Jump to content

గోలకొండ పత్రిక సంపాదకీయాలు/హైదరాబాదు పరిపాలనా నివేదిక

వికీసోర్స్ నుండి


హైద్రాబాదు పరిపాలనా నివేదిక

4 - 11 - 1935

హైద్రాబాదు పురపాలక సంఘము

ఇదియు స్థానిక స్వపరిపాలనలోనిదేయైనను దీని వివరములు ప్రత్యేకముగా నివేదికలో గలవు దీని ఆదాయము 11 లక్షలపై చిల్లర. దానిలో 7 లక్షలపై చిల్లర (అనగా సగము కంటె హెచ్చు) ప్రభుత్వము వారిచ్చుచున్నారు. ఈ స్థితి హిందూ దేశములోని నాల్గవదగు మన నగరము యొక్క ఘనతకు తగినట్టులేదని మా తలంపు. 1344 ఫ.లో మన పురపాలక సంఘము విశాలపరుపబడినది. పన్నులును, సభాసదులును, హెచ్చింపబడినారు, కనుక ముందు అభివృద్ధి కనపడగలదని ఆశించెదము

వ్యవసాయ శాఖ

ఈ శాఖపైన వ్యయము 8 లక్షల 55 వేలపై చిల్లర ఈ శాఖ క్రమాభివృద్ధి చెందుచున్నది. ప్రజలకు దీని యుపయోగము ఎక్కువగా కానవచ్చునట్లు ఈ శాఖవారు ప్రయత్నము చేయుచునేయున్నారు.

ఈ శాఖవారు చేయుపని నాల్గు భాగములు 1. పరిశోధనము. 2. ప్రయోగము (Experiments), 3 ప్రదర్శనములు, ప్రచారము (Demonstration and Propaganda), 4 రైతులకు సహాయము.

సహకార శాఖ

దీనిపైన మనకు ఖర్చు 3 లక్షల 74 వేలపై చిల్లర కొంత పని జరుగుచున్న మాట వాస్తవమే కాని జన సామాన్యమునకు ముఖ్యముగా రైతులకు ఈ శాఖ గట్టి విశ్వాసమును కలిగింపలేదని గ్రామ సంబంధము గలవారు అనుచున్నారు. శాఖాధికారుల సత్ప్రయత్నములవలన క్రమముగా లోపములు తొలగిపోవచ్చును

వాణిజ్య పారిశ్రామిక శాఖ

ఈ శాఖ పక్షమున నివేదికను బట్టి చాల పని జరుగుచున్నది. నివేదిక వత్సరములో “దక్కన్ గ్లాస్ వర్క్స్" కర్మాగారము అమ్మివేయబడినది. ఈ కంపెనీకి మన ప్రభుత్వమువారు గొప్ప మొత్తమును సహాయ మొసగియుండిరని మాకు జ్ఞాపకము కలదు దివాలాలోనికి పోవసుండగా అది అమ్మివేయబడినదని నివేదికలోనున్నది ఉదారాశయులగు మన ప్రభుత్వమువారు ఇణ్ణి ముఖ్య కార్మాగారమును పూర్తిగా తమ యాజమాన్యమున వుంచుకొనినచో ఎట్లుండెడిదో!

దయామయులగు మన ప్రభువుగారు పరిశ్రమల కోసము 1339 ఫసలీలో ప్రత్యేకముగా కోటి రూపాయలు అనుగ్రహించియుండిరి దానిలోనుండి నివేదిక సంవత్సరము వరకు 72 లక్షలపై చిల్లర ఇయ్యబడినది ఈ నిధిని వ్యయము చేయుటకు ముగ్గురు మంత్రుల ఉప సంఘము ఏర్పడి యున్నది.

పరిశ్రమల కొరకు అప్పులిచ్చుట, కొన్ని కార్ఖానాలను ప్రభుత్వమువారు నడుపుచుండుట, పారిశ్రామిక పాఠశాలల స్థాపనము మొదలగు పద్ధతులు అవలంబించబడుచున్న వి

తామిరాతు శాఖ

దీనిపైన వ్యయము ఒక కోటి 61 లక్షలపై చిల్లర, అప్సాషి కూడ దీనిలోనే చేరియున్నది

టప్పా శాఖా

రాష్ట్రమున టప్పాఖానాల సంఖ్య 794 అనగా 104 చదరపు మైళ్ళకు ఒక టప్పాఖాన కలదు ఇది చాల తక్కువ యని మా అభిప్రాయము. వీని సంఖ్య హెచ్చుటకు గట్టి ప్రయత్నములు చేసి లాభము పొందింపవలయును. ఆదాయము 9 లక్షల 87 వేలపై చిల్లర వ్యయము 9 లక్షల 20 వేల పైన కలదు ఇది తృప్తికరముగనే యున్నది.

