గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 3/మధుమాలి (పద్యములు)
ఆకసమ్మునఁ బూవు లేయందగించె,
వసుధకడుపునఁబూవులే పవ్వళించె,
ఆలయమ్మునఁ బూవు లేయాటలాడె,
ఏలపాడదు తుమ్మెదపూలపాట.. . . . . ౧
పవను కౌఁగిటఁ బూవులే సవదరించే
హృదయమందునఁ బూవులే రేకులెత్తె;
తోఁటలోపలఁ బూవు లేతోలకరించె,
ఏలపాడదు తుమ్మెద పూలపాట.. . . . .౨
ఎన్ని యెన్ని భవంబులు నేమియేమి
పూజలను జేసి పట్టితీ పూలనోము!
చైత్రు సహవాస సుఖము లేచాయనబ్బె
తేటసేయుము తుమ్మెదా! పాటఁబాడి.. . .౩
తుమ్మెద
కష్టములను శారదచంద్రికలవిధాన,
దుఃఖములను తొల్కరివానతునుకలట్టు,
లనుభవించితి,_చిత్తమాహ్లాదపులక
వివశమయి సేయునృత్యము౯ విడువకుఁడ.. . . . . ౪
స్తన్యభరశీతలంబైన జననియొడిని,
పరిమళ ప్రగాఢమగు భౌమపాన్పునందు,
వేదఋక్సూతనుగు యజ్ఞవేదిమీఁద
నెలమి_నాదు కౌమార మేనిలిపికొంటి.. . . . . ౫
ఆటలాడితి వెన్నెల యలలపోల్కి,
పాటలను బాడితిని సెలయేటిపగిది,
సంకెలలు కాళ్ళయందెలు చాయఁగొంటి,
అన్నిటను...... బాల్యలీలలేయనుభవించి.. . . . . ౬
పాటలుతలాడగాఁగొని పవ్వళించి,
పాటలను జెలిక తైలభాతిఁ బిలచి,
పాటలే జీవయాత్రకుఁ బధముఁజూప
వచ్చితిని, యంపకమ్ముల పాటతోడ.. . . . . ఽ
ఇంతకన్నను నోములే నితరమెఱుఁగ.
ఈశ్వరుఁడనుగ్రహించె నాకీభవంబు.
నవ్వుచును బుట్టి, నవ్వుచు నవక మొంది,
నవ్వుచునుబోదు—నిదియె నానగ్నలీల.. . . . . ౸
పాంథుఁడు.
మధుప! యేటికీ చంచల పథముఁగొంటి
వొక్కపువునకుఁ బెట్టుదు'చక్కిలింత’
లొక్కపువునఁ బానీయముఁ గ్రుక్క గొందు
వెక్క పూవును గీతితో నుత్సవింతు.
అంతు లేనియాక సమునఁ గొంతసేపు,
కుటిలపవన వీచికలందుఁ గొంతసేపు,
కువలయోన్మీల రేఖలఁ గొంత సేపు,
త్రుళ్ళిపడుచుఁ దిరిగెదుమ త్తునివిధాన.. . . . . ౧౦
తుమ్మెద
చంచలుఁడనౌదు నవనికిఁ జలన మొసఁగ,
విరహినగుదుశుష్కితులకుఁ బ్రేమదార్ప,
మత్తుడనగుదు జతలకు మత్తువెట్ట.
లేదు లేదనృతంబిందు లేశమయిన.. . . . . ౧౧
ఒక్కపువుపొంతనాడుదు, నెక్కపూవు
పజ్జఁబాడుదు మెక పూవు సెజ్జమీద
శిశువువలె నిదురింతు నీ చిత్రదశల
చక్కదనములు లేక నా జన్మమేల?. . . . . ౧౨
చిత్తచాంచల్యమన్నను సిగ్గులేదు
మతిభ్రమణమనినను నవమానపడను,
నన్ను నాపూల నెడఁదీసి భిన్న భిన్న
మార్గములకీడ్వకున్న నమస్కరింతు.. . . . . ౧౩
తారలన్నను,మణులన్న తనయులన్న
పులుఁగులన్న, గీతములన్న, పూవులన్న
నామవాచక భేదముల్ నాకు మాత్ర
మన్నియును బూవులేయగు నార్ద్రదృష్టి.. . . . . ౧౪
పూల కొఱక యిపుట్టితి, పూలలోని,
తీయ తేనెను దీయుచుఁదిరుగువాఁడ;
నెపుడు నాడుచుఁ బాడుచునిదియె - నిజము,
భ్రమయొ; యున్మాదమో; కైపొ; వలపొ సొలపొ!. . . . . ౧౫
ఈమధువ్రతమును తుదకెల్లజరిపి
వదలుదును తేనెపెరలతోఁ బాటుపృధివిఁ -
పిదపనరయుఁడు చంచలహృదయచంచ
రీకగీతిసంగ్రహమును బ్రీతితోడ.. . . . . ౧౬
ప్రేమచేఁ జెమ్మగిల్లిన హృదయ రాగ
ములను నడిపింప కాల్వలెందులకు త్రవ్వ?
నడువనిమ్ము నచ్చినభంగి నెడుపు లొలయు
వాలకముతో నెడా పెడ వాఁకలట్లు.. . . . . ౧౭