Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 2/క్షాత్రయుగమునాటి హింద్వార్యులు-వారియాహారము

​

[1]క్షాత్రయుగమునాఁటి హింద్వార్యులు - వారియాహారము



[మాడపాటి హనుమంతరావు గారిచే వ్రాయబడినది]

మనపూర్వులకు హింద్వార్యులు క్షాత్రయుగమున నెట్టి వస్త్రముల ధరించుచుండిరో మామొదటి వ్యాసమునఁ జూపియున్నాము. ఆ కాలమున వారెట్టి యాహారమును భుజింపుచుండిరో, క్షాత్రయుగారంభమునుండి తద్యుగాంతమువఱకు వారియాహారమున నెట్టిమార్పులు కలిగెనో ఈవ్యాసమునఁ దెలుపుట మాయుద్దేశము. ఇట్టిమార్పులను మనకుఁ జూపు ముఖ్య గ్రంధములు ఉపనిషత్తులు, వీర కావ్యములు, మనుస్మృతియునైయున్నవి. మనవారిలో వాటిల్లిన యీమార్పులు ఒకదృష్టికి అభివృద్ధి నూచకము లేయైనను వేఱో కదృష్టితోఁ జూచిన పక్షమున నవి మనవారి హీనదశకుఁగూడ కారణములైన వని యనేక విద్వాంసులభిప్రాయపడుచున్నారు, నైతికాధాత్మికబుద్ధితో నాలోచించిన యెడల, మత సంబంధమగు నుద్దేశముల ప్రేరణచేతి మాంసాహారమును త్యజించి శాకాహారము నవలంబించిన వారు మనకెంతయు వందనీయులనుట యందు సందేహముండునా? ఉండదు, కాని పారమార్ధికదృష్టితో నాహారమునందు వారు చేసికొనిన యామార్పు వారిని రాజ్యాంగ స్వాతంత్య్రమునుండి దూరగులఁజేసిన మాటఁదలఁచినపుడు యామార్పు వారి కనర్థదాయకముగాఁ బరిణమించినదికాని లాభప్రదము కాలేదను సంగతిని మోక్షమూలరువంటివాఁడొప్పికొని యున్నాఁడు. పైనఁ జెప్పఁబడిన మార్పెట్లు కలిగినదో వీరకావ్యములనుబట్టి యోచించుటకు ముందు, బృహదారణ్యకోపనిషత్తునందలి యీ క్రింది వాక్యము మా చదువరుల శ్రద్ధనాకర్షింపఁదగియున్నది. “విద్వత్సభలందజేయుఁడుగను, సర్వజన ప్రీతికరముగ నుపన్యసించు వక్తగాను, వేదార్థమును బోధింపఁగల వాఁడుగను, దీర్ఘాయువుగను నుండు పుత్రుని బడయఁగోరువాఁడు నేతితోను (గొడ్డు దైనను సరే గొఱ్ఱెదైననుసరే) మాంసముతోను వండఁబడియున్న యన్నమును దినవలయును.”ఇట్టి యన్నమును దినుటవలన పై వచనముననున్న ఫలము లభించునా లభింపదాయను విషయమున మేము వాదము సల్పఁ బూనుకొనలేదు. కాని ఈ వాక్యమునుబట్టి చూచినచో గోడ్డుమాంసమును దినువారు శారీరిక బలము నందు మాత్రమేకాక మానసిక బలమునందును గొప్పవారగుదురని ఆకాలపువారు నమ్మియుండినుట స్పష్టముగా మాత్రము తెలియుచున్నది. కనుక ఆకాలపువారికి మాంస మాహారమైయుండెననియు, పైనఁ జెప్పినమాంసము మేదస్సునకుఁ గూడ బలము నిచ్చునదియని వారెంచుచుండిరనియు తేలుచున్నది.

మహాభారతము కూడ పైయంశమునే బలపఱచు చున్నది. యుద్ధానంతరము ధర్మజుఁడొనర్చిన యశ్వమేధ సందర్భమున, వ్యాసుఁడు, పశుపక్షులు ముఖ్యముగా ఎద్దులు, జలచరములు యజ్ఞకార్యము కొఱకు మంచివని వచించియున్నాఁడు.[2] అంతేకాదు. ఆయజ్ఞ సమయమున, జంతువులమాంసముతో వండఁబడిన వివిధ మధురాహారములకు మితమే లేకుండెనని కూడ చెప్పఁబడియున్నది. [3]† వేలకొలఁది బ్రాహ్మణులును లక్షల కొలఁది క్షత్రియులును భుజించుటకై యేర్పరుపఁబడిన విందులందనేక పశువుల మాంసము వండబడియుండవలయుననియు, చంపఁబడిన జంతువులసంఖ్యనుబట్టియేమి, వాడఁబడిన [4] మద్యభాండముల సంఖ్యనుబట్టియేమి అప్పటి మన హింద్వార్యుల విందులకును వారిసోదరులకు జర్మనీ దేశీయుల విందులకును విశేషభేదముండలేదనియు చెప్పినచో నందు అసంగత మేమియునుండదు.

మహాభారతమునకు ఇప్పటియాకారము నొసఁగిన సౌతి, వైష్ణవ జైన బౌద్ధమతములు వృద్ధిఁజెందిన తరువాతి ​వాఁడు; కనుక పైనఁ జెప్పిన విందుల వివరములు అతనికి వింత గాఁదోఁచియుండవచ్చును. కావుననే యాతఁడు, తరువాత వచ్చిన యధ్యాయమునందు అట్టి విందులను నిరసించినాఁడు. ఈ యధ్యాయమున బంగారుతలగల యొక నకులము (ముంగిస) కథ వచ్చినది. మాంసాహారమును, జంతువులబలులను దూష్యములు గాఁ జూపి, యవిగల యజ్ఞములకంటే ఆఁకలిఁగొన్న యతిధికి పిడికెడటుకులు పెట్టిన నెక్కువపుణ్యమువచ్చునని నిరూపించుటకై ఈకధ యచ్చట తెచ్చిపెట్టఁబడినది. క్షాత్రయుగారంభమునుండి యాయుగము ముగియునాఁటికి జనుల యభిప్రాయము లేవిధముగా మాఱినవో పైకధవలనఁ దెల్లముగు చున్నది.

జనాభిప్రాయ మెట్టిమార్పుఁ జెందినను క్షత్రియులు మాత్రము నేఁడెట్లో యట్లే ఆకాలమునందును పూర్వాచారమును వదలక మాంసాశనమును జంతువుల బలులను జరుపుచునే యుండిరి. పైదాని తరువాత యధ్యాయమున అప్పటిజనాభిప్రాయమును కొంత సమాధానపఱచుటకై యియ్యఁబడిన ప్రత్యుత్తరమొకటి మనకు కానవచ్చుచున్నెది. వ్యాసాది మహర్షుల నియోగము ననుసరించి ధర్మరాజు చేసిన యా యజ్ఞ కార్యమును నకులమెట్లు నిందింప సాహసించెనని జనమేజయుఁడు ప్రశ్నవేయఁగా వైశంపాయనుఁడిట్లు చెప్పుచున్నాఁడు. పూర్వమొకప్పుడు ఇంద్రుఁడు యజ్ఞము చేయుచుండ పశువధ జరగఁబోవు సమయమున అచ్చటనుండిన ఋషులు యజ్ఞపశువుల జాలిఁగొలుపు చూపులఁ జూచి దయఁదలఁచి, 'పశుహింస అధర్మకార్యము కనుక ఈ యాగము సధర్మమైనది కాదు' అని యింద్రునితో ననిరి. [5] ఇంద్రుఁడు వారితో నేకీభవింపనందున యజ్ఞములందు జంతువులను వధింప వచ్చునా కూడదా యను విషయమున ఇంద్రునకును ఋషులకును వాదము కలిగెను. అంత వారీ వివాదాంశమున చేదిదేశపు రాజగు వసువు యొక్క తీర్మానమును గోరిరి. ఏది దొరికిన దానితోనే యజ్ఞము చేయవచ్చునని వసువు నిర్ధారణ చేసెను. ఈ యంశము నింత నిర్లక్ష్యముగా తీర్మానించినందున చేదిరాజు అధోగతిపాలై పాతాళమునకుఁ బోయెను". కాని యిూవివాద మింతటితో ముగియలేదు. జన సామాన్యము జంతువులకు మాఱుగా నితర పదార్థములను యజ్ఞ సమయములం దర్పించి తృప్తినొందు చుండిరి. కాని క్షత్రియులు మాత్రము తము పూర్వపద్ధతిని మానలేదు. కనుకనే క్షత్రియుఁడైనవాడు తన సార్వభౌమత్వమును జాటఁ గలిగినపుడెల్ల ధర్మజ జనమేజయులవలె నశ్వమేధముఁ జేయుచునే యుండెను. అశోకుని వంశీ మంతరించిన తరువాత హిందూచక్రవర్తి యగు పుష్యమిత్రుఁడు ఆశ్వమేధ యాగము చేసెను. ఈవిధముగా యజ్ఞములందు జరుగు హింస న్యాయమైనదే యని బ్రాహ్మణు లొప్పుకొనవలనిన వారైరి. దీని తరువాతి యధ్యాయమున అగస్త్యుని యజ్ఞపు కథ కలదు. ఈజన్నము పండ్రెండు వత్సరములు జరుగుచుండెను. దీనియందు నిర్జీవ పదార్థములే యాహుతి యియ్యఁబడెను. అంత నింద్రుఁ డాగ్రహించి వర్షింప మానుకొనెను. యజ్ఞదులకు ధాన్యమైనను దొరకదేమో కదా యని ఋష్యాదులు భయపడి, అగస్త్యుని యొద్దకుఁ బోయి మొఱపెట్టు కొనిరి. అగస్త్యుఁడు చేయున దేమియులేక, ధాన్యమే లభింపని యెడల తాను మానసిక యజ్ఞము చేసెదననియు, కాకపోయినచో ఉత్తర కురుభూములకు బోయి ద్రవ్యముఁ దెత్తుననియు, అదియును కాదా తానే యింద్రత్వమును వహించి భూమిని సస్యవంతముగఁ జేసెదననియు చెప్పి యట్లే తన మహాత్మ్యమువలన ద్రవ్యము నుద్భవింపఁ జేసెను. ఇంద్రుఁడచ్చెరువొంది తన్ను క్షమింపుమని యగస్త్యుని వేడికొని ఎప్పటివలె వర్షము గుఱిపించెను. దేవతలతోడి వైరమున తమ తపోధనమును వృధ చేసికొనుట మంచిపనికాదు కనుక యాగములలో జరుగు పశుహింస హింసయే కాదని విధింపుమని అగస్త్యుని ఋషులు వేడికొనిరి. అతఁడు వారి విన్నపము నంగీకరించెను. ఋషులు స్వస్థానములకుఁ బోయిరి. ఈసమయమున జంతువుల బలులు కనుకూలముగ నభిప్రాయము మాఱినది కనుకనే అశ్వ మేధపర్వమునందలి తుదియధ్యాయమున వెనుకటి స్థితిగతులు పోయి, ధర్మజుని యాగమును నిందించిన యా నకులము నిజముగా నకులము కాదనియు, యముఁడు జమదగ్ని కా ​ప వశమున నకులాకారమును ధరించెననియు, యుధిష్టిరుని యాగమును దూఱినప్పుడు శాపనివృత్తి కలుగవలసిన విధానముండెను. కనుక యాగమును నిందించుట సంభవించినదనియు చెప్పఁబడి యున్నది.

మాంసాహారమును గుఱించియు, యాగములందు పశుహింస జరగుటను గుఱించియు జనుల యభిప్రాయము లెట్లు మాఱినవో చూపుటకై మేము నకులము యొక్క కథను కొంత దీర్ఘముగ వ్రాయవలసినవారమైతిమి. ఈ నకులము యొక్క కథ మనవారి యాహారవిధానము యొక్క మూఁడు దశాభేదములను దెలుపుచున్నది. మొదట మాంసాహారులు గాను జంతువులను బలియిచ్చువారుగను నున్న హింద్వార్యులు ఆపద్ధతిని వదిలి అహింసా సిద్ధాంతము నవలంబించి రెండవదశకు వచ్చిరి. ఆ రెండవ దశనుండి మరల యాగాదులందు హింసజరుగవచ్చును అను సిద్దాంతము నొప్పుకొని మూఁడవదశకు వచ్చిరి. ఈ విధముగా క్షాత్రయుగాంతమునాఁటికి స్థిరపడిన నీ మూఁడవ యభిప్రాయమే ఇప్పటి కాలమున పశుహింసతోఁగూడిన యాగములు విశేషముగాఁ గానరాకపోయినను, క్షాత్రయుగాంతముననుండిన యభిప్రాయమే యిప్పటికి స్థిరమై యున్నదనుట స్పష్టము. ఆహార విషయమునను క్షాత్రయుగాంతము నాఁటి యభిప్రాయములే నేఁడును నిలచియున్నవి. అనఁగా నేఁటికిని క్షత్రియులును, హింద్వార్యులలోను మిశ్రార్యులలోను జేరిన కొన్ని బ్రాహ్మణ జాతుల వారును మాంసాహారమునే భుజించు చున్నారు.

అయినను, ఒక విషయమున మాత్రము కడపటివాక్యమునఁ బేర్కొనఁబడినవారు తక్కుoగల హిందువుల మార్గము ననుసరింపక తప్పలేదు. అదేదన గోవధము. హిందువులలోని వివిధశాఖలవారెట్లు గోవృషభవధమును మహాపాతకములుగ గణించు చుండిరో పైవారును నట్లే తలఁచుచుండిరి. [6] ఈ నిషేధ మెప్పుడు విధింపఁబడినదో తెలియదు. క్షాత్రయుగారంభమున మన హింద్వార్యులు గోవృషభములను బలియిచ్చుచు, వాని మాంసమును దినుచుండిరనుట నిర్వివాదాంశము. ఈ సిద్ధాంతమును బలపఱచు వాక్యములు మహాభారతమందెన్నియో కలవు. అనేక యాగములచేఁ బ్రసిద్ధిఁ గాంచిన రంతిదేవుడు బలియిచ్చు చుండిన వృషభముల[7] చర్మములు కుప్పలోనుండి యొకనది యుత్పత్తియయ్యెననియు, దానికి చర్మావతీ (చేంబలు) యను సార్థక నామము వచ్చెననియు, మహాభారతమున నున్నది. ఇఁక గొడ్డుమాంసమును దినుచుండిరను విషయమున, కావలసినచో భవభూతి కృతమగు ('ఉత్తర రామచరిత'లోని వశిష్ట విశ్వామిత్రుల శిష్యుల సంభాషణము చూడఁదగును. ఈ సంభాషణమున వశిష్ఠుని యాతిధ్యమునకై మధుపర్కము కొఱకు చిన్నయావు నొకదానిని వధించిన విధమును తెల్లగడ్డముగల యాజడదారియెదుట నాయావు, పులిముందుబడిన మేకపిల్లవలె, గుటక్కున మాయమైన విధమును వర్ణింపఁబడి యున్నది. స్థితిగతులట్లుండఁగా క్షాత్రయుగాంతము నాఁటికి గోవృషభములు ఆహారరూపమున మనవారి కుక్షులలోఁ బడకుండ నెట్లు తప్పించుకొనఁగల్గెనో తెలియవచ్చుటలేడు. ఎట్లయిన నేమి! క్షాత్రయుగాంతము నాఁటికి వానికాయవస్థ తప్పినది. ఎందుచేతనో కాని గ్రీకులు ఈ నిషేధమును వ్రాయలేదు. అప్పటికాలపువారు శాకాహారులుగా నుండిరనియు, జంతువుల బలియిచ్చుట వారేవగించు కొనుచుండిరనియు గ్రీకులు కనిపెట్టిరి. “హిందూ దేశీయులు సాధారణముగా ధాన్యము తిని జీవించెదరు; నేల దున్నెదరు. కాని పర్వత ప్రాంతముల వారు మాత్రము వేటాడిన జంతువుల మాంసముఁ దినుచుందురు” అని 'పరియాను' వ్రాసి యున్నాఁడు. దీనినిబట్టి చూడ, ఇప్పటి వలెనే ఆకాలమునఁ గూడ హిమాలయ ప్రాంతవాసులు మాంసమును దినుచుండిరనియు మైదానములలో నుండు వారు శాకాహారులుగా నుండిరనియు తెలియుచున్నది. ​'వేటాడిన జంతువులు' అనుటవలన గోవధ నిషిద్ధమైనట్టు కొంత గోచరమగుచున్నది. కాని పరదేశీయుల దృష్టి నాకృషి౯ంప వలసిన యీ యంశము గ్రీకులకేల స్పష్టముగా స్ఫురింపలేదో తెలియరాకున్నది. వారు వ్రాసిననేమి వ్రాయకపోయిననేమి? నేఁడెట్లో క్షాత్రయుగాంతమునగూడ నటే గోవధ మహాపాతకముగా నెంచఁబడు చుండెననుట నిస్సంశయము.

మహాభారతము నచ్చటచ్చట కానవచ్చు నస్పష్ట చిహ్నములనుబట్టి గోవధానిషేధ చరిత్రమును కొంచెము కనుఁగొందము; నహువ సప్తర్షులకథలో, సప్తర్షులు యాగములందు గోవధ క్రమమైనదేయని వాదించుచుండ, నహుషుఁడగి యక్రమమని వాదించును. అనఁగా సప్తర్షులు క్షాత్రయుగము నాఁటి పూర్వాచారపరాయణుల భావములను వ్యక్తీకరించినారు; నహుషుఁడు సంస్కారవాదుల యభిప్రాయములను ప్రకటించియున్నాఁడు. "గోవులను బలియియ్యవచ్చునని చెప్పు వేదమంత్రములను నీవు నమ్ముదువా?" యని నహుషుని అగస్త్యుఁడడిగెను.[8] "నేను నమ్మ” నని నహుషుఁడు ఉత్తరమిచ్చెను. ఋషులిట్లనిరి. “నీవధర్మమార్గమున నున్నావు. అనుశ్రుతముగా వచ్చుచున్న మతమును నీవొప్పుకొనకున్నావు" తరువాత జరిగిన వాదవివాదమున నహుషుఁడు అగస్త్యుని తలమీఁదఁగొట్టి, శాపవశమున మత్యలోకమున సర్పమై జన్మించెను. నకులము కథలో జంతుహింసకు ప్రతికూలుఁడుగా నున్న అగస్త్యుఁడు ఈ సందర్భమున జంతుహింసకు అనుకూలుఁడుగా నుండుట విచిత్రముగా నున్నది. పైన వివరింపఁబడిన శ్లోక వ్యాఖ్యానమున గోవుయొక్క పావిత్య్రము ఏర్పడిన కారణము చూపఁబడి యున్నది. యాగ సంబంధములగు మంత్రములకు బ్రాహ్మణుఁడెట్లు ఉనికిపట్టోయ ప్లే యజ్ఞ ద్రవ్యములగు క్షీరము, నేయి మొదలగువానికి ఆవులునికి పట్టులు కనుక ఆవులను వధింపఁగూడదని నహుషుఁడు తలఁచెనఁట. గోవధానిషేధమునకు మఱియొక కారణముకూడ నుండవచ్చును. కృష్ణునకు గోవులు ప్రియతమములగుట వలన కృష్ణారాధనముతోఁబాటు గోవుల గౌరవముకూడ హెచ్చియుండవచ్చును. ఇంకొక సంగతికూడ గమనింపఁదగియున్నది. ఇరానియనులు గోవులపావిత్యమును నమ్ముచుండిరి. కనుక సింధునది యావలినుండి అప్పుడప్పుడు వచ్చుచుండిన యార్యులతో ఁగూడ నీయభిప్రాయము దేశమునందంతిట బ్రవేశించియుండవచ్చును. ఎట్లువచ్చిన నేమి? గోవధానిషేధము క్షాత్రయుగములోనే వచ్చినదనియు అది కొంతకాలము వఱకు వాదవివాదములకు గుఱియై ఆయుగాంతము వఱకు స్థిరపడినది మనము నమ్మవలెను.

వీపులమీఁద బరువులను మోసికొనిపోవు జంతువుల మాంసము తినఁగూడదని మనదేశమందొక నియమముండెను. మహాభారతముననిట్టి మాంసమునకు 'పృష్ఠమాంస' మని పేరు. బరువులుమోయు జంతువులయెడల జనులకుగల కృతజ్ఞత వలన నీనియమము పుట్టియుండవచ్చును. ఈకారణము వృషభముల వధకు వర్తించును గాని గోవధకువర్తింపదు. అంతేకాక గుఱ్ఱపుమాంసము ఆకాలమున నిషిద్ధముగా నుండలేదు. గుఱ్ఱముకూడ బరువులను మోసి కొనిపోవు జంతువేకదా. కనుక పృష్ఠమాంస సిద్ధాంతము తర్కమునకు నిలువఁజాలదు.

గోమాంసముమాత్రమే కాక బ్రాహ్మణక్షత్రియులు తినఁగూడని మాంసముల విధములు ఇంకనుగలవు. “ఐదునఖములుగల యైదు తరగతుల జంతువుల మాంసమును మాత్రమే బ్రాహ్మణ [9]క్షత్రియులు తినఁదగినది” యని రామాయణమున నొక ప్రసిద్ధశ్లోకము కలదు. దీనినిబట్టి చూచితిమేని బ్రాహ్మణులు మాంసాహారమును దిను విషయమున మఱెే నిర్బంధము నుండినట్లు కానరాదు. ఇట్లుండియు, మహాభారతమున నొకచోట త్యాజ్యములగు జంతువులు పేర్కొనఁబడినవి. శాంతిపర్వములోని ౩౬ వ అధ్యాయము "బ్రాహ్మణుఁడు తినఁగూడని మాంస మేది?” యని ధర్మరాజు భీష్మునడుగును. దీనికి భీష్ముడిచ్చిన ప్రత్యుత్తరమిది [10] “ఎద్దులను, మంటిని (?) చిన్న పిపీలకల ​ను, మలినపదార్థములలో జన్మించు పురుగులను, విషమును బ్రాహ్మణులు తినఁగూడదు. పొలసులేని చేపలను, తాబేళ్లను తప్ప కప్పలవంటి చతుష్పాత్తులగు జలచరములను గూడ వారు భుజింపఁ గూడదు. భాసములను, హంసములను, సుపర్ణములను, చక్రవాకములను, ప్లవములను, కొంగలను, కాకులను, మద్గులను, గ్రద్దలను, శ్యేనములను, గుడ్లగూబలను, మాంసమును భక్షించునట్టి పదునైన పొడుగుపాటి కోరలుగల చతుష్పాత్తులను, రెండు దంతములుగలట్టియు నాల్గుదంతములు గలట్టియు పక్షులను వారు తినఁగూడదు". దీని తరువాత, తక్కిన విధములగు మాంసములను బ్రాహ్మణులు తినవచ్చునని చెప్పఁబడి యున్నది.

ఇట్టి యనుకూల ప్రమాణములుండి నప్పటికిని క్షాత్రయుగాంతము నాఁటికి హింద్వార్యులును, మిశ్రార్యులునుఁ పూర్వాచార పరాయణులగు క్షత్రియులు తప్ప తక్కిన వారండఱును, క్రమముగా మాంసాహారమును మానివేయు చుండిరి. ఆధ్యాత్మిక జీవనము కలవారు మాంసమును త్యజించి తీరవలయునను విధానముండినట్టు కానవచ్చుచున్నది. “మాంసాహారమును మద్యపానమును మానవునకు సహజములగు కోరికలు కనుక వానిని వాడుకొనవచ్చును. అయినను వానిని వదలిపెట్టుట మహాలాభప్రదము” [11][12] అని మనువు వచించి యున్నాఁడు. మాంసము తినవచ్చునా తినఁగూడదా యను ప్రశ్న క్షాత్రయుగాంత ప్రాంతమున జనుల మనస్సును చాల కలవరపఱచినట్లున్నది. ఇట్టి తర్కవితర్కములకు ముఖ్యకారణము అప్పుడు ప్రచారము నందుండిన అహింసా సిద్దాంమే. అనుశాసన పర్వములోని ౧౧౫వ అధ్యాయమునండు యుధిష్టిరుఁడు ఇట్లు భీష్ము నడిగెను. "అహింస పరమధర్మమని మీరు చెప్పుచున్నారు. శ్రాద్ధ సమయమున పితృదేవతలకు మాంస మర్పింప వలయుననికూడ మీరే చెప్పుచున్నారు. హింసలేకుండ మాంస మెట్లువచ్చును? మాంసాహారము వలన కలుగు పాప మేది? దానిని వర్జించిన వారికబ్బు పుణ్యమెట్టిది? జంతువును వధించి దాని మాంసమును దీనిని వాని కెంతదోషము? ఇతరులు చంపి తెచ్చిన మాంసమును తినిన వారి దోష మెట్టిది?" ఈ ప్రశ్నములకు భీష్ముని యుత్తరములఁ జూడుఁడు."తేజమును, ఆయువును, బుద్ధిని, బలమును, మేధాశక్తిని కాంక్షించువాఁడు హింస మానవలెను. మద్య మాంసములను వదలిన వాఁడు ప్రతిమాసమున నశ్వమేధము చేసిన వానికి లభించు పుణ్యము పొందును, ఇతర ప్రాణుల మాంసము చేత శరీరమును పెంచుకొనువాడు తప్పక దుఃఖమును బొందునని నారదుఁడు వచించి యున్నాఁడు. తనను ఎవరైన హింసించినపుడు ఎట్టి బాధ కలుగుచున్నదో అట్టి బాధయే జంతువులను హింసించునపుడు వానికిని కలుగుచున్నదని తలంచవలెను. మాంసముకొఱకే జంతువులు హింసింపఁ బడుచున్నవి. హింసార్థము ధనమిచ్చువాడును, ఒకఁడు చంపి తెచ్చిన మాంసమును తినువాఁడును, జంతువులను స్వయముగాఁ జంపువాఁడును హింసా దోషమున సమానులు.అయినను, ప్రాపంచికులకొఱకు మహర్షులీ విధమున విధించియున్నారు. కాని మోక్షాసక్తుడగువాఁడు ఈ నియమములను పాటింపవలసిన పనిలేదు. దేవతల కర్పింపఁబడినదియు, పితరులకియ్యఁబడినదియు, తప్ప తక్కినమాంసములన్నియు వర్ణనీయములే. మాంసము తినవచ్చునని వచించిన వసురాజు స్వర్గమునుండి యధోలోకమునఁబడి యటనుండి పాతాళము పాలయ్యెను. అగస్త్యుఁడు జనుల పైనఁ దయదలచి వేటజంతువులు ప్రోక్షితములని వచించెను. కనుక శ్రాద్ధములలో మాంసము నర్పింపవచ్చును. ముఖ్యముగా ఆశ్వీజమాసశుక్ల పక్షమున మద్యమాంసములను ముట్టఁగూడదు. చాతుర్మాసములందు వీనిని వణి౯ంచినవాఁడు, యశము,దీర్ఘాయువు, బలము, విజయము అను వానిని పొందును. ఆశ్వీజమాసమున మాంసమును త్యజించుటవలననే నాభాగుఁడును, అంబరీషుఁడును స్వర్గమునకుఁ బోయిరి. మధ్యమాంసములను త్యజించినవారు మునులనబడుచున్నారు”. ​పై వాక్యముల వలన, మనకు అక్కాలపు జనులకు మాంసాహారముపై గలిగిన అసహనభావమును పూర్వాచారమును త్రోసిపుచ్చజాలక కొన్ని సమయములందు అట్టి యాహారమును వారు వాడుటకొప్పుకొనుటయును తెలియవచ్చుచున్నది. వారు జంతువుల బలిని, వేటను తప్పుగాఁ దలఁపలేదు. వారు తినుచుండిన మాంసము దేవతలకర్పింపఁబడినట్టిదో వేటాడిన జంతువులదోయై యుండెను. రోమను కాథలిక్కులలోని "లెంటు" వలెనే అప్పటి క్షత్రియులు కూడ జనాభిప్రాయానుసారము, ఒక మాసము వఱకు మాంసమును వదలుచుండిరి. రానురాను బ్రాహ్మణులు పైతృకవిధుల కొఱకును బలుల కొఱకును హింస చేయుచుండినను, మాంసాహారమును మాత్రము విసర్జించిరి. యజ్ఞశేషమగు మాంసమును అగ్నిలోఁ బడవేయసాగిరి. పితృదేవతారాధనమున మాంసమును దినుట పాతకముగా పరిగణింపఁబడ మొదలిడెను. [13]కొందరు క్షత్రియులు వేటాడుట వదలకపోయినను మాంసాహారమును సంపూర్ణముగా వదలిరి. ఈ విధముగా హిందూజాతి యంతయు మాంసాశనమునే కాక మద్యపానమును గూడ త్యజించుట అత్యంత ఘనకార్యమనుటకు సంశయించువారుందురా? మద్యపానాభ్యాసము యొక్క చరిత్రను పరిశీలించితిమేని, ఆరంభమున హింద్వార్యులకును వారి సోదరులగు జర్మనులకుండినంత మద్యపానాసక్తి యుండెడిది. అలసియుండినప్పుడును, సంతోషమున నుండినప్పుడును కృష్ణార్జునులు మద్యపానము చేయుచుండిరని మహాభారతము మనకుఁ చెప్పుచున్నది. యదు వృష్టులు మద్యపానరతులని మనమెఱుఁగుదుము. బలరాముని త్రాఁగుఁబోతుతనము మనకు క్రొత్త విషయము కాదు. త్రాఁగుఁబోతుతనము యొక్క ప్రభావము వలన యాదవులంతఃకలహముల పాలై తుదకు మడిసిన సంగతి మనకు తెలిసినదే. సురాపానము చేయువారు సురలనియు, చేయనివారు అసురులనియు రామాయణమునందలి గంగాఖ్యానములో నున్నది. దండకారణ్యమునకుఁ బోవుచు గంగానదిని దాటునపుడు, తాను ౧౪ సంవత్సరముల వనవాసమును నిరపాయముగా గడపి మరల వచ్చువేళ అనేక కుంభములు మద్యమును గంగాదేవికర్పింతునని సీత మ్రొక్కులిడినది. యుధిష్ఠిరుని అశ్వమేధ వర్ణనమునందు యజ్ఞప్రదేశము మద్య సముద్రముగా నుండెనని యున్నది. పైయంశములును, లెక్కకు మిక్కిలిగానున్న ఇతరములగు నుదాహరణములును కలసి, క్షాత్రయుగారంభమున మన హింద్వార్యులు సాధారణముగాను క్షత్రియులు ముఖ్యముగాను మద్యమును సేవించుచుండిరని మనకు రుజువు చేయుచున్నవి. కాని ఆ యుగము ముగియు వఱకు హిందువులలో విశేష జనులు, ముఖ్యముగా బ్రాహ్మణులందఱును మద్యము వదలియుండిరి. కాని క్షత్రియులు మాత్రము ఇంకను పూర్వాచార శృంఖలములను తప్పించుకొనఁజాలరైరి. మద్యపానము పంచమహాపాతకములలో నొకటి యయ్యెను. ఈ పాతకములు ఉపనిషత్తులలోఁ గూడ వచ్చినవి. [14]కనుక క్షాత్రయుగాదియందు బ్రాహ్మణులు ఈ నిషేధమును పాటించియుండిరేమో? అదెట్లుండినను, క్షాత్రయుగములోపల మాత్రము వారు మద్యమును పూర్తిగా వదలుటయే కాక, దానిని ఆర్యేతర కార్యముగా భావించి యుండిరనుట నిస్సంశయము. ఈ విషయమును గూర్చిన యొక వచనము శాంతిపర్వములోని ౧౪౧ వ అధ్యాయమున విశ్వామిత్ర చండాలుర కథయందున్నది. కఱవుకాలమున నొకనాఁడు విశ్వామిత్రుఁడు క్షుద్బాధా పీడితుఁడై యొక చండాలుని గృహము ప్రవేశించి చచ్చిన కుక్క కాలును తినుటకై తస్కరించెను. అప్పుడు విశ్వామిత్రునకును చండాలునకును, విశ్వామిత్రుని వర్తనమును గుఱించియు, బ్రాహ్మణుఁడగువాఁడు మాంసము తినవచ్చునా యనుటను గుఱించియు నొక సంభాషణము జరుగును. సంభాషణాంతమున, ఆహార విషయమున ఈ నియమమును పాటింపకపోయినచో దోషము కాదనియు,‘ప్రతీత’శ ​ద్ధము త్రాఁగుఁబోతు విషయమున మాత్రమే వర్తించుచున్నదనియు విశ్వామిత్రుఁడు చెప్పియున్నాడు. [15] శాంతిపర్వములోని ౧౮౦వ అధ్యాయములో మోక్షధర్మ ప్రశంసయందు మఱియొక శ్లోకమున్నది. ఇంద్రుఁడు జంబుకరూపమున వచ్చి బాధితుఁడగు నొక బ్రాహ్మణు నూఱడించుచు బ్రాహ్మణుల గొప్పతనము నుగ్గడించుచు నిట్లనును. “మద్యము, లత్వాకపక్షి మాంసము, ప్రపంచములోని సమస్త పదార్థములయందును ఎక్కువ రుచిగలవి. అట్టివానిని నీవు కలలోనైన తలంపవు.” ఇట్టి సదభ్యాసము బ్రాహ్మణునకు హింద్వార్యులలో నున్నత స్థానము నొసంగిన కారణములలో నొకటి. అప్పుడును ఇప్పటివలెనే బ్రాహ్మణులలో కొందఱు వంచకులుగూడ నుండిరి. మొత్తముమీద బ్రాహ్మణులయందున్న ఈ సదాచారము తక్కినవారిని సన్మార్గమునకుఁ ద్రిప్పుటకు కారణమయ్యెను. కనుకనే “యాగాదులందు తప్ప వారెప్పుడును మద్యపానము చేయరు” అను “మెగస్తనీస్” వచనమును “స్ట్రాబో” ఉదాహరించియున్నాఁడు.[16]

ఈ ప్రకారము క్షాత్రయుగమున హిందువులు గోహత్యను గోమాంసాహారమును పూర్ణముగ విడిచిపెట్టిరి. క్షత్రియులు తప్ప తక్కినవారందరు మద్యపానమును దాదాపుగా మానుకొనిరి. అయినను ఈ సిద్ధాంతమునకు కొన్ని నిషేధములు లేకపోలేదు. గంగానదీ ప్రాంత వాసులగు నావార్యులు సంఘ, మత సంస్కారములండు పురోగాములై యుండ, పంజాబు దేశపు టార్యులు పూర్వాచారపరాయణులై యుండిరి. కావుననే పంజాబు వారిలో వివాహసంబంధములగు పూర్వాచారము లనేకములుండెను. వారు జాతిభేదమునకు పూతి౯గా లోఁబడినవారు కారు. ఆహారపానీయములలో సైతము వారు తమ తొంటి మార్గమును వదలలేదు. కావుననే గంగానదీ ప్రాంతవాసులు పంజాబు వారిని నీతిహీనులుగాఁ దలఁచుచుండిరి. మహాభారతములోని కర్ణపర్వమునందు ఒక శ్లోకము కలదు. [17] “గోవర్ధన మనునది మఱ్ఱి చెట్టు; సుభద్రాయను నది చత్త్యరము. ఇది చిన్నితనమునుండి నేనెఱిఁగియున్న రాజకుల ద్వారము" అని ఈ శ్లోకమున కర్థము. అనగా గోవధశాలయు, అనఁగా గోవధశాలయు, సురాభాండాశ్రయమును రాజమందిర ద్వారమున తప్పకయుండునవి యని భావము. గోవధమును మద్యపానమును గంగానదీ ప్రాంతవాసులగు నార్యులు అసహనముతోఁ జూచుచుండిరి. ఇంకొక శ్లోకమున నిట్లున్నది. “బియ్యముతోఁ జేయఁబడిన మద్యమును ద్రావునట్టియు, గొడ్డుమాంసమును ఉల్లిగడ్డలను, ఆపూపమాంసమును, వేయించిన ధాన్యమును తినునట్టి పంజాబు దేశవాసులు దుర్వర్తనము కలవారు.” అప్పటివఱకును పంజాబు దేశపు స్త్రీపురుషులు గొడ్డుమాంసమును దిని మైకమెత్తునట్లు మద్యమును ద్రావి రాత్రిందివములు స్వేచ్ఛావిహారము సల్పుచుండిన కారణమువలననే, గంగానదీ ప్రాంతవాసులగు నార్యులు వారిని హేయభావముతో జూచుచుండిరి. పంజాబు దేశపు టార్యులు ఈ విధముగా వెనుకఁబడియుండినను కాలక్రమమున వారును గోవధను మహాపాతకముగా లెక్కించి తక్కుంగలవారి యభిప్రాయములతో నేకీభవించిరి.

ఆహార విషయమున సర్వార్యజన సమ్మతమై యుండిన పైనియమమును పాటింపని జాతి మఱియొకటి యుండెను. అది సారస్వత బ్రాహ్మణ జాతి. పొలుసు లేని చేపలను క్షాత్రయుగమునాఁటి బ్రాహ్మణుఁడు తినఁగూడదు. అట్టి యాచారమునకు విరుద్ధముగా, నాఁటినుండి నేఁటివఱకు మత్స్యములను దినుచుండు సారస్వత బ్రాహ్మణులయొక్క యాచారమును దెలుపు గాధ యొకటి శల్యపర్వములోని సరస్వత్యుపాఖ్యానమున ఉన్నది. ఒకప్పుడు హిందూదేశమున ద్వాదశవర్ష క్షామము మహాభయంకరముగా నుండెను. బ్రాహ్మణులు దేశదేశములకు వెడలిపోయిరి. అప్పుడు కొందఱు బ్రాహ్మణులు మాత్రము సరస్వతీ నదీతీరమున మత్స్యాహారవ్రతులై అట్లేయుండి వేదములను గాపాడిరి. క్షామము పోయిన తరువాత బ్రాహ్మణులు మరలవచ్చి సారస్వ ​తుల వద్ద వేదములఁ జదివిరి. వంగదేశ బ్రాహ్మణులును, శన్వీబ్రాహ్మణులును సారస్వతుల యాచారమునే ఇప్పటికిని అవలంబించి యున్నారు.

ఆ కాలమున హిందువులు సామాన్యముగా భుజించు నాహారము ధాన్యసంబంధమైనది. అందును వారు ముఖ్యముగా వరియన్నమును దినుచుండిరి. సాధారణముగా ధనవంతులును, ముఖ్యముగా క్షత్రియులును మాంసముతోఁగూడ వండబడిన అన్నమును — ఈ కాలమున పోలావు అనఁబడునట్టి దానిని — తినుచుండిరి. రాజసూయా నంతరము దుర్యోధనుఁడు హస్తినాపురమునకు వచ్చిన పిమ్మట, ధృతరాష్ట్రుఁడు కుమారుని జూచి “పిశితౌదనమును దినుచున్న నీవు ఇట్లు శుష్కించుచున్నావేమి?” యని సభాపర్వమున అడుగును. [18] ఇదిగాక, క్షాత్రయుగాంతరమున వివిధ జీవితావస్థలలో నుండిన హిందువులెట్టి యెట్టి యాహారమును భుజించుచుండిరో తెలుపు మఱియొక శ్లోకమున్నది. దాని యర్థమిది. “ధనవంతులు మాంసము విశేషముగాగల యాహారమును, మాధ్యమిక స్థితి గలవారు పాలును పాలతోఁ చేయఁబడిన వస్తువులు విశేషముగాఁ గల యాహారమును, పేదవారు ఎక్కువగా తైలపక్వములను తినెదరు.” [19]

వనపర్వమునందలి ౧౯ం వ అధ్యాయమందున్న ఒక శ్లోకమును బట్టి చూచినచో, ఆర్యులు ఆరంభమున హిమాలయా పాద ప్రాంతములందు నివాసము చేసియుండిరనియు, అచ్చట వరిపంట యుండెననియు తెలియుచున్నది. అప్పుడు మాత్రమే కాదు. హిందూదేశపు ఉత్తరభాగములలోని పర్వత ప్రాంతములు నేఁటికిని సువాసనగల వరిపంటకు పేరుఁగాంచి యున్నవి. ఆర్యులాప్రదేశములనుండి వెడలి వానికంటె నెక్కువ ఉష్ణముగానుండు మైదానములలోనికి క్రమక్రమముగా బ్రవేశించిరి. ఈ క్రొత్త స్థలములు నాఁటికిని నేఁటికిని గోధుమల పంటలకును, యవల పంటలకును యోగ్యములై యున్నవి. “యుగాంతమున జనులు యవలు, గోధుమలు తిను స్థలములకుఁ బోయెదరు.” [20] ఈ శ్లోకార్థమును సమన్వయము చేయుఁదలఁచినయెడల మనము పై యూహనే యాధారము చేసికోనవలెను. దుర్యోధనుని యాహారము విషయమున వచ్చిన శ్లోకమునందలి “పిశితౌదన” శబ్దమును బట్టి చూచితిమేని ధనవంతులగువారు గోధుమలకంటె బియ్యమునే యెక్కువగా వాడుచుండిరని తెలియుచున్నది.

హిందువులు మితాహారులు. 'హిందువులకు నిర్ణీతములగు భోజన సమయములే' లేవని గ్రీకులు వ్రాసియున్నారు. ఈ యంశమును బలపఱచు వాక్యములు కొన్ని మహాభారతమునఁ గలవు. మాట్లాడకుండ భోజనము చేయుట మంచిదని మన హింద్వార్యులు తలఁచుచుండిరి. [21]కుటుంబము వారందఱు నొకమారే భుజించుచుండిరని తోఁచుచున్నది. విందువేళలందును యాగాదులందును భూరిసంతర్పణలు జరుగుచుండెనని చెప్పవలెను. అశ్వమేధ సమయమున వేలకొలఁది బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు భోజనమువలన సంతృప్తులైరని మహాభారతమునందు ఉన్నది. నిర్ణీత కాలములలో భోజనము చేయని దురభ్యాసము మనయందు నేఁటికిని గలదు. విందు సమయములందు మధురాహారములు వడ్డింపఁబడుచుండెను. “శాకములను వండు వంటవాండ్రును, మధుర పదార్థములను వండువాండ్రును ఎప్పటివలెనే ధృతరాష్ట్రుని సేవయందుండిరి.” [22] ఈ శ్లోకమును బట్టి ధనవంతులు మధురపదార్థములను ఎల్లప్పుడును తినుచుండిరని తెలియుచున్నది. దుర్యోధనుని పాలనమునాఁటివలెనే యుధిష్ఠిరుని పాలనమున సైతము అమర్చఁబడుచుండిన మధురపదార్థములేవియో చెప్పుటకు వీలులేదు. [23]శర్కర, అ ​ల్లము మొదలగు వస్తువులతోఁ జేయఁబడు తియ్యని పదార్థములను, కూరగాయలను వండుటయందు తెలివిగ ల వంటవాండ్రను నర్ధమిచ్చు వివిధ శబ్దములను వ్యా ఖ్యాత వివరించియున్నాఁడు. కూరగాయల ప్రసక్తిప లుతావులఁ గలదు. కాని యవియెట్టివో వ్రాయలేదు. ఉల్లిగడ్డలు, వెల్లిగడ్డలు సాధారణముగా పంజాబునందు మాత్రము వాడుకయందుండెనని యిదివఱకే చెప్పియు న్నాము. ఇవి మధ్యదేశమువారికి నిషిద్ధములుగా నుండెను. పాలు అందఱును ఉపయోగించుచుండిరి. పాల వలన తయారగువస్తువులన్నిటిలో ఉత్తమపదాధ౯ము నేయియేయని ’ఘృతంశ్రేయా ఉరశ్చితః' అను వాక్య మువలనఁ దెలియుచున్నది.


  1. ↑ *ఈ వ్యాసము సి.వి.వైద్యా ఎం.ఏ., ఎల్.ఎల్.బి. గారి యభిప్రాయముల ననుసరించి వ్రాయఁబడినది. వీరి యభిప్రాయము ప్రకారము క్షాత్రయుగ పరిమితి క్రీ.పూ. 3000 నుండి 300 వఱకు.
  2. ↑ ¶తంతందేవంసముద్దిశ్య, పక్షిణః పశవశ్చయే, ఋషభావిశాస్త్రపరితా, నధాజల దరాశ్చయే, నిర్వాస్తానభ్య యంజింస్తే, శత్రాగ్ని దయకర్మణి ఆశ్వ॥
  3. ↑ †భక్ష్య ఖండవరాగాణాం క్రియంభుజ్యతాంతథా, పశూనాంవధ్యతాం చైవ నాంతం దదృశి జనాః॥ అశ్వః
  4. ↑ ±సురారేయసాగర॥ అశ్వః
  5. ↑ ★నాయంధర్మకృతోయజ్ఞో నహింసాధర ఉచ్యతే, యజవీజై సహస్రాక్ష త్రివర్ష పరమోషితైః అశ్వః
  6. ↑ ★ఆర్జునుని శపథసందర్భమును జూడుఁడు. బ్రహ్మఘ్నా నాంచయేలోకా, యేచగోఘాతినామపి, పాయనంహి యవాన్నంహి శాకంకృనరమేవహీ, సంయావా పూవమాంసాని యేదలో కావృధాన్నతౌ౹౹ద్రోణః
  7. ↑ †రంతిదేవునియింట దినమునకు 9000 పశువులు చంపబడుచుండెనని చెప్పబడియున్నది. ఆలభంతతదాగావః, నహప్రాణ్యేకవింశతిః|తత్రస సూదాక్రోశన్తి, నుమృష్ణమణికుండలాః నూపంభూయిష్ట మశ్నీధ్వం,వాద్యమాంనంయధాపురా॥ ద్రోణుః
  8. ↑ ★యఇమే బ్రహ్మణాప్రోక్తా, మంత్రావై ప్రోక్షణేగవామ్, వితే ప్రమాణంభవతః, ఉతాహో నేతివాసవః నహుషోనేతావాహ తమసామూఢ చేతః ఋ, ఉ, అధర్మేనంప్రవృత్తస్త్వం, ధర్మన ప్రతిబుధ్యనేః ప్రమాణమేతదస్తాకం, పూర్వప్రోక్తం మహర్షి భిఃః ఉద్యోః
  9. ↑ ‡పందపందనఖాభిక్ష్యా, బ్రహ్మక్షత్రేణరాఘవ, శల్యకఃశ్చవిధోగోథా, శరఃకూరపంచమఃః
  10. ↑ అనడ్వాన్మృత్తికాచైవ, తథాక్షుద్రపిపీలికాః, శ్లేషాతక స్తధావిప్రై, రభక్ష్యంవిషమేవచః అభక్ష్యా బ్రాహ్మణేరత్స్యాః, శల్కైర్యే వైవివర్జితాః|చతుప్పా
  11. ↑ నమాంసభక్షణేదోషో, నమద్యేనచమైధునే, ప్రవృత్తిరేషాభూతానాం, నివృత్తిస్తుమహాఫలాః
  12. ↑ †త్కచ్ఛపాదన్యే మండు కాజలజార్చయేః భాసాహం సాఃను వర్నాశ్చి, చక్రవాకాశిప్లవా బశాః | శాకోమద్దుశ్చ గృధ్రర్చ, శ్యేనోలూ కాస్త ధైవచః క్రవ్యా చాదంష్ట్రినఃసర్వే చతుష్పాతక్షిణశ్చయే, యేషాంచోభయతోదంతా, చతుర్దంష్ట్రాశ్చ సర్వశః1 'మృత్తిక', 'విషము' అనువానికి 'నేల' 'విషము' అని అర్ధము వ్రాసినాము. వీని నిజమైన భావమేమో తెలియదు
  13. ↑ పితృదేవతల కర్పింపఁబడు వివిధమాంసము లీ క్రింది శ్లోకములందు వర్ణింపఁబడియున్నవి (అనుశాసన పర్వము): ద్వౌ మాసౌతుభవేత్ తృప్తి మ౯త్సైః పితృగణస్యహ త్రీన్మాసాన్ నావికేనా విశ్చతుర్మానంశశేనహాః వార్ధ్రీణసేన తు ఆజేన మాసా౯ప్రియన్తే పంచైవ పితరోనృప వారాహేణ తుషణ్మాసా౯ నప్త వైకాకులేనతు!మాసాన్టషై పాష౯ తేన గౌరవేణ నవ ప్రభో గవయన్య తుమాంసేన తృప్తిః స్యాదశమానికీ౹౹ మాంసేనైకాదశ ప్రీతిః పితౄణాం మహిషేణతు గవ్యేన దత్తే శ్రాద్ధేతు సంవత్సరమిహోచ్యతే౹౹ వాఘ్రీణనన్య మాంసేన తృప్తిర్ద్వాదశవార్షికీ ఆనంత్యాయ భవేద్దత్తం ఖడ్గమాంసంపితృక్షయే ౹౹
  14. ↑ *ఛాందోగ్యోపనిషత్తు ౧ం వ కాండము
  15. ↑ ‡వైవాతిపాపంబక్షమాణస్య దృష్టసురాంకు దీత్త్వా పతతీతిశబ్దః
  16. ↑ ¶‘ఇది సోమపానమురబోలును’ అని రాప్సన్/క్రిండల్ వ్రాసినాఁడు
  17. ↑ $"గోవర్ధనో నామ వటః, సుభద్రం నామ చత్వరమ్, ఏతద్ రాజకులద్వారం, ఆకుమారాత్ స్మరామ్యహమ్ః కర్ణః
  18. ↑ ¶ఆచ్ఛాదయసి ప్రాణాంశ్చాన్నమశ్నాసి పిశితౌదనం ఆజానేయా వహంత్యశ్వాః కేనాసి హరిణః కృశఃః సభాః
  19. ↑ ‡ఆఢ్యానాం మాంసపరమం మధ్యానాం గోరసోత్తరమ్, తైలోత్తరందరిద్రాణాం, భోజనంభరతర్షభః సభాః ఉద్యోః
  20. ↑ †యే యవాన్నాజనాయదా, గోధూమాన్నాస్తథైవద, తా౯దేశా౯ సంశ్రయిష్యంతి యుగాంతే పర్యుపస్థితేః వనః
  21. ↑ §ప్రాఙ్ముఖోనిత్యమశ్నీయాద్ వాగ్యతోఁన్నమకుత్సయ౯ః అనుః
  22. ↑ ౽ఆరాలికాః రూపకారా, రాగఖాండవికాస్తథా ఉపాతిష్ఠంత రాజానం, ధృతరాష్ట్రం పురాయథాః ఆశ్రః
  23. ↑ ౾అపూపములు, ఖండవరాగములు (లేక రాగఖాండవములు) అను రెండు విధములగు పదార్థములును, మోదకములును అచ్చటచ్చట వచ్చుచుండును.