Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 2/సంచిక 1/విజయదశమి

వికీసోర్స్ నుండి

శరదృతువు

విజయదశమి

కాలము

.
తే.

 “కాలచక్రంబు ◆ నిరవధి కంబు దీన
సర్గములుఁ బ్రళయంబులుఁ ◆ జనుచునుండు
ప్రళయమునఁ బరమాత్ముండు ◆ ప్రకృతిబొందిఁ
యఖిలమును సృజియించు గ◆ల్పాదియందు.

అని భీష్మాచార్యుని నిర్వచనము. కాలమునకు ఆద్యంతములు లేవు, వృద్ధిక్షయములు లేవు. ప్రాత క్రొత్తలు లేవు. అనంతమయిన కాలస్వభావము కేవలభావనీయమనివ్యాస మహర్షి మతము; కాని ఈ కాలస్వభావస్వరూపముల నన్వేషించుటకు బొత్తుగా అవకాశములు లేకపోలేదు. కాలము నెవ్వరో సనాతన కవులు చక్రమునకుఁ బోల్చిరి. ఇందుగంభీరమైన ధ్వనికలదు. చక్రస్వరూపమున 'ఆద్యంత’ నిరూపణము దుర్లభము. చక్రస్వభావమున 'భ్రమణము' నైజవిలాసము. కాల మెప్పుడును స్థావరము కాదు. కావున చాలనీయమనుట క్రమాగత సిద్ధాంతము. ఐఁక నీ కాలచక్రమందు అవయవప్రకార మెట్లు నిరూపింపబడినదో చూతము. కాలమందు దీఘ౯మయిన అగ్రభాగమునకు యుగమని పేరు. హ్రస్వమయిన ఆది భాగమునకు నిమేషమని పేరు. ఇట్టి నిమేషములు ౧౮ ఒక కాష్ట. 30 కాష్ట లొక కళ. 3౬౦ కళ లొక ముహూత౯ము. 3ం ముహూత౯ము లొక దినము. 3౦ దినము లొక మాసము. ౨ మాసము లొక ఋతువు. 3 ఋతువు లొక అయనము. ౨ ఆయనము లొక వత్సరము ఇట్టి వత్సరములు ౧౭,౨౮,౦౦౦ కృతయుగమున గడచినవి. ౧౨,౯౬,౦౦౦ త్రేతాయుగమందుతరించినవి. ౮,౬౪,౦౦౦ ద్వాపరమునదాటిపోయినవి. ౪,౩౨,౦౦౦ కలియుగమును ముగింపనున్నవి. ఇందో సరికి ౫౦౧౭ మానుషాబ్దములు నడచినవి. సృష్టి ఆదినుండియును ఈనల సంవత్సరముతో ౧౯౫,౫౮,౮౫,౦౧౭ యేండ్లు గతించినవని గణకులు సిద్ధాంతీకరించుచున్నారు. ఈ సృష్టి ఏసృష్టియో చెప్పలేము. ఇన్ని సంవత్సరములనుండియును విజయదశమి మహోత్సవ మారాధనయందున్నదో లేదో చెప్పలేము. కాని ఒక మాట నిజము. వత్సరము"ను మానవుడెపుడు కాలమానముగా నంగీకరించెనో అప్పటినుండియు ఋతువిభాగము వచ్చుచున్నదనుట కేవలమూహాసిద్ధాంతము కాదు. ఆరు ఋతువులలో

శరదృతువు

నకొక విలక్షణత్వ మున్నదనక తప్పదు.
శ్లో.

 వాషి౯కంసంజహారేంద్రో
ధనురె క్షెత్రం రఘుర్దథొ౹
ప్రజార్ధసాథనేతౌహి
పర్యాయోద్యత కార్ముకొ. రఘువంశము.

అని మహాకవి శరదాగమమును సూచించెను - వానకొఱకై వహించిన ధనువును ఇంద్రుఁడుపసంహరించెను. విజయ ప్రియుడై రఘుమహారాజు చాపమునులేవనెత్తెను. శరదృతు వనేక విధముల పూజాఋతువనుటకు సంశయము లేదు. వానలు వెనుకపడును. పృధివియంతయు క్షాళితమయిన తేజస్సుతో పచ్చబడును. ప్రవాహముల యందుదకములు ముక్తకాలుష్యములై స్నానీయములగును. కావురుగమ్మిన దిశాచక్రములు సహజసౌందర్యములతో వెలుఁగును. పొలమంతయు మొలకపైరుతో మోహనముగా నవనవలాడును. ఆకురాలిన మోడడవులు నల్లబాఱిన యాకు జొంపములతో సాంద్రములగును. దుద్దిన పీడితములయిన తామరకొలకులు మరల సంపూణ౯శోభలతోఁ బ్రఫలములగును. పగలు ప్రసన్న వాతములతో సూర్యుఁడును, రాత్రులు కర్పూరాతపములతోఁ జంద్రుడును లోకముయొక్క ఉత్సవప్రసక్తినిఁ బ్రేరేపింతురు. అందువలననే కర్మానుష్ఠానయోగ్యమగు నీ ఋతువును ఆర్యులు పూజాపురస్సరముగ నామతించిరి. మొదటినుండియును శరదృతువు నందు విజయదశమి ప్రథానోత్సవదివసముగాఁ బరిగణింపఁబడినదని వాదించుట ప్రమాదము. విజయుఁడు స్వకీయవిజయోత్సవముచే అమృతముగా జేసిన యుత్తమదివసమగుటవలన విజయదశమియని పేరెక్కినది. విజయుఁడు కుంతీపుత్రుఁడు. పాండవమధ్యముఁడు. వీరు ద్వాపరాంతమందున్న మహావీరులు. అప్పటినుండియు నీదినమందు వీరారాధన జరుగుచున్నదని చెప్పిన యుక్తముగ నుండును. కాని ఏతత్పూర్వ యుగములందు వూజయే లేదనుట తప్పు. శరదృతువు