వైద్య శాఖ

ఈ శాఖపైన నివేదిక వత్సరమున 19 లక్షలకు మించి వ్యయమైనది. ఇంగ్లీషు వైద్యశాలలు కాక నగరమున 29 యూనానీ ఆయుర్వేద వైద్యశాలలు వుండెననియు వానిలో 10 ప్రభుత్వము వనియు, 19 ప్రభుత్వ సహాయము పొందునవి అనియు నివేదికలో కలదు. ఈ 29 లో ఆయుర్వేద వైద్యశాలలు ఎన్నో, యునానీ వెన్నో వివరములుండిన బాగుండెను “యూనానీ వైద్యశాఖ" పైన 1 లక్ష 53 వేలు ఖర్చయినవి వివరములు ఇట్లియ్యబడినవి

ఆరోగ్య శాఖ రూ. 4,43,142
వైద్య శాఖ రూ. 19,36,191
యూనానీ శాఖ రూ. 1,53,541
మొత్తము రూ.25, 32, 874

ఇది సరియేయైనచో ఆయుర్వేద శాఖపైన ఖర్చైనదేదో కాన్పించుట లేదు.

విద్యాశాఖ

నివేదిక వత్సరమున 10 కాలేజీలు 52 హైస్కూళ్ళు, 132 మిడిలు స్కూళ్ళు, 4290 ప్రైమరీ పాఠశాలలు, 58 ప్రత్యేక పాఠశాలలు వుండెను విద్యాశాఖ పైన మొత్తము వ్యయము 1 కోటి 6 లక్షల పై చిలుకు దీనిలో ప్రారంభ విద్యపైన అయిన వ్యయము 24 లక్షల 28 వేలపై చిలుకు అనగా నూటికి 22 చొప్పున మాత్రమే. ప్రారంభ విద్య చాలా ముఖ్యమైనది జన సామాన్యమున కందునది ఈవిద్యయే కనుక దీనికి ఎక్కువగా వ్యయమగుట అవసరము, అని (1931 మర్దుంషుమాశాలో చదువుకొనిన వారి సంఖ్య నూటిలో 5 కంటే తక్కువగా నున్న దేశము విషయమున) చెప్పవలసిన పనిలేదు. మహోదారులును, విద్యా ప్రియులును నగు మనప్రభుత్వము వారికి విషయమున యెక్కువగా సూచించవలసిన పనిలేదు.

స్త్రీ విద్య

బాలికా పాఠశాలలు ప్రభుత్వము వారివి (స్వంతముగా వారివి లేక ఇందాదు పొందునవి అన్నియు కలిసి) 718 యుండెను. ఇవి కాక ప్రయివేట్ పాఠశాలలు 9 ఉండెననియు, వానిలో చదువు బాలికల సంఖ్య 70 అనియురిపోర్టులో కలదు (పుట 105-111) ఈ ఏడింటిలో 1 హైస్కూలు, 1 మిడిలు స్కూలు వుండెనట ఈ రెండు పెద్ద పాఠశాలలు ఎచ్చట నుండెనో తెలియదు ఈ 9 పాఠశాలలు ఎట్టివో కానరాదు. ఏలయన ఇవి సహాయము పొందునవి ( Aided) కాని, సహాయము పొందక పోయినను అంగీకరింపబడినవి (Unaided, Recognized) గాని కావు ఈ హైస్కూలు బాలికల ఉన్నతపాఠశాల (సుల్తాను బజారు) కాదుగదా? ఏల యన ప్రభుత్వ సహాయముపొందని బాలికల హైస్కూలు మాకు తెలిసినంతవరకు రాజధాని యందలి ఈ ఒక హైస్కూలే కనబడుచున్నది

వాఙ్మయము

నివేదిక వత్సరమున వెలువడిన 560 పుస్తకములలో 369 ఉర్దూవి. (పుట 116). అనగా సూటిలో 66 అన్నమాట దీనిని గూర్చి నివేదికలో “దీని వలన ఈ భాషకుగల జన ప్రియత్వము వెల్లడి యగుచున్నది ( (Which indicated the popularity of that language as a literary medium) అని వ్రాయబడియున్నది (పుట 13 ఉపోద్ఘాతము.)

కానీ పూర్తిగా జనప్రియత్వమని చెప్పుట బ్రిటిషు ఇండియాలో ఇంగ్లీషులో వెలువడిన పుస్తకముల సంఖ్యను జూచి ఇంగ్లీషు జన ప్రియమని చెప్పుట యెట్లుండునో అంత మాత్రమే.

మత శాఖ

వ్యయము 12 లక్షల 18 వేల పై చిల్లర. 12 మత సంబంధమగు కొత్త మందిరములు (3 మహమ్మదీయులవి, 3 మహమ్మదీయేతరులవి) కట్టబడినవి 78 ప్రాతవి (39 మసీబులు, 39 మహమ్మదీయేతరులవి) బాగు చేయించబడినవి. ఈ పని యంతయు ప్రభుత్వ వ్యయములతో జరిగినది పై సంఖ్యలవలన మన ప్రభుత్వము వారి నిష్పాక్షికత్వము తెలియుచున్నది

ముగింపు

మొత్తము మీద మేము పైన ఉల్లేఖించిన విధమున ప్రభుత్వము వారి నివేదిక బోధప్రదముగనున్నది విద్యావంతులగు దేశీయులు - ముఖ్యముగా ఇంగ్లీషు వచ్చినవారు - ఈ నివేదికను చదివి లాభము పొందవచ్చును ముందు నివేదికలు సకాలమునకు సత్వరముగా ప్రకటితములగునట్లు ఏర్పాటులు జరిపిన యీ నివేదికల విలువ యింకను హెచ్చగలదు.