Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 5/జన్మభూమి

వికీసోర్స్ నుండి

జన్మభూమి

ఏదేశమేగినా ♦ ఎందుఁగాలిడిన
ఏపీఠమెక్కినా ♦ యెవరెదురయిన
పొగడరా నీతల్లి ♦ భూమి భారతిని
నిలుపరా నీజాతి ♦ నిండుగర్వమ్ము
లేదురా యిటువంటి ♦ భూదేవియెండు
లేరురా మనవంటి ♦ ధీరులింకెందు.

ఏపూర్వపుణ్యమో ♦ ఏయోగబలమొ!
జనియించినాడ వీ ♦ స్వర్గలోకమున
ఏమంచి పూవుల౯ ♦ బ్రేమించినావు!
నినుమోచె నీతల్లి ♦ కనక గర్భమున

సూర్యుని వెలుతురు ♦ ఆడునందాక
ఓడలఁజెండాలు ♦ ఆనునందాక
నరుడు ప్రాణాలతో ♦ నడుచునందాక
అందాకగల యీయ ♦ నంత భూతలిని
మనభూమివంటి క ♦ మ్మని భూమిలేదు.

తమతపస్సులుఋషుల్ ♦ ధారఁబోయంగ
చండవీర్యము శూర ♦ చంద్రు లర్పింప
రాగదుగ్ధము భక్త ♦ రాజులీయంగ
భావసూత్రము కవి ♦ బాంధవు లల్ల
దిక్కుల కెగఁదన్ను ♦ తేజంబు వెలుఁగు
జగముల నూగించు ♦ మగతనం బెగయ
రాలుపూవులుసేయు ♦ రాగాలు సాగ
సౌందర్య మెగఁబోయు ♦ సాహిత్యమొప్ప
వెలిగినదీ దివ్య ♦ విశ్వంబు పుత్ర!
దీపించె నీపుణ్య ♦ దేశంబు పుత్ర!

అవమాన మేలరా ♦ అనుమాన మేల!
భరతపుత్రుఁడనంచు ♦ భక్తితోఁబలుక !

— రాయప్రోలు సుబ్బారావు.