Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 5/బాలభటుని తరిబీతు

వికీసోర్స్ నుండి

బాలభటుని తరిబీతు

౧ భటత్వమన నేమి?

నీవు బాలభటుడవు అగుటకు పూర్వము బాలభటత్వమన నేమియో తెలిసికొనగోరెదవు అది మనోహరమైన ఆట. బాలునియందు గర్భితమైయున్న మంచినంతను వికసింపజేయు తరిబీతును అది నీకొసంగును. నిన్నది పౌరుషమంతునిగను, పరోపకారిగాను, స్వశక్తి మీదనే ఆధార పడియుండువానిగను వేయేల సన్మార్గుడగు పౌరునిగను తరిబీతు చేయును. సైన్యమునందు ధైర్యమునకును ఓర్మికిని సూక్ష్మబుద్ధికిని పరిశీలనాశక్తికిని వన్నెకెక్కిన వానినేరి వార్తానిర్వహణమునకై పంపెదరు; ఆతడు ముందుపోయి శత్రువు యొక్క జాడ లు కనుగొని, వారికి చిక్కుబడకుండ, తన సేనానాయకునికి తెలియ జేయవలయును. అట్లు జాడలు తీయునపుడు అతడు శత్రువులకు పట్టుబడవచ్చును; మృతినొందవచ్చును; కాని ఆతడు లక్ష్యముజేయడు. ఎందుచేత? ఆతడు తనపక్షమునకై పనిచేయుచున్నాడు గాని స్వార్థమునకు గాదు. సైన్య సంబంధము లేని మన భటత్వమునకుగూడ, వాని నలవరచు కొనుచుంటినను స్పృహలేకుండనే యోగ్యతలన్నిటిని పొందెదవు. ఇదియే నీకు మాతృదేశ సేవానురక్తిని గలిగి౦చును.

మాతృదేశ సేవానురక్తి గలిగినప్పుడు ముందుగా నీవు కొంత తరిబీతు పొందవలసియున్నది. తరిబీతు లేనిదిఏపనినిగాని చక్కగ నిర్వహింపజాలవు. నీవు వీధివెంబడిగాని పొలముల వెంబడిగాని పోవుచుందువు. ఆకస్మికముగా ఒక మనుష్యున కొక గాయముతగిలి భయంకరముగ రక్తము కారుచుండును అప్పుడు నీవేమి చేసెదవు? రక్తము కారకుండ వెంటనే కట్టు కట్టకపోయిన యెడల, నీవు వైద్యుని తీసికొని వచ్చులోపల నే ఆమనుష్యుడు మృతి చెందగలడు. రక్తము కారకుండ కట్టు కట్టుటకు "ప్రాధమిక చికిత్స”ను నేర్చుకొని యుండవలయును. నదియందుగాని, కాలువయందుగాని, చెరువునందుగాని ఒక మనిషి మునిగి పోవుచుండును; నీకు ఈత వచ్చియుంకుటయేగాక రక్షణోపాయములను గూడ తెలిసికొని యుండని యెడల వానిని ఎట్లు బ్రతికించెదవు? ఒక మనుష్యుడు తాను పోవలసిన దారి తెలియక అల్లాడుచుండును. నీకాదారి తెలిసియుండక పోయిన యెడల, ఆతని కెట్లు చూపింపగలవు ? నీ ఇరుగు పొరుగునందు అగ్ని ఆపద సంభవించును. అగ్నికాహుతియగుచున్న గృహము లోపలనున్న మనుష్యులను రక్షించుటకును అగ్ని ఇతర గృహములకు వ్యాపింపకుండుటకును నీవేమి జేసెదవు? పరదలు వచ్చి గ్రామములు కొట్టు కొనిపోవునపుడు, సాంక్రామిక వ్యాధులు విరివిగ వ్యాపించునపుడు, నీవు వారి కేవిధముగ సహాయభూతుడ వయ్యెదవు?

ఉపన్యాస వేదికల నెక్కి గంభీరోపన్యాసములనిచ్చి మాతృదేశ సేవను చేసినామనుకొనుటకంటె, పైన చెప్పిన ఆపదలయందు నీదేశీయులకు సహాయపడుటయే మాతృదేశమునకు ఎక్కువ సేవజేయుట. అట్లు సేవ జేయు తబీతును పొందియుండని యెడల నీవు వట్టి నిరర్థకుడవు; కాబట్టి భటత్వమునందు ఈ విషయములనేగాక, ఇంతకన్న మహత్తరమైన యంశములనుగూడ నీవు నేర్చుకొనెదవు.

౨ భటుడగుట ఎట్లు?

గ్రామమందుగాని, పట్టణమునకుగాని బాలభట “పటాలము” గాని “జట్ట ”గాని ఉండిన యెడల, ఈపొత్తము చివరనున్న “ఫారము” నందు మొదటి భాగమును నీవు పూర్తిజేసి, రెండవ భాగమును (నీవు ౧౮ సం. వయస్సునకు లోబడి యుండిన యెడల) నీ సంరక్షకునిచే పూర్తి జేయించి, బాలభటోపాధ్యాయుని చేతికీయుము. అట్టి “పటాలము” గాని “జట్టు”గాని; లేని యెడల, నీవే జట్టు నొకదానిని ఏర్పరచుకొనవచ్చును. “జట్టునందు నలుగురు మొదలు ఏడుగురువరకు ఉండవచ్చును. నీవు చేయదలచిన కార్యమును గురించి కొందరు స్నేహితుల జెప్పుము. అట్లు చెప్పి ఒక “జట్టు”ను ఏర్పరచి, జట్టు పెద్దను ఎన్నుకొని, “భారతవర్ష బాలభట సంఘము, బెజవాడ” కు వ్రాయుము. వారు నీకు తగిన సలహా నొసంగెదరు. నీవు “పటాల” మందుగాని, "జట్టు" నందు గాని సభ్యుడవు అగుటకుముందు ప్రాధమిక శక్షయందు ఉత్తీర్ణుడవు కావలయును. ప్రాధమిక శిక్షావిధాన మంతయు ఈ పొత్తమందు గాననగును. పిమ్మట, భటుని ప్రతిజ్ఞను గైకొందువు; అంతట భటసోదర బృందమునందు నీఒక సభ్యుడవగుదువు. అప్పటినుండియు నీవు బాలభట చిహ్నమును ఒకే విధమగు దుస్తులను ధరించి, భటుని సంజ్ఞలను ఉపయోగింపవచ్చును.

3 భటుని ప్రతిజ్ఞ

౧ దేవునకును, రాజునకును, దేశమునకును నావిధ్యుక్తధర్మమును చేయుట నా ప్రధమ ప్రతిజ్ఞ.

౨ అన్ని వేళలయందు అందరికిని తోడ్పాడుట నాద్వితీయ ప్రతిజ్ఞ.

3 బాలభట శాసనమును నిర్వివాదముగ సిరసావహించుట నాతృతీయ ప్రతిజ్ఞ.

నేను నా గౌరవముమీద ఈ ప్రతిజ్ఞలను దీసికొనుచున్నాను.

