Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 4/మూడవ ఆంధ్రసారస్వతమహాసభ

​

మూడవ ఆంధ్ర సారస్వత మహాసభ - విశాఘపట్నము.

ఐదవ ఆంధ్రదేశ గ్రంథాలయ ప్రతినిధుల మహాసభతో బాటుగ ఈసభ విశాఖపట్టణ పురమందిరమన ౧౯౧౮ సం॥ జూను నెల ౨౩ వ తేదీ ఉదయమున సమావేశమయ్యెను, ప్రార్థనలు గావించిన పిమ్మట ఆహ్వాన సంఘాధ్యక్షులగు శ్రీ ప్రభల లక్ష్మీనరసింహం పంతులుగారు తమ స్వాగతోపన్యాసమును ఈవిధమగ నిచ్చిరి.

ఆహ్వాన సంఘాధ్యక్షుల ఉపన్యాసము

అర్యలారా! పండితవర్యులారా!! ఈతృతీయాంధ్ర సారస్వతి మహాసభకు విచ్చేసిన తమ కఁదఱకును స్వాగతము. ఆహ్వాన సంఘపక్షమున నిండు మనముననిచ్చు స్వాగతమును గైకొండు. మాయెడ లోపములు పెక్కులండు. వాని సరకుగేయక మన్నింపుఁడు. కఱువు, బవరము, జాడ్యములను ప్రజల గాసిలఁజేయుచున్నవి. శ్రమములకోర్చి, యెడలి బడలిక గడనసేయక మాతృభాషాసేవా కుతూహలము మనములు నిండఁదా మఁడఱు నిచ్చటికి విచ్చేసితిరి. ఇయ్యది పడితులు కేకాలముననైన సహజధర్మము. లక్ష్మీ సరస్వతులకు సహజవైరమట. కానిఁడు కడగఁడ్లఁబడియైనఁగడఁ బేదరికమన రాజులే కవిరాజులు విరాజిల్లిరి. క్రౌంచవిధుధనామన నొంటిదానిని దుఁటరీవిలుకాఁడు వి౦టనేసిన గంటదడిపెట్టిన వాల్మీకిశోకము శ్లోకరూపమనఁ బరిణమించి యదికావ్య మునకుఁ గృత్యాదియయ్యెను. కవిహృదయము కఱఁగి ఝరీప్రవాహమై కావ్యరస ముప్పతిల్లును గదా!

వాల్మీకి మహర్షి మొదటికవి. పిదపఁ గూడ ఋషి యంశము లేనివారలకుఁ గవిత్వ మబ్బదని పెద్దలు చెప్పుదురు. ఋషులనగా ద్రికాలలేదులుగదా! కవి లోకజ్ఞుడు గావలయునఁదురు. కవిహృదయము కవులకే తెలియనఁట! కవి హృదయము గడు విశాలమైనది. భూనభోంతరములు నిండియుండును. ప్రకృతిలీనమగు నిరంతశోభను గవికనులు గాంచుచుండును. శబ్దజాలమునందలి నిగూఢ మాధురీస్వరములను, బ్రహ్మాండ కటాహములు సృష్టికర్తను గీర్తించు దివ్యగానామృతమును గవి వీనలు వినుచు౦డును. శబ్దబ్రహ్మము కవివనోవీధి నోంకారగానము సేయుచుండను ఆక్షిగోచరముగాని యద్భత వైచిత్ర్యములఁ బ్రకృతి కవికంటికిఁ గరతలామలకముగఁ బ్రదర్శించుచుఁడును. “కవిగాననిచో రవి గానగేర్చు" యను నార్యోక్తి నిక్కముగదా! వాల్మీకి మహర్షి రామచరితము నీవిధమునఁ దిలకించి యాది కావ్యము రచించెను. చాతుర్యము చేత వర్ణించువాడు కవి. ​వస్తువునకు వర్ణములకు వన్నెబెట్టువాఁడు కవి. నన్నయ పద్యమునకుఁ దిక్కన వర్ణముఁ బూసెనను పుక్కిటి పురాణ మందలి గూఢార్థ మిదియె.


ఆంధ్రసారస్వత మేనాఁడిలఁ బాదుకొనినదో తెలియరాదు. భారతరచనమునఁ దనకు నారాయణశాస్త్రి సాహాయ్యమును సేసినట్లు చెప్పియుండుటవలన దానిని వాగనుశాసనుండు సృజియించెనన వీలు లేదు. ఏది యెట్లున్న నాంధ్రుల మనముల నానంద వార్నిధి నోలలాడించి యాంధ్రుల నూతన సంరంభ విజృంభణములకెల్ల నాలవాలమై, యాంధ్రుల యభీష్టములఁ దీర్పఁ బారిజాతమై యాంధ్రభాష విలసిల్లుచున్నది. వివిధ రాజ్యములందు వెవ్వేఱువిధముల వసతి గాంచిన యాంధ్రుల వింత విధమున నాకర్షించి సౌభ్రాతృత్వముఁ బెంచుచు నైకమత్యముఁగూర్చుచున్నది యాంధ్రభాషయే. ఆంధ్రోద్యమమునకుఁ బట్టుకొమ్మ యాంధ్రభాషయే. తేనెసోనల పగిది వీనులవిందుగా నెనలేని తీపులీనునది మనతల్లిబాసయే. కావుననే “దేశభాషలందుఁ దెనుగు లెస్స”యని వాసి గాంచినది.


ఆంధ్రసరస్వతి శైశవ మేరీతిఁగడచెనో తెలియరాకున్నది. కాని మన మెఱింగిన నాఁటనుండియు వివిధాలంకార విభూషితయై నవరసంబులుమీఱ నంచితపద విన్యాసక్రమమునఁ గావ్యవీధి జరించుచున్నది. కృష్ణ దేవరాయల కాలమున మిన్ను ముట్టి పిదపఁ గొంచెముఁగ్లాని జెంది వర్తమానమున వినూత్న దివ్య తేజమున వెలుఁగుచున్నది. తొడవులయందలి ప్రియ మంతగాఁ గానరాదు. స్నిగ్ధగంభీర భావగర్భితములై పలుకులు జ్ఞానోపదేశ మొనరించుచున్నవి. నవయుగ ప్రభాతవళక్షదీధితు లంతరి పక్షమున కెగఁబ్రొక నిద్రమేల్కాంచి కనులువిచ్చి “లెండు లెండు కార్యక్రమమునకుఁ గడఁగుఁడు త్వరపడుఁ" డని యుద్బోధించుచున్నది. ఏభాషయందైన వాఙ్మయమును బ్రజల సాంఘిక జీవనము నన్యోన్యవికాసమునకుఁ బరస్పరము దోడ్పడుచుండును. సారస్వతమున సాంఘిక జీవనము శక్తులు ప్రతిఫలించుచు దీప్తిమంతముగాఁ జేయను. వాఙ్మయము సాంఘిక జీవనమును పరిశుద్ధము సేయుచుండును. భాషలకును వాఙ్మయమునకును శైశవాద్యవస్థలు నడచుచుండును. విమర్శించినచో భాషలయందీ పరిణామము గాంచనగును.


