్కూలును గలిగి నూటికి డెబ్బదిమంది చదువను, వ్రాయను సమర్థతగలవారు కలరు. సుప్రసిద్ధ కవివరులగు శతావధానులు తిరుపతి వేంకటేశ్వరుల గురువులు షద్దగ్ననీ వేత్తలగు చర్ల బ్రహ్మయ్యశాస్త్రీ వరేణ్యుల నాదరించి ధవళేశ్వరంబున పాఠశాలను నెలకొల్పిన లక్ష్మీనరసయ్యమ్మగారి దీగ్రామంబె. లోకంబునందెల్ల సుప్రసిద్ధివడసి బొబ్బిలి రణరంగంబున మరణించిన రంగారావుగారి సతీరత్నంబు మల్లమ్మదేవియు మాగ్రామవాసుల బిడ్డయనుటకు గర్వించుచున్నారము. ఇంక ననేక చరిత్రాంశము లీగ్రామమునకు గలవు. గ్రంథవిస్తర భీతిచే విరమించి ప్రస్తుతాంశంబునకు వచ్చెదను. భారతవర్షంబున చరిత్రాంశంబుల దిలకించినను, యుక్తినిపరికించినను, దేశాభ్యుదయంబునకు భాషాభివృద్ధియే ప్రధమ సోపానంబని తెలియుచున్నది. భాషాభిమానము లేని రాజ్యంబుగాని, భాషాభివృద్ధి లేని దేశంబుగాని యభివృద్ధిపొందినట్లు యే చరిత్రమునందును గానరాదు. ఏ దేశము నాగరికతాభివృద్ధితో, సకలసంపదలతో, జ్ఞానసంపత్తితో తులతూగుచున్నదో యాదేశంబు తప్పక భాషాభివృద్ధి గాంచియు న్న దనియే యెఱుంగవలెను. ఇట్టి పరిస్థితిగమనించియె ఇట్టి సర్వోత్కృష్టత గ్రహించియె, అమెరికా, జర్మనీ, ఇంగ్లాండు మొదలగు దేశంబుల ప్రతిపట్టణంబువను, గ్రామంబునను, తుదకు యింటింటియందును భాషాభివృద్ధి కనువగు జ్ఞానసాధనంబగు పుస్తకభాండా గారంబులు వెలయింపఁజేసి ప్రపంచకమందలి జాతులలో నాగరికాగ్రగణ్యులై వినుతికెక్కిరి. వారి దేశంబుచూచియే బరోడా ప్రభువు తన దేశంబున గ్రంథాలయంబులు నెలకొల్పి ప్రజలను మిగుల యౌన్నత్యదశకు తీసుకువచ్చెను. మనదేశంబు తొల్లిటి యాన్నత్యంబు పొందవలెనన్న సిరిసంపదలు సత్కశాభివృద్ధిగాంచవలెనన్న, యిహపరసౌఖ్య మందవలెనన్న గ్రంథాలయ స్థాపనంటే ప్రథమ కర్తవ్యంబు. సర్వస్వాతంత్య్రంబులలవడుటకు, విజ్ఞానధనంబు నొందుటకు, ప్రకృతి ఆధ్యాత్మికంబుల దెలుసుకొనుటకు సూక్ష్మములో మోక్షమనునట్లు యీ గ్రంథాలయంబులె సాక్షిభూతములగును. ఇట్టి సర్వోత్కృష్టత గుణాతిశయములనుబట్టియె మన పూర్వులు పెక్కుచోట్ల దేవాలయంబులకుతోడు నీ గ్రంథాలయంబులను నెలకొల్పుచుండిరి. ఒక్క దేవాలయంబున నాముష్మికసాధనంబు దెలుపును గాని గ్రంథాలయంబు విజ్ఞానసంపత్తితో గూడుకొని ఐహికాముష్మిక సుఖసౌధనంబులు గలుగజేయును. మనకు బుద్ధులు చెప్పు తలిదండ్రులు, హితోపదేశము జేయుగురులు, సలహాజెప్పు మంత్రులు, తోడునీడగు భార్య, సోదరులు, యోగులు, జ్ఞాతులు, యెందఱో మహనీయులు, స్త్రీ పురుషరత్నంబులు యింతయేల తుదకు దైవంబు నీగ్రంధరాజంబులందు వహించియుండునప్పుడు అట్టి పవిత్రవంతంబై సర్వోత్కృష్టమైన గ్రంథాలయముం గాంచుట యెంత శుభప్రదమో లాభకరమో యోచింపుడు. అట్టి సర్వ శుభప్రదమైన యిహపర సాధనమైన కార్యంబు గాబట్టియె మున్ను మనవారు తక్షశిల, నలందల, ధ్యానకటక మొదలగు పలుచోట్ల గ్రంథాలయములు స్థాపించి దేశాభివృద్ధికరముగ జేసి వన్నెకెక్కిరి. మఱియు వైదేహ, కాశి, కోసల, కురు, పాంచాలాది ప్రభుస్థానంబులు గ్రంథాలయంబులు గలిగి సకల కళావిభూషితులగు పండితవర్యులచే నలంకరింపబడి యుండెను. ఎక్కడ జూచినను విద్యా వినోదంబులచే వర్ధిల్లుచుండెను. ఈ గ్రంధాలయంబులకడ కరిగి కర్మిష్ఠులు, యోగులు మొదలగు వారెల్లఱు తమ తమ సంశయంబుల దీర్చుకొనుచు కృతార్థులగుచుండిరి. దేశము భాగ్యభోగ్యజ్ఞానాధికంబు లొందవలెనన్నచో గ్రంథాలయంబులే ముఖ్యావసరంబులు, గ్రంధాలయంలె ప్రధచూలంకారంబు. శ్రీకృష్ణ దేవరాయలు “భువనవిజయ”మను పేర నొక సభనిర్మించి కవినాథులతో విద్యావినోదంబులు సలుపుచుండె. మఱియునిది యిట్లుండ మనదేశంబున కెందఱువచ్చి మనలను దోచుకొనినను, దేవాలయంబులను పడగొట్టినను, వివిధ దురాచారంబులు బోధించినను, ఏది పోయినను, ఏమిజరిగినను మన పెద్దలు తమ దారాపుత్రాదులకన్న,సోదరసోదరీమణులకన్న,గ్రంథరాజంబులను కాపాడి కీర్తి శేషులైరి. మన పెద్దలు మనకొసంగిన దివ్యధనమిదియె. వాటి యందు౦డు జ్ఞానసంపద గ్రహించి శ్రేయోభివృద్ధులందు భారము మనయందున్నది. ప్రపంచకంబు పుట్టియెన్నో యుగంబు లైనది. ఎందఱో యోధులు, రాచకీయధుర౦ధరులు, ఘనసంఘసంస్కర్తలు, జ్ఞానధనులు, కవులు,గాయకులు,పరోపకారపరాయణులు బయలుదేరిరి. దేశంబున కొన్నియో మేళ్ళు చేసిరి. గతించిరి. ఇన్ని యుగంబుల చరిత్రము, జ్ఞానధనము, గతించిన వారల అనుభవములు, వారల త్రోవలు మనము పొందు టెట్లు? పుస్తకఁబునగాదె? అట్టి దివ్యధనమును కాపాడుకొని యభివృద్ధిజెందుటకు గ్రంధాలయంబు లావశ్యకంబులు గావె. అట్టివిలేకుండిన లోకజ్ఞానంబెట్టుండును. మున్ను మనదేశంబున గ్రంథాలయాభివృద్ధిగాంచుట వినియుంటిమిగదా. రానురాను అన్యపరిపాలనంబువను, మతద్వేషంబుల మనగ్రంధాలయంబులు క్షీణించినవి. ఇప్పుడు మనమత విషయమునకు 'మేమురామ' ని వాగ్దత్తము చేసిన ఆంగ్లేయపరిపాలనవలన మన గ్రంథాలయాభివృద్దికి సావకాశము చిక్కినది. తరుణము పోగొట్టుకొన జడదు. గ్రంథాలయాభివృద్ధివలన అమెరికా, జర్మనీ, ఇంగ్లాండు దేశంబు లమిత లాభంబులు పొంది జన్మహక్కులు బడసినవి. ఎన్నో గ్రంథరాజంబులను మన దేశంబునుండి తీసికొనిపోయి వారి భాండాగారంబులు నింపిరి. లాభము జెందిరి, ఒక్క శాకుంతల నాటకమును అంగ్లేయ పండితుఁ డొకఁడు తన భాషకు భాషాంతరీకరించి నప్పు డద్దానిని జూచినప్పటి నుండియు పాశ్చాత్య పండితవరులు భారతీయులకు విజ్ఞానవిస్తరంబగు వాఙ్మయంబుండేనని నమ్మి వారుకూడ సంస్కృతిభాషాపఠనంబునకు దరలిరి. విపుల గ్రంథపఠనం బొనర్చిరి. మనదేశమందలి యపూర్వగ్రంథరత్నంబులను తమ దేశంబునకు దొరలించిరి. ఈమధ్య తంజావూరు తాళపత్రి గ్రంధముల లైబ్రరీని గూడ దీసికొనిపోవ జర్మనీవారు ప్రయత్నించిరి. అంతలో యుద్ధదేవత అడ్డుపడింది.