ఈ ప్రతిజ్ఞలను చేసి, బాలభట దీక్షనుగైకొనుట మహా పవిత్రవంతమైన కార్యము. మానవునకు గౌరవముకంటె ఘనమగు విషయము లేదు. ద్రవ్యముపోయిన, ఇండ్లుపోయిన, పొలములు పోయిన మరల సంపాదించు కొనవచ్చును. కాని గౌరవముపోయిన మరల లభ్యముగాదు. అట్టి మహత్తరమైన “గౌరవము” మీద ఈ ప్రతిజ్ఞు గైకొనుచున్నావు. కావున నీశక్తియుక్తుల నన్నిటిని వినియోగించి, ఆ ప్రతిజ్ఞకు ఎంత మాత్రము భిన్నము గాకుండునిట్టు వర్తింపవలయును.

కాబట్టి ఈ ప్రతిజ్ఞ యొక్క అర్ధమును నీవు బాగుగా తెలిసికొని యుండవలెను. ప్రతిదినమును ఎవరికైన ఉపకారమును చేయుటవలన నీవు దేవుని సేవించు చున్నావు. ఆయన యొక్క అధికారమును శిరసావహించుట వలనను, ఆయన యొక్క బావుటాకు నమస్క రించుట వలనను శ్రీజార్జి ప్రభువర్యుని సేవించుచున్నావు. నీవు స్వశక్తివలనను, పెద్దల వలనను, తరిబీతును పొందుటవలన సన్మార్గుడగు పౌరుడవై, మాతృదేశమును సేవించుచున్నావు.

దీనినంగీకరించిన, ప్రతిజ్ఞయందు రెండువ భాగమగు ఇతరులకు సహాయము చేయుటను, మూడవ భాగమగు భటుని ధర్మములను దెలిసికొనుటయును సంభవమగును. భటుని దీక్షను సంతృప్తికరముగ నిర్వహించుటయు, ఈ సోదరత్వము యొక్క పవిత్రవంతమగు ప్రతిజ్ఞలను నిలుపుకొనుటయు సులభములగు పనులు గావు. అందుచేత భటుడగుట సులభముగ చేయదగిన కార్యమని తలంపకుము. ఇతరులకు సహాయము చేయవలయునని నీకు హృదయ పూర్వకమైన వాంఛగలదా ? మాతృదేశమును సేవింపవలయునని, నీహృదయము పరితపించుచున్నదా? సేవా వ్రతమునకై నీ కాలమును నీ శక్తిని కొంత వినియోగింప సిద్ధపడియుంటివా? ప్రతిదినము నీవు తప్పకుండ “ఇతరుల కుపకారకరమగు కార్యము” ను ఒక్కదానినైన చేయుటకు తయారుగా నున్నావా? పట్టుదల గలిగియుండి స్థిర సంకల్పమును జేయ సంసిద్ధుడ వేనా? తన ధర్మమును సరిగ నిర్వహించు భటుని జీవితము ఆనందపూరితమై యుండుననుట యధార్ధము. ఏలయన, ఇతరులను సేవించుటయం దాతడు స్వార్ధమును మరచి పోవును. ఒక సారి భటధర్మము నలవరచికొనెనా, ఎప్పుడును దానిని విడువజాలడు. అందుచేత అతని జీవితకాలమంతయు ఆనందప్రదమై వెలుంగును; అట్టివాని దేహము ముసలిదై పోయినప్పటికిని, వాని భటోత్సాహమును, సేవయెడలగల ఆనందమును యౌవనవంతములుగ నిలిచిపోవును.

అయినను నీవు భటుడుగ జేరుటకు ముందు బాగుగా యోచింపుము. ఒక్క విధమగు దుస్తులు వేసికొన వచ్చుననిగాని, ఆటలాడుకొన వచ్చుననిగాని, కులాసాగా తిరుగవచ్చునని గాని ఇందు చేరకుము. ఇందు చేరుటయందు భటుని ప్రతిజ్ఞానిర్వహణమే ఎల్లప్పుడును నీదృక్పధమందు నిలిచియుండవలయును. అనేకమంది చేరి సోమరిపోతులై యుండుటకంటె సరియైనవారు కొద్దిమంది చేరినను మంచిదే.

ఈ షరతులకు నీ వంగీకరించి, చేరదలంచితివేని, సోదరా నీకు సుస్వాగతము !

౪ ప్రాధమిక శిక్ష

మన ప్రతిజ్ఞానిర్వహణమునకు అవసరమగు సామర్ధ్యమును జ్ఞానమును పొందుటకుగావలసిన శిక్షను మన మిక్కడ ప్రారంభించెదము. ప్రాధమిక శిక్ష ఈవిధముగ నుండును. (క) అనుభవమువలన ఈక్రింది ముళ్లను వేయగలిగి యుండుట; ౧ దర్భముడి, ౨ నడి తడపముడి, 3 పల్లెముడి (తడితాడుముడి), ౪ ఏనుగ మెలిక ౫ బ్రహ్మముడి, ౬ పొడుగుది పొట్టిచేయుముడి.

(చ) భటధర్మములను తెలిసికొని అర్ధము చేసికొనుట.

(ట) భటుని రహస్యపు గుర్తుల నెరుంగుట. భటుని నమస్కారమును దెలిసికొనుట. భారతవర్ష బాలభట పతకముయొక్క అర్ధమును తెలిసికొని యుండుట, “యూనియన్ జాక్” అను బావుటాయొక్క రచనాక్రమమును దానిని సరిగా ఎగుర వేయుటను తెలిసికొనుట,

(క) ముళ్ళు (చిత్రపటములను జూడుడు)

