గోలకొండ పత్రిక సంపాదకీయాలు/21 రోజుల ఉపవాస దీక్ష
21 రోజుల ఉపవాస దీక్ష
10 - 5 - 33
గాంధిమహాత్ముడు మే 8 వ తేది సోమవారంనాడు మధ్యాహ్నము 12 గంటలైన తరువాత బంధు మిత్రుల మధ్య భగవన్నామ కీర్తనముతో 21 రోజుల ఉపవాస దీక్షను ప్రారంభించినాడు. మహాత్ముడు ఉపవాసమును నిశ్చయించుకొనిస సందేశము తెలిసిన వెంటనే భారతదేశము యొక్క అన్ని భాగములును గజ గజ వణకసాగెను. అన్ని మూలల నుండియు మహాత్ముని భక్తులును, మిత్రులును మహాత్ముని ప్రాణవిషయమున సంశయ భీతిగ్రస్తులై ఉపవాసమును మానుడని ప్రాధేయ పడజొచ్చిరి. కొందరు ఎరవాడకేగి కన్నీళ్ళతో మహాత్ముని హృదయమును కరిగింపజూచిరి. కాని ఆ హృదయము మొదట కఠినమైయుండినకదా కన్నీటికి కరుగుననుమాట, మహాత్ముడు తన నిశ్చయమును మానుటకు వీలులేదని చెప్పిన తన ప్రాణ విషయమున ఎవరును భీతిజెంద నవసరములేదని నచ్చజెప్పెను
ఇచటనే మహత్ముని పూర్వోపవాసమునకును ప్రస్తుతోపవాసమునకును గల భేదము ఒకటిగోచరించు చున్నది. ఇదివరకు సెప్టెంబరులో మహాత్ము డుపవసించునప్పుడు తాను జీవింప గల్గునో లేదో అను విషయము వారికే తెలిసి యుండలేదు. ఇప్పుడన్ననో అట్లుగాక తాను అన్ని రోజులు కూడ ఉపవాసముండి జీవింపగల్గుదునని గట్టి విశ్వాసముతో నున్నాడు. అందరికిని అదేధైర్యము చెప్పుచున్నాడు. కాని సామాన్య జనులకు ఆ ధైర్యనుబ్బునా? వారు ప్రేమించు వస్తువు యొక్క వినియోగమును తలచి భయపడుటయు దుఃఖించుటయు సామాన్య మానపునికి ప్రకృతి మహాత్ముడో ప్రకృతిని నియమించువాడు.
మరియొక భేదమేమనగా పూర్వోపవాసమందు మెక్డానాల్డుగారి సాంఘిక సమస్యా పరిష్కారమువల్ల శాశ్వతమై యుండవలసిన సవర్ణాస్పృశ్య విభాగమును లేకుండ చేయుటకై సదరు పరిష్కారమునే తీసివేయించు నుద్దేశ్యముతో మహాత్ము డుపవసింపవలసి వచ్చెను. ప్రస్తుతమన్ననో అట్టివి విశేషోద్దేశ్యమేదిగాని లేదు. 21 రోజులను క్రమముగా ఉపవాసము జరిగియే తీరవలెను.
మరి యీ యుపవాస మెందుకు? హరిజనుల యభివృద్ధిని దలచియేయని మహాత్ముడు వాక్రుచ్చినాడు. హరిజనుల యభివృద్ధికి ఈ ఉపవాసమెట్లు దోడ్పడును? తక్కిన కారణ విశేషములను మహాత్ముడు గోప్యములైనంత పవిత్రములని తెలియజేయలేదు అయినను సూక్ష్మముగా హరిజనోద్ధరణమునకై ఉద్యమించుచున్న తన యొక్కయు తన తోటివారి యొక్కయు ఆత్మ సంశుద్ధికియని మహాత్ముడు తెలుపుచున్నాడు
దీని యర్ధమేమి? ఇప్పటికే ఈ పవిత్రోద్యమమును కొన్ని కళంకములు ఆవహించియున్నవని మహాత్మునికి గోచరించి యుండవలెను. కాబట్టి మహాత్ముని ఉపవాస సమయమున హరిజనోద్యమములో పనిచేయువారేమి చేయదగినదియు దీనినిబట్టి గ్రహింపవచ్చును. వారు బాహ్యాంతశ్శుద్ధిని రక్షించుకొనుటయందు బహు జాగరూకులుగా నుండవలసి యున్నది. హరిజనోద్ధరణోద్యమము పవిత్ర కార్యము. పవిత్రకార్యములన్నింటియందు చూపదగిన శుద్ధినే యిందును అవలంబింపవలెను. కాబట్టి ఇంతవరకును హరిజనోద్ధరణోద్యమమందు చేరియున్నవారు మహాత్ముని యుపవాసకాలమున తమ యంతరాత్మలవైపు దృష్టిని మరల్చి తమ లోపములను పరిశోధించి పశ్చాత్తాపశుద్ధ మనస్కులయ్యెదరు గాక, అంతేచాలదు. భవిష్యత్తులో అటు వంటి దోషములు లేకుండ తమ ప్రవర్తనమును రక్షించుకొనుటకు నిశ్చయించుకొనెదరుగాక
ఏ వి థక్కరుగారు హరిజనోద్ధరణోద్యమమునందు కొన్ని ప్రాంతముల జడత్వ దోషమును సూచించుచున్నారు. వారు తమ మాంద్యమును వదల వలసి యున్నది. భారతదేశమందనేక భాగములలో హరిజనోద్ధరణ సంఘములే యేర్పడ లేదట. ఇది యిటుండ కొందరు సనాతనులు హరిజనులను దేవాలయ ప్రవేశార్హత గలవారినిగ జేయు చిత్తుశాసనములను ప్రారంభము నుండియు ఎదిరించు చున్నారు. ఇదంతయు మహాత్ముని మనస్సును కలవరపెట్టి యుండునని తలచెదము మొదట మహాత్ముని యుపవాసమును మాన్పుటకై సవర్ణ హిందూనాయకులు ఆస్పృశ్యతను నిర్మూలించుటకై వాగ్దాన మిచ్చునపుడు ఏ అభ్యంతరమును తెలుపక మహాత్ముడు ఉపవాసమును విరమించువరకు తూష్టింభావము వహించిన వారు ఆ వాగ్దానమును నెరవేర్చబోవు సరికి అడ్డుతగిలిరి ఈ ప్రతికూలుర కందరికి ఈ రెండవ ఉపవాసము ఆత్మపరీక్షకు తగిన సమయము. వారు ప్రాచీనమైన పద్ధతియనెడు ఒక్క హేతువుచేత మాత్రమే ఏ ఆచారమునైనను గౌరవించుటకు సిద్దులుగ నుండకూడదు తత్వమును మనస్సులో ఏ పక్షపాతములేక విచారించి తదనుసారముగా వర్తించవలెను. హరిజనోద్ధరణోద్యమమునకు అనుకూలురుగ నున్నవారు మాంద్యమును మాని చురుకుగా పని చేయవలెను.
ఇట్లంతయు తప్పక జరుగుననియే మా నమ్మకము మహాత్ముని మనోబలము అప్రతిహతమైనది. మహాత్ముడు తలపెట్టినంత దానిలో ముప్పాతికవంతైనను ఈ 21 రోజుల ఉపవాసదీక్షలోగా నేరవేరవలెను. లేనిచో మరియొక సారి మహాత్ముడు ఇటువంటి ఉపవాసమును పూనవలసి వచ్చును. ఆ మాటను యిప్పటి నుండియే మహాత్ముడు సూచించుచున్నాడు ప్రస్తుతోపవాసము యిక మీద రాబోవు అటువంటి యుపవాసములలో మొదటిది యని మహాత్ముడు చెప్పుటలో అదే అభిప్రాయమని మాతలంపు ప్రస్తుతోపవాసమునే అంత్యోపవాసమునుగ గూడ చేయగల శక్తి భారతీయుల చేతిలో నున్నది వారు మాంద్యమును ప్రాతికూల్యమును వదలి మహాత్మునికి ప్రియులగు హరిజనుల నుద్ధరించుట యందు శ్రద్ధాభక్తులతో పని చేయుదురేని మహాత్మునికి అటువంటి మరియొక ఉపవాసముతో పనియుండదు
ఈ సమయమున మహాత్ముని విడుదలయు భారతీయులందరికిని సంతోషము కలిగింపక మానదు వారు ప్రభుత్వమున కిందులకై కృతజ్ఞులు, కానీ ఇది దుఃఖములో సంతోషము భగవంతుని నమ్మి మహాత్ముని యాత్మోత్సాహమునకై భారత ప్రజలు ద్విగుణీకృత శ్రద్ధతో అస్పృశ్యతా నిర్మూలనోద్యమమున పనిచేయుటకన్న యిప్పుడు వేరు మార్గమేదియు కన్నడదు. అది యే మహాత్ముడును సూచించిన మార్గము.