Jump to content

గోల్కొండ చరిత్ర/ఉపోద్ఘాతం

వికీసోర్స్ నుండి

ఉపోద్ఘాతం

1939లోని నా రచనను ఆంగ్ల భాషలో తర్జుమా చేసి ప్రచురించడానికి పదిహేడేళ్ళ కాలవ్యవధి పట్టింది. ఈ పుస్తకం బాగా ప్రాచుర్యంలోకి వచ్చినందుకు సంతోషం కలిగినా భారతదేశం, మరియు విదేశాలలోని ఆంగ్లం తెలిసిన పండితులకు, పాఠకులకు అందలేదనే విషయం తెలిసి, ఆంగ్ల భాషలో దీని అనువాదం తీసుకురావలసిన అవసరం అనివార్యమైంది. ఇతర పనుల్లో మునిగిపోవడం వలన అనువాద కార్యక్రమం పూర్తిగా రూపుదాల్చడానికి చాలా కాలమే పట్టినందుకు కాస్త విచారం కలిగించే విషయం. వాస్తవానికి ఒక పుస్తకాన్ని, ఒక భాషనుండి మరో భాషలోకి అనువదించడమంటే మానసిక వేదనకు గురికావడమే. కలం, కాగితం మీద పెట్టగానే అనువదించడంలో వెచ్చించిన సమయాన్ని ఒరిజినల్ వర్క్ కోసం శ్రమిస్తే మరింత సమాచారం అందుబాటులోకి వస్తుంది. సమయం వృథా కాదు అన్న భావన దీనికి కారణం. అంతేగాక, ఒక భాషకున్న విశిష్టత, దాని ఆత్మను మరో భాషలోకి అనువదించడం నిజానికి కష్టతరమైన పని. అయినప్పటికీ అవసరమైన మార్పులతో, అదనపు సమాచారంతో 'దక్కన్ చరిత్ర' పై మక్కువ గలవారికోసం ఆంగ్లానువాదం తీసుకురావడం జరిగింది.

వంశ మూలాలనుండి చివరి వరకు రెండు వందల సంవత్సరాల కాలపరిమాణాన్ని ఆక్రమించిన విస్తృత చరిత్ర. ఈ రచనలోని వస్తువును కాలపట్టిక (chronological order) ననుసరించి, ఆధునిక శాస్త్రీయ పద్ధతిలో విషయ వివరాల నిర్వహణ జరిగింది. ఆ క్రమంలో ఇందులోని విషయాలను అధ్యాయాలుగా విభజించి, సాంస్కృతిక పరిణామ క్రమాన్ని కళ్ళకు కట్టినట్లు సవివరంగా ఇవ్వబడినది. ఈ పుస్తకంలో ప్రశంసించదగిన విషయమేమిటంటే అప్పటికాలంలోని సాంస్కృతిక, ఆర్థిక స్థితి గతులపురోగతిని ప్రస్తావించడం. చివరికి, సాంస్కృతిక సంపదయే ఒక జాతి తన ముందు తరాలకు అందించే అసలైన సంపద. కుతుబ్షాహీ రాజులు ఆ సాంస్కృతిక విలువలనీ తమ దక్కన్ ప్రజలకు వారసత్వంగా అందించినది.

గోల్కొండ, భారతదేశ చరిత్రకారుల దృష్టినాకర్షించలేకపోవడం విచారించదగిన విషయం. భారత దేశపు మేధావుల చేతిలో దీనికి సంపూర్ణ న్యాయం జరగలేదు. పరిమితులు వున్నా, గోల్కొండ రాజ్యానికి తనకున్న పరిధుల్లో వనరులకు, చారిత్రక, సాంస్కృతిక సంపదలకు కొదవలేదు. అందుచేత భారత ఉపఖండం (sub - continent) లోని చరిత్రలో దీనికి ప్రముఖ స్థానం వుంది. కొత్త పాలనా సిద్ధాంతాలను ప్రవేశపెట్టింది. జీవన శైలిలో కొత్తదనాన్ని సృజించింది. ఇప్పటికీ దక్కన్ సామాజిక జీవనంలో వీటి సాంస్కృతిక ఆనవాళ్ళు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ రాజ్యం ప్రారంభ దశ నాటినుండి మధ్య తూర్పు దేశాలలోని ప్రజలకు సుపరిచితం. రాజకీయ వేత్తలను, మేధావులను, వర్తకులను, వృత్తి కళాకారులను అమితంగా ఆకర్షించిన దేశం. ఈ రచనను ప్రామాణికం చేయడానికి పర్షియన్, ఉర్దూ, ఆంగ్ల, ఇతర శాసనాలు, గ్రంథాలు, చరిత్రకు సంబంధించిన పత్రాలు సాధ్యమైనన్ని వనరులను శోధించాను. పరిశీలించాను. సమయం అనుకూలిస్తే, అదనంగా ఇంకాస్త సమాచారాన్ని తర్వాత వచ్చే ముద్రణలో జత చేసే ప్రయత్నం చేస్తాను.

బృహత్తరమైన ఈ కార్యక్రమం పూర్తిగా రూపు దాల్చడానికి సహకరించిన బంధు మిత్రులకు రుణపడి వుంటాను. నాకు ప్రియమైన, గౌరవనీయులైన స్నేహితులు - శ్రీయుతులు సలావుద్దీన్ (Salahuddim), డా౹౹వహీదుద్దీన్ (Dr.Waheeduddin), ఫిలాసఫీ ఆచార్యులు, ఉస్మానియా విశ్వవిద్యాలయం వారు అందించిన విలువైన సహాయానికి కృతజ్ఞుణ్ణి. వారి విలువైన సమయాన్ని కేటాయించి రాత ప్రతిని పూర్తిగా చదివి తగిన సలహాలనందించారు. వాస్తవానికి వారు చూపిన ఈ ఆదరాభిమానానికి కేవలం కృతజ్ఞతలు తక్కువే. వారి సహచర్యం, సహకారం నాలో కొత్త ఉత్సాహాన్ని నింపి జీవితానికి అర్థం చూపించింది.

నా మేనల్లుళ్ళు (nephews) శ్రీయుతులు మహమూద్ బేగ్ (Mahamood Baig), అబ్దుల్ హఫీజ్ సిద్దిఖీ, (Abdul Hafees Siddiqui) లు అందించిన విలువైన సహకారానికి కృతజ్ఞతలు. అనువాదం ప్రారంభం నుండి పూర్తయ్యేవరకు అన్ని విధాలుగా సహకరించారు. ప్రత్యేకించి హఫీజ్ సిద్దిఖీ అందించిన సహాయం మరువలేనిది. ఇతను ప్రతి అధ్యాయాన్ని చదివి, సంస్కరించి, ప్రెస్ వ్యవహారాలను పర్యవేక్షించడంలో ముఖ్యపాత్ర పోషించారు. ఈ బృహత్ కార్యక్రమం, అతని సహకారం లేకపోయినచో వెలుగు చూడకపోయేది. ప్రొ॥ ఫజ్ హక్ (Fazle Haque), నిజాం కాలేజి, హైదరాబాద్ సమయానికి తగు సలహాలందించి, సహకరించినందుకు వారికి కృతజ్ఞతలు.

హిమాయత్ నగర్,
హైదరాబాద్ దక్కన్,
జూన్, 1956

- అబ్దుల్ మజీద్ సిద్ధిఖి