ఆంధ్రభాషాచారిత్ర మింకను వ్రాయఁబడవలయును. అది ద్రావిడకుటుంబములోఁ జేరినదనిమాత్రము నిర్ధారణము గావింపఁ బడినది. ద్రావిడ భాషలకు సామాన్య వ్యాకరణమునుఁ కాల్డ్వెత్, దొరవారు వ్రాసిరి. చాలఁగాలము గడచినది. పునర్ముద్రణము జరిగినది. ఇట్టి పనిని దేశీయులు పండితులు పూనుదురు గాక! కీతి౯శేషులగు శేషగిరిశాస్త్రులుగా రాంధ్రమున కభినవశబ్దశాస్త్ర మును గూర్పయత్నించిరి. కాని యాంధ్ర మఱవమునుండి నిష్పన్నమయ్యెనను నొక తలంపు మతి నాటించుకొని పాటుబడి యుండిరి. అదియు నసంపూర్ణమై యుండెను. మన దేశమున మహారాజశ్రీ రావుసాహేబు గిడుగు రామమూతి౯ పంతులుగారీ విషయమునఁ గృషి సల్పుచున్నారు. కాని వారి యత్నములును మన మనోరధములు నింతవఱకు ఫలియింపఁజాలకున్నవి. వివిధ దేశభాషా పరిశ్రమమును నన్యభాషాపరిచయమును గలిగినంచి గాని యిట్టి మహా కార్యమునకుఁ గడంగుట దుస్తరము. భాషా చారిత్రమును వ్రాయుచో భాష యేకాలమున నేరూపున వ్యాప్తి గాంచియుండెనో తెలుపఁదగి యుండును. వతి౯మానమున భాషాస్వరూపము మాఱి గ్రాంధిక గ్రామ్యవాదుల వాదమునకు బలము నిచ్చుచున్నది. ఆర్యవ్యవహరసిద్ధంబగు భాష గ్రాహ్యంబు గదా! దీని నార్యులు స్థిరపఱచి గ్రహియింతురు గాక!


భాషాచారిత్రమునకుఁదోడు వాఙ్మయచారిత్రముకూడ వ్రాయఁదగి యున్నది. సంస్కృతమునఁగూడఁ బ్రాచీన గ్రంథ మేదియు నిట్టిది గానరాదు. ఆంగ్లమునను పాశ్చాత్యభాషలను దేవభాషను గూర్చి కొన్ని గ్రంథములు వ్రాయఁబడి యున్నవి. స్వదేశీయులగు పండితు లిట్టి యుద్యమములకయి యత్నింతురని నమ్ముచున్నారము. భాషాపరిజ్ఞానము కొఱ కన్యభాసాభ్యాస మవసరమయి యున్నది. ఆంధ్రసోదరులు గొందఱు దేశభాషలనభ్యనించి యా యా భాషలనుండి భాషాంతరీకరణములు మొదలగునవి చేయుచు వాఙ్మయవృద్ధి గావించు చున్నారు. శబ్దశాస్త్ర విజ్ఞానమునకుఁ దగినకృషి యంతగా సలుపఁబడుచున్నట్లు కానరాదు. అన్యభాషాభ్యాసమునను, ముఖ్యముగ దక్షిణ దేశమందుఁ బ్రచారముగల యట్టియు మన భాషతో సంబంధించి యున్నట్టియు భాషల పరిచయము గలుగఁజేసికొనినచోఁ బయి కార్యములును సాధ్యములగును. విమర్శకజ్ఞానము వృద్ధిఁజెందినంగాని చారిత్రరచనము వలనుపడదు.


ఆంధ్రవాఙ్మయమున నవలలు నాటకములు చిన్నికధలు, చిత్రవణ౯నములేకాక, శాస్త్రములు, కళలు, చరిత్రలు, మహాపురుష చరిత్రములు, వాణిజ్య పరిశ్రామిక విషయములను గూర్చిన గ్రంధము లెన్నియో యింకను వెడలఁదగియున్నవి. వచన కావ్యరచనయే కొలఁదికాలము క్రిందట నారంభమయి నూతనశక్తిగలిగి పెంపుఁజెందు చున్నది. ఆంధ్రసారస్వతము సర్వంకషముగ నాంధ్రలోక జీవనము నంటుచుఁ బవిత్ర జీవనమునకును నాంధ్ర ​వ్యక్తివికాసమునకును దోడ్పడునట్లు పరాత్పరుఁ డనుగ్రహించును గాక!


మాతృభాష యందు విద్యగఱపుట జ్ఞానోదయమునకు ముఖ్యావశ్యకమని యెల్లరును గ్రహియించిన విషయమై యున్నది. అన్యభాషాగ్రహణముననే బాలుర గ్రహణధారణశక్తులు వినియోగపడినచో విద్య నిస్సారమయి విజ్ఞాన వివర్ధనసాధనముగా నేరదనియును, దత్కారణముననే భారతీయులకు స్వతంత్రనిర్మాణశక్తి చాలదనియు ననుకరణ పద్ధతిమాత్ర మలవడుచున్న దనియును బెద్దలు నుడువుచుందురు. ఇట్టికొఱంత మాతృభాషా ముఖమున నుత్తమవిద్యాభ్యాసమబ్బకుండునంతవఱకు నుండును. జాతీయ విద్యయం దభిమానము నిక్కనుగుచుండు నీకాలమున నిట్టిలోపములు దప్పక సవరింపఁబడును గాక!


ఆంధ్రసారస్వతము పెక్కువిధముల నూతనమార్గములఁ బ్రసరించుచు వాసిగాంచుచున్నదియని మన మెఱింగి యున్నారము. విద్యాధికులీ విషయమున నగ్రస్థానమునందు నిలిచి భాషాగౌరవమును సుప్రతిష్ఠితముగా నెలకొల్పుదురని నమ్ముచున్నారము. ఆంధ్రభాషయం దుత్తమనిఘంటువు లేనిలోపము మెండుగాఁ గానవచ్చుచున్నది. ఈ లోపము గొలఁదికాలమునఁ దీఱువని నమ్మితిమి. కాని మన యభీష్ట మింకను సిదించు కాలము సమీపించినట్లు కానరాదు. కాలమతిత్వరితగతి నడుచుచున్నది. మనము వెనుకఁబడరాదు. ఆంధ్రులతేజము పెంపుఁ జెందఁగోరితిమేని యాంధ్రసారస్వతమును జెంపుఁజెందఁజేయవలయును. మన భాగ్యవశమున సుభయభాషాకోవిదులును నాంగ్లసారస్వతీ సాహితీవిభూషణులునగు బ్రహ్మశ్రీ యనరుచుండ్ర వకుండ్ర నారాయణమూర్తిపంతులుగారీ సభ కగ్రాసనాధిపత్యము వహింప సమ్మతించిరి. కాలవిలంబము గాకుండ సభా కార్యమునకుఁ దొడంగి యగ్రాసనాధిపతుల యమూల్యోపన్యాసమును వినఁగుతూహలగు తమ యౌత్సుక్యమునకు నిరోధము గలుగకుండ నింతటితో విరమించుచున్నాఁడను.