ఆశ్వీజ

మాసముతో నుదయించుచున్నది. అందు శుక్రవారముఖములతిమనోహరములు. వర్ధమానములు. కర్మయోగ్యములు. పూజాప్రయుక్తమగు ఆర్యకర్మ నానాముఖముల దీపించినట్లు ఇతిహాసములు సెప్పుచున్నవి. యజ్ఞములు, యాగములు, దండయాత్రలు, సరస్వతీ పూజనములు మున్నగునవి కొన్ని సనాతనకర్మలు. పూర్వయుగము నందు శరదృతువు సరస్వతీ పూజారంభముతో నైక్యమ గుచుండెను. సరస్వతీపూజ వైదిక యుగమందుఁగూడ బ్రచారములో నుండెను. సరస్వతి వాగధిష్ఠానయగు దేవత. స్రవంతీమతల్లియైన పుణ్యవాహిని. ఋగ్వేదము నందు సరస్వతిని బ్రబోధించు అనువాకము లనేకము లున్నవి; కాని

సరస్వతి

వేదయుగమునాటికి కేవల వాణీపాలినిగా భావింపఁబడినట్లు తోపదు. సరస్వతి యిసుకపడకలలోఁబడి ప్రవహించు చక్కని నది. పెక్కు ఋషికులము లీ నది కిరుకెలకుల నుండెడివి. వారి పరిమళ్ళు సరస్వతీతోయముతోఁ బెరిగెను. వారి వనస్పతులు సరస్వతీనీరములు త్రావి ఫలవంతములయ్యెను. వారి పూలతీగెలు సరస్వతీ జీవనాధారముచే కొనసాగి కుసుమించెను. మహర్షు లీనదిలో స్నానమాడిరి. మహషి౯ పుత్రికలీయేటి నీళ్లెత్తి కొనిపోయిరి. మహర్షుల యావులీ కల్లోలవతి యొడ్డున మేసి ఛాయావృక్షములక్రింద నిలచి నెమరువెట్టెను. అందువలననే సరస్వతి పేరు వారికంత ఆప్తముగ స్తవనీయమయ్యెను. ఈ క్రింది సూక్తిని జదువుఁడు.

ఋక్కు. పావకానః సరస్వతీ వాజే భిర్వాజినీవతీ!
యజ్ఞం వష్టుధి యావసుః॥

అర్థము. పరిశుద్ధిని, అన్నమును, ధనమును గలుగఁజేయునట్టి సరస్వతీ దేవి (యజమానునాకీయవలసిన) అన్నాది సువస్తువులతో వచ్చి మా యజ్ఞకర్మను నెఱవేర్చును గాక!

ఋక్కు. మహోఅర్థః సరస్వతీ| ప్రచేతయతికేతునా!
ధియోవిశ్వావిరాజతి॥

అర్థము. (నదీరూపమగు) సరస్వతి (ప్రవాహరూపమగు) కర్మచేత కావలసినంత యుదకమును ఇచ్చుచున్నది. సమస్తమైన (కర్మానుష్ఠానయోగ్యములయిన) బుద్ధులను ప్రకాశింపఁజేయుచున్నది.

ఈ పైసూక్తములవలన సరస్వతి నదీరూపిణియగు దేవతగా భావింపఁబడిన దనుట నిశ్చయము. ఇది వైదికయుగ విషయము. కాని ఆయుగమందే సరస్వతి అన్నదాయినిగా ధ్యానించినట్లు అచ్చటచ్చట అనువాకములు కలవు. సరస్వతి పాలుపిండును, వెన్న తీయును, అంతేకాదు ఋజువులును, రసవంతములును నగు వాక్కులను బ్రసాదించును. ఇట్టి వింకను గొన్ని విశేషణములు సరస్వతికి వాడఁబడియున్నవి. నదియైన సరస్వతిని దేవతగా గొలుచుటలోఁ జక్కని యర్ధమున్నది. నదుల యుభయపార్శ్వములయందును బచ్చని పొలములు వధి౯ల్లును. చక్కని పట్టణములు కట్టఁబడును. వాణిజ్యవ్యాపారములు సాగును. అన్యోన్యస్థలాంతరములకు చనవు సరసము లభివృద్ధియగును. వేయేల నాగరకతా వికాసములు నదుల వంటియె వ్యాపించి తేజరిల్లినవి. నైలునదీతీరమునందె ప్రాచీనమైన ఈజిప్టు నాగరకత మొలచి మోహపెట్టెను. సింధుగంగామహావాహినులతో ఆర్యుల సనాతన సభ్యతయైక్యమైనది. తెనుగుసీమయందు ప్రాక్తనాంధ్రనాగరకత గోదావరీ వీచికలపై ఉయ్యాలలూగినది. అందువలననే నదులు పూజ్యములయినవి. మఱియు ఆర్యుల సంధ్యావందన సంకల్పమునందు సైతము స్మరణీయములుగా ననువదింపబడినవి. కాని ఈ భావము కాలక్రమాగతమయిన భేదార్థమున కగ్గమయినది. కావ్యక్రీడనము పుష్పించినకాలమున

"ఆద్యేఆత్మని వాసనిత్యరసికే ఆనందమాధత్స్వమే” అనియు,
'రమ్యేరమ్యత రేరనేరసకలే రక్తాంశు కేరంజకే'

అనియు మధురముగా కాళిదాసు దేవినుపాసించెను. అధ్యయనము నిత్యబ్రాహ్మణవిధిగా నంగీకరించుసరికి

శ్లో.

సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ
విద్యారంభంకరిష్యామి| సిద్ధిర్భవతు మేసదా.

