గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 11/సంచిక 2/కళాస్త్రీల యభినయ దేశికులు
కళాస్త్రీల యభినయదేశికులు
శ్రీ దివాకర్ల రామమూర్తిగారు
సిద్దమూర్తియయిన యోగి చిదానందస్థానమగు తనకళాప్రకృతిలో స్త్రీశక్తికికూడ ఒక స్థాన మిచ్చినాడు. కళాప్రపంచము కూడ అనంతమగు శక్తి రూపమునకు విహారసదన మనుకొనినాడు. అచేతనము లగు శిలా విగ్రహములను దేవాయతనమునందు ప్రతిష్ఠించి భగవంతుని సగుణునిగా నిరూపించుటకు బదులు, తన కళామహిమచే యోగీంద్రుడు ఆకర్షణీయమగు స్త్రీ ప్రకృతి యొక్క అంగికాభినయనములయందు శ్రీకృష్ణపరమాత్మను ముముక్షులకు చూపించినాడు. తానుచూచి సంతోషమున మునిగినాడు.
కాలముననుసరించి మార్పునవలంబించి వృత్తివిద్యలు గంగగలసిన ఈదినములలో సయితము నాగరికత మొగముచూపని పవిత్రములగు హిందూ గ్రామములయందు త్రిసంధ్యలయందును భగవత్సాన్నిధ్యమున నృత్యగీతాదులననునయించి జాగరము చేయుటకు దేవదాసీగణములు దేవుని ఈనాముల ననుభవించుచు విధ్యుక్తములను నెరవేర్చు చుందురు. ఈ దేవదాసీగణము రంభ,ఊర్వశి, మొదలగు అప్సరః స్త్రీ వంశముల నుండి అవతరించినమూర్తులు. సౌందర్యమునను, విజ్ఞానమునను, కళాభినివేశమునను రంభాదులతో సరిపోల్చు టతిసాహసమయ్యును, వీరులకు దేవస్త్రివంశాగతుల మనుగోరంత గర్వము పొడచూపుచుండును. పులినిచూచి పిల్లివాతలను పెట్టికొనినయట్లు, బారసాల దినమున తల్లిదండ్రులు బియ్యములో వ్రాసిన నామములను నాగరిక తానుగుణముగా మార్చుకొనుటాచరమైన ఈ దేశములో 'దేవదాసీ' అన్న పదమునందలి సౌకుమార్యము మోటుతనమనిపించినది. దేవదాసీ గణములు కళావంతులయిరి. కళావంతులమని విఱ్ఱవీగుటకు వీరియందు కూచిపూడి భాగవతుల గురుత్వము నిలిచిపోయినది. కళా తపస్వులగు కూచిపూడివారి గురుత్వమున కళార్థినులయిన 'దేవదాసీ' గణము కళాపాఠాంతరములందు గురువులతో పండితసభల కరిగి తమపాండిత్యమును ప్రకటించుకళాప్రచారము పూర్వము నుండియు అనుశ్రుతముగా వచ్చుచున్నది. ఇంకను అడుగంట లేదు.
సిద్ధశాస్త్రి కళా స్త్రీలలో అభినయశాస్త్ర బీజములు చల్లుట చాల కాలము ఆలోచింపక పూనుకొనిన కార్యము గాదు. సహజముగా పురుష ప్రకృతికున్న స్త్రీ ప్రకృతులు కోమలములు, మృదులములు,ఆకర్షణీయములు. ఇది మానవజాతియందే నిషిద్దమయిన ప్రత్యేకత గాదు. పశుపక్షి వృక్షాదులయందుగూడ గమనింప నగును. కాయలకన్న పువ్వు లేల ఆకర్షణీయములు? పువ్వులవంటి ప్రకృతి స్త్రీలది. సునిశితమయిన అంగము లాహార్యములకును, అభినయములకును వాంఛనీయములు. శ్రమపడి జీవితమునంతను వినియోగించి రచించిన అద్వితీయమగు కళాబీజములూ షరక్షేత్రములో చల్లుట కెట్లు కృషీవలు డంగీకరించును? స్త్రీ పరాఙ్ముఖుడయినను భరతకళాబ్రహ్మ స్త్రీలను తన కళాబీజములతో పూజ్యస్థానములకు తీసికొనివచ్చినాడు.