సోదరులారా! పగహస్తగతంబగుట చేతనేమి, క్రిమిభక్ష్యంబుననేమి, అగ్నిదగ్ధంబుననేమి అంతరించగానున్న వాటినైన తాళపత్రాది గ్రంధంబులకూడ సేకరించి సంరక్షించి భాండాగారంబులు నింపి మాతృభాషాపోషాకులై యభివృద్ధిఁగాంచుడు. ఈ గ్ర౦థాలయాభి వృద్ధియే మనకామ్యార్థముల నొసంగునది. గ్రంథాలయాభివృద్ధియే మనకు ఐహికాముష్మిక సాధనము, సౌఖ్యప్రదము. ఇంగ్లాండు, జర్మనీ మొదలగు దేశములందు గ్రంథాలయంబులేని గ్రామంబులేదని చెప్పియుంటిని. సంవత్సరమునకు వేలకొలంది గ్రంథుబులు సంపాదించి కుతూహలు లగుచుందురు ధనికు లెంతయు సాయముచేతురు. ఒక ఆండ్రూకార్నీజీయను ధనికుడు యెన్నియో పుస్తకభాండాగారంబులు నిల్ని ప్రోత్సాహపరచెను. అక్కడ ధనికుల ప్రోత్సాహము మెండు. పాశ్చాత్య దేశంబున ౪౫౦౦౦౦౦ జనాభాగల యొక్క చిన్న రాజ్యమగు ఆస్ట్రేలియాయందే ౧౫౦౦౦ గలవు. రెండువందల లక్షలజనాభాగల మన ఆంధ్రశదేంబున నెన్ని యున్నవో చూచితిరా? సుమారు ౪౫౦ గలవు. మనదేశంబు విద్యాభివృద్ధియందెంత వెనుకపడి యున్నదో చూచితిరిగదా. ఇంతవఱకు ౧౧ జిల్లాలలో గోదావరీ మండలమందే ౧౬,౫౨,౮౫౯ జనాభాగలిగియుండి సుమారు ౧౦౦ గ్రంథాలయంబు లున్నందుకు మనము సంతసింప వలసినదే. సోదరులారా! ఇంతమాత్రంబున గర్వింపవలదు. ఈ గ్రంథాలయోద్యమముయొక్క ఫలితంబు మహాత్కృష్టత మనయాంధ్రదేశంబునకేగాక భారతవర్షంబున కంతకు గూడమార్గదర్శి యగునట్లు జేయుదురు గాక. గ్రంథాలయంబులందుండు కార్యదర్శులు శాంతచిత్తులుగాను, విద్యావంతులుగాను, జనాకర్షణపరులుగాను, సుగుణవంతులుగాను, ఉండవలయును. ఇట్టి నుగుణములు గలిగియుండిన గ్రంథాలయంబులు సర్వజనాదరణీయంబులై దినదిన ప్రవర్థమానంబులై తేజరిల్లు.