అను సులభసూక్తిధ్యానవాచికముగా నల్లికొనియెను.'ఆధునిక కాలమందు మానవ స్వభావమునందున్న సంగీత సాహిత్యములును, కళాకాంతులును, భాషాభావములును, ఉద్దేదీపింపఁజేయు మధురార్ద్రశక్తుల కన్నిటికిని సరస్వతి అధిష్ఠాన దేవతగా భావించి అర్చింపఁబడుచున్నది.

ఈక్రింది పద్యము లిందులకు దార్కాణములు.

ఉ.

పాలును నీరు వేఱుపఱు
        పంగలమావుల వేదవీధివా
హ్యాళియొనర్చునే యలికు
        లాలక, తాసితవర్ణయయ్యు నే
బాలసువర్ణ దేహమున
        భాసిలు, నానలు మోము వేల్పుప్రో
యాలు, వలంతిపల్కు జవ
        రాలునటించుత నాదు నాలుక౯.


శా.

తల్లీ! నిన్ను దలంచి పుస్తకముచే
తంబూనితి౯ నీవు నా
యుల్లంబందుననిల్చి జృంభణముగా
        నుక్తుల్ సుశబ్దంబు శో
భిల్లంబల్కుము నాదు వాక్కునను స౦
        ప్రీతి౯ జగన్మోహినీ!
ఫుల్లాబ్జాక్షి; సరస్వతీ! భగవతీ!
        పూర్ణేందు బింబాననా!

జైత్రయాత్ర

క్షత్రియులకు దిగ్జిగీపాతృవ తీండ్రించు దినములి వియె. వానలాగిపోయి, త్రోవలెండుటచే సేనాగమనము సుగమమగును. రఘువు దిగ్విజయ యాత్ర నభివర్ణించుచు కాళిదాను

గీ.

“దాటుటకు నర్హముగ నదుల్ ♦ దనరఁజేసి
అడుసు లేనట్లు త్రోవల ♦ నలరఁజేసి.
తచ్ఛరత్కాలమాతని ♦ దండయాత్ర
కరుగఁ బురికోల్పెనతఁడను ♦ కొనకమున్నె".

అని కాలయోగ్యతను నిరూపించెను. రాజులు సామాన్యముగా నీఋతువును విజయ యాత్రాకాలముగాఁ బూజించిరనుట నిర్వివాదము. అప్పటినుండియే ఆయుధపూజ ప్రారంభమైయుండవచ్చును.

శ్రీహర్షుని సత్రయాగము శరదృతువునందు జరిగెను. బౌద్ధులత్రివేణీ పరిషత్తు కార్తిక జ్యోత్స్నలలో సనుకూడెను. శ్రీకృష్ణుని రాసక్రీడనము శరత్తునందేరాణించెను. ధర్మజుఁడు రాజనూయమును ఈ శుభదినములలోనే జరిపించెను; ఇంకెందుకు మహభారత యుద్ధమె కార్తీక బహుళమున జరిగినది. కాని విజయఁఁడీ శరత్ర్పారంభమునకు స్థాయిపూజను గల్పించెను. లేనిచో నిది భారతవషీ౯యులకు జాతీయోత్సవకాలముగాఁ బాదుకొనియుండదు. భారతవీరులలో అర్జునకుఁగల పూజ్యపదవి యనన్యమయిన దనక తప్పదు. ఒక పక్షమున భారతకధారచనకు నాయకుఁడే అర్జునుఁడని చెప్పవచ్చును. రధానురధికులు ప్రాణవిసజ౯నము చేసి యశోమాజ౯న మొనర్చిన మహాభారత రణనాయకత్వము అర్జునునకు గట్టిపెట్టుట నిర్వివాద విషయముకాదు. కాని తత్వజ్ఞులీ నిణ౯యమునకు విరుద్ధులుకారు. భారతపాఠకులకు మొట్ట మొదట రంగమందు మహత్తరమగు

భీష్మ తేజస్సు

పరిస్ఫుటము గాఁ గానవచ్చును; కాని భీష్ముడువీరుఁడుగా కంటెనాచార్యుఁడుగా నధిక ప్రశంసనీయుఁడయ్యెను. అదిగాక ధర్మాధ౯ కామమోక్షములు నాల్గింటను నీకురుకులతిలకుని జీవితము యధాపూణ౯ పరిణామమును బొందలేదు. భీష్ముని మహాసంగ్రామమందు నాయకుఁడనుట కంటే, ఆ వీరకుటుంబమందు రాజషి౯యనుట సమంజసము. తరువాత వస్త్రధారులలో ద్రోణకృపాశ్వద్ధాములు మ లు వత్తురు. వారందఱును బ్రాహ్మణులు. ఆచార్య పీఠస్ధులు. పాలితులుగాని పాలకులుగారు. వీరు సుయోధన నియోగమందుండిరి కావున యుద్ధమునందంజవేసి పోరాడిరి; అంతేకాని వీరుండినందువలన యుద్ధము దాపరింపలేదు. వీరి జీవితములు వృత్తిధర్మమునందుత్తమపురు షులకుగల యభిమాన కౌశలములను జూపుచున్నవి. కాని స్వధర్మానుష్టానమునందుఁగల అసిధారావ్రతమహత్త్వమును బ్రదర్శించుటలేదు. అందువలన వీరు నాయకకక్ష్యనెక్కుదురను న్యాయములేదు. మిగిలిన యోధగణమందు సుయోధనకర్ణులు ప్రధాన పురుషులు. సుయోధనునీ జీవితము క్లిష్ట విమర్శనకుఁ జోటిచ్చు దురంత గర్భితమైనది. సుయోధనునియందుఁ జక్రవర్తికుండవలసిన యుదారలక్షణములున్నవి. యోధునకుఁ గావలసిన బల సాహస ప్రావీణ్యము లున్నవి. కాని ఉపాయ నీతియందు దక్షత తక్కువ. సాంప్రదాయ పధముల పట్ల ప్రమాణబుద్ధి స్వల్పము. ఆత్మగతియందలి విశ్వాసము కంటె నాప్తవచనమునందు నమ్మక మెక్కువ. అందువలన నే సుయోధనజీవితము మొదట శకుని దురూహాయంత్రమందును, పిమ్మట కర్ణుని నిరంకుశసాహసరటనమునకును జిక్కి, ఎటుదిప్పిన నటు లాడినది. ఇతనికి పట్టుదలగలంత పరిశీలన లేదు. సంకల్పబాహుళ్యమంత భావసమృద్ధి కానరాదు. ఉత్తమచక్రవతి౯ కేవల యోధుఁడు కానేరఁడు. కేవల నైతికుఁడును గాఁబోఁడు. సామ్రాజ్యభోగమునందెంత ఏకగ్రీవమయిన ఆసక్తియున్నదో, తత్సాధనాసాకల్యమునందంత నీతిప్రయోగ నైపుణ్యములు కావలెను. ఈ రెండును ఇందుసమ్మేళములు కాలేదు. మిగిలినవాఁడు