౧ దర్భముడి – రెండు తాళ్లనుగాని, ఒక తాడు యొక్క రెండు చివరలనుగాని ముడి వేయటకిది ఉపయోగమగును. ప్రాధమిక చికిత్సయందు కట్టుకట్టునట్టి గుడ్డ యొక్క రెండు చివరలను ముడి వేయుటకు దీనిని వాడెదరు. కండ్లుమూసి యుండిగాని, చేతులు వెనుకవైపు పెట్టుకొనిగాని ఈ ముడిని సరిగ వేయగలిగి యుండవలెను. (ఒకటవ చిత్రపటము a, b లను జూడుడు)
౨ నడితడప ముడి ౼ సమాసమగు లావుగలిగియుండని రెండు తడిలేని త్రాళ్ళను ముడివేయుట కిది ఉపయోగింపబడును (ఒకటవ చిత్రపటములో C. ని జూడుడు) సమానమగు లావుగలిగి యుండని రెండు తడితాళ్ళను ముడి వేయునప్పుడు ఈముడినే రెండు సార్లు వేయుదురు. సురక్షితముగు ముళ్ళలో నిదియొకటి (ఒకటవ చిత్రపటమునందు d ని జూడుడు)
3 పల్లెముడి ౼ తడి త్రాళ్ళనుగాని, రెండు రకముల త్రాళ్ళనుగాని ముడి వేయుటకిది పనికివచ్చును. పల్లెవాండ్రు చేపలు పట్టుటయందు దీనిని ఉపయోగించెదరు. రెండుముళ్ళను
దగ్గరకులాగుటవలన ఇది బిగియును. (ఒకటన పటము నందు(e నిజూడుడు)
౪ పొడుగుది పొట్టిది చేయుముడి ౼ పొడుగు తాడును దానిని కోసి వేయకుండగ నే కావలసినంతనరకు పొట్టిదిగా చేయుటకిది పనికివచ్చును. తాడు యొక్క చివరలను ఉపయోగింపకుండ దీనిని వేయవలెను (ఒకటవ పటము J, 8, 14. లనుజూరుడు)
౫ ఏనుగ మెలిక ౼ కర్రకుగాని చెట్టునకు గాని ఒక తాడుయొక్క చివరకు ముడివేయుటకిది ఉపయోగమగును. ఒక చివరమాత్రము ముడి వేయవలెను. పరంజా కర్రలు కట్టునపుడు, వంతెనలు కట్టునపుడు, కొరడాకు తాడును కట్టునపుడు దీనినే ఉపయోగింతురు. (రెండవ పటమునందు a, b లను జూడుడు.)
౬ బ్రహ్మముడి ౼ ఇది జారిపోని ముడి. జంతువులను కట్టి వేయుటకుగాని, ఎత్తుమీదనున్న మనుష్యులను క్రిందికి దింపుటకుగాని ఇది ఉపయోగమగును. ఒక వైపు మాత్రమే కట్టవలెను. కండ్లుమూసికొని, ఒకభటుడు ఇంకొక భటునిచుట్టును ఈముడిని వేయగలిగి యుండవలెను. (రెండవ పటమునందు c, d లను జూడుడు)

రెండవ పటమునందు e అను గుర్తు వేసి వేరొకముడి కలదు. ప్రతిభటునకును మెడ రుమాలుండును. దానిని ముడి వేసికొను పద్ధతి ఇందు జూపట్టియున్నది. ప్రతిభటుడును తాను ఇతరులకు ఉపకారము చేయవలెనని జ్ఞప్తి యందుంచు కొనుటకై, ఈ రుమాలునకు మామూలుగా వేసికొను ముడిగాక వేరొక దానినిగూడ వేసికొని యుండును.

ఈ ముళ్ళ యొక్క ఉపయోగమును భటును జాగ్రత్తగ తెలిసికొని యుండవలయును. బ్రహ్మముడిని, ఏనుగు మెలికను తాము యొక్క ఒక కొసతో మాత్రమే వేయవలెను. తన చుట్టును, ఇంకొక చుట్టును గూడ భటుడు ఈ ముళ్ళను వేయగలిగి యుండవలెను.

(చ) భటధర్మములు

౧ బాలభటుడు విశ్వాసపాత్రుడు

“నా గౌరవముతోడుగా నేనీ పనిని చేసెదను” అని ఏభటుడైన జెప్పిన, ఆతడా కార్యమును తప్పక నిర్వర్తించునని తలంపవలసినదే. భటుని మర్యాద ఎల్లప్పుడును విశ్వాసపాత్ర మైనదియే. “నా గౌరవము తోడు” అని ఏభటుడైన వాగ్దానము చేసిన అది గొప్ప ఒట్టుతో సమానము. “నీ మర్యాద తోడుగా ఈపనిని చేసెదవని నమ్ముతాను” అని భటోద్యోగీయుడెనరైన భటునితో చెప్పిన తన సమర్థతనంతను వినియోగించి భటుడా ఉత్తరువును పాలింపవలసినదే; ఆ ఉత్తరువును నిర్వర్తించుటయందు ఏయడ్డంకులు కలిగినను లక్ష్యపెట్టగూడదు. అతని గౌరవముదనిూద నమ్మినప్పుడు అబద్ధము చెప్పుట మూలమున గాని, ఉత్తరువును పాలింపకపోవుట మూలమున గాని, భటుడు తన ధర్మమును అతిక్రమించిన యెడల, ఆతనికి అంతకన్న ఎక్కువ అవమానము ఉండబోదు. అట్లు చేసిన ఆతనిని భటోద్యమము నుండి తొలగింప వచ్చును. భటుని ప్రతిజ్ఞా నిర్వహణమునందును, తాను ప్రతిదినమును ఇతరులకు ఉపయోగ కరమైన కార్యము నొక్క దానినైన చేయుటయందును తనకును తన భటసోదర బృందమునకును అవమానమును దెచ్చు ఏ కార్యమునుగాని చేయకపోవుట యందును తన గౌరవము తోడుగా కృషి సలుపవలయును.

౨. భటుడు రాజభక్తిని, దేశ భ క్తిని, మాతాపితలయెడల భక్తిని, తాను సేవజేయువారి యెడల భక్తిని తనకులోబడి యుండు వారియెడల భక్తిని కగిలియుండును.

అనగా, వారికి వ్యతిరేకమగు పనులను ఎంత మాత్రమును చేయగూడదు. వారికి వ్యతి రేకముగ వర్తించునట్టి వారలకును, వారిని గూర్చి అన్యాయముగాను నిర్దయతోను మాట్లాడునట్టి వారలకును నీవు వ్యతి రేకుడవై యుండవలయును. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రలాపములను అపనిందలను కొండెములను చెప్పుటనునీవు అణచి వేయవలయును.

3. భటుడు ఎల్లప్పుడును పరోపకారి.

మిగిలిన వాటికంటే దీనిని నీవు ముందుగ నిర్వర్తింపవలయును. నీ ఆనందమును సౌఖ్యమును నీ క్షేమమునుగూడ లెక్కజేయక ఈ కార్యమునకు గడంగవలయును. ఏదిచేయవలయునో నీకు సందియము తోచినప్పుడు “ఇతరులకు ఏదిఉపకారము?” అని ప్రశ్నించుకొని, దానినే చేయవలయును. ఎవరి ప్రాణమునైన కాపాడుటకుగాని, హానికలిగిన వారికి తోడ్పడుటకుగాని నీ వెల్లప్పుడును సిద్ధపడి యుండవలయును ప్రతిదినమును ఇతరుల కుపయోగకరమగు కార్యమును ఒక్క దానినైన చేయవలయును. అది ఎంత చిన్న కార్యమైనను సరియే ఇతరులకు ఉపకరించునదిగ నుండవలయును. అట్టి ఉపకారము చేసినందులకు నీవు బహుమతిని అంగీకరింపగూడదు.

౪. ఏజాతిమతము వారలయినను ౼ అందరికినిభటుడు స్నేహితుడు; భటవర్గ మాతనికిసోదరులు.

అదివర కెప్పుడును ఎరిగి యుండకపోయిసను నీవు మరియొక భటుని కలిసికొన్నప్పుడు ఆతనికి కావలసిన సహాయమును చేయుటకై నీశక్తిని వినియోగింపవలయును. నీకంటే ఇతరులు బీదవారనిగాని, తక్కువ కులము వారనిగాని తలంచి వారిని నిరసనగా చూడగూడదు. ఇతరులకంటె నీవు భాగ్యవంతుడవని, ఎక్కువ కులము వాడనని విర్రవీగగూడదు. ప్రతివాని యందున్నట్టి మంచినే చూడుము; అంతియ కాని, వానియందున్న చెడుగునుగూర్చి నీవు లక్ష్యము చేయనక్కరలేదు.