అగ్రాసనాధిపతులగు శ్రీప్రభల లక్ష్మీనరసింహం పంతులుగారి ఉపన్యాసము

ఆంధ్రభాషకు పుట్టినిల్లయి, వాఙ్మయమునకు బట్టుకొమ్మయై, వాగనుశాసను కావ్యసంరంభణమునకు కేళిగృహంబై, రాజరాజ నరేంద్రపరిపాలిత రాణ్మహేంద్రపురశోభితమై, నిరంతర శోభాభాసమాన నానావిధసస్యసంభరిత కేదారలక్ష్మీవిలాసపరిశోభితమై, గౌతమీ పుణ్యనదీపవిత్ర జీవనపునీత ప్రజాజీవనరమ్యంబై విద్యలకు సెలవు, సిరులకునిక్క పంటలకొటారమని ప్రసిద్ధిగాంచిన, యీగోదావరీ మండలమున నేసభనైన నాధిపత్యము వహించుట పున్నెములపంటయనుటయం దించుకయు సందియము లేదు. వర్తమానమున నాంధ్రభోజుండని యనన్యసామాన్యకీతి౯నిగాంచిన శ్రీరాజా శ్రీ వేంకటకుమారమహీపతి సూర్యారావు బహద్దరు శ్రీపీఠికాపురాధీశ్వరాధిష్ఠితమండలమున సభినవగ్రంథాలయోద్యమ పటు కార్యనిర్వహణ దీక్షితులగు శ్రీ చెలికాని ధర్మారాయ తత్సోదరనివాసంబగు నీ చిత్రాడనగరమున నీవిద్వజ్జనాకీర్ణంబగు నిమ్మహాసభ నధ్యక్షపదవిని నెలకొల్పబడుట యెట్టిభాగ్యోదయమని యెన్నదగును? ఇట్టి మహార్హపదము తుదకలభ్యయ్యోమున నాబోటి పామ రుని పాల్పడెననిమాత్ర మించుక మనమెఱియుచున్నది. ఎల్లచదువులు తుదిచూచిన పండితవర్యులును, వింతకబ్బములచే వెన్నెలలబఱపి తల్లిబాస దెల్వినొందజేసి క్రొతలగు తేనెసోనల కెనయగు మృదుమధురఫణతుల నమృతంపువానల గుఱియుచు వాఙ్మయమండలమున నిండువెలుంగుతో వెల్గు కవిచంద్రులును, దేశసేవానిరతులయి నిజదారనుతోదరపోషణార్థముగాక దైవదత్త మగు నుత్త మజీవితమును మానవ సేవకై ధారవోసిన మహోదారహృదయులును బెక్కులుండ ననుబోటి యలతిని నిరంతర కుక్షింభరవ్యాపారపారీణు, విస్మృత మాతృదేవతావాద్ధురీణు, వాదప్రతివాదఖండననిలుంఠనక్రియాసంప్లవు నేల యిట్టి యత్తమపదమునబెట్ట నా మిత్రులమితానుకంపదృష్టితో సమకట్టిరో తెలియరాకున్నది. ఎట్టులయిన నిప్పట్టున నీమండలసభా మండలాధిపత్యమునపట్టభద్రుఁడనైతిని, కాని ముందుకార్యంబెట్లు? అగ్రాసనాధిపుని యారంభోపన్యాసమను గంభీరశీర్షిక వాక్స్తంభనము గావించుచున్నది. నా భాగ్యవశమున నీవిధముననే గతవత్సరమున గంజాముమండలమున గ్రంథాలయ సభాధిపత్యము వహించితిని. మన్నివాసమగు విశాఖపురమున నాంధ్రసారస్వతసభాహ్వాన సంఘాధ్యక్షుత్వమున బ్రతిష్ఠింపఁబడితిని నాయల్పకోళము సంగల వాగ్గుంభనమృతయు సంతరించిపోయినది. నా మిత్రులగు గ్రంథాలయసర్వస్వనిర్వాహకులు దానినంతయు ముద్రించి ప్రకృతమందు నాభాసాదారిద్ర్యమును ద్విగుణీకృతము గావించిరి. నేనెటులు యీ కార్యక్రమమున బ్రధమసోపానము నారోహణముచేసి కృతకృత్యుడ నయ్యెదనని యెంచుచుంటిని. తమ కరుణయే శరణముగాగల నాకు వేఱో౦డు భయములేదు. నాయిక్కట్టులకు దోడు నామిత్రులు రెండు గడియలయిన దడయకుండ పనికి గడగువెఱవు నాలోచించి ముందడుగిడబ్రేరించిరి. కానిండు విషయము గ్రంథాలయములు, వినువారలు విద్వాంసులు, కాలము సంక్షేపము, గ్రంథవిస్తర మప్రశస్తము. తమ సాన్నిధ్యమున నించుకోనియు తమ తేజము నామనఃఫలకమున బ్రతిఫలించునేని నేనీకార్యము నెరవేర్పగలనను ధైర్యముతో సాహనించితిని.