కర్ణుడు

కర్ణుని భాగతనాయకుని గాఁ జేయుట ఇతిహాసరచనా ధర్మమునకు విరుద్ధము కాదు. కాని భారతమువంటి "సంహిత"కు ఔచితినితేఁ జాలదు. భారతకధాసంవిధానము నొకవలకుఁ బోల్చినచో, కర్ణుడు దానికి కొలికిత్రాడుగును కాని కన్నులలో నొకకన్నుగాఁడు. కర్ణుఁడు నిశితయోగ్యుఁడు. అందునకు సందేహము లేదు. అయితే అతనియోగ్యత "రణపాలన”మందు అసిధారావ్రతలకుణములతో విమర్శింపఁదగీనది; కాని ధీరోదాత్త కావ్యనియమములతో నిరూపింపఁ దగినది కాదు. అట్టి నిరూపణకు వశముకాదనియే నావి ధేయాశయము. కర్ణ జీవితమును ఉదా తభావముతోఁ బరిశీలించినచో ఖండితమయిన సిద్ధాంతము తేలదు. అక్లిష్టనిష్పత్తి యుత్పన్నమగును. భారతపర్వముల యందనేక స్ధలాంతరముల కర్ణుఁడు విషయనివాధిగాఁ బోషింపఁబడి యున్నాఁడు. ఆపట్ల నెల్ల నొకరహస్యము బయటపడును. కర్ణుఁడు సంశయగ్రస్తములగు భావములు కలవాఁడుకాడు. ఆతని సంకల్పమెంత దృఢమయినుదో, ఆతని క్రియాదృష్టియును అంతనిశ్చలమైనది. అందువలననే తనకుఁ దోచినదెల్ల కార్యపరిణామమనియె విశ్వసించెను. అట్లే ఖండితముగా వారించెను. మతాంతరమును నిరసించెను. తెగఁబడి తత్కార్యసాధనమునకు దూకెను. కాని పర్యవసానమునందు అన్యధా భావవశుఁడగుచు వచ్చెను. ఈతఁడు చెప్పినంత చేసియున్నచో, భీష్మాది రధికవర్గమునకు అంతచేటు నిరసనభావము దయి౦చియుండదు. ఇట్లు చర్చించుటచే, అతఁడు చెప్పినంత చేయఁజాలనివాడని యర్ధముచేయఁగూడదు. ఇచటఁ బ్రసక్తి కాయికశక్తి కాదు నైతికయుక్తి. కర్ణునియందు ఎన్నిగుణము లైననున్నవికాని మాత్సర్యము మాత్రము లేకపోతే లేదు. ఉదాత్త జ్వలితమగు నాతని గుణతేజస్సు “పగ” పాలై పొగఁబాఱినది. కర్ణకథావిధానము ఎంతవఱకును బ్రచండముగ నుద్ఘాటింపదగినది కాని ప్రమధురముగ ధనముఁ జేయఁజాలినది కాదు. ఏ సందర్భము నెట్లు సమస్వయించినను ఈ మహావీరుని దృష్టియందు "పగ” పొగరాజుచున్నట్లు ప్రదర్శింపకపోరాదు. ఈపగ ఎక్కడిదందురా? కుమారాస్త్ర విద్యాసందర్శన ముహూత౯ మందు అంకురించినదె. కావున కర్ణుని పరాక్రమము మాత్సర్యనైమిత్తికముగఁ బ్రకాశించినదనుట సామంజస్యమునకు దూరముకాదు. ఒకానొకపగచే ఏకపక్షదీక్షితుఁడయిన యోధుని ఉభయకుల ప్రచారగర్భితమగు భారతమునకు బ్రధాననాయకుని జేయుట వలనుపడదు.

ఇఁక పాండవపక్షమునందుఁ గధానాయకత్వము వహింపఁదగిన వారు యుధిష్ఠిరార్జునులు. భీమాదుల నెందుకువదలితినో కురుకులయోధవిమర్శన ధోరణిఁబట్టి సులువుగ నూహింపఁగలరు.

ధర్మరాజు

యుధిష్ఠిరునకు ధర్మరాజని నామాంతరమువాడిన వ్యాసుఁడు మిగులగడుసువాఁడు. ధర్మరాజును మొట్టమొదట వేత్తగా వర్ణించినాఁడు. తరువాతఁ బ్రశాంతునిగా బ్రదర్శించినాఁడు. చివరకుఁ గేవలస్వార్ధనిస్పృహునిగా వన్నె వేసినాఁడు. ధర్మజుని ప్రవత౯నమందు. క్లిష్టమును అసందర్భమునగు విమర్శనీయవృత్తి లేకపోతే చు; కాని క్వాచిత్కము. అదిగాక ధర్మరాజను పేరు చాలవఱకీ చిత్రవైరుద్ధ్యమును గప్పి పెట్టుచున్నది. వ్యాసుఁడు వ్రాసిన వ్రాతలు సదివియే, చేసినచేతలుసూచియే మహాకవి వేమన

పేరుధర్మరాజు ♦ పెనువేపవిత్తయా
విశ్వదాభిరామ ♦ వినుర వేమ!