౫. భటుడు ఎల్లప్పుడును వినయశీలుడు.

అనగా నీవు అందరియెడలను, అందు ముఖ్యముగా స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, అశక్తులు, వికలాంగుల యెడల వినయమును గలిగియుండవలయును. వారికి సహాయము చేసినందులకుగాని, వినయముగలిగి యున్నందులకు గాని ప్రతిఫలమును దీసికొనగూడదు.

పరాయివారికేగాక, సోదర భటులకును, తలిదండ్రులకును, ఇతర స్నేహితులకునుగూడ వినయము గలిగి యుండవలయును. మోటు మాటలనుగాని అమర్యాదకరమైన మాటలనుగాని ఎన్నడును ఉపయోగింపజనదు. ఎవరైన మోటుమాటల నుపయోగించిన యెడల వారికి మంచిమాటలతోనే ప్రత్యుత్తర మిమ్ము లేదా మాట్లాడక ఊరకుండుము.

౬ భటుడు భూతదయగలవాడు.

జంతువులన్నిటికిని బాధకలుగకుండ తన చేతనైనంతవరకు చూడవలయును. అనవసరముగ ఏ జంతువునుగాని చంపకూడదు; ఇతరులచేత చంపింపను కూడదు. పెంపుడుజంతుపులను అలక్ష్యముగా విడిచి పెట్టకుము.

౭. భటుడు తల్లిదండ్రులయొక్కయు, బాలభటోద్యోగీయుల యొక్కయు ఆజ్ఞలను నిర్వివాదముగ శిరసావహించును

ఉద్యోగుల యొక్కయు, తల్లి దండ్రులక్కయు, జట్టు పెద్దల యొక్కయు, యోగ్యుల యొక్కయు ఉత్తరువులను శిరసావహించ వలయును. నీకు ఇష్టముకాని ఉత్తరువును ఇచ్చినప్పటికిని నెర వేర్చుట నీధర్మ మగుటచే, దానిని శిరసావహింపవలెను. ఆ ఉత్తరును నెర వేర్చినపిమ్మట, దానికి వ్యతిరేకమగు సంగతులేమైన ఉన్న చెప్పనలయును. ఇదియే శిక్ష (Discipline.)

౮. భటుడు ఎట్టి కష్టములందును సంతోషమును విడువడు.

నీకు ఉత్తరువునిచ్చిన, దానిని సంతోషముతోడను ఇష్టముతొడను, తక్షణమే నెరవేర్చవలయునేగాని, అది నీకిష్టములేక పోయినప్పటికిని, దానిని నెమ్మదిగాను అసుతుష్టితోడను అసమ్మతితొడను చేయగూడను. భటుడెప్పుడును గొణగుటగాని మూలుగుట గాని చేయడు. పరిస్థితులు అసంతుష్టికరముగను అపకారముగను ఉన్నప్పటికిని, గొణిగినగాని, మూలిగినగాని లాభమేమియు లేదు అట్లు చేయుటవలన ఇతరులకు గూడ అసౌఖ్యము గలుగును. అట్టి పరిస్థితులయందు గూడ సరియైన భటుడగువాడు ఉల్లాసములో తోడనే నిండియుండి, కష్టములనుండి తొలగుటకై ప్రయత్నించును. ఓర్పును గోల్పోడు. చెడుమాటల నుపయోగింపకు ప్రమాణముజేయడు. ధైర్యముతోడ కష్టమును బాధను సహించును.

౯. భటుడు మితవ్యయి.

అనగా నీవు ద్రవ్యమును వృధాగా వ్యయపరుపగూడదు. నీవు ద్రవ్యము యొక్క ఉయోగమును తెలిసికొనియుండి, సాధ్యమైసంత కూడబెట్టి, ఇతరులమీదా భారముగాకుండ నుండవలయును. అట్లు కూడబెట్టుట వలన ఇతరులకు అవసరమైనప్పుడు 'సహాయ చేయగలిగి యుందువు.

౧౦. బాలభటుడు త్రికరణ (మనస్సు, వాక్కు, కాయముల) శుద్ధిగలవారు.

ఆతని అలవాటులన్నియు పరిశుభ్రముగా నుండును. ఆతడు తన దేహమును పరిశుభ్రముగాను ఆరోగ్యవణముగాను కాపాడుకొనును. మత్తు పదార్ధములను త్రాగుట, చుట్టలు మొదలగు వానిని కాల్చుట, పొడుము పీల్చుట, మొదలగు అనుపయోగకరములును అసహ్యకరములును అగు అలవాటులు నాతడు దరిజేరనీడు. అపరిశుభ్రమగు ఆలోచనల నాలోచింపను. అపరిశుభ్రమగు కోరికలను కలిగియుండును. అపరిశుభ్రమగు మాటల నుచ్చరింపకు. అపరిశుభ్రమగు కార్యములను చేయడు.

(ట) భటుని గుర్తులు, నమస్కారములు, పతకము (Badge), జెండా.

భటుని గుర్తులు — వీనిని ఇసుకయందు గాని నేలయందుగాని రాళ్ళమీదగాని గీతలు గీచి వేయవచ్చును. పుల్లలతో గాని కర్రలతో గాని చేయవచ్చును. భూమిమీద రాళ్ళను గుర్తులు పెట్టవచ్చును. లేదా సుద్దతో వేయవచ్చును. ఇతర భటులకు ఇబ్బంది కలుగకు౦ డుటకై, పనియైపోయినపిమ్మట ఈ గుర్తులను చెరిపి వేయుచుండవలయును. ఈ ప్రక్క నున్న 3వ పటమునందు ఆ గుర్తులను చూడనగును. 1వ గుర్తు “ఈ వైపుగా పొమ్ము” అని తెలియజేయును. బాణముయొక్క తలభాగము వైపని యర్ధము. 2వ గుర్తు "ఈ మార్గము గుండ వెళ్ళవద్దు" అని తెలియజేయును. 3వ గుర్తు "నేను ఇంటికి వెళ్లి పోతిని” అని తెలియజేయును.ఈ గుర్తును రెండువిధములుగా వేయవచ్చును. ఒక పెద్ద సున్నా చుట్టి మధ్యను 'బొట్టు పొడుచుట, లేదా మూడు రాళ్ళను ఒక దానిమీద మరియొకటి ఉ౦చుట. 4 వ గుర్తు “బాణము చూపించు వైపున బాణముయొక్క కొననుండి 3 అడుగుల దూరమున ఒక ఉత్తరము దాచబడినది" అని తెలియజేయును. (3వ పటమున నాలుగవ గుర్తు నందు మొదటి భాగమును జూడుడు) ఆఉత్తరము దాచబడిన స్థలము బాణము యొక్క కొననుండి 3 అడుగులు౦డక అంతకన్న ఎక్కువ గాని తక్కువగాని ఉండిన, ఎన్ని అడుగులున్నదో అన్న అడుగులకు బాణము యొక్క మొదటి భాగముందున్న చతురమునందు అంకెవేసి చూపవలయును. (3వ పటమున 4వ గుర్తు నందు రెండవభాగమును జూనుడు) 5వ గుర్తు “ఈ వైపున నీకు కనబడును" అని తెలిజేయును. 6వ గుర్తు ఒక భటుడు తన పేరు వ్రాయు విధము. పటమును కున్న గుర్తునకు "9వ మద్రాసు పటాలమునకు చెందిన పాము జట్టునందలి 9వ సంఖ్య భటుడు” అని అర్థము.