కూచిపూడి భాగవతులు బోగము వాండ్రకు చెప్పునాట్యాదులకు 'భాగవతము' అందురు. భగవత్సంబంధ మగు కథ ఇందు చూపింపబడుటయే భాగవత మనుటకు కారణము. పారిజాతాపహరణము, దశావతారాభినయము, సత్యావధూపీణన గొల్లకలాపము మొదలగునవి వారలకు నేర్పుదురు. ఈ విద్యాభ్యాసములో నూతనత్వమున్నది. ఇవి నేర్చుకొనుట దుర్లభమగు కార్యములలో నొకటి. పాటలకు క్రొత్తలగురీతు లున్నవి. కూనిరాగములు తీసెడు కంఠములను సాపుతీసి భాగవతకత్తున కనుగుణముగా నొత్తవలయును. 'గొల్లభామ' పాల డబ్బాలపాలు త్రాగెడు పిల్లవానిని ఆవుపాలకు మరల్చుట ఎంత కష్టమో, కూనిరాగముల కలవడిన కంఠములను మార్గమునకు త్రిప్పుట అంతకష్టము.
అభినయమునకు అంగములు ముదిరిన వంగవు. వంగకున్నచో అంగికాభినయము అతుకవు. అందుకొరకై ఈ అభినయవిద్యార్థినులు చిరుత ప్రాయమునుండి గురువునొద్ద విద్యాభ్యాసము చేయవలయును. ముదిరిన చేతివేళ్లు వంగనిచో నిర్దాక్షిణ్యముగ గురువులు బెత్తములతో సున్నితములగు అంగుళులపై మోదుదురని వినికిడి. వలసిన రీతిగా స్వాధీనములోనున్న గాని భావప్రకటన గాదు. భావప్రకనటము తప్పినచో రసము చెడును. అప్పుడా అభినయము అభినయ మనిపించుకొనదు. వేళ్లు కదల్పుటో విరుచు కొనుటో యనిపించుకొనును. ఈ కళాభ్యాసమునకు ౪,౫ సంవత్సరముల కాలము పట్టును. అప్పుడుగాని వాచికమునకు తగినఅంగికాభినయమును, దానికి తగిన పద విన్యాసములును,తగిన తాళముల వాయి౦పులును అభ్యాసములును కావు. అందుకొరకే పెండ్లి కాలములు వినోదార్దముగా తీసికొని రాబడుమూకలలో 'మేళకత్తె' యెకతెయే భాగవతమును కట్టగల సామర్థ్యమును గలిగియుండును. తదితరులు సాధారణముగా అలంకార విద్యార్థులు. పట్టు సమయముల యందు తక్క తదితరములయందు పల్లవులు అందుకొందురు. తాళములు వేయుదురు. భాగవతాభినయముతో 'మేళకత్తె' తన్ను తాను మరచియున్న సమయముల యందు చేతనము గెలిగిన ప్రతిమలగు ఆకత్తువారు ముసిముసినవ్వులను భాగవతము చెవిదూరని నవనాగరికులతో సాగింతురు. ఈ విషయము భాగవతములు చూచిన సామాజికుల కనుభవసిద్ధము.
కూచిపూడివారు విద్యాభ్యాసము చేసిన వారిని వదలరు. వారితో సభల కరుగుదురు. సభలలో భాగవతము చెప్పునప్పుడు వెనుక తాళము పుచ్చుకొని హాస్యమును చెప్పుచు భాగవతమును వినిపింతురు. గురువు ముందు చరణ మందించును. చరణము ప్రారంభించి ఆనర్తకి నాట్యమును ప్ర్రారంభించును. సామాజికుల కలసట తీర్చుటకు, విసుగు పోకొట్టుటకు పడుచుదనము దాటిన వృద్ధ బ్రాహ్మణుడు నాయికకు అలసట తీరుటకయి ముందునకు వచ్చి తానే నృత్యము చేసి, హాస్యమును చెప్పి కథలోనికి అంపును. వెనుకనున్న అనుగాములు, అనుగాయితులు, పల్లవి అందుకొని రాగములు విసరుట పాటక తెకు అలసట తీరుట కొఱకే.