అని సవ్యాజముగాఁ బాడియున్నాఁడు. యుధిస్థిరజీవితమునందు గొన్ని యంశములు వాదనీయములు. ఈయుత్తమక్షత్రియుఁడు జ్ఞానయోగియా లేక కర్మయోగియా? నీతిజ్ఞుఁడా లేక నీతినిర్వాహకుఁడా? నాధనసవృద్ధుఁడా? లేక సాధన సమర్ధుఁడా? ఈ విషయములు తేలవలెను. ఇవియన్నియు సున్నితమయిన భేదములు. సూక్షమయిన భావచర్చలు; కాని ఈనిరూపణము నుంచియె ధర్మరాజు జీవితము పోషింపబడవలసియుది. ధర్మజుఁడు ఎంతవేత్తయో అంత సంకల్ప స్థైర్యముకలవాఁడుకాఁడు. ధర్మ సందేహములను నిశితబుద్ధితో కదలించువాఁడేకాని ఆత్మవిశ్వాసముతో స్థిరీకరించువాఁడుకాఁడు. ద్యూతము నిషిద్ధధర్మముని యాతఁడెఱుఁగును. కాని సంప్రదాయ సిద్ధమను క్షుద్రసంశయమును భాపికొనలేకపోయెను. ధర్మపత్ని ద్యూతపణముకాఁదగునని యొకఁడాదేశింపఁగా, అపుడు విధినిషేధముల నెఱుంగనట్లు ప్రవర్తించెను. ఈపోకడ ఒకానొక విషయమును దెలుపుచున్నది. అదియేదన? ధర్మజునిగ్రహణశక్తి చక్కని విచారదృష్టిగలదైనను అనుష్ఠానఘర్షణమునందు స్వయంసంఛన్నమగు స్వభావగౌర్బల్యములేనిదికాదు. విషయవేగమ్ముల భాగతరణమునందు ఇతఁడు తనకైతాను నడపిన సందర్భములు చాల అరిది. ఒకానొకకార్యమునకుఁ దాను కారకుఁడైనను, లోకము తాను నిమిత్తమాత్రుఁడని నిశ్చయించులాగు ప్రవర్తించు ఉపాయమునందుఁ జక్కనికుశలుఁడు. అందువలన దూరదృష్టిలేని మందప్రజ్ఞుఁడని యూహింపరాదు. తానెన్ని కార్యములు చేసినను

“చం.బ్రతికిన నాల్గునాళ్లు ఋతవారియుధిష్ఠిరుఁడ
న్న మేటికిరీతి ... ... ... ...

చెడకుండనుండు తెఱఁగుఁ బాటించుట ధర్మజుని మతము. అయితే ఇందొక సూక్ష్మవిషయమున్నది. ధర్మరాజ నిర్ణయములన్ని

"ఏక క్రియాద్వ్యర్ధి కరీ" అను న్యాయమునకు బ్రమాణములగుచుండును. కృష్ణ రాయభారమును సంకల్పించినవాడు ధర్మరాజు; తదౌచితిపట్లఁ గృత నిశ్చయుఁడు ధర్మరాజు. కాని నిశిత విమర్శనకుఁ ద్రోసినపుడు శ్రీకృష్ణ రాయభారమునకుఁ బ్రధానకారణము యుధిష్ఠిరుని ఉపాయచాతుర్యమా? లేక తత్తతస్సదర్భ సిద్ధమయిన స్వయంకృత కార్యమా? అనుగొప్ప సంశయమును పైకిఁ దెచ్చును. ఇఁకఁ బూర్వపక్షసిద్ధాంతములకుఁ గావలసినంత తర్కము. వీనికేమి! ధర్మరాజు కొండొక బలవత్తర హేతువుచే నీనాయకత్వపదవికిఁ దొలఁగి నిలచుచున్నాఁడు. భారతము ఇతిహాసము. రెండు రాజ కుటుంబముల స్వార్ధస్వామ్యములకు సంబంధించిన పెనఁగులాట. ఇందెంతవఱకును విషయోద్ధతీయున్నదికాని, విషయలాలిత్యమున కవకాశము లేదు. ఈ రణకధనమునకుఁ బ్రధాన నాయకత్వము రాజధర్మముచే నిరూపింపఁదగినది. అంతేకాని ధర్మరాజత్వముచే సమన్వయించుకొనవలసినది కాదు. భారతమందు ధర్మరాజు స్థితి మొదటినుండియు నట్లేయున్నది. ఉదాత్తధర్మనును దృష్టితో స్వధర్మము ననేక సందర్భములఁ దగులఁబెట్టెను. ఆతని ధర్మము ఏయుత్తమ ధర్మమయినను గావచ్చును; కాని ఉత్తమమగు క్షత్రియ ధర్మము మాత్రము కాదు.

"శా. వారు బ్రాహ్మణులె యేకీడైన సైరింపఁగ౯.

అను కవిపలుకులలో నీ రహస్యమే బయటపడుచున్నది. క్షత్రియధర్మమునందు కార్యనిశ్చయము ప్రధానము. బ్రాహ్మణధర్మమునకు కార్యచర్చ ముఖ్యమయినది. ధర్మరాజునందీ గుణదుర్బలత్వముచాలఁ గలదు. తెగఁబడి కర్ణునితో తారసిల్లినపుడయిన ధర్మజుని క్షాత్రము

నైజసాహసముతోఁ బ్రజ్వలించినదికాదు. తనయసమర్ధతకుఁ దానులజ్జింపక తమ్ముని దిట్టసాగెను. కర్ణ విజృంభణమునకును అర్జునోపాలంభమునకును సందర్భముఁ గల్పించిన క్షత్రియనాయకుని ధర్మదృష్టియెట్టిదో యూహింపుడు. ఈయన శాపనార్ధములలో

“క.విను కర్ణున కేనోడితి
నన నేటికి నీవునోడి ♦ తనిలజమాద్రీ
తనయులు ముస్నేయోడిరి
మనతోఁ గూడంగఁ గంస ♦ మర్దియునోడె౯.