౪వ పటము

నాల్గవ పటమునందున్న చిహ్నములన్ని “తిన్నగా పోవలయును” అని తెలియ జేయును.2 ఇందులో 1 వది—ఒక చెట్టు యొక్క బెరడు నిలువుగా తీసి వేయబడి యున్నది; 2వది ఒక రాయి విూద మరియొకరాయి పెట్టబడి యున్నది; 3వది ఒక చిన్నచెట్టు రెండు వైపులకు వ౦చబడియున్నది. 4వది (గడ్డి ముడి వేయబడి ఆకాశము వైపునకు చూపు చున్నది (blazed tree).

౫వ పటము అయిదవ పటమందలి గుర్తు లన్నియు "కుడివైపునకు తిరిగిపోవలయును" అని తెలియజేయుచున్నవి. ఇందులో 1వది చెట్టు బెరడు పెద్దదిగ తీసిన దానిప్రక్కన కుడివైపున చిన్నది తీయబడినది; 2వది పెద్ద రాయికి కుడివైపున చిన్న రాయి పెట్టబడియున్నది; 3 వది చిన్న చెట్టుకుడివైపునకు వంచబడి యున్నది; 4వది గడ్డి ముడివేయబడి కుడివైపునకు వంచబడి యున్నది; 5వది బాణపుగుర్తు పుల్లలతో చేయబడినది. ఇటులనే ఏవైపునకు మార్గము సూచింపదలచిన ఆవైపునకు గుర్తులను చేయునది. ఇట్లు పెట్టు గుర్తు లన్నియు వెనుకవచ్చు భటునికి విస్పష్టముగ కానిపించునవిగ నుండవలెను. ఒకచోట అనేక రాళ్ళు గలవు; అట్టిచోట మూడు రాళ్ళు ఒక దానిమీద మరియొకటి పెట్టిన గాని, ఒక పెద్ద రాయి ప్రక్క చిన్న రాయి పెట్టినగాని అది ప్రత్యేకపు గుర్తుగ భటునికి కనబడక పోవును. ఏలయన అట్టి స్వభావముగనే ఉన్న రాళ్లు అనేకముండును.. అందుచేత అట్టి స్థలములయందు మీరు పెట్టునట్టి రాళ్ళు వాటియంతట అవి ఉన్నట్లు అగుపడునట్టివిగాక ప్రత్యేక గుర్తుగ పెట్టినట్లు అగపడుచున్నవిగ చేయవలెను. లేనియెడల వేరొక గురుతైనా వేయవలయును.

౬వ పటము భటుని నమస్కారము, రహస్యపు గుర్తు - భటులందరును పరస్పరము రహస్యపు గుర్తుతో సమస్కరించుకొందురు ౼ ఒక దినమున వారు తరుచుగా కలిసికొనుట సంభవించు నెడల మొదట కలిసికొన్నప్పుడును, చివరసారి విడిపోవునప్పుడును నమస్కరించు కొనెదరు. కుడిచేతి చిటికెన వేలును బొటనవ్రేలును మడచివేసి, మిగిలిన మూడు వ్రేళ్లను పైకెత్తి యుండి నమస్కరించెదరు. అది భటుని నమస్కారము. మూడు వేళ్లతో నమస్కరించుట అనగా ఏమిటో నీకు తెలియునా? నీవు మూడు ప్రతిజ్ఞలను చేసియుంటివి గదా! ఆమూడుప్రతిజ్ఞలను ఎల్లప్పుడును నీకు జ్ఞప్రియందుండి ఆచరించుటకును నీవు నమస్కరించు భటునికి జ్ఞాపకము చేయుటను ఈ మూడు వ్రేళ్లురు సూచించును. (ఆరవ పటమును జూడుడు).

౭వ పటము

౮వ పటము

కుడిచేతిని భుజమునకు సమరేఖలో నుంచి మూడు వ్రేళ్లను కణతకు తగిలీతగలనట్లు ఉంచవలెను. దీనికి సంపూర్ణవందననుని పేరు (7వ పటముందలి 3వ బొమ్మనుజూడుడు). కుడిచేతిని మడచిన భుజమునకు తిన్నగా వ్రేళ్లు వచ్చును; అప్పుడు అరచేతిని ఎదురు వైపునకు పెట్టి మూడు వేళ్లను చూపిన అది అర్థవందనము (7వ పటమందలి 4వ బొమ్మను జూడుడు). ఒక భటుడు సమానహోదా గలిగిన మరియొక భటుని తెలిసికొన్నప్పుడు అర్ధవందనము నిచ్చును; తన పైయధికారి జట్టు పెద్ద, సేనాపతి, భటోపాధ్యాయుడు, మొదలగువారికి సంపూర్ణ వందనము నిచ్చును. భటులు, తమభటవస్తులయందున్నప్పుడు, రాజుగారి "కమీషండుఆపీసరు "లకు "యూనియన్ జాక్" అను బావుటాను రాజుగారికై ఎగుర వేసినప్పుడు (అనగా కోటమీదదాని, సైన్యముతీసికొని పోవునప్పుడుగాని, కవాతు సమయమందు గాని) ను, సంపూర్ణ వందనమే చేయవలయును. రాజుగారిమీద కీర్తన, భరతవర్షముమీద కీర్తన, వందేమాతర కీర్తనలను పాడుటకు పూర్వమునందును పరమందును గూడ సంపూర్ణ వందనమే చేయవలయును. భటదుస్తులయందు లేని యెడల, “హుషార్ " (Alert) గా నడచుచుపోయినచాలును. భటదుస్తులయందున్నను లేకపోయినను భటులు పరస్పరము కలిసికొన్నప్పుడు వందనముల నిచ్చుకొనవలయును. కొందరు భటులు ఒకచోట నిలుచుండి యుండగా, పైయధికారివచ్చిన యెడల, ఆ భటులందు" పెద్ద” వారినందరిని "హుషార్" గా నిలునబెట్టి, తానొక్కడు ఆ పైయధికారికి వ౦దన మొసంగినచాలును. వందనము లెప్పుడును కుడిచేతి తోడనే చేయ వలయును. ఏభటుడైన వందనము చేసినప్పుడు తిరిగి ప్రతినందనమును చేయవలయును. భటునకు చేతిలో భటదండ మున్నప్పుడు ఆ దండమునకు కుడిచేతిని సమకోణముగ ఆనించిన అదియేనమస్కారము. (7వ పటమునందలి మొదటిబొమ్మ భటుడు చేతిలో దండముతో నిలువ బడినప్పుడు చేయుపద్ధతిని, రెండవ బొమ్మచేతిలో దండముతో నడచుచున్నప్పుడు చేయు పద్ధతిని సూచించుచున్నవి).