అనంతరము అధ్యక్షులగు శ్రీ ఎనమండ్ర నారాయణ మూతి౯పంతులు గారు తమ అధ్యక్షుకోపన్యాసమును ఈ విధముగ జదివిరి:౼


అధ్యక్షుల ఉపన్యాసము

ఆంధ్రవాఙ్మయాభివృద్ధి నభిలషించి యీసభ నెలకొల్పబడినది. ఇట్టి సభ యుండవలెననియు సంవత్సగమున కొకమారయినను సమావేశమయి యాంధ్రసారస్వతాభిలాషులు తక్షేమమునకు గలుగుచున్న వృద్ధిక్షయముల విమర్శించి యితర సారస్వతములకు వెనుకదీయకుండునట్లు భాషను, వాఙ్మయమును సంస్కరింపవలెననియు మన దేశీయ సహోదరుల యాలోచనయే మిక్కిలి శ్లాఘనీయమును భావి ఫలమునకు సహకారియునై యున్నది. కాలక్రమమున లోక మెల్లను నాగరకతయందు ముందరకు వచ్చుచున్నది. ప్రతి దేశమునకును దేశాభిమానము హెచ్చుచున్నది. దేశవిద్యలయందాదరము మెండుగుచున్నది. సారస్వతాభి మానము దేశాభిమానమునకు ముఖ్యాంగము. ఇది సర్వోచ్చగానున్నపుడే విష్ణువర్ధనంకృష్ణరాయాదిప్రేరితులయి నన్నయ, పెద్దనాది మహాకవులు మహాకావ్యముల రచించి యున్నారు. తరతరములకొలదిని లోకులకు నీతిబోధకమై శ్రేయోదాయకమయిన సారస్వత ముదయించినది. భాష సంస్కరింపబడినది. కాని యప్పటికిని యితరానపేక్షమున కవులు కవితనుమాత్ర మాశ్రయించి స్వతంత్రముగ జీవయాత్ర జేయగలవారు కారైరి. మనదేశమందు గీర్వాణభాషమహోన్నతదశయందున్నప్పుడుగూడ కవులు ప్రాయశఃరాజపోషితులేగాని ప్రజాపోషితులై యుండలేదు. కానీ యాలోపము కవులది కాదు. ప్రజలు సారస్వతమందభిరుచి గలిగియుండి లేని కవులకు స్వతంత్రశక్తిగలిగి గ్రంధరచన మప్రయత్నముగను నిర్దుష్టముగను రసవంతముగను సర్వజనామ రంజకముగను బయలుదేరును. లేకున్నసస్వతంత్రమై లక్ష్మికధీనమై దానిదయనపేక్షించిదాని యభిరుచికి వ్యభిచరించి ప్రజల కుపచరింపక అంత సార్థకముగా నేరదు. పాశ్చాత్య దేశములందు పదు నేడవ శతాబ్దము వరకును కవిత రాజాధీనమైయుండి క్రమముగా బ్రజలవిద్యాభివృద్ధి బలముగా జేసికొని స్వదేశీయాళయమై స్వతంత్రమై ప్రజాక్షేమమునకు ముఖ్యాధారమై వర్ధిల్లు చున్నది. మన దేశనుందు స్వదేశీయులు మొత్తము మీద నిరక్షురులు. సాక్షరులైనవారందరును విదేశవిద్యాభిమానులు. పరిపాలకులు విదేశీయులు. విద్యాలయములు విదేశ విద్యావ్యాపకములు. కాబట్టి జీర్ణమంగే సుభాషితమ్మనునట్లు మనవిద్యలు మనకే కొరమాలియున్నవి. కవులు కవులకొరకై వ్రాయుచున్నారు. పండితులు పండితులకొరకై ప్రసంగించుచున్నారు. స్వదేశ విద్యలు జీవనోపాయములు గాకున్నవి. ప్రజలకు కవితయు, కవికి ధనగౌరవములును దూరమైనవి. రాజునకు దేశహితము నెఱిగించు ముఖ్యమార్గము ముండ్లు బలసిపోయినది. అస్వతంత్రత కొడబడుదమన్నను రాజావలంబము కవులకు గగన పుష్పమైనది. మొన్నటివరకును మనఁయూనివర్సిటీఁవారు దేశవిద్యాతంత్రమందు దేశభాషల కించుక యెడమిచ్చి పూర్వరాజులు లేని కొఱంతను కొంతతీర్చినా ​పురా రు. నేడు దేశభాషా పరిశ్రమ మికరవిద్యా వ్యాసంగముల కభ్యంతరమగునని వారి నైచ్ఛికముజేసి గ్రంథకర్తలకు పోయుచున్న పోతపాలుకూడ నెగజేపీ వేసిన్నారు. ఇక నెవ్వరికోసరము దేశవిద్యల నభ్యసించుట! ఎవ్వరికోసరము గ్రంథములు వ్రాయుట! విశ్వవిద్యాలయమునకు దేశవిద్యలు తనకుమాలినధర్మములై తోచినవి. ముఖ్యభాషలు వాపక్షములై పోయినవి. శాస్త్రములు పరభాషామూలముగా నుపదేశింపబడుచున్నవి. గమ్యస్థానమైన శాస్త్రజ్ఞానము మార్గయాసముచే దుస్సాధ్యనుగుచున్నది. పరభాషలు పరభాషలే. అస్వాధీనయకు పరభాషను స్వాధీనముగు జేసికొనుటలో స్వాధీనయగు స్వభాషయసాధ్యమగుచున్నది. దేశమందు వ్యుత్పత్తి బొత్తుగా అడుగంటినది. విద్య జీవనాధార పరిమితమై తేలినది. సహృదయుల యవస్థ యిటుడుగా, సర్వజన సామాన్య మునకు విద్య కేవలము శశవిషాణమై యున్నది. స్వభాషలో సులభ సాధ్యములగు గ్రంథములు లేవు. పురాణములు గీర్వాణభూ యిష్టములు! ప్రబంధము లినుపగుగ్గిళ్ళు. పూర్వకవివిరచితములైన నాటకసారస్వతము లేనేలేదు. ఇప్పటికవులు వ్రాసిన నాటకములు కథలును గూడ పేలవములు. బాలబోధలుగూడ విదేశభావ ప్రతిపాదకములును విదేశభాషా పరిజ్ఞాన సాధ్యములు ను. రాజవిద్యలగత్యములుగాక, రాజభాష లామూలాగ్రముగా నభ్యసింప నవకాశములేని స్త్రీలవిద్య వృథా కాలయాపనమైనది. బాలుర యావస్మేధాశక్తియును పొగ మూటకట్టుటవలె పరభాషా సంప్రదాయ సంగ్రహణమందు వినియోగమగుచున్నది. అన్ని విధముల నాంధ్రదేశమందు బుట్టి యాంధ్రభాష స్వభాషయగుట శాపవశమైనట్టు గాన్పట్టుచున్నది. ఇట్లుండ థనికులందును, బుద్ధిమంతులందును ఆంగ్లేయభాష విశ్వభాషయై దేశభాషలనాదరణీయములుగ నున్నవి. రాజకీయదీర్ఘ సూత్రములంబన్ను దేశాభిమానులు కొందరు ఇంగ్లీషు విశ్వభాష గాకూడదనియును, తత్సానే దేశభాషలలో ముఖ్యమైన హిందీభాష విశ్వభాషయైనచో, బ్రజలకందరకును స్వభాషా భేదములవలన గలిగిన యభిప్రాయభేదములు నశించి యైకమత్యము హెచ్చి దేశక్షేమ హేతువగునని హిందీభాష యాయాదేశభాషలకు మారుగా పిల్లలకు జెప్పించవలెనని సహస్రముఖములు ఘోషించుచున్నారు. ఈయుపాయ ముపదేశించుటకు సయుక్తికముగానే యున్నది. కాని యాచరించుటకు దుస్సాధ్యమును, సాధ్యమైనచో దేశభాషల కరిష్ట హేతువును, పాఠశాలలలో దేశభాషలు నేర్పుదమంటిమేని గ్రంధసామగ్రి లేదు. గ్రంధములు వ్రాయువారు లేరు. వ్రాసినవి చదువువారు లేదు. ఆమారునీసాభేదముల కుపచరించునట్లు వ్రాయుటకు గ్రంథకర్తలు ప్రయత్నింపకున్నారు. స్త్రీలకు గృహకృత్యమునుండి తీరుబాటైనప్పుడు సత్కాలక్షేపము జేయింతురన్న దగిన గ్రంథములులేవు. మంచి నాటకములాడించి మనస్సుల నలరించి రసరిమగ్నలజేసి నీతియు దైవభక్తియు ప్రతిపాదింతుమన్న గ్రంథములులేవు. మఱోక్కటి, ఇంగ్లీషు వచ్చియురానట్లు నేర్చికొని పరీక్షలను కృతార్థులైన భారతీయ మహాపండితులు దేశభాషల దిరస్కరించి తమ్మాలముగా ప్రసంగించుటయే యకార్యకరణ మనుకొనుచుండగా వారు గ్రంధములవ్రాసి లోకోద్ధారకముజేయుటెక్కడ?