“క.కావున మనమిక ననికిం
బోవంబని లేదు విపిన ♦ భూమికిఁ జని య
చ్చో వెఱపుదక్కి తపసుల
మై విచ్చలవిడిఁజరింత ♦ మందఱముదగ౯


"క.కాదేని బిరుదు లాడక
సాదులమై వినయ మొప్పఁ ♦ జని కురు నాథుం
డేది వనిచినను జేసి ద
యాదృష్టినతండు సూచు ♦ నట్లుండఁ దగు౯.


"సీ.దేవతలిచ్చిన ♦ తేరునశ్వంబులుఁ,
గపికేతనంబును ♦ గలవు, దైవి
కంబుచేనున్నది ♦ గాండీవమనఁ దాటి
యంతవి, ల్లదిగాక ♦ హరిరధంబు
గడపెడు నటె, పరి ♦ కర మిట్టిదైయుండ
నెట్లు కర్ణున కోడి ♦ యిట్టు ♦ వలియఁ
బాఱుతెంచితి నీవు ♦ భడంబునఁ గర్ణుఁ
గనిపాఱుదని సుయోధనుఁడు సెప్పె


తే.నదినిజంబు గొనక బే ♦ లైతి నాడు
బేలతనమునఁ గాదె పాం ♦ చాల మాత్స్య
పాండులాదిగఁ గలిగిన ♦ బంధుమిత్ర
జనులు దెగటాఱి రప్రయో ♦ జనముగాఁగ •


తేలినదేమన! ధర్మరాజు భారతభావమునందొక ప్రథానావయవమగునుగాని మహాసంగ్రామమునందుఁ బ్రత్యక్షకార్యవీరుఁడుకాఁడు. కార్యాధిపత్యముగూడ నొసఁగుఁడు. కార్యనాయకత్వముమాత్ర మాతని చేతఁబడదు. ఇంక

అర్జునుఁడు

మిగిలియున్నాఁడు. మహాభారతమునకు అర్హునుఁడెనాయకుఁడని నామతము. వ్యాసుడీభావము తోడనే భారత సంహితయందుఁ భార్ధునిఁ బోషించెను. తెనిగించిన నన్నయ కుఁగూడ పార్థునికథానాయకత్వమె దృష్టియందు లక్షితమైయుండెను. ఈ ప్రచ్ఛన్న వ్యంగ్యములేలయని కన్నడభారతకర్త విజయునే కధానాయకునిగా స్వీకరించి చిత్రించెను. అయితే విజయుడు భారతమునకు నాయకుఁడంటిమి. ఇది యింతమాత్రముతో నొప్పికొను నిర్వివాద సిద్ధాంతము కాబోదు. మనవి భావమును నిరూపించుటకుఁగల ఆధారములేవో వెదకుదము. అర్జునుఁడు సంపూణ౯ సాఫల్యనుయినజీవితముకలవాఁడు. అనగా నతఁడు ధర్మార్ధకామమోక్షములను నాలుగాశ్రమములను ఫలవంతముగా నడపినవాఁడని యర్థము. ఇందుకు లక్ష్యములెత్తిచూపుదము. అర్జునుని ధర్మవ్యక్తికి గీతలే సాక్షి. అర్థసాధనకు దిగ్విజయమె యుదాహరణము. కామకళ్యాణమునకు ఉలూచీ సుభద్రావిలాసమె నిదర్శనము. తురీయాశ్రమమునుగూర్చి చర్చ యప్రస్తుతము. ఆదినుండియుఁ బార్థుని ఒకానొక అగ్రవిలక్షణత్వముతోఁ గవిపోషించుచు వచ్చెననుటకు అవకాశములుకలవు. అస్త్రవిద్యాప్రదర్శనమునందు కుమారవర్గములో అర్జునుని ధనుఃప్రకర్షయె లోకము నాకా౯౦చెను. దీక్షితుఁడై మహాతపస్సుసలిపి యితఁడు సాటివీర సోదరులలో బ్రత్యేకస్సుతోఁ బ్రకాశించెను. ద్రుపదపరిభవమె యీతిని వియోధనాయకత్వమునకుఁ బ్రధమ బీజమువంటిది. ఇది అర్జున జీవితమునందుఁ బ్రధమ భాగము. రెండవభాగము నందు ఇంతకంటె ముఖ్యవిష యములున్నవి. భారతవిషయములలో పాంచాలీ పరిణయమున కొక చిత్రన్యముకలదు. పరిణయమైన తరువాత ద్రౌపదీ జీవితముకును మహాభారతకథకును భేదమే కన్పింపదు. మత్సయంత్రమును దుస్సాధ్యములయిన యోధపరీక్షలలో నొదానినిగా జేర్పవచ్చును. అట్టి కఠినపరీక్షయందు విశృఖలవిజయమునందిన అర్జునుఁడు తప్పక భారతకథానాయికపీఠము నలంకరింపఁగలఁడను విశ్వాసము కవికల్పనకు సహజము, ఈ దశయందే అర్జునుని ద్వాదశమాసిక వ్రతము పూర్ణమైనది. ధర్మోద్ధారఁకుడయిన అర్జునునకుఁగవి చిత్రాంగదా స్నేహముఁ గల్పించెను. ఉలూచీ శయ్యలఁబ్రసన్ను నిజేసెను. కపట కాషాయాంబరములలోఁ బ్రచ్ఛన్నునిజేసెను. ఆహాఏమి? కాఠిన్యముతోఁ గళామార్ధవముఁజూపెను. స్ఫటికములతో మెత్తనిపూలు చెక్కెను. ఆచ్ఛాదనతో నందమును బ్రదర్శించెను. కామవిహ్వలుఁడైన అర్జునుఁడు తీర్థయాత్రాదీక్షితుఁడైన యర్జునునితో పవిత్రుఁడగుచున్నాఁడు. శుష్కవ్రతుఁడైన అర్జునుఁడు రసలాలసతచే నార్ద్రుఁడగుచున్నాఁడు. " వలననే కవి,

'శోభనముమీదను శోభనమౌచు నింపుగ౯'

అని విజయవిలాసమును బూర్ణముఁజేసెను.

