Jump to content

గోలకొండ పత్రిక సంపాదకీయాలు/హైదరాబాదు స్త్రీల యుత్సాహము

వికీసోర్స్ నుండి


హైదరాబాదు స్త్రీల యుత్సాహము

1-10-1932

హైదరాబాదునందు, తక్కిన భారత రాష్ట్రములయందువలె ప్రజల సేవకై స్త్రీలు ఉత్సహించుచుండుట యెంతయు హర్ష సంజనకముగానున్నది. గత బుధవార పత్రికయందు, సెప్టెంబరు నెల 24 వ తేదినాడు సమా వేశమున హైదరాబాదు మహిళా మహాసభ యొక్క కార్యక్రమము వర్ణితమై యున్నది. ఈ మహాసభ అఖిల భారత మహిళా మహాసభతో సంబంధము గలదై దానికి ఇరువది మంది ప్రతినిధులను ఎన్నుకొని పంపుచుండుట ప్రశంసింపదగిన విషయము గాంధి మహాత్ముడు గుర్తించినటుల యిది స్త్రీల యుగము స్త్రీలు సంకుచిత దృష్టి వదలి సోదరీ వర్గముతో కలసి లోకకళ్యాణమునకై పాటుపడినచో ప్రపంచమునకంతయు త్వరలో శాంతి చేకూర కలదు శాంతము లేక సౌఖ్యము లేదు. ఇందు వారి సహజ కోమల హృదయ మెంతయో యుపకరించును. ఈ విషయము ప్రస్తుత మహాసభ యొక్క ఉపన్యాస నిర్ణయములయందు స్పష్టమగుచున్నది.

శ్రీమతి శ్రీకిస్‌గారి సతీమణి యధ్యక్ష స్థానమలంకరించి యుపన్యసించుచు, ధనవంతులు అజ్ఞానులగు దాసీలకు తమ బిడ్డలను సంరక్షణార్థమై ఒప్పగించుట వలన జ్ఞానశూన్యుల దురాచారములు పసితనమందే పట్టుబడుట సంభవించుచున్నదనియు, కాబట్టి శిశువులను పెంచు పని జ్ఞానవంతులై జాగరూకులగు వారి యధీనమందుండవలెననియు చెప్పెను ఈ మాటను తల్లిదండ్రులు అనుసరించినచో సంఘమునందు ఆరోగ్యము, ఐశ్వర్యము, శాంతియు తప్పక వర్ధిల్ల గలవు ఈ మూడును ఆచారశీలములపై నాధారపడియున్నవి. ఆచార శీల బీజము పసితనమందు నాటి మెలకువతో కాపాడినగాని చక్కగా ఫలింపదు.

ప్రస్తుత మహాసభ గావించిన నిర్బంధ ప్రారంభ విద్య తీర్మానము కార్య రూపమున పరిణమించుట అధిక భాగము విద్యాగంధ హీనమైన మన హైదరాబాదు రాష్ట్రమునందు యెంతయో అవసరమై యున్నది రాష్ట్రము యొక్క భావిసౌఖ్యమంతయు యిప్పటి బిడ్డల విజ్ఞానముపైననే కదా ముఖ్యముగా నాధారపడియుండును