ఇట్టి యవస్థలో మన యాంధ్రసారస్వత సభ యుదయిచింది. దేశభాష నభివృద్ధి జేసి సారస్వతము వివిధజన సమాదరణీయ ముగను స్వతంత్రముగను, విపులముగను సర్వశాస్త్ర ప్రతిపాదకముగను, లోకోద్ధారకముగనుజేయు నుపాయంబుల సభా ముఖంనజర్చించి ప్రచురించుట మనకు ముఖ్యకత౯వ్యాంశమై యున్నది. ఈ మహాకార్యమునకు బైనచెప్పిన వానివంటి యవరోధములనేకములు గలవు. వానిని నివారించి గ్రంథకత౯లకభయమిచ్చి సారస్వతాభిమానులకు పూర్వ రాజుల నడవడి ననుసరించి భావి గ్రంథకత౯లకు మార్గదర్శకముగా గ్రంథములు వ్రాయించి ధనికులు సాహాయ్యముంబడసి యుత్తమ గ్రంథములకు బారితోషికంబుల నిప్పించి గ్రంథాలయముల స్థాపించి, యసద్గ్రంథములకు నిరాకరించి, వాని ప్రాచుర్యము నిరోధించి సద్గ్రంధములను యూనివర్సిటీ, గవర్నమెంటువారల సహాయ్యముంజేకొని విద్యాలయంబులం జదివించి, పత్రికలను నెలకొల్పి, యచ్చటచ్చట నాటకశాలలు, అచ్చటచ్చట శాస్త్రోపన్యాసములు, అచ్చటచ్చట గ్రంథవిమర్శకసభలు, అచ్చటచ్చట బరీక్షలు, అచ్చటచ్చట శాస్త్ర చర్చలు, అచ్చటచ్చట బూర్వ సంప్రదాయ సూచకములగు ప్రదర్శనములు, జరిత్రాంశా న్వేషక సంఘములు, భాషాసంస్కార సంఘములు — నేర్పరచి సారస్వతమూలమున దేశోద్ధారమొనర్చుట మన కార్యక్రమము. ఇదంతయు నొక్కసభలో గాని యొక్కతరమందుగాని నెరవేర్చగలమని భ్రాంతి నొందవలదు. కాని యయ్యది మన గమ్యస్థానమని దృష్టి పధమున నిడికొని దానింజేరు నుపాయముల నారసి మనలో నెవ్వరెవ్వరేయేపనులకు జాలుదురో వారి వారిచే నాయా కార్యములను సమగ్రముగ నెరవేర్పించుట మనయాశయమై యుండదగును. ఇట్టి వ్రతమునందు మనలోని మేథావంతులును, ధనవంతులును దేదీకదీక్షను వహించి తమ లోకోపకారధురీణత వలన దేశమంతటికి ​ని స్వార్థపరత్వమును మాన్పి తమ యాశయమునకు లోకులు సహకారులుగను ఉద్దీపకులుగను పాటుపడునట్లు చేయవలయును. ఈ మహావిధానమును నొక్కొక్కయంశము జర్చింతము.


ఇప్పటిస్థితిలో మనకావ్యము లెట్లు వ్రాయనగును? కవితకు బ్రధానోద్దేశమేమి? ప్రకృతిలకుణము వణ౯ంచి ప్రకృతి తత్వమును బ్రతిసాదించుట సుఖదుఖముల నిష్పత్తిఁ ప్రతిబోధించి జన్మసమర్ధించుట. ప్రభుసమ్మితసుహృత్సమ్మిత, కాంతాసమ్మిత భేదములచే లోకమునకు హితబోధసేయుట. చమత్కారకల్పనలచే హృదయము రంజించుట. మహాకవీశ్వరుల కీయంశములలో బూర్వాపూర్వము లుత్తరోత్తరములకన్న బలీయములు. మధ్యమాఛమకవులు తద్వ్యతిరేకముగా దలంతురు. కాని యెందయినను పరమార్ధవిచారము విడిచి కేవలచమత్కార కధాకల్పనయే కవితకు ముఖ్యమైన యాశయమై యుండదు. స్వభావమం దున్నది యుండవలసినది వణి౯ంచుట కవికి ముఖ్యకత౯వ్యము. భగవదవతార పురుషులగు వేదవ్యాసులు, వాల్మీకియును బ్రకృతిపురుష తత్వములను సంబంధమును ఆనేకవిధములైన యితిహాసముల మూలముగా దమ మహాకావ్యములయందు బోధించి లోక ముద్ధరించినారు. షేక్స్పిజరు, వర్డ్సువర్తు టెన్నిసము లోనగు నాంగ్లేయమహాకవులు జగత్తత్త్వమును వర్ణించి, జగద్ధితముగా నీతిబోధించినారు. ఈగీటు రాతినిరాసి యాంధ్రకవులేందరు వన్నెకువత్తురో మనము విచారి౦తము గాక. అందులకు నిల్చిన కవిత్రయము వారును పోతనకవియును సర్వజన సామాన్యముగా నాహ్లాదకరులయి విలసిల్లుచున్నారు. చిత్రకవిత్వ, బంధ కవిత్వాదులన్ననో కవులు, పండితులు, చూచి సంతసింప సాధనములై జనసామాన్యముగ కవిత్వమనియే పరిగణింపబడకున్నవి. ముందు ఆంధ్రభాషలో బయలుదేరనున్న కావ్యములు కవితాప్రధానాశయములను నెరవేర్చునవిగా నుండుగాక. కవితకు ముఖ్యాంగము రసము . అట్టి రసపోషకములై, పాత్ర చిత్యము, మృదుమధుర శైలి, అర్థవైశద్యము, భావోచిత, సుప్రసిద్ధ శబ్దప్రయోగము, విభావాద్యౌచిత్య్రము, అర్థ పోషణము, స్వభావోక్తి గలిగి కావ్యము లుండదగును. చిత్రకవిత్వము, శ్లేష, అనుప్రాసలు-మున్నగునవి త్యజించి కేవలము కావ్యప్రాణమగు రసమే ప్రథానముగా నుద్దీపింపవలెను. ఇప్పటిస్థితిలో మన ఛందోనియమములు మహాకఠినములయి యున్నవి. అవియే అప్రసిద్ధ నిరర్ధక పదప్రయోగమునకు మిక్కుటమయిన కారణములై యున్నవి. వాని నిర్వహించు ప్రయత్నములో నర్ధభంగము వాటిల్లుచున్నది. పదదాంపత్యము భంగమైనది. భాషా సంప్రదాయము చెడినది. కావున దన్నియమములే ప్రథానముగాగల వృత్తములలో వ్రాయ యత్నింపక సంస్కృతాంగ్లేయ భాషలలో నట్లు సులభచ్ఛందోనియమముల బెట్టికొని వ్రాయనగును. ఆంధ్రభాషాతత్వముం బట్టి పరిశీలింపగా శార్దూలాది వృత్తములు సంస్కృత శబ్దముల విశేషముగా వాడకుండ వ్రాయ నలవిగాదు. దీన దాన కవితోద్దిష్టపరమార్ధములకు జాల భంగము కలుగును. ఆంధ్రభాష స్వభాషగాగల వారందరు దగుమాత్రమయిన కష్టముపై నర్ధము జేసికొనునటుల కవితసెప్పుట ముఖ్యాశయమైనచో నట్టి నియమములు సంకెళ్ళవలె జుట్టుకొనును. అట్టి సంకెళ్ళ ద్రెంపగల మహనీయులు త్రెంచుదురుగాక. ప్రాయికముగా నెంత పరిశ్రమమయినను అర్థగౌరవమందు వినియోగపరచితిమేని రసావాప్తియగునుగాని వృత్తినియమములతో బనియేమి. వృత్తములు సంస్కృతభాష కత్యంతోపయుక్తములే. వానిం దెనుంగులోనికి దెచ్చికొని సంస్కృతమందులేని యతి ప్రాసాది నియమములం బెట్టుకొని, చాలక అనుప్రాసలం బెట్టి నెత్తి కోతలవాడు అమానుషక్రియల జేయ నుద్యమించినట్లు మనకవులు కవితం జెప్పదొడంగి భాషకు వాఙ్మయమునకుంగూడ శాశ్వతానర్ధహేతువులయినారు.