ఈ సభలలో చెప్పబడు భాగవతమనునది రెండు రకములుగా వ్యాహృతము. ౧. గొల్లకలాపము. ౨. భామ కలాపము. గొల్లకలాపమనునది వేదాంతవిషయము, సృష్ట్యాదినుండియును ప్ర్రారంభింపబడి, బ్రహ్మజ్ఞానవిచారము శ్రుతి స్మృత్యాదుల సారాంశములతో గూడియుండును. ఇది సామాన్యు లర్థము చేసికొనుటకు కష్టమయినది. ఈ గొల్లకలాపమును చెప్పుటకు మున్ముందు ప్రార్థనాదికములతో ప్రారంభింతురు. నాయిక గొల్లవేషము వేసికొనును. బ్రాహ్మణుడు బ్రాహ్మణుడేగదా ! ఇచ్చట గొల్లభామతో హాస్యమాడు కూచిపూడి వైదిక బ్రాహ్మణుని గమనింపకలయును. పదపదమునకు చమత్కారము నొలక బోయును. గొల్లభామ వేషము కట్టిన యువతి 'గొల్లచల్లో యమ్మ గొల్లచల్ల' యనుచు, శిరస్సుపై చల్లతో నిండిన మృణ్మయ పాత్ర లేకపోయినను, ఉన్నయట్లే అభినయించుచు అమ్మకమునకు తిరుగును. బ్రాహ్మణుడు చలగొనుటకు పిలిచి మేము, వేదవేదాంగములు చదువుకొనిన బ్రాహ్మణులము, గొల్లవారిచల్ల పనికిరాదని ఆచారనిషేధమును చూపును. అప్పు డాపడుచు, బ్రాహ్మణుడన నెవరు ? ఎట్టికర్మ లాచరింపవలయును? ఇత్యాది ప్రశ్నలనువేసి, చమత్కారముగా వర్ణాచారములను, బహ్మ జ్ఞానతత్వమును వివరించి వ్యాఖ్యానము చేసి గొల్లలు బ్రాహ్మణులకున్న ఉత్తములని నిరూపించును.
ప్రత్యేకముగా 'గొల్లకలాపమును' విమర్శించుటకు గాని, వర్ణించుటకుగాని స్థలము చాలదు. స్థలాంతరమున విచార్యము. జననమాది మరణమువరకుగల ఆధ్యాత్మిక విషయము చక్కని జక్కుల పాటలలో నిమిడ్చబడి నర్తింపబడుట చూచి తీరవలయును. ఈ వేదాంత పాఠము అభ్యర్థనీయములు. మాతృగర్భమున శుక్రశోణితముల సంయోగమున కలిగిన పిండోదయమాది శిశుజననమువరకు గలుగు గర్భవరక పరిణామము విని, ఆనందింపవలసినదే. అభినయమును చూచి ఊహించుకొనవలసినదే. ఆయా ప్రసంగాను యుక్తముగ బ్రాహ్మణుని చురుకుతనమును, సమయస్ఫూర్తియు, వక్రోక్తియు, హాస్యోక్తియ విని తనివిపొంది తీరవలయును. ఇది కళాతపస్వులగు ఆంధ్ర జనములకు వాంఛితేతరము గాదు.
తరువాత 'భాగవతము'లో సత్యావధూపీణనము అభినయింపబడును, ఆ విరహము రూపుదాల్చి యచట నిలుచుండును. బ్రాహ్మణుడు సత్యావధువుయొక్క వయస్యపాత్ర నభినయించును. అతని యోదార్పులు కడుపు చెక్కలగునట్లు నవ్వించును. దాసీజనసహజమగు గాత్రమును తెచ్చిపెట్టికొనును. అలవడిన తన అంగములను, నవకములు చెడినను. చివరకొనాలదాచిన కళా విభవములతో సమయానుకూలముగ వంచుటలో అతిని విద్యావిభవము చూడనగురు. సత్యావధువు పాడుపద్యములు హృదయ భేదకములు, పూలు గుచ్చుటాది వ్యాపారములు సజీవములుగా ప్రతిమ దాల్చును. ఈ సత్యా వ్యాపారమునందు విచిత్ర సంఘటన మొకటియున్నది. అది సత్య ఈ బాపన చెలికత్తెచే కృష్ణభగవానునకు కమ్మనొకటి వాని పంపును. ఈ కమ్మ శకుంతల దుష్యంతునకు వ్రాసినటువంటిది గాదు; నాగరిక స్త్రీ వలచిన వరునికి వ్రాయు ప్రేమలేఖ గాదు. కాని భాగవతమునందు రుక్మిణీ సతి బ్రాహ్మణునిచే కృష్ణపరమాత్మకు వ్రాయు లేఖ వంటిది.
విరహమున సత్య బాధపడుచున్నది. నిజమునకు చూచువారలకు యాథార్థ్యమని తోచును ఇది గోరంతలు కొండంతలుగా చెప్పుట గాదని ఎరుగుదురుగాక ! చెలికత్తెలు అమ్మా ! జాబునొకదానిని కృష్ణమూర్తివారికి పంపగూడదంటమ్మా! అను సందర్భము వరకును వచ్చును. ఉత్తరము వ్రాయుటకు పరికర సంపాదనమునకు పరిపరి విధము లాలోచింతురు. అంతలో బాపన చెలికత్తె తన వీపుచూపి, చెలీ! సత్యా! నీ గోళ్ళతో నావీపున వ్రాయుము. నేను వెన్నదొంగ కడకేగి, చూడు, మాచెలి యుత్తరమంపినదని వీపు చూ పెదనని గంభీరముగా, హాస్యముగా నుచ్చరించును. ఇందుగల సమయస్ఫూర్తి పాఠకులు తమంతట తాము గ్రహించుకొనినగాని రసోదయము కాదు.
మేళములయందు కళా స్త్రీలతో కూచిపూడివారు కళారాధనాసమయమునందు పూజకు తాళములతో నిలువంబడుదురు. ఎంత చనువుగా నున్నను ప్రేమగా నున్నను అభినయ విషయములో లోటు కనబరచినచో సభానంతరమునందైనను గురువులు శిష్యురాండ్రయెడ కఠినముగా ప్రవర్తింతురు. తాను చెప్పిన కళా పాఠములయందు నెరసులు దొరకినచో ప్రప్రథమమున కళకు గౌరవహాని; రెండవది తన పాండిత్యమునకు మచ్చ కళకు నిందను ఆపాదింప, వారూరకుండజాలరు. విపశ్చితులగు ఆ కళాపయోథులు తమంతట తాము పాండిత్యలోపమును చూచి సహింపలేరు. ఇది అభిమానధనులగు గురుస్వాముల కెల్ల కాలమునందును తగినదే. అభినయ సమయమున నాయిక తప్పుటడుగు వేసి, అంగికముగా తప్పు నభినయించినప్పుడు తాళము వేయుచున్న గురుడు ఆగ్రహమున వేళ్లపై తాళములతో మొత్తి మరల శాస్త్రానుసారముగా నర్తింపచేయుట వయస్సు నిండిన పెద్దలు చూచిన విషయము. ఆమాత్ర మయిన భయముండకపోయినచో కళకు అనాదరణమును నిర్లక్ష్యమును కలుగును. ఒక పూజ్యుడు తన అంతఃకరణమందు మాలిన్య మెట్లు సహింపలేడో అలాగుననే తన పాండిత్య ప్రకర్ష యం దొరులు రంధ్రములు వెదకుటకు తా వీయ గురు వొప్పుకొనడు.
ఇట్లు వారలతో దేశములు తిరుగుట అంతయు కళాభిమానము గాదు. స్వార్థముగూడ నున్నది. వచ్చు రాబడులలో గురుస్వాములకు కొంతభాగ ముండును. అభాగము కొఱకు, కళాదృష్టి లేని నేత్రములకు నీచముగాక నంబడినను బోగము మేళములతో తిరుగుచుందురు. ఈ సంచారము శృంగార కళాభినివేశులగు వారల సంయమమున కాటంకములు గలిగించి, శీలములందు దోషములు నగపరచినను, కళాదృష్టితో పరిశీలించు విద్యార్థులకు ఆక్షేపణీయము గాదు. సంపూర్ణకళాయుతుడగు చంద్రునికి మచ్చవంటిది.
ఈ యుగమున కళాస్త్రీలస్థాన మున్నతస్థితికి వచ్చినదని ఆ దేవదాసీగణముల యభిప్రాయము. సంసారులగు అస్త్రీలకు కళయంటదు. అభినయము సల్లాపము లాడుటలోనే కనబడును. అందుకొరకే ఈ అభినయకళ సంసారులకు, తదితరులగు వారలయింట నిలువలేదు. నిలిచినను అంతఃపురములయందు తప్పటడుగులతోడనే నాట్యకళాయువతి గంతినది. ఇట్టి కళా పోషణమునకు అడ్డంకి తగిలినది.
గాంధీమహాత్ముని వేశ్యయువతీ బహిష్కారము ఆచరణీయమనుటలో సందేహము లేదు. అనుభవశాలి వాక్యము శాస్త్రబద్ధము. కాని వివాహాదులకు ఈ స్త్రీల నాహ్వానించివారిచే భాగవతాది పూజ్యములగు అభినయములనుచూచి ఆనందించురసపిపాసులకు రసజ్ఞత పసలేనిదగును. పూర్వాంధ్రులయుగము నుండి వచ్చు జీవకళకి నాదరణము ప్రబలుచున్నది. జీవకళ నశింపదు. కాని వృద్ధిపొంది నవకమున కొప్పు సవరించుకొనక పోవచ్చును. శీలసంరక్షణమునకు వివాహములకు పిలిచి కళను పోషించినంతనే లోపము రాదు. రానున్నది రాకను పోదు. అభినయకళాతపస్వులగు కూచిపూడి భాగవతులు తమకళాప్రకృతిలో స్త్రీలకు స్థానమొసగి తమ్ము తామే గౌరవించు కొనిరనుటలో సందేహము లేదు.
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.
Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.
This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.
The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.
This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.
Public domainPublic domainfalsefalse