సభయందు గావింపబడిన రెండవ తీర్మానము గమనింపదగియున్నది. ఈ కాలమున, మన దేశమునందంతయు బాలబాలికల పాఠశాలలయందు ఉపాధ్యాయులును వేత్రధారులగుట యొక దురచారమైయున్నది. ఈ వాడుక యిప్పటి యుపాధ్యాయు లందధికయయ్యెను. ఆ సామర్థ్యమును అనర్హతను సూచించుచున్నది. దెబ్బ తగులనిచో పిల్లలు తామడిగిన ప్రశ్నలకు సరియగు ఉత్తరముల నీయరనియు సరిగా చదువరనియు అనేకులు ఉపాధ్యాయులు మొఱ పెట్టుదురు. అట్లయిన దెబ్బపడినప్పుడంతయు సరియగు సమాధానమును పిల్లలు యిచ్చుచున్నారా? అవును, యిచ్చుచున్నారు, అని చెప్పుటకు సాహసింపగల ఉపాధ్యాయుడెవడైననున్నాడని మేము తలచము. పిల్లలు తగిన యుత్తరముల నీయకపోవుటకు ప్రధానమైన కారణములు రెండు గలవు బాలురకు మొదట బోధించిన విషయము అర్థము కాకయైన నుండవలెను. లేదా, వారికా విషయ మందభిరుచియే లేకుండియుండవలెను సామాన్యముగా అభిరుచి లేని విషయము నందు అభిరుచిని గల్గింపగల్గుట ఉపాధ్యాయుని సామర్థ్యాతిశయమును దెల్పును. మొదలే యభిరుచి లేని విషయమును దెబ్బలు కొట్టియైనను విద్యార్థి మనస్సులోనికి బలాత్కారముగా తురుముట గురు శిష్యుల కిద్దరికి బాధను గల్గించును. కాబట్టి ముఖ్యముగా బాలుని ప్రకృతియే విద్య అనుకూలించుచో దానినే నేర్పుట పరమోత్తమము. అర్థము కానప్పుడు కొట్టుటవలన లాభమేమి ? మరల బోధించవలెను పంతులు సమర్థుడైననో విషయము తెలియునట్లు చేయుటకు దెబ్బల యవసరమే యుండదు ఈ బాధంతయు ఉపాధ్యాయులు బాలుర మనస్సులను సహజ శక్తులను గ్రహింపగల్గినచో తొలగగలదని మా యభిప్రాయము

రెండవ తీర్మానము తర్వాత రుస్తుంజి ఫరిదూంజిగారి సతీమణిగారిచే ఉపపాదింపబడిన తీర్మానము ఒక చిన్న క్లిష్ట సమస్యను దెచ్చెను. బాలబాలికలకు జాతిమత ద్రవ్యభాషా భేదములు లేక ఏకముగ పాఠశాలలుండవలెనని యీ తీర్మానము చెప్పుచున్నది. దీనిపై నుపన్యసించుచు ఫరీదూంజిగారి సతీమణి యేక భాష సాధారణము కానప్పుడు విభేదముల కవకాశముందని నిరూపించి అందరికిని పాఠశాలలు సమానముగా నుండవలె ననెను. "మాతృ భాషయందు విద్య"యను నభిప్రాయము యిపుడు బలమైయున్నను, భారతీయులందరికినీ సమానముగా సులభమైన హిందీ భాష దేశభాషయైననేగాని మన దేశమందు జాతీయ భావము వృద్ధికి రాదు. అని మేము తలచెదము, జాతీయ భావమనునది యెఱుగక అంతర్జాతీయత యని ఘోషించుట మొదటి మెట్టునుండి కడపటి మెట్టుపై అడుగు పెట్టి నటులుండును. విద్యను భేదములను సమసిపోవునటుల నేర్పుటకు తగిన సౌకర్యములు విద్యా ప్రవీణులు చేయవలయును. అట్లేర్పరచబడిన విద్యా విధానము దేశమందంతయు అనుసరింపబడవలయును.

హైదరాబాదు మహిళా సభవారు కట్టకడపట "పట్టణమందు వ్యాధులచే బాధపడుచుండు వారి స్వార్థ త్యాగులై సాంఘికసేవ చేయవలయును" అని గావించిన తీర్మానము సభకు చక్కని ముగింపుగా నున్నది. భావి రాజ్యాభివృద్ధి విషయమున తండ్రులకంటె తల్లులయందే యెక్కువ బాధ్యత కలదు. కావున, హైదరాబాదు మహిళా సభవారు తమ యుదారాశయములను త్వరలో సత్యము గావించుకొనగలరని యాశించుచున్నాము.