౯వ పటము యూనియన్ జాక్ - (రాజుగారి బావుటా) తెగల్లగుడ్డమీద ఎర్రని అడ్డగీతలున్నది. ఇంగ్లండు'(సెంటు జార్జ్. 8వ పటమున మొదటి బావుటా) యొక్క బావుటా; ఊదా గుడ్డమీద అయి మూలలకున్న తెల్లగీతలుగలది స్కాట్లాండు (సెంటుఆండ్రూ. 8 వ పటమున రెండవ బావుటా) యొక్క బావుటా. ఈ రెండు బావుటాలును ౧౬౦౬ వ సంవత్సరమున కలుపబడినవి. తెల్లగుడ్డమీద ఐమూలలకున్న ఎర్రగీతలుగలది ఐర్లాండు (సెంటుపట్రిక్ - 8 వ పటమున 3వ బావుటా) యొక్క బావుటా. ఈ మూడును ౧౮౦౧ వ సంవత్సరమున గలుప బడి "యూనియ౯ జాక్" అను పేరుగల బావుటాయైనది. (మనలను పరిపాలించుచున్న ప్రభువుల దేశమునందు ఇంగ్లాండు, స్కాట్లాడు, ఐర్లాండు అనిమూడు దేశములున్నవి. ఆమూడును పైవిధముగా కలిసి సంయుక్త రాష్ట్రములైనవి.) అప్పటినుండియు ఈ బావుటా ఒక సంయుక్త రాష్ట్రముల కేగాక సామ్రాజ్యమున కంతకును బావుటాగ అంగీకరింపబడినది. అది మన రాజుగారగు జార్జి ప్రభువర్యుని ప్రతినిధిగ నెంచి, దానికి భక్తిలో సమస్కరింపబడును.

ఐర్లాండు దేశముయొక్క చిహ్నమగు అయిమూలలందు ఎర్రగా ఉన్న గీతలు స్కాట్లాండు దేశ చిహ్నమగు అయిమూలలందు తెల్లగా ఉన్న గీతల మయముగా వేయక ఒక ప్రక్కగా వేసిరి. అందుచేత ఎర్రని అయి మూలగీతలకు ఒక ప్రక్కను తెల్లనిగీత వెడల్పుగను రెండవ ప్రక్కను సన్నగను కానిపించుచున్నది. ఈ ఎర్రని అయిమూలగీతకు ప్రక్కనున్న తెల్లని వెడల్పుగీత పైభాగమునకు వచ్చులాగున ఈ బావుటాను ఎగుర వేయనలయును. ఈ విషయము ముఖ్యముగా గమనింపవలయును. జనులు సాధారణముగా ఎర్రని అయిమూల గీతకు ప్రక్కనున్న సన్నని తెల్లగీత పై భాగమునకు వచ్చులాగున బావుటాను కట్టెదరు. ఆది సరియైన విధముగాదు. భటు లెప్పుడును ఈ తప్పును చేయరాదు. 9వ పటమున మొదటి బావుటా సరియైన పద్ధతి నెగుర వేయుటను, రెండవది తప్పుగా నెగుర వేయుపద్ధతిని సూచించుచున్నవి.

భారతవర్ష బాలభటుని పతకము - ఈపతకమునందు దీక్షా వాక్యము, కమలము, భానుడు అని మూడు చిహ్నములు గలవు. కమలమును భానుడును గలసి ప్రాధమిక శిక్షయం దు తీర్లతను దెలుపు పతక మగును. దీక్షావాక్యమును, కమలమును గలసిమధ్యమశికయందు తీర్థతను దెలుపు పతక మగును. ఉత్తమ శిక్షయం దుత్తీర్ణతను దెలుపు పతకమునందు ఈ మూడు చిహ్నములను గలిగియు౦డును. ఉద్యోగులును, జ్యేష్ఠభటులును ధరించు పతకమునందు ఈ మూడు చిహ్నములుండుటయే గాక చుట్టును గుండ్రని యాకారముగ నేర్పడియుండును.

దీక్షా వాక్యము - “సిద్ధపడి యుండుము” (Be prepared) అనునది దీక్షా వాక్యము. నాగరికత జెందిన దేశములన్నిటియందును ప్రపంచమంతటనుగూడ భటులకిదియే దీక్షా వాక్యము. మనము పొందునట్టి తరిబీతు అంతయు సేవకొరకేననియు, ఆకస్మికములగు అనసరముల కెల్ల మనము సిద్ధపడి యుండవలయుననియు, ఆవాక్యము మనలను ఉద్బోధించుచుండును.

కమలము భారతవర్షమంతటను ప్రీతి పూర్వకముగా జూచు చిహ్నము. బురదగుంటయందు జన్మించి ఉదకముద్వారా బైటికి పెరిగి అక్కడ సూర్యరశ్మి తగులగానేవికసించి సౌరభముతో గూడిన సౌందర్యవంతములగు దళములను ప్రకాశింప జేయుచున్నది. అందుచేత కమలము పవిత్రతను, వాంఛను సూచించు చిహ్నమైయున్నది. కమలమువలెనే భటులు గూడ, స్వార్థపరత్వమను చీకటినుండి వెలుగునకువచ్చి తమ సేవావ్రత సౌరభమును ఇతరులకు వెదజల్లి ప్రపంచము నింకను సౌందర్యవంతమగునట్లు జేయ పాటుబడు చుందురు.

భానుడుగూడ భారతవర్షము యొక్క చిహ్నమేయి యున్నది. ఇది మహ్మదీయుల యొక్కయు చిహ్నము. ఉదయభానుని వలెనె మన గౌరవ ప్రపత్తులు మనసేవ అత్యున్నతంబులై వెలుంగవలయును. దేవుని, సామ్రాజ్యమును, దేశమును, సేవించవలయునని నిష్కల్మషముగ వాఛించు పుత్రీ పుత్రకులు పది వేలమందియైన భారతవర్షమందు ఉదయింపగలిగిన యెడల, శ్రీరామచంద్రమూర్తి- అక్బరులనాటి ప్రాచీన ఔన్నత్యము తిరిగి పునరిద్ధరింపబడగలదు.

౫ భటుని దుస్తులు

ప్రతిజ్ఞ తీసికొనునాటికి భటులందరును భటుని దుస్తులను సంపాదించుకొన వలయును. ఈక్రింది దస్తులు భటునికి అత్యంతావశక్యములు.

కాకీషర్టు ౼ కాకీషర్టు బుజములమీద పట్టీ, వక్షమునందు రెండు జేబులు, జేబులకు మూతలు కలిగి యుండవలయును. దానికి గుండీలు "కాకి" రంగునే గలిగి యుండవలయును.

మట్టలాగు ౼ కాకీమట్టలాగు, మోకాలు వరకు మాత్రముండవలయును.

తలగుడ్డ ౼ ముదురు ఆకుపచ్చని గుడ్డ 3 గజములు మొదలు 3౺ గజముల పొడవుండవలయును.

మెడరుమ్మాలు ౼ ౨౭ గాని 3౦ గాని అంగుళములు చతురమునుగలిగి మెడచుట్టును కట్టుకొనుట కుపయోగించును. అది జట్టు ఏ రంగును నిర్ణయించుకొనునో ఆరంగునే కలిగి యుండవలెను.

బుజము మీది ముడి - 1¾ గాని 2¼ గాని వెడల్పును ఆరు అంగుళములు పొడవును గల ౪ ముక్కలు ఎడమబుజముమీది చొక్కాకు తగిలించుకొన వలయును. ఇదియును జట్టు యొక్క రంగునే గలిగి యుండవలయును.

భటుని దండము

పిల్లవాని పొడవునుబట్టి ౫ అడుగులుగాని ౫౺ అడుగులుగాని ఉండవలయును. దానిమీద అడుగులును అంగుళములును గుర్తువేయ వలయును.

బుజముమీది పతకము ౼ పటాలము యొక్కపేరు వ్రాసిన చిన్న గుడ్డను కుడిబుజము మీద చొక్కాకు తగిలించుకొన వలయును.

పైన వివరించినవి. తప్పకుండ సంపాదించుకొన వలయును. ఈక్రిందవివరించినవి ఉండకపోయినను ఫర్వాలేదు.

వస్తువులు పెట్టుకొని తీసుకొనిపోవుటకొక సంచి ౼ బుజముమీద వేలాడుటకు వీలుగా నీరు తీసుకొని పోవుటకొక బుడ్డి.

భటునిచాకు ౼ భటునిఈల (ఉద్యోగులకు) జట్టు పెద్దలకుమాత్రము.

చెప్పులు ౼ వీలైన బూడిదరంగువి.

మేజోళ్ళు ౼ వీలైన బూడిదరంగువి.

ఇంతకన్న ఏమియు అవసరములేదు. ఇతర వస్తువులన్నియు సంచియందే పెట్టుకొనవలయును. యుద్ధభటులు వేసికొనులాగున దుస్తులు ధరింపగూడదు. చొక్కా మోచేతి వరకు పైకి ఎగదీసికొని యుండవలెను. మట్టలాగులు మొదలైనవి వెంటనే కుట్టించు కొనుటకు వీలు లేని యెడల, అంగీకారమును పొంది అవిలేకుండ తాత్కాలికముగ ఉండవచ్చును. అట్టివారు మెడరుమాలు, బుజముమీదిముడి, భటుని దండము, వీనినైన తప్పక సంపాదించు కొనవలయును. పిమ్మట తలపాగాను, మట్టలాగును సంపాదింపవలెను. తుదకు షర్టును భుజముమీది పేరును సంపాదించుకొనవచ్చును. కవాతునకు వచ్చునప్పుడు అందరును ఒకే విధమగు దుస్తులను గలిగియుండవలెను. కొందరు మట్టలాగులను మరికొందరు ధోవతులను ధరింపగూడదు. ఇది ముఖ్య విషయము.

ప్రాధమిక శిక్షయందు తీర్ణతను దెలుపు పతకమును చొక్కా ఎడమవైపు జేబుమీద ధరింపవలయును. ఈ పతకము మద్రాసు నందు భారతవర్ష బాలభట సంఘము యొక్క కార్యస్థానమునుండియు, ఇతరశాఖా సంఘముల ద్వారాను తెప్పించుకొనవచ్చును. భటదస్తులు అందముగను, పరిశుభ్రముగను చిరిగిపోకుండను కాపాడుకొనవలయును. పతకము గూడ మాసిపోగూడదు. అది నిభటజీవితము యొక్క చిహ్నము. భటదుస్తులు వేసికొనునప్పుడుగూడ పతకమును ధరించియుండవలెను. దుస్తులు వెలిసిపోయినను, చిరుగులు కుట్టినను పరిశుభ్రముగనుండిన ఫర్వాలేదు.. అంతేకాని మాసిపోయిగాని, గుండీలు పోయిగాని ఉండిన అసహ్యకరముగ నుండును. భటులు తమదుస్తులను తామే కుట్టుకొనుటను నేర్చియుండవలయును. కవాతునకు భటదుస్తులను ధరింపకుండవచ్చుట లజ్జాకరము. భటుడు సేవావ్రతమున్నకై తాను సిద్ధముగా నుండుటయేగాక తన దుస్తులనుగూడ ఎల్లప్పుడును సిద్ధముగా నుంచవలయును. "సిద్ధపడియుండులుటకై” అవసరమైన తన దుస్తులను తానే ఉతుకుకొనవలయును.

౬ దీక్షాస్వీకరణ మహోత్సవము.

ప్రాధమిక శిక్షా విధానమందు ఉత్తీర్ణుడై, భటప్రతిజ్ఞ యొక్క అర్ధమును సంపూర్ణముగ దెలిసికొని, దానిని వల్లించిన పిమ్మలు దీక్షా స్వీకరణమహాత్సవము జరుగును. ఆసమయమునకు నీ భటదుస్తులను సిద్ధము చేసికొని యుండవలయును. ఉత్సవమునందు జరుపవలసిన ఈ క్రింది విధానమును పటాలమందు ముందుగా అందరికిని చక్కగా నేర్పవలయును. దీక్షా స్వీకరణము పవిత్రమగు కార్యము. అందుచేత అక్కడకువచ్చిన పిమ్మట తరుముకొనుచుండిన బాగుండదు.

దీక్షా స్వీకరణ విధానము.

(క) జెండె చుట్టును పటాలము “గుర్రపు డెక్క” ఆకారమున ఏర్పడవలయును (మామూలుగా జెండా నెత్తుటయు, నమస్కరించుటయు, అదివరకే జరిగియుండవలయును). భటోపాధ్యాయుడును, సహాయ భటోపాధ్యాయుడును మధ్యఖాళీయందు నిలువబడెదరు. ప్రతి “జట్టు పెద్ద” తమ జట్టునకు ఒక అడుగు ముందుగానిలువబడును. సహాయభటోపాధ్యాయుని చేతియందు మెడరుమ్మాళ్లను భటదండములను నూతనభటులకై సిద్ధముగ పెట్టుకొని యుండును.

(చ) అప్పుడు భటోపాధ్యాయుడు నూతన భటులను తీసికొని రావలసినదని ఉత్తరవు నిచ్చును. అప్పుడు జట్టు పెద్ద నూతన భటుని వద్దకుబోయి "నాయకుని అనుకరింపుము, త్వరగా నడుపుము" అని చెప్పి అతనిని తీసుకొని పోయి భటోపాధ్యాయునికి మూడు అడుగుల దూరమున నిలువబడి "ఆగుము” అని చెప్పును. పిమ్మట తాను ఒక అడుగు ముందు వేసి ఉపాధ్యాయునికి నమస్కరించి, ఒక అడుగు ప్రక్కకు వేసి నిలువబడును. అప్పుడు నూతన భటుడు (ఉపాధ్యాయునికి 3 అడుగుల దూరమునందుండును). ఉపాధ్యాయునికి నమస్కరించును.

