గోలకొండ పత్రిక సంపాదకీయాలు/హైదరాబాదు పరిశ్రమలు
హైదరాబాదు పరిశ్రమలు
27 - 4 - 1929
మన ప్రభుత్వమువారు హైద్రాబాదు పరిశ్రమల యభివృద్ధికై యొక కోటి రూపాయీలు ఇచ్చియున్నారని వినుటకు చాల సంతోషమగుచున్నది ఈ కోటి రూప్యములీ క్రింది విషయములందు వ్యయపఱచుట వారి యుద్దేశమై యున్నది
1. గృహ పరిశ్రమలకు (Cottage Industries).
2. పరిశ్రమ యంత్రముల పరిశోధనకు
3. రాష్ట్రములోని యార్థిక పారిశ్రామిక విచారణకు .
4. పరిశ్రమ పరిశోధన సహాయమునకు.
5. ఇచ్చటగాని బయటగాని యువకులు పరిశ్రమలకై యభ్యసించిన వారికి సహాయము చేయుటకు.
ఈ యుద్దేశములు నిరభ్యంతరముగా నుత్తమమైనవి ప్రతి దేశము నేటి కాలమున పరిశ్రమలపై విశేషముగా నాధారపడియున్నది మన రాష్ట్రములో నింతవరకెవ్వరు పరిశోధక పండితులుగాని, శాస్త్ర పరిశోధకులుగాని, చారిత్రక పరిశోధకులుగాని, నూతన వస్తు నిర్మాతలుగాని (Inventors) యుత్పత్తి గాకుండుట చూడ నాశ్చర్యముగా నున్నది. లేకున్న నేటేట డజనుల కొలదిగా విద్యార్థులు విదేశములకున్నత విద్యానిమిత్తమై పోయి ప్రతి సంవత్సరమును లక్షల కొలదిగా సర్కారు వారి ద్రవ్యమును తినినను లాభము లేక పరిణమించుచున్నది. నిజాము రాష్ట్రములో నేత పరిశ్రమ మున్నగు పరిశ్రమలు సర్కారు వారిచే ఏల నడుపబడును? వాణిజ్యాది శాఖ యొకటి యున్నది. కాని యింతవరకు చెప్పుకొనగలిగినంతటి ఫలితము మనకు గనుపించలేదు. ప్రస్తుతము ప్రభుత్వము వారీ కోటి రూప్యములను వ్యయము చేయ నిశ్చయించి నందున ముందు గొప్ప గొప్ప మార్పులీ పరిశ్రమ శాఖవలన రాష్ట్రమునందు గలుగునని విశ్వాసము కలదు గృహ పరిశ్రమల యభివృద్ధి మొదటి స్థానమలంకరించి యున్నది. దీనిని నిజముగా నభివృద్ధి చేయనెంచిన మహాత్మగాంధీ గారి రాట్నమును గూడ గొంత పరీక్షించి చూడవలయును. మగ్గములు అగ్గువయు, శ్రేష్ఠమైనవియు, లాభకరములైనవియు, గ్రామములకు సులభముగా నేర్చుకొనుటకు వీలుగలిగినట్టివియు, చూచి ప్రచార మందుంచవలయును.
పరిశ్రమ యంత్రముల ప్రచారము (Demonstration) రెండవ కార్యముగా ప్రభుత్వమువారు నిర్ణయించినారు నగరములలో ప్రదర్శించుకొనిన నెవరికిని లాభములేదు మరియు ప్రదర్శించు యంత్రములు విశేషముగా వ్యవసాయ సంబంధముగాను, రాష్ట్రపు పరిస్థితులనుబట్టి యీ సంబంధమైనవిగాను నుండవలయును ఈ యంత్రముల ప్రదర్శనము గ్రామములో గావలయును ప్రతి గ్రామమునకు బోయి చేయుటకు మారుగా గ్రామజనులు విశేషముగా గూడునట్టి జాతరలలో జూపింపవలయును మన రాష్ట్రములో ప్రతి జిల్లాయందును గొప్ప గొప్ప జాతరలు జరుగుచుండును. కొన్ని కొన్ని జాతరలలో వేనవేల జనులు కూడుచుందురు. అచ్చట త్రాగుడు విశేషముగా నుండుటయే కాననగును దానికి మారుగా నిట్టి ప్రదర్శనములు చూపించిన వారికెంతయో లాభకరముగా నుండును మేమెన్నియో మారులీ విషయమై వ్రాసియుంటిమిగాని చెవిటి ప్రభుత్వమునకు చెవుకెక్కుట లేదు.
నిజముగా నీ కోటి రూప్యములను సద్వినియోగము జేయవలయుననిన ప్రజలకు లాభమగు మార్గములందు దీనిని వినియోగ పరచవలయును. మొత్తము పై ప్రభుత్వమువారి యౌదార్యమును ప్రశంసించుచు వారి ద్రవ్యమును నధిక సంఖ్యాకులగు రైతులకు లాభకరమగు మార్గములలో వినియోగంతురని మరొక మారు నమ్ముచున్నాము