మూడవదశ అజ్ఞాత వాసము. ఇందు గమనింపదగినది అస్త్రవియోగము. ఈసంవిధానము ముఖ్యముగా అర్జునుని చిత్తసంయమనమునకు స్ఫుటసూచనగాఁ దీసికొనవచ్చును. గాండీవివంటి ధన్వికి చిత్తసంయమనము లేనిచో నిరంకుశమైన ప్రయోగోపసంహారములు లోకనిగ్రహములే పరిణమించి యుండును గాని లోకానుగ్రహకారకములై శాంతించి యుండవు. భారతరణము లోకశాంతి స్థాపనకై సంకల్పింపఁబడినది. ఇది నిర్వివాదము కాక పోయినను సంప్రదాయవాదు లిచ్చిన యర్థము మాత్ర మిదియే కదా? విజయుఁడీ మహాకథకు నాయకుఁడగుట చేతనే సంకల్పసాధనలు రెండును ఇతనియందు యధాపరిమితములై శక్తిమంతములయినవి.

తృతీయవ్యవస్థ కురు క్షేత్రరణరంగమందు ఆరంభించు చున్నది. ఇందు ఒకానొక ఉదారనాయకుని జిజ్ఞాసకాండ చక్కగా విశదీకరింపఁబడినది. అర్జునవిషాదయోగము మహాభారతకథాకంఠమునందు పసుపుత్రాడులాగు వ్రేలాడుచున్నది. అది మాంగల్యమో- ఉరిత్రాడో-నచ్చఁ జిత్రింపవలసిన భారము కవిది.

“ఉ.తాతల మామల౯ సుతులఁ
దండ్రులఁ దమ్ముల నన్నల౯ గురు
వ్రాతము శిష్టకోటి సఖి
వర్గము: దుచ్ఛజనానురూప దు
ర్నీ తివధించి యేఁబడయి
నెత్తుటఁదోగిన రాజ్యభోగముల్
ప్రీతియొనర్చు నే? యశము
పెల్లాడఁ గూర్చునె పెంపొవచ్చునే.

అని అర్జునుఁడు ప్రకంపవాచియై తహతహలాడెను. గాండీవము హస్తమునుండి క్రిందకు జాతిపడెను. దాని శ్రీకృష్ణుఁడు పన్నిన మహాభారత సంగ్రామత్రంతమంతయు ఇసుకయిల్లు కూలినట్లు కూలెను. ఇంక గతియేమి. కృష్ణుడేగతి. ఉభయపక్షవీరులును ప్రత్యక్షముగనో పరోక్షముగనో సంగ్రామ సంప్రాప్తికై పనిచేసిరి. అందు శ్రీకృష్ణుఁడు ప్రముఖుఁడు. వీరులు యుద్ధము నే కాంక్షించిరి. కాంక్షితమె నెట్టికొనివచ్చినది. అస్త్రము లాహూరములైనవి. శస్త్రములు సానలపై మెఱుఁగెక్కినవి. రణజ్వరము వ్యాపించినది. రక్తదాహము తీండ్రించినది. అక్షౌహిణులు వ్యూహముఖముల నడ్డినిలచినవి. పవిత్రమగు కురుక్షేత్రమున నింక నిముసములలో నెత్తురేళ్లు పాఱనున్నవి. అది కడు సంక్షోభాసమయము. కర్మకాండ జరుగవలసినది జ్ఞానకాండ సందుకొనినది. అపుడేమి చేయవలెను? ఉఛయపంక్తులకును సామరస్యమును గొలిపి, అర్జునవిషాదమును తప్పింపవలెనా? లేక ఎత్తినియెత్తు న్యాయసిద్ధమయిన ముగింపునకుఁ దేవలెనా? శ్రీకృష్ణుఁడు రెండవమార్గమున నడచెను. యోధవర్గమును నడిపించెను. గీతోపదేశ మొనర్చి

నిష్కానుకర్మయోగము

నుద్ధరించెను. ధర్మవశుఁడైనఅర్జనుడు స్వజనచ్ఛేదము నాప్తవిధిగా సంగీకరించి కృతకృత్యుఁడయ్యెను; విజయుడయ్యెను. వీరారాధనయోగ్యముగు మహాభారతమునకుఁగ్ర మాగనుతయిన ఉపసంహారమునుగల్పించెను. ఇందుఁగల యర్థస్ఫోటమేమన మహాసంగ్రామమునకుఁ బ్రధాననాయకుఁడయిన అర్జునుఁడు స్వార్థనికతుఁడా-లేక స్వార్థనిస్పృహుఁడా యను వంశము తేలుటయే. దేవదత్తము కురు క్షేత్రమందు మ్రోగువఱకును అర్జునుని మనస్సు విస్ఫుటముగాఁ గానరాలేదు. పరాజితులయిన పౌరుషవంతులకుండు మాత్సర్యస్పర్థలు మాత్రమె కానవచ్చినవి. ఇపుడన్ననో అవి యన్నియును మాఱినవి. అర్జునుఁడు కేవలము పగసాధించుటకై గాండీవమునుటంకరించెనా? లేక నిరంకుశ రణదాహము నాపలేక నెత్తురుకూడుఁ గాంక్షించెనా? లేక రాజ్యలుబ్ధుఁడై తెగించెనా? ఈ సమస్యలు — సమస్యలన నేల సందేహములు - విచ్చిపోవుటకే అర్జునవిషాద యోగము వచ్చినది. ఒక మహాయోధకుమారుని అనుకంపాకారుణ్యాది స్నిగ్ధగుణములను బైకిదెచ్చి చూపినది. అసూయాక్రోధావి క్షుద్రగుణ కాలుష్యమును క్షాళితముఁ జేసినది. తుదకు ఉదాత్తమగు నిష్కామకర్మయోగమును స్థాపించినది. కథానాయకుఁడగు అర్జునుఁడు స్వధర్మబద్ధుఁడై సంకల్ప సన్యాస ముతో ఆత్మకర్తవ్యభాగమును మోసెనను గంభీరభావైచితిని పోషించి ప్రతిష్ఠించినది. వ్యాసమహర్షి దృష్టియందు అర్జునుఁడు కథానాయకుఁడని నిర్దేశము లేక పోలేదు.