సమర విజయము

కలియుగుకురుక్షేత్రమున ఘోరసంగ్రామము పరిసమాప్తిగాంచినది. మిత్రమండలివారి యుదారాశరుములు, దుర్ణేయపరాక్రమము విజయము గాంచినవి. పంచము శాంతిభూయిష్ఠమై సద్యోజాతసాంఘిక శక్తుల నభినవమార్గముల ప్రసరింపఁణేసి ప్రపంచ నాగరికతా ఘనర్నిర్మాణమునకు యత్నములు సలుపబడుచున్నవి. అదృష్టశ్రుతపూర్వరుగు నీ సంగ్రామచారిత్రము మహాభారత రూపమున నభివణి౯౦పగల యభినవవ్యానుండు బయలు దేరినచో భారతవష౯పర్వముందు దొడ్డరియై విరాజిల్లగలదను నానందము మన డెందముల నిండియున్నది. జర్మనీ దోర్మదరూపరుగు నధర్మము నశించినది. ప్రాపంచిక రాజ్యాంగతత్వనిర్ణేతయగు విల్సనునేత మూలనూత్రముల నిర్వచనము చేసియున్నాడు. “స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంకు న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః | గోబ్రాహ్మణేభ్యః శుభమస్తునిత్యం లోకాస్సమస్తా స్సుఖినోభవంతు" అని గ్రంధపఠనానంతరమున నిత్యము వి. ప్రాశీర్వాదము వినబడుచునేయుండును. దీని భావమిప్పుడు తేటపడుచున్నది. “దైవీ స్వస్తిగస్తునః !స్వస్తిర్మానుషేభ్యః | ఊర్ధ్వంజి గాతు భేషజం | శంనోఅస్తుద్విపదే । శంచతుష్పదే । ఓంశాన్తిశ్శాస్తశ్శాన్తిః॥ అని నిత్యమును పురుషసూక్తపారాయణము గావింప బడుచున్నది. అయినను భగవంతుని కరుణ మనయెడ పూణ౯ముగా రాకున్నది. రాజకీయవాతావరణము కాలజీమూతపటల చ్ఛన్నమై యున్నది. అయిన తుది నమృతము వషి౯౦చుగాక!

విద్యావ్యాప్తి

సంగ్రామానుభవము వలన పెక్కులగు నూతన విషయములు గ్రాహ్యములయినవి. ముఖ్యముగ విద్యాదానశ్రమ పద్ధతులు విమర్శలోనికి వచ్చినవి. పాశ్చాత్య విద్యయు శాస్త్రము నింతవఱకు మతవిదూరములై కేవల మైహికతంత్రప్రావీణ్యజనకములయి యుండెను. అందువలన సర్వోత్కృష్టమగు శాస్త్రముకూడ పరహింసా సాధనమయినది. ధర్మగ్లాని సంభవించినది. మఱియు యువకులందఱును నూతన యుగమున భావిపౌరత్వకార్యనిర్వహణమునకు దగిన శారీరక మానసిక సిద్ధులన్నియు తృతీయ గోదావరిమండల గ్రంథాలయసభ. డని వా నుచిత రీతిని బడయుటకు వలయు విద్యాపద్ధతులు నిణీ౯తము లగుచున్నవి. దేహమాత్మకర్మక్షమమై యుండ వలయును. విద్య యైహిక పారలౌకికజ్ఞానప్రదమై యుండవలెను. అప్పుడే నిజమగు నాత్మస్వారాజ్యస్వాతంత్య్రము పురుషునకు లభించును. ఇదియే యుపనిషదగ్ధముకూడ.