శైలివిషయమున మన కావ్యములు సంస్కృతమాతృకలగు పూర్వకావ్యముల క్రిందను, తెలిసియు దెలియకయు నాగ్లేయమాతృ కలగు నాధునిక కావ్యముల క్రిందను విభజింపవచ్చును. రెండిటియందును వ్యావహారికాంధ్రము దయమాలి విడనాడబడి యున్నది. ఏదేశమందును మొదటికవులు దుర్విదగ్గులును, దంభత్వ విదూషితులునుగాక, సర్వజనసామాన్యముగ సుబోధకమగు భావములు, భాషయు, శైలియు నవలంబించి వ్రాయువారు. క్రమక్రమముగ భాష సంస్కరింపబడి యధ౯ము గంభీరమై, శైలి కఠినమై పరిణమించును. ఎప్పుడయినను రసవంతులుగు కవులు జనోపయోగము కొఱకే వ్రాయుచుందురు. కాళిదాసాది మహాకవులు మొదటివారయినను సరి, మధ్యకాలమువారయినను సరియర్థ వైశద్యము, మృదుమధుర సులభశైలి, భౌవోచిత శబ్దప్రయోగము, స్వభావోక్తి-కొరకే పాటుపడుదురు. ఆంగ్లేయకవులలో మహాకవులయిన చ్యాసెర్ (ఆదికవి) స్పెన్సెరు, మిల్టను, టెన్నిసను, లోనగు కొందరు పండిత పామర సామాన్యముగా ననుభవింపబడుచున్న వారు. మనలో నన్నయభట్ట తిక్కనాదుల శైలిని బట్టి చూడగా వారాదికవులు కారేమోయని సిద్ధాంతము ​జేయ బుద్ధిపుట్టును. ఆదికవులే ఆయిరేని వారి శైలియు భాషయు వ్యావహారికములే యనవలసియుండును. కాని వారినాటికే గ్రాంథికము వేఱు వ్యావహారికము వేఱుగా బరిణమించినది. రానురాను భాష వన్నెతేరి వ్యావహారికమునకు గ్రాంథికమునకును దూరము హెచ్చినది. శైలి బరువైనది. దాంభికము ప్రబలమైనది. అతిశయోక్తి నైజమైనది. నైజము పేలవమయినది. కల్పనలు కల్పితములయినవి. శబ్దాలంకారములు భాషాసంస్కరణముతో గ్రమక్రమముగా నైసర్గికములయినవి. భాషలోని యప్రసిద్ధపదములు పాండిత్య ప్రకటనము కొఱకు మిక్కుటముగా వినియోగములయినవి. అదే కారణముగా గీర్వాణప్రయోగములు, సంప్రదాయములు హెచ్చి స్వభాషనానుడి సతిక్రమించి కేవల పరభాషయై పోయినది. యతిప్రాసలు కఠిన నియమములు నిరర్థకపదముల కెంతో యెడమిచ్చినవి.. భావోచితశబ్ద ప్రయోగమునకు వ్యవహారము తార్కాణగదా. ఇట్లుండగా గ్రంధ శైలి వ్యావహారికాంధ్రమునకు గేవలము వ్యతిరేకమై కొన్ని యెడల హాస్యాస్పదమయినది. దీన దానరసము చెడినది. అర్ధము అనుప్రాసములులోనగు గారడీలకు బలియైనది. సామాన్యకవుల చేతులలో భాషసంస్కృతమునకు దూరమయి తెలుగునకు వ్యతిరేకమై పరిణమించినది. అచ్చ తెనుగువ్రాయుదుమని వూనుకొన్న కొందరు మహనీయులు వికృతములయిన ప్రయోగముల బ్రయోగించి తమ గ్రంధములు తమకేగాని యర్థముకానట్లు వ్రాసి బడవైచినారు. ఒక పద్యమునకు రెండు మూడథ౯లు గల కావ్యములు, తిన్నగా జదివిన నొక యధ౯ము, తలక్రిందు గా జదివిన మరియొక యగ్దము గల కావ్యములుగూడ బయలుదేరినవి. ప్రజలలో గవిత్వమునకు స్వతస్సిద్ధమయిన యాకలిగొన్నవారు ప్రధానములయిన భారతభాగవతాది గ్రంథముల జదుపుచు నర్థము దెలియక యూహించియు, నేర్చికొనియు, ముండ్లలోఁ బండ్లేరుకొనునట్లు శ్రమ పడుచున్నారు. ఇంతలో భాష దేశకాల పాత్రములకు లోనై మార జొచ్చినది. ఆమార్పులు లాక్షణికులు కొందరు గ్రంథములందు నంగీకరింపకున్నారు. మరికొందరు వ్యవహారమందును గ్రాంధిక ప్రయోగములందును దమపాండిత్యము కొలందిని జేయుచు స్వోత్కర్ష బ్రకటించుచున్నారు. మరికొందరు దేశాభిమానులు గౌర్నమెంటువారికి నివేదించి వారి సహాయ్యముచే వ్యావహారిక ప్రయోగములు గల గ్రంధములను బురదలో మట్టించినారు. ఇట్టివారు భాష యొక్క యుత్పత్తిని గాని, సంప్రదాయములను గాని యెరుగరని నాతలంపు. జీవభావ పుట్టినది పుట్టినట్లుండదు. అనేక కారణములకులోనై పదేపదే మారుచుండును. ప్రత్యయములు వేఱగుచుండును. ప్రయోగములు మొదట నొక యర్ధ మందును తరువాత లక్షణయా మరియొక యర్థమందును మారుచుండును. రూపములుకొన్ని పెరుగుచుండును. మరికొన్ని తగ్గుచుండును. మృతశరీరము పెరుగనట్లే మృతభాషయును పెరుగదు. మారదు. కాని భాష జీవించియున్నంతవరకు శారీరిక, రాజకీయ, దైవిక కారణములచే మార్పులొందుచుండగా గ్రంథములలో మాత్రము పూర్వప్రయోగములే సాధువులనియును ఆధునికములు వ్యావహారిక సమ్మతము అయినప్పటికి నసాధువులనియును గ్రాంధికరూపములను గట్టిగా బట్టుకొని యుండుట గడియారములంబట్టి గాని సూర్యుడు గగనమందు దిరుగగూడదని చెప్పిన మూఢులతో సుజ్జీవేయుటయే. వ్యావహారికేతరములైన ప్రయోగము లాధునికాంధ్రమునుండి విసర్జింపవలసినదియే. తదనుగుణములైన వాని సంగీకరింపకున్ని పూర్వపునాణెములే గాని యిప్పటి కొత్తబేడలు, రూపాయనోట్లు ఉపయోగిఁపనిని ప్రతిజ్ఞ జేయు జానపదుని మార్గము. ఈయంశమిఁతకన్న నియ్యెడ జర్చింపబనిలేదు. పర్యాయత్వేన దీనిని సవిస్తరముగా విమర్శింతుముగాక కాని యీసమయమందునే బ్రతిపాదింపదలచిన పరమార్ధమేమన:౼ ఆధునికాంధ్రవ్యాకరణ మొక్కటి వ్రాయించి వ్యావహారిక భాషాప్రయోగముల సాధుత్వాసాధుత్వములు నిర్ణయింప నాంధ్ర సారస్వత సభవారు పూనుకొనవలయునని. ఇందుమూలమున నుచితజ్ఞులుగాని గ్రంధకర్తలు పామరప్రయోగములను, గ్రావ్యములను వాడకుందురు. తర్వ్యాకరణచోదితములైన ప్రయోగములుగల యుద్గ్రంధము లంగీకరంపదగునా కాదా యని తరువాత విమర్శింపగలము.