“తే. అధిప ! యోగీశ్వరేశ్వరం ♦ డయిన కృష్ణుఁ
డును, ధనుర్ధరవరుృఁ డ ♦ ర్జునుఁడు నెచట
నిలచి రచ్చట విజయంబు ♦ నీతి సిరియు
భూతి నిత్యంబులగు నిది ♦ నాతలంపు.

అను వాక్యములు సంజయుని నోటనుంచెను. కృష్ణుఁడు మహాసంగ్రామమందు అస్త్రముపట్టనివాఁడగుటచే నాయకుఁడు కాలేదు. ఇంక మిగిలినవాఁడు అర్జునుఁడు. ఇతఁడే శ్రీమన్మహాభారతమునకుఁ గథానాయకుఁడు.

ఇట్లు వీరలోకమందు విజయుని పూజ్యస్థానము సిద్ధించి స్థిరపడినది. ఇట్టి విజయుఁడు ప్రచ్ఛన్న వేషమును విసర్జించి నిక్షీ పశస్తాస్త్రములను పునః ప్రయోగమునకై పూజించిన దివసమగుటచేతనే విజయదశమి యైనది. అది మనకేల పూజ్యదివాసమయినదందురా ? భారతయుద్ధము ఆర్యసభ్యతయొక్క ఉచ్చకు ఛాయాపటమువంటిది. అందు దేశగౌరవమును వీరభావమును నిలచియున్నవి. భారతజాతీయత సంపాదించిన విలక్షుణతేజస్సు గూడ అందే ప్రతిఫలించుచున్నది. అట్టి మహాకధకు నాయకుఁడు ఆ రాధనీయుఁడని జగము విశ్వసించుచున్నది. వ్యక్తి బోధించుచున్నది. సంప్రదాయము శాసించు చున్నది. అందువలన నాఁడు మొదలు నేఁటివఱకు విజయదశమి ధారావాహికమయిన పూజా పుష్పములను గ్రుచ్చి కాలకంఠమందు వేయుచునేయున్నది.

ముగింపు

శరదృతువు కార్యానుష్ఠానయోగ్యమైన ఋతువని చెప్పితిని. అందు ఆశ్వీజము పూజతోఁ బ్రారంభమగును. విజయారాధనతో ఫలించును. తరువాత కృష్ణ పక్షారంభమందు 'అద్దెపండుగ' వచ్చును. అకలంక వర్చస్సునకుఁ బాత్రములయిన కళ్యాణక న్యాజనములు ఋతులక్ష్మిని గౌరి పేరఁ గొలుతురు. మంగళ సౌభాగ్యస్థానమగు కుమారీకులము ఋతు ప్రసన్న మగు ఉత్సాహవ్యగ్ర భావవర్ధిల్లవలెను. ఇందులకు,

“గీ. అఱుఁగదంచిన సన్న బి ♦ య్యంబు వండి
పొట్లకాయలు నేతిపో ♦ పుల నమర్చి
పేరఁ బెట్టిన మాఁగడ ♦ పెరుగుతోడ
నపుడు తినిపించి రెల్లకన్యలను సతులు.

ఇటువంటి మోహనోత్సవములె తగినవి. దీపావళీ మహోత్సవముతో శరదృతువు మాతృభూమికి నివాళిపట్టు చున్నది. ఓం శాంతిః శాంతిః శాంతిః-

-రాయప్రోలు సుబ్బారావు


"శమీపూజ"

రంగులు పూసి తెచ్చిన తు ♦ రంగము*[1] లెక్కి సవారిచేసి నీ
ముంగలఁ బందెమాడఁదల ♦ పోయను; నీ ముదిగొమ్మలందు మీఁ
దంగమనీయమౌ మరక ♦ తంబులపోల్కి వెలుంగు పచ్చ జీ
రంగులఁ * బట్టియాడుటకు • రానిటు చేర; శమి మహీజమా!

ఉ. దక్షిణ దెచ్చికోలుకయి ♦ తావక పత్రముఁ గోలడుల్చి నా
కుక్షీ భరించుకోవలయు ♦ కోర్కులు పుట్టవు; * నేఁడుగూడ నీ
సాక్షిగ నిల్చు నాభరత ♦ సాహసలక్ష్మికి భాష్పపూర్ణపూ
జాక్షరముల్ జపించిచన ♦ నాశజనించెను; గాన వచ్చితి౯

శమీపూజ


This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse

  1. దత్తమండలములవారు శమీపూజనాఁడు గుఱ్ఱములనలంకరించి సవారిచేయుదురు. బాలురు 'జీరంగు' అనఁబను పచ్చఱెక్కలుగల భ్రమరములను బట్టి మెడకుదారముగట్టి యాడింతురు. ఛాందసులు జమ్మిపత్రిఁగొనిపోయి మంత్రిపూర్వకముగ నూరిలో ఎవరికిచ్చి దక్షిణలఁగైకొందురు.