గోలకొండ పత్రిక సంపాదకీయాలు/హిందూ సంఘ సంస్కార మహాసభ
హిందూ సంఘ సంస్కార మహా సభ
15-6-1927
హైద్రాబాదులో మొన్న జరిగిన ఆరవ హిందూ సంఘ సంస్కార సభా చర్యలు పేరుచో ముద్రింపబడి యున్నవి. ఈ మహా సభ అత్యుత్తమముగా, జయప్రదముగా జరుపబడెననుటలో సందేహము లేదు. సభా భవనము నగర వాసుల చేతను, జిల్లాల నుండి వచ్చిన వారిచేతను పూర్తిగా నిండియుండుట ప్రజలందు కలుగుచున్న మార్పును సూచించుచున్నది. మరియు సభా తీర్మానములను శ్రద్ధతో విని వాని నామోదించుటలో మన రాష్ట్రపు జనుల సత్వరాభివృద్ధిని సూచించుచున్నది.
ఆహ్వాన సంఘాధ్యక్షుల యొక్కయు యధ్యక్షురాలు యొక్కయు, నుపన్యాసములు చాల బోధ ప్రదములైనవి. ఆహ్వాన సంఘ అధ్యక్షులయిన శ్రీయుత రామచంద్ర నాయకుగారు హైద్రాబాదులోని పరిస్థితులను, తామెట్లు రాజకీయ సభలను చేయజాలరో, తమకెట్లు విద్యా మతాది విధానములందు విశేషాధికారములు కావలయునో సూచించిన విషయములన్నియు ముఖ్యముగా గమనింపదగినవి. అధ్యక్షురాలగు సరళాదేవి చౌధరాణిగారి యుపన్యాసము గంభీర భావ గర్భితమైనది. ప్రతి వాక్యమును దీర్ఘాలోచనకు తావిచ్చునది. బ్రాహ్మణుల ధర్మమును వారు చూపి చెప్పిన విషయములు వారు స్వయముగా బ్రాహ్మణి యగుట చేతను, సత్యాధారములగుట చేతను నిరసింపబడక ప్రశంసింపబడెను. "బ్రాహ్మణత్వమునకు మారుగా నెప్పుడు బ్రాహ్మణుడే సంఘ నాయకుడయ్యెనో అప్పుడే పతన మారంభమయ్యెను”. ఇత్యాది వాక్యములు ఎంత తీక్ష్ణముగా నున్నను వానిలోని గంభీర భావమును గ్రహించుట అవసరము.
ఈ సంఘ సంస్కార మహా సభా తీర్మానములు అనేకములు హిందూస్థానమందన్ని ప్రాంతములందును జరుగునన్ని సంస్కార సభలలో ప్రవేశపెట్టబడి సాధారణముగా నామోదింపబడునట్టివి. స్త్రీ విద్యా వ్యాపకత్వమును గురించినట్టియు, సర్వ జనైక్యతను గురించినట్టియు, అస్పృశ్యతా మద్యపాన బాల్య వివాహ శుల్కాది దోష నివారణ విషయికముల గురించినట్టియు, మున్నగు తీర్మానములు సర్వసాధారణములైనవే. ఒకటి రెండు తీర్మానములు విశేషముగా చర్చింపబడెను. అందు విధవా వివాహమొకటి. దీని విషయమై విశేష కాలము వాదోపవాదములు జరిగెను. తుదకు బహుజనాంగీకారముగా వితంతూద్వాహము అందు ముఖ్యముగా బాల వితంతూ వివాహములు అంగీకరింపబడెను.
హైదరాబాదు రాష్ట్రమునకు సంబంధించిన తీర్మానములు సభవారు చేయుట చాల యుక్తముగా నున్నవి. ఖాన్గీ పాఠశాలల శాసనమును బహిరంగ సభల నిరోధించు శాసనమును, రద్దు చేయవలయునని యీ సభ కోరెను. "గ్రంథాలయ వార్షికోత్సవములను ఆపివేసినందులకీ సభవారు తీవ్రముగా ఆక్షేపించుచున్నారు." -ఈ తీర్మానము సూర్యాపేట సభల విషయమైనది. గ్రంథాలయ ఉద్యమమును రాజకీయమునకే సంబంధమును లేనిది. బరోడా వంటి సంస్థానమీ యుద్యమమునకు చేయుచున్న సహాయము బ్రిటిషిండియా యందును కానరాదు. ఇట్టి వానిని నిరోధించుట జ్ఞానమును నిరోధించుటయై యున్నది. ఈ నిరోధములు ముందు వుండకూడదని సభ కోరుట చాల సమంజసము.
భైక్షుక వృత్తిని నిరోధించు శాసనమును గురించి మా పత్రికలో నిదివరకే మా యభిప్రాయము నిచ్చియుంటిమి. ఇది చాలా యవసరమైనది. దేశమందీ మూలమున ప్రబలిన సోమరితనమును ఫలవంతమగు మార్గములందు ప్రసరింపజేయుట దేశ దారిద్ర్యమును పోగొట్టుట యగును.
మొత్తము పైన తీర్మానము లన్నియు దీర్ఘ సమాలోచనా ఫలితములని చెప్పునొప్పు. సభా కార్యక్రమములు చక్కగా జరిగెను. కానీ వానిని ఆచరణ యందుంచుట యొక్కటి మిగిలిన పని. ఇచ్చట మన లోపము విశేషము. వేయి సులభముగా చెప్పవచ్చును గాని యొక్కటి సక్రమముగా దీక్షతతో నాచరించుట కష్టము. మనలో కార్య దీక్షతకు మనము ప్రాముఖ్యత నొసగు వరకు మనకు గౌరవము కలుగదు. ఈ సభ వారు దేవీ చౌధురాణి గారి యధ్యక్షతతో జరుపుటచే ఈ రాష్ట్రవాసులలో గొప్ప సంచలనము కలిగించిన వారైరి. సభా కార్యక్రమము విశేష భాగము ఉర్దూలో జరిగెను. కానీ కొందరు మహారాష్ట్రమందు మాట్లాడుటచే మహారాష్ట్రేతరులకు ఉత్సాహభంగమయ్యెను. సభయందు హిందూస్థానీలో నుపన్యాసములు జరుగవలెనని కొందరి యాందోళనము కూడ జరిగెను. ఇట్లు ప్రత్యేక భాషా పక్షపాతము సభవారు చూపకుండిన చాలమేలుగా నుండెడిది. ఈ సభకు పూర్వము కొన్ని సంవత్సరములు ఈ సభలు జరిగియుండలేదు. ఇక ముందిట్టి లోపము లేకుండునట్లుగా సక్రమముగా సభలు జరుగునని నమ్ముచున్నాము. ఇంతియ కాక యీ సభయందు మహారాష్ట్రుల తీసికొనినంత ఆంధ్రులు తీసికొనకపోవుట శోచనీయము. ముందు సభలందైనను ఆంధ్రులు ఉత్సాహముతో విశేష సంఖ్యాకులుగా చేరి శ్రద్ధ వహింతురని నమ్ముచున్నాము.