కావ్యోపయోగముగా నొక యలంకారశాస్త్రము దెలుగున వచనరూపముగా వ్రాయించి భావిగ్రంధకర్తలకు రసము, ఔచిత్యము, గుణము, దోషము, శైలి, నానుడి మొదలగు సంశముల నుపదేశింపగలుగుట యాంధ్రసారస్వత సభోద్దేశ్యములలో ముఖ్యమైనదని నామతము. ఇందువలననే బయిని వక్కాణించిన కార్యదోషములు తొలగి రసవంతములైన గ్రంథములు బయలుదేరుటకు సాధనముగల్పించిన వారమగుదుము. రసస్వరూపము సర్వదేశములకును, సర్వకాలములకును ఒక్కటియే గనుక నీయలంకార శాస్త్రగ్రంథమందు లక్షణములకు లక్ష్యములు, ఆంగ్లేయ సంస్కృతాంధ్ర గ్రంథములనుండి యెంచుట నాయభిప్రాయము. ఇట్టి యలంకారగ్రంథము లింగ్లీషుభాష ననేకములున్నవి. వానియాశయము సర్వజనసామాన్యముగా గావ్యలక్షణము లుపపాదించుట. ​సంస్కృతాలంకారశాస్త్రము లనంతములు. మన పూర్వులేశాస్త్రముబట్టినను దాని మొదలు పాతాళము వరకును, తుద నక్షత్ర మండలము వరకును జూడనిది విడుచువారుకారు. మనలో నలంకార శాస్త్రము అగాధము. దానిని లౌకికోపయోగ మాశయముగా గ్రంథకర్తలకు మాగ్గసూచిగా నొక లఘుగ్రంధము వ్రాయించుట నాయభిప్రాయము.


నాటకములు ధారాళముగా వ్రాయు నలవాటు మన గ్రంథకర్తలు చేసికొనవలయును. నాటకాంశములను జూచుకొనుటలో గతాను గతికముగా పురాణగాధలు మున్నగునవి యెంచుట మనస్వతంత్రశక్తికి లక్షణముగాదు. రసోత్పత్తికి గారణము కానేరదు. లోక చర్యయంతయు గావ్యములకు వంశముగాగలదు. పురాణకధలు గూడ స్వభావమునుండియే తీయబడినవి. మన మేల స్వభావము నుండియే యితరకథలెంచికొని చర్వితచర్వణము మానగూడదు. దేశచరిత్రనుండి యనేకాంశముల దీసికొననగును. సాధారణ మానుష వ్యాపారములనుండి యనంతములుగా దీసికొనవచ్చును. మన దేశమునందలి కొన్ని దురాచారములు నాటకమూలముగా బయలుపెట్టి ప్రజలకు వినిపించి నివారింప మనము సమర్ధులము. స్వాతంత్య్రము బలము. సారస్వతము నందు స్వాతంత్య్రము సారస్వతాశయ ప్రాప్తి కమూల్యమైన సాధనము. తదభావము తదాశయభంగ హేతువు. హరిశ్చంద్ర, నల యుధిష్ఠిరాది మహనీయుల చరిత్రములు మిక్కిలి మనోహరములు, అఖండనీతిప్రబోధకములు. కాని ప్రజలెన్ని మారులు వినువులేక వానినే విననోర్తురు! వానిని మొదటవ్రాసిన కవులు మహాకవులు. వానిసాధనముగా నాకవులు ప్రజల కఖండ ప్రమోదము గావించి లోకోద్ధారకులైరి. అట్టికథలు మానుషచరిత్రయం దెల్లెడను గలిగియుండగా మనము మాత్రమేల యుపేక్షింపవలెను.


మన దేశచరిత్ర సంపూర్ణముగా వ్రాయబడియుండలేదని తమయందరకును విశదమేగద. వ్రాసినది నిజమైనది కాదు. 'ఇండియన్ మ్యూటినీ' 'బ్లాకుహోలు' లోనగు ప్రసిద్ధాంశములను గురించి చరిత్రకారులిప్పటికిని విశేషవైషమ్యము గలిగియున్నారని మనము పదేపదే చదువు చున్నాము. మనము పాఠశాలలో జదువు చరిత్రలన్నిటియందును 3౦౦ మంది యింగ్లీషు సిబ్బంది, 3౦,౦౦౦ మంది ఇండియన్ సిపాయిలను కొట్టిరనియు, హిందువులు స్త్రీలను పశువులుగా జూచు వారనియు, మనకుసత్యము శౌచములోనగు ధర్మములు మృగ్యములనియు వేనోళ్ళ ఘోషింపబడుచున్నవి. ఇవి నిజమే కావచ్చును. కానీ పూర్వోత్తరము లాలోచించినచో నిట్టి పరమాధ౯ము లాపాదించిన మహాచరిత్రతకారులు పక్షపాతబుద్ధితో వ్రాసిరనియు నప్పుడప్పుడు గోచరింపకమానదు. శ్రీ విజయనగర మహారాజులలో నగ్రగణ్యుడగు రెండవ యానందగజపతి - యింగ్లీషువారికి సహాయ్యము జేసి యీ దేశమునుండి ఫ్రెంచివారిని తొలగించుటలో తన బుద్ధిబలమును, సేనాబలమును, ధనమును తృణప్రాయములుగా దలంచి ధారవోసి యింగ్లీషువారితో నొక సంధిచేసి తన యావచ్ఛక్తిని వారివిషయమై సమర్పించినాడు. జయించినతరువాత నింగ్లీషువారు తత్సంధిని పైయధి కారు లామోదించలేదని చెప్పుచు ఆమహారాజును నిరాకరించినారు. విజయనగర పూర్వోత్తర చరిత్రచూడగా నప్పటి కంపెనీ యుద్యోగస్థులు ఆ మహారాజువిషయమై ప్రతిజ్ఞాభంగము జేసినట్లు స్పష్టపడుచున్నది. కాని యిటీవల వ్రాసిన చరిత్రలలో నానందగజపతి మహారాజు కంపెనీవారి కాడితప్పెననియు నప్పటియుద్యోగస్థుల కెంతయు నపచారమొనరించి వారి కాగ్రహపాత్రుడయ్యెననియు బేర్కొనబడినది. దీని నిజము మన దేశచరిత్రయందు గని పెట్టవలసి యున్నది. ఇట్లుగా ననేకవైషమ్యములు మన చరిత్రమునిండ నున్నవి. సత్యమందాదర మొకవంతు, దేశాభిమాన మొక్కవంతు మనలను నిజమైన చరిత్రము వ్రాయ బురికొల్పవేల? నాయుద్దేశము ఆంధ్రదేశమున కంతకును చారిత్రికసంఘ మొకటి స్థాపించి యెచ్చటెచ్చట పూర్వచరిత్రములు, లేఖలు, కథలు, గ్రంథములు, కైఫియ్యతులు గలవో, వానినన్నింటిని సంగ్రహించి యొక దేశచరిత్ర వ్రాయించుట మనకు ముఖ్యవిధియైయున్నదని. దీనియందు మనముచేయు నుపేక్షు పాతిత్యమని నాధృఢనిశ్చయము.


మరియును మనలో గద్యరచన మిక్కిలి యరుదు. ఏ దేశములోను పద్యరచన తరువాత యనేక శతాబ్దములు గడచినపిదపనే గద్యముదయించును. ఇందుల కారణము దురూహ్యము గాదు. గ్రంథరచన మునుమున్ను భావోద్రేకమున బుట్టును. మనదేశ మందు గవితాజన్మమునకు గారణము మహాకవియైన వాల్మీకికి గలిగిన కరుణరసోద్రేకమనియు నారసము తనంతటదానే శ్లోక రూపకముగా వెలువడెననియు బ్రసిద్ధమైన కధ తమకందరకు విశదమే. అట్టి రసోద్రేకమునకు దగిన రచన పద్యమేగాని గద్య కాదు. సామాన్యముగా మనుష్యుని దినచర్యయందుగలుగు విశేషములు కావ్యరచనకు దగినవని పూర్వులెవ్వరును దలంపరు. రామురా నుత్తరప్రత్యుత్తరములు లోకవ్యవహార ప్రసంగములు మున్నగు నవసరకృత్యములవలన గద్యకవసరముగలిగి దేశిచరిత్రాదిమూలముగా వృద్ధిజెందును. ఆంగ్లేయాలంశారికులు కవితకు గద్య పద్యవిభాగము ​మూలము గాదందురు. గద్యయైనను రసస్ఫూతి౯గలిగి యుండెనేని యదియును కవితయనియే యందురు. కాని గద్యపద్య భేదము భావములందు గన్పట్టు. సామాన్యముగా హృదయానందము గలిగించు కావ్యములు కవిత (Poetry) లనియును, జ్ఞానదాయకములైనవి గద్యయనియు (Prose), వారి యభిప్రాయము. సంస్కృతమందు అనుష్టుప్పాది ఛందస్సులు మిగుల సుకరముల గుటంజేసి సమస్తశాస్త్రములు పద్యరూపకముగనే యువపాదింపబడి యున్నవి. ఆంధ్రసారస్వతమందు ఆంగ్లేయము ననుసరించి గద్యవిశేషముగా వ్రాయవలసి యున్నది. దేశచరిత్రములు, గ్రంధవిమర్శలు, కవిజీవితములు, శాస్త్రసారస్వతము, వార్తాపత్రికలు లోనగు వానికి గద్యయే తగిన వాహకము, అందు ప్రాయికముగా శబ్దాలంకారము లుండవు. అర్ధాలంకారము లరుదు. మహాగద్యకవుల శైలి సులభముగను, శృతిహితముగను, అనాయాసముగను, సుప్రసిద్ధ పదభూయిష్ఠముగను ఉండి యాశయము విస్పష్టముగ దెలియజెప్పు చుండును. అట్లువ్రాయుట పద్యరచనకన్నను కష్టము. నవలలులోనగు వానియందు వర్ణాంశము మిక్కిలి యుండును. అలంకారములు గూడ నుండును. కాని కొన్ని యాంధ్రకావ్యములయందువలె వర్ణాంశముల కొఱకై కధాభాగములు మార్చుట, అలంకారములకై వర్ణనాంశములు బెంచుట యెన్నడును గానంబడదు. ఇది మన సామాన్య కవులకు మాత్రమే చేతనయినయంత్రము. తగిన కథలు గలిగి రసవంతములయిన నవలలు మిక్కిలిగా మనము వ్రాయించ వలసి యున్నది. న్యాయమైన గద్య ఉన్నది ఉన్నట్లు వృత్తంతా మూలముగా బోధించు చరిత్రాదులయం దుపయోగమైనది.


అన్నిటికన్నను మిక్కిలి యపయోగములయినవి వార్తాపత్రికలు, బాలవాఙ్మయమును. వార్తాపత్రికలు మనకు అన్నివిధములయిన వ్యాపారములయం దుండవలయును. వానిభాష వ్యావహారిక భాషయై నుబోధకరముగ నుండవలెను. ఆంగ్లేయభాషా సాంప్రదాయ ములను వర్ణింపవలెను. ఆంగ్లేయభావములకు సరియైన యాంధ్రగీర్వాణములు దొరకనప్పుడు ఆంగ్లేయభాషాసమములైన పదములతోనే విశదీకరింపవలయును. కాని అర్ధముకాని సంస్కృత సమాసములుగా తర్జుమా చేయవలదు. "మండల కరగ్రాహి" త్యాది పదములు సంస్కృతమందు తప్పు. ఆంగ్లేయ రాజ్యతంత్ర పరిభాషకు సరియైనవి కావు. స్వతంత్రముగా దీసికొనిన నిరర్ధకములు. అట్టివి పనిబట్టి త్యాదింపవలెను. “కలెక్టరు " అనినఁదువలన భాష యెంగిలి కానేరదు. గ్ర౦థవిమర్శకును చరిత్రాత్మక వ్యాసములు వ్రాయుటకును, రాజకీయాది వ్యవహారముల జర్చించుటకును మాసపత్రికలుండవలయును. అందలి వ్యాసములు గూడ నిర్దుష్టమై సుబోధకమై, సహేతుకమై యుండవలయును.


బాలవాఙ్మయమని నేబేర్కొ నిన యంశము సభ్యులెల్లరు సావధానముగా జిత్తగించి యాలోచింపవలసి యున్నది. ఒక యాంగ్లేయ పుస్తకశాలకు బోయి చూచినయెడల మూడేండ్ల శిశువులు మొదలు జేసికొని బాలురకత్యంతో పయోగమైన వివిధములైన గ్రంథములు కానిపించు ముందు బొమ్మలు, అక్షరములు, చిన్నకథలు, లోకోక్తులు, మతవిషయిక గాథలు, నీతికథలు, మహనీయుల చరిత్రములు, లోక జ్ఞానము, యంత్ర సాధనములు, ప్రకృతిశాస్త్ర ప్రసంశ - లోనగు జ్ఞాతవ్యాంశములు వేనవేలు గలిగిన గ్రంధములనేకము లొక్కొక్క వయసునకు దగినవి యొక్కొక్క విధమైన భావములు శైలితో వ్రాయబడియుండును. అట్టి గ్రంథములు తెలుగుభాషను వ్రాయగా జూచి యానందించు భాగ్యము నాకెన్నడైనను గలుగునాయని వాని జూచినప్పుడెల్ల మాటల నూరు చుండుదును. నిన్నటిదినమందు బ్రదర్శింపబడిన గ్రంథాలయ వస్తుప్రదర్శనమందట్టి ప్రయత్న సూచకములగు కొన్ని చిన్న పుస్తకముల జూచి యమితానందమైనది. అట్టివేనాకు గావలసినపుస్తకములు. చక్కని తేట తెలుగు మాటలతో మృదు మధుర శైలితో బాలురకు ప్రాయికముగా దెలియు సంశములగూర్చి నీతిబోధకములు గాను, చమత్కారముగాను, హృదయ రంజకముగాను, చదువుకొన్నంత మాత్రముచేత నానందభరితులంజేయగలట్టి చిన్నకావ్యములు పాటలు బాలురకై వ్రాయనగును. దీనికిని నాంగ్లేయరచన మంచి మాతృక కాగలదు.


ప్రకృతిశాస్త్రములు విరివిగా నాంధ్ర భాషయందు వ్రాయింపదగును. వాని శైలివిషయమై వేఱుగ జెప్పనవసరములేదు. వాని తాత్పర్యమునకు దిగిన సులభగద్యయే దానికుపపత్తి. పరిభాష విధిగా నాంగ్లేయపరిభాషా సమముగా నుండవలెను. “బొగ్గు పులుసు వాయువు,” “వియుక్తాగ్రగుడము,” “సంయుక్తాగ్రగుడము" లోనగు ప్రయోగములకు భాషాద్వారములు మూయందగును.

పైవిధానము సమగ్రముగా నడిపించుటకు సారస్వత సభాంగ మైన యుపశాఖలు బయలుదేరి యొక్కొక్క పని కొక్కొక్క యుపశాఖ నిర్ణీతమై వ్యవహరింపవలని యుండును.

ఇక నింతటితో విరమింపదగును. మీరు దయచేసిన స్వల్పకాలములో సారస్వత విషయమై మునుమున్ను దోచిన యూహలనే యిందు బొందుపరచినాను. కానియే ​యంశమును విపులముగా బ్రతిపాదింపలేనైతిని. కాని రాబోవు నాంధ్రసారస్వతమీవిధముగానుండిన బాగుండునని నాయభి ప్రాయములు మాత్రము సూచించి విజ్ఞులైన తమ్మందరును వానిని విమర్శనముగా నాలోచించి న్యాయమని తోచినవాని నవలంబించి ప్రచురము చేతురని వేడుకొనుచున్నాను.


అంతటితో ప్రాతః కాలసభ ముగిసినది. తిరిగి మధ్యాహ్నము ౪ ఘంటలకు సభకూడెను. అప్పుడీ తీర్మానములు చేయబడినవి:౼

తీర్మానములు

౧. యూనివర్శిటీ వారేర్పరచియున్న పండితపరీక్షలయందును గివర్నమెంటువా నేర్పరచియున్న సంస్కృతపరీక్షల యందును గల సాధకబాధకములను దొరతనమువారికి నివేదించి వారియభిమతమునుబడయు నీ క్రింద ఉదహరించిన వారిని సభవారు పసంఘముగా యేర్పరుచు చున్నారు. వీరు రాబోవు సంవత్సరములోపున ఈకార్యము నిర్వర్తింపవలయును. (ఇరవైమంది పేర్లుగలవు)

౨. శ్రీ ఆంధ్రమందుత్తమ విద్యావ్యాపనమునకై విజయనగరామం దేర్పడియున్న యాంధ్రవిద్యానిలయ ప్రయత్నములకు సాహిత్యపోషకులును సాహిత్యాభిమానులును ఆగు నాంధ్రప్రముఖులు తగురీతిని సహాయముచేయవలెనని ఈసభవారు ప్రోత్సాహించుచున్నారు.

3. ఈయాంధ్రసారస్వత మహాసభా సమావేశములు నిర్విఘ్నముగా చేయుటకై ఇందుదహరించిన నారిని (తమతో నితరుల జేర్చుకొను నధికారముతో) స్థాయిసంఘముగా నేర్పగుచుచున్నారు. (ముప్పదిమంది పేర్లుగలవు)

౪. శ్రీ పిఠాపురం రాజా గారు వ్రాయింపు సమకట్టిన సూర్యగా యాంధ్రనిఘంటువు భాషాభివృద్ధి కార్యములకు అత్యంతవసరము అయియున్నది. కావున దానిని శీఘ్రముగ పూతి౯చేయింప యీ సభవారు వారికి విజ్ఞాపన మొనర్చుచున్నారు.

౫. విశ్వవిద్యాలయమువారు ఇంటర్మీడియేట్, బి.ఏ. పరిక్షలలో తెలుగు సాహిత్యము నిర్బంధముగా నుండు నటుల చేయవలెనని యీ సభ వారు వారిని కోరుచున్నారు.

౬. ఆంధ్రభాషకు సంపూర్ణమగు వ్యాకరణము లేదు. ఆంధ్ర సారస్వతాభివృద్ధికి అడ్డుగానుండుటచే అట్టి వ్యాకరణము రచియించుట కొక పండితసంఘ మేర్పాటుచేయవలెనని యీ సభవారు తీర్మానించుచున్నారు.

౭. దేశభాష వాఙ్మయచరిత్రలు భాషాభివృద్ధికి ముఖ్యాధారములగుటను యిప్పుడు వ్రాయబడిన కొన్ని చరిత్ర లసమగ్రములుగ నుండుటచేతను నిరాధాగ సిద్ధాంతి భూయిష్టములై కనబడుటచేతను, సరియైన చరిత్రిలు వ్రాయి౦చుట యావశ్యకమని యీ సభవారు తీర్మానించు చున్నారు.

ఆరవ ఆంధ్రదేశ మహాసభతోబాటు వాల్గవ సారస్వత మహాసభను గూడ మద్రాసునందే జనుపుటకు ఆహ్వానింపబడి అందరిచే న౦గీకరింపబడెను. అంతటితో సభ ముగిసెను.

విందు

ఈ రెండు సభలకును వచ్చిన ప్రతినిధులందరికొని ౨౩ వ తేది సాయంకాలము ఐదుగంటలకు శ్రీ ప్రభల నరసింహంపంతులు గారు ఫలాహారముల విందునోసంగి అందరిని ఆనందింపజేసిరి.



This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse