గోలకొండ పత్రిక సంపాదకీయాలు/హైదరాబాదు సివిలు సర్వీసు
పాలగుదురు తమకు విద్యకావలెనని, తమను వెట్టిచాకరి చేయించవలదని, తమకు గ్రంధాలయము కావలెనని, తమ ప్రభవులతో నెట్లు చెప్పుకొందురు ఇప్పటికైనను ఆలస్యమైనను బాబెహుకూమతు వారు ఈ 2-3 దినములలో సెలవిత్తురని విశ్వసించుచున్నాము
ఈ యాంధ్రసభలు చాల నిరపాయములనియు ప్రజాహిత సంస్థలనియు, రాజభక్తి కలవనియు, మన నిజాము రాష్ట్ర పత్రికయగు మన్షూనుచేత సనదు పొందుటయే కాక నిచ్చటికి 500 మైళ్ళ దూరమున నున్న మద్రాసునుండి ఇంగ్లీషులో వెలువడు హైద్రాబాదు హెరాల్డు పత్రికచేతను మంచి సర్టిఫికెట్టును పొందినది. ఒకవేళ కొల్లాపుర అధికారులకు తెలియకున్న నీ సభ విషయమై మా బాబెహుకూమతు వారికి బాగుగా తెలియును
హైద్రాబాదు సివిల్ సర్వీసు
2 - 3 - 1932
బ్రిటిషు ఇండియా ఐ. సి. యస్ పరీక్షలెట్లో, మైసూరు సంస్థానములో మైసూరు సివిల్ సర్వీసు పరీక్షలెట్లో, మన రాష్ట్రములో హైద్రాబాదు సివిల్ సర్వీసు పరీక్షలట్లు ఏర్పాటుఅయి అనేక సంవత్సరములైనది ప్రతి సంవత్సరము 52 విద్యార్థులను ఈ సర్వీసులోనికి తీసుకొనుచున్నారు. కాని యీ పరీక్షలలో మనకు బ్రిటిషు ఇండియాకును, మైసూరునకు చాల భేదమున్నది బ్రిటిషు ఇండియాలోని పరీక్షలకే విద్యార్థులు బి ఏ. పరీక్షయందుత్తీర్ణులై యుండవలెను. ఆ విద్యార్థులు పరీక్షయియ్య వలసిన విషయమంతయు, ఇంగ్లీషులోనే యుండును ఒక్క పత్రికమాత్రమే ఏదైన యొక ప్రాచీన భాషలో (Classical) నుండును.
మన రాష్ట్రములోని పరీక్షా విషయములో బహుకాలము నుండి ఏ కారణముచేతనో హిందువులు కృతార్థులగుటలేదు ఒక్కొక్క సంవత్సరమొక్క హిందువు సహితము సర్వీసునకెన్నుకొనబడడు ఇట్లు అనేక సంవత్సరముల నుండి జరుగుచున్నది. దీనికి కారణములు చాలమందికి సరిగా తెలియదు హిందువులకు ప్రోత్సాహము ప్రభుత్వమువారు కలిగించుట లేదని జనులనుకొనుచున్నారనియున్నది సరికాదనియు ప్రభుత్వ పక్షమున యొక ప్రకటన కావింపబడెను. ప్రభుత్వమువారిట్లు అనుచున్నారు.
"సెలక్షను బోర్డువారు హిందువులకు ప్రతికూలముగా నున్నారని యనుచున్నారు. కాని ఎన్నికలను జేయునప్పటి యంకెలజూచిన ప్రభుత్వము వారికందఱును సమానులేయని విశదమగును. నియమముల ప్రకారము వయస్సులో ముల్కీ యగుటలో, ఆరోగ్యవిషయములోనే విద్యార్థి తృప్తికరమగు నిదర్శనములను జూపించునో యతడు దరఖాస్తు ఇయ్యవచ్చును దరఖాస్తులను విచారించునపుడు ప్రభుత్వమువారు హిందులయెడ ప్రత్యేకముగా రియాయతీ ఛేయుచుందురు. ఆఖరు నియామకము పరీక్షా ఫలితమును బట్టి యుండును. పరీక్షకులు విశేషముగా రాష్ట్రమునకు బయటనుండువారే యుందురు. అట్టిచో ముసల్మానులయెడ పక్షపాతమెట్లుచేయనగును. ఈయేడు సంవత్సరముల సంఖ్యలను జూచిన హిందువులు తక్కువసంఖ్యలో దరఖాస్తులిచ్చుచున్నారు. అది హిందువులతప్పే అయినను, వారిలో నెక్కు వమందినే నామకరణము చేయుచున్నాము 16-32 లోని సంఖ్యల జూచిన 100 మంది హిందూ దరఖాస్తులలో 60 మంది నామకరణమైనది కాని...... ముసల్మాను దరఖాస్తులలో 298 మాత్రమే నామకరణమైనది పోటీ పరీక్షలోనే హిందువులు క్రిందబడి పోవుచున్నారు”