(ట) అంతట భటోపాధ్యాయుడు నూతన భటుని ఇట్లు ప్రశ్నించును - "నీ గౌరవమేమియో నీకు తెలియునా?"

దానికి నూతన భటుడు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చును.

“సత్యసంధుడను యోగ్యుడను అయియుందునని నాయందు నమ్మకముంచదగును అదియే దాని యర్ధము”

(త) తిరిగి భటోపాధ్యాయుడు ప్రశ్నించును ౼ “భటధర్మమేమియో నీకు తెలియునా? నీవు చేయబోవు వాగ్దానములను చక్కగా తెలిసికొంటివా?" నూతన భటుడిట్లనును. “నాకు తెలియును"

(ప) భటోపాధ్యాయుడిట్లు ప్రశ్నించును.

“దేవునకును రాజునకును దేశమునకును నీ విధ్యుక్తధర్మము చేయుదువనియు, అన్నిశలయందును అందరికిని తోడ్పడుదువనియు, భటశాసనమును నిర్వివాదముగ శిరసావహించెదననియు, నీమర్యాదతొడుగా నిన్ను విశ్వసింపవచ్చునా?

నూతనభటుని ప్రత్యుత్తరము "విశ్వసింపవచ్చును.”

(గ) భటోపాధ్యాయుడిట్లనును ౼ “నీప్రతిజ్ఞను తీసికొనవచ్చును. సోదర భటుల వైపు తిరుగుము.”

అంతట నూతనభటుడు పటాలము వైపునకు తిరుగును.

(జ) అంతట భటోపాధ్యాయుడు ఈ ఉత్తరువిచ్చును ౼ పటాలం! అర్ధవందనము నిమ్ము!” అందరును అర్ధవందనము చేసి నిలబడెదరు. భటుడుగూడ అర్ధవందనము చేసి ఈక్రింది ప్రతిజ్ఞగై కొనును ౼

“దేవునకును, రాజునకును, దేశమునకును, నా విధ్యుక్తధర్మమును చేయుట నా ప్రధమ ప్రతిజ్ఞ.

అన్ని వేళలయందును అందరికిని తోడ్పడుట నా ద్వితీయప్రతిజ్ఞ.

బాలభట శాసనమును నిర్వివాదముగ శిరాసావహించుట నాతృతీయ ప్రతిజ్ఞ.

నేను నామర్యాదతోడుగ ఈ ప్రతిజ్ఞలను తీసుకొనుచున్నాను”.

(డ) భటోపాధ్యాయుడు పటాలమున కిట్లనును “పటాల౦ సద్దు.” నూతనభటున కిట్లనును “వెనుక వైపునకు తిరుగు” అంతట నూతనభటుడు భటోపాధ్యాయునిపై పుతిరుగును.

(ద) భటోపాధ్యాయుడంత సహాయోపాధ్యాయునినుండి పటాలము యొక్క రంగు గలిగిన మెడరుమ్మాలును తీసికొని, నూతనభటుని మెడచుట్టునుకట్టి ఇట్లనును ౼

"ఈ ప్రతిజ్ఞను నిలువబెట్టెడవనినీ గౌరనము తోడుగ నిన్ను విశ్వసించుచున్నాను. సేవయే నీ వ్రతము. భటసోదరబృందమునందు నీవిప్పుడు చేరినావు”.

అంతట సహాయభటోపాధ్యాయుడు భటదండము నెసంగగా భటుడు దానిని ఎడమ చేతితో స్వీకరించును.

(బ) అంతట నూతన భటుడును జట్టు పెద్దయును భటోపాధ్యాయునికి నమస్కరించి, వెనుకవైపు తిరుగుదురు. అప్పుడు నూతన భటుడు పటాలమునకు వందనము చేయగా భటోపాధ్యాయుడీ యూత్తరువు నొసంగును. “దండము నెత్తుడు”. పిమ్మట ఇట్లనును “సద్దు” అంతట భటులు దండములను యధాస్థానలందుంచెదరు.

(స) తర్వాత భటో సాధ్యాయుడు జట్టు పెద్దకిట్లనును ౼ "నీజట్టుకు పొమ్ము”

అంతట జట్టు పెద్ద “నీజట్టుకు పొమ్ము” అని నూతన భటునకు త్తరువు నొసంగి తన జట్టునకాతనిని తీసికొనిపోయి యధాస్థానమున౦దిద్దరును నిలువబడెదరు. పిమ్మట ఇంకొక నూతన భటుని పిలిచి, ఇదేప్రకారము జరిపెదరు. భారత భటునకు రహస్యపుగుర్తు దానికి జవాబుగలదు. నూతన భటునకు దీక్షా స్వీకరణమైన పిమ్మట జట్టు పెద్ద దానిని తెలియజెప్పును. దానిని ఇతరుల కెవ్వరికిని చెప్పరాదు.

౭ సభ్యత్వము - జవాబుదారీ.

ప్రపంచమునం దంతటను ప్రబలియున్న భటసోదర మహాబృందమునందు నీవు సభ్యుడవైనాడవు. ఏ దేశమందైనను ఈసోదర చిహ్నము భటులందరినుండియు నీకు సహాయముగొని వచ్చును. మనవలెనే సేవావ్రతమును గైకొని పనిజేయువారు ప్రపంచము నందంతటను నిండియున్నారని వినిన నీకు సంతోషజనకముగ లేదా? సంతోషజనకమే. కాని ఆనూతన సామర్థ్యముతో బాటు క్రొత్త జవాబుదారిగూడ ఆవేశించి యున్నది. నీవు సరియైన భటుడవగుదువేని, భటసోదర బృ౦దమునందు సరియైన సభ్యుడవేని, అందరికి స్నేహితుడపై ఇతర భటులకు సోదరుడవై మెల౦గ వలయును. నీవు భటధర్మమును సరిగ నిర్వహింపవలయును. నీ జట్టునకు నీపటాలముసకు నిజాతికి ప్రపంచమంతటను నిండియున్న నిసోదరభటులకు అవమానమును దెచ్చునట్టి కార్యమును నీవు ఎంత మాత్రమును చేయకుము.

ప్రాచీన భారతవర్షము యొక్క సుపుత్రుడవుగమ్ము! సేవావ్రతమును గైకొన్న నూతన యోధుల గౌరవమును వన్నెకుదెమ్ము!! సత్యవ్రతుడవు, ధైర్యవంతుడవు, దయావంతడవు, బలవంతుడవు కమ్ము!!!

బాలభట లక్షణములు

“రీ. ఒనర విశ్వాసమును, భక్తి, ♦ యుపకృతి యను,
భ్రాతృభావంబు, విజయంబు ♦ భూతదయయు,
బ్రధితరాజ్ఞానువర్తన, ♦ మధికతోష
మును, మితవ్యయమును, ద్రిశుద్ధిని, వచింత్రు
బాలభటలక్షణములని ♦ ప్రాజ్ఞులెంగు”


This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse