Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 11/సంచిక 2/నీటి మీది సంచార గ్రంథాలయము

వికీసోర్స్ నుండి

శ్రీ సేవాశ్రమ వాణీమందిరము : పెదపాలెము

నీటిమీది సంచార గ్రంథాలయముయొక్క సంగ్రహనివేదిక

అపూర్వములును, అనఁదకరములు నగు ఘటనలు ప్రస్తుతమన్ని దేశముల, సకల క్షేత్రములు గన్పట్టుచున్నవి. ఎల్ల విషయముల నిముసనిముసమునకు వివిధములగు మార్పులతో ప్రత్యక్ష మగుచున్న ఆధునిక యుగమున పరాధీనమగు భారతదేశమున నడచుచున్న జనోపయోగకరములగు సదుద్యమములన్నియు నితర దేశములందువలె ప్రభుత్వ పోషితములు కాక పరోపకారబుద్దితోను దేశ సేవాభిలాషతోను నిర్మింపబడిన జాతీయసంస్థలచే నిర్వహింపబడుచున్నవి. దేశోన్నతికి కారణభూతములగు ముద్యమములలో గ్రంథాలయోద్యమము వినుతికెక్కినది. ఇట్టి మహోద్యమ విషయమున బరోడా సంస్థానమును విడిచిచూచిన తక్కిన భారత దేశమందంతటను నాం భూమి మొదటిస్థానము నాక్రమించు చున్నది. సంపన్నులనుండి చెప్పుకొనదగినంత సాయము రాకున్నను పట్టుదలతో నాంధ్రపుత్రులు పలువిధముల మాటలతో గాక కార్యరూపమున సరస్వతీదేవి నారాధించుచున్నారనుట లోకవిదితము.

గ్రంథాలయచరిత్రను మొదటినుండి చూచినను నందు కొంత కాలము క్రిందటివరకు దేవళములవలెనే గ్రంథనిలయములును ఉన్న చోటినుండి కదలక తమకడకువచ్చువారికి మాత్రమే దర్శనమిచ్చి,అందునను తమ పోషకులకుమాత్రమే తమ్మువాడుకొను నధికారమొసంగి కేవలము పండితప్రకాండులకు మాత్రము పనికివచ్చు స్థితియందున్నట్లు తెలిసికొనగలము, కాని కాలముతో పాటు గ్రంథాలయము యొక్క సంకుచితంబగు ధర్మమును, దానితో పాటద్దాదాని సాధన విధానమును పూర్తిగా మారిపోయి నేడది 'సర్వజనీన విశ్వవిద్యాలయమై' యెట్టి విచక్షణయ లేక సమస్తసజనుల కందు బాటులోనుండి తనకడకు రానివారి దగ్గరకు సహితము తానేగుచు, తన్ను పయోగించ స్వయముగ శక్తి లేనివారలకుకూడ తానుపయోగ పడుచు—అంతటితో నూరకొనక తన్నెఱిగియు లక్ష్యము చేయనివారిని, అసలే యెరుగని వారినికూడ పరిచయము చేసికొని దేవుడు ప్రాణులకు వాయువును, జలమును, ఆహారమును యిచ్చుచున్న విధమున మానవులకు ప్రసాదించు చున్నది. ఈ యాదర్శమును పూర్తిగా నమలు పరుచ సాధ్యముగాకున్నను ధర్మగ్రంథాలయమని (Public Library) పేరు పెట్టుకొన్న ప్రతిసంస్థయు దీని నాదరించి అరుక్షణము గమనములో నుంచుకొనవలెను. లేకున్న నట్టి గ్రంథాలయములు తమగౌరవమును గోలుపోయి నిరుపయోగములగుననుటలో సందియము జెందనక్కరలేదు.

తనకడకు రానివారి సమీపమునకు తానే పోయి సేవించుట గ్రంథాలయ ధర్మమని తెలిసికొంటిమి. నే డిందు నిమిత్తము నడచుచున్న సాధన విధానములు ప్రపంచమున పలు విధముల వ్యాప్తి గాంచినవి. గ్రంధాలయమున కేతెంచి పొత్తములు గైకొనుటకు సందర్భపడని వారల యిండ్లకు గ్రంథములు మోటారుబండ్లలో తీసికొనిపోబడుచున్నవి. దారి సౌకర్యము లంతగా లేనిస్థలముల యెద్దుల బండ్లును గుర్రములాదిగా గల జంతువులును పుస్తకముల నొక చోటినుండి యింకొకచోటికి చేర్చుటకై ఉపయోగింపబడు చున్నవి. ఇటులనే నీటిపై ప్రయాణము చేయు బాటసారుల యుపయోగము కొరకు పెదపాలెము సేవాశ్రమమువారు తమవాణీ మందిరపక్షమున కృష్ణాబ్యాంకు కాలువమీద పెద్దవడ్లపూడి - కొల్లూరుమధ్య ప్రయాణము చేయు బోటులో నొక సంచార గ్రంథాలయమును 25-10-35 వ తేదీని ప్ర్రారంభించిరి. దీనికి గుంటూరుమఁడల గ్రంథాలయ సంఘాధ్యక్షులగు శ్రీయుత శరణు రామస్వామిచౌదరి గారి ఆధ్యక్షతక్రింద పూజ్య శ్రీ రాయసం వేంకటశివుడు గారు ప్ర్రారంభోత్సవమును నెరపిరి. చినపాలెం వాస్తవ్యులగు వాశిరెడ్డి అన్నపూర్ణమ్మ గారు బోటులో గ్రంథములవగైరా నుంచుటకై చిన్ని గ్రంధ పేటిక నొకదానిని దయతో నొసంగిరి.

ప్రథమవత్సర కార్యకమము

ప్రారంభోత్సవము 25వ తేదీన జరుపబడినను, 28-10-35 తేదీనుండి బోటులో గ్రంధములు, పత్రికలు ప్రయాణీకుల యుపయోగము నిమిత్తముంచబడి తదాదిగా నీ సంచార గ్రంథాలయ కార్యక్రమము సాగుచువచ్చెను. పైబోటులో ఆంధ్ర వారపత్రిక, ప్రజామిత్ర, ప్రకృతి, Indian Naturopath పత్రికలును సుమారు 20 పొత్తములును ఉంచి ఎప్పటికప్పుడు పత్రికలును, అప్పుడప్పుడు పుస్తకములును మార్చబడుచు వచ్చెను. ఆశ్రమసేవకు లప్పు డప్పుడు బోటులో ప్రయాణము చేయుచు అందలి పత్రికలు, పుస్తకములు ప్రయాణీకులుపయోగించు చున్నది లేనిది కనుగొనుటయే గాక వారికి గ్రంథాలయావశ్యకతను గూర్చియు, గ్రంధపఠనమువలని ప్రయోజనమునుగూర్చియు చిన్ని చిన్ని ప్రసంగములు చేయుచు, నేదైన పొత్తముగాని పత్రిక గాని చదువురానివారలకు చదివి వినిపించుచువచ్చిరి. బోటులోని దుకాణదారుడే గ్రంథ భాండాగారిగా వ్యవహరించుటచే స్థాపకుల పనియు కొంచెము తేలికగా నుండెను. ఆశ్రమ సేవకులవలెనే మఱికొందఱు గ్రంథాలయ మిత్రలు కూడ తమ ప్రయాణసమయములలో బోటులోనివారల కేదైన గ్రంథకాలక్షేపము చేయుచు సంచారగ్రంథాలయ కార్యనిర్వహణమున సాయపడుచుండిరి.

ఇట్లుండ పెద్ద వడ్లపూడి - పిడపర్రు గ్రామముల మధ్యతిరుగు `రెండవపడవలో కూడ నీ సంచార గ్రంథాలయ కార్యకమము 17-11-35 వ తేదీన ప్రారంభింపబడెను. అందు భారతి, కృష్ణాపత్రిక, గ్రంథాలయ సర్వస్వము, ప్రకృతి పత్రికలతోపాటు 10 పుస్తకములు కూడ ప్రయాణీకుల యుపయోగము నిమిత్తముంచబడెను. ఇట్లేర్పాటు చేయబడిన రెండుబోటులలోని గ్రంథాలయములను కాలువలు కట్టివేయుటకు పూర్వము మొదటిది 1936 మార్చి మధ్యకాలమునను, రెండవది మార్చి మాసారంభము నందును తాత్కాలికముగా ఆపివేయబడుటతో నీ సంచారగ్రంథాలయ ప్రథమ వర్ష కార్యక్రమము ముగిసెను.

ద్వితీయవత్సరము జరిగినపని

మరల నీ సంచార గ్రంథాలయ కార్యక్రమము 2-7-36 వ తేదీన మొదటిబోటులోను, 26-6-36 వ తేదీన రెండవబోటులోను ప్ర్రారంభమై పూర్వమువలెనే సాగింపబడి వరుసగా మరల 13-3-37 వ తేదీన మొదటిది, 31-1-37వ తేదీన రెండవది తాత్కాలికముగా ఆపివేయబడి తమ ద్వితీయ వత్సర జీవితమును ముగించుకొనినవి. అశ్రమ సేవకులలో నొకరు కార్యాంతరమున దూర దేశ మందున్నందున పూర్వమువలె అప్పుడప్పుడు జరుగుచువచ్చిన గ్రంథకాల క్షేపములు ప్రసంగములు కొనసాగకున్నను మామూలు కార్యక్రమమున కేలాటి యాటంకమును కలుగలేదు. పత్రిక లెప్పటికప్పుడు బోటులోనిచ్చుట, మధ్య మధ్య పుస్తకములను మార్చుట మామూలుగానే జరిగెను.

లెక్కలు

ఈసంచార గ్రంథాల యోపయోగమును గూర్చిన లెక్కల నివేదించుటకు ముందు దీనికి గాను ప్రత్యేకము వెచ్చింపబడిన ధనము ఆందు మిత్రులనుండి సేవాశ్రమము వారు దీనిని తముపొందిన సహాయమును గూర్చి వివరించుటుచిత్తమని తలంచుచున్నాము. మొదటి సంవత్సరము “ఆంధ్రవారపత్రిక”ను పుతుంబాక రామసీతమ్మ గారును, “కృష్ణాపత్రిక” ను వాశిరెడ్డి రాజ్యలక్ష్మీ వరప్రసాదాంబ గారును “ప్రజామిత్ర'ను పుతుంబాక నరసయ్య గారును “ప్రకృతి”” “Indian Naturopath” “గ్రంధాలయసర్వస్వము”లను తత్తోత్పత్రికాధిపతులును దయతో నొసగిరి. “భారతి'పత్రిక ఖర్చుమాత్రము గ్రంథాలయ నిర్వాహకులే భరించుచుండిరి. రెండవ సంవత్సరము పత్రికలన్నియు గ్రంథాలయము వారే స్వయముగ తెప్పించిరి. ప్రత్యేక మీ బోటులలోని సంచార గ్రంథాలయముల నిమిత్తమైన ఖర్చుల నీకింద బొందు పరతుము.

ఈ మొత్తమంతయు వాణీమందిరమునకు చందాదారుల నుండి వసూలైన ధనమునుండియే వెచ్చింపబడెను.

ప్ర్రారంభోత్సవమున కేతెంచిన అతిథులకు భోజనాది సత్కారములకైన వ్యయమును శ్రీయుతులు పుతుంబాక శ్రీరాములు, గాధిరాజు కోటంరాజు గార్లు భరించిరి.

ఈ సంచార గ్రంథాలయముల అభివృద్ధినిగూర్చిన వివరముల నీ క్రింది పట్టికలలో కాననగును.

ఈ లెక్కలు పాఠకుల రిజిస్టరుననుసరించి తయారు చేయబడినవి. కొందఱు పాఠకులు తమ పేరుల రిజిస్టరులో నమోదు చేయ నిరాకరించుచుండిరి.

ప్రచురణ (Publicity)

వర్తమాన కాలమున పెద్ద పెద్ద వ్యాపారములకువలెనే గ్రంథాలయ పచారమునకును ప్రచురణ అత్యంతావశ్యకమను సంగతిని గ్రహించినవారై అమెరికాలోను ఐరో\పాఖండమందలి చాల దేశములందును పెద్ద పెద్ద గ్రంధాలయములవారు వ్యక్తిగతముగను గ్రంథాలయ పరిషత్తులద్వారాను దీనిని విరివిగా సాగించుచు యిందు నిమిత్తము కొందఱకు జీతములిచ్చి ప్రత్యేకము ప్రచురణ కార్యోద్యోగుల నియమించు చున్నారు. విరివిగా ప్రకటనగల వస్తువులెక్కుడుగా అమ్ముడు బోవునట్లే మంచి ప్రచురణగల గ్రంథాలయములలోని గ్రంధసామగ్రియు మిక్కుటముగా నుపయోగమునకు వచ్చుననుట గ్రంథాలయముల నడపువారి కనుభవవేద్యమే.

పైసూత్రము ననుసరించి మాసంచార గ్రంథాలయ ప్ర్రారంభోత్సవపు టాహ్వాన పత్రిక ప్రతులను ప్రకటన నిమిత్తము తెలుగు వార్తాపత్రికలకు కొన్నిటికి పంపితిమి. ఆంధ్ర దినపత్రిక, ప్రజాబంధు, సమదర్శిని పత్రికలు దానిని ప్రకటించేను. తదుపరి ప్రారంభోత్సవ కార్యక్రమమును “Hindu” “Indian Express" పత్రికలకు క్లుప్తముగను ఆంధ్రపత్రిక, ప్రజామిత్ర, సుబోధిని, గ్రంథాలయ సర్వస్వములకు వివరముగను వ్రాసి పంపితిమి. పండితులచే ప్రశంసింపబడియు మాయీనవ్య విధానము తెలుగు పత్రికాధిపతుల సంతగా నాకర్షించలేదని తెలుపుటకు వగచుచున్నాము. ఆంగ్లపత్రికలలో “Hindu” మా రిపోర్టును చక్కగాదిది ప్రకటించినది గాని "Indian Express' దీనిని బొత్తుగా గ్రహించనేలేదు. ఆంధ్రపత్రిక వారును యీవార్తను సవ్యముగా ప్రకటించరైరి. 12 పంక్తులలో యిమిడ్చెను. సుబోప్ర్రజామిత్ర దీనిని సుభోధిని అమూల్యమగు ప్రారంభోపన్యాసమును విడిచి తక్కిన వృత్తాంతమును మేము పంపిన విధమున ప్రకటించెను. ఇట్లు సమగ్ర వృత్తాంతమునే తెలుగు పత్రికయు ప్రకటించకపోవుట వారలకీ యుద్యమమందుగల యుపేక్షాభావము వెల్లడి యగుచున్నది.

అయినను మద్రాసు గ్రంథాలయ సంఘ కార్యదర్శి యస్.ఆర్.రంగనాధన్ గారు యీ సమాచారమును హిందూపత్రికలో చూచి వెంటనే తమ సంతోషమును వెలిబుచ్చుచు మాకొక లేఖ వ్రాసిరి. వారు మా యీ సంచారగ్రంధాలయము యొక్క పూర్తివివరములను బొమ్మల బ్లాకులను తమ గ్రంధాలయ సంఘము యొక్క సంవత్సరనివేదికలో ప్రచురించుటకై పంపవలసినదిగా కోరిరి. వారి కోరిక ననుసరించి కొంత కాలమునకు లైబ్రరీ ఫొటోలు తీయించి వానితోపాటు మాయీబోటులోని సంచారగ్రంథాలయమును గూర్చిన నివేదికనుకూడ వ్రాసి పంపుకొంటిమి. దాని సంగ్రహమును, బోటు బొమ్మకు బ్లాక్ తయారు చేయించి దానిని తమ అష్టమ వార్షిక నివేదికలో ప్రకటించియుండిరి. ఈబోటు బొమ్మ ఆంధ్రపత్రిక లో కూడ 3-2-36 వ తేదీన ప్రకటించబడెను. దీనివిషయమై (Floating Library Andhra Desa) అను శీర్షి క్రింద క వ్యాసముకూడ శ్రీయుత అయ్యంకి వెంకటరమణయ్య గారు కోరగా మేము వారిని పంపితిమి . వారు (Indian Library Journal)లో 1935 డిసెంబరు సంచికలో ప్రచురించిరి. తదుపరి కొంతకాలమునకు లండనులో నున్న “ప్రపంచవయోజన విద్యా సంఘమువారు ప్రచురణార్థము దీనివివరములు తెలుపవలసినదిగా నొకజాబు వ్రాసిరి. కాని వారికి వెంటనే సమాధానమిచ్చుటకు మాకు వీలుచిక్కకపోవుటచే మిన్నకుంటిమి.