గ్ర౦థాలయములు

ఇట్టి విద్యావ్యాపనమునందు గ్రంథాలయములు ముఖ్యసాహాయ్యములు. పండితున కుత్తమగ్రంథములకంటె వెఱో౦డు ధనములేదు. అపరిగ్రహులగు సన్యాసులకు గూడ గ్రంధములే ధనముగా నెంచి తద్దోయవిభాగమును గూర్చి విజ్ఞానేశ్వరయోగీ సూత్రము లేర్పఱచి నాఁడు. నిరతిశయమగు సర్వప్రాపంచిక సౌందర్యసారము నోక్కచోఁ బేర్కొనవలసినచో కాకుంతలమును స్మరింపజనునని జర్మనుకవి యుగ్గడించి యుండెను. ఒక్క గ్రంథరాజముయొక్క మహాత్మ్యమట్టిదియగునెడ నద్భుతగ్రంథరత్న భాండాగారమగు గ్రంథాల యమహిమ పెట్టువర్ణింపనగును. పూర్వకాలమునుండియు గ్రంథప్రశస్తి మనదేశమున గ్రహింపబడి సుప్రసిద్ధ రాజ్యస్థానములయందును నవద్వీపాది విద్యానిలయముల యందును మఠములయంగును దేవళములయందును పండితగృహముల ముందును గ్రంథములు పెక్కులు సంగ్రహింపబడుచుండెను. కాశ్మీరదేశమున శ్రీనగరమున సరస్వతీపీఠమని ప్రశస్తిగాంచినది. యచ్చటి గ్రంథరాజములును విద్వచ్ఛేణియునై యున్నవి. మద్ధారకులుకూడ దూరాధ్వములు నడచి యచ్చటికేగి విజయముగాంచి తమ గ్రంథములనిచ్చి మతవ్యాపనదీక్ష వహించియుండిరి; గ్రథాలయముల యాకర్షణశక్తి యట్టిది. వారణాసి క్షేత్రముకూడ వట్టిదే. బౌద్ధమతప్రచారముగల కాలమున బౌద్ధవిహారములయందెన్నియో యుత్తమగ్రంథము లుండియుండెను. మతములు క్షీణదశకు వచ్చి రాజ్యము పరహస్త గతంబైన బిదప బ్రజలయం దుదరభరణమే కష్టమగుటను విద్యావ్యాసంగము గ్రంధసంపాదనాసక్తియు తగ్గిపోయి యుండుటను గ్రంథము లనేకములు ఖిలమయినవి. భారత భరతఖనియం దమూల్యరత్నములగు గ్రంథరాజములు కొన్ని విదేశరాజ్య గతములయినవి. సంధివిషయమున భరతఖండమునుండి జర్మనుచోరులవలన గొంపోబడిన గ్రంథరత్నముల దేఱిగి మన దేశమున కర్పింపబడునటుల గోరుడని వాక్రుచ్చిన హిందూమహా సభాధ్యక్షుకోపన్యాసము మనసంత్రాసమును వెలిబుచ్చుచున్నది.

గ్రంథాలయోద్యమము

పూర్వగ్రంథాలయచారిత్ర మెటులుండ నవీనగ్రంథాలయవిజృంభణ మించుక యాలోచింతము. పాశ్చాత్యదేశములయం దీయద్యమము బాగుగ వాడుకొని ప్రభుత్వములవలనను విశ్వవిద్యాలయములు మున్నగు ప్రతిస్థాపనముల వలనను బోషింపబడుచున్న యంశము తమకందఱకును విదితంబయి యున్నది. పుస్తక సామగ్రియు విజ్ఞానమును విచ్చలవిడిగా ప్రజలకందఱకును సులభ్యములగు నటులు దగుయత్నములు జేయబడుచుండును. దివ్యభవనములు పుస్తకాలయములుగ నిర్మింపబడియున్నవి. ఉచితముగను అల్పములగు చందాలవలనను సమూల్యములగు పుస్తకముల ప్రజలు జదివి జ్ఞానాభివృద్ధి చేసుకొనుసాధనములు పాశ్చాత్యదేశములదేశములయందు గలవు. స్త్రీలకును పురుషులకును నీరూపమున విద్యాగ్రహణము సులభసాధ్యమై యున్నది. లక్షల కొలది ద్రవ్యము వెచ్చింపబడును. చదువరుల నాకర్షింపదగు నానావిధ సౌకర్యములుగూర్ప బడును. పుస్తకములలోని సారమున కనురూపముగ బాహ్యాలంకారములు, చిత్రముద్రణము, సొగసైనయట్టలు మొదలగు నెన్నియో యలంక్రియ లోనగూర్ప బడును. మఱియు పుస్తకము లసంఖ్యాకములగుటచే సెక్కుచోట్ల పుస్తక వివరణపట్టికాక్రమమే యొకళాస్త్రముగా సభ్యసింపబడు చున్నది. ఆమెరికా దేశము సన్ని విధముల నీయుద్యమ ముత్కృష్టదశయందున్నది. మనదేశమున బరోడా సంస్థానమునందు శాస్త్రసంశోధిత పద్ధతుల నీయుద్యమము వ్యాప్తజెందునటుల జేయబడు చున్నది. మనయాంధ్రదేశమున ముఖ్యముగ నామిత్రులగు శ్రీయుత అయ్యంకి వెంకటరమణయ్య పంతులు, శ్రీయుత నూరి నరసింహశాస్త్రిగార్లచే నీయుద్యమము వ్యాప్తము కాబడినది. వారిభాషాభిమానము దేశసేవారతియు సంస్తవనీయములు. ఉద్యమ మారంభమనయిది మొదలు, సర్వంకషముగ నాంధ్రలోకమునం దంతటను కోనలు సాగినది అభినవదీప్తితో విరాజిల్లుచున్నది. ఇతర దేశములకు మాగ౯ ప్రదర్శకమగుచున్నది. ఈసంవత్సరమున రాబోవు నాంధ్ర దేశగ్రంథాలయ మహాసభతో గూడ అఖిలభారతదేశీయ గ్రంథాలయ మహాసభ కావింపబడుటకు బ్రయత్నములు సలుపబడుచుండుట హృదయానంద దాయకముగా నున్నది. ఇదియే యీ యుద్యనుముయొక్క జీవశక్తికిని, ముఖ్యతిత్వమునకు దృష్టాంతమై యున్నది. ఆంధ్రజీవితమును విద్యావాసనాయుతముగ జేసి యన్ని విధముల నైసర్గిక తేజముతో బ్రజ్వరిల్లఁ జేయసమకట్టిన దీయుద్యమమే కావున ఆంధ్రోద్యమమున కుపాంగములగు నుముద్యమములలో నిది ప్రాముఖ్యమును గాంచినది.

