Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 2/గ్రంథాలయోద్యమము, బరోడా

​

గ్రంథాలయోద్యమము - బరోడా.

బరోడా సంస్థానాధీశులగు శాయాజీ గాయ క్వాడీగారు ఆధునిక కాలమున భరతఖండమందు గ్రంథాలయోద్యమమును స్థాపించుటయందు మార్గదర్శులై యున్నారు. వారు పాశ్చాత్య దేశములకు తఱుచు వెళ్ళి ఆదేశములందు జనులభివృద్ధినొందుటకు స్థాపింపబడిన ప్రతిష్ఠాపనలను పరిశీలనతో గమనించినవారు. జనులకు జ్ఞానాభివృద్ధియైనగాని దేశాభివృద్ధి కాదను నంశమును బాగుగ గుర్తెరిగి, మన బ్రిటిషు ప్రభుత్వమునందు నిర్బంధ ప్రథమ విద్య కూడునా కూడదా యను నంశము ఇంకను వివాదగ్రస్తమైయుండగా- ప్రథమవిద్య నిర్బంధముగను ఉచితముగను దేశమందఁతటను అభ్యసింపజేయవలసినదను శాసనమును అమలులోకి దెచ్చిన మహామహులు. ఇట్లు దేశమందు జ్ఞానాభివృద్ధికిది బీజములనాటి, పిమ్మట విద్యావంతులు పాఠశాలలయందభ్యసించిన విద్య నభివృద్ధినొందించుకొనుటకును, వయోవృద్ధులగుటచే పాఠశాలలకు పోయి ఇంకను విద్య సంపాదించుకొనుటకు వీలుతప్పినవారు జ్ఞానోపార్జన చేసుకొనుటకు సదుపాయములు కల్పించుటకును, తమదేశమున గ్రంథాలయోద్యమమును ఈ మహాపురుషుడు స్థాపించెను. ఈ యుద్యమమా దేశమందు ప్రారంభ మయినది 1910 సంవత్సరములోనని చెప్పవచ్చును. అంతకుపూర్వము బ్రిటిషు ప్రభుత్వములో చేరిన రాష్ట్రములయందువలె ఆదేశమందలి పట్టణములందచ్చటచ్చట వార్తాపత్రికలు చదువుకొనుటకును, గ్రంథ సముదా యము సమకూర్చుటకును చందాలనిచ్చి సాంఘికులుగా చేరు సభలుండియుండెను. ఈసభల వలన జనసామాన్యమున కేమి ఉపయోగములేకుండెను. భాగ్యవంతులే చందాలనిచ్చి ఇందు సభికులుగా చేరుచుండిరి. కావున గ్రంథాలయములు ధర్మముగా జేయబడినగాని జన సామాన్యమునకు జ్ఞానాభివృద్ధి సాధకములు గావని వారు బాగుగాగుర్తెరిగి వారట్లుచేయుటకు తీర్మానించిరి, ఆధునిక కాలమున అమెరికా ఖండపు సంయుక్త రాష్ట్రములలో గ్రంథాలయోద్యమము ఎక్కువ సమర్థతతో నిర్వర్తింపబడుచున్నది. కావున నీ యుద్యమము తమ దేశమునందు వ్యాపింప జేయుటకు తమకు సహాయులుగా నుండి గ్రంథాలయ శాఖాధ్యక్షులుగా నుండుటకై అమెరికాదేశ వాస్తవ్యులగు బార్డెనుగారిని శాయాజీరావుగారు తమదేశముకు బిలిపించిరి. వీరు మొదట ఒక సంవత్సరమువరకే ఉండుటకై యాహ్వానము చేయబడిన ​వారయ్యును, పిమ్మట వీరు చేయు కృషి వలన దేశమునకుకలుగుచున్న యమిత లాభమును గురైరిగి వీరిని మూడు సంవత్సరముల కాలము వరకు గాయక్వాడీ గారుంచిరి. దేశమంతటను గ్రంథాలయములు స్థాపించక పూర్వము గ్రంథాలయోద్యమమును సరియైన మార్గముల నడుపుటకు ప్రతిష్ఠాపన మొకటి స్థాపించుట యావశ్యక నూయెను. ఇదియే బరోడా కేంద్ర గ్రంథాలయ ప్రతిష్ఠాపనము. (Baroda Central Library Organisation) దీనిని స్థాపించుటయే బార్డెనుగారు చేసిన మొదటిపని. ప్రతి గ్రంథాలయమందునన్ని గ్రంథముల నుంచుటగాని, గ్రంథాల యోద్యమసంబంధమగు నన్ని శాఖలను స్థాపించుటగాని సాధ్యమైనపని కాదు. అట్టిపని కోరతగినది కూడ కాదు. కావున అందుబాటులోనున్న గ్రంథాలయములన్నియు అన్యోన్యాశ్రయములుగానట్లు చేయుటకును, గ్రంథాలయోద్యమము సరియైన మార్గముల నడచునట్లు చేయుటకును, ఈ కేంద్రగ్రంథాలయ ప్రతిష్టాపన స్థాపించబడినది. బరోడా రాష్ట్రమం దీయుద్యమము నూతనముగా సాపింపబడినదౌటచేత ఈ ప్రతిష్ఠాపన స్థాపించుట అంత కష్టము కాకుండెను. ఈ సంస్థాపన కార్యరూపముగ పరిణమింపక పూర్వము బరోడా రాష్ట్రమందున్న నగరముల యొక్కయు పట్టణముల యొక్కయు, పెద్ద పల్లెల యొక్కయు, చిన్న పల్లెలయొక్కయు సంఖ్యను, వాటియందున్న జనసంఖ్యయు, చదువరుల సంఖ్యయు, మొదట తెలిసికొనుట యావశ్యకమాయెను. బరోడా రాష్ట్రమందు బరోడానగరముతోగలుపుకొని నాల్గుసగరములును, 38 పట్టణములును, 46 పెద్దపల్లెలును, 2628 చిన్న పల్లెలును ఉన్నట్లు లెక్క తేలినది. ఇందు బరోడా నగరమందు రాష్ట్రమండలి ప్రతీ గ్రంథాలయమున కందుబాటులో ఉండునట్లుగా రెండులక్షలగ్రంథములుగల కేంద్ర గ్రంథాలయమును స్థాపించుటకును, మిగిలినమూడు నగరములందును ఆనగరము ముఖ్యపట్టణముగాగల జిల్లాలందలి గ్రంథాలయములన్నిటికిని అందుబాటులో నుండునట్లుగా 20,000 పుస్తకములు గల గ్రంథాలయములుండునట్లును, 38 పట్టణములలోను ఒక్కొక్కచోట 5,000 పుస్తకములుగల గ్రంథాలయములను స్థాపించుటకును, 426 పెద్దపల్లెలలో ఒక్కొక్కచోట 500 గ్రంథములుగల గ్రంథాలయముల నేర్పరచుటకును మిగిలిన చిన్న పల్లెలయం దొక్కొక్కచోట 200 గ్రంథములుగల గ్రంథాలయముల నేర్పరచుటకును తీర్మానింపబడినది.

బరోడాయందు
మొదటి గ్రంథాలయ శాఖాధ్యక్షులు.

డబ్లియు.ఏ.బోర్డెను.

ఈగ్రంథాలయములు దేశమంతటను పైన చెప్పబడిన ప్రకారము వ్యాపించి వానివలన ప్రజలు నిజముగా నభివృద్ధిఁ బొందవలెనన్న ప్రజలకు ముందు వానియందు అభిమానముండవలెను. ఉచితముగా వచ్చిన వస్తువునందు ప్రజలకంత యాదరణ యుండదు. సొమ్మునంతయు ప్రజలే ఖర్చు పెట్టి గ్రంథాలయము స్థాపించుకొనవలయునని రాజు శాసించిన, ప్రజలయందంత యుత్సాహము లేక పోవుట చేతను, దారిద్ర్యముచేతను అట్టిపని సమకూడదు. కావున ప్రజలయందు ఈయుద్యమముపట్ల ఉత్సాహమును యాదరణమును కలుగచేయుటకును, గ్రంధాలయములకు పుష్కలముగ సొమ్ము లభించుటకును శాయాజీ మహారాజుు

​గారు కొన్ని నియమముల నేర్పర్చిరి. ఏగ్రామమునందైనను ప్రజలెంత సొమ్మును చందా మూలమున వసూలు పర్చుకొనుచున్నారో అంత సొమ్ముకు రెట్టింపు దొరతనము వారిచే ఆగ్రామమువారికి గ్రంథాలయ స్థాపనకొరకిచ్చుటకు తీర్మానింపబడినది దొరతనము వారిచ్చు సొమ్ములో సగము స్థానిక పరిపాలనా సంఘపు సొమ్ములోనుండియు మిగిలిన సొమ్మ రాష్ట్రపు బొక్కసమునుండియు ఇచ్చుట కేర్పాటు చేయబడెను. ఇదిగాక దొరతనమువారిచే ప్రచురింపబడు గ్రంథములన్నియు 'గ్రంథాలయముల కుచితముగా నిచ్చుటకు తీర్మానింపబడెను.

ఇట్లు గ్రంథాలయములు దేశమంతటను స్థాపించుచు రాగా 1913సంవత్సరము వరకు బరోడా కేంద్ర గ్రంథాలయమందు 65,000 ముద్రిత గ్రంథములను 2,000 సంస్కృత లిఖత గ్రంథములను, తక్కిన మూడునగరముల యందు రమారమి 3,000 గ్రంథములు గల గ్రంథాలయములును, 38 పట్టణములలో 4,000 మొదలు 300 వరకు గ్రంథములుగల గ్రంథాలయములును, 426 పెద్దపల్లెటూండ్లలో 216 గ్రామములందు 200 గ్రంథములుగల గ్రంథాలయములును, 2,628 చిన్న పల్లెటూండ్లలో 86 పల్లెటూండ్లయందు గ్రంథాలయములును 110 పల్లెటూండ్లయందు పఠనమందిరములను స్థాపింపబడెను.

1914 సంవత్సరాంతముకు బరోడా రాష్ట్రమందలి నాల్గు నగరములందును కేంద్రగ్రంథాలయములును, 38 పట్టణములందును 373 పల్లెలందును గ్రంధాలయములును, 100 పఠన మందిరములును పనిచేయుచున్నవి. ఇవిగాక సంచార గ్రంథభాండారములు బరోడా కేంద్ర గ్రంథాలయము వారిచే దేశమందంతటను పంపబడుచుండెను.

సంచార గ్రంథభాండాగారములననేమో ఇచ్చట చెప్పుట యావశ్యకము. ప్రజాసా మాన్యమునకు సామాన్యముగా నిష్టముగల గ్రంథములను కొన్నిటిని ఒక పెట్టెలో పెట్టి ఆపెట్టె నొక సేవకునకిచ్చి ఆ పెట్టెయందుండు గ్రంథముల పట్టికలతోకూడ గ్రామములకు పంపబడును. ఆసేవకుడా పట్టికలను గ్రామస్థులందరకు పంచి పెట్టి తన గ్రంథముల పెట్టెను కూడలి స్థలమున నెక్కడనో యొక చోట యుంచుకొనును. ప్రజలందరు తమకు పంచి పెట్టబడిన పట్టికనుండి గ్రంథముల పేర్లు తెలుసుకొని వారాసేవకునివద్దకు వచ్చిఒకటొకటిగ పుస్తకములను తీసుకొని చదువుచుందురు. ఇట్లు తాను తెచ్చిన గ్రంథములను ఆయూర చదువదలుచుకున్న వారందరు చదివిన పిమ్మట సేవకుడు ఈగ్రంథములు దీసుకొని మరియొకచోటికరుగును. ఇట్లు ప్రత్యేక గ్రంథాలయములు స్థాపించుటకు సావకాశములు లేనిచోట్ల ఈ సంచార గ్రంథ భాండాగారముల మూలమున విద్యాభివృద్ధి జరుగుచుండును.

గ్రంథాలయములు స్థాపించినతోడనే గ్రంథాలయోద్యమముతో గూర్చిన పని యంతయు పూర్తికాలేదు. గ్రంథాలయమును జనాకర్షముగ జేయుటయును, గ్రంధాలయమున్నట్లు జనసామాన్యమున కందరకు దెలియునట్లు చేయుటయును, అతక్షరజ్ఞానము లేనివారికి గూడ గ్రంథాలయమువలన లాభముచే ​కూరునట్లు చేయుటయును గ్రంథాలయ స్థాపకుల పనియై యున్నది. ఇట్లు చేయుటకు కేంద్ర గ్రంథాలయ సంస్థాపన పక్షమున బరోడా నగరమందెంతయో కృషి జరుగుచున్నది.

శిశువిద్యకు గ్రంథాలయముల తోట్పాటు:- శిశువులకు విద్య నభ్యంసింప జేయుటయందు కథలు చెప్పుటయు, చిత్రపటములు చూపుటయు, వస్తు పాఠములను బోధించుటయు, మిక్కి_లి యుపయోగకరములు. అందుచే కేంద్రగ్రంథాలయ పక్షమున గ్రంథాలయములకు సంబంధముగ శిశుశిక్షా శాఖ యొకటి స్థాపింపబడినది. ఈశాఖకు సంబంధించిన యుద్యోగులు బడి పిల్లలను తమ గ్రంథాలయమునకు తీసుకొనివచ్చి వారికి పైన చెప్పిన పరికరము సహాయ్యముతో విద్య నభ్యసింప జేయుదురు.

క్రీడాశాఖ-గ్రంథాలయము జ్ఞానమిచ్చునదేగాక యాహ్లాదమును పుట్టించునదిగ కూడ నుండవలయునను తలంపుతో గ్రంథాలయములలో క్రీడాశాఖ కూడ నేర్పురుపబడినది.

చిత్రపట సందర్శనము-గ్రంథాలయములు చక్షురసంయోగమువలననే గాక నిరక్షరకుక్షులకుకూడ జ్ఞానదాయకములుగా నుండవలెననియు, జ్ఞానము ఆహ్లాదముతో ప్రజలు సంపాదించుకొనుటకు దగిన సదుపాయములుండవలయుననియు నిదివరకే చెప్పి యుంటిమి. ఇందుకుగాను ఆ దయాసింధువగు శాయజీగాయకవాడీగారు సినిమెటోగ్రాఫులను కొని కేంద్ర గ్రంథాలయ సంస్థాపన కొసగిరి. ఈ శాఖీయోద్యోగులు ఈ యంత్రము తీసుకొని రాష్ట్రమందలి గ్రామములకు బోయి ఈమూలమున దేశమందు జ్ఞానమును వెదజల్లు చున్నారు.

గ్రంథాలయ సంఘము—గ్రంథాలయములను పరిపాలన చేయుటకు దగిన జ్ఞానము ప్రత్యేక అభ్యాసమువలన గాని యలవడదు. ఇదియొక ప్రత్యేక శాస్త్రము. అనుభవము వలన నిందు నేర్చుకొన తగిన యంశము లెన్నియో గలవు. కావున బరోడా కేంద్ర గ్రంథాలయ సంస్థాపనకంగముగ గ్రంథాలయ సంఘమొకటి 1913 సం॥రం ఏప్రియలులో స్థాపింపబడెను. ఇందు భాండాగారికులు సాంఘికులుగా చేరి తమ తమ యనుభవములను గూర్చి ముచ్చటింతురు. గ్రంథపరిశోధన వలన నేర్చికొనిన యంశములను గూడ ముచ్చటిం తురు. ఈ మూలమున గ్రంథాలయ శాస్త్రము బరోడా రాష్ట్రమున సహస్రముఖములు నభివృద్ధి నొందు చున్నది.

గ్రంథాలయ శాస్త్రబోధ:- గ్రంథాలయ నిర్వహణము ప్రత్యేక శాస్త్రముగా నభివృద్ధి చెందినదని ఇదివరకే చెప్పియుంటిమి. ఈశాస్త్రము నభ్యసింప జేయుటకు విద్యార్ధి వేతనములనిచ్చి ప్రత్యేక మొక పాఠశాలను శాయాజీగాయక్వాడీగారు 1912 సం॥రం నవంబరు 26వ తేదీన స్థాపన చేసిరి.

గ్రంథాలయసర్వస్వమను పత్రిక:—ఇట్లు బరోడా రాష్ట్రమందలి ప్రతి పట్టణమందును, ప్రతి పల్లెయందును, ప్రతి మనుజునకును జ్ఞానము దేవదత్తమగు వాయువువలెను నీటివలె ​సమృద్ధిగను వెల లేకను లభించుటకై గ్రంథాలయములను, వానికంగముగ పైన చెప్పిన వివిధ శాఖలను, ఆమహారాజు స్థాపన యంతటతో తృప్తి చెందక తమ యనుయాయులకు తాము స్థాపించిన ప్రతిష్ఠాపనల క్రమమును ఇతర రాష్ట్రముల నేర్చుకొని లాభము పొంగుటకై తమ బొక్కసము నుండి ఎక్కువ ధనమును వ్యయుపెట్టి సర్వాంగ సుందరమగు పత్రికను మూడుమాసముల కొకసారి మూడు భాషల యందు ప్రచురించునట్లు చేయుచున్నారు. ఆపత్రికబోధ చేయుచున్న విషయములే మన దేశమందట్టి, యుద్యము స్థాప నకు మార్గదర్శకము లగుచున్నవి.

బరోడాగ్రంథాలయ శాఖాధ్యక్షులుగా ఈశాబాధ్యక్షులుగా బోర్డెనుగారు 3 సంవత్సరముల కాలమువరకు పనిచేయుటకు నియంపబడినని, ఇదివరకే చెప్పబడియుండెను. వీరి పని యొక్క గడువు 1913 సంవత్సరం 15 సెప్టెంబరుతో అంతమయ్యెను. వీరిస్థానము నధిష్ఠించుటకు వీరిస్థానము ఇచ్చట పని చేయుచున్న కాలముననే, కుడ్హోల్కరు అను వారిని గాయక్వాడీగారు ప్రపంచమంతటను తిరిగి గ్రంథా లయ శాస్త్రము నభ్యసించి వచ్చుటకును, ఆయా దేశములయందలి గ్రంథాలయములయొక్క కట్టుదిట్టములను గూర్చియు మర్యాదలను గూర్చియు తెలిసికొనివచ్చుటకు పంపియుండిరి. అమెరికా సంయుక్త రాష్ట్రముల గ్రంథాలయ సంఘమువారు గాయక్వాడీగారిని కుడ్హోల్కరుగారిని తమ సంఘములకు గౌరవసభ్యులుగా చేర్చుకొనిరి. ఈ కుడ్హోల్కరుగారు వారి విధిని నిర్వర్తించుకొని స్వదేశమునకు వచ్చి బోర్డెనుగారు ఖాళీ చేసిన పదవినధిష్టించిరి. వీరికి మన ఆంధ్రదేశ గ్రంథాలయోద్యమము గూర్చి తరుచు జాబుల మూలముగ సంజాయిషీని తెప్పించుకొని దానిని వారిపత్రిక యందు ప్రచురించుచున్నారు. వారిచే ప్రచురింపబడు పత్రికయందచ్చగు ప్రతిమల యొక్క బ్లాకులను మన పత్రిక కుచితముగా బంపుచున్నారు. దూరమునుండి వారిచే జూపబడుచున్న ప్రేమతోతృప్తినొందక స్వయముగా మన యాంధ్రదేశమందలి భాండాగారికులు కొందరు వారివద్దకు వెళ్ళి ఇందును గూర్చిన జ్ఞానమును నేర్చుకొనుట కడునవసరము. ఇందుకు కొందరు యువకులు ప్రయత్నపడుచున్నారు. వారి ప్రయత్నములు సఫలీకృత ములగునట్లు పరమేశ్వరుడు చేయుగాత!

కుడల్ కార్క్, ఎం.ఏ.ఎల్.ఎల్.బి

అమెరికా దేశమందున్న న్యూయార్కు గ్రంథ భాండాగార సంఘమునందు
గౌరవ సభ్యులు,బరోడా రాష్ట్రమునందు గ్రంథాలయ శాఖాధ్యక్షులు