ఇది ప్రభుత్వము వారి సమాధానము ప్రభుత్వము వారు హిందువుల విషయములో చూపించెడు ప్రేమకు మేము కృతజ్ఞులము మరియు ప్రభుత్వము వారు ప్రజల పక్షమునుండి నేవిధమైన యాక్రోశము కలిగినను వెంటనే దాని విషయమున తమ యభిప్రాయమును వెల్లడించుట చూడ వారి ప్రజానురాగము వెల్లడియగుచున్నది అందుచేత మేము ప్రభుత్వము వారికి రెండు మూడుసూచనలు చేయసాహసించుచున్నాము పైప్రకటనలోని విషయములలోకొన్ని సమాధానములు మాకు సరిగా నచ్చలేదు నామకరణము అనునది వేరు. పరీక్షా ఫలితముగా నియామకమువేరు. నామకరణములో హిందువులనెక్కువగా తీసికొనినంతనే హిందూ విద్యార్ధులకు లాభములేదు హిందువులలో నూటికి 60కి మారుగా 95 తీసికొని ముసల్మానులలో నూటికి 5 మందినే నామకరణము చేసి రనుకొనుడు. పరీక్షా ఫలితముగా ముసల్మానులు 5 లో 4 గురిని తీసికొని హిందువులలో 95 లో నెవ్వరినిగూడ గెలిపించక యుండవచ్చును. కావున పై నామకరణ సంఖ్యలవలన లాభములేదు. మనకు కావలసినది అసలు నియామకములు
హిందువులు నిశ్చయముగా చాలకొలది మందియే దరఖాస్తులిచ్చుచున్నారు. అది హిందువుల తప్పేయనుట కొంత నిజమను కొందాము కాని యంతయు హిందువుల తప్పుకాదు ఈ 15 - 20 ఏండ్లుగా హిందువు లెందఱు ముసల్మాను లెందరు ఎన్నుకొనబడినారు ముసల్మానులే నూటికి 95 ప్రకారము తీసికొనబడి యున్నారు. ఇది చూచియే హిందువులకు దినదినము ధైర్యము తక్కువై లాభములేని యీ విశ్వప్రయత్నములేల యని మానుకొనినారు సాధారణముగా ప్రతి మనుష్యుడు ఎదుటి వాని భావము గుర్తించి పనిచేయును ఎదుటి వాడు తనకు సుముఖుడు కాలేడని యొకనికి తెలిసిన వాడు వాని దగ్గఱకే పోడు ఎదుటివాడు తనయందు ప్రీతియున్నదని వాడు గుర్తుపట్టిన వాని దగ్గఱకు తాను పోవుటయే గాక తన బంధువులను గూడ బిలిచికొను పోవును ఏ సంవత్సరమైన హిందువులు హెచ్చుగా తీసుకొనబడిన దాని ఫలితము మఱుచటి సంవత్సరమే విశదమగును, హిందువు లెక్కువ సంఖ్యతో ప్రయత్నింతురు ఇదియే దీని రహస్యము.
ఇక యొక ముఖ్య విషయమును గమనింపవలసియున్నది. హిందువుల నామకరణము హెచ్చుగా నుండినను వారెందుకు పరీక్షలో కృతార్థులు కారు ఒకవేళ యిచ్చటి వారు పరీక్షకులుగా నుండిన పక్షపాతము చూపి యుందురని తలపవచ్చును. కాని యందఱును బయటివారే కదా పరీక్ష చేయునది
ఈ వాదము బాగుగానే యున్నది. కాని మా యభిప్రాయమున బయటివారు కూడ ముసల్మానులే యుండవచ్చునని హిందువులు తలుచుచున్నారు. ఏలయిన విశేషముగా పరీక్షా పత్రములు ఉర్దూ సంబంధము కలవే అందుచేత ఉర్దూ వచ్చిన ముసల్మానులే ఈ పరీక్షకులుగా నుండిన విచిత్రము కాదు. అయినను ఈ విషయములో మాకాక్షేపణము లేదు
మేమాక్షేపించునది పరీక్షా పద్ధతియే! పరీక్షలో మొత్తము 500 గుణములు. అవి యిట్లు విభజింపబడినవి
ఇంగ్లీషు ప్రశ్నా పత్రిక | 100 |
ఉర్దూ వ్యాసము | 100 |
ఇంగ్లీషు నుండి ఉర్దూకు, ఉర్దూ నుండి ఇంగ్లీషుకు తర్జుమా | 100 |
ఆధునిక సమస్యలు ఇంగ్లీషులో 50, ఉర్దూలో 50 | 100 |
నోటి జవాబులు | 100 |
మొత్తం | 500 |
ఈ 500 నూర్లలో నోటి జవాబులు.............. మూలకము కానందుచే అందు భాషా జ్ఞానము..... అభిప్రాయ జ్ఞానమే ప్రధానము కాన అదిపోగా మిగతా 400 గుణములలో ఉర్దూ కొరకై 250 గుణములున్నవి. అనగా ఉర్దూ మాతృ భాష కలవారికెక్కువ సౌకర్యమున్నది. తక్కిన వారికి లేదు దీని