గ్రంథాలయములు, వాని కార్యములు.

సరస్వతీనిలయములగు గ్రంథాలయము లూరూరను బ్రబలుచున్నవి. మండలములు ముఖ్యపట్టణములయందుత్తమ గ్రంథాలయములు వెలయుచున్నవి. ఆంధ్రదేశమున కేంద్ర గ్రంథాలయములనుగూర్చి సత్ప్రయత్నములు సాగుచున్నవి వాగ్దేవి నిజపద మంజీరమంజుల ధ్వనులతో గ్రంథాలయసీమల నాట్యమాడుచున్నది. చదువరుల వాఙ్మందిరమున శాశ్వత వసతిని గొనయత్నించుచున్నది. పదా వాక్కున నివసించు నధిష్ఠానదేవత కావునమన పెద్దలు శారదాదేవికి లక్ష్మీ పార్వతులకు బోలె దేవళములు నిర్మింపరైరి. వాక్సుమములచేతను భవ్యభావా తగంగవిధులచేతను నిత్యము పూజింపఁబడుచున్నది. అటులు పాసింపబడిని వాగ్దేవి సంప్రీతురాలై యభీష్టము లనొసంగుగాని వేఱండువిధమున కరుణాపాంగదృష్టిని బ్రసాదింప నేరదు. “నారాయణం నమస్కృత్య నరం చైవనవోత్తమమ్ | జీవీం సరస్వతీం వాప్తస్తతో జయ ముదీర యేత్” అని మహాభారతముఖమున వ్రాయబడియున్నది. జనప్రబోధముకోఱ కత్యంత దయాశాలినియగు సరస్వతీ దేవివలన నా విష్ణుడయి గ్రంధరచనమునకు వ్యాసుండు ఆదికవి వాల్మీకికూడ బ్రహ్మవలన “మచ్ఛిం దాదేవ తేబ్రహ్మ౯ ప్రవృత్తేయం సరస్వతీ” యనియాదేశింపబడి యాది కావ్యరచనకు దొడఁగెను. ఆటులు సరస్వతీ ప్రేరణమున రచింపబడిన గ్రంథములు దక్కవేఱండు శాశ్వతకీతి౯ని గాంచనేరవు. సరస్వతీ భూషణములగు నుత్తమగ్రంథముల గ్రంథాలయములు సమకూర్చి భద్రపరచుచున్నవి. లేనియెడ మాఱు మూలల మాటుమడిగి కొన్నియు, క్రిమికీటకముల పాలయి కొన్నియు, మఱియు నితరవిధముల నశించిపోవును. గ్రంథాలయోద్యమము వెలువడిన కొలదికాలములోపల నెన్నియుత్తమగ్రంధములు తాళపత్ర సంచికల సంపుటములుగా నొనర్పబడినవి బయటికి వచ్చినవి! నా మావశిష్టములగునవి యెన్నియో ప్రత్యేక్షానందము గలుగ జేయుచున్నవి. ఈవిషయమున చిత్రాడ నెలకొల్పబడిన శ్రీరామవిలాసగ్రంధాలయ సభ్యులయొక్కయు శ్రీ చెలికాని ధర్మారావు గారి యొక్కయు వారిసోదర వగ౯ముయొక్కయు ప్రయత్నములును, ఉత్సాహములును శ్లాఘాపాత్రములు, గ్రంథాలయోద్యమము వెలుపడక పూర్వమునుండియు శ్రీవీరేశలింగపుస్తక భాండాగారాద్యుత్తమపుస్తకాలయముల నెలకొల్పి స్త్రీ పురుషులకు విద్యాదాన మొనరించుచున్న యీ గోదావరీ మండలవాస్తవ్యుల కంతగా వీనియుపయోగములగూర్చి చర్చించుట యనవసరమును సూర్యునకు కరదీపికను గను పరచినయట్లు వృథాప్రయాసమును అగును. గ్రంథాలయములు పైని వివరించినవిధమున గ్రంధసంగ్రహణము సంరక్షణమునుమాత్రము నిర్వతించుచుంటయేగాక గ్రంథరచనకు దోడ్పడుచుండుటయు మఱియు సభ్యులు వివిధకళాయుక్తులుగను జ్ఞానసంపన్నులుగను జేయటకు యత్నించుచుండుట కడు సమంజసమయి యున్నది. కావుననే యీ యుద్యమము సర్వంకషమయి యాంధ్ర లోకమున కుపకృతి నొనర్చుచున్నది.