పత్రికలద్వారా జరిగినది గాక వ్యక్తిగతముగ మేమీ సంచార గ్రంథాలయ సువార్తను పలువురు పెద్దలకును, గ్రంథాలయ మిత్రులకును తెలియజేయుచువచ్చితిమి. మా సంచార గ్రంథపేటికలుంచబడిన పడవలలో నెక్కువారి కెల్లరకు ఒకరు చెప్పకుండగనే మాబోటు గ్రంథాలయము స్వయంప్రకటన చేసికొనుచుండెను. మా సంచార గ్రంధాలయముయొక్క సాధారణ కార్యక్రమము నిర్విఘ్నముగా జరుగుట కీ మాత్రము ప్రచురణ సరిపోవచ్చునని మే పెంచుచున్నను యెంతజరిగినను ప్రయోజన మెక్కువగు నేకాని యేమియు నష్టముండదు.

ముగింపు

ఈ నివేదికను పూర్తి చేయుటకు పూర్వము యి గ్రంథాలయ నిర్వాహకులకు గలిగిన కొన్ని యనుభవములను గూర్చి చెప్పవలసియున్నది. ఈ సంచారగ్రంధాలయము ద్వారా మా సేవాశ్రను వాణీమందిరము (కేంద్ర గ్రంధాలయము) నెక్కువ గ్రామముల కుపయోగపడునట్లు చేయుసంకల్పము మాకు మొదటినుంచియు కలదు. ఈ సంచార గ్రంథాలయము మా కేంద్ర గ్రంథాలయము యొక్క శాఖగా పని చేయుచున్నది. పై బోటులలో నప్పుడప్పుడు ప్రయాణము చేయుకొందఱు మిత్రులు మా సంచారగ్రంథాలయ పేటికలలో పెద్ద పెద్ద విలువ గలిగిన పురాణాది యుద్ధంధములు, వైద్యశాస్త్రములు బహుళసంఖ్యాకములగు నవలలు లేవని తమ యభిప్రాయముల నొసగుచువచ్చిరి. మఱికొంద అంగ్లపత్రికలు కూడ యందుంచ వలసినదిగాను, ఆంధ్రదినపత్రిక మిక్కిలి అవసరమనియు తమ యుద్దేశములు ప్రేక్షకాభిప్రాయ గ్రంథమున నుద్ఘాటించిరి. ఇందులకు వారిని మే మెంతయు నభినందించుచున్నాము. భగవానుడిచ్చిన శక్తికొలది యింకను నెక్కుడు పత్రికలు, ఆంగ్లపత్రికలు సహితముంచుటకు మాయభ్యంతర మేమియులేదని విన్న వించుచున్నాము. కాని గ్రంథముల విషయమై యీ రెండు సంవత్సరముల మా అనుభవమును బట్టి ప్రస్తుత పరిస్థితులలో యెక్కువ మార్పులకు అవకాశము కనబడుటలేదు. ఆంధ్ర దినపత్రికను తెప్పించవలెననెడి తలంపు మాకు ద్వితీయవత్సరారంభమున కలిగి దానికై కొన్ని యేర్పాటుల నిమిత్తము చాల ప్రయత్నించి విఫలులమై యూరకుంటిమి.

ఇప్పటికి మా పడవలోని సంచార గ్రంథాలయ కార్యక్రమమును గూర్చిన నివేదికను గ్రంథాలయలోకమునకు సమర్పించుకొన శక్తినిచ్చిన సర్వేశ్వరునకు మాయంజలులు ప్ర్రప్రధమమున నర్పించి పిమ్మట యీ సంచారశాఖతో పాటు మా కేంద్ర గ్రంథాలయమునకును తద్వారా వీనికన్నిటికీ మూలకందమగు సేవాశ్రమసంస్థకును సకల విధముల తోడ్పడుచున్నట్టి తల్లులకు, మిత్రులకు, తదితర పెద్దలకు మా కృతజ్ఞతాపూర్వక నమస్కృతులు చెల్లించుకొందుము

ఇప్పటివలెనే యికముందును అన్ని రీతులు మా యాశ్రమ కార్యకలాపమునందు చేదోడు వాదోడు గానుండి, వాణీమందిరమాదిగాగల ఆశ్రమశాఖల నన్నింటిని చందాలను,విరాళములను విరివిగా నొసంగి పోషించుచు మా చేయుసేవను గ్రహించి మమ్ము పునీతులజేయుటకై దేశీయులెల్లరికి విన్నవించుకొందుము.

తత్సత్

పాతూరి నాగభూషణం,

సేవాశ్రమము.



This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse