గోల్కొండ చరిత్ర/పరిచయం
పరిచయం
(Introduction)
కుతుబ్షాహీల వంశ చరిత్ర ఆంధ్రదేశం చరిత్ర. ఆంధ్రదేశం భౌగోళిక, నైసర్గిక స్వరూప స్వభావాలపై దృష్టి సారించడం ఒక చారిత్రాత్మక సందర్భం. అలాగే ఘనమైన కుతుబ్షాల చరిత్రను అవలోకనం చేసేముందు దక్కన్ పీఠభూమిలో ఆవాసం ఏర్పరుచుకున్న ప్రజల జీవనశైలిని రేఖామాత్రంగానైనా స్పర్శించడం అసందర్భమేమీ కాదు.
ఆంధ్ర లేదా మధ్యయుగ వ్యక్తీకరణగా తెలంగాణ నేలపై 16, 17 శతాబ్ది కాలంలో కుతుబ్షాహీ వంశస్థులపాలన కొనసాగింది. దక్కన్ పీఠభూమికి తూర్పున వున్న ప్రాంతం, అక్కడి ప్రజలభాష తెలుగు. ఇదే ప్రాంతాన్ని 13వ శతాబ్దిలో కాకతీయ వంశస్థులు రాజ్యమేలారు. క్రిష్టియన్ యుగానికి ముందే ప్రాచీనులకు ఈ ప్రాంతం సుపరిచితం. భౌగోళికంగా, విశాలమైన సముద్రతీరం, ఖండాంతర భూభాగం కలిగి, ఉత్తరంలో చిలకా సరస్సు, ఒరిస్సా కింది అంచులనుంచి, దక్షిణాన చిత్తూరు జిల్లా వరకు, పశ్చిమంలో కోహిర్ (Kohir), కొలస్ (Kolas) నుండి తూర్పున మచిలీపట్నం వరకు విస్తరించియున్న ప్రాంతం. భూములను సస్యశ్యామలం చేస్తూ అసంఖ్యాకమైన నదులు, తూర్పు కనుమలు లాంటి పర్వత శ్రేణులు, సుప్రసిద్ధ ఆంగ్ల కవి రష్మిన్ పదాల్లో వర్ణించబడే సుందర సహజ, ప్రాకృతిక దృశ్యాలు; సముద్ర మట్టానికి సగటున 250 అడుగుల ఎత్తులో తీర ప్రాంతాలుగా సిక్కకోలు, ఏలూరు, రాజమండ్రి, గుంటూరు జిల్లాలు. పీఠభూమి మండలాలుగా నల్లగొండ, దేవరకొండ, ఘన్పూర్, గోల్కొండ ప్రాంతాలు. ఇవి సముద్ర మట్టానికి దాదాపుగా వెయ్యి నుండి నాలుగు వేల అడుగులఎత్తు వరకు వుంటాయి. తీర ప్రాంత జిల్లాలు సమృద్ధిమయమైనవి. తీర ప్రాంతాలను పోలి, అంతర్భాగంలోని నేలలు వ్యవసాయిక భూములు గానే సారవంతమైనవి కాకుండా ఖనిజ వనరులతో సమృద్ధిగా వుండేవి. ప్రత్యేకించి నదీ వనరులు చెప్పుకోదగ్గవి. కృష్ణా, గోదావరీ, తుంగభద్ర, పెన్నా లాంటి పెద్ద నదులే గాక, పదిహేడు చిన్న నదులు తూర్పు, పడమటి కనుమలగుండా ప్రవహిస్తూ సాగునీరు, తాగునీరు అవసరాలకు ఉపయోగ పడ్తున్నాయి. భూగర్భ జలాలకు అనువైన ఇసుక నేలలు, ఒండ్రు నేలలు అధికం. వర్షపాతం, తేమ, ఉష్ణోగ్రత కాలాన్ని బట్టి మారుతూ వుంటుంది. ఉత్తర భారతదేశంతో పోల్చినట్లయితే ఈ ప్రాంతాలలో అత్యధిక చలి, వేడి, పొగమంచు లాంటి వాతావరణం వుండదు. ఆంధ్రాలో వాతావరణం రుతువులను బట్టి సాధారణంగా వేడి, తేమ మారుతూ వుంటుంది. వర్షపాతం కూడా కాలాన్ని బట్టి మారుతూ వుంటుంది. ఈ మార్పులు ప్రధానంగా వ్యవసాయం మీద, ప్రజల మీద కూడా ప్రభావం చూపుతుంది. డెల్టా ప్రాంతాల్లో 15 నుండి 35 అంగుళాల వర్షపాతం. దీనితో కృష్ణా, గోదావరులకు నీరు అందుతుంది.
పీఠభూమి ప్రాంతాల్లో 40 నుండి 50 అంగుళాల వర్షపాతం వుంటుంది. ఆంధ్రదేశం, ఖనిజ వనరులున్నా ఇది ప్రధానంగా వ్యవసాయక దేశం. నదులు, నీటి కాల్వల సదుపాయం వల్ల ఏడాదికి రెండు పంటలదిగుబడి వుంటుంది. బహుశా విదేశీయులు వీటిచే ఆకర్షింపబడి తరుచుగా దాడులు చేయడానికి ఉపక్రమిస్తారు. చివరికి 17వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తులు కూడా ఇక్కడి పంటలు, సంపద, అభివృద్ధికి ఆకర్షింపబడి ఈ ప్రాంతాలపై కన్నేసి ఈర్ష్య చెందేవారు.
ఆంధ్రులమూలాలు ఆర్యులనుండి వచ్చిందా లేక ద్రావిడులకు చెందినవారా? అన్న వివాదాస్పద విషయాన్ని అలా వుంచితే, వారి చరిత్ర చాలా ప్రాచీనమైనదన్నది చారిత్రక వాస్తవం. వైభవమైనది, ఘనత కలిగినది, ఆంధ్రుల చరిత్ర. రుగ్వేదంలోని ఐతరేయ బ్రాహ్మణీకంలో ఆంధ్రులు ప్రత్యేకమైన జాతికి చెందినవారని స్పష్టమైన ప్రస్తావన వుంది. ఇదొక గుణాత్మకమైన సాక్ష్యం. వారి ఉనికి క్రిష్టియన్ యుగానికి (Christian era) ఎనిమిది వందలసంవత్సరాలకు పూర్వమే వున్నట్లు చారిత్రక ఆధారాలు వున్నాయి. అనగా బ్రాహ్మణం రాయడానికి ముందు వున్నది. మూడవ శతాబ్ది క్రీస్తు పూర్వం విషయానికొస్తే మౌర్యుల దర్బారులో గ్రీకు రాయబారిగా వున్న మెగస్తనీసు తన 'యాత్రాదర్శిని'లో ఆంధ్ర దేశం గురించి రాసిన విషయాలను కూడా గమనించవచ్చు. సంపూర్ణ ఉత్తర భారతదేశంలో చంద్రగుప్త మౌర్యుని కీర్తి వెలుగులు వ్యాపించి తిరుగులేని నాయకుడిగా వెలుగొందుతున్న విప్లవాత్మకమైన కాలంలో కూడా ఆంధ్రులు తమ ఉనికిని, అస్తిత్వాన్ని నిలబెట్టుకున్నారు. మెగస్తనీసు, ఆంధ్రులగురించి ప్రస్తావిస్తూ “ఆంధ్రులు శక్తివంతమైన జాతివారు. వారి ఆధీనంలో ముప్పై పట్టణాలు, అనేక గ్రామాలు, ప్రహరీ గోడలు, బురుజులతో రక్షణగా కట్టబడియుండి ఒక లక్ష పదాతిదళం, రెండువేలతో అశ్విక దళం, వెయ్యి ఏనుగులతో కూడిన శక్తివంతమైన సేన వుండేది” అంటూ చెప్పుకొచ్చాడు. అయినప్పటికీ తర్వాతి కాలంలో మౌర్యులకనుసన్నల్లో మెలగక తప్పలేదు ఆంధ్రులకు. అంతేకాదు అశోక సార్వభౌముడికి భక్తి శ్రద్దలతో దాసోహమనడానికి ఒత్తిడిలు వచ్చాయి. అయితే అది ఎంతో కాలం కొనసాగలేదు. అశోకుడి పిమ్మట మౌర్య సామ్రాజ్యం పతనం చెంది ముక్కలుగా విడిపోయింది. శాతవాహనులు - చరిత్ర గుర్తించిన, ప్రపంచానికి తెలిసిన ప్రాచీనాంధ్రులు. చరిత్ర సృష్టించిన వారు శాతవాహన వంశస్థులు. వీరు సంపూర్ణ దక్కన్ పీఠభూమిపై తమ ఆధిపత్యం కలిగి యుండటమేగాక, తమ రాజ్యం సరిహద్దులను ఉత్తర భారతం వరకు విస్తరింపజేసి మగధను కూడా స్వాధీనపరుచు కున్న ఘనత శాతవాహనులది. దక్కన్ సంస్కృతి, వైభవం ఎదగడానికి శాతవాహన వంశస్థులకృషి శ్లాఘనీయమైనది. నాలుగు వందల సంవత్సరాల దీర్ఘకాల పాలనలో వారి అభిరుచుల, చిహ్నాలను అవశేషాలుగా ఇప్పటికీ 'పఠన్' (patan) ఒకప్పటి శాతవాహనుల రాజధాని, దాని చుట్టుపక్కల వున్న జిల్లాల్లో లభ్యమయ్యే శిథిలాల్లో దర్శించవచ్చు. ప్రఖ్యాత గుహలు, దేవాలయాలు - కన్లీ (Kasli), నాసిక్ (Nasik), అజంతా, ఎల్లోరా శాతవాహనుల వైభవానికి స్మృతి చిహ్నాలు.
మూడవ శతాబ్ది A.D.లో శాతవాహనుల పతనం, దక్కన్ రాజకీయ, సాంస్కృతిక చరిత్రపై తీవ్ర నష్టాన్ని కలిగించాయి. దీని వలన దక్కన్ సమగ్రతకు చరమగీతం పాడినట్లయి దేశం యావత్తు చిన్న చిన్న ప్రాంతాలుగా ముక్కలుగా విడిపోయి కదంబులు (Kadambas), గంగ (Gangas), వంశానికి చెందిన చిన్న చిన్న రాజుల పాలనలోకి వెళ్ళిపోయాయి. ఆరవ శతాబ్ది (6th century) మధ్య కాలంలో చెల్లాచెదురుగా వున్న ప్రాంతాలు తిరిగి చాళుక్య వంశస్థులపాలనలో ఏకతాటిపైకి వచ్చాయి. పులకేశన్-II (Pulakesan-II) చాళుక్య వంశంలో గొప్ప పరిపాలన దక్షత కలిగిన రాజగా ప్రసిద్ధి. ఇతను పీఠభూమిని ఏకమొత్తంగా ఒకే ఛత్రం కిందకి తెచ్చి శక్తివంతమైన సామ్రాజ్యంగా మార్చాడు. ఇందులో దక్షిణ భారతం అంతర్భాగంగా వుండేది. చాళుక్య రాజులు 'కనరేశి' (Kanaresi) కలిగినవారని, కన్నడ మాట్లాడేవారని, శాతవాహనుల మాదిరి తెలుగు (Proto -telugu) మాట్లాడేవారు కాదని తెలుస్తుంది. అందుకే ఆంధ్ర ప్రాంతం పూర్తిగా 'కనరేశి' (Kanaresi) సామ్రాజ్యంలో విలీనమయ్యిందన్న భావన కలుగుతుంది. ఆగ్నేయ దిశలోనున్న దక్కన్లోని ఆంధ్రులు, తమిళనాడులోని తమిళులు ఇప్పటికే కన్నడిగులుగా గుర్తింపబడటానికి ఇదే ప్రధాన కారణం కావచ్చు. ఈ పరిపాలనా కాలంలో ఆంధ్ర సంస్కృతి తిరిగి పునరుజ్జీవనం పొంది అభివృద్ధి దిశగా సాగింది. దక్కన్లోని తీర ప్రాంతాలను పులకేశన్-II (Pulakesan -II) కనిష్ట సోదరుడైన కుబ్జ విష్ణువర్ధను పాలనా బాధ్యత అప్పగించబడింది. విష్ణువర్ధనుడు స్వతంత్ర ప్రతిపత్తిగా 624 A.D. లో బాధ్యతలు స్వీకరించి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసి 'వేంగి'ని రాజధానిగా మార్చాడు. కుబ్జ, అతని వారసులు స్వతంత్ర రాజులుగా నాలుగు శతాబ్దాలు పాలించి చరిత్రలో తూర్పు చాళుక్యులుగా గుర్తింపబడ్డారు. తూర్పు చాళుక్యులుగా గుర్తింపబడిన ఆంధ్రులు తమ ఆలీన విధానాలద్వారా ప్రత్యేక రాజకీయ ప్రతిపత్తిని అనుభవించారు. ప్రారంభ దశలో వేంగీ రాజులు 'కనరేశి' జన సమూహాన్ని ఆదరించినా, తరువాత కాలంలో తెలుగు భాషా సంస్కృతులను ఆదరించి అభివృద్ధిపరిచారు.
12వ శతాబ్దిలో చాళుక్యుల పతనం దక్కన్ చరిత్రలోనే ఒక విషాదకరమైన ఘటన. దేశం విచ్ఛిన్నం కావడం, చిన్న చిన్న రాజ్యాలుగా చీలిపోవడం, కాని, అదే సమయంలో రాజ్య విచ్ఛిన్నత ఒక అసాధారణమైన, చెప్పుకోదగిన విషయంగా చరిత్రలో మిగిలింది. చీలిపోవడమనేది అస్తవ్యస్తంగా కాకుండా, ఒక పద్దతిగా భాష, సంస్కృతుల వైరుధ్యాల పై ఆధారపడి మూడు ప్రాంతాలను మూడు వంశాలవారు - యాదవులు, బల్లాల, కాకతీయులు పాలించారు. ఇందులో కాకతీయులు ఆంధ్ర పాలకులుగా తెలుగు మాట్లాడేవారి ప్రాంతాలను ప్రత్యేక స్వతంత్ర రాష్ట్రంగా ఏర్పరచి ప్రత్యేక క్షేత్ర పరిథిగా ప్రకటించుకున్నారు. ఇదే ప్రాంతం పూర్వం చాళుక్యుల పాలనలో వుండేది. కాకతీయుల పాలనలోనే 12వ, 13వ శతాబ్ది కాలంలో ఆంధ్రదేశం ఒక ప్రత్యేక భాషాపరమైన, సాంస్కృతికపరమైన భాగంగా తనదైన విశిష్ట అస్తిత్వంతో, దక్కన్లోని మరో రెండు ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలనుండి ప్రత్యేకతను సంతరించుకుని ఉబికి వచ్చింది. తెలుగు భాషను, తెలుగు సంస్కృతికి ఒక ప్రత్యేక హోదానిచ్చి అనేక విశిష్టతలతో అభివృద్ధి పరిచి గుర్తింపులోకి తెచ్చిన వారిలో ముఖ్యులైన కాకతీయ పాలకులు - ప్రతాప రుద్రదేవుడు, గణపతిదేవుడు, రుద్రమదేవి. వీరికి తెలుగువారు రుణపడి వుంటారు.
ఈ ప్రాచీన వ్యవస్థ ఒక శతాబ్ది కాలం కన్నా ఎక్కువ కొనసాగలేదు. పదునాల్గవ శతాబ్దం ప్రారంభంలో ఖిల్జీ (Khilji), తుగ్లక్ (Tughlak) లదాడులవల్ల పూర్తిగా పూర్వ వైభవం తుడుచుకు పెట్టుకుపోయింది. 1323 A.D. లో తుగ్లక్ ల దాడులవల్ల కాకతీయ సామ్రాజ్యం కూలదోయబడింది. తెలుగు రాజ్యంతో పాటు దక్కన్ లోని ఇతర ప్రాంతాలు కూడా తుగ్లక్ పాలనలోకి వచ్చాయి. దక్కన్ భూభాగంలోకి ఈ తుర్క్ ఆగమనంతో కొత్త శకం ప్రారంభమైంది. చరిత్రలో 'మధ్యయుగం' (Medieval Period) అనే కొత్త అధ్యాయానికి తెరతీసింది. దీనితో విప్లవాత్మకమైన మార్పులు వచ్చినా పాత సాంప్రదాయాలు, స్థిరీకరించబడిన వ్యవస్థలకు భంగం వాటిల్లలేదు. వాస్తవానికి ఉత్తరాది ప్రాంతాలనుండి దిగుమతైన అక్కడి సంస్కృతి సంప్రదాయాలతో సమ్మిళితమై దక్కన్ సంస్కృతి కొత్త సొబగులు అద్దుకుంది.కొత్తగా జయించిన ప్రాంతాలను, అనుభవజ్ఞులైన సుబేదారి ప్రముఖులకు పాలనాధికారులుగా నియమించగా వారు, ఉదారస్వభావం గలవారై హిందూ సామ్రాజ్యపు పాత సాంప్రదాయాలను గౌరవించడమే గాక, సాంప్రదాయిక విచారాలు, భావనలను, వ్యవస్థలను సంరక్షించారు. 1345 A.D. లో దక్కన్లోని ఈ సుబేదారులే వ్యక్తిగత స్వతంత్ర రాజులై తమ తమ ప్రాంతాలను స్వతంత్ర రాజ్యాలుగా ఏర్పాటు చేసుకుని, పరిపాలించసాగారు. రెండు సంవత్సరాల తరువాత వీరే బహమనీ రాజులుగా పిలువబడినారు. అలా బహమనీ రాజ్యానికి బహమనిషా మొదటి రాజు కాగా, అతని పాలనలో ఆంధ్రులు అనుకూల వాతావరణం పొంది తమ సంప్రదాయాలను పరిరక్షించుకుంటూ ముందుకు కొనసాగిస్తూ వచ్చారు. ఈ సమయంలో ఆంధ్రుల జాతీయత, సంస్కృతి గట్టి పడటానికి రెండు మూడు కారణాలను చూడవచ్చు. మొదటిగా దాదాపుగా వంద సంవత్సరాల వరకు సాగిన బహమని రాజుల పాలనలో ఆంధ్ర దేశం పైన ప్రభావపూరితమైన నియంత్రణ లేకపోవడం, ప్రత్యేకించి కోస్తా ప్రాంతాలలో. రెండవ కారణం - బహమనీ పరిపాలనా చట్రం దక్కన్లో ప్రజలకు స్వేచ్ఛా స్వతంత్ర వాతావరణం కలిగించేదిగా వుండటం. బహమనీ రాజ్యం మూడు, నాలుగు క్షేత్రాలుగా (provinces) భాషా ప్రాతిపదికపై విభజింపబడి వుండటంతో ఇతర క్షేత్రాలకు (provinces) సమంగా ఆంధ్ర ప్రాంతం కూడా ప్రత్యేక హోదాను పొంది తమకు అనుకూలమైన వాతావరణంలో భాషా సంస్కృతులను అభివృద్ధి పరచగలిగారు. మూడవది ఆంధ్రులు అవకాశాలను చేజిక్కించుకుని, స్వేచ్చా పూరిత వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకుంటూ, సద్వినియోగ పరుచుకుంటూ అనేక క్లిష్టసమస్యలను అధిగమించే ప్రయత్నం చేశారు. స్వేచ్ఛా వాతావరణాన్ని అనుభవిస్తున్నా, విదేశీ పాలనకు లొంగకుండా అవసరమనుకున్న ప్రతి దశలో తురకు వ్యతిరేకంగా స్వాతంత్ర్య పోరాటాలు చేశారు. దీనిని సరిగా వ్యాఖ్యానిస్తే ప్రథమ 'భారత జాతీయోద్యమం' (First National Movement of India) గా పరిగణించవచ్చు. ప్రోతయ నాయక్ (Protaya Naik) నాయకత్వం లో నాయక్ లు, రెడ్లు ఒక కూటమిగా ఏర్పడి తమ అస్తిత్వానికి, ఉనికికి పోరాటాలు జరిపారు. దక్షిణ భారతంలో వీరు విజయనగర సామ్రాజ్యం వ్యవస్థాపనలో విజయం సాధించడమేగాక, విజయనగరం, రాజమండ్రి, కొండవీడులను చిన్న రాజ్యాలుగా ఏర్పాటు చేయడంలో కూడా సఫలీకృతులయ్యారు. ఇవన్నీ కూడా రెడ్డి రాజ్యాలుగా నెలకొన్నాయి. వీరి పాలనలో తెలుగు సంస్కృతి వైభవంగా వెలిగింది. తెలుగు భాష ఉన్నత శిఖరాలకు చేరింది. పదహారవ శతాబ్దం ప్రారంభంలో కుతుబ్షాహీల పాలన దక్కన్లో స్థిరపడింది. అటు పిమ్మట ఆంధ్ర రాజ్యాలు కుతుబ్షాహీల పెత్తనంలోకి వచ్చినా, ఆంధ్ర ప్రజలకు సానుకూలమైన వాతావరణమే వుండేది. వాస్తవానికి కుతుబ్షాహీలు కూడా కాకతీయుల మార్గంలోనే నడిచి ఒక జాతీయ భావనలో పాలన సాగించారు.