గ్రంథ రచనము.

ఈ విషయమున నాయభిప్రాయములు వేఱుస్థలముల వ్యక్తపరచియుండుటచే పునరుక్తి కాకుండ కొలఁదియంశములనుమాత్రము విశదీకరించి విరమించెదను. గ్రంథరచనకు కారణభూతము సరస్వతీ ప్రేరణమని యిదివఱకే నుడివియుంటిని. ఆలంకారికవచనము లటుండ కావ్యమునకు ప్రయోజనము ముఖ్యము. కవి యొక యుత్తమ సందేళ హరుండయి యుండవలెను. కవి హృదయమా యుత్తమసందేశ ప్రపూర్ణమయి పొంగి పొరలి కావ్యస్వరూపయరీ వేగమున ప్రవహించును. అట్టిసందేశ మాయా దేశకాలపరిస్థితులనను సరించి యుండును. లోకోత్తరవర్ణ రస నములచే సామాన్యవిషయములు గూడ వినూత్నభావద్యోతకములుగా సత్కవీంద్రుడు ప్రదర్శించు చుండును. ప్రకృతిలీనమగు భగవత్తత్వము కవికన్నులయెదుట గట్టబడి యుండును. కవి తన మనోభావములు చదువరు హృదయవీధుల బ్రవతి౯౦పచేసి యంతరింద్రియమోదము గూర్చుచుండును. ఉత్తమకావ్య మీవిధమున ముప్పతిలజేసి విమలానంద మొనగూర్చుచుండును. శబ్దములందలి నిగూఢమాధురిని మధించి యమృతస్వరూపమున శ్రోతల శ్రవణపుటములు జొనిపి యంతర్నా డీ తంత్రుల తదనురూపముగా నవ్యగావామృతము వెలువడువటుల జేసి నిరతిశయముఖమున నోలలాడించు చుండును. కుశలవులవలన రామాయణమును విని మునులీతీరున నానందించినదా ప్రశంసించిరీవిధమున “ఆహో గీతస్య మాధుర్యం శ్లోకానాంతు విశేషతః |చిరనిర్వృత్త మస్యేతత్ ప్రత్యక్షమివ దర్శితమ్ " ఇట్టి కావ్యము లన్ని భాషలయందును మహాకవులవలన రచింపబడి యున్నవి. భారతవష౯మున ప్రస్తుతమందు భారత జాతీయతత్వము నిజహృదయమున ప్రతిఫలించుచుండ దివ్యతేజః ప్రభాదీపితుండయి శ్రీయుత రవీంద్రనాధ ఠాకూరును కవిచంద్రుఁడు భారతసందేశము నేవిధమున కావ్యరూపమున రచించుచున్నవాడు! ఆయన కవిత్వము ప్రపంణమునం దంతట ప్రశస్తిగాంచినది. రవీంద్రుని వ౦టి కవీంద్రుఁ డాంధ్రమునగూడె వెలయుగాక! అందాక గ్రంథాలయములు రవీంద్రుని కావ్యములసారమును నాంధ్రజనులు గ్రోలునటుల సౌకర్యము లోనగూర్చు చుండుగాక ! వత౯మానమున నాంధ్రవాఙ్మయమున నాంధ్రతత్వము ప్రతిఫలించుచు విశాసము గాంచుచున్నయది. కాని యింకను అభినవ సంశోభచే దివ్య తేజముతో తేజరిల్ల దగియున్నది. ఆంధ్ర సరస్వతి యింతదనుక కావ్యక్రీడలచే శైశవావస్థయందు క్రీడించు చున్నది. నాట్యరంగమున నూతనపద విన్యాసము లభ్యనించుచున్నది. భావగాంభీర్యమును వెలిబుచ్చుచున్నది. శాస్త్రమర్యాదల కొలదిగ నభ్యసించుచున్నది. బాహ్య దృష్టిచే బ్రకృతి సౌందర్యమును దిలకించి వర్ణనాతిశయమున భావోద్రేకమును జెందుచున్నది. కాని యాదిభౌతికమగు సంపదను గాని భావప్రపంచమున సంతరింద్రియ గోచరమై నిరతిశయానంద సంధాయకమగు ప్రకృతి స్వభావమునుగాని గ్రహించినటుల గానరాదు. కావుననే సావయవరూప భూతసృష్టి యందలి నిరుపమ సౌందర్యజాలము చక్కగ నభిరణి౯౦పబడుచున్నది. కాని నిరవ యవమును నాక్ష్మైకవేద్యమును నిగూఢమునగు భావతత్వమును బాగుగ గ్రహించినగాని యుత్తమసందేశము కవి మనోవీథి శబ్దబ్రహ్మ స్వరూపమయి నాదముచేయు చుండుట యరిది, కవి త్రికాలజ్ఞుడు లోకజ్ఞుడు, "నా ఋషిః కురుతే కావ్యమ్" అని పెద్దలు నుడువుదురు “కంఠమందున నోంకారఘంటమొఱయ | జైలగుగావుత మన్మనః క్షేత్రసీమఁ గవికుటుంబంబుపొలిటి దివిజ సురభి జలజ సంభవుబోటి భాషావధూటి" యనిభావ గర్భితముగా శ్రీనాధుఁడు సరస్వతీ స్తవమును జేసి యున్నాడు ఆంగ్లమున నుత్తమసందేశ ద్యోతకములగు కావ్యములు మెండుగలవు. శబ్దనిగూఢమాధురీవిలసితములగు కావ్యజాలములు సారస్వతము నలంకరించుచున్నవి. ఆంగ్లకవిత్వమును మాతృకగా నిడుకొని యాధునికులలో శబ్దాధ౯గౌరవముల ససమానపాండితీమహిమగల టెన్నిస౯ (Tennison) స్విన్ బర్న్ (Swinburen) మున్నగు కవీశ్వరుల కవనచాతురులను గ్రహించి కావ్యములు రచించుచో నాంధ్రవాఙ్మయాభివృద్ధి గలుగువి నాయోజనయై యున్నది. రవీంద్రుని గ్రంథము లవశ్యము పఠనీయములని యిదివరకే నుడివియుంటిని. అభినవకవి సార్వభౌము లీవిషయమును గుతి౯తురుగాక ! అనుకరణిపద్ధతి యప్రశస్తమయినను నారంభదశయందనివార్యము. ఉత్తమాచరణాను సరణమున వివేకము జనించి భావోదయము గలుగును,

శాస్త్రములు - కళలు

వత౯మానమం దాంధ్రవాఙ్మయవాహినియం దన్నివిధముల గ్రంఢజాలములు ప్రవహించుచున్నవి. సల్వలోదకమయిన పవిత్ర గౌతమీ ప్రవాహమున గలసి పునీతమైనభంగిని యాంధ్రత్వమును ప్రతిఫలించుచు నాంధ్రసందేశమును ప్రకటీకృతము గావించుచున్నందున సన్ని గ్రంథములు నాదరణీయములగుచున్నవి. ఉత్తమ విమర్శగ్రంధములును భాషాచారిత్రమును వాఙ్మయ వారిత్రమును యింకను వెడలవలసియున్నవి. అభినవాంధ్ర కవితాపితామహులగు రాయబహద్దరు కందుకూరి వీరేశ లింగము పంతులుగారు కవిజీవితముల వ్రాసిరి, సారస్వతచరిత్రమునుగూడ వ్రాసి యాంధ్రలోకము నుద్ధరింతురుగాక! కాని దేశ పరిస్థితులనుబట్టి శాస్త్రగ్రంథఋలు కళలను బోధించుగ్ర౦థములు విస్తరిల్లవలసియున్నవి. వీనికి దిగుపదసామగ్రికూడ మనభాషలో లేదు. అన్యభాషా పరిచయమునగాని శాస్త్రసంబంధములగు భావములు వామములు సువ్యక్తములుగు నాంధ్రమున బలుకబడ నేేరవు. దేశభాషలలో గొన్నిట యీకోఱ౦త కొంతవఱకు దీర్చుకొనబడుచున్నది. అఖిలభారతపండిత సమ్మేశమునగాని సర్వజనసమాదరణీ యములగు పదములు నిర్ణయింపబడుటకు వీలుకాదు. అట్టిపనికయి పండితులు గడిగుదురు గాక! ఆంధ్ర నిఘంటువునందయిన కొంత యత్నము సలుపబడునని యోచించుచున్నారము. గ్రంథాలయము లన్నివిధముల శాస్త్రములు కళలు వృద్ధిజెందు నుపాయము అన్వేషింప కృషి సల్పుచుండుట నీయంశ మిచ్చట జర్చించితిని.

ఉపసంహారము

సావధానచిత్తులై యాదర భావముతో సోదరప్రీతితో నానుడువులు నింతగఱకు వాలించిన తమకు పునఃవందనము లాచరించు చున్నాడను. భారతవపమున నాంధ్రమాతకు బుత్రులమై జనించిన మనభాగ్యమునకు పరాత్పరుని గొనియూడుచుంటిమి. సకలజాత్యభీష్టసంధాతయుగు గజన్నిర్మాత మనహృదయముల నాత్మావబోధమగు శుద్ధాంధ్రతత్వప్రకాశమును నెలకొల్పియున్నాడు. అఖిలభారతజాతీయతత్వమున నాంధ్రవ్యక్తిప్రత్యక్తత్వవిధానమున నిమిడియున్నది కాని భిన్నముకాదు. ఆంధ్రజాతీయతత్వ విస్ఫురణమునకు మూలాధారరూపమగు నీ గ్రంథాలయోద్యమమును పరాత్పరుఁ డను గ్రహించి సంపూణ౯సంపదల తోదులదూగ జేయుగాత!! తదుద్యమనాయకులు చిరాయురున్నతుల విలసిల్లుదురు గాత !!



This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse